• ఇంజినీరింగ్‌ కోర్సుల్లో మార్పులు

  * విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి పెద్దపీట
  * పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం

  ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో 97 శాతం మంది సాఫ్ట్‌వేర్‌, అనుబంధ ఉద్యోగాల్లో ప్రవేశించాలని కోరుకుంటున్నారు. వారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందేందుకు పూర్తిస్థాయి అర్హతలు కలిగి ఉన్నారు. ఏడు శాతం మంది మాత్రమే ఈ వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు కలిగి వాటిని నిర్వహించగల స్థాయిలో ఉన్నారు.
  - 2013లో ఒక అధ్యయనం వెల్లడించిన విషయం
  దేశంలో ఏటా 10 లక్షల మంది వరకూ ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచంలో రెండో స్థానం మనదే. మరి ఉద్యోగాల మాటేమిటి? అంటే తటపటాయించాల్సిన పరిస్థితి! ఉదాహరణకు 2017-18లో దేశవ్యాప్తంగా భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలో 13.4 లక్షల మంది డిప్లొమా, ఇంజినీరింగ్‌, ఎంటెక్‌, ఫార్మసీ, ఎంసీఏ ఉత్తీర్ణులై బయటకు రాగా.. వీరిలో 6.5 లక్షల మంది మాత్రమే ప్రాంగణ నియామకాలు పొందారు.
  ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో అనేక మందికి తాము చదివిన కోర్సుకు సంబంధించిన ప్రాథమిక విషయాలపై అవగాహన, ఆచరణాత్మక పరిజ్ఞానం (ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌) లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలు కొరవడుతున్నాయి. దీంతో వీరిలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విజన్‌-2025తో ప్రక్షాళనకు అడుగులు వేస్తోంది. ప్రత్యేక కథనం
  పరిశ్రమవంతులను చేద్దాం
  ఇంజినీరింగ్‌ విద్యార్థులను పరిశ్రమవంతులుగా తీర్చిదిద్దేందుకు భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అడుగులు వేస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటా పాఠ్యాంశాల్లో మార్పులు చేయటంతో పాటు.. చదువు పూర్తయ్యేలోగా క్షేత్రస్థాయి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన కలిగించటం వరకూ అన్ని దశల్లో విద్యార్థులను తీర్చిదిద్దాలని భావిస్తోంది. వారిలో నైపుణ్యాలను మెరుగు పరిచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఏఐసీటీఈ విజన్‌-2025ను ప్రకటించింది.
  కల్పించే సౌకర్యాలు
  * లక్ష అంకుర సంస్థల అభివృద్ధి
  * ప్రతి కళాశాల కనీసం ఐదు పరిశ్రమలతో అనుసంధానం కావడం
  * ప్రపంచస్థాయి కంప్యూటర్‌ ల్యాబ్‌ల ఏర్పాటు
  * కళాశాలల్లో ప్రత్యేకంగా పరిశోధన, ఆవిష్కరణల (ఇన్నోవేషన్‌) సెల్‌ ఏర్పాటు
  * అధ్యాపకుల సామర్థ్యాలు, బోధన నైపుణ్యాలపై పరిశీలన.
  ప్రస్తుత పరిస్థితి..
  ఇంజినీరింగ్‌ కళాశాలలు భారీగా పెరిగిపోవడం, అందరికీ ఉద్యోగాలు లభించకపోవడం ఈ రంగంపై ప్రభావం చూపుతోంది. నాణ్యత లేని కళాశాలలు మూతపడుతున్నాయి. జాతీయ స్థాయిలో సాంకేతిక విద్య పూర్తి చేస్తున్న వారిలో సగం కంటే తక్కువ మందికే ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
  విజన్‌ - 2025 లక్ష్యాలు
  * పాఠ్యాంశాల్లో మార్పులు, అతిథి అధ్యాపకులు, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాంగణ నియామకాలు.. అన్నింట్లో పరిశ్రమలను భాగస్వాములను చేయడం.
  * కళాశాల, ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించేలా సమర్థ పరిశోధన కేంద్రాల ఏర్పాటు. మంచి పరిశోధనలకు ప్రోత్సాహకాలు.
  * విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సులు ప్రవేశపెట్టడం. పారిశ్రామికవేత్తలతో బోధన. పరిశ్రమల పర్యవేక్షణలో ఇంక్యుబేషన్‌ కేంద్రాల ఏర్పాటు.
  * అంతర్జాతీయ విద్యా సంస్థలతో విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి (స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజి) కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడం.
  ప్రపంచవ్యాప్తంగా ఇలా
  ప్రపంచ ఆర్థిక వేదిక-2015, యునెస్కో గణాంక సంస్థ ప్రకారం ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తున్న వారు చైనా తర్వాత భారత్‌లోనే అధికంగా ఉన్నారు.
  పరిశ్రమల అవసరాలివీ..
  * కోర్సు ప్రాథమిక అంశాలపై విద్యార్థులకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశంతో పాటు సాంకేతికంగా వస్తున్న మార్పులపై అధ్యయనం.. అంకితభావం, నిలకడ, సానుకూల దృక్పథం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.
  * ప్రతి ఉద్యోగి కొత్తగా ఆలోచించడం, మూస పద్ధతికి భిన్నంగా వ్యవహరించటం, విశ్లేషణ శక్తి కలిగి ఉండాలని పరిశ్రమల యాజమాన్యాలు ఆశిస్తున్నాయి.

  అందుబాటులోకి ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌

  ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థుల కోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఇందులో తమ కళాశాల వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అధ్యాపకులు, విద్యా సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 136 కోర్సులకు సంబంధించి ఇంటర్న్‌షిప్‌ కోసం కంపెనీల సమాచారాన్ని పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ఆయా కంపెనీలు అందించే ఉపకార వేతనం, కోర్సు సమయం, ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలను పొందుపర్చారు. ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులను ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ గతంలో ఏఐసీటీఈ మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఇంజినీరింగ్‌ విద్యార్థులు 2, 4, 6, 8 సెమిస్టర్లలో ఎప్పుడైనా ఇంటర్న్‌షిప్‌ చేసుకోవచ్చు. 2, 8 సెమిస్టర్లలో 3 నుంచి 4 వారాలు; 4, 6 సెమిస్టర్లలో 4 నుంచి 6 వారాలు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణ పూర్తి చేసిన బీటెక్‌ విద్యార్థులకు 14 నుంచి 20 క్రెడిట్లు ఇస్తారు.

  ఏపీ విట్‌లో కౌన్సెలింగ్‌ ప్రారంభం

  తుళ్ళూరు, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన కౌన్సెలింగ్‌తో విట్‌(ఏపీ) విశ్వవిద్యాలయం కళకళలాడింది. రాజధాని అమరావతిలోని విట్‌లో మే 9న‌ వెల్లూరు క్యాంపస్‌కు సంబంధించిన ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ చేపట్టారు. దీన్ని ప్రారంభించిన అనంతరం విశ్వవిద్యాలయం వైస్‌ ప్రెసిడెంట్‌ శంకరవిశ్వనాథన్‌ మాట్లాడుతూ.. అమరావతి, వెల్లూరు, చెన్నై, భోపాల్‌ క్యాంపస్‌ల్లోని వివిధ బ్రాంచిలకు ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ చదివి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు విట్‌లో ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. జిల్లాకు ఇద్దరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 26 మంది విద్యార్థులకు ఈ వెసులుబాటు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ సీఎల్‌వీ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  వేసవిలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

  ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 59 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో డసాల్ట్‌ సిస్టమ్స్‌ సహకారంతో మే 13 నుంచి 30 రోజుల పాటు ఉత్తమ శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో అర్జా శ్రీకాంత్‌ ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి డసాల్ట్‌ సంస్థ సర్టిఫికెట్‌ అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ పట్టభద్రులతో పాటు ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న వారు సైతం వెబ్‌సైట్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు 1800 425 2422 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
  https://to.ly/1yYzH