• నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

  మేడ్చల్‌, న్యూస్‌టుడే: నూతన సాంకేతిక ఒరవడితో మానవాభివృద్ధికి ఉపయోగపడేలా కొత్త ఆవిష్కరణలు చేయాలని న్యూక్లియర్‌ ప్యూయల్‌ కాంప్లెక్స్‌ ఫార్మర్‌ సీఈఓ జయరాజు పేర్కొన్నారు. మైసమ్మగూడ గ్రామంలోని సెయింట్‌ పీటర్స్‌ (స్పెక్‌)లో జులై 19న ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ...రాబోయే రోజుల్లో ప్రపంచం అన్ని రంగాల్లో సాంకేతిక పురోగతిని సాధించాలంటే పరిశోధన, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఇతర దేశాలలో పోటీ పడి ప్రయోగాలను సృష్టించాలని గొప్ప పరిశోధకులుగా మారాలని తెలిపారు. కార్యక్రమానికి అతిథిగా జేఎన్‌టీయూ డైరెక్టర్‌ అంజిరెడ్డి, కళాశాల ఛైర్మన్‌ బాల్‌రెడ్డి, డైరెక్టర్‌ సరోజరెడ్డి, ప్రిన్సిపల్‌ నగేశ్‌, అధ్యాపకులు ఉప్పలరాజు, టి.వి.రెడ్డి, మేరీ, జావన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

  భావవ్యక్తీకరణతో సమోన్నత అవకాశాలు

  * విట్‌ సదస్సులో వక్తలు
  దాకమర్రి(తగరపువలస), న్యూస్‌టుడే: దాకమర్రిలోని వైజాగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో 'భావవ్యక్తీకరణ నైపుణ్యం' అనే అంశంపై జులై 19న సదస్సు జరిగింది. ఎలిగెంట్‌ హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు మురళీకృష్ణ, అమన్‌ మాట్లాడుతూ విద్యార్థులు కార్పొరేట్‌ స్కిల్స్‌, ఉద్యోగ, ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. సమోన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే భావవ్యక్తీకరణతో పాటు శరీర భాష ఎంతో కీలకమన్నారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీఎంఎంఎస్‌ శర్మ మాట్లాడుతూ కోర్‌ సబ్జెక్టులతో పాటు ఆంగ్లభాషపై పట్టు కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విట్‌ ఛైర్మన్‌ జీఎస్‌ శంకరరావు, డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆంగ్ల అధ్యాపకులు సత్యనారాయణ పాల్గొన్నారు.

  ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అవగాహన సదస్సు

  గుంటూరు (వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జులై 18, 19 తేదీలలో ఎంటర్‌పెన్యూర్‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వింజనంపాడు కిట్స్‌, పెదకాకాని మండలంలోని వీవీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలు, కాకినాడ జేఎన్టీయూ సంయుక్తంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కిట్స్‌ ప్రిన్సిపల్‌ పి.బాబు చెప్పారు. ఉప కులపతి తులసీరాం దాస్‌, ఎంటర్‌పెన్యూర్‌ డైరెక్టర్‌ కేవీ రమణ పాల్గొంటారని చెప్పారు.

  విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన

  విశాఖపట్నం (సాగర్‌నగర్‌), న్యూస్‌టుడే: తమ వర్సిటీ నుంచి ఏటా రెండు వేలమందికి పైగా విద్యార్థులు ఐటీ రంగంలోకి ప్రవేశిస్తున్నారని గీతం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ పి.వి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో జులై 16న ఐటీ రంగం ప్రాధాన్యంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు నూతన అంశాలపై అవగాహన పెంచడంతో పాటు పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. విశాఖలో విస్తరించనున్న ఐటీ రంగానికి అవసరమైన నిపుణులను అందించడానికి గీతం సిద్ధంగా ఉందని, ఇందుకు ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటరాక్షన్‌ సెల్‌(ఐఐఐసి)ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఇన్నోవేటివ్‌ యాప్స్‌ సీఈవో రామ్‌ ఇందుకూరి మాట్లాడుతూ ఐటీ రంగంలో ప్రోగ్రామింగ్‌ నిపుణతను పెంచడానికి ఫైథాన్‌ లాంగ్వేజీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపయోగిస్తున్న టెక్నాలజీల గురించి ఎప్పటికప్పుడు కొత్త అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

  విద్యతో పాటు విషయ పరిజ్ఞానం అవసరం

  ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులకు విద్యతో పాటు విషయ పరిజ్ఞానం ఎంతో అవసరమని టీసీఎస్‌ సంస్థ ప్రతినిధి ఎ.సుబ్రహ్మణ్యం చెప్పారు. స్థానిక సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కార్యగోష్ఠిని జులై 16న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించడంతో పాటు భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాస సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.అప్పుడే ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు పొందగలుగుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ గురించి ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు. ప్రాంగణ ఎంపికల్లో రాణించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను తెలియ జెప్పారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.సాంబశివరావు మాట్లాడుతూ తమ కళాశాల టీసీఎస్‌ సంస్థతో పరస్పర ఒడంబడిక (ఎంఓయూ) కుదుర్చుకుందని చెప్పారు. ఆ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం కళాశాలలో త్వరలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నామని వెల్లడించారు.

  కేఎల్‌ వర్సిటీలో పెట్రోలియం ఇంజినీరింగ్‌ కోర్సు

  విజయవాడ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరంలో ఏర్పాటు కానున్న పెట్రో కారిడార్‌ లక్ష్యంగా కేఎల్‌ విశ్వవిద్యాలయం పెట్రోలియం ఇంజినీరింగ్‌ కోర్సులను ప్రారంభించినట్లు ఉపకులపతి డాక్టర్‌ ఎల్‌.ఎస్‌.ఎస్‌.రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో స్వయం ప్రతిపత్తిగల విశ్వవిద్యాలయాల కేటగిరీలో తమ వర్సిటీనే మొదటిసారిగా ఈ కోర్సును ప్రవేశపెట్టిందన్నారు. పెట్రోలియం ఇంజినీరింగ్‌ కోర్సు విద్యార్థులకు దేశవిదేశాల్లో డిమాండ్‌ ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అత్యుత్తమ వేతనాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఓఎన్‌జీసీ, షెల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి ప్రముఖ కంపెనీలతో కేఎల్‌ విశ్వవిద్యాలయం కీలక అంశాలపై ఒప్పందాన్ని కుదుర్చుకోనుందని తెలిపారు. కోర్సు వివరాలను http://www.kluniversity.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు.

  మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగాల్లో భారీ కోత?

  ముంబయి: ఉద్యోగాల్లో భారీ కోత విధించేందుకు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ వారంలోనే ఇందుకు సంబంధించి ప్రకటన రావచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయని బ్లూంబర్గ్‌ పేర్కొంది. నోకియా హ్యాండ్‌సెట్‌ తయారీ విభాగాన్ని సొంతం చేసుకున్నాక, మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల సంఖ్య 1,27,104కు చేరింది. ఇందులో నోకియా ఉద్యోగులే 30,000 మంది ఉన్నారు. పోటీ దిగ్గజ సంస్థలైన యాపిల్‌, గూగుల్‌తో పోలిస్తే అత్యధిక సిబ్బంది ఉండటంతో, మైక్రోసాఫ్ట్‌కు నిర్వహణ వ్యయం అధికం అవుతోంది. మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల గత వారం ఉద్యోగులకు లేఖ రాశారు. సంస్థ కార్యకలాపాలు పరిమితం చేసి, లాభదాయకత అధికంగా ఉండేలా చూస్తామని (లీనియర్‌ బిజినెస్‌ ప్రాసెసెస్‌) పేర్కొన్నారు. నోకియా సిబ్బందితో పాటు, వ్యాపారం-మార్కెటింగ్‌కు సంబంధించి ఇరు సంస్థల్లో ఒకేరకమైన విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరిని, ఇంజినీరింగ్‌ విభాగంలో కూడా తొలగింపులు ఉంటాయని బ్లూంబర్గ్‌ పేర్కొంది.
  మారుమూల ప్రాంతంలోని రైతు నుంచి మహా నగరాల్లోని నిపుణుల వరకు అందరికీ సాంకేతిక సాధికారత కల్పించేందుకు మొబైల్‌, క్లౌడ్‌ ఉపయోగ పడతాయని మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఈ విభాగాల్లోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, మరింత మెరుగైన ఆవిష్కరణలతో భూగోళంపై ఉండే ప్రతి ఒక్కరికీ, సంస్థలకు చేరువ కావాలని భాగస్వామ్య సంస్థలకు పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లో ప్రారంభమైన మైక్రోసాఫ్ట్‌ భాగస్వాముల అంతర్జాతీయ సమావేశాలు-2014కు సత్య తన సందేశం పంపారు.
  10 లక్షల ఉద్యోగాలు: సాంకేతికత వినియోగం పెరిగితే, 56 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.36 లక్షల కోట్లు) మేర ఆర్థిక వృద్ధితో పాటు 10 లక్షల మందికి అదనంగా ఉద్యోగాలు లభిస్తాయని ఒక నివేదిక పేర్కొందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ (ఎస్‌ఎంఎస్‌ అండ్‌ పీ) మీతుల్‌ బి.పటేల్‌ చెప్పారు.

  'శ్రీ ఇందు'లో ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే

  ఈనాడు, హైదరాబాద్‌: శ్రీ ఇందు ఇంజినీరింగ్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ డేను జులై 14న ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో 874 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాంగణ నియామకాల్లో 412 మంది విద్యార్థులు వివిధ ఐటీ కంపెనీలకు ఎంపికయ్యారని, వారికి ఆఫర్‌ లెటర్లు అందించామని కళాశాల ఛైర్మన్‌ ఆర్‌.వెంకట్‌రావు అన్నారు. ప్రాంగణ నియామకాల్లో 34 సంస్థలు పాల్గొన్నాయి. విద్యార్థులకు విద్యతోపాటు సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, వ్యక్తిత్వ వికాస తరగతుల ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

  విద్యారంగంలో రాష్ట్రాన్నినంబరువన్‌ చేస్తాం

  మాదాపూర్‌: ఉన్నత విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ కళాశాలలు అధికంగా ఉన్నా పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యం విద్యార్థుల్లో కొరవడుతోందన్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాల్డెజ్‌(టాస్క్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జులై 14న అరోరా గ్రూప్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల స్నాతకోత్సవాన్ని మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేటీఆర్‌ ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. విద్యార్థులు తమ తోటి వారితో కాకుండా ప్రపంచంతో పోటీ పడాలన్నారు. కొత్త ఆలోచనలు ఉన్నవారిని ప్రోత్సహించేందుకు రానున్న ఆరునెలల్లో అతిపెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. నేటి విద్యార్థులు కలల సాకారానికి పట్టుదలతో కృషి చేయాలన్నారు.

  ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్‌ కోర్సు పరీక్ష ఫలితాల విడుదల

  ఏఎన్‌యూ(గ్రామీణ మంగళగిరి): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ 1/5 మొదటి సెమిస్టరు(రెగ్యులర్‌), 1/5 రెండో సెమిస్టరు (సప్లిమెంటరీ), 2/5 మొదటి సెమిస్టరు (రెగ్యులర్‌) కోర్సుల పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డి.సత్యనారాయణ జులై 14న తెలిపారు. జవాబుపత్రాల పునఃమూల్యాంకనం, ప్రత్యక్ష పరిశీలన, జిరాక్సు కాపీలకు ఒక్కో పేపరుకు రూ.950ల వంతున జులై 23 లోగా చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www.anu.ac.inలో చూడాలని సూచించారు.

  16 నుంచి ఫార్మసీ విద్య,ఉపాధి అవకాశాలపై సదస్సులు

  రాజంపేట, న్యూస్‌టుడే: స్థానిక అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో జులై 16 నుంచి మూడు రోజుల పాటు ఫార్మసీ విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి.గోపీనాథ్‌ తెలిపారు. ఎంసెట్‌, పి.జి.సెట్‌లలో ర్యాంకులు సాధించిన ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు వారి భవిష్యత్తు కోర్సుల ఎంపిక, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  ఇన్ఫోసిస్‌కు 8మంది ఎస్‌ఆర్‌కే విద్యార్థుల ఎంపిక

  కృష్ణా జిల్లా (రామవరప్పాడు), న్యూస్‌టుడే : ఎనికేపాడులోని ఎస్‌ఆర్‌కే ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్న 8 మంది విద్యార్థులు ఇన్ఫోసిస్‌ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో అర్హత సాధించారని కళాశాల యాజమాన్యం జులై 14న ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఛైర్మన్‌ అప్పారావు, డైరెక్టర్‌ పి.వెంకట నరసయ్య విద్యార్థులను అభినందించారు.

  సీఆర్‌ఆర్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

  ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: స్థానిక సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల 2014 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభించాయని ప్రధానాచార్యులు డాక్టర్‌ జి.సాంబశివరావు జులై 14న ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిది మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్‌లో, మరో ఎనిమిది మందికి 'సీఎంసీ'లో, ముగ్గురికి ఎఫట్రానిక్సేలో ఉద్యోగాలు లభించాయని చెప్పారు. 2015 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు త్వరలో ప్రాంగణ ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. దీనిలో భాగంగా బీటెక్‌ నాలుగో సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగ సాధన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను ఈ సందర్భంగా ప్రధానాచార్యులు అభినందించారు.

  18న జాతీయ స్థాయి సదస్సు

  గుత్తి , న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ ఇంజినీరింగ్‌ కళాశాలలో జులై 18న జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామచంద్ర తెలిపారు. సదస్సులో యంగ్‌మేనేజర్‌, యాడ్‌మేకింగ్‌, డ్రీమ్‌వెంచర్‌, బిజినెస్‌క్విజ్‌, ఇన్ఫర్మల్‌యాక్టివిటీస్‌, ఫ్యాషన్‌కార్నివాల్‌, డ్యాన్స్‌ తదితర కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ మేనేజ్‌మెంట్‌మీట్‌ను విద్యార్థులు జయప్రదం చేయాలని ఆయన కోరారు.

  లెండిలో ముగిసిన 'మొబైల్‌ కంప్యూటింగ్‌' సదస్సు

  తగరపువలస, న్యూస్‌టుడే: జొన్నాడ లెండి ఇంజినీరింగ్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్సు విభాగం, కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్టూడెంట్స్‌ చాప్టర్‌ సంయుక్త ఆధ్వర్యంలో రెండ్రోజులుగా జరుగుతున్న 'మొబైల్‌ కంప్యూటింగ్‌' సదస్సు జులై 12న ముగిసింది. ఈ సదస్సుకు విశ్రాంత ఉపకులపతి, రచయిత ఆచార్య డాక్టర్‌ రాజ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. 4జీ, డబ్ల్యుసీడీఎంఏ టెక్నాలజీ ప్రాముఖ్యతను, వినియోగాన్ని వివరించారు. 5జీ టెక్నాలజీపై జరుగుతున్న పరిశోధనలు వివరించి సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయన్నారు. లెండి ఛైర్మన్‌ పి.మధుసూదనరావు మాట్లాడుతూ కంప్యూటర్‌ విద్యనభ్యసించే విద్యార్థుల ఆలోచనలు నిత్య నూతనంగా ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు విద్యార్థులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం విశ్రాంత వీసీ ఆచార్య డాక్టర్‌ రాజ్‌కమల్‌ను లెండి యాజమాన్యం ఘనంగా సన్మానించింది.

  ఉచితంగా ఇంజినీరింగ్‌ విద్య

  జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: ఇంటర్‌ ఉత్తీర్ణులైన గిరిజన, ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశం కల్పించనున్నామని ఎడ్యుకేషన్‌ ఫర్‌ యు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పఠాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంసెట్‌ పరీక్షలో అర్హత సాధించిన గిరిజన విద్యార్థులకు, ఎంసెట్‌ రాయకపోయినా పేద ముస్లిం విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఉచిత రవాణా, వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నామన్నారు. వివరాలకు 94419 84350, 94419 84386 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

  యువతకు మెరుగవుతున్న ఉపాధి

  హైదరాబాద్‌: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న కోర్సులతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని ఐటీసీ లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (అగ్రి బిజినెస్‌) శివకుమార్‌ సూరపనేని అన్నారు. సోమాజిగూడలోని టోపాజ్‌ భవనంలోని 'స్మార్ట్‌ స్టెప్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎంప్లాయిబిలిటీ సొల్యూషన్స్‌ ఫినలిస్టు ప్రోగ్రామ్‌' ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలూ కల్పించిన సందర్భంగా జులై 12న సంస్థ కార్యాలయంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ యువతలో మేథో సంపత్తిని పెంచి దేశంలో ఉద్యోగావకాశాలను కల్పించే సంస్థలు రావాలన్నారు.ఐఐఏం (అహ్మదాబాద్‌), ఐఎస్‌ఈ, ఐఆర్‌ఎంఏలకు చెందిన పూర్వ విద్యార్థులు రూపొందించిన 'ఫినలిస్ట్‌' శిక్షణ ఇప్పుడు ఎంబీఏ (ఫైనాన్స్‌) విద్యార్థులకు వరంగా ఉందన్నారు.

  క్లవుడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా అద్భుత సేవలు

  బాలాజీచెరువు, న్యూస్‌టుడే: రానున్న 20 సంవత్సరాల్లో క్లవుడ్‌ కంప్యూటింగ్‌ అద్భుతమైన సేవలు అందిస్తుందని జేఎన్టీయూకే ఉపకులపతి డాక్టర్‌ తులసీరామ్‌దాస్‌ పేర్కొన్నారు. స్థానిక జేఎన్టీయూకేలో కంప్యూటర్‌ సైన్సు విభాగం ఆధ్వర్యంలో టెక్విఫ్‌ నిధులతో రీసెర్చ్‌ పెర్స్‌ఫెక్టివ్స్‌ ఇన్‌ క్లవుడ్‌ కంప్యూటింగ్‌ అనే అంశంపై జాతీయస్థాయి వర్క్‌షాపు జరిగింది. కార్యక్రమానికి తులసీరామ్‌దాస్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఇంటర్నెట్‌ బేస్డ్‌ అప్లికేషన్స్‌ క్లవుడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా ప్రాచుర్యం పొందాయన్నారు. పరిశోధన రంగంలో వివిధ సవాళ్లను క్లవుడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా పరిష్కరించవచ్చునన్నారు. ఎన్‌ఐటీ సూరత్‌కల్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ పాల్గొని మాట్లాడుతూ క్లవుడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌డేటా, గ్రీన్‌కంప్యూటింగ్‌ ద్వారా వాతావరణంలో కాలుష్య శాతాన్ని తగ్గించవచ్చునన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ప్రభాకర్‌రావు, రిజిస్ట్రార్‌ ప్రసాద్‌రాజు, ప్రిన్సిపల్‌ పద్మరాజు, ఇన్ఫోసెస్‌ ప్రతినిధి సుధీర్‌రెడ్డి, సీఎస్‌ఈ విభాగాధిపతి సుమలత, కోఆర్డినేటర్‌ కరుణ తదితరులు పాల్గొన్నారు.

  ముగిసిన 'ఇన్నోరోబో' వర్క్‌షాపు

  జగన్నాథపురం, న్యూస్‌టుడే:భవిష్యత్‌లో అన్ని రంగాలలోనూ రోబోటిక్స్‌ ప్రముఖ పాత్ర పోషించనున్నాయని ప్రముఖ గుండె వైద్యనిపుణులు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి కార్డియాలజీ చీఫ్‌ పి.వి.వి.సత్యనారాయణ అన్నారు. సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్థులు ఇటువంటి వర్క్‌షాపులో పాల్గొనడం ద్వారా సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవచ్చునన్నారు. కాకినాడలో సత్యరోబోటిక్స్‌ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో జులై 11న ప్రారంభమైన 'ఇన్నోరోబో' వర్క్‌షాప్‌ జులై 12న ముగిసింది. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులకు రోబోటిక్స్‌ అసెబ్లింగ్‌, ప్రోగ్రామింగ్‌ వంటి పలు అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సంస్థ మేనేజర్‌ పి.త్రినాధ్‌ తెలిపారు. లైన్‌ ఫాలోవర్‌, అబ్‌స్ట్రాకిల్‌ అవైడెన్స్‌, డి.టి.ఎం.ఎఫ్‌ కంట్రోల్డ్‌, వాల్‌ ఫాలోవర్‌ రోబోట్‌లను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులను పలు బృందాలుగా ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన వారికి బహుమతులను, పాల్గొన్నవారికి ధ్రువపత్రాలను అందజేశారు.

  ఫార్మసీ విద్యార్థులకు ఉజ్వల భవిత

  * ఏయూ వీసీ రాజు
  తగరపువలస, న్యూస్‌టుడే: ఫార్మసీ విద్యార్థులకు దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు అన్నారు. దాకమర్రి రఘు ఫార్మసీ కళాశాలలో 'ధన్వంతరి-2కె14' పేరిట ఏర్పాటు చేసిన రెండ్రోజుల జాతీయ సదస్సును ఆయన జులై 11న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య రంగానికి వైద్యులు, ఫార్మసిస్టులు రెండు కళ్లు వంటివారన్నారు. రాబోయే రోజుల్లో ఫార్మారంగం విస్తృతం కానుందన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌, అంతర్జాలంతో కాలక్షేపంచేయకుండా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. హోస్ఫిరా ఫార్మాస్యూటికల్‌ ఉపాధ్యక్షులు నిక్‌ఫేజ్‌ మాట్లాడుతూ ఫార్మా నవిద్యార్థులు పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం ఏయూ వీసీ ఆచార్య జీఎస్‌ఎన్‌రాజు, నిక్‌ఫేజ్‌లను రఘు ఛైర్మన్‌ కె.రఘు, రమాదేవి దంపతులు సన్మానించారు. వివిధ కళాశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏయూ ఆచార్యులు విజయరత్న, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ సీనియరు శాస్త్రవేత్త ఎస్‌ఎంఎం కిరణ్‌, రఘు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జగదీష్‌ పండా పాల్గొన్నారు.

  నేషనల్‌ యూత్‌ అవార్డుకు...

  ప్రగతిభవన్‌, న్యూస్‌టుడే: నేషనల్‌ యూత్‌ అవార్డులు 2013-14 కోసం రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ సమాజ ఉన్నతికి విశేష కృషి చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు వ్యక్తిగతంగా, స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతిపాదనలు పంపడానికి జిల్లా నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్టెప్‌ అధికారి మాధవరావు జులై 11న ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వ్యక్తిగతంగా, స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతిపాదనలు తగు ఆధారాలతో జులై 25 తేదీలోపు జిల్లా యువజన సంక్షేమ శాఖ(స్టెప్‌) కార్యాలయంలో స్వయంగా అందించాలని కోరారు. మరిన్ని వివరాలకు www.yas.nic.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చన్నారు.

  సాంకేతిక రంగం సాకారంతో ఉజ్వల భవిత

  * ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి
  కాకినాడ నగరం/జగన్నాథపురం, న్యూస్‌టుడే: సాంకేతిక రంగాన్ని సాకారం చేసుకోవటం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. 'సత్య రోబోటిక్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, ఎస్‌ఎఫ్‌సీ ల్యాబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో జులై 11 న కాకినాడలో 'ఇన్నో రోబో వర్క్‌షాపు' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనంతలక్ష్మి, బీసీ కార్పోరేషన్‌ మాజీ డైరెక్టర్‌ పిల్లి సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. భవిష్యత్తులో పారిశ్రామిక, విద్య, వైద్య రంగాలతో పాటు, ఇతర అంశాలు కూడా రోబోటిక్స్‌తో ముడిపడి ఉన్నాయని అనంతలక్ష్మి అన్నారు. అనంతరం పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ నవ్యాంధ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు. ప్రధానంగా విశాఖ నుంచి చెన్నై వరకూ కోస్టల్‌ కేరిడార్‌ అభివృద్ధి చెందనుందని ఆయన వివరించారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్న నినాదం నిజం కాబోతోందని సత్యనారాయణమూర్తి అన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి కార్డియాలజీ చీఫ్‌ డాక్టరు పీవీవీసత్యనారాయణ వైద్య రంగంలో రోబోటిక్స్‌ ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సత్య రోబోటిక్స్‌ డైరెక్టర్‌ పి.త్రినాథ్‌, ఎస్‌ఎఫ్‌సీ ల్యాబ్‌ డైరెక్టర్‌ జగదీష్‌, వర్కుషాప్‌ కోఆర్డినేటర్‌ కిరణ్‌, దీప్తి, రమ్య, సురేష్‌, కరుణకుమార్‌, మానస, రఘురామ్‌, అసన్య తదితరులు పాల్గొన్నారు.

  ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలపై శిక్షణ

  నూజివీడు, న్యూస్‌టుడే: నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు, ఇంటర్వ్యూలను ఎదుర్కొనే విధానం తదితరాలపై జులై 14న శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రిపుల్‌ఐటీ సంచాలకులు ఆచార్య ఇబ్రహీంఖాన్‌ తెలిపారు. పూర్వ యూనియన్‌ హోమ్‌ కార్యదర్శి పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత కె.పద్మనాభయ్య, ఎస్‌ఎస్‌బీ పూర్వ డైరెక్టర్‌ జనరల్‌, ఏపీ పోలీస్‌ అకాడమీ మాజీ సంచాలకులు ఎం.వి.వెంకటేశ్వరరావులు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

  విద్యార్థుల ప్రతిభ

  సూళ్లూరుపేట, న్యూస్‌టుడే : సూళ్లూరుపేటలోని గోకులకృష్ణ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచారని ఆ కళాశాల ప్రధానాచార్యులు విజయకృష్ణ రపాక తెలిపారు. అనంతపురం జేఎన్‌టీయూ రీజియన్‌ పరిధిలోని బీటెక్‌ చివరి సంవత్సరం సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఈసీఈ విభాగంలో బి.సింధూ 88, కె.కీర్తన 87.54, ఎంఈ విభాగంలో పి.వెంకటేశ్వర్లు 82.46, బి.కవిత 80.3, ఈఈఈ విభాగంలో ఎం.బుజ్జమ్మ 87.7, పి.హర్షవర్ధన్‌రెడ్డి 86.30, ఐటీ విభాగంలో బి.పూజిత 78, పి.శ్రీనివాసులు 76, సీఎస్‌ఈ విభాగంలో ఎల్‌.సుజిత 85.38, ఎం.మంజులా 82.62 శాతం ఫలితాలు సాధించారన్నారు. కళాశాల యాజమాన్యం తరఫున విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధానాచార్యులు నాగరాజు పాల్గొన్నారు.

  గీతం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు

  సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: గీతం విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ ద్వారా నిర్వహిస్తున్న బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ కోర్సుల్లో చేరడానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంబంధిత విభాగం ప్రధానాచార్యులు గణపతి జులై9 న తెలిపారు. గీతం ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులకు నేరుగా బీ-ఫార్మసీ కోర్సులో ప్రవేశాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేయనున్నామని వివరించారు. ఎం-ఫార్మసీలో ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మా కాలజీ, ఫార్మా స్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మా స్యూటికల్‌ అనాలసిస్‌ అండ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్పెషలైజేషన్‌లను ఆఫర్‌ చేస్తున్నామన్నారు. బీ-ఫార్మసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఎం-ఫార్మసీలో ప్రవేశాలకు అర్హులన్నారు. వివరాలకు గీతం ఫార్మసీ విభాగంలో సంప్రదించాలని సూచించారు.

  ఫ్యాకల్టీ ఛైర్మన్‌గా ఆచార్య సుబ్రహ్మణ్యం

  సిరిపురం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల ఫ్యాకల్టీ ఛైర్మన్‌గా ఆచార్య సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆయనకు ఈ మేరకు జులై 9న సాయంత్రం ఏయూ వీసీ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు తన ఛాంబర్‌లో ఉత్తర్వులు అందజేశారు. వీసీ మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధిలో కీలకంగా వ్యవహారించాలని ఆయనకు సూచించారు. ఆచార్యుల్లో ఐక్యత పెంచడంతోపాటు విభాగాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. అలాగే పలు విభాగాలకు చెందిన బీఓఎస్‌ ఛైర్మన్లకు ఉత్తర్వులు అందజేశారు. ఎకనమిక్స్‌ విభాగ బీఓఎస్‌ ఛైర్మన్‌గా ఆచార్య రామకృష్ణ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ బీఓఎస్‌ ఛైర్మన్‌గా ఆచార్య శివకృష్ణ, మెటలర్జీ బీఓఎస్‌ ఛైర్మన్‌గా ఆచార్య శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

  ఫార్మసీ కళాశాలలో 'ధన్వంతరి-2కె14' సదస్సు

  దాకమర్రి(గ్రామీణ భీమిలి), న్యూస్‌టుడే : దాకమర్రి రఘు ఫార్మసీ కళాశాల వేదికగా జులై 11, 12వ తేదీల్లో 'ధన్వంతరి-2కె14' పేరిట జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జగదీష్‌పాండా తెలిపారు. 'గ్లోబల్‌ ఛాలెంజెస్‌ ఇన్‌ పేరేంటరల్‌ ఫార్ములేషన్స్‌ అండ్‌ రెగ్యులేటరీ యాజ్‌పెక్ట్స్‌' అనే అంశంపై సదస్సు ప్రధానంగా చర్చిస్తుందన్నారు. ఈ సదస్సుకు ఏయూ వీసీ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 500మందిప్రతినిధులుఈసదస్సులోపాల్గొంటారన్నారు

  జేకేసీలో మెంటర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

  ఆదిలాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ ప్రభుత్వ పురుషుల డిగ్రీకళాశాలలోని జవహర్‌ నాలెడ్జి సెంటర్‌(జేకేసీ)లో మెంటర్‌లుగా పనిచేయడానికి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ పి.అశోక్‌ తెలిపారు. బీఈ/బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ(సీఎస్‌), ఎంఎస్సీ(ఐటీ), ఎంఎస్సీ(ఐఎస్‌), ఎంసీఏ, ఎంఎస్సీ(మాథ్స్‌), ఎంఎస్సీ(ఫిజిక్స్‌), ఎంఎస్సీ(కెమెస్ట్రీ), ఎంఎస్సీ(ఎలక్ట్రానిక్స్‌), ఎంబీఏ(హెచ్‌ఆర్‌) కోర్సుల్లో ఏదో ఒకదానిలో 55 శాతం మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వివరించారు. గౌరవవేతనం నెలకు రూ.8వేలు ఉంటుందని తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు జులై 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8297800380 సెల్‌నెంబరుకు సూచించారు.

  ట్రిపుల్‌ ఐటీకి కార్పొరేషన్‌ పాఠశాలల విద్యార్థులు 13 మంది ఎంపిక

  కృష్ణా జిల్లా (కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మకమైన ట్రిపుల్‌ ఐటీకి నగరపాలక సంస్థ పాఠశాలల్లో చదివి మంచి మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 13 మంది ఎంపికయ్యారు. వీరిలో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 11 మందికి సీట్లు దక్కగా, బాసర ట్రిపుల్‌ ఐటీలో ఒకరికి, ఇడుపులపాయలో ఇరువురికి సీట్లు దక్కాయి. నగరపాలక సంస్థ పరిధిలోని పటమట జీడీఈటీ పాఠశాలకు చెందిన జి.గోవింద, దుర్గాప్రసాద్‌, గీతిక, నిఖిల తదితరులకు ట్రిపుల్‌ ఐటీలో సీట్లు లభించాయి. ముత్యాలంపాడు ఏకెటీపీఎం స్కూలు విద్యార్థిని కె.పావని, ఎస్‌.కె.ఎస్‌.ఆర్‌ మున్సిపల్‌ స్కూలుకు చెందిన కె.ఏసురత్నం, కృష్ణలంక వీఎంఆర్‌ఆర్‌ పాఠశాలకు చెందిన ఎం.అనూష, పూర్ణానందంపేటకు చెందిన సందక పరుశురాములు మున్సిపల్‌ స్కూలుకు చెందిన ఎస్‌.కె.ఖజురున్‌, కె.పవన్‌కల్యాణ్‌లకు ట్రిపుల్‌ ఐటీలో ప్రస్తుతం సీట్లు లభించాయి. వాంబేకాలనీకి చెందిన జంధ్యాల దక్షిణామూర్తినగరపాలక సంస్థకు చెందిన కె.దేవి, జీఎస్‌ఆర్‌ఎంసీకి చెందిన సౌమ్యదేవిలకు ట్రిపుల్‌ ఐటీలో సీట్లు దక్కాయి. మరోవైపు న్యూ రాజరాజేశ్వరీపేటకు చెందిన కేర్‌ అండ్‌ షేర్‌ పాఠశాలకు చెందిన ఎ.కృష్ణసాయి, ఎం.మహేష్‌లు సీట్లు సాధించగా, అరండల్‌పేట ఎంఎఎంయు ఉర్దూ పాఠశాలకు చెందిన దుర్గారావుకు సీటు దక్కింది.

  ఆర్‌ఆర్‌బీ పరీక్షల నేపథ్యంలో... నాలుగు ప్రత్యేక రైళ్లు

  ఈనాడు, హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌బీ పరీక్షల నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని పాట్నా - సికింద్రాబాద్‌ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 11, 18తేదీల్లో రైలు నంబరు 03241 ఉదయం 10గంటలకు పాట్నాలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందని అన్నారు. తిరుగు ప్రయాణంలో 13, 20వ తేదీల్లో రైలు నంబరు 03242 రాత్రి 10గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి పాట్నాకు వెళుతుందని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు బల్లార్ష, రామగుండం, కాజిపేట సహా ఇతర స్టేషన్లలో ఆగుతాయని వివరించారు.

  12న ధ్రువలో మెగా ఉద్యోగా మేళా

  చౌటుప్పల్‌రూరల్‌: నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం తుఫ్రాన్‌పేట శివారులోని ధ్రువ ఇంజినీరింగ్‌ కళాశాలలో 12న 'మెగా ఇండస్ట్రీయల్‌ జాబ్‌ ఫెయిర్‌'ను నిర్వహిస్తున్నట్టు కళాశాల ఛైర్మన్‌ కె.పర్వత్‌రెడ్డి తెలిపారు. జులై 8న ఉద్యోగా మేళా బ్రోచర్స్‌ను ఫ్యాప్సీ ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌- రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య(ఫ్యాప్సీ) సహకారంతో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేద, నిరుద్యోగ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా 30 ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, తార్నాక, ఈసీఐఎల్‌, ఓల్డ్‌ సిటీ నుంచి ఉదయం 8 గంటల నుంచి బస్సు సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం విద్యార్థులు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సుమారు 5 వేల మంది విద్యార్థులు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనే అవకాశం ఉందన్నారు.

  వీఎల్‌ఎస్‌ఐ టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన

  పోతవరప్పాడు(ఆగిరిపల్లి), న్యూస్‌టుడే: స్థానిక ఎన్నారై ఇంజినీరింగ్‌ కళాశాల్లోని నాలుగో సంవత్సరం బీటెక్‌, మొదటి సంవత్సరం ఎంటెక్‌ విద్యార్థులకు వీఎల్‌ఎస్‌ఐ టెక్నాలజీపై జులై 7న అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ డా. ఎన్‌.ఎస్‌.మూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఎల్‌ఎస్‌ఐ టెక్నాలజీలో ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలను ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ రంగంలో విద్యార్థులకు అందుబాటులో ఉండే ఉపాధి అవకాశాలు, వీటిని పొందేందుకు పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలను ఆయన వివరించారు. ఈసీఈ విభాగాధిపతి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యార్థుల కోసం అత్యాధునిక సాంకేతికతలపై వర్క్‌షాపులు, అతిథి ఉపన్యాసాల ద్వారా పరిశోధనాత్మక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

  పరిశోధన రంగంపై ఆసక్తి పెరగాలి

  * విజ్ఞాన్‌లో ప్రారంభమైన జాతీయ సదస్సు
  పొన్నూరు, న్యూస్‌టుడే : సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పరిశోధన రంగంపై ఆసక్తి పెంపొందించుకోవాలని అమెరికాకు చెందిన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్‌ రావు వేమూరి పేర్కొన్నారు. జులై 7న చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో మెషిన్‌ లెర్నింగ్‌పై జాతీయస్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సులో రావు వేమూరి మాట్లాడుతూ గణాంక పద్ధతులను ఆధారంగా చేసుకుని యంత్రాలను నిత్యావసరాలకు అనుగుణంగా మలుచుకోవడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు ప్రవేశ పెట్టడంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు కాలాన్ని వృథా చేసుకోకుండా పరిశోధన రంగాలపై మరింత పట్టు సాధించాలన్నారు. పరిశోధన రంగంపై సదస్సులు నిర్వహించడం వల్ల అధ్యాపకుల బోధన పద్దతులు మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఈసదస్సు ఏడు రోజుల పాటు జరగనుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్‌ లావు శ్రీకృష్ణ దేవరాయులు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి.మధుసూదనరావు, సీఎస్‌ఈ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌. జ్ఞానేశ్వరరావు, ఆచార్య డాక్టర్‌ ఎం.వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

  ఆర్కిటెక్చర్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ కొనసాగింపు

  హైదరాబాద్ (విజయనగర్‌కాలనీ) : మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏ విశ్వవిద్యాలయంలోని నెహ్రూ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆర్కిటెక్చర్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌కు జులై 6న మంచి స్పందన వచ్చింది. విద్యార్థుల కోరిక మేరకు 7వ తేదీ కూడా కొనసాగిస్తున్నట్లు వర్సిటీ ఎకడమిక్‌ డైరెక్టర్‌ డా.ఎస్‌.ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. కోర్సుల గురించి వివరించేందుకు, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రదర్శనలో నిపుణులైన అధ్యాపకుల్ని అందుబాటులో ఉంచామన్నారు.

  మౌలిక వసతుల కల్పనకు కృషి

  * విద్యతోనే ప్రగతి సాధ్యం
  * జేఎన్‌టీయూ రెక్టార్‌ సుదర్శన్‌రావు
  * 1500మంది విద్యార్థులకు పట్టాలు అందజేత

  కడప జిల్లా (చాపాడు), న్యూస్‌టుడే : అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తామని ఆ యూనివర్సిటీ రెక్టార్‌ సుదర్శన్‌రావు పేర్కొన్నారు. జులై 6న చైతన్యభారతి, విజ్ఞానభారతి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 2008, 2009, 2010 సంవత్సరాల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాజెక్టు కోసం హైదరాబాద్‌కు వెళ్లేవారని, అంతదూరం వెళ్లకుండా యూనివర్సిటీ పరిధిలోనే ప్రాజెక్టు పూర్తిచేసేలా వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యతో మనిషికి సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పారు. దానివల్ల ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యావంతులకు విద్య కీర్తిప్రతిష్ఠతలు తెచ్చిపెడుతుందని, అందుకు నిదర్శనమే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని వివరించారు. జేఎన్‌టీయూ హైదరాబాదు వాటర్‌ రిసోర్స్‌ ఇంజినీర్‌ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో మనిషి నిత్యం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నేర్చుకోవడంలో ఫెయిల్‌ కావొద్దని విద్యార్థులకు సూచించారు. కరస్పాండెంట్‌ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీ పట్టాలు పొందిన వారు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలనిసూచించారు. ఉన్నతస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం రెండు కళాశాలల్లో బీటెక్‌ పూర్తిచేసిన 1500 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు.

  డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీకి మంచిభవిత

  కడప జిల్లా (చింతకొమ్మదిన్నె), న్యూస్‌టుడే : డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ (ఫార్మా-డీ) పూర్తి చేసిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని రామిరెడ్డి మెమోరియల్‌ ఫార్మసీ కళాశాల డైరెక్టర్‌ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ కళాశాలలో ఆరేళ్లపాటు ఈ అభ్యసించి, బయటకు వెళ్తున్న విద్యార్థులకు జూనియర్‌ విద్యార్థులు జులై 6న వీడుకోలు సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 28 కళాశాలలు ఉండగా, ఈ కళాశాలల నుంచి ఈకోర్సు మొదటి బ్యాచ్‌ ఈ ఏడాది బయటకు వస్తుందని తెలిపారు. గతంలో ఈకోర్సు కేవలం అమెరికా లాంటి దేశాల్లోనే ఉండేదని, ఆరేళ్లక్రితం మనదేశంలో ప్రవేశపెట్టారన్నారు. ప్రస్తుతం వివిధ వ్యాధులకు, ప్రమాదాలప్పుడు ఎముకలు విరిగిన సందర్భాల్లోనూ డాక్టరే పరీక్షించి మందులు ఇస్తున్నారు. ఇతర దేశాల్లో మాత్రం డాక్టర్‌ కేవలం వ్యాధిని గుర్తించిన తర్వాత దానికి ఎలాంటి మందులు వాడాలో డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ పూర్తి చేసిన వారు మాత్రమే అవసరమైన మందులు రాస్తారన్నారు. ప్రస్తుతం మన దేశంలో కూడా ఇక ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఇలాంటి విధులు నిర్వర్తించవచ్చన్నారు. దీంతోపాటు ఇతర దేశాలకు ఉపాధికి కూడా వెళ్లవచ్చని వివరించారు.

  ట్రిపుల్‌ ఐటీ ఫలితాల వెల్లడిలో తకరారు

  * రెమిడియల్స్‌ పరీక్షలూ లేవు
  * ఆందోళనలో విద్యార్థులు

  న్యూస్‌టుడే, నూజివీడు : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని మూడు ట్రిపుల్‌ ఐటీలను ఆది నుంచి సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. లిఖిత పూర్వక నిబంధనలు లేక సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అప్పటికప్పుడు వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషించడం ఆనవాయితీగా మారింది. తొలి నాళ్లలో ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు అభ్యర్థుల ఎంపికలో గందరగోళం ఏర్పడితే ఎలాగోలా దానిని అధిగమించారు. అనంతరం మెంటార్లు, హోమ్‌రూమ్‌ ట్యూటర్ల ఆందోళన. మైనర్‌ డిగ్రీ కోర్సుల విషయంలో అయోమయం. ఇలా సమస్యలు ఒకదాని వెంట మరొకటి వస్తోంటే తాజాగా ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సర ఆఖరి సెమిస్టర్‌ ఫలితాల వెల్లడిలో జాప్యం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది.
  ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మే మొదటి వారంలో ఆఖరి సెమిస్టర్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో తప్పిన లేదా జీపీఏ మెరుగు పరచుకుందామనుకున్న విద్యార్థులకు రెమిడియల్స్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇవి గత నెల 28న జరపాలి. విద్యార్థులు తప్పిన సబ్జెక్టులు తెలుసుకుని రెమిడియల్స్‌కు సిద్ధం కావడానికి కనీసం 15 రోజుల ముందు ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. అంటే జూన్‌ 15 లోపు ఫలితాలు విడుదల చేయాలి. కానీ ఇంత వరకు అది జరగలేదు. ఎప్పుడు వెల్లడిస్తారు.. తాము రెమిడియల్స్‌ ఎప్పుడు రాయాలి, వాటికి సిద్ధం కావడానికి చాలినంత సమయం ఇస్తారా లేదా అనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది.

  ఉన్నత విద్యలో ఏఐటీ, జేఎన్‌టీయూ ఒప్పందం

  సోమాజిగూడ, న్యూస్‌టుడే: నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏఐటీ) కృషి చేస్తోందని ఆ సంస్థ అధ్యక్షుడు డబ్ల్యూకే నుకుల్‌చై అన్నారు. బీటెక్‌, ఎంటెక్‌ కోర్సులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విద్యార్థులకు కల్పించేందుకు హైదరాబాద్‌, కాకినాడ జేఎన్‌టీయూలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జులై 5న‌ రాత్రి గ్రీన్‌ ల్యాండ్స్‌లోని హోటల్‌ హరిత ప్లాజాలో విలేకర్ల సమావేశంలో వివరించారు. యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో ప్రొ.కాజుయమాటో, భారత ప్రతినిధి నితిన్‌ కుమార్‌ త్రిపాఠీలతో కలిసి ఒప్పంద వివరాలను నుకుల్‌చై వివరించారు. మధ్య తరగతి వారూ కోర్సు చేసే విధంగా జెన్‌టీయూల ద్వారా ఇందులో చేరే వారికి సాధారణ ఫీజులో 50శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.

  ఆర్కిటెక్చర్‌ సృజనాత్మకమైన కళ

  విజయనగర్‌కాలనీ, న్యూస్‌టుడే: అభిరుచి, సృజనాత్మకత ఉన్న వారు ఆర్కిటెక్చర్‌ కళలో నిష్ణాతులుగా ఎదుగుతారని మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏ వీసీ పేర్వారం పద్మావతి తెలిపారు. జులై 5న‌ వర్సిటీలోని నెహ్రూ ఆర్ట్‌గ్యాలరీలో ఆర్కిటెక్చర్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఆర్కిటెక్చర్‌ కోర్సుల్ని విద్యార్థులకు మరింతగా చేరువచేసేందుకు ఈ ఫెయిర్‌ను రూపకల్పన చేశామన్నారు. ఇతర కోర్సుల కన్నా ఆర్కిటెక్చర్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అకడమిక్‌ డైరెక్టర్‌ ఎస్‌. ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ రంగంలో టెక్నీషియన్ల కోసం విదేశాల మీద ఆధారపడుతున్నామని, మన అవసరాలను మనమే తీర్చుకునేలా శిక్షణ ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ప్లానింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌ మెంటల్‌ డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్సులకు ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉందన్నారు. ఫెయిర్‌లో జేఎన్‌ఏఎఫ్‌ఏ వర్సిటీతోపాటు వైష్ణవి స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, సీఎస్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మాస్టర్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌, ఎస్‌ఎఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ తదితర విద్యా సంస్థలు పాల్గొన్నాయి. ఫెయిర్‌ జులై 6న‌ కూడా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

  కేఎల్‌యూలో ఎంబీఏ, ఎం.టెక్‌. ప్రవేశానికి కౌన్సెలింగ్‌ కేంద్రాలు

  గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, ఎం.టెక్‌. కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని పీజీ చేరికల సంచాలకుడు పి.శ్రీనివాసరావు జులై 5న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్య, పరిశోధన, ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకొని ఎం.టెక్‌.లో 22 స్పెషలైజేషన్స్‌ ద్వారా రెండేళ్ల కోర్సును అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే కేఎల్‌యూ బిజినెస్‌ స్కూలు ద్వారా ఎంబీఏలో 8 స్పెషలైజేషన్స్‌తో అత్యున్నతస్థాయిలో కోర్సును అందిస్తున్నామని, ఐదేళ్ల కాలపరిమితి గల బీబీఏ, ఎంబీఏ, సీఏ ప్రాతిపదికగా బీకాం హానర్స్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నామన్నారు. ఇతర ప్రోగ్రామ్స్‌ కింద మూడేళ్ల కాల పరిమితితో జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌, బీఎస్సీ, విజువల్‌ కమ్యూనికేషన్‌, ఎంసీఏ కోర్సులు, రెండేళ్ల ఎం.ఫార్మసీ, ఎంఏ ఆంగ్లం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా కోర్సులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లో కౌన్సెలింగ్‌ మీట్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
  బీటెక్‌లో పెట్రోలియం, వ్యవసాయ ఇంజినీరింగ్‌ కోర్సులు
  బీటెక్‌లో ఈ ఏడాది నుంచి పెట్రోలియం, వ్యవసాయ ఇంజినీరింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టామని అండర్‌ గ్రాడ్యుయేట్‌ చేరికల సంచాలకుడు పి.శ్రీనివాసులు తెలిపారు. ఇంజినీరింగ్‌ చేయాలనుకునేవారికి ఇవి చక్కని ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు.
  వెబ్‌సైట్‌

  పాఠశాల స్థాయి నుంచే వృత్తి నైపుణ్యంలో శిక్షణ అవసరం

  గచ్చిబౌలి: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వృత్తినైపుణ్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ దిలీప్‌చెనోయ్‌ అన్నారు. జులై 4న గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్కీ)లో 'లీడర్‌షిప్‌ ఇన్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌' అనే అంశంపై జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దిలీప్‌ చెనోయ్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో వృత్తినైపుణ్యం పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎన్‌ఎస్‌డీసీ కృషిచేస్తోందన్నారు. కాకినాడ జెఎన్‌టీమూ ఉపకులపతి తులసీరామ్‌దాస్‌ మాట్లాడుతూ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంజినీరింగ్‌ ఇష్టం లేకపోయినా బలవంతంగా అందులో చేర్పించడం వల్ల వారు రాణించలేకపోతున్నారని తెలిపారు. నాస్కామ్‌ ఉపాధ్యక్షురాలు డా.సంధ్య చింతల మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్లేస్‌మెంట్స్‌ను విద్యార్థులు 7వ సెమిస్టర్‌లో ఉన్నప్పుడు నిర్వహించాలని సూచించారు.

  ఆర్కిటెక్చర్‌కు విస్తృత ఉపాధి అవకాశాలు

  * జేఎన్‌ఏఎఫ్‌ఏ వర్సిటీ వీసీ డా.పద్మావతి
  విజయనగర్‌కాలనీ, న్యూస్‌టుడే: ఆర్కిటెక్చర్‌కు విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయని మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ వర్సిటీ ఉపకులపతి డా.పేర్వారం పద్మావతి అన్నారు. సమీప భవిష్యత్తులో ఆర్కిటెక్చర్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, హౌసింగ్‌, అర్బన్‌ డిజైన్‌, వెబ్‌డిజైన్‌ తదితర నిర్మాణ రంగంలోని ప్లానింగ్‌ విభాగాల్లో డిమాండ్‌ మరింతగా పెరగనుందన్నారు. కోర్సు ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వివరించేందుకు జులై 5న ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ప్రారంభమైంది. ఎస్పీఏ కళాశాల ప్రిన్సిపల్‌ డా.డి.విజయకిషోర్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఆర్కిటెక్చర్‌ విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ రంగంలో నిపుణుల కొరత ఉండడంతో కొన్ని సందర్భాల్లో వ్యయప్రయాసలకోర్చి విదేశాల నుంచి నిపుణుల్ని తెప్పించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. డిమాండ్‌కు తగ్గట్లు నిపుణుల్ని అందించేందుకు తమ కళాశాల చేస్తున్న కృషిని వివరించారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను కూడా కోర్సులో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. వర్సిటీ అకడమిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ ఆర్కిటెక్చర్‌ కోర్సుల ప్రయోజనాన్ని విద్యార్థులకు కుణ్ణుంగా వివరించడానికి నెహ్రూ ఆర్ట్‌ గ్యాలరీలో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

  6న ఉద్యోగమేళా

  విశాఖపట్నం (కంచరపాలెం), న్యూస్‌టుడే: రాజీవ్‌ యువకిరణాల పథకంలో భాగంగా జులై 6న ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధికల్పనా కార్యాలయంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఇ.వెంకటరత్నం తెలిపారు. పాయకరావుపేటలోని దక్కన్‌ ఫైన్‌ కెమికల్‌ (ఇండియా) ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారన్నారు. ట్రైనీ కెమిస్ట్‌/ షిప్ట్‌ఆపరేటర్‌ ఉద్యోగాలకు బీఎస్సీ/ ఎంఎస్సీ కెమిస్ట్‌ చేసి 25 ఏళ్లలోపు వయస్సు కలిగిన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. జీతం నెలకు రూ.7,500తో పాటు ఇతర అలెవెన్స్‌లు ఉంటాయన్నారు. ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నీషియన్‌ ఉద్యోగాలకు బీటెక్‌ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ చేసి 25ఏళ్లలోపు గల పురుష అభ్యర్థులు అర్హులన్నారు. జీతం రూ.7,500 ఇతర అలెవెన్స్‌లు ఉంటాయన్నారు. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు డిప్లొమో కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ చేసిన 25 ఏళ్లలోపు పురుషులు అర్హులన్నారు. జీతం నెలకు రూ.7,500తో ఇతర అలెవెన్స్‌లు ఉంటాయన్నారు. అనుభవం కలిగిన అభ్యర్థులైతే వయస్సు 35 ఏళ్లలోపు వరకు ఉండవచ్చన్నారు. ఆసక్తి గల వారు అన్ని ధ్రువీకరణ పత్రాలతో 6వ తేదీన హాజరుకావాలని సూచించారు.

  జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలోనే బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌

  * కూకట్‌పల్లి ప్రాంగణంలో మరో 60 సీట్లు అదనం
  హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ కూకట్‌పల్లి ప్రాంగణంలో ఇప్పటివరకు బీటెక్‌లో అయిదు ఇంజినీరింగ్‌ బ్రాంచీలుండగా నూతన విద్యా సంవత్సరం నుంచి కొత్తగా కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి బ్రాంచి అనుబంధ కళాశాలలు అందిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం ఫార్మా హబ్‌గా ఉన్నందున విశ్వవిద్యాలయమూ ప్రవేశపెట్టాలని ఎప్పటి నుంచో ఆచార్యుల నుంచి డిమాండ్‌ ఉంది. ఈక్రమంలో బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ పెట్టేందుకు ఉపకులపతి రామేశ్వర్‌రావు అంగీకరించారు. విశ్వవిద్యాలయంలో జులై 3న సాయంత్రం జరిగిన అకడమిక్‌ సెనెట్‌లో ఈ కోర్సునకు ఆమోదం లభించింది. పాలకమండలి నిర్ణయం తీసుకొని కోర్సును ప్రవేశపెడతారు. ఈ కోర్సును సుల్తాన్‌పూర్‌ ప్రాంగణంలో ప్రవేశపెట్టాలని కొందరు విన్నవించినా కొన్నాళ్లపాటు కూకట్‌పల్లి ప్రాంగణంలో నడపాలని నిర్ణయించారు. ఈ కోర్సుతో మరో 60 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఎంసెట్‌ ద్వారా వీటిని భర్తీ చేస్తారు.
  ఎంటెక్‌ న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌ ..
  కూకట్‌పల్లి ప్రాంగణంలో ఎంటెక్‌లో న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌ కోర్సునూ ప్రారంభించాలని ఉపకులపతి ఆసక్తిగా ఉన్నారు. దీంట్లో 18 సీట్లుంటాయి. ఈ కోర్సు ప్రవేశ పెట్టడంపై కొందరు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అయినా చివరకు అకడమిక్‌ సెనెట్‌ ఆమోదం తెలిపినట్లు తెలిసింది.

  ప్రాంగణ ఎంపికల్లో 16 మందికి ఉద్యోగాలు

  కడప నగరం, న్యూస్‌టుడే : నగరంలోని కేవోఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో 16 మందికి ఉద్యోగ అవకాశం లభించిందని ప్రధానాచార్యులు డాక్టరు వి.మధుసూదన్‌ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఐఎస్‌ఈ సంస్థ ఎంపికలకు తమ కళాశాలకు వచ్చిందన్నారు. వివిధ దశల్లో రాణించిన 16 మందిని ఉద్యోగాలకు ఎంపికచేశారన్నారు. ఇప్పటి వరకు పలు బహుళజాతీయ సంస్థలు నిర్వహించిన ఎంపికల్లో తమ కళాశాల నుంచి 156 మంది ఉద్యోగాలను సొంతం చేసుకున్నారన్నారు.

  రక్షణ వ్యవస్థలో అవకాశాలు మెండు

  కృష్ణా జిల్లా (పెనమలూరు), న్యూస్‌టుడే: దేశ రక్షణ వ్యవస్థలో ప్రతిభావంతులైన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అవకాశాలు అనేకం ఉన్నాయని ప్రభుత్వ రంగ సంస్థ బెల్‌ శాస్త్రవేత్త ఆర్‌.చంద్రకుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన గంగూరు ధనేకుల ఇంజనీరింగ్‌ కళాశాల ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశరక్షణ వ్యవస్థకు కావాల్సిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో యువత ప్రధానపాత్ర పోషించాలన్నారు. రక్షణ బలాలకు ఎలక్ట్రానిక్స్‌ పరికరాల అవసరం ఎప్పటికప్పుడు అవసరం అవుతూనే ఉంటుందన్నారు. అత్యాధునిక పరిశోధనలను కొనసాగించాల్సిన బాద్యత ప్రతిభ గల ఇంజినీరింగ్‌ విద్యార్థులపై ఉందని గుర్తించాలన్నారు. రక్షణ వ్యవస్థలో వైర్‌లెస్‌, మానవ రహిత యుద్ధతంత్రం, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ రేడియో తదితర విభాగాల్లో భావి ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

  విద్యార్థి జీవితంలో వెలుగు నింపేది విద్యే..

  గుంటూరు జిల్లా (పొన్నూరు), న్యూస్‌టుడే: విద్య మాత్రమే విద్యార్థుల జీవితంలో వెలుగులు నింపుతుందని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఛైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పేర్కొన్నారు. జులై 2న చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో బీటెక్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లావు రత్తయ్య విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలే కానీ నిరుత్సాహ పరచకూడదన్నారు. విద్యార్థుల నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యనభ్యసించే విద్యార్థినీ విద్యార్థులు చరవాణీలకు, ద్విచక్రవాహనాలకు దూరంగా ఉంటే విద్యలో మరింతగా రాణించడానికి అవకాశం ఉందన్నారు. విద్య కేవలం మార్కుల కోసమే కాదని, తెలివితేటలు పెంచుకోవడమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు.

  ఏఎన్‌యూ బీఫార్మశీ, ఎంటెక్‌ పునఃమూల్యాంకన ఫలితాలు విడుదల

  ఏఎన్‌యూ(గ్రామీణమంగళగిరి), న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బీఫార్మశీ 3వ సెమిస్టరు, ఎంటెక్‌ రెండో సెమిస్టరు, ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు 3వ సెమిస్టరు, 5వ సెమిస్టరు, ఐదేళ్ల కోర్సు 3,7, 9వ సెమిస్టర్ల పరీక్షల పునఃమూల్యాంకన ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డి.సత్యన్నారాయణ మంగళవారం తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ http://anu.ac.in/resultsmain.php లో చూడాలని సూచించారు.

  కేఎల్‌యూ కులపతిగా డాక్టర్‌ శ్రీహరిరావు

  తాడేపల్లి, న్యూస్‌టుడే: కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం కులపతిగా డాక్టర్‌ శ్రీహరిరావు నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీహరిరావును కేఎల్‌ఈఎఫ్‌ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ అభినందించారు. భారత రక్షణ పరిశోధన సంస్థలో చీఫ్‌ కంట్రోలర్‌గా పని చేసిన డాక్టర్‌ శ్రీహరిరావు కెఎల్‌యూలో ఉపకులపతిగా పనిచేశారు. కులపతిగా పనిచేస్తున్న డాక్టర్‌ జీఎల్‌ దత్తా ఉద్యోగ విరమణ చేయడంతో ఆ భాద్యతలను డాక్టర్‌ శ్రీహరిరావు చేపట్టారు.

  భీమా కళాశాలలో ఉద్యోగ నియామక మంత్రణం

  కర్నూలు జిల్లా (ఆదోని సాంస్కృతిక) , న్యూస్‌టుడే : ఆదోని పట్టణంలోని భీమా ఇంజినీరింగ్‌ కళాశాలలో బహుళజాతి సంస్థ (సెర్కొ) ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాలు నిర్వహించినట్లు కళాశాల ప్రధానాచార్యులు శ్రీకాంత్‌గౌడు, నియామక అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగం కల్పించడం తమ కర్తవ్యమన్నారు. కళాశాలకు మరెన్నో సంస్థలు వస్తున్నాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఉద్యోగ మంత్రణంలో 27 మంది ఇంజినీరింగ్‌, ఐదుగురు ఎంబీఏ విద్యార్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. సంస్థ నియామక అధికారి రఘురాజ్‌ పాల్గొన్నారు.

  వర్సిటీ అభివృద్ధిపై దృష్టి

  * జేఎన్‌టీయూకి నూతన పరిపాలనా భవనం
  * విద్యార్థులకు విలువలతో కూడిన బోధన
  * ఉపకులపతి లాల్‌కిషోర్‌ రెండేళ్ల పాలన
  అనంతపురం (జేఎన్‌టీయూ), న్యూస్‌టుడే : జేఎన్‌టీయూలో సమస్యల పరిష్కారంపై ఉపకులపతి దృష్టి సారించారు. ఆచార్య కె.లాల్‌కిషోర్‌ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టి జూన్ 30తో రెండేళ్లు పూర్తయింది. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించిన ఆయన అభివృద్ధిపై దృష్టి పెట్టారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వివాదాలు లేకుండా వర్సిటీని ముందుకు తీసుకెళుతున్నారు. మరో ఏడాది పాటు ఆయన ఉపకులపతిగా కొనసాగనున్నారు.గడిచిన రెండేళ్లలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిష్కారం ఇలా...
  * క్యాంపస్‌లో 900 మంది విద్యార్థులకు మాత్రమే వసతి ఉండేది. ప్రత్యేక భవనాల నిర్మాణం, వృథాగా ఉన్న గురుకులం భవనాలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రస్తుతం 1700 మందికి వసతి కల్పిస్తున్నారు.
  * ఐదు జిల్లాల్లో విస్తరించిన వర్సిటీకి పరీక్షల విభాగం కీలకం. ఈ విభాగానికి ప్రత్యేక భవనం నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. ఏడేళ్ల క్రితం ఆగిపోయిన ఆడిటోరియం నిర్మాణం సాగుతోంది.
  * పరీక్షల్లో నాలుగుసెట్ల విధానానికి స్వస్తి పలికి జంబ్లింగ్‌ పద్ధతిని తెరపైకి తీసుకొచ్చారు. గతంలో జేఎన్‌టీయూ పరీక్షల నిర్వహణలో సొంటి సంస్థ నుంచి అపవాదు తెచ్చుకోగా... తాజాగా పరీక్షల నిర్వహణ గాడిన పడింది.
  * సిలబస్‌ పూర్తిగా మార్పు చేశారు. 'ఔట్‌ కమ్‌ బేస్డ్‌ సిలబస్‌'కు రూపకల్పన చేశారు. ఎంఎస్‌ఐటీ, సీర్‌ అకాడమీ కోర్సులు ఆఫర్‌ చేశారు.
  * పరిశోధనా ప్రమాణాలు పెంచే దిశగా శోధ్‌గంగను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. అనుబంధ కళాశాలలను సైతం పరిశోధన కేంద్రాలుగా తీర్చి దిద్దారు.
  వంద పోస్టుల భర్తీకి శ్రీకారం
  * ఇప్పటివరకు డిజిటల్‌ లైబ్రరీ భవనాన్ని పరిపాలనా భవనంగా వినియోగిస్తున్నారు. రూ.20 కోట్లతో జేఎన్‌టీయూ పాత క్యాంపస్‌లో పరిపాలనా భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకు మానిటరింగ్‌ డవలప్‌మెంట్‌ కమిటీ (ఎండీసీ) ఆమోదం లభించింది. త్వరలోనే టెండర్లు ఆహ్వానించి భవన నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
  * ఇంజినీరింగ్‌ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ఈసెమిస్టర్‌ నుంచి ఇంజినీరింగ్‌లో విలువలు (మోరల్‌ ఎథిక్స్‌) సిలబస్‌లో ప్రవేశ పెట్టనున్నారు.
  * అనంత జేఎన్‌టీయూ, పులివెందుల, కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వంద అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి దస్త్రం పంపారు. ఉత్తర్వులు రాగానే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.
  * యాంటి ప్లాగరిజమ్‌ ఎంటెక్‌ విద్యార్థుల ప్రాజెక్టులకు శోధ్‌గంగను అనుసంధానం చేయనున్నారు.

  నూతన పరిశోధనలపై దృష్టి సారించాలి

  * జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్‌ ఎన్‌వీ రమణారావు
  కాచిగూడ: బోధనా సిబ్బంది నూతన పరిశోధనలపై దృష్టి సారించాలని జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్‌ ఎన్‌వీ రమణారావు అన్నారు. కొత్త పరిశోధనలను విద్యార్థుల భవిష్యత్తును సమున్నతంగా తీర్చిదిద్దడానికి వినియోగించాలని సూచించారు. జూన్ 30న కాచిగూడలోని భారత్‌ విద్యా సంస్థలకు చెందిన భారత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌' జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సదస్సులో దేశవ్యాప్తంగా 40 కళాశాలలకు చెందిన 100 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో గోవర్ధన్‌, శ్రీనివాసులు, పద్మనాభం, కుమారస్వామిరావు, భారత్‌ విద్యా సంస్థల ఛైర్మన్‌ సీహెచ్‌ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  కంప్యూటర్‌లో నెట్‌ వర్కింగ్‌ కీలకం

  నర్సంపేట రూరల్‌, న్యూస్‌టుడే: కంప్యూటర్‌ విద్యలో నెట్‌ వర్కింగ్‌ విధానం కీలకమని ముంబయి ఐఐటీ ఆచార్యులు ప్రొఫెసర్‌ కామేశ్వరి అన్నారు. లక్నేపల్లి బాలాజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ కళాశాలలో జరిగిన ఐఐటీ ముంబయి, ఇండియన్‌ సొసైటీ ఫర్‌ టెక్నికల్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న వారం రోజుల కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్‌పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సును జూన్ 30న బిట్స్‌ విద్యా సంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ ఒక కంప్యూటర్‌లో ఉన్న విషయాన్ని మరో కంప్యూటర్‌ను చేర్చడానికి నెట్‌ వర్కింగ్‌ అవసరమన్నారు. సమాచారాన్ని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులభంగా పంపేందుకు నెట్‌ వర్కింగ్‌ దోహదపడుతుందన్నారు. మనం నిత్యం సెల్‌ఫోన్‌, కంప్యూటర్ల ద్వారా విషయాన్ని మార్పిడి చేస్తున్నామన్నారు. కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్‌కు టీసీపీ డంప్‌, వైర్‌శార్క్‌ వంటి సాప్ట్‌వేర్‌లను ఉపయోగించి డేటా ప్యాకెట్లను ఒక నెట్‌ వర్క్‌ నుంచి మరో నెట్‌ వర్క్‌కు పంపవచ్చన్నారు. సమాచారాన్ని పంపేందుకు ట్రాన్స్‌ఫోర్టేషన్‌ లేయర్‌, నెట్‌ వర్క్‌ లేయర్‌ను ఉపయోగించే విధానాన్నిప్రయోగాత్మకంగా వివరించారు.

  8న ఇంజినీరింగ్‌విద్య నాణ్యతపై సదస్సు

  కర్నూలు విద్య, న్యూస్‌టుడే: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో జులై 8వ తేదీన అనంతపురం జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్య నాణ్యతపై రాష్ట్రస్థాయి సందస్సు నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ సాంకేతిక విద్యసెల్‌ కన్వీనర్‌ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 29న‌ స్థానిక సెంట్రల్‌ప్లాజాలో రాష్ట్రస్థాయి సదస్సుకు సంబంధించి ప్రచార పత్రాన్ని విడుదల చేశారు.

  డిసెంబరు 19 నుంచి ఐఐటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

  రాయదుర్గం: నగరం మరో ప్రపంచ స్థాయి సమ్మేళననానికి ఆతిథ్యమివ్వనుంది. ఐఐటీ(పాన్‌ ఐఐటీ)కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం (ఐఐటీ అలుమ్ని గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌) డిసెంబరు 19 నుంచి 21 వరకూ నగరంలోని మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ఖెంకా ఆడిటోరియంలో జూన్ 29న‌ జరిగిన కార్యక్రమంలో నిర్వాహక కమిటీ మార్కెటింగ్‌ విభాగం, సెక్రటరియేట్‌ విభాగం ఛైర్మన్లు శాంతనుపాల్‌, సురేష్‌ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌ ఐఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ దేశాల్లో విభిన్న రంగాల్లో పనిచేస్తున్న మూడు వేల మంది ఐఐటీ పూర్వ విద్యార్థులు పాల్గొంటారన్నారు.

  ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రతిభ

  గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన నాల్గో సంవత్సరం ఈసీఈ విద్యార్థి ఎం.రేవంత్‌కుమార్‌ బెస్ట్‌ ఐడియా పోటీల్లో ప్రథమ స్థానం సాధించినట్లు విభాగాధిపతి ఎం.కామరాజు జూన్ 27న‌ వెల్లడించారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో జేఎన్‌టీయూ-కాకినాడ, సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన 'గ్రో యువర్‌ ఐడియా' పేరిట 'విభజన రాష్ట్రవ్యాప్త ఉద్యోగాలు' అనే అంశంపై పోటీ నిర్వహించారు. వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో రేవంత్‌కుమార్‌ ఆలోచన ప్రథమ స్థానంలో నిలిచింది. విజేతను ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.రవీంద్రబాబు, విభాగాధిపతి కామరాజులు అభినందించారు.

  శ్రీనివాసలో ముగిసిన 'క్యాంపస్‌ డ్రైవ్‌'

  కడప నగరం, న్యూస్‌టుడే: నగరంలోని శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌లో ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆ కళాశాల ప్రధానాచార్యులు జె.వి.ఆర్‌.రమేష్‌ జూన్ 27న‌ తెలిపారు. బెంగళూరుకు చెందిన కూబీ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఐబీఎం సంస్థ 'ఆఫ్‌ క్యాంపస్‌ రిక్రూట్‌మెంటు' జరిపినట్టు తెలిపారు. జిల్లాలోని పలు కళాశాలల నుంచి 44 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఇందులో తమ కళాశాల విద్యార్థులు రెహ్మాన్‌ (ఈసీఈ), హరీష్‌కుమార్‌ (సీఎస్‌సీ), కల్యాణ్‌కుమార్‌ (ఈసీఈ) ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్‌ శ్రీనివాసులు విజేతలను అభినందించినట్టు పేర్కొన్నారు. ప్లేస్‌మెంటు అధికారి నరేష్‌కుమార్‌ విద్యార్థులకు విలువైన సూచనలు చేశారని చెప్పారు.

  మిట్స్‌కు స్వయం ప్రతిపత్తి

  కురబలకోట, న్యూస్‌టుడే: మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు యూనివర్శిటీ గ్రాంట్‌ కమిషన్‌(యూజీసీ) స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) కల్పించినట్లు ఆ కళాశాల కరస్పాండెంట్‌ ఎన్‌.విజయభాస్కర చౌదరి జూన్ 27న‌ ప్రకటనలో పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తి కల్పించడంవల్ల విద్యార్థులకు అవసరమైన పాఠ్య ప్రణాళికను స్వయంగా రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రస్తుతం జేఎన్‌టీయూ పాఠ్య ప్రణాళిక కాకుండా పరిశ్రమలకు, ఐటీ రంగంతో పాటు ఇతర రంగాలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పాఠ్య ప్రణాళికను రూపొందించుకుని విద్యార్థులకు నూతన పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

  ఇగ్నో అధ్యయన కేంద్రం ప్రారంభం

  గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక ఎంవీఆర్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) స్టడీ సెంటర్‌ను వర్సిటీ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.రాజారావు జూన్ 25న ప్రారంభించారు. పేద విద్యార్థులు, ఉద్యోగులు తమ విద్యార్హతను పెంచుకునేందుకు ఈ దూరవిద్యా కేంద్రం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి సర్టిఫికెట్‌ కోర్సులను అభ్యసించవచ్చని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అసిస్టెంట్‌ డెరెక్టర్‌ డాక్టర్‌ బారిక్‌ మాట్లాడుతూ కేంద్రంలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు తెలియజేశారు. కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ రామారావు, ప్రిన్సిపల్‌ ఎ.బాలకృష్ణ, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌వీ కృష్ణ పాల్గొన్నారు.

  పరిశోధనా ఫలితాలే భావితరాలకు మార్గదర్శకాలు

  * జేఎన్‌టీయూ వీసీ ఆచార్య లాల్‌కిషోర్‌
  కర్నూలు విద్య, న్యూస్‌టుడే : పరిశోధనా ఫలితాలే భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.లాల్‌కిషోర్‌ అన్నారు.జూన్ 25న నగర శివారులోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో 'అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రికల్‌ సిస్టమ్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌' అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ పరిశోధన చేసే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడం వల్ల సాంకేతిక నైపుణ్యం పెరుగుతుందన్నారు. విషయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, పంచుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. అంకిత భావంతో శోధిస్తే ఎన్నో ఆవిష్కరణలు పుట్టుకొస్తాయన్నారు. కళాశాల వ్యవస్థాపకులు జి.పుల్లయ్య మాట్లాడుతూ ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు కొత్త ఆవిష్కరణలకు నాందికావాలన్నారు. ప్రతి పరిశోధనా విద్యార్థిలో అంతర్గతంగా అనంత శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని వాటిని వెలికి తీయాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉంటుందన్నారు. కళాశాల ఛైర్మన్‌ జి.వి.యం.మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందాలంటే విద్యార్థులు ఇలాంటి సదస్సుల్లో పాల్గొనాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

  ఎన్‌ఈసీలో మైక్రోసాఫ్ట్‌ సృజనాత్మక కేంద్రం ప్రారంభం

  నరసరావుపేట, న్యూస్‌టుడే: స్థానిక నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాలలో జూన్ 24 న విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇన్నోవేషన్‌(సృజనాత్మక) సెంటర్‌ను ప్రారంభించింది. ముఖ్యఅథితిగా హాజరైన మైక్రోసాఫ్ట్‌ భారతదేశ విద్యావిభాగాధిపతి లోకేష్‌మెహ్రా దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెహ్రా మాట్లాడుతూ భారతదేశంలోని ఐఐటీల్లో 35 శాతం అధ్యాపకుల కొరత ఉందని, దీన్ని అదిగమించడానికే ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఈ-లెర్నింగ్‌, ఈ-మెటీరియల్‌, సృజనాత్మక సెంటర్ల ఏర్పాటు ద్వారా విద్యావిభాగంలో అధ్యాపకుల కొరత తీర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు వారి సృజనాత్మకతను ఆలోచనలను సాఫ్ట్‌వేర్‌ రూపంలో అభివృద్ధి పరిచి అప్లికేషన్లను విపణిలో ప్రవేశపెడితే విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యలో మెలకువలతోపాటు ఆర్థికంగా కూడా లాభపడతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు యజమానులుగా, పారిశ్రామిక వేత్తలుగా కూడా మారవచ్చని చెప్పారు.

  ఇన్ఫోసిస్‌ ఉద్యోగాలకు ఎంపిక

  పాల్వంచ, న్యూస్‌టుడే: కొత్తగూడెం ఆడమ్స్‌ కళాశాల ప్రాంగణ నియామకాల్లో ఇన్ఫోసిస్‌కు ఎంపికైన ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కళాశాలలో జూన్ 23న‌ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆడమ్స్‌ కళాశాల కార్యదర్శి ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కళాశాలలో గత విద్యాసంవత్సరంలో నిర్వహించిన నియామకాల్లో 150 మంది విద్యార్థులకు ఉద్యోగవకాశాలు కల్పించామన్నారు. నూతనంగా ఎంపికైన ఈఈఈ విద్యార్థులు ఎం.హరిత, ఎం.సూర్యప్రత్యుష, కె.సాయిసంతోష్‌లకు ఏడాదికి రూ.3.25 లక్షలు వేతనం ఉంటుందని చెప్పారు.

  నైపుణ్యం ఉంటే ఏ బ్రాంచి అయినా ఒక్కటే

  * జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ కె.శ్రీకుమార్‌
  నల్లజర్ల, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌లో ప్రవేశం కోరే విద్యార్థులకు అంతర్గత నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం చాలా ముఖ్యమైన ఆభరణాలని, ఈ రెండూ ఉన్న విద్యార్థి ఎటువంటి బ్రాంచిలోనైనా రాణించగలరని జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ కె.శ్రీకుమార్‌ తెలిపారు. ఏకేఆర్‌జీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్యపై జూన్ 23న‌ జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత అవగాహన కమ్యూనికేషన్‌ స్కిల్సు ఇంజినీరింగ్‌ విద్యార్థికి రెండు కళ్ళులాంటివన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేముందు కళాశాల వాతావరణంను నిశితంగా పరిశీలించాలని తెలిపారు. ఇంజినీరింగ్‌ విద్యార్థికి ప్రణాళిక చాలా అవసరమని అన్నారు. కష్టపడే తత్వాన్ని విద్యార్థులు అలవరచుకోవాలన్నారు. అపుడే విద్యార్థి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు.

  మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ కాంపీటెన్సీ సెంటర్‌ ప్రారంభం

  ఎనికేపాడు(రామవరప్పాడు), న్యూస్‌టుడే: విజయవాడ ఎస్‌ఆర్‌కే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని ఎస్‌ఆర్‌కే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విజయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ ఉమెన్‌, విజయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్స్‌, విజయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌ ఫర్‌ ఉమెన్‌ కళాశాలలు 'మైక్రోసాఫ్ట్‌ ఎడ్వాంటేజ్‌ ప్లాటినం క్యాంపస్‌'గా గుర్తింపు పొందిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ కాంపెటెన్సీ సెంటర్‌ను ముఖ్యఅతిథిగా హాజరైన మైక్రోసాఫ్ట్‌ రిసోర్స్‌పర్సన్‌ ప్రదీప్‌ కుమార్‌ గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించేలా చేయడమే మైక్రోసాఫ్ట్‌ సంస్థ క్లౌడ్‌ కాంపీటెన్సీ సెంటర్‌ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ పి.వెంకటనరసయ్య మాట్లాడుతూ ఇప్పటికే ఎస్‌.ఆర్‌.కె. ఫౌండేషన్‌కు సంబంధించిన సీఎస్‌స్సీ, ఐటీ, ఎంసీఏ విభాగ అధ్యాపకులు మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్స్‌ పూర్తి చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్‌ ఆర్‌.నారాయణస్వామి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఎకడమిక్‌ కోర్సులతోపాటు పరిశ్రమల అవసరాలకు సరిపడే సర్టిఫైడ్‌ కోర్సులు చేయడం ఎంతో అవసరమన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోటెక్‌ సొల్యూషన్స్‌ సీఈవో ఎస్‌.కృష్ణారావు విశేష అతిథిగా హాజరయ్యారు. ఎస్‌.ఆర్‌.కె. హెచ్‌వోడీ హరిత, కళాశాల సెక్రటరీ బి.ఎస్‌.శ్రీకృష్ణ, విజయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రిన్సిపల్‌ పి.వెంకటేశ్వరరావు, మేనేజ్‌మెంట్‌ సైన్స్‌ ఫర్‌ ఉమెన్‌ ప్రిన్సిపల్‌ ఎన్‌.సుబ్రమణ్యం, ఫార్మా కళాశాల ప్రిన్సిపల్‌ డా.పద్మలతతోపాటు విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

  విదేశీ విద్య అభ్యసించడానికి నైపుణ్యాలు అవసరం

  కానూరు,న్యూస్‌టుడే :విదేశీ విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు నైపుణ్యాలు అవసరమని అమెరికాలోని అట్లాంటాలోని ఎస్‌ఆర్‌కె సంస్థ సీనియర్‌ సొల్యూషన్‌ ఆర్కిటెక్‌, కళాశాల పూర్వ విద్యార్థి అయిన వేములపల్లి రూపేంద్ర అన్నారు. జూన్ 18న వీఆర్‌ సిద్ధార్థ కళాశాలలో విదేశాలలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు అన్న అంశంపై ఆయన మాట్లాడుతూ విదేశీ విద్య పరిశోధనలతో కూడుకున్నదని ఇక్కడ వాటిని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అక్కడ ప్రతిభ కల విద్యార్థులను విశ్వవిద్యాలయాలు ప్రోత్సహిస్తాయన్నారు. ఉద్యోగం పొందాక అక్కడ పరిస్థితులు, ఉద్యోగ సంప్రదాయాలు ఎలా అలవరుచుకోవాలో ఉదాహరణలతో సహా వివరించారు. ఒక సాధారణ విద్యార్థి కూడా ప్రతిభతో విదేశీ విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ భువనైకరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఉన్నత లక్ష్యాలను అందుకుని కళాశాలకు, దేశానికి పేరు తేవాలన్నారు. ఐటీ విభాగాధిపతి రాజేంద్రప్రసాదు మాట్లాడుతూ ఐటీ విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా మంచి అవకాశాలున్నాయని, అవసరాలకు అనుగుణంగా నూతన సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానాలను నేర్చుకుంటూ నిరంతర పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  ఖరగ్‌పూర్‌ ఐఐటీలో సూపర్‌కంప్యూటర్‌

  కాన్పూర్‌: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సూపర్‌కంప్యూటర్‌ ఏర్పాటైంది. ఇది ప్రపంచంలో 130వ సూపర్‌కంప్యూటర్‌ కాగా.. మనదేశంలో ఐదవదని ఐఐటీ ఖరగ్‌పూర్‌ డైరక్టర్‌ ఇందర్‌నీల్‌మన్నా జూన్ 17న విలేకర్లకు తెలిపారు. ఒక విద్యాసంస్థలో సూపర్‌ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయటం మనదేశంలో ఇదే తొలిసారన్నారు. దీనిద్వారా ఎయిరోడైనమిక్స్‌, వాతావరణం, జీవరసాయనశాస్త్రం తదితర రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తామని వెల్లడించారు.

  విద్యార్థుల కృషితో సౌర వెలుగులు

  * అన్నమాచార్య విద్యార్థుల ఆవిష్కరణ
  తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూ, ఇంధన కొరతను తట్టుకుని, విద్యుత్తులోటును పూడ్చుకునే దిశగా తిరుపతికి చెందిన అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు సౌర విద్యుత్తు తయారీకి పూనుకున్నారు. తమకున్న పరిధిలో ఆర్థిక పరిమితులకు లోబడి, తక్కువ బడ్జెట్‌తో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సూర్య కిరణాల ద్వారా సౌరవిద్యుత్తును రూపొందించే విధానాన్ని రూపొందించారు. మార్కెట్‌లో ఇప్పటికే సౌర విద్యుత్తు పరికరాలు ఉన్నప్పటికీ, ఇండస్ట్రియల్‌ వ్యర్థాలతో విద్యార్థులు రూపొందించిన పరికరాలు మార్కెట్‌ ధర కంటే తక్కువగా ఉండడం గమనార్హం. వీధి దీపాలను వెలిగించడానికి, గృహ అవసరాల వినియోగానికి ఇన్వర్టర్లు సైతం రూపొందించారు. నూతనంగా రూపొందించిన ప్యానళ్ల సాయంతో సూర్య కిరణాలను గ్రహించి, ప్రత్యేకంగా రూపొందించిన బ్యాటరీలను రీఛార్జ్‌చేసి, తద్వారా బ్యాటరీల నుంచి కళాశాలలో ఏర్పాటుచేసిన సోలార్‌ విద్యుత్తు దీపాలను వెలిగించారు. ఈ పరికరాల విలువ మార్కెట్లో రూ.10వేలకు పైగా ఖర్చు అవుతుండగా, విద్యార్థులు కేవలం రూ.1500 వ్యయంతో సౌరవిద్యుత్తు పరికరాలను రూపొందించారు. అయితే ఇప్పుడున్న ప్రాథమిక నమూనాకు మరికొంత సాంకేతికతను జోడించి, తుది రూపును ఇవ్వడానికి మరో రూ.వెయ్యి వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. ఈ నమూనాకు విద్యార్థులు సోలార్‌ ఎనర్జీ బేస్డ్‌ డస్క్‌-డన్‌ స్ట్రీట్‌ లైట్‌ కంట్రోల్‌ అనే పేరు పెట్టారు. ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న ఎలక్ట్రికల్‌ విభాగం విద్యార్థులు ఎన్‌.గాయత్రి, బి.జగదీష్‌, జి.కవిత, ఎం.జయంతి తమ వర్కింగ్‌ ప్రాజెక్టుగా సోమవారం కళాశాల యాజమాన్యానికి దీనిని సమర్పించారు. అలాగే సౌరవిద్యుత్తును తనలో నిక్షిప్తం చేసుకుని గృహావసరాలకు అవసరమైన విద్యుత్తును అందించే బీఈఎస్‌ఎస్‌ (బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం)ను పి.దినేష్‌రెడ్డి, జి.సుబ్బరాజు, ఎన్‌.సునిల్‌కుమార్‌. వై.పవన్‌కుమార్‌, పి.శైలజ కలసి రూపొందించారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సౌర విద్యుత్తును వినియోగించే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు రూపొందించిన నమూనాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేలా త్వరలో ఒక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు కళాశాల ఈఈఈ విభాగాధిపతి సి.వెంకటరమణారెడ్డి జూన్ 16న‌ తెలిపారు. ఇప్పుడు రూపొందించిన నమూనాలకు పూర్తి రూపం వచ్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని, విద్యార్థులకు సహకరిస్తామని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.రవీంద్రనాథ్‌ తెలిపారు.

  మాలిక్యులార్‌ మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో అద్భుతాలు సృష్టించవచ్చు

  * ప్రొఫెసర్‌ కుందన్‌ ఇంగేల్‌
  లాం(తాడికొండ), న్యూస్‌టుడే: మాలిక్యులార్‌ మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి అద్భుతాలను సృష్టించవ్చని పూనేకు చెందిన వీలైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీస్‌ అప్లికేషన్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కుందన్‌ ఇంగేల్‌ అన్నారు. లాంలోని చలపతి ఫార్మసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో 'ఔషధ తయారీలో మాలిక్యులార్‌ మోడలింగ్‌ పాత్ర' అనే అంశంపై జూన్ 16న‌ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రిన్సిపల్‌ నాదెండ్ల రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇంగేల్‌ మాట్లాడుతూ ఔషధాల తయారీకి సాధారణంగా 15-20 సంవత్సరాల కాల వ్యవధి పడుతుందన్నారు. మాలిక్యులార్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి కాల వ్యవధిని తగ్గించడంతో పాటు డబ్బు, జంతువుల సంఖ్యను తగ్గించవచ్చని సూచించారు. ఔషధాల గుణగణాలను అధ్యయనం చేయడం ద్వారా తక్కువ ఖర్చుకే వ్యాధిని నిర్మూలించి ఉపశమనం ఇచ్చేటువంటి అద్బుత ఔషధాలను తయారు చేయవచ్చన్నారు. స్వైన్‌ఫ్లూ నివారణకు మార్కెట్లో ఉన్న ఓసెల్‌ మివిర్‌, ఎయిడ్స్‌ చికిత్సకు మార్కెట్లో ఉన్న కొత్త మందులు మాలిక్యులార్‌ ద్వారా ఉత్పత్తి చేసినవేనని ఆయన వివరించారు. సౌందర్య ఉత్పత్తుల తయారీ, వివిధ సువాసనలిచ్చే తేనీరు తయారీలో, పెట్రోలియం పరిశ్రమలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగం తెలుసుకోవడం ద్వారా అనేక రకాల నూతన పరిశోధనలు చేయవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫార్మాస్యూటికల్‌ ఎనాలసిస్‌, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాలజీ అధ్యాపకులు, ఎంఫార్మా, బీఫార్మా, డీఫార్మా విద్యార్థులు పాల్గొన్నారు.

  ఎస్‌ఎమ్‌బీల నుంచీ ఐటీకి భారీ వ్యాపారావకాశాలు

  ఈనాడు, హైదరాబాద్‌: చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల (ఎస్‌ఎమ్‌బీ) నుంచీ భారీ వ్యాపారావకాశాలు లభిస్తాయని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం ఆశిస్తోంది. 2012- 13లో ఎస్‌ఎమ్‌బీల నుంచి 8.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.52,200 కోట్లు) వ్యాపారం లభించగా, రానున్న అయిదేళ్లలో ఈ మొత్తం 18 బిలియన్‌ డాలర్లు (రూ.లక్ష కోట్లకు పైగా) దాటుతుందనే అంచనాలున్నాయి.
  సేవలు, ఉత్పత్తుల రంగంలోని వ్యాపారం, పరిశ్రమ ఏదైనా కార్యకలాపాలు సజావుగా, పారదర్శకంగా సాగడంలో ఐటీ కీలకంగా మారుతోంది. మానవ వనరుల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, సరకుకు ఆర్డర్లు తీసుకోవడం, సరఫరా వంటి వ్యవహారాలు క్రమానుగత పద్ధతిలో సాగేలా చూసుకొనేందుకు, నిర్వహణ ఖర్చులు తగ్గించుకొనేందుకు, ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగు పరచుకొనేందుకు ఐటీ ఉపయోగపడుతుంది. విభిన్న దేశాలు, దేశంలో భారీ స్థాయిలో కార్యకలాపాలు సాగించే కార్పొరేట్‌ సంస్థలు ఐటీ వినియోగంలో ముందున్నాయి. ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను ఐటీ సంస్థలు తయారు చేసి అందించడమే కాక, నిర్వహిస్తున్నాయి కూడా. వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి సంప్రదాయ దేశాలతో పాటు కొత్త విపణులపై దృష్టి సారిస్తున్న ఐటీ సంస్థలు, దేశీయంగా ఎస్‌ఎమ్‌బీ విభాగం భారీ వ్యాపారాన్ని అందించగలదని ఆశిస్తున్నాయి.
  ఇవీ అవకాశాలు
  దేశంలోని 4.70 కోట్ల ఎస్‌ఎమ్‌బీలు జీడీపీలో 17 శాతం వాటాను కలిగి ఉన్నాయి. తయారీ రంగంలో 45 శాతం వాటా కలిగిన ఈ సంస్థలు, దేశీయ కార్మికులలో 40 శాతం మందికి ఉపాధిని చూపుతున్నట్లు ఒక అంచనా ఉంది. దేశీయ ఎగుమతులలో 40 శాతం ఈ రంగం నుంచే ఉన్నాయని సమాచారం. అందుకే భిన్న రంగాలలోని ఎస్‌ఎమ్‌బీల అవసరాలకు పరిశీలించి, వాటికి ఉపయోగపడే ఐటీ ఉత్పత్తులు, సేవల తయారీలో ఐటీ సంస్థలు నిమగ్నమయ్యాయి. క్లౌడ్‌ పద్ధతిలో, తక్కువ ఖర్చులోనే ఐటీని వినియోగించుకొనే అవకాశాన్ని ఎస్‌ఎమ్‌బీలకు కల్పిస్తున్నాయి. 2012-13లో ఎస్‌ఎమ్‌బీల నుంచి 8.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.52,200 కోట్లు) వ్యాపారం ఐటీ సంస్థలకు లభించింది. ఐటీ వినియోగంలో 15 శాతం వార్షిక వృద్ధి లభిస్తోందని, అయిదేళ్లలో ఎస్‌ఎమ్‌బీల నుంచి ఐటీ సంస్థలకు 18 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,08,000 కోట్లు) లభిస్తుందని నాస్కామ్‌ అంచనా వేస్తోంది.
  రిటైల్‌ విభాగం వాటా 43 శాతం
  ఐటీ వినియోగంలో తయారీ, విద్యా, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య, స్థిరాస్తి- నిర్మాణ రంగాలతో పాటు చిల్లర వర్తక (రిటైల్‌) విభాగం అత్యంత కీలకంగా మారాయి. ఎస్‌ఎమ్‌బీలలో 43 శాతం వాటా రిటైల్‌ విభాగానిదే. దేశంలోని భిన్న ప్రాంతాలు, అవసరాలకు అనుగుణంగా అక్కడి రిటైల్‌ సంస్థలున్నాయి. వీటికోసం ప్రత్యేక ఐటీ ఉత్పత్తులు, సేవలు రూపొందించడం సంస్థలకు సవాలుగా ఉంది.
  * ఎస్‌ఎమ్‌బీలలో మరీ చిన్న స్థాయి ఎస్‌ఎమ్‌బీలు ఎటువంటి ఐటీ సేవలను వినియోగించుకోవడం లేదు.
  * మధ్య స్థాయి సంస్థలు సొంతంగా రూపొందించుకున్న సొల్యూషన్ల నుంచి పెద్ద సంస్థలు అమలు చేసే ప్యాకేజ్డ్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి సిద్ధం అవుతున్నాయి.
  * ఆదాయం, లాభాలు మెరుగ్గా ఉన్న సంస్థలు కొత్త టెక్నాలజీకి అప్‌గ్రేడ్‌ కావడంతో పాటు వ్యాపారాభివృద్ధి కోసం మొబిలిటీ, అనలిటిక్స్‌ వంటివీ వినియోగిస్తున్నాయి.

  పైడా విద్యాసంస్థల్లో నూతన కోర్సులు

  పటవల(తాళ్లరేవు), న్యూస్‌టుడే: పైడా విద్యాసంస్థల్లో మరిన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఛైర్మన్‌ పైడా సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. పటవల పైడా ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పైడా సత్యప్రసాద్‌ మాట్లాడారు. తాళ్లరేవు మండలంలోని పటవల పైడా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏఐసీటీఈ న్యూఢిల్లీ వారు 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించిన అగ్రికల్చర్‌ బి.టెక్‌ కోర్సులో 120 సీట్లకు అనుమతి మంజూరయ్యాయన్నారు. దీనితో పాటుగా ఎమ్‌.టెక్‌ సివిల్‌ బ్రాంచ్‌లో ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌, ఎమ్‌.టెక్‌ మెకానికల్‌ విభాగంలో అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సిస్టమ్‌, ఎమ్‌.ఫార్మసీలో ఫార్మాస్యూటికల్‌ అనాలసిస్‌ అండ్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ ఒక్కొక్క బ్రాంచిలో 24 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

  నగరంలో ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు

  జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఆస్ట్రేలియా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్ట్రేలియన్‌ ట్రైల్స్‌ ప్రోగ్రాంను నగర విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆస్ట్రేలియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ మైఖేల్‌ ఓహన్లోన్‌ తెలిపారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల కోర్సు చేసిన విద్యార్థులు తర్వాత గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు నెలలు ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంటుందన్నారు. 3 సంవత్సరాల ఆస్ట్రేలియన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంను రెండు సంవత్సరాలలోనే పూర్తి చేసి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఏసీబీఎం సంస్థ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

  సివిల్స్‌ ఉత్తమ ర్యాంకర్లలో ఇంజినీరింగ్‌ అభ్యర్థులే అధికం

  * రెండు రాష్ట్రాల నుంచి 40 మందిదాకా..
  ఈనాడు, హైదరాబాద్‌, నల్గొండ, న్యూస్‌టుడే: దేశంలోనే అత్యున్నత సర్వీసు అయిన సివిల్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల నుంచి 35-40 మందికి చెప్పుకోదగిన ర్యాంకులు లభించాయి. ఉత్తమ ర్యాంకర్లలో ఇంజినీరింగ్‌ విద్య పూర్తిచేసిన వారే అధికంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన క్రితిక జ్యోత్స్న 30వ ర్యాంకు సాధించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అవిభాజ్య రాష్ట్రంలో ఈమెతోనే ఉత్తమ ర్యాంకర్ల ఖాతా ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. సివిల్స్‌ పరీక్షల శిక్షణ సంస్థ 'బ్రెయిన్‌ట్రీ' సంచాలకులు గోపాలకృష్ణ మాట్లాడుతూ.. సివిల్స్‌లో సిలబస్‌ సంపూర్ణంగా మార్చిన అనంతరం వెలువడిన తొలి ఫలితాల్లో హ్యుమానిటీస్‌పై పట్టు కలిగిన వారు ఉత్తమ ర్యాంకులు పొందారని చెప్పారు. ఇంజినీరింగ్‌ విద్యను పూర్తిచేసిన వారు వీరిలో ఎక్కువగా ఉన్నారని తెలిపారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ హీరాలాల్‌ సమారియా కుమారుడైన పీయుష్‌ సమారియా 165వ ర్యాంకు సాధించారు.

  గీతం విద్యార్థికి ఫిక్కీ జాతీయ ఇన్నోవేషన్‌ అవార్డు

  విశాఖపట్నం, న్యూస్‌టుడే: గీతం విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఆఖరి సంవత్సరం బీటెక్‌ చదువుతున్న విద్యార్థి కృష్ణసాయి ఇంకొల్లు జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారని గీతం విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ జి.సుబ్రహ్మణ్యం జూన్ 12న ఓ ప్రకటనలో తెలిపారు. అంధుల కోసం ఆసరాగా ఉండే విధంగా తక్కువ వ్యయం కాగల పాదరక్షలను రూపొందించారని వివరించారు. పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్న కృష్ణసాయి డిజైన్‌ జాతీయ స్థాయిలో జరిగిన ఇండియా ఇన్నోవేషన్‌ గ్రోత్‌ ప్రోగ్రామ్‌లో అత్యుత్తమ డిజైన్‌లలో ఒకటిగా అవార్డును సొంతం చేసుకుందని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ), ఇండో యూఎస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫోరమ్‌, టై సిలికాన్‌ వేలీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌, స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సంయుక్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇన్నోవేటర్స్‌ పోటీల్లో అవార్డుతో పాటు బంగారు పతకాన్ని అందుకున్నారని తెలిపారు. ఫిక్కీ జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన 10 మంది జాబితాలో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.

  ఫేస్‌బుక్‌, లింక్‌డ్‌ఇన్‌ల ద్వారా టీసీఎస్‌ నియామకాలు

  ముంబయి: ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌ తాను చాలావరకు నియామకాలను ఒకటో అంచె, రెండో అంచె నగరాలలోనే చేపడుతున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ 55,000 మందిని భర్తీ చేసుకోవాలనుకొంటోంది. ఇప్పటి వరకు 25,000 మందికి ఆఫర్‌ లెటర్లను పంపించింది. ఉద్యోగావకాశాలను స్వీకరిస్తున్న వారు ప్రస్తుతం 72 శాతంగా ఉంటున్నారని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌, లింక్‌డ్‌ఇన్‌ వంటి డిజిటల్‌ వేదికల ద్వారా కూడా రిక్రూట్‌మెంట్‌ చేపడుతున్నట్లు టీసీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ హెడ్‌- హెచ్‌ఆర్‌ వివరించారు. ఉద్యోగం కావాలనుకున్న వారు పోర్టల్‌లో వారి పేర్లను నమోదు చేసుకోవచ్చని, పరీక్ష, ఇతర నియామక సంబంధిత ప్రక్రియలు ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చని, ఈ విషయాన్ని కాలేజీలకు తెలిపామని ముఖర్జీ వివరించారు.

  వచ్చేస్తోంది స్మార్ట్‌ కుర్చీ

  * కాళ్లు లేనివారికి ఇక కదలిక సులువు
  * హైదరాబాద్‌ కుర్రాళ్ల ఆవిష్కరణ
  * మైక్రోసాఫ్ట్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

  ఈనాడు ప్రత్యేక విభాగం: స్మార్ట్‌ఫోన్‌ మాదిరిగా స్మార్ట్‌కుర్చీ వస్తోంది. స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్‌లోని సాంకేతిక నైపుణ్యం ఆధారంగా రూపొందించిన ఈ చక్రాల కుర్చీ పిలిస్తే వస్తుంది. ఎటు వెళ్లమంటే అటు వెళ్తుంది. అడ్డుగా ఏదైనా వస్తే దానంతటదే ఆగిపోతుంది. స్వరంతోనే కాదు.. మీట నొక్కినా పనిచేస్తుంది. హృదయ స్పందన, రక్తపోటు వంటి వివరాలనూ అందజేస్తుంది. ఎలాంటి తరహా నేల మీదైనా పనిచేసేలా దీన్ని తయారుచేశారు మన హైదరాబాదీ కుర్రాళ్లు. ఈ ఆవిష్కరణను మైక్రోసాఫ్ట్‌ జాతీయ స్థాయి ప్రతిభాన్వేషణ పోటీల్లో ఇటీవలే ప్రదర్శించారు. అంతా సవ్యంగా సాగితే మన విద్యార్థుల 'స్మార్ట్‌' ఆవిష్కరణ విపణిలోకి రావడానికి పెట్టుబడి పెట్టేదీ.. మైక్రోసాఫ్టే. అలాకాకపోయినా విపణిలోకి త్వరలోనే రావడమైతే ఖాయం.
  వేర్వేరు కారణాలతో చక్రాల కుర్చీకే పరిమితమైనవారు ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్లాలంటే ఇంకొకరి సాయం తప్పనిసరి. కనీసం ఇంట్లో ఒక గది నుంచి మరో గదికి వెళ్లాలన్నా కష్టమే. ఇలాంటి వారి కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చక్రాల కుర్చీని రూపొందించారు హైదరాబాద్‌కు చెందిన బీవీఆర్‌ఐటీ కళాశాల కంప్యూటర్‌ సైన్సు మూడో సంవత్సరం విద్యార్థులు ప్రభాష్‌ కుమార్‌, బి.రామ్‌, సంపత్‌, ఆదివంశీ. గత నెల 21, 22 తేదీల్లో మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలో బెంగళూర్‌లో జరిగిన 'యూత్‌ స్పార్క్‌' జాతీయ స్థాయి పోటీల్లో దేశం మొత్తం మీద ఏడు ఆవిష్కరణలను ఎంపిక చేయగా.. మన రాష్ట్రం నుంచి ఎంపికైనది ఇదొక్కటే. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్‌ నిర్వహిస్తున్న ఈ పోటీ తుది ఫలితాలు జూన్ 30న వెలువడనున్నాయి. అత్యుత్తమంగా నిలిచిన ఆవిష్కరణను విపణిలోకి తీసుకురావడానికి అవసరమయ్యే నిధులను మైక్రోసాఫ్టే అందజేస్తుంది. 'సమాజానికి ఉపయోగపడే ఈ ఆవిష్కరణకు గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాం. ఇటీవల జేఎన్‌టీయూలో నిర్వహించిన 'ఆక్మెల్‌ నేషనల్‌ లెవెల్‌ డిజైన్‌' పోటీల్లో దీనికి ప్రత్యేక బహుమతి లభించింది. పుణెలో ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌పై గత ఏప్రిల్‌ 27న జరిగిన అంతర్జాతీయ సదస్సులో మా ప్రజెంటేషన్‌కు 'అత్యుత్తమ పురస్కారం (బెస్ట్‌ పేపర్‌ అవార్డు) దక్కింది. ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ రిసెర్చీ అండ్‌ జర్నల్స్‌‌ (ఐఆర్‌ఏజే)లో దీని గురించి ప్రచురించనున్నారు అని చెబుతున్నారు బీవీఆర్‌ఐటీ కళాశాల మైక్రోసాఫ్ట్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ సమన్వయకర్త కార్తీక్‌.
  ఎలా పనిచేస్తుంది?: ఈ స్మార్ట్‌ కుర్చీకి బ్యాటరీ ఉంటుంది. రెండు గంటలు ఛార్జింగ్‌ చేస్తే 24 గంటలు పనిచేస్తుంది. ముందుకూ, వెనక్కూ, కుడి, ఎడమ, ఆగు.. అనే మీటలను నొక్కడంద్వారా కుర్చీ కదులుతుంది. కాళ్లూ చేతూలూ పనిచేయని వారికోసం 'స్వర గుర్తింపు' సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. 'ముందుకు, వెనక్కు, కుడి, ఎడమ.. ఆగు..' అని పిలిస్తే చాలు.. కుర్చీ అందుకనుగుణంగా పని చేస్తుంటుంది. ఏదైనా అడ్డుగా వస్తే దానంతటదే ఆగిపోతుంది. అందుకోసం కుర్చీ కింది భాగంలో పేషెంట్‌ కాళ్లు పెట్టుకునే చోట అల్ట్రాసౌండ్‌ సెన్సర్లు బిగించారు. కుర్చీకి ఎదురుగా ఒక మీటరు దూరంలో ఏవి అడ్డువచ్చినా సెన్సర్లు గుర్తిస్తాయి. దీంతో ఎవరి ప్రమేయం లేకుండానే చక్రాలకు బ్రేకులు పడతాయి. 'స్వర గుర్తింపు ద్వారా కదలికలు జరిగే ప్రక్రియలో ప్రస్తుతానికి ఇంగ్లిషు పదాలకే అప్లికేషన్‌ రూపొందించాం. ఫార్వర్డ్‌, స్టాప్‌, బ్యాక్‌, లెఫ్ట్‌, రైట్‌.. అని చెప్పిన వెంటనే కుర్చీ పనిచేస్తుంది. తెలుగు, ఇతర భాషల్లోనూ ఇది పనిచేసేలా తయారుచేస్తున్నాం. ఈ ప్రయోగం త్వరలోనే కొలిక్కి వస్తుంది. ఇప్పటికే యూఎస్‌లో ఒకరు ఈ కుర్చీని ఉపయోగిస్తున్నారు' అని చెబుతున్నారు ఆవిష్కరణ బృందంలో సభ్యుడు ప్రభాష్‌ కుమార్‌.
  ఏమిటీ ప్రత్యేకత?: జీవాధారమైన సంకేతాలను గుర్తించే అప్లికేషన్‌ను ఈ కుర్చీకి అమర్చుతున్నారు. పేషెంట్‌ చేతికి ప్రత్యేకంగా తయారుచేసిన ఓ బ్యాండ్‌ కడతారు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి.. తదితర వివరాలను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను ఆ బ్యాండ్‌లో అమర్చుతారు. ఆ ప్రాణాధార వివరాలు సాధారణ స్థాయిలో ఉన్నాయా? అసాధారణంగా పెరిగాయా? తగ్గాయా? అన్నది ఈ బ్యాండ్‌ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంటుంది. ఏమాత్రం తేడాగా కనిపించినా వెంటనే ఆ వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో అంతకు ముందే సిస్టంలో నమోదుచేసిన ఫోన్‌ నెంబరుకు పంపిస్తుంది. ఆసుపత్రులు, ఇళ్లలో దీర్ఘకాలం అస్వస్థతతో బాధపడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. దీనిపై ప్రయోగం ఇంకా కొనసాగుతుంది.
  ఎవరికి ఉపయోగం?
  వెన్నుపూస దెబ్బతిని మంచానికే పరిమితమైనవారికి...
  ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకున్నవారికి...
  వయసు పైబడి మోకాళ్ల నొప్పులు, శారీరక బలహీనతతో నడవలేని వారికి....

  నూతన కోర్సులు మంజూరు

  ప్రకాశం జిల్లా (మార్కాపురం పట్టణం), న్యూస్‌టుడే: స్థానిక ఏ1 గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు నూతన కోర్సులు మంజూరైనట్లు ఛైర్మన్‌ ఎం.షంషీర్‌ అలీబేగ్‌ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో(సీఏడీ/ సీఏఎమ్‌) 24 సీట్లు, సివిల్‌ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ ఎయిడెడ్‌ స్ట్రక్చరల్‌ అనాలసిస్‌ అండ్‌ డిజైన్‌ 24 సీట్లు ఏఐసీటీఈ మంజూరు చేసిందని తెలిపారు. వీటితోపాటు డిప్లొమాలో రెండు బ్రాంచీలు మంజూరైనట్లు చెప్పారు.

  సైన్సు పరిశోధనలపై యువత ఆసక్తి చూపాలి

  * గణిత శాస్త్రవేత్త గోవింద క్రిష్ణస్వామి
  ఇన్నీస్‌పేట, న్యూస్‌టుడే: దేశంలోని ప్రతిభావంతులైన యువత సైన్సు పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకోవాలని చెన్నై మేథమెటికల్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త గోవింద ఎస్ క్రిష్ణస్వామి సూచించారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల వేదికగా జరుగుతున్న జాతీయ రిఫ్రెషర్ కోర్సులో ఆయన అతిథి ఉపన్యాసం ఇచ్చారు. ప్రపంచదేశాలు స్విట్జర్లాండ్ వేదికగా హిగ్స్‌బోసాన్ పేరుతో పరిశోధన చేస్తున్నాయని.. అది విజయవంతమైతే విశ్వరహస్యాలు వెల్లడవుతాయన్నారు. ద్రవ బిందువు ఆధారంగా పదార్థంలోని కేంద్రక నమూనాను ఏవిధంగా చేధించాలో వివరించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ మస్తానయ్య మాట్లాడుతూ ఔత్సాహిక పరిశోధకులకు ఆర్ట్స్ కళాశాల ఒక వేదికగా మారడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భౌతిక శాస్త్రంలో వివిధరకాల ప్రయోగాలు చేస్తున్న విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం శాస్త్రవేత్త గోవింద క్రిష్ణస్వామిని ప్రిన్సిపల్ మస్తానయ్య సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కె.రామచంద్రరావు, కోర్సు డైరెక్టర్ శ్రీనివాసన్, రీసోర్సు పర్సన్లు వల్లూరిపల్లి శ్రీనివాసరావు, టీకే విశ్వేశ్వరరావు, యం.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

  'హార్టీనోట్' సృష్టికర్తకు అరుదైన అవకాశం

  ఐతమ్ క్యాంపస్(టెక్కలి), న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌లో చేరినప్పటి నుంచి అద్భుతాలు ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతున్న ఆ 20 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు కూడా అందరి వూహలకు తగ్గట్టుగా మరో అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు! స్థానిక ఐతమ్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే 'హాయ్‌ఫ్రెండ్', మూడో సంవత్సరంలో 'హార్టీనోట్' వంటి సామాజిక వెబ్‌సైట్లను సృష్టించి అందరి దృష్టినీ ఆకర్షించిన పడ్డా మోహన్‌కృష్ణ దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇంటర్న్ షిప్ సంస్థ 'ఇంటర్న్‌షాలా'కు ఎంపికయ్యాడు. కేవలం ఐఐటీ విద్యార్థులను మాత్రమే ఎంపిక చేసుకునే ఈ సంస్థ మోహన్‌కృష్ణ ప్రతిభా పాటవాలకు ఆసక్తి చూపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న మోహన్ కృష్ణకు కంపెనీ సీఈవో సర్వేష్ అగర్వాలా ఇంటర్వ్యూ చేసిన అనంతరం హెచ్ఆర్, ఎంఆర్ మేనేజర్లు ఇంటర్వ్యూలు చేశారు. ఆరు గంటల పాటు ఆన్‌లైన్‌లో సాంకేతిక పరీక్ష నిర్వహించి ఇంటర్న్‌షాలాలో ఉద్యోగావకాశం కల్పించారు. సంస్థలో సాఫ్టావేర్, వెబ్ టెక్నాలజీకి సంబంధించి ఒక్క అవకాశమే అందుబాటులో ఉండగా, అది మోహన్‌కృష్ణ దక్కించుకోవడం విశేషం. జేఎన్‌టీయూకే పరిధిలో ఇంటర్న్‌షాలాకు ఎంపికైన తొలి విద్యార్థిగా మోహన్‌కృష్ణ నిలిచాడు. మూడు నెలల శిక్షణా కాలంలో రూ. 4.5 లక్షల వార్షిక వేతనం, అనంతరం రూ. 8 లక్షల వార్షిక వేతనం ఉంటుందని మోహనకృష్ణ తెలిపారు. ఇంతకుముందే రెండు ప్రముఖ కంపెనీలకు మోహనకృష్ణ ఎంపికయ్యాడని, ఇంత అద్భుత అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని కళాశాల డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కేబీ మధుసాహు హర్షం వ్యక్తం చేశారు.

  యానిమేషన్ రంగంలో విస్తృత ఉపాధి

  * జెఎన్‌టీయూ ఎఫ్ ఉపకులపతి పేర్వారం పద్మావతి
  విజయనగర్‌కాలనీ, న్యూస్‌టుడే: మీడియా, సినిమా, ఇతర ప్రచార మాధ్యమాల్లో యానిమేషన్‌తోపాటు ఫైన్ఆర్ట్స్ కళలకు విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయని మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ వర్శిటీ ఉపకులపతి పేర్వారం పద్మావతి అన్నారు. గురువారం జేఎన్ఎఎఫ్ఏ వర్శిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నామన్నారు. అదే విధంగా ప్రఖ్యాత గాంచిన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. యానిమేషన్, ఫొటోగ్రఫీ, అప్త్లెడ్ఆర్ట్స్, మల్టిమీడియా, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులకు డిమాండ్ ఉందన్నారు. శని, ఆదివారాల్లో వర్శిటీలోని ఆర్ట్ గ్యాలరీలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్శిటీ అడకమిక్ డైరెక్టర్ ఎస్.ప్రదీప్‌కుమార్, వర్శిటీ రిజిస్ట్రార్ కవితా దర్యానిరావు పాల్గొన్నారు.

  సరోజినీ కళాశాలతో కొత్త ఎంటెక్ కోర్సులు

  తేలప్రోలు(హనుమాన్‌జంక్షన్), న్యూస్‌టుడే: తేలప్రోలు సరోజినీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి రెండు కొత్త ఎంటెక్ కోర్సులు, రెండు పాలిటెక్నిక్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కరెస్పాండెంట్ ఎ.వి.రంగారావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎంటెక్ మెకానికల్ (మెషీన్ డిజైన్) కోర్సు 18సీట్లు, ఎంటెక్ ఈఈఈ (పవర్ ఎలక్ట్రానిక్స్) కోర్సు-18 సీట్లు, పాలిటెక్నిక్ ఈఈఈ 60 సీట్లు, సివిల్ 60 సీట్లతో నూతన కోర్సులు ప్రారంభమవుతున్నట్లు ఆయన వెల్లడించారు.

  సాంకేతిక పరిజ్ఞానంలో మోషన్ క్యాప్చర్ ఒక మైలు రాయి

  పటమట, న్యూస్‌టుడే: ప్రస్తుతం సినిమా రంగంలో అభివృద్ధి చెందుతున్న అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంలో మోషన్ క్యాప్చర్ ఒక మైలురాయి అని పారిశ్రామికవేత్త డి.రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలోనే మొదటి మోషన్ క్యాప్చర్ ట్రైనింగ్ స్టూడియోను నగర విద్యార్థులకు తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. బందరు రోడ్డులోని ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలోని ఎలిమెంట్ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో ఏర్పాటు చేసిన మోషన్ క్యాప్చర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిజ్ఞానం క్రీడాకారుల కదలికలను పరిశోధించడానికి, వైద్య విభాగంలో మనుషుల్లోని ఎముకల కదలికలను పరిశీలించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. వివిధ రంగాల్లో దీని ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. కొత్తగా తీసే చిత్రాల్లో ఈ పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. గతంలో ఇది ఖర్చుతో కూడుకుందని, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందన్నారు. నగర విద్యార్థులు ఈ పరిజ్ఞానాన్ని నేర్చుకొని, ఉపాధి పొందేందుకు మంచి అవకాశమని అన్నారు. ఎలిమెంట్ సంస్థ టెక్నికల్ హెడ్ పి.మహేష్ మాట్లాడుతూ మనిషి కదలికలను గుర్తించి వాటిని యానిమేషన్ రూపంలో ఎటువంటి 3డీ క్యారెక్టర్‌ని అయినా అమర్చే విధానాన్ని మోషన్ క్యాప్చర్ అంటారన్నారు. సినిమా రంగంలోని విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఎక్కువగా వాడతారని చెప్పారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రం నుంచి రజినీకాంత్ నటించిన విక్రమసింహ వరకు అనేక చిత్రాల విజువల్ ఎఫెక్ట్స్‌లో మోషన్ క్యాప్చర్ ప్రధాన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. కంప్యూటర్ 3డీ గేమ్స్‌లోనూ ఈ పరిజ్ఞానాన్ని వాడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రధాన సాంకేతిక కళాశాలల్లో కూడా విద్యార్థులకు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యానిమేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

  బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌కు ఎఐసీటీఈ అనుమతి

  చేపూర్(పెర్కిట్), న్యూస్‌టుడే: జెఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలో కొనసాగుతున్న క్షత్రీయ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌కు ఈ విద్యాసంవత్సరం 2014-15లో బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ డిగ్రీకి ఎఐసీటీఈ అనుమతి వచ్చినట్లు కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంటెక్‌లో థర్మల్ ఇంజినీరింగ్, డిప్లమాలో మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులకు ఎఐసీటీఈ అనుమతి లభించిందని అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ కోర్సులు ఉపయోగపడుతాయని కళాశాల ఛైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు.

  విద్యార్థులు ఆవిష్కరించిన సోలార్ బగ్గీ

  కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: సౌరశక్తితో నడిచే వాహనాన్ని రూపొందించారు దువ్వాడ విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు. ఈఈఈ, మెకానికల్ విద్యార్థులు సంయుక్తంగా తయారుచేసిన ఈ వాహనానికి 'సోలార్ పవర్డు క్యాంపస్ బగ్గీ' అని పేరు పెట్టారు. ప్రిన్సిపల్ అలీస్‌మేరీ మే 29న దీనిని ఆవిష్కరించారు. నలుగురు వ్యక్తులు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దినట్లు చెప్పారు. మొత్తం వాహనం తయారీకి రూ.75 వేలు ఖర్చయిందని తెలిపారు. వాహనం రూపకల్పనలో భాగమైన విద్యార్థులు, వారికి సహకరించిన ఈఈఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.మహేశ్వరరావు, మెకానికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ రుద్రాభిరామ్‌ను విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య, సీఈవో కె.పవన్‌కృష్ణ తదితరులు అభినందించారు.

  సిద్ధార్థలో మైక్రోసాఫ్ట్‌ ఇన్నోవేట్యూ కేంద్రం

  చిత్తూరు జిల్లా (నారాయణవనం), న్యూస్‌టుడే: సిద్ధార్థ గ్రూప్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ మైక్రోసాఫ్ట్‌ సంస్థ 'మైక్రోసాఫ్ట్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ కొలాబరేషన్‌'తో అగ్రిమెంట్‌ కుదుర్చుకుని సంతకాలు చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ డైరెక్టర్‌(ఎడ్యుకేషన్‌ అడ్యోకసి) లోకేష్‌మెహ్ర మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తరపున, సిద్ధార్థ కళాశాల ఛైర్మన్‌ డాక్టర్‌ అశోకరాజు కళాశాల తరపున మే 23న అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. దీనిద్వారా సిద్ధార్థ గ్రూఫ్‌ కళాశాలలోని విద్యార్థులు సొంతంగా 'ఆప్స్‌'ను తయారు చేయవచ్చు, విద్యార్థుల ప్రతిభను ఆధునిక టెక్నాలజి అయిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా విద్యార్థుల పరిశోధనా సామర్ధ్యాన్ని, ప్రతిభను గుర్తించి వివిధ రంగాలలోని కంపెనీలతో పాటు మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఈ ఎంఐసీ ద్వారా సిద్ధార్థ గ్రూఫ్‌ విద్యార్థులు పరిసర జిల్లాలో ఉన్న కంపెనీ అవసరాలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ ఖర్చులేకుండా అందించే వీలు కలుగుతుంది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ డైరెక్టర్‌ లోకేష్‌మెహ్ర పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విద్యార్థుల ప్రతిభను చాటేందుకు మైక్రోసాఫ్ట్‌ అగ్రిమెంట్‌ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేశారు.

  ఇంజినీరింగ్‌ కళాశాలకు అనుమతి

  నెల్లూరు(విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అనుబంధంగా ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈమేరకు ఆ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య నాగేంద్రప్రసాద్‌ మే 21న ఒక ప్రకటనలో తెలిపారు. 2014-15 అకడమిక్‌ సంవత్సరానికి ఎంసెట్‌ కోడ్‌ వీఎస్‌యూఈ పరిగణంచబడుతుందన్నారు. ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, త్రిబుల్‌ఈ, కంప్యూటర్స్‌ సైన్స్‌, సివిల్‌ విభాగాల కోర్సులలో ప్రవేశాలు చేపడతామని ఆయన తెలిపారు.

  సౌరశక్తితో నడిచే ట్రైసైకిల్

  భీమవరం విద్యావిభాగం(పశ్చిమ గోదావరి), న్యూస్‌టుడే: భీమవరంలోని ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు వికలాంగుల కోసం సౌరశక్తితో నడిచే ట్రైసైకిల్‌ను రూపొందించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ డి.రంగరాజు తెలిపారు. మెకానికల్ బ్రాంచి ఆఖరి సంవత్సరం చదువుతున్న వివేక్, లోకేష్, భవిష్య, సుధ, ఛాందిని, సద్గుణ అనే విద్యార్థులు ఈ ట్రైసైకిల్ తయారు చేశారన్నారు. ట్రైసైకిల్‌కు పైన సౌరశక్తి ప్యానల్స్‌ను ఏర్పాటు చేయడంతో బ్యాటరీ ఛార్జింగ్ అయి వాహనం నడుస్తుందని, దీంతో వాహనం నడిపే వ్యక్తికి నీడ కూడా వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు తయారీకి కోల్‌కతకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ రూ.50 వేలు అందించినట్లు మెకానికల్ బ్రాంచి విభాగాధిపతి డాక్టర్ కె.బ్రహ్మరాజు చెప్పారు. మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ వి.దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో విద్యార్థులు ఈ ప్రాజెక్టును తయారు చేశారన్నారు.

  ఐబీపీఎస్ పరీక్షల క్యాలెండర్ తొలిసారిగా విడుదల

  హైదరాబాద్ : దేశంలోని వివిధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు / మేనేజ్‌మెంట్ ట్రెయినీస్, క్లర్కులు, స్పెషలిస్టుల పోస్టుల భర్తీకి 2014 - 15 సంవత్సరంలో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన క్యాలెండర్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) మే 15న విడుదల చేసింది. ఐబీపీఎస్ ఈ విధంగా ముందుగానే క్యాలెండర్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలోని ప్రధానమైన ప్రభుత్వరంగ బ్యాంకులు ఐబీఐపీఎస్ నిర్వహించే కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ (సీడబ్ల్యూఈ) స్కోర్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేస్తున్న సంగతి తెలిసిందే.
  * ఐబీపీఎస్ క్యాలెండర్ వివరాలు ఇలా ఉన్నాయి...
  1) సీడబ్ల్యూఈ పీవో/ ఎంటీ - 4: అక్టోబరు (2014) 11, 12, 18, 19 తేదీలు, తిరిగి నవంబరు 1, 2 తేదీలు.
  2) సీడబ్ల్యూఈ క్లర్క్స్- 4: డిసెంబరు (2014) 6, 7, 13, 14, 20, 21, 27 తేదీలు.
  3) సీడబ్ల్యూఈ స్పెషలిస్ట్ - 4: ఫిబ్రవరి (2015) 14, 15, 21 తేదీలు.
  ఈ తేదీల్లో రాత పరీక్షలు జరుగుతాయని, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉంటాయని ఐబీపీఎస్ డైరెక్టర్ తెలిపారు.
  * రూరల్ బ్యాంకుల పరీక్షల క్యాలెండర్
  రూరల్ బ్యాంకులకు సంబంధించి 2014-15లో నిర్వహించనున్న సీడబ్ల్యూఈ -ఆర్ఆర్‌బీ 3 ఆన్‌లైన్ పరీక్షల క్యాలెండర్‌ను కూడా ఐబీపీఎస్ విడుదల చేసింది. ఈ పరీక్షలు 2014 సెప్టెంబరు 6, 7, 13, 14, 20, 21, 27 తేదీల్లో జరుగుతాయి.

  ఐబీపీఎస్- క్యాలెండర్

  సాంకేతిక సారథ్యం 'ఏఐసీటీఈ'కే

  * సుప్రీంకోర్టు తీర్పుతో సంస్థకు పునరుజ్జీవం
  * యూజీసీ మారటోరియానికి కాలంచెల్లు

  ఈనాడు, హైదరాబాద్‌: అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ)కి సాంకేతిక విద్యపై మళ్లీ పట్టు లభించింది. సుప్రీంకోర్టు నుంచి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు వెలువడడంతో కొత్తగా ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర కళాశాలల ప్రారంభానికిగానీ, మూసివేతకుగానీ అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని శనివారం ప్రకటన ఇచ్చినట్లు ఏఐసీటీఈ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మంథా 'ఈనాడు'తో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కళాశాలల అనుమతుల ప్రక్రియను జూన్‌ రెండో వారంలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2013-14 సంవత్సరంలో విడుదలచేసిన 'అనుమతుల జారీ ప్రకటన'ను అనుసరించి తమ చర్యలు వచ్చే విద్యా సంవత్సరానికీ యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. దీంతో యాజమాన్యాల ఆసక్తిని అనుసరించి కొత్తగా కళాశాలలు రావడం, కోర్సులు పెరగడం, తగ్గడం జరగనుంది.
  ఏఐసీటీఈ నుంచి యూజీసీకి..
  సాంకేతిక విద్యపై ఏఐసీటీఈకి నియంత్రణ అధికారం లేదని కిందటేడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని స్థానంలో సాంకేతిక విద్య పర్యవేక్షణ బాధ్యతలను యూజీసీ స్వీకరించేలా ఢిల్లీలో గట్టి ఏర్పాట్లు జరిగాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా రానున్న విద్యా సంవత్సరం(2014-15)లో కొత్తగా ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర వృత్తివిద్యా కళాశాలలకు కోర్సులవారీగా అదనపు సీట్ల మంజూరుకు అనుమతులు ఇవ్వడంలేదని పేర్కొంటూ యూజీసీ మారటోరియాన్ని ప్రకటించింది. అంతేకాకుండా.. యూజీసీ తరఫున సంబంధిత విశ్వవిద్యాలయాలే (అనుబంధ గుర్తింపును మంజూరు చేసే) ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర కోర్సుల కళాశాలల స్థాపనలో, అదనపు కోర్సుల అనుమతుల్లో కీలకపాత్ర పోషించేలా నిబంధనలు తయారవుతున్నాయి. ఈ తరుణంలో సాంకేతిక విద్యపై ఏఐసీటీఈకే పూర్తి అధికారం ఉందని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు 2014-15 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. మరోవైపు సుప్రీం తీర్పును 'అరోరా' కళాశాలల అధిపతి రమేష్‌ స్వాగతించారు.
  యూజీసీ నుంచి ఏఐసీటీఈకి..
  పార్లమెంటు చట్టం ద్వారానే ఏఐసీటీఈ ఏర్పడింది. కిందటేడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మేరకు చట్టంలో మార్పులుచేసి ఏఐసీటీఈ కార్యకలాపాలను కొనసాగించేలా ఢిల్లీలో ప్రయత్నాలు జరిగాయి. అయితే, కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈలోగా ఏఐసీటీఈ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించి సానుకూల ఆదేశాలు పొందింది. దీంతో యూజీసీ స్థానంలో ఏఐసీటీఈ మళ్లీ తెరపైకొచ్చింది. తొలుత జారీచేసిన యూజీసీ మార్గదర్శకాలు అనుసరించి జేఎన్‌టీయూ కాకినాడ అధికారులు కొత్త కళాశాలల స్థాపన, అదనపు సీట్ల మంజూరు గురించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. మారటోరియం నిర్ణయంతో వాటిని ఉపసంహరించుకున్నారు. మళ్లీ ఏఐసీటీఈ ప్రకటన జారీచేస్తున్నందున తమ పూర్వ ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లు జేఎన్‌టీయూ కాకినాడ అధికారులు తెలిపారు. ఇదేబాటలో ఇతర వర్సిటీలు నడుస్తున్నాయి.

  పీఆర్‌ డిగ్రీ కళాశాలలో... నూతన వృత్తి విద్యాకోర్సులు

  భానుగుడిసెంటర్‌, న్యూస్‌టుడే: కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన వృత్తివిద్యా కోర్సులకు యూనియన్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అనుమతులిచ్చిందని ప్రిన్సిపల్‌ కల్నల్‌ ఎం.సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో కేవలం పీఆర్‌ ప్రభుత్వ కళాశాలకు మాత్రమే ఈ కోర్సుల నిర్వహణకు అంగీకారం తెలిపిందన్నారు. మే 10న‌ కళాశాలలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమర్షియల్‌ ఆక్వాకల్చర్‌ (30 సీట్లు), రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ (30 సీట్లు) కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ల్యాబ్‌, ప్రొఫెసర్ల నియామకం, పరిశ్రమల అనుసంధానం నిమిత్తం రూ.1.85 కోట్ల నిధులను యూజీసీ వెచ్చించిందన్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన అనంతరం విద్యార్థులు త్వరగా ఉద్యోగావకాశాలను పొందే వీలుంటుందన్నారు. క్రెడిట్‌ విధానంతో ఈ కోర్సులను నిర్వహిస్తున్నామని కోర్సుల కోఆర్డినేటర్లు డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌, టీటీ విజయప్రసాద్‌లు తెలిపారు. దీనికోసం రాష్ట్ర మత్స్యసాంకేతిక పరిజ్ఞాన సంస్థ, సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ఎడ్యుకేషన్‌ (సీఐఎఫ్‌ఈ) రిలయన్స్‌, స్పెన్సర్స్‌, తదితర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామన్నారు. ఏదైనా ఇంటర్‌, డిప్లమో చదివిన విద్యార్థులు ఈ కొత్త కోర్సుల్లో చేరవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 0884- 2387888లో సంప్రదించవచ్చు.

  సత్తా చాటిన ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల

  * జాతీయ స్థాయిలో 27వ స్థానం
  సిరిపురం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలకు అరుదైన గౌరవం లభించింది. ఇటీవల ఎడ్యుకేషనల్‌ వరల్డ్‌ మేగజైన్‌ నిర్వహించిన ఓ సర్వేలో జాతీయ స్థాయిలో ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల 27వ స్థానాన్ని దక్కించుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్థాయిలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తొలి స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఇటీవల విడుదలైన ఈ సర్వే ఫలితాలతో ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు జాతీయ స్థాయిలో మరో మారు ప్రత్యేక గుర్తింపు లభించినట్త్లెయిందని వర్సిటీ ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో బిట్స్‌ బిలానీ కళాశాల తొలి స్థానంలో నిలవగా, హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీ రెండవ స్థానంలో నిలిచింది. అయితే జాతీయ స్థాయిలో ఏయూ 27వ ర్యాంకు సాధించగా ఉస్మానియా యూనివర్సిటీ 46వ స్థానంతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్థాయిలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏయూ తొలిస్థానంలో నిలవగా, జేఎన్‌టీయూ హైదరాబాద్‌ 2వ స్థానంలో నిలిచింది. ఆచార్యులు, పరిశోధన, ప్రాంగణ ఎంపికలు, మౌలిక వసతుల ఆధారంగా ఎడ్యుకేషనల్‌ వరల్డ్‌ సంస్థ ఈ ర్యాంకులు ప్రకటించినట్లు ఏయూ వీసీ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు మే 9న తెలిపారు. ఈ స్ఫూర్తితో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తామన్నారు.

  సైబర్‌ దాడులకు విరుగుడు

  న్యూయార్క్‌: సైబర్‌ దాడుల నుంచి కంప్యూటరు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను రక్షించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించాడు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి సంజంగార్గ్‌. ఇందుకు గాను ఇతనికి 20 వేల అమెరికన్‌ డాలర్ల బహుమానం దక్కింది. ఇతను కంప్యూటరు ప్రోగ్రాం కోడ్‌ ఇతరులు గుర్తించకుండా ఉండేలా కొత్తరకం టూల్‌ అభివృద్ధి చేశాడు. దీంతో కంప్యూటింగ్‌ మెషినరీ అసోసియేషన్‌ డాక్టరల్‌ డిసెర్టేషన్‌ అవార్డును ఇచ్చారు. దీని కింద వచ్చేనెల రూ.12 లక్షలు అందనుంది.

  ఇసుకలోనూ యమ స్పీడు

  * సరికొత్త బైక్‌ను సృష్టించిన వాగ్దేవి విద్యార్థులు
  సంగెం, న్యూస్‌టుడే: మట్టిరోడ్లు, కొండలు, ఇసుక.. ఇలా అన్ని ప్రాంతాల్లో అలవోకగా నడిచే 'ఆఫ్‌రోడ్‌ ఫోర్‌వీలర్‌ బైక్‌'ను వరంగల్‌ జిల్లా సంగె మండలం బొల్లికుంటలోని వాగ్దేవి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు తయారుచేశారు. ఇది సాధారణ రోడ్లపైనే కాకుండా బీచ్‌లలో కూడా సునాయాసంగా నడుస్తుందదని విద్యార్థులు తెలిపారు. 'ఇండిపెండెంట్‌ సస్పెన్షన్‌ టిల్లింగ్‌ వీల్స్‌, ఫోర్‌ బార్‌ మెకానిజమ్‌' ఆధారంగా ఇది పనిచేస్తుందన్నారు. ఈ వాహనాన్ని 'డిజైన్‌ కాటియా' అనే సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా రూపొందించారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగే ఈ బైక్‌ లీటరు పెట్రోలుకు 30 కి.మీల మైలేజ్‌ ఇస్తుందన్నారు. ఈ వాహనాన్ని బీటెక్‌ మెకానికల్‌ చివరి సంవత్సరం విద్యార్థులు రంజిత, ఫెయిజ్‌, రవితేజ, సృజన, సుభాష్‌, ప్రవీణ్‌, భగవాన్‌, శోభ, రోహిత్‌లు రూపొందించారు. వీరిని కళాశాల యాజమాన్యం సీహెచ్‌ దేవేందర్‌రెడ్డి, సత్యపాల్‌రెడ్డితో పాటు ప్రిన్సిపాళ్లు సీహెచ్‌ సత్తయ్య, ప్రకాశ్‌, హెచ్‌వోడీలు శ్రీనివాస్‌, విజయ్‌పాల్‌ అభినందించారు.

  లీటర్‌ పెట్రోల్‌తో 1,200 కి.మీ

  వాషింగ్టన్‌ నుంచి న్యూస్‌టుడే ప్రతినిథి: షెల్‌సంస్థ ఆధ్వర్యంలో హ్యుస్టన్‌లో నిర్వహించిన అధిక మైలేజీని అందించే కార్ల ప్రదర్శనలో కెనడాలోని క్యూబెక్‌కు చెందిన లావల్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు తాము రూపొందించిన కారుకు మొదటి బహుమతిని గెలుచుకున్నారు. కేవలం లీటర్‌ పెట్రోల్‌తో 1,200 కి.మీ. ప్రయాణం చేసే అలెరియాన్‌గా వ్యవహరించే ఈ మూడు చక్రాల కారు కన్నీటి బిందువు రూపంలో ఉంటుంది. గత ఏడాది ఇదే విశ్వ విద్యాలయానికి చెందిన వేరే విద్యార్థుల బృందం 4 లీటర్లతో 5772 కిలోమీటర్లు ప్రయాణం చేసే కారును రూపొందించారు. ప్రోటోటైప్‌, అర్బన్‌ కాన్సెప్ట్‌ అనే రెండు విభాగాల్లో డీజిల్‌, పెట్రోలు, చమురు, హైడ్రోజెన్‌, సూర్మరశ్మి, విద్యుత్‌ వంటి పలు ఇంధన రూపాలు వినియోగించుకుని అత్యధిక మైలేజీ ఇచ్చే కార్ల కోసం షెల్‌ సంస్థ గత ఆరేళ్లుగా ఇలాంటి పోటీలను నిర్వహిస్తోంది. ఆరింటిలో అయిదు సార్లు లావల్‌ విశ్వ విద్యాలయ విద్యార్థులే గెలుపొందటం మరో విశేషం. హ్యూస్టన్‌లో నిర్వహించిన పోటీల్లో ఇండియానా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఫ్లయింగ్‌ సాసర్‌ రూపంలో ఉండే కారును రూపొందించిన కారుకు 4 లీటర్లతో 1366 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యముంది.

  అమెరికాలో చదువులు: భారత విద్యార్థుల సంఖ్య అధికం

  వాషింగ్టన్‌: అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకూ దాదాపు లక్షా 13 వేల 813 మంది భారతీయ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుని ఉన్నట్లు అధికారిక నివేదిక ఒకటి బుధవారం వెల్లడించింది. అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 2 లక్షల 90 వేల 133 మంది విద్యార్థులతో చైనా అగ్రస్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇక్కడి విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో పేర్లను నమోదు చేసుకున్న భారతీయుల్లో నాలుగింట మూడొంతుల మందికి పైగా సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం తదితర రంగాలను ఎంచుకున్నారు.

  గాలితో నడిచే కారు

  * ఇంజినీరింగ్‌ విద్యార్థుల రూపకల్పన
  న్యూస్‌టుడే, కరీంనగర్‌: గాలితో నడిచే చిన్న కారును రూపొందించారు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న నరేశ్‌, ప్రశాంత్‌, సాయికిరణ్‌, అనిల్‌రెడ్డి, అమరేందర్‌లు రెండు నెలలపాటు కష్టపడి రూ.60వేల ఖర్చుతో దీన్ని తయారు చేశారు. వాయుశక్తిని వినియోగిస్తూ..ఆ శక్తిని డైనమో బ్యాటరీల సాయంతో విద్యుత్‌శక్తిగా మారుస్తూ నడిచేలా గాలి మోటార్లను బిగించారు. మే 7న శ్రీ చైతన్య యంత్ర కళాశాల కార్యదర్శి ముద్దసాని రమేష్‌రెడ్డి కారును ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ..ఈ కారుతో వాయు కాలుష్యం ఉండదని, పెట్రోలు, డీజిల్‌ను వినియోగించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. తొలుత 20 కి.మీ. వేగంతో పోనిస్తే తర్వాత వేగాన్నందుకొని వీచే గాలి సాయంతో ఇది నడుస్తుందన్నారు. కనిష్ఠంగా గంటకు 20, గరిష్ఠంగా 50 కి.మీ. వేగంతో కారు ప్రయాణించగలదని, 300 కిలోల బరువును మోసుకెళ్తుందని తెలిపారు. విద్యార్థులను ప్రధానాచార్యుడు ఆర్‌వీఆర్‌కే చలం, అధ్యాపకులు అభినందించారు.

  గత ఏడాది సత్తా చాటిన ఐటీ కంపెనీలు

  * బిగ్‌డేటా, అనలిటిక్స్‌, అప్లికేషన్లతో వృద్ధి
  * మరికొన్నేళ్లు సానుకూల ధోరణే: ఐడీసీ

  ఈనాడు - హైదరాబాద్‌ : ఐరోపా కోలుకోవడం, ఆర్థిక మందగమనం నుంచి బయట పడుతున్న అమెరికా సాఫ్ట్‌వేర్‌ వ్యాపారాభివృద్ధికి వూతమిస్తున్నాయి. బిగ్‌డేటా, అనలిటిక్స్‌, అప్లికేషన్ల విభాగాలతో దిగ్గజ కంపెనీలు మార్కెట్‌ వాటాను పెంచుకొంటున్నాయి. 2013లో దిగ్గజ ఐటీ సంస్థలన్నీ కలిపి 369 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.22.25 లక్షల కోట్ల) వ్యాపారం చేసినట్లు ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) వెల్లడించింది. 2012 కంటే ఈ మొత్తం 5.5 శాతం అధికం అని పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌ రంగానికి మరికొన్నేళ్లు సానుకూలంగానే పరిస్థితులు ఉంటాయని సంస్థ అంచనా వేస్తోంది. పోటీలో నిలబడేందుకు, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు కొత్త ఉత్పత్తులు, సేవలతో కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇందుకవసరమైన డేటా నిర్వహణ, డేటాకు అనుసంధానం కావడంతో పాటు సమాచారాన్ని పంచుకోవడం కీలకంగా మారిన పరిస్థితులే సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ వృద్దికి కారణమవుతున్నాయని సంస్థ పేర్కొంది.
  ఈ మూడే కీలకం: సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ మెరుగ్గా ఉండేందుకు అప్లికేషన్లు, అప్లికేషన్‌ అభివృద్ధి, ఆచరణలోకి తీసుకురావడం (ఏడీ అండ్‌ డీ), సిస్టమ్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రధానంగా దోహదపడ్డాయి. ఈ మూడు రంగాలు గత ఏడాదిలో 5.4- 5.6 శాతం వృద్ధిని సాధించాయి. మొత్తం సాఫ్ట్‌వేర్‌ వ్యాపారంలో అప్లికేషన్ల వాటానే 50 శాతం. కొలాబరేటివ్‌- కంటెంట్‌ అప్లికేషన్లు, ఎంటర్‌ప్రైజ్‌ సోషల్‌ నెట్‌వర్క్స్‌, పరిశోధన అప్లికేషన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. 14.1 శాతం మార్కెట్‌ వాటాతో మైక్రోసాఫ్ట్‌ అగ్రస్థానంలో నిలవగా, ఎస్‌ఏపీ, ఆరెకల్‌, ఐబీఎం, ఇన్‌ట్యూట్‌ తరవాతి స్థానాల్లో నిలిచాయి.
  సాఫ్ట్‌వేర్‌ వ్యాపారంలో ఏడీ అండ్‌ డీ వాటా 23 శాతం. ఈ విభాగం వృద్ధిలో స్ట్రక్చర్డ్‌ డేటా మేనేజ్‌మెంట్‌, డేటా యాక్సెస్‌, అనాలిసిస్‌, డెలివరీ రంగాలు ముఖ్య పాత్ర పోషించాయి. వ్యాపార విధాన పరమైన నిర్ణయాల్లో బిగ్‌డేటా, అనలిటిక్స్‌ వినియోగం పెరిగినందున డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ (డీబీఎమ్‌ఎస్‌) సొల్యూషన్లకు ప్రాచుర్యం లభించింది. ఏడీ అండ్‌ డీలో 21.5 శాతం మార్కెట్‌ వాటాతో ఆరెకల్‌ అగ్ర స్థానంలో ఉండగా, తరువాతి స్థానాల్లో ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, ఎస్‌ఏపీ, ఎస్‌ఏఎస్‌లు ఉన్నాయి.
  వ్యాపారంలో 27 శాతం సిస్టమ్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (కంప్యూటర్లలో వినియోగించే) సాఫ్ట్‌వేర్‌ది. విండోస్‌ 8 ఆవిష్కరణ, వర్చువల్‌ మెషీన్‌, క్లౌడ్‌ సిస్టమ్‌ వినియోగం వంటివి ఈ విభాగం అభివృద్ధికి తోడ్పడ్డాయి. ఈ రంగంలో 29.3 శాతం మార్కెట్‌ వాటా మైక్రోసాఫ్ట్‌దే. తరవాతి స్థానాల్లో ఐబీఎం, సిమాంటిక్‌, ఈఎంసీ, వీఎమ్‌వేర్‌లు ఉన్నాయి.

  సాధిద్దామా ఉద్యోగ విజయం..

  ఈనాడు- హైదరాబాద్‌: ఇప్పుడంతా పోటీ ప్రపంచం. రాకెట్‌కంటే వేగంగా దూసుకెళ్లాలి. లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు ఆ తరవాత ఫలితాలూ అదే స్థాయిలో ఉండాలి. మరి దానికోసం ఏం చేయాలి?
  ఒక్కో సంస్థకు రెజ్యుమె పంపడం, అక్కడి నుంచి ఇంటర్వ్యూకి పిలుపు అందే వరకూ ఎదురు చూడటం చాలామంది చేసే పని. దీనికి బదులు ఎక్కడ అవకాశాలు ఉన్నాయో తెలుసుకుని వాటికి దరఖాస్తులు పంపడం, ఫోన్‌ ఇంటర్వ్యూలకు హాజరుకావడం వరుసగా చేస్తుండాలి. దీనివల్ల కాలయాపన ఉండదు. ఒకేసారి ఎక్కువ సంస్థల గురించి సమాచారం, జీతం వంటి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.
  * కొందరికి ప్రయత్నం చేసిన వెంటనే ఉద్యోగాలు వస్తాయి. అయినా చేరరు. దీనికంటే మంచి ఉద్యోగం వస్తుందనీ, జీతం తక్కువనీ ... బోలెడు కారణాలు చెబుతారు. దీనివల్ల విలువైన కాలం, అనుభవం వృథా అవుతాయి. చదువూ, మార్కులను బట్టి మనం కోరుకున్న స్థాయి ఉద్యోగాలకు దరఖాస్తులు పంపుకోవాలి. ఎంపికయినట్టు తెలిపి, చేరడానికి కొంత సమయం ఇస్తారు. ఈ లోపు చేరాలా, వద్దా అని ఆలోచించుకోవాలి. 'అది ఇంకా మంచిది' అనుకుంటూ తరచూ ఉద్యోగాలు మారడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగం ఇచ్చే సంస్థలు మీ నిలకడలేని తనాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి.
  * ఉద్యోగం సంపాదించగానే మీరు విజయం సాధించినట్లు లెక్కేసుకోకండి. అక్కడ మీరు స్థిరంగా నిలబడాలి. దీనికోసం ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే మీరు ఏ రోజుకారోజు ఏం నేర్చుకున్నారు. ఇంకేం నేర్చుకోవాలన్నది పుస్తకంలో రాసుకోండి. విజయాలతో పాటు అపజయాలనూ నమోదు చేయండి. ఇవన్నీ భవిష్యత్తులో మిమ్మల్ని మీరు తరచి చూసుకోవాలనుకున్నప్పుడు ఉపయోగపడతాయి.

  ఎల్‌ఈడీ ఆధారిత 3డీ హాలోగ్రామ్‌

  * మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ ఆవిష్కరణ
  ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ అధునాతన ఎల్‌ఈడీ ఆధారిత 3డీ హాలోగ్రామ్‌ను ఆవిష్కరించింది. కేవలం రాత్రివేళల్లోనే కాకుండా పట్టపగలు సైతం స్పష్టమైన, ప్రకాశవంతమైన, వాస్తవిక రంగుల్లో 3డీ హాలోగ్రాఫిక్‌ బొమ్మలను చూడటం సాధ్యమవుతుందని మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ సీఎండీ డాక్టర్‌ ఎం.వి. రమణారావు ఒక ప్రకటనలో తెలిపారు. 3డీ అద్దాలతో పనిలేకుండా మామూలుగానే ఈ బొమ్మలను చూడవచ్చు. 2డీ తెరలు, బొమ్మలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు 3డీ హాలోగ్రామ్‌ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో హాయిని, విశేషమైన అనుభూతిని కల్పిస్తుందని ఆయన వివరించారు. విద్య-శిక్షణ, వినోదం, ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ సభలు, సంబంధిత ఇతర అవసరాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. మాల్స్‌, క్రీడా ప్రాంగణాలు, సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు, స్టూడియోలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, వినోద కేంద్రాల్లో ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని 3డీ హాలోగ్రాఫిక్‌ తెరలను ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్‌, ఉపకరణాలను కూడా మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ సమకూర్చగలుగుతుందని తెలిపారు. ఎల్‌ఈడీ సాంకేతిక పరిజ్ఞానంలో పాతికేళ్లకు పైగా తమకున్న అనుభవంతో ఈ కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించగలిగినట్లు డాక్టర్‌ రమణారావు చెప్పారు.

  మేఘా ఇంజినీరింగ్‌ కళాశాల వీడ్కోలు వేడుక

  హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌లోని మేఘా ఇంజినీరింగ్‌ మహిళా కళాశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నాగోలులో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.

  అగ్ని ప్రమాదాల నివారణకు 'కిట్స్' ప్రాజెక్ట్

  తూర్పుగోదావరి, భానుగుడిసెంటర్, న్యూస్‌టుడే: అగ్ని ప్రమాదాలను నివారించేందుకు కిట్స్ (దివిలి) ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సరికొత్త ప్రాజెక్టును రూపొందించారు. కళాశాల మెకానికల్ విభాగాధిపతి, గైడ్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం సూచనలతో మెకానికల్ విభాగ విద్యార్థులు ఎం.శివప్రశాంత్, కె.వెంకటేష్, కె.అప్పారావు, పి.రమణ, జి.వెంకటేష్‌లు దీనిని రూపొందించారు. బస్సులు, రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే వాటిని నివారించేలా రూపకల్పన చేశారని ప్రాజెక్టు గైడ్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇది 5 రకాల పనులను చేస్తుందన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రైలును నిలుపుదల చేయడం, అలారం మోగించడం, అత్యవసర ద్వారం తెరుచుకోవడం, నీళ్లను వెదజల్లడం, రైల్వే సిబ్బందికి సంక్ష్లిప్త సందేశాలను పంపడం వంటి ఐదు రకాల పనులను చేస్తుందన్నారు. దీనిని కళాశాలలో ప్రదర్శించగా జిల్లా పర్యటనకు వచ్చిన ద.మ. రైల్వే జీఎం శ్రీవాత్సవ్ తిలకించి విద్యార్థులను అభినందించారు. యువత తలచుకుంటే ప్రజలకు, ప్రభుత్వ సంస్థలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అనంతరం శ్రీవాత్సవ్ ఈమెయిల్ అడ్రసును విద్యార్థులకు ఇచ్చి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును రైళ్లలో వినియోగించేందుకు విద్యార్థుల సహాయాన్ని కోరారు.

  దేశంలోకి ప్రవేశించిన 'హార్ట్‌బ్లీడ్‌' కంప్యూటర్‌ వైరస్‌

  * ఇంటర్నెట్‌ వినియోగదారులూ జాగ్రత్త
  * సైబర్‌ భద్రతా సంస్థ అధికారుల హెచ్చరిక

  న్యూఢిల్లీ: అత్యంత ప్రమాదకరమైన 'హార్ట్‌బ్లీడ్‌' వైరస్‌ భారత్‌లో ప్రవేశించింది. ఇంటర్నెట్‌ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ భద్రతా విభాగం అధికారులు హెచ్చరించారు. ఈ వైరస్‌ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తోంది. హార్ట్‌బ్లీడ్‌ వైరస్‌తో లక్షలాది పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌ కార్డ్‌ నంబర్లు, ఇతర కీలక సమాచారాన్ని హ్యాకర్లు తేలిగ్గా చేజిక్కించుకోగలుగుతారు. హ్యాకింగ్‌పై పోరాడుతున్న భారత కంప్యూటర్‌ అత్యవసర స్పందనా బృందం (సీఈఆర్‌టీ) ఈ వైరస్‌పై ఆందోళన చెందుతోంది. ''ఓపెన్‌ ఎస్‌ఎస్‌ఎల్‌లో హార్ట్‌బ్లీడ్‌ వైరస్‌ను గుర్తించాం. ఇది కీలక సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంది. టీఎల్‌ఎస్‌, డీటీఎల్‌ఎస్‌ హార్ట్‌బీట్‌ అదనపు పాకెట్లను వినియోగించే సమయంలో సరైన తనిఖీలు చేయకపోవడం వల్ల ఈ వైరస్‌ ప్రవేశిస్తుంది. దీనివల్ల హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం, పాస్ట్‌వర్డ్‌లు, ఇతర కీలక సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉంది'' అని సీఈఆర్‌టీ ఇంటర్నెట్‌ వినియోగదారులను హెచ్చరించింది. అనుమానిత ఈ మెయిళ్లు, సందేశాలు, ఆడియో, వీడియో క్లిప్‌లు, ఈ-లింకులను వెంటనే తొలగించాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందేశాలు వచ్చిన వెంటనే వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని చెబుతున్నారు. ఓపెన్‌ ఎస్‌ఎస్‌ఎల్‌ను '1.0.1జి' వెర్షన్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవడంతో పాటు యాంటీ వైరస్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని సైబర్‌ భద్రతా సంస్థ సూచిస్తోంది.

  'వాయు వేగంతో దూసుకెళ్లే కారండి!

  దివిలి, (పెద్దాపురం): పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గాలితో నడిచే వాహనం (కంప్రెసర్ వేకిట్)ను గురువారం ఆవిష్కరించారు. కళాశాలల్లో బీటెక్ మెకానికల్ విభాగం 4వ ఏడాది చదువుతున్న విద్యార్థులు కె. శివకుమార్, కె. మురళీ, పి.ఆనందరావు, సుందర్, రాధాకృష్ణలు సంయుక్తంగా ప్రొఫెసర్ కోటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ వాహనాన్ని రూపొందించారు. వాహనం తయారికీ పాత స్ల్పెండర్ వాహనం ఇంజను సేకరించి తగినన్ని మార్పులు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. వాయు పీడన శక్తి ద్వారా పనిచేసే ఈ వాహనం భవిష్యత్తు తరాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ వాహనం 25పీఎస్‌పీ శక్తితో కదులుతుంది. వాయు పీడనానికి అవసరమయ్యే కంప్రెసర్ పనిచేయడానికి అవసరమైన గాలిని మాత్రమే ఈ వాహనం వినియోగించుకుంటుంది. కాలుష్య రహితంగా ఈ వాహనాన్ని రూపొందించినట్లు విద్యార్థులు తెలిపారు.

  గాలితో నడిచే ఇంజన్‌ తయారీ

  * రీజెన్సీ విద్యార్థుల అద్భుత సృష్టి
  తూర్పుగోదావరి, యానాం, న్యూస్‌టుడే:డీజిల్‌, పెట్రోల్‌ వంటి ఇంధన వనరులు తరిగిపోతు వాటి వినియోగం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తలు అన్వేషణ జరుపుతున్నారు. గాలితో నడిచే వాహనాలు నడిపే ఇంజిన్‌ను తయారు చేయడం ద్వారా మానవాళికి మేలు చేయాలనే సత్‌సంకల్పంతో యానాంలోని రీజెన్సీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు కొద్ది నెలల పాటు శ్రమించి ఒక కొత్త ఇంజిన్‌ తయారు చేశారు. ఇందుకోసం రూ.25వేలు వెచ్చించి గాలి వత్తిడి శక్తితో ద్విచక్ర వాహనం నడిచేలా వీరు యంత్రం(కంప్రెస్డ్‌ ఎయిర్‌ ఇంజిన్‌) తయారుచేశారు. రీజెన్సీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.వి.ఎస్‌. నారాయణ, డీన్‌ డాక్టర్‌ అన్యం రామకృష్ణారావు సమక్షంలో గాలితో మోటారు బైకును నడిపి వీరు చూపించారు. ఈ యంత్రం ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తితో వాహనం నడవడమే కాక వెలుపలికి వచ్చే గాలి కాలుష్య రహితంగా ఉండి ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటోంది. దీనితో ఇంజన్‌ను కారుకు అనుసంధానం చేస్తే అది పనిచేస్తున్నంత సేపు వెలుపలికి వచ్చే గాలిని ఎయిర్‌ కండీషనర్‌గాను వినియోగించుకొనే వెసులుబాటు వాహనదారులకు ఉంటుంది. ఒక సారి సిలిండర్‌లో గాలిని నింపితే దాదాపు 80-100 కి.మీల దూరం ప్రయాణించవచ్చని, ఇందుకు రూ.10 నుంచి రూ.15 మాత్రమే ఖర్చు అవుతుందని తయారు చేసిన విద్యార్థులు బొడ్డపాటి వెంకటేష్‌, తోట జైతేజ, ధరణికోట రాజేష్‌, సనిపిని వీర వెంకట వినోద్‌ తెలిపారు. తాము రూపొందించిన ఇంజన్‌ గురించి సైన్స్‌ జర్నల్స్‌కు పంపించామని, యు-ట్యూబ్‌లోనూ అప్‌లోడ్‌ చేసామని వీరు తెలిపారు. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గుతుందని, విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని వీరు ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ విద్యార్థులకు లెక్చరర్‌ జి.రవికుమార్‌ గైడ్‌గా వ్యవహరించారు. విద్యార్థుల ప్రతిభను రీజెన్సీ సంస్థ సీఎండీ డాక్టర్‌ జి.ఎన్‌.నాయుడు, ఎస్టేట్‌ మేనేజర్‌ సూర్యదేవర సుధీర్‌కుమార్‌, మెకానికల్‌ విభాగాధిపతి ఎం.ఎం.ఎస్‌.ప్రసాద్‌ అభినందించారు.

  ఐడియా ఖాతాదారులకు ఉద్యోగ సమాచారం

  * టీఎమ్‌ఐ గ్రూపుతో ఒప్పందం
  ఈనాడు, హైదరాబాద్‌: సూక్ష్మ-చిన్న-మధ్యస్థాయి సంస్థ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లలో ఉద్యోగావకాశాలు వెల్లడించడంతో పాటు, ఇంటర్వ్యూకు పిలుపు కూడా మొబైల్‌ ద్వారా రాష్ట్రంలోని తమ ఖాతాదారులకు అందించే సేవలను ఐడియా సెల్యులార్‌ ప్రారంభించనుంది. ఇందుకోసం మానవ వనరుల సంస్థ టీఎంఐ గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది. ఎంఎస్‌ఎంఈ సంస్థలు తమకు కావాల్సిన నిపుణులను మొబైల్‌ ద్వారా ఎంపిక చేసుకునేందుకు రూపొందించిన జాబ్స్‌ డైలాగ్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు టీఎంఐ గ్రూప్‌ ఈ సదుపాయాన్ని ఉచితంగా అందచేస్తోంది. ఐడియా ఖాతాదారులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు అవకాశం లభిస్తుంది.
  ఈ సేవ పొందేందుకు..
  ఐడియా ఖాతాదారులు టోల్‌ఫ్రీ నెంబరు /5234550 కు కాల్‌చేయాలి లేదా సంక్షిప్త సందేశం (ఎస్‌ఎమ్‌ఎస్‌) పంపాలి. అనంతరం సూచనలకు అనుగుణంగా తమ విద్యార్హతలు, వృత్తి అనుభవం, తాము ఏ ప్రాంతంలో ఉంటున్నాం, ఎక్కడ ఉద్యోగాన్ని ఇష్టపడుతున్నాం అనే అంశాలు తెలపాల్సి ఉంటుంది. అనంతరం ఉద్యోగార్థుల పేరు నమోదు, రెజ్యూమె తయారీ, ఇంటర్వ్యూలకు పిలుపులు, సంబంధిత సంస్థల యాజమానాయలతో సమన్వయం వంటి సేవలను సంస్థ అందిస్తుంది. ఉద్యోగాన్వేషణను సౌకర్యవంతం చేసేందుకు టీఎంఐ గ్రూప్‌తో ఒప్పందం చేసుకుని, ఈ సేవను అందుబాటులోకి తెచ్చామని ఐడియా సెల్యులార్‌ ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ బి.రామకృష్ణ తెలిపారు. సరైన నిపుణులను ఎంచుకోవడం ఎస్‌ఎంఈలకూ సులువవుతుందని పేర్కొన్నారు.

  గూగుల్‌ గ్లాస్‌తో మాటే మంత్రం!

  * నోటిమాటతో సకల పనులూ సాధ్యం
  * ఈ పరికరంతో విప్లవాత్మక మార్పులు
  * 'ఈనాడు'తో గూగుల్‌ ఉన్నతాధికారి రమణ సత్యవరపు

  ఈనాడు, విశాఖపట్నం: వినూత్న సాంకేతిక ఆవిష్కరణ 'గూగుల్‌ గ్లాస్‌' ప్రపంచ సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని గూగుల్‌ సంస్థ అంతర్జాతీయ సీనియర్‌ ఇంజినీరింగ్‌ మేనేజర్‌ రమణ సత్యవరపు చెప్పారు. ఈ సాధనం పనితీరును సమగ్రంగా పరిశీలించి, మార్పు చేర్పులు చేయడానికి వీలుగా కొన్ని నమూనా ఉపకరణాల్ని కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. అద్భుత స్పందన వస్తున్న నేపథ్యంలో త్వరలోనే అమెరికా మార్కెట్లోకి పూర్తిస్థాయిలో దీనిని విడుదల చేయాలని సంస్థ భావిస్తోందని తెలిపారు. తర్వాత దశల వారీగా అన్ని దేశాల్లోనూ దీని విక్రయాలు మొదలవుతాయన్నారు.
  గూగుల్‌ అప్లికేషన్స్‌ను భవిష్యత్తు తరం గూగుల్‌ ఉపకరణాలకు ఇంటిగ్రేట్‌ చేసే భారీ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న రమణ.. అమెరికాతోపాటు భారత్‌, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లలో వివిధ గూగుల్‌ ప్రాజెక్టుల బాధ్యతలు చూస్తున్నారు. లోగడ మైక్రోసాఫ్ట్‌లో పదేళ్లపాటు పనిచేసినప్పుడు ఆయన చేసిన ఆరు వినూత్న ఆవిష్కరణలకుగాను ఇప్పటికే రెండు పేటెంట్లు సొంతంకాగా మరో నాలుగు పేటెంట్లు మంజూరు కావాల్సి ఉంది. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి వచ్చిన సందర్భంగా రమణ తాజాగా 'ఈనాడు'తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ''స్మార్ట్‌ ఫోన్‌లోని పలు ఆప్షన్లను చేతులతో ఉపయోగించడానికి సమయం వృథా అవుతుంది. చేతులతో చేసుకునే అత్యవసర పనుల్ని వాయిదా వేసుకోవాల్సి కూడా వస్తుంటుంది. అలాంటి అవస్థలను తప్పించి కేవలం నోటిమాటతో ఆదేశాలు(కమాండ్‌లు) ఇచ్చి కావాల్సిన ఆప్షన్లను వినియోగించుకోగల పరిజ్ఞానమున్న పరికరమే గూగుల్‌ గ్లాస్‌. ఎలాంటి కళ్లజోడుకైనా దీనిని అమర్చవచ్చు. దీనికి ఉండే చిన్నపాటి కంప్యూటర్‌ తెర ఒక కంటి ముందు ప్రదర్శితమవుతూ ఉంటుంది. 'ఓకే గ్లాస్‌' అని పలకగానే(వాయిస్‌ కమాండ్‌ అందించగానే) దీనిలోని ఆప్షన్లన్నీ తెరపై కనపడతాయి. కావాల్సిన ఆప్షన్‌ పేరు పలికిన వెంటనే అది అందుబాటులోకి వస్తుంది. మీట నొక్కాల్సిన పని లేకుండానే నోటిమాటతో మెయిల్స్‌ చూసుకోవచ్చు, ఫోన్‌ మాట్లాడవచ్చు, ఫొటోలు తీయవచ్చు, వీడియో రికార్డింగ్‌ చేసుకోవచ్చు. నోటిమాటతోనే ఫొటోలు తదితరాలను కావాల్సినవారికి పంపుకోవచ్చు. ఈ పరికరంతో వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు, మహిళల భద్రతకు ముప్పు ఉందనే కొన్ని విమర్శలు ఉన్నాయి. అయితే ప్రతి దేశ చట్టాలను గూగుల్‌ గౌరవిస్తుంది. ఆయా నిబంధనలకు అనుగుణంగానే ఉత్పత్తులను విక్రయిస్తుంది. గూగుల్‌ గ్లాస్‌పై విమర్శలను అంతగా పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. దీని విస్తృత ప్రయోజనాల్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తే ఎవరైనా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తారు. దీని ప్రయోజనాలు సంభ్రమాశ్చర్యం కలిగిస్తాయి.

  ఓయూలో టెక్నో వేడుకలు... చిత్రాలు

  హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీలోని టెక్నాలజీ కళాశాలలో ఏటా నిర్వహించే టెక్నో ఉస్మానియా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వీసీ సత్యనారాయణ వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నాటికలు, ఆటపాటల ప్రదర్శనలతో సందడి చేశారు.


  ఐటీలో సంపద సృష్టికి ఆ 4 కీలకం

  * నాస్‌కామ్‌
  ఈనాడు, హైదరాబాద్‌: రోజువారీ జీవితంలో డిజిటల్‌ టెక్నాలజీ పాత్ర కీలకంగా మారుతోంది. సామాజిక మాధ్యమాలు (సోషల్‌ మీడియా), మొబైల్‌, అనలిటిక్స్‌, క్లౌడ్‌ టెక్నాలజీ.. ఈ ఇంగ్లిషు పదాల తొలి అక్షరాలు ఎస్‌,ఎమ్‌,ఏ,సీ లను కలిపితే 'స్మాక్‌') ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ కంపెనీలతో పాటు వ్యాపార దిగ్గజాలు కూడా ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత ఏడాది టెక్నాలజీ సంస్థల ఆదాయంలో 5- 10 శాతం ఈ టెక్నాలజీల నుంచే లభించింది. రాబోయే మూడేళ్లలో ఈ మొత్తం మరింత పెరుగుతుందని నాస్‌కామ్‌ పేర్కొంది.
  స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఎయిర్‌ కండీషనర్‌ వంటి ఖరీదైన ఉత్పత్తులే కాదు.. మంచి డ్రస్‌ కొనుగోలు చేయాలన్నా యువతీ, యువకులు సామాజిక మాధ్యమాల సాయం తీసుకొంటున్నారు. తాము ఆశించినవి ఎక్కడ లభిస్తున్నాయి, ఏ విక్రయశాలలో ధరలు ఎలా ఉన్నాయి కనుక్కోవడంతో పాటు ఆయా ఉత్పత్తుల పనితీరు ఎలా ఉందో సన్నిహితులను అడిగి తెలుసుకొంటున్నారు. అందువల్లే అగ్రశ్రేణి సంస్థలతో పాటు చిన్న-మధ్యతరహా (ఎస్‌ఎమ్‌బీ) వాణిజ్య సంస్థలు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలతో లింక్‌ పేజీలు ఏర్పాటు చేసుకుంటూ, వినియోగదారుల అభిరుచులను, వారి ఆకాంక్షలను గురించి వాకబు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో అనలిటిక్స్‌ కీలక పాత్ర పోషిస్తోంది. విభిన్న మాధ్యమాల్లో లభిస్తున్న సమాచారాన్ని విశ్లేషించి, ఖాతాదారు సంస్థలకు (క్లయింట్లకు) అవసరమైన సమాచారాన్ని ఒకచోట క్రోడీకరించడం ఈ అనలిటిక్స్‌ విభాగం బాధ్యత. ఇక సమాచారాన్ని డెస్క్‌టాప్‌, మొబైల్‌ పరికరాల్లో నిల్వ (స్టోరేజ్‌) ఉంచాల్సిన పని లేకుండా, దూరాన ఉన్న సర్వర్‌లో భద్రపరచి, ఏ ప్రాంతం నుంచి అయినా తిరిగి పొందే అవకాశాన్ని క్లౌడ్‌ విభాగం కల్పిస్తోంది. సమాచార భద్రత అవసరమైన బ్యాంకింగ్‌, బీమా రంగాలు ఈ విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నా, విద్య-ఆరోగ్య సంరక్షణ, రిటైల్‌, సేవారంగాలతో పాటు వ్యక్తిగత నిగూఢత లేని చిత్రాలు- వీడియోలు వంటివన్నీ ఇంటర్‌నెట్‌ అనుసంధాన పరికరాల ద్వారా క్లౌడ్‌ పద్ధతిలో నిల్వ చేసుకోవచ్చు. ఈ విపణికి అత్యధిక గిరాకీ లభిస్తుందని, ఈ సేవలు అందించే సంస్థల వ్యాప్తి ద్వారా ధరలు బాగా తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ అంశాలన్నిటినీ అనుసంధానించేవి స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌పీసీలు, ల్యాప్‌టాప్‌ల వంటి మొబిలిటీ పరికరాలే. దేశంలో అంతర్జాలాన్ని (ఇంటర్‌నెట్‌ను) వినియోగిస్తున్న వారి సంఖ్య 21 కోట్లు దాటడం గమనార్హం. గత ఏడాదిలో ఇ- కామర్స్‌ ద్వారా 13 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.80,600 కోట్లు) వ్యాపారం జరిగింది.
  దేశీయంగానూ ఉన్నత స్థాయికి..
  ప్రపంచ వ్యాప్తంగా 2013లో స్మాక్‌ టెక్నాలజీలపై 164.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,17,400 కోట్లు) వ్యాపారం జరగగా, 2016కు ఈ మొత్తం 287.3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.17,81,200 కోట్లు) స్థాయికి చేరుకొంటుందన్న అంచనా ఉందని నాస్‌కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌ అంటున్నారు. అగ్రశ్రేణి సంస్థలతో ఎస్‌ఎమ్‌బీలు, కొత్త కంపెనీలు కలసి పనిచేయడం ద్వారా దేశీయంగా ఈ రంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  విజయ ఇంజినీరింగ్‌ కళాశాలలో టెక్నోఫెస్ట్‌

  హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలంలోని విజయ రూరల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నోఫెస్ట్‌-2014 కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వైజ్ఞానిక, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.


  సీబీఐటీలో 'శృతి'లయలు

  న్యూస్‌టుడే, నార్సింగి: కుమ్మరి చక్రంపై కుండలు చేశారు.. తాడు పోటీకి సై అన్నారు.. ఆటలాడారు.. పాటపాడారు.. రంగవల్లులతో ఆకట్టుకున్నారు.. విభిన్నమైన పోటీలు.. వింతైన ఆటలు.. ఆనందాలకు వేదికైంది గండిపేట సీబీఐటీ ౖౖకళాశాల. గురువారం కళాశాల వార్షికోత్సవం విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా ప్రారంభమైంది. 'శృతి-14' పేరిట నిర్వహిస్తున్న మూడు రోజుల ఉత్సవాలను కళాశాల కార్యదర్శి డి.కమలాకర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. గత 35 ఏళ్లుగా శృతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది. ఈసందర్భంగా కళాశాల ఆవరణలో వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి పలు పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కళాశాల ప్రిన్సిపల్‌ డా.బి.చెన్నకేశవరావు, సురేష్‌పబ్బోజు, శ్రీనివాసశర్మ, శ్యాంమోహన్‌రెడ్డి, సంధ్యారెడ్డి, కంగన్‌ ప్రీత్‌కౌర్‌ తదితరులు పాల్గొన్నారు.  వెబ్‌ ప్రపంచానికి పాతికేళ్లు

  ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: లక్షలాది వెబ్‌సైట్లు ఒక్క క్లిక్‌తో ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నాయి. మెయిల్స్‌, సెర్చింజన్ల దశ దాటి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా ప్రతి నిమిషం సన్నిహితులకు అందుబాటులో ఉంటున్నాం. క్షణక్షణం అప్‌డేట్‌ అవుతున్నాం. సమాచారానికి, అవసరాలకు అన్నింటికి ప్రస్తుతం వెబ్‌సైట్లపైనే ఆధారపడుతున్నాం. ఈ అద్భుతమైన అవకాశాలు అందుబాటులోకి రావడానికి కారకులు ఎవరో, ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో తెలుసా? బ్రిటిష్‌ ఇంజనీరు, కంప్యూటర్‌ శాస్త్రవేత్త సర్‌ టిమ్‌ బెర్నర్స్‌ లీ 1989 మార్చి 12న వెబ్‌ రూపకల్పనలో మొదటి అడుగువేశారు. అదే ఆ తర్వాత వరల్డ్‌ వైడ్‌ వెబ్‌గా రూపొందింది. టిమ్‌ ప్రస్తుతం వరల్డ్‌ వైబ్‌ వెబ్‌ కన్‌సార్టియం (డబ్ల్యు3సి) డైరెక్టర్‌.
  మనకెంతో ఉపయోగపడుతున్న వెబ్‌ ప్రపంచం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దాని గురించి ఆసక్తికర విషయాలు కొన్ని.
  * 1991 ఆగస్టు 6న మెదటి వెబ్‌సైట్‌ http://info.cern.ch ప్రారంభమైంది.
  * వరల్డ్‌ వైబ్‌ వెబ్‌ ప్రోగ్రామింగ్‌ కోసం ఆబ్జెక్టివ్‌ సి ఉపయోగించారు.
  * మొదటి వెబ్‌సర్వర్‌గా నెక్ట్స్‌ కంప్యూటర్‌ను వినియోగించారు. 1990లో దాని మీదే తొలి వెబ్‌ బ్రౌజర్‌ను టిమ్‌ బెర్నర్స్‌ లీ రాశారు.
  * 1992లో టిమ్‌ సెర్న్‌ హౌస్‌కు చెందిన ఫోటోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు.
  * సెర్న్‌ యూరోపియన్‌ ఆర్గనైజేషన్‌ 1993 ఏప్రిల్‌ 30వ తేదీన వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది.
  * 1994లో సెర్న్‌ నుంచి బయటకు వచ్చి టిమ్‌ వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ కన్‌సార్టియంను స్థాపించారు.
  * మొదటి ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ ఆర్చీ.
  * ఇంటర్నెట్‌ 'సర్ఫింగ్‌' అన్న మాటను జీన్‌ ఆమర్‌ పోలీ అనే ఆమె మొట్టమొదట ఉపయోగించారు.
  * పెద్దవాళ్లకు మాత్రమే సంబంధించిన వెబ్‌సైట్‌ మొదటగా 2011లో .ఎక్స్‌ఎక్స్‌ఎక్స్‌ డొమైన్‌ పేరుతో ఆన్‌లైన్‌లోకి విడుదలైంది.
  * చాలా మంది అనుకునే విధంగా వరల్డ్‌ వైడ్‌ వెబ్‌, ఇంటర్నెట్‌ ఒకటి కాదు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కంప్యూటర్ల అనుసంధానమే ఇంటర్నెట్‌. ప్రపంచ వ్యాప్తంగా వెబ్‌పేజీల కలెక్షన్‌ వరల్డ్‌ వైడ్‌ వెబ్‌.ఇంటర్నెట్‌ ద్వారా వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను ఉపయోగించుకోవచ్చు.

  హార్డ్‌వేర్‌ రంగంలో ఉద్యోగానికి కోర్సులు

  హైద‌రాబాద్‌, న్యూస్‌టుడే : ఇంజినీరింగ్ చేసిన‌ వారు హార్డ్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటే వాటికి సంబంధించిన కోర్సులు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సులను ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌- ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఐటీ) వారు ఏఐసీటీఈ ఆమోదంతో డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌ వంటి కోర్సులతోపాటు స్వల్పకాలిక కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. డిప్లొమా/ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ మెయింటెనెన్స్‌- నెట్‌వర్కింగ్‌ వంటి కోర్సులో చేరి సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపరచుకోండి. co-ordinator stc@doeaccchennai.edu.in కి మెయిల్‌ చేసి, లేదా http://bit.ly/18RvpfH ని చూసి మరిన్ని వివరాలు పొందవచ్చు. వీరికి సాఫ్ట్‌వేర్‌/ హార్డ్‌వేర్‌ రంగంలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌, హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌, సెక్యూరిటీ ఇంజినీర్‌, లాబ్‌ డెమన్‌స్ట్రేటర్‌, టెక్నీషియన్‌/ ట్రబుల్‌ షూటర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి.

  The British Council IELTS Scholarship Award

  The British Council IELTS Scholarship Award was launched with the objective of supporting Indian students intending to study in an English-speaking country. Most importantly, it is a commitment to realising British Council’s aspiration of enabling young people to achieve their life goals.

  Click here for more details

  ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఐఎస్‌బీ పాఠాలు

  ఈనాడు - హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడటం మాని, ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగేలా చేసేందుకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన 20 ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థుల్లో ఆసక్తి గలవారిని గుర్తించి, మేనేజ్‌మెంట్‌ విద్యలోనూ వారికి కొంత ప్రావీణ్యత కల్పించేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ముందుకొచ్చింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థల నిపుణులు మరింత అవగాహన కల్పించనున్నారు. దీనిపై రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్‌జాజు, జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ (జేకేసీ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) అమర్‌నాథ్‌ రెడ్డి, ఐఎస్‌బీలో ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అరుణారెడ్డి 'ఈనాడు'కు అందించిన వివరాలు ఇవీ..
  రెండేళ్ల పాటు శిక్షణ: ఇంజినీరింగ్‌ 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ఈ మేనేజ్‌మెంట్‌ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 20 కళాశాలలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, బిట్స్‌, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి, వాసవి, సీబీఐటీ కళాశాలలతో పాటు విశాఖపట్నంలోని గీతం, తాడేపల్లిగూడెంలోని శశి, విజయవాడ సిద్ధార్థ, తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, చిత్తూరులో శ్రీవిద్యా నికేతన్‌, అనంతపూర్‌ జేఎన్‌టీయూ వంటి సంస్థలను ఐఎస్‌బీ ఎంపిక చేసింది. ఆయా విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల ప్రాతిపదికగా వీటిని ఎంపిక చేశారు. ఒకో కళాశాలలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరుకు ఎంపికలు పూర్తవుతాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోనే 60% విద్యాసంస్థలను ఎంపిక చేసినా మున్ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అవకాశం కల్పించనున్నారు. వచ్చే ఏడాది మరిన్ని కళాశాలలను జత చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్యనూ పెంచనున్నారు.
  * ఇంజినీరింగ్‌ మొదటి, రెండు సంవత్సరాల్లో మంచి మార్కులు సాధించడంతో పాటు సంస్థ/పరిశ్రమను స్థాపించాలనే ఉత్సాహం గల విద్యార్థులతో వ్యాసాల వంటివి రాయించి, వారి అభిరుచి, ఆసక్తిని పరిశీలించాకే విద్యార్థులను ఎంపిక చేస్తారు.
  * వినూత్న ఆలోచనను ఉత్పత్తిగా మార్చేందుకు ఏం చేయాలి? విపణిలో అవకాశాలు, ఆర్థిక సాయం చేసే వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లు, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, బ్యాంకులకు ప్రాజెక్టు నివేదిక సమర్పణ, వ్యాపార అంచనాలు, లాభనష్టాల బేరీజు వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.
  * ఆన్‌లైన్‌లో, శాటిలైట్‌ ద్వారా నిపుణులతో శిక్షణ ఇస్తారు. 6 వారాలు - 2 నెలలకోసారి విద్యార్థులకు ఐఎస్‌బీలో తరగతులు కూడా ఉంటాయి.
  * ఆయా కళాశాలల్లో సాంకేతిక అంశాలపై అధ్యాపకులకు సూచనలు చేసేందుకు ట్రిపుల్‌ఐటీ, శ్రీనిధి, బిట్స్‌, వరంగల్‌ నిట్‌లను నోడల్‌ కళాశాలలుగా ఎంపిక చేశారు.
  * తాజా సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులు, అధ్యాపకులకు మార్గదర్శనం చేసేందుకు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు.
  తొలి బృందం 2015 జులైలో : ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంపిక చేయనున్న 1,000 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు 2015 జులైలో ఉత్తీర్ణులవుతారు. ఈ ప్రయోగం ఫలిస్తే, ఇంజినీరింగ్‌ విద్యార్థుల నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రూపొందుతారని విద్యాసంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

  VIGNAN: ICNSC 14

  Guntur: First International Conference on "Networks & Soft Computing (ICNSC 2014)" will be organized by Vignan's Foundation for Science, Technology & Research, Guntur, Andhra Pradesh with the Technical Sponsorship of IEEE Hyderabad Section & IEEE during 19th to 20th August, 2014. Peer-reviewed accepted papers will be published in the Conference proceedings and submitted for inclusion in IEEE Xplore.
  Objective:
  ICNSC-14 will provide a platform for Researchers, Academicians & Industrials to share their research. This conference will also have prominent Keynote Speakers in the themes of 'Networks & Soft Computing'.
  Prominence:
  It will serve the future needs of the researchers and it is a nice opportunity to explore new dimensions about their research.

  Click here for more details