• 'ఉపకారం'లో అవినీతికి చెక్

  * ఈ ఏడాది నుంచే బయోమెట్రిక్ విధానం
  * తీరనున్న కళాశాల విద్యార్థుల వేతనాల వెతలు
  కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందచేస్తున్న ఉపకారవేతనల్లో అవినీతి చాలా సర్వసాధారణమైంది. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా పూర్తి ఆన్‌లైన్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. దీనిని బయోమెట్రిక్ విధానంగా పేర్కొంటున్నారు. ఇది 2013-2014 సంవత్సరంలోనే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాదికి సంబంధించి కొత్తగా ఉపకారవేతనాలు పొందే వారు, పాతవాటి పునరుద్ధరణకు ఈ కొత్తవిధానాన్నే అనుసరించాల్సి ఉంది. దీనికి సంబంధించి పాడేరు, నర్సీపట్నం డివిజన్లోని కళాశాలల ప్రిన్సిపాళ్లు అందరికి అవగాహన కల్పించేందుకు నర్సీపట్నంలో సదస్సు నిర్వహించారు. వీరికి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ప్రధాక కార్యదర్శి రేమండ్ పీటర్ కూడా వీడియోకాన్ఫెరెన్స్ ద్వారా దీని గురించి అన్నింటిని వివరించారు. నర్సీపట్నం ప్రాంతంలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాల బయోమెట్రిక్ యంత్రాన్ని తమ కళాశాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
  అన్ని కళాశాలలకు తప్పనిసరి
  ఉపకారవేతనాల దరఖాస్తులను ఇన్నాళ్లూ అధికారులు పరిశీలించేవారు. కొత్త విధానంతో ఇక వీరితో పని లేకుండా పరిశీలన కార్యక్రమం అంతా కళాశాలల స్థాయిలోనే నిర్వహించనున్నారు. బయోమెట్రిక్ పాస్ (పాయింట్ ఆఫ్ సేల్స్)గా పేర్కొంటున్న యంత్రాలను అన్ని కళాశాలలు విధిగా సమకూర్చుకొని ఈ కొత్త విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. వీటికి ఈ పాస్ సర్వర్, ఆధార్ సర్వర్ అనుసంధానమై ఉంటాయి. వీటిలో కళాశాల కోడ్, దరఖాస్తు కోడు నమోదు చేస్తే పూర్తి వివరాలు వస్తాయి. కళాశాలల ప్రిన్సిపాళ్లు ముందుగా వీటిలో రిజిష్టరు చేసుకోవాలి. విద్యార్థి తన చేతి వేళ్లలో ఏదో ఒకదానిని ఈ యంత్రంపై ఉంచితే అన్ని వివరాలు వస్తాయి.
  బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం
  ఉపకరవేతనాలకు అర్హులైన విద్యార్థులంతా కొత్త విధానం ప్రకారం బ్యాంకులకు వెళ్లి అక్కడి అధికారులతో సంప్రదించి తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబరు అనుసంధానమయ్యేలా చూసుకోవాలి. విద్యార్థుల తమ వివరాలను ఆన్‌లైన్లో రిజిస్టరు చేసుకోగానే అవి జిల్లా అధికారులకు చేరుతాయి. సక్రమంగా ఉన్న వీటిని కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపుతారు. ఆధార్, బ్యాంకు ఖాతాల నకళ్లలో వివరాలు స్పష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా సంక్షేమాధికారులు బార్‌కోడ్ రీడర్ సదుపాయం సమకూర్చుకొని వాటి ద్వారా వివరాలను పరిశీలించి అనుమతిస్తారు.
  ఉపకారం మంజూరైతేనే ఫీజు రీయంబర్స్‌మెంటు
  కొత్త విధానంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు వేగంగా మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వీటిని మంజూరు చేసిన ఆనంతరమే సంబంధిత విద్యార్థి ఫీజు రీఎంబర్స్‌మెంటును కళాశాలలకు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీంతో త్వరితగతిన వీటిని మంజూరు చేసేందుకు కళాశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. కొత్త పద్ధతిలో విద్యార్థి విధిగా ఉండి బయోమెట్రిక్ యంత్రాన్ని వినియోగించాల్సి ఉంది. ఉపకారవేతనం మంజూరైతే ఆన్‌లైన్ ద్వారానే ఆ సొమ్ము బ్యాంకుకు జమ అవుతుంది. దీంతో వీటిని బోగస్ వ్యక్తులు పొందే అవకాశం లేదు. విద్యార్థులు కూడా అన్ని కార్యాలయాలు తిరగడం తదితర బాధలు తగ్గుతాయి.

  విద్యా రుణాలకూ ప్రతిభే గీటురాయి!

  * రుణాల మంజూరులో మారిన బ్యాంకుల పంథా
  కొలువులకే కాదు.. విద్యా రుణాల మంజూరుకూ ప్రతిభే కొలమానంగా మారింది. కళాశాల గుర్తింపును చూసి రుణాలిచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు విద్యా రుణాలు అందుకోవాలంటే విద్యలో ప్రతిభ చూపాలి. అంతేకాదు.. చదువుతున్న కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు బాగుండాలి. ఆపై ప్రాంగణ నియామకాలకు కంపెనీలు వస్తుండాలి. ఇలాంటి కళాశాలలు, అక్కడి విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని బ్యాంకులు రుణాలిస్తున్నాయి. కేవలం ఏఐసీటీఈ గుర్తింపును చూసి రుణాలిచ్చేది లేదని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. విద్యార్థులకు కొత్తగా రుణం ఇవ్వాలన్నా, పాత వాయిదాలు విడుదల చేయాలన్నా ఫీజు ఎంత కట్టాలో సూచిస్తూ సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ బ్యాంకుకు ధ్రువీకరణ లేఖ ఇవ్వాలి. కళాశాలలు తమ ఫీజులు రాబట్టుకోవడానికి లేఖలు ఇవ్వడం సహజం. అయితే వాటిని బ్యాంకులు మాత్రం ఆమోదించడం లేదు. విద్యార్థికి గత ఏడాది వచ్చిన మార్కులు, ఆ సంవత్సరం ఎంతమంది ప్రాంగణ నియామకాలకు ఎంపికయ్యారు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలు బాగున్నాయని బ్యాంకర్లు సంతృప్తి చెందితే ప్రిన్సిపాళ్ల లేఖల ఆధారంగా రుణాలిస్తున్నాయి. కానీ పలువురు విద్యార్థులు రుణాల కోసం ప్రిన్సిపాళ్ల లేఖలతో వచ్చి ఉత్తిచేతులతో తిరిగి వెళ్లడం కనిపిస్తోంది. గతంలో రుణాలు పొందిన విద్యార్థులు తిరిగి చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే కొత్త రుణాల మంజూరుకు వెనుకాడాల్సి వస్తోందని బ్యాంకు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్య కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు రాక ఖాళీగా ఉండేవారి శాతం ఎక్కువవుతోంది.
  తక్కువ సంఖ్యలో రుణాల మంజూరు
  ఎస్‌బీఐ మినహా మిగిలిన బ్యాంకులు పెద్దగా విద్యా రుణాలు ఇవ్వడం లేదు. విద్యా రుణాల కోసం బ్యాంకులకు వందల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నా 10-15 మందికి మించి రుణాలు మంజూరు చేయడం లేదు. ఏటా స్టేట్‌బ్యాంకు వెయ్యి మంది విద్యార్థులకు రుణాలిస్తే మిగిలిన అన్ని బ్యాంకులు కలిపి 500 మందికి కూడా రుణాలు ఇవ్వడం లేదని కళాశాలల యాజమాన్య ప్రతినిధులు పేర్కొంటున్నారు.
  ప్రతిభ తప్పనిసరి : ఎస్‌బీఐ ఏజీఎం
  విద్యా రుణాల మంజూరు విషయాన్ని స్టేట్‌బ్యాంక్ ఏజీఎం వెంకట్రామ్ దృష్టికి 'ఈనాడు' తీసుకెళ్లగా రుణాల మంజూరుకు ప్రతిభ తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రతిభ లేని వారికి, తరగతులకు గైర్హాజరయ్యే వారికి రుణాలిస్తే వసూళ్లకు ఇబ్బందిగా మారుతోందని తెలిపారు. దీనికి ఉద్యోగాలు రాకపోవడమే కారణమంటున్నారు. ప్రవేశాలు, ప్రాంగణ నియామకాలు బాగున్న కళాశాలలకు ఏ బ్యాంకు అయినా ప్రాధాన్యమిస్తుందన్నారు.