డిగ్రీ (బీజెడ్‌సీ) మూడో సంవత్సరం చదువుతున్నాను. సైకాలజీలో పీజీ చేయాలనుంది. నాకు అర్హత ఉందా? వాటికి ఉండే ప్రవేశపరీక్షలు, ఏయే అంశాల్లో వాటికి సన్నద్ధమవాల్సి ఉంటుంది?

సైకాలజీలో పీజీ చేయాలనుకునేవారు డిగ్రీ సైకాలజీ చదివివుండాలి. కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు ఏదైనా డిగ్రీ చదివినవారికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ తమ సొంత ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలను కల్పిస్తున్నాయి. సైకాలజీ అంటే మానసిక ప్రవర్తన, మనస్తత్వ శాస్త్ర అధ్యయనం, విశ్లేషణాత్మక ఆలోచన, సహనం వంటి అంశాల్లో అవగాహన పెంపొందించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

విదేశీ కళాశాలలతో సంబంధమున్న వాటిల్లో సైబర్‌లా లేదా హ్యూమానిటీస్‌ చదవాలనుంది. అటువంటి కళాశాలలు, వాటి అడ్మిషన్‌ల వివరాలను తెలియజేయండి.

మీరు మీ విద్యార్హతలను తెలియజేయలేదు. సాధారణంగా సైబర్‌లా కోర్సును ఐటీ సంస్థల్లో పని చేసేవారు, ప్రాక్టీసింగ్‌ న్యాయవాదులు తమ అర్హతను పెంపొందించుకోవడానికి అభ్యసిస్తారు. నల్సార్‌ యూనివర్సిటీ, నేషనల్‌ లా యూనివర్సిటీ, సింబయాసిస్‌ లా స్కూల్‌ వంటివి తమ విద్యార్థులకు అనుబంధ విదేశీ కళాశాలల్లో ఒక సెమిస్టర్‌ లేదా ఒక సంవత్సరంపాటు ఒక ఐచ్ఛికంగా సైబర్‌లా కోర్సును అభ్యసించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ విద్యాలయాల్లో క్యాట్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు. హ్యూమానిటీస్‌ విషయంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎరాస్మస్‌ ప్రోగ్రాం ద్వారా విదేశంలో కొంతకాలం విద్యనభ్యసించే ఏర్పాటును కల్పిస్తున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలైన ఎస్‌ఆర్‌ఎం, గీతం వర్సిటీ, క్రయిస్ట్‌ విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులకు విదేశీ కళాశాలల్లో ఒక సెమిస్టర్‌ విద్యను పూర్తిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సంబంధిత వర్సిటీలు తమ సొంత ప్రవేశపరీక్ష ద్వారా హ్యూమానిటీస్‌ కోర్సులో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

బీఎస్‌సీ (ఎంపీసీఎస్‌) 2017లో పూర్తైంది. ఎంఎస్‌సీ (ఫిజిక్స్‌) చేయాలనుంది. విశ్వవిద్యాలయాన్ని ఎలా ఎంచుకోవాలి? పరిశోధనలోనూ ఆసక్తి ఉంది. అందుకు నేను ఏయే అంశాలపై దృష్టిసారించాలి?

ఎంఎస్‌సీ అభ్యసించాలనుకునే విద్యార్థులు ఐఐటీవారు నిర్వహించే జామ్‌ (JAM)పరీక్ష లేదా వివిధ ఎన్‌ఐటీలు నిర్వహించే ఎంఎస్‌సీ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. బోధన, పరిశోధనలపరంగా అత్యున్నత ప్రమాణాలున్న, పీజీలోనే పరిశోధనలను ప్రోత్సహించే విశ్వవిద్యాలయాల్లో పీజీ చేయడం వల్ల పరిశోధన పట్ల ఆసక్తి పెంచుకోవచ్చు. లోతుగా అధ్యయనం చేయడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంతోపాటు సీఎస్‌ఐఆర్‌ నెట్‌- జేఆర్‌ఎఫ్‌ పరీక్షకు సిద్ధం కావడం ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాన్ని పొందవచ్చు.

ఇంటర్‌ రెండో సంవత్సరం (1998) పూర్తి చేయలేదు. దూరవిద్య ద్వారా బీఏ (2015) పూర్తిచేశాను. ఇప్పటివరకూ ఇంటర్‌కు సంబంధించిన ధ్రువపత్రాలేమీ తీసుకోలేదు. ఫర్వాలేదా? ఇప్పుడు ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో రాయాలనుకుంటున్నాను. మంచిదేనా? నాకున్న ఉద్యోగావకాశాల వివరాలను తెలపండి.

బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ వారిని సంప్రదించి మీరు పూర్తిచేయని రెండో సంవత్సరం ప్రస్తుతం కొనసాగించడం సాధ్యపడుతుందేమో తెలుసుకోండి. అలా కుదరకపోతే అప్పుడు ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా ఇంటర్‌ను పూర్తి చేయవచ్చు. అప్పుడు మీరు ఇంటర్‌, బీఏ అర్హత ఉన్న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో కాకుండా రెండు సంవత్సరాల ఇంటర్‌ విద్యను రెగ్యులర్‌ విధానంలో అభ్యసించడం మంచిది.

బీటెక్‌ పూర్తిచేశాను. మా పెదనాన్న సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌గా చేస్తున్నారు. ఆయన త్వరలో పదవీ విరమణ పొందనున్నారు. వారసత్వంగా ఆయన ఉద్యోగం నాకు వచ్చే అవకాశం ఉందా?

వారసత్వ ఉద్యోగాలపట్ల సంస్థలు తమకంటూ ప్రత్యేక నియమ నిబంధనలు ఏర్పరచుకుంటాయి. సాధారణంగా వారికి పుట్టిన పిల్లలకు మాత్రమే వారసత్వ ఉద్యోగావకాశాలుంటాయి. కాబట్టి, సంబంధిత సంస్థ (జైలు) అధికారులతో సంప్రదించడం ద్వారా మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోండి.

పదో తరగతి తర్వాత దూరవిద్యలో బీఏ చేశాను. ఆ తర్వాత ఎంఏ (పాలిటిక్స్‌) చేసి, బీఈడీ (సోషల్‌-ఇంగ్లిష్‌) 2014లో పూర్తిచేశాను (2017లో ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో పూర్తైంది). డీఎస్‌సీ రాశాను కానీ, ఉద్యోగం రాలేదు. నాకున్న వేరే ప్రభుత్వ ఉద్యోగావకాశాలేవి? ఇంకా వేరే ఏ కోర్సులైనా చేస్తే మేలా?

పీజీ అర్హతతో ఉన్న ఉద్యోగావకాశాలకు మీరు అర్హులు. రాష్ట్ర, కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ద్వారా వెలువడే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకుని, పోటీ పడేందుకు మీకు అర్హత ఉంది. ఎంఏ (పాలిటిక్స్‌) తో జూనియర్‌ లెక్చరర్‌గా ప్రయత్నించవచ్చు. ఏపీసెట్‌ లేదా యూజీసీ నెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి, ఈ ఉద్యోగ పరీక్షలకు సంసిద్ధమైతే తప్పకుండా విజయం సాధిస్తారు.

డిగ్రీ (బీఏ కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. సైబర్‌ లా చేయాలనుంది. సైబర్‌ లా, సైబర్‌ సెక్యూరిటీల మధ్య తేడా ఏంటి? సైబర్‌ లాను అందించే విశ్వవిద్యాలయాల వివరాలను తెలియజేయండి. ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

ఇంటర్నెట్‌ ఆధారిత సేవలు, ఇంటర్నెట్‌ వాడకం, సైబర్‌ నేరాలు, వాటి చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం- 2000ను రూపొందించారు. దీనినే సైబర్‌ చట్టం/ సైబర్‌ లా అంటారు. కంప్యూటర్లు, నెట్‌వర్క్‌, డేటా అనధికార వాడకం, హ్యాకింగ్‌ల నుంచి పరిరక్షించే సాంకేతిక పరిజ్ఞానాన్నే సైబర్‌ సెక్యూరిటీ అంటారు.
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వారు సంవత్సరం వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌లాస్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ సైబర్‌ లా కోర్సును అందిస్తోంది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ కోర్సులకు అర్హులు. పెరిగిన ఇంటర్నెట్‌ వినియోగం దృష్ట్యా ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. లా ఫర్మ్స్‌, కార్పొరేట్‌, ఇన్‌కం టాక్స్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

ఇంటర్‌ (సీఈసీ) పూర్తిచేశాను. ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ లేదా ఏర్‌ టికెటింగ్‌ చేయాలనుంది. వీటిలో ఏది మేలు? ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఈ కోర్సులను అందించే కళాశాలల వివరాలను తెలపండి.

ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హాండ్లింగ్‌, ఏర్‌ టికెటింగ్‌లకు తమదైన ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు కోర్సులూ విమానయాన సేవలను అందిస్తున్నాయి. కాబట్టి, రెండింటిలో మీ ఆసక్తిమేరకు ఎంచుకోండి. ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హాండ్లింగ్‌ కోర్సు ముఖ్యంగా విమానాశ్రయ అంతర్జాతీయ స్థాయి పర్యావరణాల్లో పనిచేయడానికి, ప్రపంచ నలుమూలలా ఉండే ప్రజలను కలుసుకుని, సాయం చేయడానికి ఇష్టపడే అభ్యర్థుల కోసం రూపొందించారు.
ఏర్‌ టికెటింగ్‌ ప్రధానంగా విమానాల బుకింగ్‌, టికెట్‌ రిజర్వేషన్‌, ప్రయాణ ప్రణాళికను రూపొందించడం, ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లను చేయడం లాంటి నైపుణ్యాలను అలవరచుకోవడం వంటివాటితో కూడి ఉంటుంది. ఐఏటీఏ (ఇంటర్నేషనల్‌ ఏర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌) జీఎంఆర్‌ వారు నాలుగు నెలల వ్యవధిగల సర్టిఫికెట్‌ ఇన్‌ ఏర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌, గ్రౌండ్‌ హాండ్లింగ్‌ డిప్లొమా ఇన్‌ ఏర్‌ టికెటింగ్‌ కోర్సులను అందిస్తున్నారు.

బయాలజీలో దూరవిద్య ద్వారా డిగ్రీ (మూడో సంవత్సరం) చదువుతున్నాను. ఎంఎస్‌సీ జియాలజీ రెగ్యులర్‌ విధానంలో చేయాలనుంది. దీంతోపాటు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షలకూ సిద్ధమవాలనుకుంటున్నాను. వీటికి సంబంధించి ఏవైనా శిక్షణ సంస్థలున్నాయా? ఉద్యోగాన్ని అందించే ఇతర పరీక్షల వివరాలూ తెలపండి.

డిగ్రీ దూరవిద్యలో అభ్యసించినవారు రెగ్యులర్‌గా పీజీ చదవడానికి ఎలాంటి అవరోధం లేదు. కానీ, ఎంఎస్‌సీ (జియాలజీ) చేయాలనుకునే వారు బీఎస్‌సీ (జియాలజీ) పూర్తిచేసి ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు బీఎస్‌సీలో జియాలజీని ఒక సబ్జెక్టుగా మూడు సంవత్సరాలు చదివినవారికీ అవకాశం కల్పిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, దిల్లీ యూనివర్సిటీ, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇలా అందిస్తున్న వాటిలో ఉన్నాయి. దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి నగరాల్లోని కొన్ని ప్రైవేటు సంస్థలు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షలకు సంబంధించిన శిక్షణను అందిస్తున్నాయి. డిగ్రీ పూర్తిచేశారు కాబట్టి పబ్లిక్‌ సర్వీస్‌ నియామక పరీక్షలు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలు, బ్యాంకు పరీక్షలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. జియాలజీ పీజీ ఉత్తీర్ణులైనవారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జియో ఫిజిసిస్ట్‌, జియాలజిస్ట్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, మేనేజర్‌- మైనింగ్‌ లాంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా (ఈఈఈ) 80%తో పూర్తిచేశాను. ఆర్థిక అననుకూల పరిస్థితుల కారణంగా బీటెక్‌ చేయలేకపోతున్నాను. వన్‌ సిట్టింగ్‌లో బీటెక్‌ పరీక్షలు రాస్తే, నాకు బీటెక్‌ అర్హత ఉన్నట్లేనా? బీటెక్‌ అర్హతగా ఉన్న ఉద్యోగాలకు నేను దరఖాస్తు చేసుకోవచ్చా?

వన్‌ సిట్టింగ్‌లో డిగ్రీ లేదా బీటెక్‌ చేయడం అసలు అందుబాటులో లేదు. ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌ లేదా కళాశాల ఇలా అందించినా దానివల్ల విద్య, ఉద్యోగపరంగా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. బీటెక్‌ అర్హత సాధించాలంటే మీరు రెగ్యులర్‌ విధానంలోనే చదవాల్సి ఉంటుంది. అలాకాని పక్షంలో దూరవిద్యలో ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఐఈ) వారు అందిస్తున్న ఏఎంఐఈ కోర్సును ఎంచుకోవచ్చు. బీటెక్‌కు సమాన అర్హతగా ఈ కోర్సును పరిగణిస్తారు. అప్పుడు బీటెక్‌ అర్హతగా ఉన్న ఉద్యోగాలకూ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్‌ పూర్తి చేశాక గ్రూప్‌ 4 రాసి, ఆర్‌ అండ్‌ బీలో జూనియర్‌ అసిస్టెంటుగా పని చేస్తున్నా. దూరవిద్య ద్వారా బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చేయాలని ఉంది. ఏ విశ్వవిద్యాలయాలయినా ఈ అవకాశం కల్పిస్తున్నాయా?

ఉద్యోగం చేస్తూ మీ విద్యార్హతను పెంచుకోవాలనే ఆలోచనకు అభినందనలు. బీఈ లేదా బి.టెక్‌ లాంటి ప్రొఫెష్నల్‌ కోర్సులను రెగ్యులర్‌గా అభ్యసించడం అనేది శ్రేయస్కరం. మీ విషయంలో రెగ్యులర్‌ విద్య అభ్యసించడం కుదరదు కాబట్టి మీరు ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ వారు అందిస్తున్నటువంటి ఎ.ఎం.ఐ.ఇ. లేదా ఐ.ఇ.టి.ఇ. వారి ఎ.ఎం.ఐ.ఇ.టి.ఇ కోర్సులను ఎంచుకోవచ్చు. 10+2 లేదా, డిప్లొమా చేసినవారు ఈ కోర్సు చేయడానికి అర్హులు.
ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారు ఎ.ఎం.ఐ.ఇ కోర్సును పదకొండు స్పెషలైజేషన్స్‌లో అందిస్తున్నారు. మీరు కోరుకున్నటువంటి సివిల్‌ ఇంజినీరింగ్‌ కూడా ఈ స్పెషలైజేషన్‌లో ఉంది. సెక్షన్‌ ఎ. సెక్షన్‌ బి కింద ఈ కోర్సును రూపొందించారు. మొత్తం 19 సబ్జెక్టులు, ల్యాబ్‌ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.
ఉత్తీర్ణత సాధించిన వారు అసోసియేట్‌ మెంబర్‌ ఇన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌గా నమోదవుతారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో ఈ కోర్సును పూర్తి చేయాలి. ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో పరీక్షలు జరుగుతాయి. సంవత్సరం పొడుగునా అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.ieindia.org ని సందర్శించండి. ఐ.ఇ.టి.ఇ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీర్స్‌ వారు ఎ.ఎం.ఐ.ఇ.టి.ఇ కోర్సును అందిస్తున్నారు. జూన్‌ నెలలో పరీక్ష కొరకు ఫిబ్రవరి లోగా, డిసెంబర్‌ నెల పరీక్ష కొరకు ఆగస్టు లోగా దరఖాస్తు చేసుకోవాలి. అయిదు సంవత్సరాల వ్యవధిలో కోర్సును పూర్తి చేయాలి.
పైన పేర్కొన్న రెండు కోర్సులు రెగ్యులర్‌ మోడ్‌లో బి.టెక్‌తో తత్సమాన అర్హతగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలకు అర్హత కల్పిస్తాయి. ఉన్నత చదువులు అభ్యసించడానికి కూడా తోడ్పడతాయి.

హాస్పిటాలిటీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేయాలని ఉంది. దూరవిద్య/ కరస్పాండెన్స్‌లో ఈ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలేవి?

పర్యటక రంగ అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా మంచి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. హాస్పిటాలిటీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఎంబీఏ చేయాలనుకునే అభ్యర్థులు ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సును దూరవిద్య ద్వారా కాకుండా రెగ్యులర్‌ విధానంలో అభ్యసించడం మంచిది. ఫలితంగా వృత్తిపరమైన నైపుణ్యాలు, సాఫ్ట్‌స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
ఏదైనా దూరవిద్య కోర్సును అభ్యసిం ముందు ఆ కోర్సును అందించే విశ్వవిద్యాలయం, సంబంధిత కోర్సుకు డిఫెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ), యూజీసీ అనుమతి ఉందో లేదో తెలసుకోవాలి. అనుమతి ఉన్న విశ్వవిద్యాలయ కోర్సును మాత్రమే ఎంచుకోవాలి. ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) వారు ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) వారి సౌజన్యంతో ఎంబీఏ హెచ్‌ఎం కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తున్నారు.
సింబయాసిస్‌, సిక్కిం మణిపాల్‌ యూనివర్సిటీల వారు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నారు.

అనారోగ్య కారణంగా డిగ్రీలో కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు పాసవ్వలేదు. ఫలితాలు రాకముందే రాసిన ఐసెట్‌లో 3780 ర్యాంకు వచ్చింది. ఆగస్టులో సప్లిమెంటరీ రాశాక ఏదైనా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుందా? లేదంటే వచ్చే మార్చిలో ఐసెట్‌ రాసేంతవరకూ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లో చేరడం మంచిదా?

ఓటమి గురించి బాధపడకుండా ముందుకు వెళ్దామనే మీ ఆలోచన ఆచరణాత్మకం. ముందుగా మీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల మీద దృష్టిపెట్టండి. పరీక్షలు ఆగస్టులో ఉంటే ఫలితాలు వెలువడటానికి కనిష్ఠంగా నెలరోజులకుపైగా సమయం పడుతుంది. ఈలోపు ఐసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ కూడా పూర్తయ్యి తరగతులు మొదలుకావచ్చు.
ముందుగా మీకు ఆసక్తి ఉన్న కోర్సు- ఎంబీఏ/ ఎంసీఏను ఎంచుకోండి. మీకు మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, మేనేజ్‌మెంట్‌ పట్ల ఆసక్తి ఉంటే ఎంబీఏను ఎంచుకోండి. ఎంబీఏ చేయాలనుకుంటే..ఐసెట్‌ కౌన్సెలింగ్‌ మీ పరీక్ష ఫలితాలు వెలువడే సరికే అయిపోతుంది కాబట్టి, క్యాట్‌కు సన్నద్ధం అవ్వొచ్చు. దీనికి ప్రకటన ఆగస్టులో విడుదలవుతుంది. పరీక్షను నవంబర్‌లో నిర్వహిస్తారు. మంచి క్యాట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా పేరున్న సంస్థలో సీటు సంపాదించుకోవచ్చు.
కంప్యూటర్స్‌, మేథమేటిక్స్‌ పట్ల ఆసక్తి ఉంటే ఎంసీఏను ఎంచుకోవచ్చు. ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను ప్రసిద్ధి చెందిన జాతీయ విద్యాలయాల్లో అభ్యసించడం కెరియర్‌ పరంగా శ్రేయస్కరం. కాబట్టి, మీ పరీక్ష ఫలితాలు, ప్రవేశపరీక్ష సబ్జెక్టులపై ఉన్న పట్టు ఆధారంగా మీకు కోచింగ్‌ ఎంతవరకూ అవసరమో నిర్ణయించుకోండి.

కెమికల్‌ ఇంజినీరింగ్‌ అమ్మాయిలకు తగిన కోర్సేనా? నాలుగేళ్ల కోర్సు తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి?

అభ్యసించే విద్యకు, చేసే ఉద్యోగానికి ఆడ, మగ అనే లింగ భేదం ఉండదు. ప్రతి మ్యానుఫాక్చరింగ్‌ సంస్థకు తమ ఫ్యాక్టరీలు, పరిశోధన కార్యకలాపాల్లో, కెమికల్‌ ఇంజినీర్లు తప్పనిసరిగా కావాలి. కెమికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పట్టా పొందినవారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రాసెస్‌ డిజైన్‌ ఇంజినీర్‌, సేఫ్టీ స్పెషలిస్ట్‌, సీనియర్‌ ఇంజినీర్‌, మ్యానుఫాక్చరింగ్‌ కన్సల్టెంట్‌, పరిశోధన రంగాల్లో అవకాశాలు లభిస్తాయి.
మన దేశంలో ఈ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థుల్లో 45% నుంచి 55% అమ్మాయిలే. కాబట్టి, కోర్సు పూర్తి చేసినవారికి ఉజ్వల భవిష్యత్తు ఉందనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, ఆంధ్ర, జేఎన్‌టీయూ, నాగార్జున విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ ప్రముఖ కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఆత్మన్యూనత భావాన్ని వదిలి, ధైర్యంగా కోర్సును ఎంచుకోండి.

ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేశాను. మెకానికల్‌ ఇంజినీర్‌ కావాలని అనుకుంటున్నాను. నా లక్ష్యం నెరవేరడానికి పాలిటెక్నిక్‌లో చేరాలా? ఇంటర్‌లో ఎంపీసీ చదవాలా? ఏది మెరుగు?

పాలిటెక్నిక్‌, ఇంటర్మీడియట్‌ కోర్సులు ఇంజినీరింగ్‌ పూర్తిచేయడానికి రెండు మార్గాలు. రెండింటికీ 6 (3+3, 2+4) సంవత్సరాల సమయమే పడుతుంది. పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన తర్వాత ఏ కారణంతోనైనా బీటెక్‌ ప్రవేశం పొందలేకపోయినా ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. అయితే పాలిటెక్నిక్‌ కోర్సు చేయాలనుకున్నప్పుడు ఉత్తమ ప్రమాణాలున్న కళాశాలను ఎంచుకున్నప్పుడే విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది.
పాలిటెక్నిక్‌ పూర్తయ్యాక ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ ప్రవేశం పొందవచ్చు. అయితే రెండు కోర్సులూ మంచివే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. మెకానికల్‌ ఇంజినీర్లకు విషయ పరిజ్ఞానంతోపాటు లోతుగా ఆలోచించడం, క్రియేటివిటీ తప్పనిసరి. ఈ లక్షణాలను మీలో పెంపొందించుకోగలిగితే భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు.

ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్‌ను 51% మార్కులతో పూర్తిచేశాను. ఉస్మానియా, ఇతర ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి అర్హత ఉండదని తెలుసు. పీహెచ్‌డీ చేయడానికి అవకాశమిచ్చే ఇతర విశ్వవిద్యాలయాల గురించి తెలపండి. ఇంకా దూరవిద్యలో ఇతర అవకాశాలు నాకు ఏమేం ఉన్నాయో తెలపండి.

ఏదైనా విశ్వవిద్యాలంలో పీహెచ్‌డీ లేదా ఎంఫిల్‌ అభ్యసించడానికి తత్సమాన పీజీలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. విశ్వవిద్యాలయ ప్రవేశపరీక్ష, ముఖాముఖి ద్వారా ప్రవేశం కల్పిస్తారు. యూజీసీ 2016 రెగ్యులేషన్స్‌ ప్రకారం దూరవిద్య ద్వారా ఏ విశ్వవిద్యాలయం కూడా దూరవిద్య ద్వారా పీహెచ్‌డీ అందించకూడదు.
మీరు ఇతర దూరవిద్య కోర్సులు అందిస్తున్న ఇగ్నో, ఇఫ్లూ, ఉస్మానియా, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు అందిస్తున్న ఆరు నెలల ఇంగ్లిష్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు, ఏడాది వ్యవధిగల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌/ డిప్లొమా ఇన్‌ ఇంగ్లిష్‌ వంటి దూరవిద్య కోర్సులను ఎంచుకుని మీ అర్హతలు, ఉద్యోగావకాశాలను పెంపొందించుకోవచ్చు.

ప్రస్తుతం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాను. దూరవిద్య విధానంలో బయాలజీ, ఇంగ్లిష్‌, మెథడాలజీలతో బీఈడీ చేయాలని ఉంది. అందించే విశ్వవిద్యాలయాలు, వాటి ప్రకటన వివరాలను తెలియజేయండి.

మన తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, అంబేడ్కర్‌ దూరవిద్య విశ్వవిద్యాలయం మొదలైనవి దూరవిద్య ద్వారా బీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) ని అందిస్తున్నాయి. కనీసం రెండు సంవత్సరాల బోధనానుభవం ఉన్న అధ్యాపకులకు ఈ విశ్వవిద్యాలయాల్లో దూరవిద్య ద్వారా బీఈడీ చేయడానికి అర్హత ఉంటుంది.
ఈ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కోసారి విడుదల చేస్తుంది. ఆంధ్రా విశ్వవిద్యాలయం జూన్‌లో, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం జనవరిలో, అంబేడ్కర్‌ దూరవిద్య విశ్వవిద్యాలయం డిసెంబర్‌లో ప్రకటనలు విడుదల చేస్తారు. ఉస్మానియా మాత్రం ఇతర దూరవిద్య కోర్సులకు ఏప్రిల్‌లో, బీఈడీ, ఎంఫిల్‌ లాంటి కోర్సులకు యూనివర్సిటీ సూచన మేరకు ప్రకటనలు విడుదలచేస్తుంది. కాబట్టి తరచూ వెబ్‌సైటü చూస్తూ ఉండటం వల్ల నోటిఫికేషన్‌ వచ్చినపుడు తెలిసే అవకాశం ఉంది.

ఎంఏ (ఇంగ్లిష్‌) తర్వాత బీఈడీ చేశాను. ఇంగ్లిష్‌ పరిజ్ఞానం పెంచుకోవాలని ఉంది. ఇందుకు నేనేం చేయాలి? ఇంగ్లిష్‌లో పీజీ డిప్లొమా, టీచింగ్‌లో డిప్లొమా లాంటివి చేయవచ్చా? అందించే విశ్వవిద్యాలయాలేవి? వాటి ప్రకటనలు ఎప్పుడు ఉండొచ్చు?

ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం, బోధనా పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ఒక అధ్యాపకుడికి ఎంతో అవసరం. మన తెలుగు రాష్ట్రాల్లో ఇఫ్లూ (ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ) వారు సంవత్సర కాలవ్యవధి గల పీజీసీటీఈ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ టీచింగ్‌ ఇంగ్లిష్‌) కోర్సును అందిస్తున్నారు. ఈ కోర్సుకి డిసెంబర్‌లో ప్రకటన విడుదలవుతుంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా సీసీపీఈ (సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ప్రాక్టికల్‌ ఇంగ్లిష్‌), సీసీఈటీ (సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ టీచర్‌) లాంటి కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు ఆరు నెలల స్వల్ప కాలవ్యవధితో ఉంటాయి. ప్రకటన సంవత్సరానికి రెండుసార్లు వెలువడుతుంది. వీటితోపాటు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీడీసీఈ (పీజీ డిప్లొమా ఇన్‌ కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌) కోర్సు అందుబాటులో ఉంది. జనవరి/ ఫిబ్రవరి నెలలో ఈ నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ)లో ఆరు నెలల నుంచి రెండేళ్ల కాలవ్యవధితో సీటీఈ (సర్టిఫికెట్‌ ఇన్‌ టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌) కోర్సు అందుబాటులో ఉంది. దీని ప్రకటన మే/ జూన్‌లో వస్తుంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే చాలా కోర్సులు కూడా ఉన్నాయి.edx, courseera లాంటి వెబ్‌సైట్లలో నమోదు చేసుకుంటే ఎక్కడినుంచైనా ఉచితంగా కోర్సులను చేయవచ్చు. వీటిలో చాలారకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి.

మా బాబు సీబీఎస్‌ఈలో పదోతరగతి పూర్తిచేశాడు. స్టేట్‌, సెంట్రల్‌ పాలిటెక్నిక్‌ పరీక్షలు రాశాడు. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? వీటి ద్వారా జేఈఈ రాసి, ఐఐటీలో చేరవచ్చా? సీఐటీడీలో డిప్లొమాచేసి, ఆపై పీజీ చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం పొందే వీలుంటుందా?

మీ బాబుకు ఉన్న ఆసక్తిని బట్టి రెండింటిలో దేనిలో చేర్పించాలో నిర్ణయం తీసుకోండి. ఏ కోర్సు అయినా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మీ అబ్బాయికి బీటెక్‌పై ఆసక్తి ఉంటే స్టేట్‌ పాలిటెక్నిక్‌లో చేర్పించండి. దీని తర్వాత బీటెక్‌లో సివిల్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ వంటివి చదవవచ్చు.
టూల్‌ ఇంజినీరింగ్‌, క్యాడ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైనింగ్‌), కామ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ మానుఫాక్చరింగ్‌), ఆటోమేషన్‌ లాంటి స్పెషలైజ్డ్‌ ట్రైనింగ్‌ కోర్సుల పట్ల ఆసక్తి ఉంటే సీఐటీడీలో చేర్పించండి. సీఐటీడీలో అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌, సిస్టమ్స్‌ నేర్చుకోవచ్చు. అయితే పాలిటెక్నిక్‌ చదివినవారికి జేఈఈ పరీక్ష రాసే అర్హత ఉండదు. సీఐటీడీలో డిప్లొమా చేసి, తర్వాత పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివితే ప్రభుత్వ ఉద్యోగం పొందే వీలుంటుంది. చదివిన స్పెషలైజేషన్‌కు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్‌ వచ్చినపుడు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవచ్చు.

ఇంటర్‌ (బైపీసీ), బీఏ తర్వాత బీఈడీ పూర్తిచేశాను. ఆర్కియాలజిస్ట్‌ అవ్వాలని ఉంది. దీనికి ప్రత్యేకంగా ఏదైనా కోర్సు చేయాలా? ఉంటే ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలియజేయండి. ప్రవేశపరీక్ష, భవిష్యత్‌ ఉద్యోగావకాశాల గురించి తెలియజేయండి.

ఆర్కియాలజిస్టు కావాలనే మీ ఆసక్తి అభినందనీయం. ఇందుకు మీరు డిగ్రీలో (బీఏ స్థాయిలో) హిస్టరీ/ ఆర్కియాలజీ సబ్జెక్టును చదివి ఉండాలి. ఆ తర్వాత పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా లేదా డిగ్రీ కోర్స్‌ ఇన్‌ ఆర్కియాలజీ చదవాలి. నుమిస్మాటిక్స్‌, ఎపిగ్రఫీ, ఆర్కివ్స్‌, మ్యూజియాలజీ అనేవి ఆర్కియాలజీ ముఖ్య బ్రాంచీలు. దీనిలో వివిధ రకాల స్పెషలైజేషన్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు జియో ఆర్కియాలజీ, బయో ఆర్కియాలజీ, హిస్టారికల్‌ ఆర్కియాలజీ, ఎత్నో ఆర్కియాలజీ, కంప్యూటేషనల్‌ ఆర్కియాలజీ.
వీటిల్లో మీకు ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోవచ్చు. తర్వాత పీహెచ్‌డీని మీకు నచ్చిన స్పెషలైజేషన్‌లో చేయవచ్చు. అయితే ఈ కోర్సుకు ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో రకమైన ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు రాష్ట్రస్థాయి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. ఆర్కియాలజీ చదివినవారు యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షల ద్వారా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సంపాదించవచ్చు. ఆర్కియాలజిస్ట్‌లకు రక్షణ రంగం, మ్యూజియాలు, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, కల్చరల్‌ సెంటర్లలోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి.
వీరు సెట్‌, నెట్‌ ద్వారా అధ్యాపకులు, పరిశోధకులుగా కూడా స్థిరపడవచ్చు. వీటితోపాటు టూరిజం రంగం, క్యూరేటర్స్‌, హెరిటేజ్‌ కన్సర్వేటర్స్‌, ఆర్కివిస్ట్‌లుగా కూడా వీరికి అవకాశాలుంటాయి.

మా అబ్బాయి ఇంటర్‌ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ (మ్యాథ్స్‌) చేసింది. ఎడ్‌సెట్‌ రాయడానికి అర్హత ఉంటుందా?

ఇప్పటివరకూ ఇచ్చిన ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌లో దూరవిద్య చదివినవారికి అర్హత ఉండదని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మీ అమ్మాయికి అర్హత ఉంది. ఒకవేళ నోటిఫికేషన్‌లో దూరవిద్య ద్వారా డిగ్రీ చదివినవారికి అర్హత లేదు అని ఇస్తే అప్పుడు మాత్రమే ఉండదు. ఇవ్వనంతవరకు అర్హత ఉంటుంది.

డిగ్రీ (బీఏ కంప్యూటర్స్‌) చివరి సంవత్సరం పూర్తిచేశాను. ఎల్‌ఎల్‌బీ చేయాలనుంది. సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ సైన్స్‌పైనా ఆసక్తి ఉంది. వీటిని చదవడానికి అర్హుడినేనా? అందించే విద్యాసంస్థల వివరాలను తెలపండి. మా తమ్ముడు కూడా బీఏ కంప్యూటర్స్‌ చేస్తున్నాడు. తనకు జర్నలిజం, ఎంబీఏపై ఆసక్తి ఉంది. వీటికి ఉండే ఉపాధి అవకాశాల గురించీ తెలపగలరు.

మొదట మీకు ఎక్కువ ఆసక్తి దేనిపై ఉందో నిర్ణయించుకుని, దాన్ని చదవండి. డిగ్రీ తర్వాత ఎల్‌ఎల్‌బీ చదివితే తప్పకుండా ఉద్యోగావకాశాలు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం సైబర్‌ సెక్యూరిటీలో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ కోర్సును చదవవచ్చు.
కంప్యూటర్‌సైన్స్‌ చదవడానికి సాధారణంగా ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ సబ్జెక్టులు చదివుండాలి. ఎంఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలనుకుంటే బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) పాసై ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, కాకతీయ, శ్రీవెంకటేశ్వర మొదలైన విశ్వవిద్యాలయాలు కంప్యూటర్‌సైన్స్‌ను అందిస్తున్నాయి. మీరు ఇంటర్‌లో ఎంచుకున్న సబ్జెక్టులు, విశ్వవిద్యాలయాలు నిర్దేశించే అర్హతలను చూసుకుని, వాటి ఆధారంగా దరఖాస్తు చేసుకోండి.
మీ తమ్ముడికి జర్నలిజం, ఎంబీఏ అంటే ఆసక్తి అని తెలిపారు. ఇవి చేసినవారికీ ఉద్యోగావకాశాలు చాలానే ఉన్నాయి. జర్నలిజం చేసినవారికి వారి స్పెషలైజేషన్‌ బట్టి ఉద్యోగావకాశాలుంటాయి. ఉదాహరణకు- అడ్వర్టైజింగ్‌ మేనేజర్‌, ఆడియో ఇంజినీర్‌, ఆడియో టెక్నీషియన్‌, కెమెరామెన్‌, కాప్షన్‌ రైటర్‌, కార్టూన్‌ యానిమేటర్స్‌, చిల్డ్రన్‌ లిటరేచర్‌ రైటర్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ టీచర్‌, డిజిటల్‌ రికార్డింగ్‌ ఆర్టిస్ట్‌, డిజిటల్‌ ఎడిటింగ్‌ ప్రొఫెషనల్‌, డిజిటల్‌ వీడియో ఎడిటర్‌, మీడియా కమ్యూనికేషన్స్‌ ప్రొఫెషనల్‌, మేగజీన్‌ ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌, న్యూస్‌ ఎడిటర్‌, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్‌, న్యూస్‌ కాస్టర్‌, పబ్లిక్‌ రిపోర్టర్‌, రేడియో, టీవీ, స్పోర్ట్స్‌ బ్రాడ్‌కాస్టర్‌ మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.
ఎంబీఏ చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ స్పేస్‌ రిసర్చ్‌ ఆర్గనైజేషన్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, బ్యాంకింగ్‌ మొదలైనవాటిల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు రంగంలోనూ హ్యూమన్‌ రిసోర్స్‌, ఆపరేషన్స్‌, మార్కెటింగ్‌ ఫైనాన్స్‌ మేనేజర్లుగా స్పెషలైజేషన్‌ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.

దూరవిద్యలో బీఎల్‌ఎస్‌సీ చదవాలనుకుంటున్నాను. ప్రభుత్వ రంగంలో దీనికి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

సమాచారం, పరిజ్ఞానాన్ని అందించడంలో గ్రంథాలయాలు ముఖ్యపాత్రను పోషిస్తాయి. నేషనల్‌ మిషన్‌ ఫర్‌ లైబ్రరీస్‌ దేశంలో మరిన్ని గ్రంథాలయాల స్థాపనకు ప్రతిపాదన ఇచ్చింది అంటే, వాటికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. మీరు దూరవిద్య ద్వారా చదవడం కంటే రెగ్యులర్‌ విధానంలో చదవడం వల్ల సబ్జెక్టుపట్ల ఎక్కువ పరిజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే నేరుగా చదవడానికే ప్రాధాన్యమివ్వండి.
బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (బీఎల్‌ఎస్‌సీ) చదివినవారికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు చాలానే ఉంటాయి. బీఎల్‌ఎస్‌సీ చదివినవారికి లైబ్రేరియన్‌, డాక్యుమెంటేషన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, డిప్యూటీ లైబ్రేరియన్‌, ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, నాలెడ్జ్‌ మేనేజర్‌/ ఆఫీసర్‌, ఇన్ఫర్మేషన్‌ ఎగ్జిక్యూటివ్‌, ఇన్ఫర్మేషన్‌ అనలిస్ట్‌ మొదలైన అవకాశాలు ఉంటాయి.
ఈ కోర్సు చదివినవారు స్కూళ్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సెంట్రల్‌ గవర్నమెంట్‌ లైబ్రరీలు, బ్యాంక్‌ ట్రెయినింగ్‌ సెంటర్లు, నేషనల్‌ మ్యూజియాలు, ఆర్కివ్స్‌, రేడియో స్టేషన్లు, న్యూస్‌పేపర్‌ లైబ్రరీలు, న్యూస్‌ చానళ్లు, డేటాబేస్‌ ప్రొవైడర్‌ సంస్థలు, ప్రచురణ సంస్థలు, లైబ్రరీ నెట్‌వర్క్స్‌, వ్యాపార సంస్థలు, పరిశోధన సంస్థలు, వివిధ ప్రాంతాల్లోని నాన్‌ గవర్నమెంట్‌ ఆర్గనైజేషన్స్‌, ట్రెయినింగ్‌ అకాడమీలు మొదలైనవాటిల్లో కొలువులు పొందవచ్చు.

బీఎస్‌సీ కంప్యూటర్స్‌ చదువుతున్నాను. భవిష్యత్తులో దీనికి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? నాకు శారీరక వైకల్యం ఉంది. నాకు ప్రభుత్వ రంగంలో ఎలాంటి ఉద్యోగావకాశాలు లభిస్తాయి?

ఈరోజుల్లో ప్రతి పనిలోనూ కంప్యూటర్‌ వాడకం పెరగడంవల్ల ఈ కోర్సు చదివినవారికి ఉద్యోగావకాశాలకు కొదవేం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండింటిలోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తు బాగానే ఉంటుంది. వీలైతే ఉన్నత చదువులు చదవడానికి ప్రయత్నించండి. డిగ్రీ తర్వాత కంటే పీజీ కంప్యూటర్‌ సైన్స్‌ చదవడం వల్ల ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
డిగ్రీ తర్వాత అయితే ప్రభుత్వ రంగంలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ల్లో, సెంట్రల్‌ గవర్నమెంట్‌లో రైల్వే, ఇన్‌కం టాక్స్‌, పోస్టల్‌ మొదలైన విభాగాల్లో, ఇంకా ఇండియన్‌ స్పేస్‌ రిసర్స్‌ సెంటర్‌, డిఫెన్స్‌ రిసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్స్‌ లాంటి సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి.
జావా, ఒరాకిల్‌, డాట్‌నెట్‌, శాప్‌ (ఎస్‌ఏపీ), హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్‌ లాంటి కోర్సులు నేర్చుకుని ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకూ ప్రయత్నించవచ్చు. అంగవైకల్యం లక్ష్యానికి అడ్డు కాదు. ప్రభుత్వం శారీరక లోపం ఉన్నవారికి ఉద్యోగాల విషయంలో ప్రత్యేక అవకాశాలను కల్పిస్తోంది. కాబట్టి కష్టపడి చదవండి.

బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. సివిల్‌ సర్వెంట్‌ కావడం నా కోరిక. ఇప్పటినుంచి సివిల్స్‌కు సన్నద్ధమవడం మంచిదేనా? అయితే ముందుగా దేశంలో ఏదైనా ఉన్నత విద్యాసంస్థలో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఇందుకు క్యాట్‌ రాయాలనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఏదైనా స్కాలర్‌షిప్‌, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ లాంటివి పొందే అవకాశం ఉందా?

మీరు ఉన్నత విద్యాసంస్థలో ఎంబీఏ చదవాలనుకుంటున్నారు. సివిల్‌ సర్వెంట్‌ కావాలనీ అనుకుంటున్నారు. ఈ రెండూ విభిన్నమైన దారులు. అయితే మీరు ప్రణాళికబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఆప్టిట్యూడ్‌ అనేది క్యాట్‌, సివిల్‌ సర్వీసెస్‌ రెండు పరీక్షల్లోనూ ఉంటుంది. ఇది మీకు ఇతర పోటీ పరీక్షల్లోనూ తోడ్పడుతుంది.
మీ స్వల్పకాలిక లక్ష్యం ఐఐఎం అయితే మొదట దాన్ని సాధించండి. ఆ తర్వాత మీ దీర్ఘకాలిక లక్ష్యం- సివిల్‌ సర్వీసెస్‌కు అవసరమైన వయసు, పరీక్ష ప్రయత్నాల సంఖ్య (అటెంప్ట్స్‌) మొదలైనవాటి గురించిన సమాచారాన్ని సేకరించుకోండి. దాని ప్రకారం ప్రణాళికను రూపొందించుకుని, ఆ దిశగా కొనసాగండి.
ఐఐఎంల్లో చదవడానికి ఖర్చు ఎక్కువగానే అవుతుంది. ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌ సౌకర్యం ఉన్నప్పటికీ అది కొంతమంది మెరిట్‌ విద్యార్థులకే లభిస్తుంది. కాబట్టి పోటీ ఎక్కువ. అంతేకాకుండా ఫీజు మొత్తాన్ని దీనిలో అందించరు. అయితే మీకు బ్యాంకు రుణం తీసుకుని చదివే అవకాశం మాత్రం ఉంటుంది.

ఎంఎస్‌సీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోటీ పరీక్షలు రాయాలని ఉంది. కానీ ఎంఎస్‌సీ వల్ల సాధ్యం కావడంలేదు. పరిష్కారం చెప్పండి.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోటీపరీక్షలు రాయడానికి మీ చదువును మానుకోవాల్సిన లేదా అశ్రద్ధ చేయాల్సిన పనిలేదు. చాలామంది పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోటీపరీక్షల్లో మంచి ర్యాంకు సాధించినవారిలో ఉద్యోగం చేస్తూ, పరీక్షకు సన్నద్ధమయినవారు కూడా ఉన్నారు. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.
ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అంత సులువైన సబ్జెక్టు కాదు. ఒకవేళ మీకు చదువుతున్నదానిపై ఆసక్తి లేకపోతే కేవలం మీరనుకుంటున్న సివిల్‌ సర్వీసెస్‌పైనే దృష్టిపెట్టండి. రెండింటిమీదా ఆసక్తి ఉంటే, ప్రస్తుతం చదువుతున్నదాని మీద శ్రద్ధపెట్టి, పూర్తిచేయండి. ఆ తర్వాత సర్వీసెస్‌ గురించి చూడండి. రెండింటిమీదా దృష్టి సారించగలను అనుకుంటే మీకున్న ప్రాధాన్యాన్ని బట్టి సమయాన్ని విభజించుకోండి. అలాగే రోజూ వార్తాపత్రికలు చదవడం, పోటీపరీక్షకు సంబంధించిన సబ్జెక్టు పుస్తకాలను చదవడం, వివిధ అంశాలను అధ్యాపకులు/ స్నేహితులతో చర్చించడం, విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవడంపైనా శ్రద్ధ తీసుకోండి.

డిగ్రీ పూర్తిచేశాను. తర్వాత బీఎల్‌ఐఎస్‌సీ చేయాలని ఉంది. అందించే విశ్వవిద్యాలయాలు ఏవి?

మన తెలుగు రాష్ట్రాల్లో బీఎల్‌ఐఎస్‌సీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌)ను ఉస్మానియా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ కోర్సును దూరవిద్య ద్వారా అందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో ఎంఎల్‌ఐఎస్‌సీ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మీకు ఆసక్తి ఉన్న విశ్వవిద్యాలయంలో కోర్సును ఎంచుకోండి.

మా బాబు పదో తరగతి (సీబీఎస్‌ఈ) పూర్తిచేశాడు. బీటెక్‌ చేయాలనుకుంటున్నాడు. పాలిటెక్నిక్‌ చేసి, తర్వాత బీటెక్‌కు వెళితే మంచిదా? ఇంటర్‌ చదివి, ఇంజినీరింగ్‌కు వెళితే మెరుగా? ఒకవేళ పాలిటెక్నిక్‌ మంచిదైతే ఏ బ్రాంచిని ఎంచుకుంటే మేలు?

పాలిటెక్నిక్‌, ఇంటర్మీడియట్‌ కోర్సులు, ఇంజినీరింగ్‌ పూర్తిచేయడానికి రెండు మార్గాలు. రెండింటికీ ఆరు (2+4, 3+3) సంవత్సరాల సమయమే పడుతుంది. పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన తర్వాత ఏ కారణంతోనైనా బీటెక్‌ ప్రవేశం పొందలేకపోయినా ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. అయితే పాలిటెక్నిక్‌ కోర్సు చేయాలనుకున్నప్పుడు ఉత్తమ ప్రమాణాలున్న కళాశాలను ఎంచుకున్నప్పుడే విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. పాలిటెక్నిక్‌ పూర్తయ్యాక ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌కు ప్రవేశం పొందవచ్చు. గతంలో చెప్పినట్లుగా ప్రతి కోర్సు మంచిదే. అభ్యర్థిలో అపారమైన ఆసక్తి ఉన్నప్పుడు ఆయా రంగాల్లో తన ప్రతిభతో భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాడు. అన్ని కోర్సులు మంచివే. ప్రతి కోర్సుకీ ఉండే ఉద్యోగావకాశాలు వేటికవే ప్రత్యేకం. మీ ఆర్థిక పరిస్థితి, అవసరాలను బట్టి మీకేది అనువుగా ఉంటే దాన్ని ఎంచుకోండి.

వ్యవసాయ పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇది పూర్తయ్యాక ఏయే ఉద్యోగాలకు అర్హత వస్తుంది? ఒకవేళ ఉద్యోగం వస్తే విధులు నిర్వహిస్తూ ఏజీ-బీఎస్‌సీ లాంటివి చదివే అవకాశం ఉందా?

వ్యవసాయ పాలిటెక్నిక్‌ పూర్తయిన తర్వాత అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత వస్తుంది. అదేవిధంగా ప్రైవేటు, వ్యవసాయ ఆధారిత రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత విధులు నిర్వహిస్తూ ఏజీ-బీఎస్‌సీ చదివే అవకాశం లేదు. కానీ, ఉద్యోగానికి సెలవుపెట్టి, ఏజీ-బీఎస్‌సీని పూర్తికాల కోర్సుగా చదివితే విషయ పరిజ్ఞానం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. వృత్తివిద్యా కోర్సులను పూర్తికాలపు రెగ్యులర్‌ కోర్సులుగా చదవడమే మేలు. ఉద్యోగం చేస్తూనే మీ విద్యార్హతలను పెంచుకోదలిస్తే ఇగ్నో, ఎన్‌ఏఏఆర్‌ఎం, ఎన్‌ఐఆర్‌డీ లాంటి ప్రముఖ సంస్థల్లో స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సులను చేస్తే వ్యవసాయ రంగంలో నైపుణ్యం సాధించి, రైతులకు మెరుగైన సలహాలను ఇవ్వగలుగుతారు.

ఇంటర్‌ (ఎంపీసీ) పూర్తిచేశాను. నా మిత్రుడు అయిదేళ్ల లా ఆనర్స్‌ చేయమంటున్నాడు. అసలు ‘లా’కూ, లా ఆనర్స్‌కూ తేడా ఏంటి? ఇంకా చాలా కోర్సుల్లో (ఉదా: బీకాం-ఆనర్స్‌) ఇలాంటివి ఉన్నాయి. అకడమిక్‌ కోర్సుల్లో ఆనర్స్‌ అంటే ఏమిటి?

సాధారణంగా లా అనేది మూడు సంవత్సరాల కోర్సు. దీన్ని డిగ్రీ తర్వాత చదవవచ్చు. లా ఆనర్స్‌ అయిదు సంవత్సరాల కోర్సు. దీన్ని ఇంటర్మీడియట్‌ తర్వాత చదవవచ్చు. లా ఆనర్స్‌లో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు- బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), బీకాం ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), బీఎస్‌సీ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), బీబీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) మొదలైన కోర్సులు అందుబాటులో ఉంటాయి.
లా అయితే 3 సంవత్సరాల లా సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. లా ఆనర్స్‌లో మొదటి రెండు సంవత్సరాలు విద్యార్థి ఎంచుకున్న స్పెషలైజేషన్‌ సబ్జెక్టులు, తర్వాతి 3 సంవత్సరాలు లాకు సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. అయితే మనదేశంలో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆనర్స్‌ డిగ్రీని ఇంటిగ్రేటెడ్‌ కోర్సుగా, మరికొన్ని స్పెషలైజేషన్‌తో కూడిన డిగ్రీగా అందిస్తున్నారు. ఉదాహరణకు- బీఏ డిగ్రీ + ఎంఏ డిగ్రీ లేదా ఆసక్తి ఉన్న ఒకే సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేయడాన్ని ఆనర్స్‌ అంటారు. దీన్ని 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కోర్సుగా అందిస్తారు. ఇది ఒక్కో యూనివర్సిటీని బట్టి వేర్వేరుగా ఉంటుంది.

మా అబ్బాయి పదో తరగతి తర్వాత ఈసీఈ ట్రేడ్‌తో పాలిటెక్నిక్‌ డిప్లొమా 2016లో పూర్తిచేశాడు. బీటెక్‌ చదవడానికి ఇష్టపడటం లేదు. తను ఇంటర్‌లోకానీ డిగ్రీలోకానీ ప్రవేశం పొందవచ్చా? అలాగే డిప్లొమాతో ఏమేం ఉద్యోగావకాశాలు ఉంటాయో తెలుపగలరు.

పదో తరగతి చదివినవారు ఇంటర్మీడియట్‌ చదవడానికి ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు. పాలిటెక్నిక్‌ డిప్లొమా ద్వారా డిగ్రీ ప్రవేశం పొందవచ్చు. ఈసీఈ డిప్లొమా ద్వారా ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
బీహెచ్‌ఈఎల్‌, సెయిల్‌, గెయిల్‌, ఇస్రో, డీఆర్‌డీఓ, బీఈఎల్‌, బార్క్‌, హెచ్‌ఏఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు డిప్లొమా వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ఎలక్ట్రానిక్‌, ఐటీ, కంప్యూటర్‌ సైన్స్‌ రంగాల్లో కూడా ఈసీఈ డిప్లొమా వారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిప్లొమాతోపాటుగా ఏదైనా కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి.

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాను. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఎంఏ ఇంటిగ్రేటెడ్‌ చేయాలనుకుంటున్నాను. దీనికి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఈ కోర్సును ఏ రాష్ట్ర, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి?

ఈమధ్య కాలంలో పరభాషా మోజులోపడి యువత మాతృభాషకు దూరమవుతున్న నేపథ్యంలో మీరు తెలుగును ఎంచుకోవడం అభినందనీయం. తెలుగులో ఎంఏ చేసినవారికీ, ఇంటిగ్రేటెడ్‌ వారికీ ఉద్యోగావకాశాల విషయంలో ఎటువంటి తేడాలు ఉండవు. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏతోపాటు మీకు ఆసక్తి ఉంటే జర్నలిజంలో కూడా డిగ్రీ చేస్తే, పత్రికా రంగంలో ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ పూర్తిచేసిన తర్వాత తెలుగు పండిట్‌ శిక్షణకు వెళ్లవచ్చు. నెట్‌, సెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే డిగ్రీ కళాశాల లెక్చరర్‌ పోస్టులకు అర్హులవుతారు. అలాగే ఎంఫిల్‌, పీహెచ్‌డీ లాంటి కోర్సులు చేస్తే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక ఉద్యోగాలకు పోటీ పడవచ్చు.
అయిదు సంవత్సరాల ఎంఏ ఇంటిగ్రేటెడ్‌ తెలుగును హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందిస్తుంది. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన వెలువడింది. దరఖాస్తు చేయడానికి చివరితేదీ- మే 5, 2017. ఈ ప్రవేశపరీక్షకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 2017 జూన్‌ 1 నుంచి 5 తేదీల మధ్య ప్రవేశపరీక్షలను నిర్వహిస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అయిదు సంవత్సరాల ఎంఏ ఇంటిగ్రేటెడ్‌ తెలుగు అందుబాటులో లేదు. ఏవైనా విశ్వవిద్యాలయాలకు ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టే ఉద్దేశం ఉంటే, ఆ విషయాలు సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచే అవకాశం ఉంది. కాబట్టి మీరు తరచుగా వివిధ విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లు, ప్రవేశ ప్రకటనలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి.

ఇంటర్‌ 1988లో పూర్తిచేశాను. తర్వాత చదువు కొనసాగలేదు. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా బీఏ పాసయ్యాను. నా పాత సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల బీఏలో నా పుట్టినతేదీని నోటరీ అఫిడవిట్‌ ద్వారా మార్చుకున్నాను. తర్వాత ఎంసీజే చేశాను. ఈ మధ్య నా పాత సర్టిఫికెట్లు దొరికాయి. అవి ఇప్పుడు చెల్లుతాయా? నేను ఏపీ సెట్‌ రాయడానికి అర్హుడినేనా? వయసుని బట్టి నేను ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చా?

పదో తరగతి సర్టిఫికెట్లు, ఇప్పుడు అఫిడవిట్‌ ద్వారా తీసుకున్నవాటిల్లో ఉన్న పుట్టినతేదీలు రెండూ ఒకటే అయితే ఏ సమస్యా ఉండదు. రెండు సర్టిఫికెట్లలో వేర్వేరు పుట్టినతేదీలు తీసుకోవడం సరైన చర్య కాదు. ఎవరికైనా పదోతరగతిలో ఏ పుట్టినతేదీ ఉంటుందో అదే ప్రామాణికం. ఉన్నత చదువులైనా, ఉద్యోగాలకైనా దీన్నే పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి పాత సర్టిఫికెట్లు చెల్లకపోవడం అంటూ ఉండదు.
ఒకవేళ మీరు తేదీని మార్చుంటే దాన్ని సరిచేసుకోవాలంటే కోర్టు ద్వారా చేసుకోవచ్చు. గతంలో చెప్పినట్టుగా ఉద్యోగాలకు కానీ, రాత పరీక్షలకు కానీ వయఃపరిమితి లేదా రెగ్యులర్‌ చదువు ఉండాలని నోటిఫికేషన్‌లో ఇవ్వనంతవరకూ దూరవిద్య ద్వారా చదివినవారు అన్నింటికీ అర్హులు. ఏపీసెట్‌కు వయఃపరిమితి లేదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా రాయవచ్చు.

బీకాం కంప్యూటర్స్‌ పూర్తిచేశాను. తర్వాత చదవాలంటే ఏ కోర్సులున్నాయి? ఉద్యోగసాధన సులభం కావడానికి ఏ మార్గాలను అనుసరించాలి?

బీకాం తర్వాత ఉన్నత చదువులు చదవడానికి చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ), మాస్టర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎంకాం), మాస్టర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ ఇన్‌ ఫైనాన్స్‌), సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ (సీఎంఏ), సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటింగ్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెంట్స్‌ (ఏసీసీఏ) బిజినెస్‌ అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌ మొదలైన కోర్సులను చదవవచ్చు.
ఉద్యోగసాధన సులభం కావడానికి- కమ్యూనికేషన్‌ నైపుణ్యాలనూ, సబ్జెక్టు పట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వంటి మార్గాలను అనుసరించాలి. విశ్లేషణాత్మక, సమస్యలను సమర్థంగా పరిష్కరించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. వీటితోపాటు బృందంతో కలిసి పనిచేయడం, కంప్యూటర్‌, నిర్వహణలో నేర్పు, ఏదైనా నేర్చుకోగల సామర్థ్యాలను కలిగి ఉండాలి. వీటిని పెంచుకోవటం ద్వారా మంచి ఉద్యోగాన్ని సులభంగా సంపాదించుకోవచ్చు.

మా అబ్బాయి ఇంటర్‌ బైపీసీ చదివాడు. తరువాత బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఇంజినీరింగ్‌ చేయవచ్చా? అది ఏ యూనివర్సిటీలో ఉంది? అర్హతలు అవకాశాలు తెలుపగలరు.

చేయవచ్చు. అయితే మన దేశంలో మెడికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు అతి తక్కువ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ కోర్సును భారతి విద్యాపీఠ్‌ యూనివర్సిటీ (పుణె), ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (చెన్నై) అందిస్తున్నాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బనారస్‌ హిందూ యూనివర్సిటీ) బయో ఇంజినీరింగ్‌ కోర్సును అందిస్తోంది.
ఈ కోర్సును చదవడానికి ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లేదా బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదివి ఉండాలి. ఐఐటీ లాంటి సంస్థలు జేఈఈ ద్వారా, ఇతర విశ్వవిద్యాలయాలు ఆ రాష్ట్ర కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలను కల్పిస్తాయి.
ఈ కోర్సు చదివినవారికి ప్రధానంగా హెల్త్‌కేర్‌, ఫార్మాస్యూటికల్‌, హెల్త్‌కేర్‌ పరికరాల తయారీ రంగంలో ఉద్యోగావకాశాలుంటాయి.
ఈ మెడికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదివినవారికి బయోమెడికల్‌ ఇంజినీర్‌, ల్యాబ్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఎక్విప్‌మెంట్‌ డిజైన్‌ ఇంజినీర్‌ మొదలైన ఉద్యోగావకాశాలు ఉంటాయి.

బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చదివాను. సైబర్‌ భద్రత అంశంలో పీజీ చేయాలనుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కోర్సు చేయాలనుంది. కోర్సు తరువాత ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా సైబర్‌ భద్రత అంశంలో పీజీ కోర్సు అందుబాటులో లేదు. ఎంఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌ అందుబాటులో ఉంది.
కచ్చితంగా సైబర్‌ సెక్యూరిటీ కోర్సు మాత్రమే చేయాలనుకుంటే, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకుని అక్కడ చదవండి. కోరుకున్న విశ్వవిద్యాలయంలోనే చదవాలనుకుంటే, అక్కడ అందుబాటులో ఉన్న కోర్సులను మాత్రమే చదవాల్సి వస్తుంది.
వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా మాత్రమే ప్రవేశాలను కల్పిస్తుంది. ఈ సంవత్సర నోటిఫికేషన్‌ (2017) ఇదివరకే వెలువడింది. ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోండి.
సైబర్‌ భద్రత అంశంలో పీజీ చదివినవారికి కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, కంప్యూటర్‌ సపోర్ట్‌ స్పెషలిస్ట్‌, కంప్యూటర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, సైబర్‌ సెక్యూరిటీ మేనేజర్‌, సైబర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌ మొదలైన ఉద్యోగావకాశాలు ఉంటాయి.

కెమిస్ట్రీ విభాగంలో ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ కాకుండా ఇంకా ఏ కోర్సు మెరుగైంది? ఆ కోర్సు ఎక్కడ అందుబాటులో ఉంది? ఉపాధి అవకాశాలను తెలియజేయండి.

కెమిస్ట్రీ విభాగంలో ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ కాకుండా ఇతర కోర్సులు అప్లైడ్‌ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ; ఇంకా ఫార్మాస్యూటికల్‌, ఇండస్ట్రియల్‌/ అనలిటికల్‌, ఆర్గానిక్‌, ఫిజికల్‌ అండ్‌ మెటీరియల్‌ కెమిస్ట్రీ లాంటి కోర్సులుంటాయి. వీటిలో ఏ కోర్సు మెరుగైందో చెప్పడం కష్టం. ప్రతీదీ దానికంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
చాలా విశ్వవిద్యాలయాల్లో కెమిస్ట్రీకి సంబంధించి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి. ఈ సబ్జెక్టు చదివినవారికి అనేక రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలున్నాయి.
లేబొరేటరీ (మెడికల్‌, టెస్టింగ్‌), ఆయిల్‌, ఫార్మాస్యూటికల్‌, రసాయనాలు, కాస్మొటిక్‌, పరిశోధన, ఆహారం, రసాయనాల తయారీ సంస్థలు, హాస్పిటల్‌ మొదలైనవాటిల్లో ఉద్యోగావకాశాలుంటాయి. భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఇస్రో లాంటి సంస్థల్లోనూ వీరికి ఉద్యోగావకాశాలుంటాయి.

జనరల్‌ బీఈడీ, స్పెషల్‌ బీఈడీ అని రెండు రకాలున్నాయి కదా! స్పెషల్‌ బీఈడీకి సంబంధించిన పుస్తకాలు, మెటీరియల్‌ ఎక్కడ దొరుకుతాయి? స్పెషల్‌ బీఈడీ ముగిశాక ఉద్యోగావకాశాలు ఏం ఉంటాయి? తెలుపగలరు.

మీకు స్పెషల్‌ బీఈడీకి సంబంధించిన పుస్తకాలు, మెటీరియళ్లు మార్కెట్‌లో దొరుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో దొరకలేదనిపిస్తే, ఆన్‌లైన్‌లో ప్రయత్నించండి. తప్పకుండా దొరుకుతాయి. స్పెషల్‌ బీఈడీ చదివినవారు సాధారణంగా స్పీచ్‌ థెరపిస్ట్‌, సైకాలజిస్ట్‌, ఫిజియోథెరపిస్ట్‌లాంటి వారితో పనిచేస్తారు. అంతేకాకుండా పబ్లిక్‌, ప్రైవేటు స్కూళ్లలో వినికిడి, కీళ్లు, దృష్టి సంబంధ లోపాలు, అంధత్వం, మానసిక మాంద్యం, అభ్యాసన లోపాలు, భావోద్వేగ భంగం, మెదడుకు సంబంధించిన లోపాలున్న విద్యార్థులున్న వాటిలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ విధమైన లోపాలున్న విద్యార్థులకు సంప్రదాయ బోధన పద్ధతుల ద్వారా నేర్చుకోవడం వీలుపడదు. కాబట్టి, వీరికి ప్రత్యేక విద్యాశిక్షణ పొందిన సిబ్బంది అవసరం ఉంటుంది.

మా అబ్బాయి సీబీఎస్‌ఈ సిలబస్‌తో పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. ‘ఎ’ గ్రేడ్‌లోనే మార్కులు వస్తుంటాయి. తర్వాత ఇదే సిలబస్‌తో 11, 12 ఎంపీసీలో చేరుద్దామని అనుకుంటున్నాం. ఇది మంచిదేనా? లేదంటే స్టేట్‌ సిలబస్‌తో ఇంటర్‌ చదివించడం మేలా? రెండింటికీ తేడాలేంటి?

మీ అబ్బాయికి మొదట ఏ కోర్సుపై ఆసక్తి ఉందో తెలుసుకోండి. అతని ఆసక్తినిబట్టి కోర్సులో చేర్పించండి. స్టేట్‌ సిలబస్‌, సీబీఎస్‌ఈ రెంటినీ పోలిస్తే సిలబస్‌, ప్రశ్నపత్రం నమూనా మొదలైనవి భిన్నంగా ఉంటాయి. సీబీఎస్‌ఈ సిలబస్‌ మనదేశం మొత్తానికి ఒకేలా ఉంటుంది. కానీ, స్టేట్‌ సిలబస్‌ రాష్ట్రాన్నిబట్టి మారుతుంది. సీబీఎస్‌ఈలో విద్యార్థికి ఆసక్తి ఉన్న సబ్జెక్టు చదవచ్చు. కానీ, స్టేట్‌ బోర్డ్‌లో అన్ని సబ్జెక్టులూ కలిపి చదవాలి. సీబీఎస్‌ఈ సర్టిఫికెట్‌కు విదేశాల్లోనూ గుర్తింపు ఉంటుంది. స్టేట్‌ సిలబస్‌తో పోలిస్తే ఇది కొంచెం కఠినం. మీ అబ్బాయి పదోతరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లోనే చదివాడు కాబట్టి, ఇంటర్‌ కూడా ఇదే సిలబస్‌తో కొనసాగించడం మేలు. పైగా స్టేట్‌ సిలబస్‌ కొంచెం వేరుగా ఉంటుంది; కొంచెం ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. రెండింటిలో ఏది మెరుగో చెప్పలేం. రెండింటికీ వాటిదైన ప్రత్యేకత ఉంటుంది. ఒకవేళ మీ అబ్బాయి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే సీబీఎస్‌ఈ తోడ్పడుతుంది. మన రాష్ట్రంలో చదవాలనుకుంటే స్టేట్‌ సిలబస్‌ను ఎంచుకోవచ్చు.

తెలుగు మీడియంలో పదో తరగతి చదువుతున్నాను. వ్యవసాయ రంగంలో ఉన్నతవిద్యను అభ్యసించాలనుంది. అగ్రి బీఎస్‌సీ చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్‌ పూర్తిచేయాల్సిందేనా? అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ చేస్తే ఎలా ఉంటుంది?

మనదేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది కదా? దానికి తోడ్పడే అగ్రికల్చర్‌ కోర్సు చేయాలనుకోవడం అభినందనీయం. మీరు వ్యవసాయ రంగంలో ఉన్నతవిద్యను అభ్యసించాలంటే మొదట అగ్రికల్చర్‌లో ఏ కోర్సు చేయాలో స్పష్టంగా నిర్ణయించుకోండి. ఒకవేళ మీరు బీఎస్‌సీ అగ్రికల్చర్‌ చదవాలంటే ఇంటర్‌ తప్పనిసరిగా చదవాలి. తర్వాత ఎంసెట్‌ రాసి, బీఎస్‌సీ అగ్రికల్చర్‌లో ప్రవేశం పొందవచ్చు. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ చదివితే, తర్వాత బీఎస్‌సీ (అగ్రికల్చర్‌) చేసి, ఉన్నత చదువులు కొనసాగించవచ్చు. ఇంటర్మీడియట్‌ చేసిన తర్వాత అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉంటే, బీటెక్‌ (అగ్రికల్చర్‌) తర్వాత ఎంటెక్‌ చదివి, పీహెచ్‌డీ చేయవచ్చు.

పదో తరగతి చదివాక, అనివార్య కారణాలవల్ల ఇంటర్‌ మధ్యలోనే ఆపేశాను. 2012లో పోటీపరీక్ష రాసి, వీఆర్‌ఏగా ఎంపికై ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ తరువాత గ్రూప్‌-2 పరీక్ష రాయడానికి నేను అర్హుడినేనా? కౌన్సెలింగ్‌ సమయంలో ఇంటర్‌ సర్టిఫికెట్లు అడుగుతారా? ఇతర బ్యాంకు పరీక్షలను రాయడానికి నాకు అర్హత ఉంటుందా?

గ్రూప్‌-2 పరీక్షలో వివిధ రకాల పోస్టులకు, వాటికి తగిన విద్యార్హతలను అడుగుతున్నారు. కాబట్టి, మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగిన విద్యార్హతలు ఉన్నాయో, లేవో చూసుకోండి. ఒకవేళ నోటిఫికేషన్‌లో ఇంటర్మీడియట్‌ అర్హత ఉండాలని ఇస్తే, ఆ పరీక్ష రాయడానికి మీకు అర్హత ఉండదు. లేకపోతే మీరు రాయవచ్చు. కౌన్సెలింగ్‌ సమయంలో విద్యార్హతలు పరిశీలించేటప్పుడు ఒకవేళ ఆ ఉద్యోగానికి ఇంటర్మీడియట్‌ అవసరం ఉన్నట్లయితే, సర్టిఫికెట్లు అడుగుతారు. ఇతర బ్యాంకు పరీక్షల విషయంలో కూడా నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతల ప్రకారం మీకు దాన్ని రాయడానికి అర్హత ఉందో లేదో తెలుస్తుంది. నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ అర్హత అడగకపోతే మీరు బ్యాంకింగ్‌ పరీక్షలు రాయవచ్చు.

ఓపెన్‌ ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌) చేస్తున్నాను. నా మొదటి సంవత్సరం పరీక్ష మేలో పూర్తవుతుంది. జూన్‌లో జరిగే నెట్‌ పరీక్షను నేను రాయవచ్చా? జేఆర్‌ఎఫ్‌ వచ్చాక సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసుకోవచ్చా? రెగ్యులర్‌ వారికీ, మాకూ ఉద్యోగావకాశాల్లో తేడా చూపిస్తారా?

ప్రస్తుతం నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌)ను సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) వారు నిర్వహిస్తున్నారు. వారి నిబంధనల ప్రకారం నెట్‌ రాసే అభ్యర్థి తుది సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా చివరి సంవత్సరం పూర్తయి ఉండాలి. మీరు ఇప్పుడు మొదటి సంవత్సరం చదువుతున్నారు కాబట్టి, సీబీఎస్‌సీ నిబంధనల ప్రకారం మీరు నెట్‌ను రాయడానికి అనర్హులు. మీరు మీ రెండో సంవత్సరంలోకానీ, రెండో సంవత్సరం పూర్తయిన తరువాత కానీ రాయవచ్చు. జేఆర్‌ఎఫ్‌ వచ్చాక సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసుకోవచ్చు. రెగ్యులర్‌ వారికీ, మీకూ ఉద్యోగావకాశాల్లో ఎలాంటి తేడా ఉండదు. మీరు పట్టుదలతో ప్రయత్నించండి, తప్పకుండా జేఆర్‌ఎఫ్‌ వస్తుంది.

ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇస్రోలో చేరాలని ఆసక్తి. దానికి ఏ ప్రవేశపరీక్ష రాయాలి? ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ చేయాలని అనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఏ కళాశాలలోనైనా ఈ బ్రాంచి ఉందా?

ఇస్రోలో చేరాలన్న మీ ఆసక్తి అభినందనీయం. ప్రతి సంవత్సరం ఇస్రో సెంట్రలైజ్‌డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) వారు రాతపరీక్ష నిర్వహిస్తారు. దాదాపు అన్ని బ్రాంచిలవారూ ఈ పరీక్షను రాయవచ్చు. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచి మన తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏరోక్రాఫ్ట్‌ ఇంజినీరింగ్‌, హైదరాబాద్‌ గీతం యూనివర్సిటీలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

నేను బీఏ, ఎంఏ (తెలుగు)ను దూరవిద్యలో చదివాను. బీఈడీని రెగ్యులర్‌ పద్ధతిలో పూర్తిచేశాను. టీచర్‌, వార్డెన్‌, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా?
నా పేరు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్లలో తప్పుగా పడింది. వాటిలో నా పేరును సరిచేసుకోవడానికి వీలవుతుందా?

సాధారణంగా టీచర్‌, జూనియర్‌ లెక్చరర్‌, వార్డెన్‌ వంటి పోస్టులకు దూరవిద్య ద్వారా చదివినప్పటికీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ నోటిఫికేషన్‌లో రెగ్యులర్‌ డిగ్రీ, పీజీ చదివినవారే అర్హులు అని ఇస్తే మాత్రం మీకు అవకాశం ఉండదు. నోటిఫికేషన్‌లో ప్రస్తావించకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. పది, ఇంటర్‌ సర్టిఫికెట్లలో తప్పుగా ప్రింట్‌ అయిన మీ పేరును సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ పాఠశాల ఉపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్‌ను సంప్రదించి వివరాలను అడగండి. వారి సూచనల ప్రకారం పాఠశాల/ కళాశాల బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే వారు సరిచేసే అవకాశం ఉంది.

మాది మధ్యతరగతి కుటుంబం. పిల్లల చదువుల విషయంలో మీ సలహా కోరుతున్నా. పెద్దబ్బాయి డిగ్రీ ఫైనలియర్‌ (కెమిస్ట్రీ- కంప్యూటర్‌) చదువుతున్నాడు. 80 శాతం మార్కులు వస్తాయి. తనను వచ్చే ఏడాది ఏం చదివించాలో తెలియటం లేదు. లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌లో పెట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించడం; సీఏ, ఎంసీఏ, ఎంబీఏ లాంటి కోర్సులు చదివించడం... ఏది మెరుగు? రెండో అబ్బాయి ఇంటర్‌ ఎంపీసీ రెండో సంవత్సరంలో ఉన్నాడు. 60 శాతం మార్కులు వస్తాయి. లెక్కల్లో డల్‌ అని చెప్పాలి. తనకు ఏ కోర్సులు మంచివో తెలుపగలరు.

ఏ కోర్సుకైనా తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఏది చదివినా ఆసక్తితో దానిలో పరిజ్ఞానం, నైపుణ్యం పెంచుకోవాలే గానీ ఉద్యోగావకాశాలకు లోటు ఉండదు. కాబట్టి మీ అబ్బాయిలకు ఏ కోర్సు పట్ల ఆసక్తి ఉందో, వారి సామర్థ్యాలేమిటో తెలుసుకుని తగిన కోర్సులో చేర్పించటమే సరైన పని. పెద్దబ్బాయి ఎలాగూ మంచి మార్కులు సాధిస్తున్నందున తర్వాతికాలంలో ఉపాధికి సమస్య ఉండదు. రెండో అబ్బాయి లెక్కలంటే అంత ఆసక్తి చూపించడంలేదు కాబట్టి ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ లాంటివి- ఒకవేళ తనకు ఆసక్తి ఉంటే చదివించవచ్చు. తన సామర్థ్యానికి కష్టంగా అనిపిస్తే గణితం లేని కోర్సులు కూడా చాలా ఉన్నాయి. ఏ కోర్సు మెరుగు అనేది విద్యార్థి ఆసక్తీ, అభిరుచులతో సంబంధం లేకుండా చెప్పడం కష్టం. ఎవరో చెప్పారనో, ఎవరో చదువుతున్నారనో కాకుండా విద్యార్థులకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవటం సమంజసం. దానిలో కృషి చేసి వారు తప్పకుండా రాణించగలుగుతారు.

భారతీయ సంగీతంలో డిప్లొమా/డిగ్రీ/సర్టిఫికెట్‌ కోర్సును అందించే విద్యాసంస్థలు ఏమిటి? ప్రవేశ విధానం ఎలా ఉంటుంది? టెక్నికల్‌ టీచర్‌ సర్టిఫికెట్‌ పొందే విధానం గురించి తెలపండి.

మన తెలుగు రాష్ట్రాల్లో సంగీతంలో డిప్లొమా/డిగ్రీ/ సర్టిఫికెట్‌ కోర్సులను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర మహిళాసభ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ మీడియా, ఎం.ఆర్‌. గవర్నమెంట్‌ మ్యూజిక్‌ కాలేజ్‌ (విజయనగరం) మొదలైన విద్యాసంస్థలు అందిస్తున్నాయి. చెన్నైలోని తమిళనాడు మ్యూజిక్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీలో కూడా డిప్లొమా/డిగ్రీ (మ్యూజిక్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశవిధానం ఒక్కో విద్యాసంస్థలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని కళాశాలలు ప్రవేశపరీక్ష ద్వారా; మరికొన్ని ప్రవేశపరీక్షా, మౌఖిక పరీక్షా ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఎం.ఎ. మ్యూజిక్‌ చదవడానికి బి.ఎ. మ్యూజిక్‌ తప్పనిసరిగా చదివివుండాలి. టెక్నికల్‌ టీచర్‌ సర్టిఫికెట్‌ 42 రోజుల కోర్సు. ఈ కోర్సు చదవడానికి వయసు 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌తో పాటు లోయర్‌ గ్రేడ్‌ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీసీసీ) చదివివుండాలి. కర్ణాటక/హిందుస్థానీ వోకల్‌ సర్టిఫికెట్‌ ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈ సంగీత రీతురల్లో ప్రవేశం ఇస్తారు.

నేను బీఎస్‌సీ ఫైనలియర్‌ చదువుతున్నాను. ఈ డిగ్రీ తర్వాత అగ్రికల్చర్‌ కోర్సు చేయవచ్చా?

అగ్రికల్చర్‌ కోర్సు చదవడానికి ఎంసెట్‌ రాయాల్సివుంటుంది. మీరు మీ డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంసెట్‌ రాసి అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాన్ని పొందవచ్చు. మీరు బీఎస్‌సీ ఏ కోర్సు చదువుతున్నారో తెలుపలేదు. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/మేథమేటిక్స్‌ చదివినవారు ఎంసెట్‌ రాయడానికి అర్హులు.

బీఎస్‌సీ (కెమిస్ట్రీ) పూర్తిచేశాను. ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ చేయాలనుంది. ఈ కోర్సు ఎలా ఉంటుంది? దీన్ని అందించే విద్యాసంస్థలు ఎక్కడున్నాయి? ఉద్యోగావకాశాలు ఎక్కడ ఉంటాయి?

ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలుంటాయి. ఈ కోర్సు చదివితే ప్రభుత్వ రంగంలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలల్లో, పోలీసు విభాగాలు, క్రైమ్‌ బ్రాంచిలు, సీబీఐ, బ్యాంకులు, రక్షణరంగం, ఆస్పత్రులు, నేర పరిశోధన విభాగాల్లో పనిచేయటానికి వీలుంటుంది. ప్రైవేటు రంగంలో డిటెక్టివ్‌ ఏజెన్సీలు, ప్రైవేటు బ్యాంకులు, బీమా కంపెనీలు, సెక్యూరిటీ సర్వీసెస్‌ ఏజెన్సీల్లో కూడా అవకాశాలుంటాయి. ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ చదివినవారు దర్యాప్తు అధికారి, లీగల్‌ కౌన్సెలర్‌, ఫోరెన్సిక్‌ సైంటిస్ట్‌, క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేటర్‌, అధ్యాపకుడు, క్రైమ్‌ రిపోర్టర్‌, డిటెక్టివ్‌, ఫోరెన్సిక్‌ మెడికల్‌ ఎగ్జామినర్‌ మొదలైన హోదాల్లో పనిచేయగలిగే వీలుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉస్మానియా ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సును అందిస్తోంది. దేశంలో తక్కువ యూనివర్సిటీల్లోనే ఈ కోర్సును బోధిస్తున్నారు.

నేను ఇంటర్‌ (సీఈసీ గ్రూప్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. తర్వాత ఏర్‌ స్టివర్డ్‌/ స్టువర్డ్‌ శిక్షణ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ కోర్సుకు ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి? కొన్ని కళాశాలలు శిక్షణ తర్వాత వారే 100 శాతం జాబ్‌ గ్యారంటీ ఇస్తామంటున్నారు. ఇది వాస్తవమేనా?

ఏర్‌ స్టివర్డ్‌ అనేది విభిన్నమైన కోర్సు. ప్రతి కోర్సుకూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీకు ఆ కోర్సు పట్ల ఆసక్తీ, శ్రద్ధా ఉన్నట్లయితే తప్పకుండా ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా కళాశాలలు శిక్షణ తర్వాత వంద శాతం జాబ్‌ గ్యారంటీ అనే ప్రకటనలు ఇస్తున్నాయి. కానీ అది చాలావరకూ అవాస్తవమేనని చెప్పాలి. నిరుద్యోగులను ఆకట్టుకోవటం కోసం ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటారు. ఉద్యోగం సంపాదించటం అనేది అభ్యర్థికి ఉన్న నైపుణ్యాలపై ఆధారపడివుంటుంది. ఈ కోర్సుపై నిజంగా ఆసక్తి ఉంటే ప్రభుత్వ ఆమోదం పొందిన కళాశాలలో చేరండి. మీ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటానికి పట్టుదలగా శిక్షణ పొందారంటే ఉపాధికి కొరతేమీ ఉండదు.

రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐఈ)లో బి.ఇడి చేయాలని ఉంది. దీని ప్రవేశాల ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది? మనదేశంలో ఆర్‌ఐఈ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?.

రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో బి.ఇడి చేయాలనే మీ ఆకాంక్ష అభినందనీయం. మనదేశంలో ఆర్‌ఐఈ కేంద్రాలు ప్రధానంగా అజ్మీర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, మైసూర్‌లలో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఇన్‌ సర్వీస్‌, ప్రీ సర్వీస్‌ వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తారు. వీటితో పాటు నార్త్‌ఈస్ట్‌ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (షిల్లాంగ్‌)లో ఇన్‌సర్వీస్‌ ప్రోగ్రాములు అందుబాటులో ఉంటాయి. ఆర్‌ఐఈ ప్రవేశాల ప్రకటన ఫిబ్రవరి/మార్చి నెలల్లో వెలువడుతుంది. మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

అగ్రికల్చర్‌ డిప్లొమా చేశాను. కారణాంతరాల వల్ల బీఎస్‌సీ (అగ్రికల్చర్‌) చేయలేకపోయాను. అగ్రి డిప్లొమా ఇంటర్‌తో సమానమేనా? నేను గ్రూప్‌-4, కానిస్టేబుల్‌, సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ లాంటి పరీక్షలకు అర్హుడనేనా?మా డిప్లొమా వారికి ఏఈఓ కాకుండా వేరే ఏవైనా ఉద్యోగావకాశాలున్నాయా?

అన్ని డిప్లొమాలూ ఇంటర్‌తో సమానం కావు. అయితే ఇటీవల మూడు సంవత్సరాల పాలిటెక్నిక్‌ డిప్లొమా చదివినవారికి ఇంటర్మీడియట్‌తో సమానంగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అర్హత కల్పించారు. రెండు సంవత్సరాల అగ్రికల్చర్‌ డిప్లొమా ఇంటర్‌తో సమానమో, కాదో అనే విషయంలో స్పష్టత లేదు. గ్రూప్‌-4 లాంటి పరీక్షల్లో కొన్ని ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌ అర్హతనూ, కొన్ని ఉద్యోగాలకు పదో తరగతి అర్హతనూ అడుగుతుంటారు. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ అర్హత ఉండాలని అడిగినట్లయితే ఆ ఉద్యోగాలకు మీకు అర్హత ఉండదు.
అప్పుడు మీరు పదో తరగతి అర్హతతో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ లాంటి పరీక్షలకు పదో తరగతి అర్హతతో కూడా పోటీపడవచ్చు.
చి అగ్రికల్చర్‌ డిప్లొమా చదివినవారికి అగ్రికల్చర్‌ ప్రొడక్ట్స్‌ సేల్స్‌మెన్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌, రీజనల్‌ సర్వీస్‌ మేనేజర్‌, కౌంటర్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌... మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి. నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, స్టేట్‌ ఫార్మ్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ లాంటి ప్రభుత్వ సంస్థల్లో కూడా ఉద్యోగావకాశాలుంటాయి.

ఎంఏ ఆర్థికశాస్త్రం చదివినవారికి ఏయే రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి? వీరికి స్వయం ఉపాధి పొందే స్వల్పకాలిక కోర్సులు ఏమైనా ఉంటే తెలియజేయండి.

ఎంఏ ఆర్థికశాస్త్రం చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉదోగాలైన ఎకనమిక్‌ ప్లానింగ్‌, అనాలిసిస్‌, రక్షణ, రైల్వే, బ్యాంకింగ్‌, విద్య మొదలైన రంగాల్లో ఆర్థికశాస్త్రం చదివినవారికి అవకాశాలుంటాయి. స్వల్పకాలిక కోర్సులు కూడా వివిధ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.
ఐఐఎఫ్‌ఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫైనాన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) వంటి సంస్థల్లో సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా డిప్లొమా ఇన్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు కూడా ఉన్నాయి. వీటితోపాటు సర్టిఫికెట్‌ ఇన్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కోర్సులు పరిశీలించవచ్చు. ఈ విధమైన స్వల్పకాలిక కోర్సులు చేయడం వల్ల కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది.

బీఎస్‌సీ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. డైట్‌ పూర్తిచేశాను. నాకు గురుకుల కొలువులో అవకాశం ఉందా? నాకు సైకాలజిస్ట్‌ కావాలని ఆసక్తి. ఈ కోర్సుకు అర్హతలేమిటి? సైకాలజీలో పీహెచ్‌డీ చేయాలంటే నెట్‌ అవసరమా?

మీకు గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగావకాశం ఉంటుంది. అయితే టెట్‌లో వచ్చిన మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి మీరు టెట్‌ రాసుంటే మీకు అర్హత ఉన్నట్లే.
మీకు సైకాలజిస్ట్‌ కావాలని ఆసక్తి ఉందన్నారు. కాబట్టి ముందు మీకు దేనిపై ఆసక్తి ఉందో, దానిపైనే శ్రద్ధ వహించండి. రెండింటిపైనా దృష్టిసారిస్తే ఇబ్బందిపడతారు. సైకాలజీపై దృష్టి పెట్టాలనుకుంటే, డిగ్రీ పూర్తయిన తరువాత మళ్లీ బీఎస్‌సీ లేదా బీఏ- సైకాలజీ చదివి, పీజీ సైకాలజీ చదవాల్సి ఉంటుంది. ఆ తరువాత పీహెచ్‌డీ చేయవచ్చు. అయితే, కొన్ని విశ్వవిద్యాలయాలు ఇందుకు నెట్‌ను తప్పనిసరి చేశాయి. మరికొన్ని వాటి ప్రత్యేక పరీక్ష విధానం ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. మీరు అధ్యాపక వృత్తిని కెరియర్‌గా ఎంచుకుంటే, తప్పనిసరిగా నెట్‌ రాయాల్సి ఉంటుంది. పీహెచ్‌డీ కోసం మాత్రమే అయితే, అది యూనివర్సిటీ ప్రవేశవిధానంపై ఆధారపడి ఉంటుంది.

ఈసీఈ బ్రాంచితో 2012లో డిప్లొమా పూర్తిచేశాను. వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌లో గతంలో ప్రాజెక్టు చేశాను. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నాను. నాకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలని కోరిక. కోర్సు పూర్తయిన వెంటనే డిప్లొమా మీదనే ఉద్యోగం దొరుకుతుందా? నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని కావాలంటే ఏం చేయాలి?

కోర్సు పూర్తయిన వెంటనే డిప్లొమా మీద ఉద్యోగం చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కానీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. మొదట మీకు ఏ విభాగంలో ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉందో స్పష్టతను ఏర్పరచుకోండి. దాని ప్రకారం ముందుకు వెళ్లండి. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కావాలనుకుంటే, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, సీ, సీ++, జావా మొదలైనవాటిపై పట్టు సాధించాల్సి ఉంటుంది.
కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలనుకుంటే, వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌ కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. అయితే డిప్లొమా తర్వాత కంటే, ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగానికి ప్రయత్నించడం మేలు. దానివల్ల మీకు జీతభత్యాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కెరియర్‌లోనూ ఉన్నతిని సాధించవచ్చు. కాబట్టి చదువును ఇంతటితో ఆపేయకుండా, కొనసాగించడానికి ప్రయత్నించండి.

నేను 2014లో బీఏ డిగ్రీ పూర్తిచేశాను. గత రెండు సంవత్సరాలుగా ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ రిసెప్షన్‌లో పని చేస్తున్నాను. ఈ ఉద్యోగం కొనసాగిస్తూ, ఏదైనా దూరవిద్య అభ్యసించడానికి సూచనలు ఇవ్వగలరు. టీవీ జర్నలిజం, ట్రావెల్స్‌- టూరిజం కోర్సులకు నేను అర్హుడినేనా?

దూరవిద్య ద్వారా కంటే, రెగ్యులర్‌గా చదవడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండి, చదువుపట్ల ఆసక్తి ఉంటే రెగ్యులర్‌ విధానానికే ప్రయత్నించండి. ఏ కోర్సు చదవాలనే నిర్ణయం మీకున్న సామర్థ్యం, నైపుణ్యాలనుబట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరో చెప్పారనో, ఇంకెవరో చదువుతున్నారనో కాకుండా ఆసక్తిని బట్టి ఎంచుకుంటే దానిలో రాణించగలుగుతారు.
టీవీ జర్నలిజంలాంటి కోర్సులు చదవడానికి ఏదైనా డిగ్రీ ఉన్నవారు అర్హులు. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలు బీఏ జర్నలిజం లేదా మాస్‌ కమ్యూనికేషన్‌ లాంటి కోర్సులు చదివినవారికే ప్రవేశాలను కల్పిస్తున్నాయి. ట్రావెల్స్‌-టూరిజం కోర్సులకు ఇంటర్మీడియట్‌లో ఏ కోర్సు చదివినవారికైనా అర్హత ఉంటుంది. డిగ్రీలో బీఏ టూరిజం, బీఎస్‌సీ ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ లాంటివి చదివినవారికే పీజీ ట్రావెల్స్‌ అండ్‌ టూరిజం చదవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఎంబీఏ ట్రావెల్స్‌ అండ్‌ టూరిజం కోర్సును కూడా ఎంచుకోవచ్చు.

ఓయూ క్యాంపస్‌లో ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ విత్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివాను. డిగ్రీ.. బీఎస్‌సీ (ఎంపీసీ), బీఈడీ పూర్తిచేశాను. గురుకులంలో పీజీటీ పోస్టుకు అర్హత ఉంటుందా? నాకు బోధన ఇష్టం. నా కోర్సుకు ఉన్న అవకాశాలు తెలుపగలరు.

అందరూ కంప్యూటర్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బోధన రంగంపై ఆసక్తి చూపుతున్నందుకు అభినందనలు. మీరు నెట్‌/సెట్‌ ఉత్తీర్ణులైతే డిగ్రీ కళాశాల అధ్యాపక ఉద్యోగాలకు అర్హులవుతారు. ఎమ్మెస్సీతో జేఎల్‌ ఉద్యోగాలకు అర్హులు. ఎమ్మెస్సీ, బీఈలతో పీజీటీకి అర్హత ఉంటుంది. మీ కోర్సు సిలబస్‌ను గమనిస్తే... సగం సిలబస్‌ మ్యాథ్స్‌, మిగతా కంప్యూటర్‌ సైన్స్‌ల కలయికతో ఉంది. మీ కోర్సు చదివినవారు మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌.. రెండిటినీ బోధించగలరు. గురుకుల కళాశాలల్లో కంప్యూటర్‌ సబ్జెక్టును కూడా బోధిస్తారు. కాబట్టి మీరు రాతపరీక్షలో ఉత్తీర్ణులైతే ఇంటర్వ్యూలో ఉద్యోగం పొందే అవకాశాలుంటాయి.

ఇంటర్‌ ఎంపీసీ సెకండియర్‌ చదువుతున్నాను. జీఈఈ మెయిన్‌ పరీక్ష రాస్తే దాని ద్వారా ఉద్యోగావకాశాలుంటాయా? ఎంసెట్‌ ద్వారా చేరే ఇంజినీరింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగం త్వరగా రావాలంటే ఈఈఈ, ఈసీఈ, సివిల్‌ బ్రాంచిల్లో ఏది తీసుకుంటే మంచిది?

జేఈఈ మెయిన్‌ పరీక్ష ఉద్యోగాల కోసం కాదు. దీని ద్వారా ఎన్‌ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. పేరున్న సంస్థల్లో చదివితే నిష్ణాతుల బోధన వల్ల విషయ పరిజ్ఞానం మెరుగవుతుంది. అక్కడ ప్రాంగణ నియామకాలు ఎక్కువగా ఉంటాయి. జేఈఈ మెయిన్‌ స్కోరు ద్వారా జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందితే భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాల విద్యార్థుల పరిచయాలతో వ్యక్తిత్వం, భావ ప్రకటన సామర్థ్యం మెరుగవుతాయి. ఉన్నత విద్య పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఎంసెట్‌ ద్వారా అయితే ఇంజినీరింగ్‌ను మన తెలుగు రాష్ట్రాల్లోనే చదవొచ్చు. అధ్యాపకులు, సహ విద్యార్థులు కూడా మన ప్రాంతం వారే అయివుంటారు కాబట్టి ఆంగ్లభాషలో సామర్థ్యం పెరిగే అవకాశం తక్కువ. ఎంసెట్‌ ద్వారా ప్రవేశం కల్పించే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో కొద్దికళాశాలల్లోనే మెరుగైన బోధన, ప్రయోగశాలలు ఉన్నాయి. అందుకని ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటే మంచి ర్యాంకుతో, మంచి కాలేజీలో ప్రవేశం పొందే ప్రయత్నం చేయండి.
ఏ బ్రాంచి మెరుగైనదో విద్యార్థి అభిరుచి, ఆసక్తులతో సంబంధం లేకుండా చెప్పడం చాలా కష్టం. ఇంజినీరింగ్‌ పూర్తిచేసేనాటికి ఉండే మార్కెట్‌ అవకాశాలు, సాంకేతిక అవసరాలు లాంటి ఎన్నో విషయాలు ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ఇవెలా ఉన్నా విద్యార్థిలో కష్టపడే తత్వం, విషయ పరిజ్ఞానం, భావ ప్రకటన సామర్థ్యం, సమస్యా పరిష్కార లక్షణాలు, ఆత్మవిశ్వాసం మొదలైనవి చాలా ముఖ్యం. కాబట్టి ఉద్యోగం కోసం కాకుండా పరిజ్ఞానం పెంచుకోవడం కోసం కోర్సును అభ్యసించాలి. అప్పుడే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది.

2017-18 విద్యాసంవత్సరానికి హైదరాబాద్‌లో ఐఎఫ్‌ఎల్‌యూ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల పీజీ నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి?

* విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్లు వాటి ప్రవేశ విధానాన్ని బట్టి ఉంటాయి. కొన్ని కేవలం రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. మరికొన్ని రాతపరీక్షతో పాటుగా ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ లాంటి పరీక్షల ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తాయి. కాబట్టి కొన్ని ముందుగా ప్రకటన విడుదల చేస్తే కొన్ని ఆలస్యంగా విడుదల చేస్తాయి.
* హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ యూనివర్సిటీలో పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌ ఏప్రిల్‌/మే నెలల్లో వెలువడుతుంటుంది. ప్రత్యేక రాతపరీక్ష ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు.
* హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీజీ కోర్సులకు ఏప్రిల్‌లో ప్రకటన విడుదల చేస్తుంది. వీరు కూడా రాతపరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఎంబీఏ కోర్సుకు 2017-18 ప్రవేశాల కోసం ఈ ఏడాది సెప్టెంబరులోనే ప్రకటన వెలువడింది. ఈ కోర్సు చదవాలనుకునేవారికి క్యాట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. క్యాట్‌ స్కోరుతో పాటు గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

బీకాం (జనరల్‌) చదివాను. జూనియర్‌/సీనియర్‌ అకౌంటెంట్‌ లాంటి ప్రభుత్వోద్యోగాల కోసం సిద్ధమవుతున్నాను. ఈ మధ్య ఏ పోటీపరీక్షకైనా బీకాం కంప్యూటర్స్‌ వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలినవారు వ్యాలిడ్‌ కంప్యూటర్‌ కోర్సు నేర్చుకున్నట్లు సర్టిఫికెట్‌ ఉండాలని అడుగుతున్నారు. ఎంఎస్‌ ఆఫీస్‌, టాలీ లాంటి కోర్సులను ఎక్కడ నేర్చుకోవాలి?

ప్రతి పనికీ కంప్యూటర్‌పైన ఆధారపడుతున్న ఈ రోజుల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానం అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రైవేటు రంగంలోనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ప్రజలకు వివిధ సేవలను అందించటానికి కంప్యూటర్‌ వినియోగం ఎక్కువైంది. అన్ని రంగాల్లోనూ దీని అవసరం అనివార్యమయింది. కాబట్టి మీరు కూడా మీ చదువుకూ, ఉద్యోగానికీ సంబంధించిన కంప్యూటర్‌ కోర్సును నేర్చుకోవడం మంచిది.
చాలావరకూ ప్రైవేటు సంస్థలు వివిధ రకాల కంప్యూటర్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఏదైనా సంస్థలో టాలీ లాంటి కోర్సు అందుబాటులో ఉంటే మీరు అక్కడ నేర్చుకోవచ్చు. ప్రభుత్వం కూడా అందరికీ కంప్యూటర్‌ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా కోర్సులను అందిస్తోంది. ఉపాధిని కల్పించడానికి వివిధ రకాల కంప్యూటర్‌ కోర్సుల్లో శిక్షణ కోర్సులు నడుపుతోంది. మీకు దగ్గర్లో నాణ్యమైన శిక్షణను ఇచ్చే ఇలాంటి కేంద్రాలుంటే దానికి దరఖాస్తు చేసుకుని చేరవచ్చు.

ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాను. నాకు విదేశీ భాషలంటే ఇష్టం రోజురోజుకీ ఎక్కువైపోతోంది. దీంతో నా కోర్సుపై శ్రద్ధ చూపించలేకపోతున్నా. ఫారిన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకోవడానికి ఏం చేయాలి?

మీ ఆసక్తి అభినందనీయం. అలాగని మీరు చదువుతున్న కోర్సును అశ్రద్ధ చేయడం సరైన పని కాదు. మీరు మొదట ఇంటర్మీడియట్‌ను శ్రద్ధగా చదివి పూర్తిచేయండి. ఎందుకంటే విదేశీభాషలు నేర్చుకోవడానికి 10+2 తప్పనిసరిగా చదివివుండాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (EFLU) లో విదేశీ భాషలు అందుబాటులో ఉన్నాయి.
వీరు స్వల్పకాలిక కోర్సులను కూడా అందిస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా డిగ్రీ చదువుతూ కూడా విదేశీ భాషలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. బహుళజాతి సంస్థలు కూడా విదేశీభాషలు తెలిసినవారికి ప్రాముఖ్యం ఇస్తున్నాయి. మీ ఉద్యోగానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు విదేశీభాషలను కెరియర్‌గా ఎంచుకోదలిస్తే పూర్తికాలపు కోర్సులను చేయవచ్చు. ఇతర రాష్ట్రాల్లో కూడా విదేశీ భాషలు అందించే విద్యాసంస్థలు ఉన్నాయి.

స్పెషల్‌ బీఈడీ చేయాలనుకుంటున్నాను. ఇలా చేసినవారు గురుకులాల్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు అర్హులేనా?

సాధారణంగా టీజీటీ (ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌) పోస్టులకు బాచిలర్‌ డిగ్రీ, బీఎడ్‌ చేసినవారు అర్హులు. అదేవిధంగా పీజీటీ పోస్టులకు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, బీఈడీలో అదే సబ్జెక్టును మెథడాలజీగా చదివినవారు అర్హులు. బీఈడీలో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చదవాలనుకుంటే, మీ బీఈడీ డిగ్రీ మీ బాచిలర్‌/ పీజీ సబ్జెక్టుకు సంబంధించినదై ఉండాలి. అప్పుడే పీజీటీ, టీజీటీ పోస్టులకు అర్హత ఉంటుంది. అలా లేకపోతే మీ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరు.
చాలా గురుకులాల్లో శారీరక, మానసిక లోపం ఉన్న విద్యార్థులకోసం ప్రత్యేకంగా విద్యాబోధన ఉండకపోవచ్చు. కాబట్టి స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చదివినవారికి గురుకులాల్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు కూడా తక్కువ అవకాశం ఉంటుంది.
అందుకని స్పెషల్‌ బీఈడీ చేసినవారికి భారత్‌లో ప్రత్యేకంగా మానసిక, శారీరకలోపం గల విద్యార్థుల కోసం స్థాపించిన విద్యాసంస్థల్లో బోధించే అవకాశం ఉంటుంది. లేదా కొన్ని విద్యాసంస్థల్లో స్పెషల్‌ బీఈడీ వాళ్ల కోసం కూడా ప్రత్యేకంగా ఉద్యోగావకాశాలు ఉండవచ్చు.

ఎంఏ (సోషల్‌) చేశాను. నెట్‌- జేఆర్‌ఎఫ్‌ రాయాలనుకుంటున్నాను. వివరాలను తెలియజేయండి. నేను డీఎస్‌సీలో భాషా పండిట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హుడినేనా? నాకున్న ఉద్యోగావకాశాలను తెలపండి.

నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను సంవత్సరంలో రెండుసార్లు నిర్వహిస్తారు. జులై, డిసెంబరు నెలల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయడానికి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివి ఉండాలి. మరిన్ని వివరాలకు cbsenet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
భాషా పండిట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి సంబంధిత సబ్జెక్టులో పీజీ/ బాచిలర్‌ డిగ్రీలో ఆ సబ్జెక్టులను కోర్‌ సబ్జెక్టుగా కలిగివుండి, బీఎడ్‌ (బాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌)లో అదే సబ్జెక్టును మెథడాలజీగా చదివి ఉండాలి. భాషా పండిట్‌ పోస్టుకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి డిగ్రీలో తెలుగు/ హిందీ/ ఇంగ్లిష్‌ మొదలైన భాషలను కోర్‌ సబ్జెక్టులుగా చదివుండాలి. లేదా పీజీలో తెలుగు/ హిందీ/ ఇంగ్లిష్‌ చదివుండాలి. దాంతోపాటు బీఎడ్‌లో మెథడాలజీగానూ చదివివుండాలి. అప్పుడే భాషా పండిట్‌ పోస్టులకు అర్హత ఉంటుంది.
మీరు స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌ స్టడీస్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే, బీఎడ్‌లో సోషల్‌ స్టడీస్‌కు సంబంధించిన సబ్జెక్టులను మెథడాలజీగా చదివితే అర్హత సంపాదించినట్లే.

బీఎస్‌సీ (బీజెడ్‌సీ) చివరి సంవత్సరం చదువుతున్నాను. లా కోర్సు చేయాలని ఉంది. నేను అర్హుడినేనా? అర్హత ఉంటే, దేనిని ఎంచుకుంటే మేలు?

మీరు లా కోర్సు చేయవచ్చు. ఎల్‌ఎల్‌బీ (బాచిలర్‌ ఆఫ్‌ లా) చదవడానికి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. కాబట్టి మీరు బీఎస్‌సీ పూర్తయిన తరువాత ఎల్‌ఎల్‌బీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుకు లాసెట్‌ (కామన్‌ లా ఎంట్రన్స్‌ టెస్ట్‌) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. తరువాత పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో స్పెషలైజేషన్లు ఉంటాయి. ఎల్‌ఎల్‌బీ పూర్తయిన తరువాత ఉన్నత చదువులు కొనసాగించాలనుకుంటే ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్స్‌ ఆఫ్‌ లా)లో ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు.
ఎల్‌ఎల్‌ఎంలో కాన్‌స్టిట్యూషన్‌ లా, మర్కంటైల్‌లా, లేబర్‌ లా, పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, క్రైమ్స్‌ అండ్‌ లార్డ్స్‌, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ ఎకనామిక్స్‌ లా మొదలైన స్పెషలైజేషన్లు ఉంటాయి.
ప్రతి స్పెషలైజేషన్‌ తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కాబట్టి ఏ కోర్సును ఎంచుకోవడం మేలో విద్యార్థితో నిమిత్తం లేకుండా కచ్చితంగా చెప్పలేం. మీ ఆసక్తిని బట్టి కోర్సును ఎంచుకోవడం మేలు.

మా తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు. తనకు ఖగోళశాస్త్రం (అస్ట్రానమీ) అంటే ఆసక్తి ఎక్కువ. అందులో రాణించాలంటే ఇంటర్లో ఏ గ్రూపు ఎంచుకోవాలి? ఈ సబ్జెక్టులో డిగ్రీ అందించే విద్యాసంస్థలూ, దీనిలో ఉద్యోగావకాశాలూ తెలుపగలరు.

ఖగోళశాస్త్రం అనేది ఒక ప్రత్యేకమైన కోర్సు. ఇందులో ఆసక్తి ఉండటం అభినందనీయం. అస్ట్రానమీ చదవాలనుకునేవారు ముఖ్యంగా భౌతికశాస్త్రం, గణితం సబ్జెక్టులపై పట్టు సాధించాల్సివుంటుంది. ఈ రెండూ కూడా అస్ట్రానమీ కోర్సు చదవడానికి ముఖ్యమైనవి. అందుకని ఇంటర్లో ఎంపీసీ లేదా ఎంబైపీసీ లాంటి ఈ రెండు సబ్జెక్టుల కలయిక ఉన్న గ్రూపును ఎంచుకోవాలి.
మన తెలుగు రాష్ట్రాల్లో అస్ట్రానమీ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలు అతి తక్కువ. నేరుగా డిగ్రీలోనే అస్ట్రానమీ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలు మనదేశంలో తక్కువే. కాబట్టి డిగ్రీలో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ కలయికలో ఉన్న కోర్సును లేదా బీటెక్‌ కోర్సును చదివి ఎమ్మెస్సీ (అస్ట్రానమీ)/ ఎమ్మెస్సీ (అస్ట్రో ఫిజిక్స్‌)/ ఎంటెక్‌ (స్పేస్‌ టెక్నాలజీ)/ ఎంటెక్‌ (స్పేస్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌ లాంటివి చదవొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోని ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు పీజీలో ఖగోళశాస్త్ర సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి.
ఈ కోర్సు చదివినవారికి నాసా, బార్క్‌, ఇస్రో లాంటి ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ అస్ట్రానమీ అండ్‌ అస్ట్రో ఫిజిక్స్‌, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌, ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌ మొదలైన సంస్థల్లో కూడా ఉపాధికి వీలుంటుంది.

అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా 2006లో ఎకనామిక్స్‌లో పీజీ చేశాను. పీజీ చదివేటపుడు మధ్యలో బి.ఇడిలో చేరటం వల్ల అన్ని పేపర్లూ ఒకేసారి అటెమ్ట్‌ చేయలేకపోయాను. దీంతో ఏడాదికి రెండు చొప్పున నాలుగు మార్కుల మెమోలు వచ్చాయి. ఒక్కో సంవత్సరానికి ఒక్క మార్కుల మెమోనే ఇవ్వమంటే ఆ అవకాశం లేదన్నారు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఏమైనా సాధ్యపడుతుందా?

సాధారణంగా ఒక్కో యూనివర్సిటీలో ఒక్కొక్క నిబంధన ఉంటుంది. కన్సాలిడేటెడ్‌ మెమో ఇస్తారేమో విశ్వవిద్యాలయంలో మొదట కనుక్కోండి. ఒకవేళ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే దానికోసం ప్రయత్నించండి. ఆ కన్సాలిడేటెడ్‌ మెమో ఇచ్చినప్పటికీ దానిలో సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణత పొందినట్లు ఉంటుంది. చాలామంది బీటెక్‌ విద్యార్థులు కూడా మొదట రాసిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే తిరిగి పరీక్ష రాసి తర్వాత మెమో తీసుకుంటారు. కాబట్టి రెండు మెమోలు వచ్చినంత మాత్రాన దాని గురించి దిగులు చెందాల్సిన పని లేదు. మీరు ఏదైనా ఉద్యోగం చేయడానికైనా లేదా ఉన్నత చదువులకైనా మంచి పరిజ్ఞానం, సంబంధిత నైపుణ్యం ఉంటే చాలు. కాబట్టి మీరు మార్కుల మెమోల గురించి ఆలోచించి బాధపడకుండా నిశ్చింతగా ఉండండి!

డిగ్రీ అర్హత‌త‌తో కేంద్రప్రభుత్వోద్యోగం వ‌స్తే రెగ్యుల‌ర్ మోడ్‌లో పీజీని చేయ‌డానికి అనుమ‌తి ఇస్తారా? ప్రభుత్వ అనుమ‌తి లేకుండా పీజీని చేయ‌వ‌చ్చా?

డిగ్రీ అర్హత‌తో కేంద్రప్రభుత్వ ఉద్యోగం వ‌స్తే రెగ్యుల‌ర్ పీజీ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది కానీ ఈ అవ‌కాశం అన్ని కేంద్రప్రభుత్వ సంస్థల్లో ఉండ‌క‌పోవ‌చ్చు. అంతే కాకుండా కేంద్రప్రభుత్వ ఉద్యోగులంద‌రికీ ఈ అవ‌కాశం ఉంటుంద‌ని క‌చ్చితంగా చెప్పలేం. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విభాగాల్లో (డిపార్ట్‌మెంట్లు) ఉన్నత చ‌దువులు చ‌ద‌వ‌డానికి స్టడీ లీవ్స్ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. అయితే ఆ చ‌ద‌వ‌బోయో ఉన్నత చ‌దువులు ఆ ఉద్యోగి చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన‌ది అయిన‌పుడు స‌ర్కారు అనుమ‌తించ‌వ‌చ్చు. ఇది అంద‌రికీ ఒకే విధంగా ఉండ‌క‌పోవ‌చ్చు. ప్రధానంగా రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీ వారికి ఈ అవ‌కాశం ఎక్కువ‌.
రాష్ట్రప్రభుత్వ కోలువులు చేస్తున్నవారికి కూడా ముఖ్యంగా కొన్ని వ‌ర్గాల వారికి ఉన్నత చ‌దువులు చ‌ద‌వ‌డానికి ప్రభుత్వం కొంత‌ వెసులుబాటును క‌ల్పిస్తోంది. కాబ‌ట్టి వారు ఉన్నత‌విద్యలు చ‌దివి, పూర్తయిన త‌ర్వాత మ‌ళ్ళీ ఉద్యగంలో చేర‌వ‌చ్చు. మీ విష‌యానికొస్తే... ఒక‌వేళ ప్రభుత్వం వారు అనుమ‌తించ‌ని ప‌క్షంలో మీకు ఉన్నత విద్య చ‌ద‌వాల‌నే ఆస‌క్తీ, ఆకాంక్షా ఉన్నట్లయితే మీరు దూర‌విద్య ద్వారా కూడా చ‌దివే వీలుంటుంది.

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను (బీజడ్‌సీ గ్రూపు). సివిల్స్‌కూ, గ్రూప్స్‌కూ తయారై ఆ పరీక్షలు రాయాలనే ఆసక్తి ఉంది. నా లక్ష్యం చేరడానికి ఏ మార్గాలు అనుసరించాలో సూచించగలరు.

లక్ష్యం నిర్దేశించుకుని, దాన్ని చేరుకోవాలనే ఆక్షాంక్ష, ఆసక్తితో ఉండటం అభినందనీయం. సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షలు రాయాలంటే ముఖ్యంగా జనరల్‌ నాలెడ్జ్‌, కరంట్‌ అఫైర్స్‌లకు సంబంధించిన అంశాలను క్రమం తప్పకుండా చదువుతుండాలి. వార్తాపత్రికల్లో వచ్చే తాజా వార్తలు, సంపాదకీయాలను ఎప్పటికప్పుడు అనుసరించాలి. దేశంలోని వివిధ రంగాలపట్ల పరిజ్ఞానం పెంచుకోవాలి. ఆ రంగాల్లోని పరిణామాలను గ్రహిస్తూవుండాలి.
గ్రూప్స్‌, సివిల్స్‌ పరీక్షలను రాసి విజయాన్ని సాధించినవారి విజయగాథలు చదవటం, వారి సన్నద్ధత పద్ధతిని తెలుసుకోవడం చేయాలి. ఓరియంటేషన్‌ కార్యక్రమాలకు హాజరుకావడం వల్ల కొంత మేలు ఉంటుంది. ఆప్షనల్‌గా తీసుకోదల్చిన సబ్జెక్టులో పీజీ కూడా చదివితే దానిపై పట్టు లభిస్తుంది. లేదంటే డిగ్రీ పూర్తయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు పట్టుదలతో సన్నద్ధమైనా కూడా ఫలితం ఉంటుంది.

ఎంబైపీసీ మాదిరిగా ఎం.పి.ఇ.సి. (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఎకనమిక్స్‌, కామర్స్‌) గ్రూపును అందించే ఇంటర్‌ బోర్డు/కళాశాలలు ఎక్కడున్నాయో తెలుపగలరు.

మన తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్‌ బోర్డు వారు ఈ ఎం.పి.ఇ.సి. గ్రూపును అందించడం లేదు. ఈ గ్రూపును అందించే కళాశాలలూ లేవు. కొన్ని కళాశాలల్లో ఎం.ఇ.సి. గ్రూపు అందుబాటులో ఉంది.
సీబీఎస్‌ఈ వారు ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయాలజీ, బయో టెక్నాలజీ, హిస్టరీ, సైకాలజీ, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్‌ మొదలైన సబ్జెక్టులను కోర్సులో భాగంగా బోధిస్తారు. కానీ ప్రత్యేకంగా ఎం.పి.ఇ.సి. కోర్సును అందించడం లేదు. మీకు ఒకవేళ ఈ సబ్జెక్టులను చదవాలనే ఆసక్తి ఉంటే ముందుగా ఎం.ఇ.సి. కోర్సును చదివి, తర్వాత ఫిజిక్స్‌ సబ్జెక్టు ఉన్న కోర్సును చదవొచ్చు.

నేను 2012-2014వరకూ మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌ కోర్సును ఏపీ పారామెడికల్‌ బోర్డు నుంచి పూర్తిచేశాను. అయితే అదే విద్యాసంవత్సరంలో డిగ్రీని రెగ్యులర్‌గా చదివాను. ప్రస్తుతం ఎంఎల్‌టీ రద్దు (క్యాన్సిల్‌) చేసి, మళ్ళీ అదే కోర్సును చేయడానికి బోర్డు అనుమతి ఇస్తుందా?

సాధారణంగా రెండు రెగ్యులర్‌ డిగ్రీలను ఒకే విద్యాసంవత్సరంలో చదవడానికి వీలు లేదు. ఈ విషయాన్ని గతంలో కూడా వివరించాం. ఒకవేళ చదివినట్లయితే ఉద్యోగ దరఖాస్తు సమయంలో గానీ, ఇంటర్వ్యూలో గానీ ఒక డిగ్రీ సర్టిఫికెట్‌ను మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీరు ఎంఎల్‌టీ క్యాన్సిల్‌ చేసి, మళ్ళీ అదే కోర్సును చేయడానికి బోర్డు అనుమతించకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ ఏపీ పారామెడికల్‌ బోర్డు వారు ప్రత్యేక నిబంధన ఉంచినట్లయితే అనుమతి దొరక్కపోవచ్చు. బోర్డు వెబ్‌సైట్‌ను ఒకసారి పరిశీలించండి. నిబంధనేమీ లేకపోతే మీరు మళ్ళీ ఎంఎల్‌టీ కోర్సును చేయవచ్చు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు (బీఈఎం) మూడో సంవత్సరం చదువుతున్నాను. దీని తర్వాత ఏం చదవాలో సందిగ్ధంలో ఉన్నాను. ఎంటెక్‌/ఎంఎస్సీ/ఎంబీఏ పర్యావరణ నిర్వహణ (ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌)లలో ఏది మెరుగైనది? ఎక్కడ చదివితే బాగుంటుంది? ఇవి కాకుండా మరేదైనా మంచి కోర్సు ఉందా?

మీరు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తయిన తర్వాత ఎంబీఏ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా ఎంఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంటెక్‌ చదవాలనుకుంటే ఎమ్మెస్సీ చదివిన తర్వాత మాత్రమే చదవవచ్చు.
పర్యావరణ నిర్వహణ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలు గానీ, కళాశాలలు గానీ మనదేశంలో చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకప్పుడు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉండేది. కానీ అతి తక్కువమంది విద్యార్థులు చేరుతుండటం వల్ల ఈ కోర్సును తొలగించారు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో ఈ కోర్సుకు ఉద్యోగావకాశాలు కూడా తక్కువ. ఒకవేళ మీరు విదేశాల్లో చదవాలనుకుంటే ఎమ్మెస్సీ చదివిన తర్వాత ఎంఎస్‌ చేయడానికి విదేశాలకు వెళ్ళవచ్చు. మీరు ఎమ్మెస్సీ చదివినా, ఎంబీఏ, ఎంటెక్‌ ఏది చదివినా అన్నీ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించినవే కాబట్టి అన్నిటికీ దాదాపు ఒకే రకంగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకుంటేనే దేనిలోనైనా రాణించగలుగుతారు.

డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. ఏర్‌ హోస్టెస్‌ కోర్సు చేయాలనుంది. శిక్షణను అందించే సంస్థలు, ఉద్యోగావకాశాల వివరాలు తెలపండి.

ఏర్‌ హోస్టెస్‌ అవడం చాలామంది అమ్మాయిల కల. ఈ ఉద్యోగం చేసేవారికి మంచి జీతం లభించడమే కాకుండా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులను కలవడానికీ, చాలా విషయాలు నేర్చుకోవడానికీ వీలవుతుంది. కానీ ఇందుకు చాలా నైపుణ్యాలు కావాలి.
మనదేశంలోని కొన్ని సంస్థలు ఏర్‌హోస్టెస్‌ శిక్షణను అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏర్‌క్రాఫ్ట్‌ ఇంజినీరింగ్‌ (దిల్లీ), రాయ్‌ యూనివర్సిటీ (అహ్మదాబాద్‌), ఏర్‌ హోస్టెస్‌ అకాడమీ (బెంగళూరు, దిల్లీ, ముంబయి, పుణె), ఫ్రాంక్‌పిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏర్‌ హోస్టెస్‌ ట్రెయినింగ్‌ (ముంబయి, దిల్లీ), లైవ్‌వెల్‌ ఏవియేషన్‌ అకాడమీ (ముంబయి, దిల్లీ) మొదలైన సంస్థలున్నాయి.
ఏర్‌ హోస్టెస్‌ కోర్సు, శిక్షణ పూర్తయిన తరువాత ఏర్‌ ఇండియా, ఇండియన్‌ ఏర్‌లైన్స్‌, బ్రిటిష్‌ ఏర్‌వేస్‌, డెల్టా ఏర్‌వేస్‌, టాటా, గల్ఫ్‌ ఏర్‌, సహారా ఇండియా, గో ఏర్‌, యునైటెడ్‌ ఏర్‌ లాంటి వైమానిక సంస్థల్లో ఏర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏర్‌హోస్టెస్‌గా ఉద్యోగం చేయడానికి మంచి భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం, స్నేహపూర్వక వ్యక్తిత్వం, ఆహ్లాదకరమైన కంఠధ్వని, అనుకూల వైఖరి వంటి నైపుణ్యాలు కలిగి ఉండాలి.

మా అమ్మాయి ఇంటర్‌ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతోంది. వైద్య విభాగంలో కొత్త పోకడలపై ఆసక్తి చూపుతోంది. వాటి వివరాలను తెలియజేయండి.

వేగంగా మార్పు చెందుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పోకడలపై దృష్టిసారించడం అభినందనీయం. ఈరోజుల్లో దాదాపు అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం వాడుక పెరిగింది. అదేవిధంగా మెడికల్‌ విభాగంలో కూడా ఆధునిక పద్ధతుల, పరికరాల వాడకం పెరిగింది. అయినప్పటికీ ఈ విభాగపు ముఖ్య ఉద్దేశం- వ్యాధులకు చికిత్సను అందించడం.
ఇంటర్మీడియట్‌ తరువాత ఈ విభాగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎంబీబీఎస్‌ (బాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సర్జరీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడికల్‌ సిస్టమ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ, బాచిలర్‌ ఆఫ్‌ యునాని మెడికల్‌ అండ్‌ సర్జరీ, బాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్సెస్‌ మొదలైనవి. వీటితోపాటుగా పారా మెడికల్‌ కోర్సులు- ఫిజియోథెరపి, మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌, ఆప్టోమెట్రిస్ట్‌, స్పీచ్‌ థెరపీ, డయాలసిస్‌ టెక్నీషియన్‌, రేడియోథెరపీ టెక్నీషియన్‌, కార్డియాలజీ టెక్నీషియన్‌, రేడియోగ్రఫిక్‌ అసిస్టెంట్‌, ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌ టెక్నీషియన్‌, రెస్పిరేటరీ థెరపీ, మెడికల్‌ ఇమేజింగ్‌, క్యాథ్‌లాబ్‌ టెక్నీషియన్‌, అనస్తీషియా టెక్నీషియన్‌, ఆడియోమెట్రిక్‌ ట్రైనింగ్‌, కార్డియాలజీ పర్‌ఫ్యూసన్‌ టెక్నీషియన్‌ మొదలైన కోర్సులు చదవడానికి అవకాశం ఉంటుంది.
డీ-ఫార్మసీ, బీ- ఫార్మసీ కోర్సులు కూడా చదవవచ్చు. ప్రతి కోర్సు కూడా తనదైన ప్రత్యేకతతో ఉంటుంది. ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా కోర్సును ఎంచుకోవడం మేలు.

బీఈఎం (బ్యాచులర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నాను. పీజీ లేదా ఎంటెక్‌ చేయాలనుంది. నాకు అందుబాటులో ఉన్న కోర్సులేవి? అందించే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగావకాశాల వివరాలు తెలపండి.

బీఈఎం పూర్తిచేసిన తరువాత మీరు ఎంబీఏ, ఎంఎస్‌సీ కోర్సుల్లో వివిధ విభాగాలు చదవడానికి అవకాశం ఉంటుంది. ఎంబీఏ చదవాలనుకుంటే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, మేనేజీరియల్‌ కమ్యూనికేషన్‌ లాంటి విభాగాల్లో చేయవచ్చు. ఎంఎస్‌సీ చేయాలనుకుంటే కోస్టల్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, నేచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సుల్లో చదవడానికి అవకాశముంటుంది.
ఎంటెక్‌ చేయడానికి ఇంటర్మీడియట్‌లో మేథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. మీకు అర్హత ఉంటే ఎంటెక్‌- ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్‌సీ- ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, యూనివర్సిటీ ఆఫ్‌ పుణెలు ఎంఎస్‌సీ- ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌లను అందిస్తున్నాయి.
ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశముంది. వీరికి నేచురల్‌ రిసోర్సెస్‌ స్పెషలిస్ట్‌, ఆపరేషన్స్‌ మేనేజర్‌, కోస్టల్‌ అండ్‌ మెరైన్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌, రిసోర్స్‌ ఫారెస్టర్‌, వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్‌, చీఫ్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ అండ్‌ హార్టీకల్చర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌లుగా ఉద్యోగావకాశాలుంటాయి.
పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, వాటర్‌ రిసోర్సెస్‌ అండ్‌ అగ్రికల్చర్‌, ఫారెస్ట్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఫెర్టిలైజర్‌ ప్లాంట్స్‌, టెక్స్‌టైల్స్‌ మిల్స్‌, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్స్‌ లాంటి జాతీయ స్థాయి సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి.

మా అబ్బాయి పదో తరగతి చదువుతున్నాడు. తనకు అగ్రి బీఎస్‌సీపై ఆసక్తి ఉంది. ఉద్యోగావకాశాలను వివరించండి. ఈ కోర్సు చదివితే బ్యాంకు, ఇతర ఉద్యోగాలకు అర్హుడేనా?

వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉండడం అభినందనీయం. వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యమున్న మనదేశంలో అగ్రికల్చర్‌ కోర్సులు చదివినవారికి ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువే. మీ అబ్బాయికి అగ్రికల్చర్‌ బీఎస్‌సీపై ఆసక్తి ఉంది కాబట్టి ఉన్నతవిద్యను కూడా దానిలోనే కొనసాగించడం మంచిది. ఆసక్తి ఉన్న కోర్సు చదివితే భవిష్యత్తులో రాణించగలుగుతారు.
అగ్రికల్చర్‌ బీఎస్‌సీ చదివినవారికీ బ్యాంకు ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. ఐబీపీఎస్‌ వారు నూతనంగా ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం బ్యాంకు పీఓ (ప్రొబేషనరీ ఆఫీసర్స్‌), క్లర్క్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాయడానికి ఏదైనా డిగ్రీ (ప్రభుత్వ గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాలు/ కళాశాలలు) కలిగినవారు అర్హులు. అయితే క్లర్క్‌ ఉద్యోగానికి కంప్యూటర్‌ నైపుణ్యం కూడా ఉండాలి. ఇతర ఉద్యోగాల విషయానికి వస్తే కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లలో ప్రత్యేకంగా ఒక డిగ్రీని కలిగినవారు అర్హులు అని ఇస్తుంటారు. అలాంటి సందర్భాల్లోనే అనర్హత ఉంటుంది.
కొన్ని నోటిఫికేషన్లలో ఏదైనా ఒక డిగ్రీని ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాల నుంచి పొందినవారు అర్హులు అని ఇస్తుంటారు. ఇలాంటి ఉద్యోగాలకు నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్‌ బీఎస్‌సీ చదివినవారికి రీసర్చ్‌ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ లోన్‌ ఆఫీసర్‌ (బ్యాంకులో), ప్రొడక్షన్‌ మేనేజర్‌, ఆపరేషన్స్‌ మేనేర్‌, ఫార్మ్‌ మేనేజర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి. అంతేకాకుండా ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ చదివి పీహెచ్‌డీ చేసినవారికి కళాశాలలు/ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుడిగా ఉద్యోగావకాశాలుంటాయి.

మా అమ్మాయి ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. మెరైన్‌ ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటోంది. ఇది అమ్మాయిలకు తగినదేనా? అందించే విశ్వవిద్యాలయాలేవి? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

మెరైన్‌ ఇంజినీరింగ్‌ ఒక విభిన్న కోర్సు. దీనికి ఆదరణ, విద్యార్థుల్లో ఆసక్తి ఎక్కువగానే ఉంది. ఈ రోజుల్లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో తమని తాము నిరూపించుకుంటున్నారు. మీ అమ్మాయికి ఈ విభాగంలో ఆసక్తి ఉంది కాబట్టి ప్రోత్సహించండి. దాని వల్ల ఆమె భవిష్యత్తులో రాణించగలుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో మెరైన్‌ ఇంజినీరింగ్‌ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. దేశంలోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఉదాహరణకు- చెన్నైలోని ఇంటర్నేషనల్‌ మారిటైమ్‌ అకాడమీ, ముంబయిలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలు. కొచ్చి, మంగళూరు విశ్వవిద్యాలయాలు, మెరైన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కోల్‌కతా) లాంటి విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది.
మెరైన్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఈ కోర్సు చదివినవారికి షిప్పింగ్‌, కన్సల్టెన్సీ సంస్థలు, తయారీ రంగం, షిప్‌ బిల్డింగ్‌ సంస్థలు, ఆయిల్‌- గ్యాస్‌ తయారీ సంస్థల్లో ఉద్యోగావాకాశాలుంటాయి. ఈ విభాగంలో జీతభత్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

డిగ్రీ చదువుతున్నాను. ఫైర్‌ సర్వీస్‌ రంగంపై ఆసక్తి ఉంది. వీటిపై డిప్లొమా కోర్సులను అందించే సంస్థల వివరాలను తెలపండి. దీనికి కావాల్సిన విద్యార్హత, ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

మన తెలుగు రాష్ట్రాల్లో ఫైర్‌ సర్వీసెస్‌పై డిప్లొమా కోర్సులను అందించే విద్యాసంస్థలు తక్కువగా ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొన్ని ప్రముఖ సంస్థలు ఫైర్‌ అండ్‌ సేఫ్టీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఉదాహరణకు- దిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ ఇంజినీరింగ్‌ (న్యూదిల్లీ)లో ఒక సంవత్సర కాలపు ఫైర్‌ టెక్నాలజీ అండ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌, ఆరు నెలల కోర్సు అయిన ఫైర్‌ ఫైటింగ్‌ కోర్సు అందుబాటులో ఉన్నాయి.
చెన్నైలోని నేషనల్‌ సేఫ్టీ అకాడమీలో డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ ఫైటింగ్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ ఇంజినీరింగ్‌ (నాగ్‌పూర్‌) మొదలైన సంస్థలు డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.
ఈ కోర్సులను చేయడానికి పదోతరగతి లేదా ఇంటర్మీడియట్‌ అర్హత ఉండాలి. దేహదార్ఢ్య పరీక్షలను కూడా నిర్వహిస్తారు. ఫైర్‌ అండ్‌ సేఫ్టీ డిప్లొమా కోర్సు చదివినవారికి సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌, ఫైర్‌ సూపర్‌ వైజర్‌, సేఫ్టీ ఇంజినీర్‌, ఫైర్‌మ్యాన్‌, ఫైర్‌ ప్రొటెక్షన్‌ టెక్నిషియన్‌, సేఫ్టీ అసిస్టెంట్‌, సేఫ్టీ ఆడిటర్‌, ఫైర్‌ ఆఫీసర్‌ ఉద్యోగావకాశాలుంటాయి.

బాయిలర్‌ ఆపరేటర్‌ డిప్లొమా కోర్సును అందించే సంస్థల వివరాలేమిటి? ఈ కోర్సుకు విద్యార్హత, ఉద్యోగావకాశాలను తెలపగలరు.

బాయిలర్‌ ఆపరేటర్‌ డిప్లొమా కోర్సును మన తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. సాధారణంగా ఈ కోర్సును (బాయిలర్‌ ఆపరేటర్‌ డిప్లొమా) ఎక్కువగా ప్రైవేటురంగ సంస్థలు అందిస్తున్నాయి. దేశంలో నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (న్యూదిల్లీ) లాంటి అతి తక్కువ ప్రభుత్వ రంగ సంస్థలో బాయిలర్‌ ఆపరేటర్‌ డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సును చదవడానికి హైస్కూల్‌ డిప్లొమా లేదా బీఈడీ (జనరల్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌) టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. బాయిలర్‌ ఆపరేటర్‌ కోర్సు చదివినవారికి పేపర్‌ మిల్లుల్లో, ఉడ్‌ మానుఫాక్చరింగ్‌ (కలప తయారీ)లో, హాస్పిటల్స్‌, పాఠశాలల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
ఫ్యాక్టరీల్లో, విద్యుదుత్పత్తి కేంద్రాలు మొదలైన పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. బాయిలర్‌ ఆపరేటర్‌ డిప్లొమా కోర్సు చదివినవారు లోప్రెజర్‌, హైప్రెజర్‌ బాయిలర్లు, పవర్‌ బాయిలర్లు, స్టీమ్‌ బాయిలర్లు, నీటిని వేడి చేసే సిస్టమ్స్‌ నియంత్రణ, నిర్వహణ బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది..

బీఎస్‌సీ (ఎంపీసీ) చివరి సంవత్సరం చదువుతున్నాను. కెమిస్ట్రీ సబ్జెక్టుపై ఆసక్తి ఉంది. పీజీ స్థాయిలో కెమిస్ట్రీ విభాగంలో ఉన్న వైవిధ్యమైన కోర్సులేమిటి? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

పీజీ స్థాయిలో కెమిస్ట్రీ విభాగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు- ఎంఎస్‌సీ- అనలిటికల్‌, ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌ , బయో, ఫిజికల్‌, డ్రగ్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ ఫార్యస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ కెమిస్ట్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఇన్‌ కంప్యూటేషనల్‌ కెమిస్ట్రీలతోపాటుగా ఎంఎస్‌సీ ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. ఈ సబ్జెక్టు చదివినవారికి వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. లెబొరేటరీలు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఆయిల్‌ ఇండస్ట్రీ, పెట్రోలియం, ఫార్మాస్యూటికల్‌, రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, సీడ్‌, నర్సరీ స్కూళ్లలో, అగ్రికల్చరల్‌ రీసర్చ్‌ సర్వీసెస్‌ మొదలైన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటురంగ సంస్థలైన డాబర్‌, హిందుస్థాన్‌ లివర్‌, రాన్‌బాక్సీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ వంటి ప్రబుఖ సంస్థలు కూడా కెమిస్ట్రీ చదివినవారికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఇస్రో, బాబా అటామిక్‌ రిసర్చ్‌ సెంటర్‌, ఇండియన్‌ రైల్వే రంగాల్లోనూ అవకాశాలున్నాయి. కెమిస్ట్‌గా, లెబొరేటరీ టెక్నీషియన్‌గా, ఫార్మసిస్ట్‌గా, టాక్సికాలజిస్ట్‌లుగా కూడా అవకాశాలుంటాయి.

మా అమ్మాయి 7 తరగతుల వరకు ముంబయిలో చదివింది. తెలంగాణలో చదవాలనుకుంటోంది. తనకు ఏ రాష్ట్రం లోకల్‌ అవుతుంది?

సాధారణంగా ఏ అభ్యర్థి అయినా ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏ ప్రాంతంలో చదువుతారో దానికి లోకల్‌ అవుతారు. చదువుకి సంబంధించి ఉన్నత విద్య అభ్యసిస్తున్నపుడు ఆ విద్యార్థి ప్రస్తుతం చదువుతున్న తరగతికి ముందు నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివాడో లేదా చివరి ఏడు సంవత్సరాల్లో ఎక్కువకాలం ఎక్కడ చదివారో ఆ ప్రాంతానికి లోకల్‌ అవుతారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్లు సాధారణంగా విద్యార్థి స్వస్థలంపై ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే స్కాలర్‌షిప్‌లు పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా రాబడి, కుల ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలి.

ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయ్యాను. మూడు సంవత్సరాల తరువాత దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తిచేశాను. నేను బ్యాంకు, గ్రూప్స్‌ పరీక్షలు రాయడానికి అర్హుడినేనా?

ఉద్యోగాన్ని బట్టి విద్యార్హత అవసరం ఉంటుంది. కొన్ని బ్యాంకు ఉద్యోగాలు ఉదాహరణకు- బ్యాంకు క్లర్క్‌ లాంటివి ఇంటర్మీడియట్‌ అర్హతతో ఉంటాయి. కాబట్టి ఈ పరీక్ష రాయడానికి ఇంటర్మీడియట్‌ అవసరం తప్పనిసరి. బ్యాంకు ఐబీపీఎస్‌ లాంటి పరీక్ష రాయడానికి డిగ్రీ అర్హత ఉండాలి. అదేవిధంగా గ్రూప్స్‌కు కూడా.
ఇంటర్మీడియట్‌ అర్హత తప్పనిసరి అని ఇచ్చిన నోటిఫికేషన్లకు అది పాసైనవారే అర్హులు. డిగ్రీ అర్హత అడిగిన వాటికి ఆ అర్హత ఉంటే సరిపోతుంది. కొన్నింటిల్లో ఇంటర్‌, డిగ్రీ రెండింటినీ అడుగుతారు. అలాంటపుడు ఇంటర్మీడియట్‌ లేనివారికి పరీక్ష రాయడానికి అర్హత ఉండదు. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ అర్హత ఉండాలని ఇవ్వకపోతే అపుడు ఏ పోటీ పరీక్ష రాయడానికైనా అర్హత ఉంటుంది.

బైపీసీ (86%) పూర్తిచేశాను. కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌పై ఆసక్తి ఉంది. డిగ్రీ, పీజీల్లో ఏ కోర్సులు ఎంచుకోవాలి?

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం చాలా అవసరం. కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ వంటి ఆసక్తికరమైన కోర్సును చదవాలనుకోవడం అభినందనీయం. కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ అనలిస్ట్‌ కావాలనుకుంటే డిగ్రీలో బ్యాచిలర్‌ సైన్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌/ బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌/ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సును చేయవచ్చు.
కొన్ని విశ్వవిద్యాలయాలు ఉదాహరణకు- యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ లాంటివి ఫోరెన్సిక్‌ సైన్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సులను కూడా అందిస్తున్నాయి. తరువాత పీజీలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌, ఎంఎస్‌సీ ఇన్‌ కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ లేదా ఎంఎస్‌సీ ఇన్‌ డిజిటల్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ కంప్యూటింగ్‌ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ లాంటి కోర్సులను చదివేవారు విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది.

మా అమ్మాయి ఇంటర్‌ (ఎంబైపీసీ) చదువుతోంది. తనకు నానోమెడిసిన్‌పై ఆసక్తి ఉంది. భవిష్యత్తులో తను ఏ కోర్సును ఎంచుకోవాలి? అందించే కళాశాలలేవి?

వైద్య రంగంలో నానోమెడిసిన్‌ ఒక విభిన్నమైన కోర్సు. ఇది నానోటెక్నాలజీ, మెడిసిన్‌ల కలయిక. వైద్యరంగంలో ఇప్పుడిపుడే ఈ కోర్సు అభివృద్ధి చెందుతోంది. కొన్ని దేశాల్లో మాత్రమే ఉదా: అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఈ నానోమెడికల్‌ కోర్సు అందుబాటులో ఉంది. మనదేశంలో ఈ కోర్సు ఇంకా బాల్యదశలోనే ఉంది.
ఈ కోర్సులో బహుళ విభాగాలున్నాయి. ఇది చదవడానికి మెడిసిన్‌తోపాటు నానోటెక్నాలజీ విభాగాల్లో పరిజ్ఞానాన్ని కలిగివుండాలి. నానోమెడిసిన్‌ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలు మనదేశంలో అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ బహుళ విభాగాల్లో పరిజ్ఞానాన్ని సంపాదించడానికి సమయం పడుతుంది.
దీనిని చదవడానికి మీ అమ్మాయి ముందుగా మెడిసిన్‌ చదివి, తరువాత నానో మెడిసన్‌లో పీహెచ్‌డీ చేయడానికి విదేశాలకు వెళ్లవచ్చు. విదేశాల్లో కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉదా:- క్రాన్‌ఫీల్డ్‌ (యూకే) నానోమెడిసిన్‌ కోర్సును అందిస్తోంది.

పీజీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) చేశాను. రసాయనాల కారణంగా ఏర్పడిన భయం వల్ల లెక్చరర్‌గా చేయాలంటే భయంగా ఉంది. సోషల్‌ మెథడాలజీలో బీఈడీ చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా?

మీరు సోషల్‌ మెథడాలజీలో బీఈడీ చేయడం కుదరదు. చేయాలంటే ఇంటర్మీడియట్‌లో తప్పనిసరిగా సోషల్‌ను చదివివుండాలి. కాబట్టి మీరు మళ్లీ ఇంటర్‌ నుంచి సోషల్‌ సబ్జెక్టులను చదివితేనే ఆ సబ్జెక్టులో బీఈడీ చేయడానికి అవకాశం ఉంటుంది. దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవడానికి ప్రయత్నించండి. అపుడే సబ్జెక్టు తొందరగా అర్థం అవుతుంది. పైగా ఎంచుకున్నది ఉపాధ్యాయ వృత్తి కాబట్టి రెగ్యులర్‌గా చదవడం వల్ల మేలు అధికం. సబ్జెక్టును ఎక్కువగా నేర్చుకోవడానికీ, అవగాహన పెంపొందించుకోవడానికీ వీలుంటుంది.

ఎంఏ, బీఈడీ పూర్తిచేశాను. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల పోటీపరీక్షలను రాయాలనుకుంటున్నాను. కుదురుతుందా?

మీకు అర్హత ఉంది. ఏ రాష్ట్ర పోటీపరీక్ష అయినా ఉద్యోగాన్ని బట్టి 10%- 15% ఓపెన్‌ కేటగిరీకి కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఈ కేటగిరీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్లో ఇచ్చిన అన్ని అర్హతలను కలిగి ఉంటే ఇతర రాష్ట్రాల పోటీపరీక్షలకు నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఆ రాష్ట్రాల రిజర్వేషన్‌ మాత్రం లభించదు.

ఎంఎస్‌సీ, మెడికల్‌ మైక్రోబయాలజీ మూడో సంవత్సరం చదువుతున్నాను. నాకు ఐఐటీల్లో పీహెచ్‌డీ చేసే వీలుందా? వివరాలు తెలపండి. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

మన దేశంలో మెడికల్‌ మైక్రోబయాలజీలో పీహెచ్‌డీని అతి తక్కువ విద్యాసంస్థలు అందిస్తున్నాయి. ఐఐటీల్లో ప్రత్యేకంగా మెడికల్‌ మైక్రోబయాలజీ అందుబాటులో లేదు. దేశంలోని ఏఐఎంఎస్‌ (ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)- న్యూదిల్లీలో మెడికల్‌ మైక్రోబయాలజీలో పీహెచ్‌డీ అందుబాటులో ఉంది.ఇది విభిన్నమైన కోర్సు. రకరకాల బాక్టీరియా, వైరస్‌ల వల్ల పెరుగుతున్న వ్యాధుల నిర్ధారణ, నివారణకు సంబంధించిన పరిశోధనల అవసరం నేడు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కోర్సు చదివినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రభుత్వరంగ సంస్థలైన సెంటర్‌ ఫర్‌ డిజీజ్‌ కంట్రోల్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మొదలైన సంస్థల్లో, ప్రైవేటు హెల్త్‌కేర్‌ సర్వీసుల్లో, ఔషధాల తయారీ సంస్థల్లో ఉద్యోగావకాశాలు, మెడికల్‌ కళాశాలలు/ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా అవకాశాలుంటాయి.

బీఏ పూర్తిచేసి, ఎంఏ తెలుగు (2011-13) దూరవిద్య ద్వారా, బీఈడీ (2011-12) రెగ్యులర్‌ కోర్సు చేశాను. ఒకే సంవత్సరం రెగ్యులర్‌, దూరవిద్య కోర్సులు చేయవచ్చా? నేను ఎస్‌ఏ, ఎల్‌పీ (తెలుగు) పోస్టులకు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడిగా అర్హుడినేనా?

ఒకేసారి 2 డిగ్రీలను కానీ, పీజీలనుకానీ, ఒక డిగ్రీ, ఒక పీజీ కోర్సులను చదవడానికి వీలు లేదు. గతంలో యూజీసీ ఈ విషయానికి సంబంధించి ఒక కమిటీని నియమించింది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత లేదు. ఎస్‌ఏ, ఎల్‌పీ పోస్టులకు దరఖాస్తు చేయడానికి డిగ్రీలో తెలుగును మెయిన్‌ సబ్జెక్టుగా చదివి ఉండాలి. అంతేకాకుండా బీఈడీ (తెలుగు) చదివి ఉండాలి. మీకు స్కూల్‌ అసిస్టెంట్‌, తెలుగు లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులకు అర్హత ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిగ్రీ, బీఈడీ చదివినవారు ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అర్హత ఉంటుంది. కొన్ని పాఠశాలలు ప్రత్యేక నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. వాటి నిబంధనల ప్రకారం మీ విద్యార్హత సరిపోతే ఏ పాఠశాలలో అయినా పనిచేయడానికి అర్హత ఉంటుంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌గా 2011-15లో బీఎస్‌సీ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో 2012లో బీఏలో చేరి 2015లో పూర్తిచేశాను. ఇప్పుడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు వన్‌టైం ప్రొఫైల్‌ నమోదులో రెండు డిగ్రీలనూ నమోదు చేయాలా లేక ఒకటా? ఏది చేస్తే మేలు?

సాధారణంగా రెండు డిగ్రీలను ఏకకాలంలో చేయడానికి వీలులేదు. యూజీసీ గతంలో ఈ విషయానికి సంబంధించి ఒక కమిటీని నియమించింది. కానీ ఈ విషయాన్ని గురించి యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌) నిబంధనల్లో ఇప్పటివరకూ స్పష్టత లేదు. పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ వన్‌టైం ప్రొఫైల్‌ నమోదులో ‘అడిషనల్‌ డిగ్రీ’ అనే ఆప్షన్‌ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు రెండు డిగ్రీలను కావాలనుకుంటే నమోదు చేసుకోవచ్చు. కానీ మీరు రెండు డిగ్రీలను ఏకకాలంలో చదవడం వల్ల రెండింటినీ ఒకేసారి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. దీనిపట్ల సరైన స్పష్టత లేదు. ఒకవేళ మీరు ఒక డిగ్రీనే నమోదు చేసుకోవాలనుకుంటే ఏ డిగ్రీ అయితే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందో దానిని ఉపయోగించుకోవడం మేలు. మీరు దేనిని నమోదు చేసినా మంచిదే. సాధారణంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఒకవేళ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా ఒక డిగ్రీ అర్హతే ఉండాలని అడిగినపుడు మీరు ఏ డిగ్రీ నమోదు చేసుకుంటారో ఆ డిగ్రీ అర్హతతోగల ఉద్యోగాలకు మీరు అర్హులవుతారు.

ఇంటర్‌ (సీఈసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో బీఎస్‌సీ ఏర్‌లైన్స్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ కోర్సు చేయడానికి నాకు అర్హత ఉంటుందా? ఈ కోర్సు ఎక్కడ లభిస్తుంది?

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదవడానికి ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాలలో 10+2 చదివి 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కాబట్టి బీఎస్‌సీ (ఏర్‌లైన్స్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ) కోర్సు చదవడానికి మీకు అర్హత ఉంటుంది. కానీ భారతదేశంలో అతి తక్కువ విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. మనదేశంలో అతి తక్కువ ప్రైవేటు విద్యాసంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాల్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందుబాటులో ఉన్నప్పటికీ బీఎస్‌సీ- ఏర్‌లైన్స్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ అందుబాటులో లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేటు కళాశాలలు మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నాయి.

మా అబ్బాయి బళ్లారిలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా ఇస్రోలో చేరాలని తన ఆకాంక్ష. వివరాలు తెలుపగలరు.

ఇస్రోలో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా చేరాలనే మీ బాబు ఆకాంక్ష అభినందనీయం. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ ఒక విభిన్నమైన కోర్సు. మనదేశంలో కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు/ విద్యాసంస్థల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ముఖ్యంగా దేశంలోని ఐఐటీలు- ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ ముంబయి, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ కాన్పూర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌- బెంగళూరు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- తిరువనంతపురం, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌- బెంగళూరు మొదలైన విద్యాసంస్థలు ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ కోర్సును అందిస్తున్నాయి. మనదేశంలోని వివిధ విద్యాసంస్థలు ఒక్కో రకమైన ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు జేఈఈ ద్వారా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లాంటి విద్యాసంస్థలు ఐఎస్‌ఏటీ ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎంసెట్‌ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి.

మా అమ్మాయి ఇంటర్‌ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరం 98% మార్కులు వచ్చాయి. వైవిధ్యంగా ఉండే కోర్సు చేయాలని తన అభిలాష. నానోటెక్నాలజీ కోర్సు చేస్తే ఎలా ఉంటుంది? దీనికి అవకాశాలెలా ఉంటాయి? ఏరోనాటికల్‌, నానోటెక్నాలజీ.. ఈ రెండింటిలో ఏది మెరుగు?

వైవిధ్యంగా ఉండే కోర్సు చదవాలనే మీ అమ్మాయి అభిలాష ప్రశంసనీయం. నానోటెక్నాలజీ వైవిధ్యమైన, ప్రత్యేకమైన కోర్సు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో నానోటెక్నాలజీ అవసరం దాదాపు అన్ని రంగాల్లో ఉంది. ఉదాహరణకు మెడికల్‌, ఫార్మసీ, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, వస్త్ర పరిశ్రమ మొదలైన రంగాల్లో నానోటెక్నాలజీ అవసరముంది. కాబట్టి, ఈ కోర్సుకి ఈ రోజుల్లో చాలా ఆదరణ ఉంది. ఈ కోర్సును మనదేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు/ విద్యాసంస్థలు మాత్రమే అందిస్తున్నాయి.
నానోటెక్నాలజీ కోర్సు చదివినవారికి వైద్య- ఆరోగ్య రంగం, వ్యవసాయం, అంతరిక్షం, పరిశోధన, బోధన మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. దీనితోపాటు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కూడా ప్రత్యేకమైన కోర్సే. కాబట్టి మీ అమ్మాయి ఏ కోర్సు చదవాలనేది ఆమెకున్న ఆసక్తి, సామర్థ్యం, నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఏ కోర్సు అయినా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఆసక్తి ఉంటే ఏ కోర్సు చదివినా అందులో రాణించగలుగుతారు. కాబట్టి ఏ కోర్సు పట్ల ఆసక్తి ఉందో అదే చదవడం మేలు.

డిగ్రీ (బీజడ్‌సీ) పూర్తిచేశాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చెయ్యాలనివుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అందుబాటులో ఉంది? ఈ కోర్సుకు ప్రవేశపరీక్ష, సంబంధిత వివరాలు తెలుపగలరు.

ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నవాటిలో ఆతిథ్యరంగం ఒకటి. దీనిలో నిపుణుల అవసరం చాలా ఉంది. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు వివిధ ప్రవేశపరీక్షల ద్వారా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు/కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ- అప్లైడ్‌ న్యూట్రిషన్‌ మొదలైన సంస్థలు హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్‌, సర్టిఫికెట్‌లను అందిస్తున్నాయి. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ వారు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశాన్ని కల్పిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశపరీక్ష ద్వారా ఈ కోర్సులో ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఈ ప్రవేశపరీక్ష రాయడానికి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం ఈకింది వెబ్‌సైట్లు చూడగలరు.
ఉస్మానియా: www.osmania.ac.in ; ఐహెచ్‌ఎం: www.ihmhyd.org

రెగ్యులర్‌ టెన్త్‌, ఇంటర్‌లను కొన్ని కారణాల వల్ల చదవలేదు. అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ద్వారా బీఏ డిగ్రీ పూర్తిచేసి తర్వాత కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్‌ పీజీ ఎం.ఎ. (ఎకనామిక్స్‌) చేశాను. నాకు గ్రూప్‌-1, 2, జేఎల్‌, డీఎల్‌ పరీక్షలకు అర్హత ఉంటుందా? ఉద్యోగం వస్తే ఇస్తారా?

టెన్త్‌, ఇంటర్‌ రెగ్యులర్‌గా చదవకపోవడం వల్ల గ్రూప్‌-1, 2 జేఎల్‌, డీఎల్‌ లాంటి పరీక్షలకు అర్హత ఉండదనే ప్రస్తావన ఇంతవరకూ ఎక్కడా రాలేదు. నోటిఫికేషన్లలో రెగ్యులర్‌గా చదివివుండాలన్న నిబంధన లేనంతవరకూ మీకు పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇంటర్వ్యూ సమయంలో పూర్వ విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేస్తారు. అలాంటి సందర్భాల్లో మీకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అంతేకానీ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్‌-1, 2, జేఎల్‌, డీఎల్‌ లాంటి పరీక్షలు రాయడానికీ అర్హత తప్పనిసరిగా ఉంటుంది. ఇంతకుముందు మద్రాసు హైకోర్టు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించింది. తమిళనాడు స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ నిర్వహించే పోటీపరీక్షలకు దూరవిద్య ద్వారా చదివినవారు కూడా అర్హులేనని తీర్పునిచ్చింది. అంతేకాకుండా దూరవిద్య ద్వారా చదివి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అందువల్ల పోటీపరీక్షల్లో ప్రతిభ కనబరిస్తే మీకు ఉద్యోగం నిశ్చయంగా లభిస్తుంది. అందుకని మీకు ఆసక్తివున్న పోటీపరీక్షలు రాయడానికి సిద్ధం కండి!

బీఎస్‌సీ (ఎలక్ట్రానిక్స్‌) చేశా. సింగపూర్‌లో స్టోర్‌ కీపర్‌ ఉద్యోగం ఆరేళ్లపాటు చేసి మళ్లీ మనదేశం వచ్చాను. దూరవిద్యలో పీజీ చేయాలని ఉంది. ఏ పీజీ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది? పీజీ తర్వాత ఎలక్ట్రానిక్స్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాలని భావిస్తున్నా. ఇప్పుడు నా వయసు 32 సంవత్సరాలు. ఈ వయసురీత్యా ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశముంటుందా?

స్వదేశానికి తిరిగి వచ్చి, ఉన్నత చదువులు కొనసాగించాలనే మీ ఆలోచన అభినందనీయం. పీజీ తర్వాత ఎలక్ట్రానిక్స్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాలని భావిస్తున్నారు కాబట్టి మీరు పీజీ కూడా ఎలక్ట్రానిక్స్‌ చేయడం మేలు. పీజీలో ఏ స్పెషలైజేషన్‌ చదివినా దానికి సంబంధించిన ఉద్యోగావకాశాలుంటాయి. ఏ పీజీ చదవాలనేది మీ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆసక్తితో చదివిన ఏ కోర్సు అయినా ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. మీరు పీజీ దూరవిద్య ద్వారా చదవాలనుకుంటున్నారు కానీ ఎలక్ట్రానిక్స్‌ అనేది సాంకేతిక కోర్సు. కాబట్టి దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవడం వల్ల సబ్జెక్టు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా, కుటుంబపరంగా సమస్యల్లేకపోతే రెగ్యులర్‌గానే విద్యాభ్యాసం కొనసాగించండి.
ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే ఒక్కో ఉద్యోగానికి వయః పరిమితి ఒక్కోవిధంగా ఉంటుంది. కొన్నిటికి ఈ పరిమితి ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు ఉండకపోవచ్చు. అందుకని ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్‌ చూసి మీ వయసు దానికి సరిపోయినట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు.

పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. తర్వాత ఇంజినీరింగ్‌ చేయాలనుకుంటున్నా. అయితే ప్రభుత్వ కళాశాలల్లో మొదటి సంవత్సరం నుంచీ చదవాలనీ, ప్రైవేటు కళాశాలల్లో మాత్రమే రెండో సంవత్సరంలో చేర్చుకుంటారనీ విన్నాను. ఇది నిజమేనా? ప్రభుత్వ కళాశాలలకు లేటరల్‌ ఎంట్రీ వర్తిస్తుందో లేదో తెలపండి.

పాలిటెక్నిక్‌ మూడో సంవత్సరం చదువుతున్న మీరు ఈ-సెట్‌ ద్వారా ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో నేరుగా ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాన్ని పొందవచ్చు. కేవలం ప్రైవేటు కళాశాలల్లో మాత్రమే రెండో సంవత్సరంలో చేర్చుకుంటారనేది అవాస్తవం. ప్రైవేటు కళాశాలతోపాటు ప్రభుత్వ కళాశాలల్లో కూడా లేటరల్‌ ఎంట్రీ వర్తిస్తుంది. మీరు ఈ-సెట్‌ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించినట్లయితే ప్రభుత్వ కళాశాలల్లో నేరుగా ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం నుంచి చదవడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది.

టెన్త్‌ తర్వాత ఇంటర్‌ చదవకుండా 2012లో అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో బీఏ పూర్తి చేశా. తర్వాత భద్రాచలం గిరిజన సంక్షేమ కళాశాలలో బీఈడీ శిక్షణ పొందాను. ఓపెన్‌ ఇంటర్‌, రెగ్యులర్‌ పీజీ(ఎకనామిక్స్‌) ఒకేసారి చేయవచ్చా? అలా కుదరకపోతే ఈ ఏడాది పీజీ ఆపివేసి, ఓపెన్‌ ఇంటర్‌ చదవడం మంచిదా? లేకపోతే పీజీయే చేయడం మేలా? ఇంటర్‌ లేనందున డిగ్రీపై బీఈడీపై వచ్చే ఉద్యోగాలకు సమస్యలుంటాయా?

మీరు ఓపెన్‌ ఇంటర్‌, రెగ్యులర్‌ పీజీ ఒకేసారి చేయడానికి అవకాశం ఉంది. ఇంటర్‌ సబ్జెక్టునూ, పీజీ సబ్జెక్టునూ ఒకేసారి చదివే సామర్థ్యం ఉన్నట్లయితే రెండు కోర్సులనూ ఒకేసారి చదవచ్చు. ఒకవేళ మీరు ఈ రెండింటికీ ఒకేసారి న్యాయం చేయలేను అనుకుంటే ఒక కోర్సు తర్వాత మరొకటి చదవడం మేలు. ఇంటర్‌ అనేది డిగ్రీ, పీజీలకు పునాది కాబట్టి మొదటి ఇంటర్‌ చదివి ఆ తర్వాత పీజీ చేయడం మంచిది. ఇంటర్‌ లేనందున డిగ్రీ, బీఈడీపై వచ్చే ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల గురించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన, సమాచారం లేదు. ఒకవేళ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లో 10+2+3 ఉండాలని ఇచ్చినట్లయితే టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ తప్పకుండా అవసరం ఉంటుంది. నోటిఫికేషన్లలో లేనట్లయితే ఎలాంటి సమస్యా ఉండదు. తమిళనాడు రాష్ట్రంలో మాత్రం బీఈడీ చదవాలంటే 10+2+3 చదివి ఉండాలన్న నిబంధన ఉంది.

పీజీ పూర్తి చేసి, నెట్‌ అర్హత సంపాదించాను. అయితే ఇంటర్మీడియట్‌ పూర్తి చేయలేదు. డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు అర్హుడినేనా?

ఇంటర్మీడియట్‌ పూర్తి చేయకపోయినప్పటికీ, మీకు డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు అర్హత ఉంటుంది. ఇంటర్మీడియట్‌ చదవకుండా డిగ్రీ, పీజీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా కొంతమంది ఉన్నారు. మీరు కూడా డిగ్రీ లెక్చరర్‌ పోస్టుకు అర్హులవుతారు. మీరు ఎంచుకున్నది ఉపాధ్యాయ వృత్తి కాబట్టి ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీలను అన్నింటినీ పూర్తిగా చదవడం వల్ల సబ్జెక్టు పట్ల పూర్తి పరిజ్ఞానం ఉంటుంది. ఇది బోధనా రంగంలో రాణించడానికి దోహదపడుతుంది. బోధనారంగంలో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తిగా చదవడం మేలు. ఎందుకంటే జె.ఎల్‌., డి.ఎల్‌. లాంటి ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.

మా అబ్బాయి ఇంటర్‌ ఎంపీసీ చదువుతున్నాడు. తనను ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేయించాలని నా కోరిక. ఇంటర్‌ తర్వాత ఏ రకంగా ముందడుగు వేయాలి? ఈ కోర్సు ద్వారా ఉపాధి అవకాశాలు బాగుంటాయా?

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివించాలనే మీ కోరిక అభినందనీయం. కానీ ఆ కోర్సు చదవడం మీ అబ్బాయికి ఆసక్తి ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. అతడి సామర్థ్యం, నైపుణ్యాలు ఈ కోర్సు చదవడానికి సరిపోతాయో లేదో చూసుకోవాలి. అతనికి ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మీ కోరిక ప్రకారమే ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివించండి. ఈ కోర్సును మనదేశంలో అతి తక్కువ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అందిస్తున్నాయి. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి వివిధ విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలలు ఎంసెట్‌ ద్వారా కానీ జేఈఈ ద్వారా కానీ ప్రవేశాలు కల్పిస్తాయి. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సును అందిస్తున్న చాలా విద్యాసంస్థలు ఐఐటీలు నిర్వహించే జేఈఈ ద్వారానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఇంటర్‌ తర్వాత మీ అబ్బాయిని ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయండి.
ఈ కోర్సు ద్వారా ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువే. ఏర్‌ ఇండియా, ఇండియన్‌ ఏర్‌లైన్స్‌, హెలికాప్టర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మొదలైన ఏర్‌లైన్స్‌కి ఏరోనాటికల్‌ ఇంజినీర్ల అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా విమాన భాగాలను తయారుచేసే సంస్థలు హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, నేషనల్‌ ఏరోనాటికల్‌ ల్యాబ్‌, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ లాబొరేటరీస్‌, సివిల్‌ ఏవియేషన్‌ డిపార్ట్‌మెంట్‌, ఏరోనాటికల్‌ డెవెలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ లాంటి సంస్థల్లో, ఇస్రో లాంటి పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

ఎంబీఏ పూర్తి చేశాను. ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేయాలని కోరిక. దీనికి ఏ కోర్సు అయినా చేయాల్సి ఉంటుందా? అలాంటిది ఉంటే వివరాలు తెలుపగలరు.

బ్యాంకులో ఉద్యోగం చేయడానికి కనీస అర్హత- గుర్తింపు ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి ఏదైనా డిగ్రీని కల్గి ఉండటం. దానికోసం తప్పనిసరిగా ఏదైనా కోర్సు చేయాలనేది ఏమీ లేదు. మీరు బ్యాంకు ఉద్యోగంపై ఆసక్తితో ఉన్నారు కాబట్టి బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన అవగాహన పెంచుకోవడం కోసం ఏవైనా సర్టిఫికెట్‌ కోర్సులు చేయాలనుకుంటే చేయవచ్చు. ఈ రోజుల్లో దాదాపు చాలా బ్యాంకులు ఐబీపీఎస్‌ పరీక్ష ద్వారానే అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మాత్రం ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.బ్యాంకు ఉద్యోగానికి సంబంధించిన రాత పరీక్షలో ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, లాజికల్‌ రీజనింగ్‌ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. ఇవేకాకుండా ఇంటర్వ్యూ సమయంలో కమ్యూనికేషన్‌, జాబ్‌ నైపుణ్యాలు మొదలైనవి పరీక్షిస్తారు. మీరు పైన తెలిపిన అంశాలపై అవగాహన ఏర్పర్చుకొని రాతపరీక్ష, ఇంటర్వ్యూలకు సిద్ధం కండి.

పదో తరగతి తర్వాత కంప్యూటర్‌ కోర్సు చేసి రెవెన్యూ విభాగంలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాను. ఆర్థిక పరిస్థితులు బాగోనందున రెగ్యులర్‌ ఇంటర్‌ చేయలేక ఎన్‌ఐఓఎస్‌ ద్వారా ఇంటర్‌ పూర్తి చేశాను. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదివాను. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌కూ, రాష్ట్రస్థాయిలో గ్రూప్స్‌ ఉద్యోగాలకు అర్హుడినా? కాదా? మళ్లీ నేను రెగ్యులర్‌ ఇంటర్‌, డిగ్రీ చేయాలా?

ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా చదువు కొనసాగించడం అభినందనీయం. మీకు ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉండి, రెగ్యులర్‌ ఇంటర్‌, డిగ్రీ చేయాలనుకుంటే చేయండి. కానీ యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌కూ, రాష్ట్రస్థాయి గ్రూప్స్‌ ఉద్యోగాలకూ దూరవిద్యలో ఇంటర్‌, డిగ్రీ చేసినవారికి కూడా అర్హత ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని నోటిఫికేషన్లలో డిగ్రీ, ఇంటర్‌ రెగ్యులర్‌గా ఉండాలని ఇస్తే తప్ప, డిగ్రీ అర్హతతో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ మీకు అర్హత ఉంటుంది. నిరభ్యంతరంగా గ్రూప్స్‌కూ, సివిల్స్‌కూ సన్నద్ధం అవ్వొచ్చు.

నాలుగోతరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలో చదివాను. ముంబయికి వలస వెళ్లి, అక్కడ ఆరు నుంచి పదివరకు చదివాను. నా సందేహం ఏంటంటే ఐదో తరగతి చదవలేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడిని కాకపోయే అవకాశం ఉందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు లోకల్‌ అని ఏ నిబంధన ప్రకారం నిర్ణయిస్తారు?

టీచర్‌ అవ్వాలనే మీ కోరిక అభినందనీయం. ఒకప్పుడు ప్రైవేటుగా బీఎడ్‌ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఎన్‌.సి.టి.ఈ. (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌) ఇప్పుడు దాన్ని పూర్తిగా నిషేధించింది. ఇంతకుముందు డిగ్రీ తర్వాత ఇగ్నో (ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ), డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ లాంటి వాటిలో ప్రయివేటుగా బీఈడీ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయాల్లో బీఎడ్‌ చేయాలంటే కనీసం రెండు సంవత్సరాలు ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలలో ఫుల్‌టైం టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఇలాంటివారికే ప్రయివేటుగా బీఈడీ చేయడానికి అవకాశం ఉంది.
మన తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ విశ్వవిద్యాలయం లాంటి విద్యాసంస్థలు కూడా ప్రైవేటుగా బీఈడీ కోర్సును అందిస్తున్నాయి. కానీ రెండు సంవత్సరాలు పనిచేయడం మాత్రం తప్పనిసరి. కానీ మీకు బోధన అంటే ఆసక్తి ఉంది కాబట్టి రెగ్యులర్‌ బీఈడీ కోర్సు చేయడానికి ప్రయత్నించండి. దాని వల్ల మీరు టీచింగ్‌కి కావలసిన మెలకువలు, నైపుణ్యాలు, సబ్జెక్టు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఇంటర్‌, డీఈడీ పూర్తి చేశాను. అలాగే దక్షిణ భారత హిందీ ప్రచారసభలో డిగ్రీ పూర్తి చేశాను. దీన్ని డిగ్రీ సర్టిఫికెట్‌గా పరిగణిస్తారా? నాకు ఏయే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి?

దక్షిణ భారత హిందీ ప్రచారసభలో డిగ్రీ పూర్తిచేశాను అని తెలిపారు. కానీ మీరు ఏ కోర్సు చేశారో రాయలేదు. సాధారణంగా దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారు ప్రాథమిక్‌, మధ్యమ, రాష్ట్ర భాష, ప్రవేశిక, రాష్ట్రభాష విశారద్‌, రాష్ట్రభాష ప్రావీణ్‌ లాంటి కోర్సులను అందిస్తున్నారు. వీటిని డిగ్రీగానే పరిగణించరు. ఇవి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు. వీటితోపాటు మూడు సంవత్సరాల బి.ఎ., రెండేళ్ల ఎం.ఎ. కోర్సును అందిస్తున్నారు. మీరు మూడు సంవత్సరాల కోర్సును పూర్తిచేసినట్లయితే అది డిగ్రీ సర్టిఫికెట్‌గా పరిగణిస్తారు. లేదంటే డిగ్రీ సర్టిఫికెట్‌గా గుర్తించరు. మీరు ఇంటర్‌ చదివి, డీఈడీ పూర్తి చేశారు కాబట్టి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగ అవకాశాలుంటాయి. అంతేకాకుండా మీరు ఉన్నత చదువులు అభ్యసించాలనుకుంటే పి.జి. చేసి పీహెచ్‌డీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.

నాలుగోతరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలో చదివాను. ముంబయికి వలస వెళ్లి, అక్కడ ఆరు నుంచి పదివరకు చదివాను. నా సందేహం ఏంటంటే ఐదో తరగతి చదవలేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడిని కాకపోయే అవకాశం ఉందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు లోకల్‌ అని ఏ నిబంధన ప్రకారం నిర్ణయిస్తారు?

నాలుగోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన మీరు ఐదో తరగతి చదవకుండా 6 నుంచి 10 వరకు ముంబయిలో చదివారు. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు (దాదాపు ఏడు సంవత్సరాలపాటు) ఏ ప్రాంతంలో చదువుతారో వారిని ఆ ప్రాంతానికి చెందినవారిగా (లోకల్‌) పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకైనా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఐదో తరగతి చదవకపోవడం వల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకపోవడం అనేది ఏమీ ఉండదు. సాధారంణంగా పాఠశాలలో చదువుతున్నప్పుడు కొంతమంది ఒకటి రెండు తరగతులు దాటేసి చదువుతూ ఉంటారు. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఎలాంటి ప్రభావమూ ఉండదు. కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. లోకల్‌, నాన్‌లోకల్‌ విషయానికి వస్తే ఉద్యోగరీత్యా బదిలీ అయ్యేవారి పిల్లలు ఆ ప్రాంతాల్లోనే చదువుతుండటం చాలాచోట్ల జరుగుతుంది. ఎక్కువకాలం చదివిన ప్రాంతానికి వారిని లోకల్‌గా పరిగణిస్తారు.

ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చదివినవారు తమ ఉద్దేశం మార్చుకుని, మెడికల్‌ వైపు వెళ్లాలనుకుంటే ఏం చేయాలి? ఎంపీసీ చదివినా వైద్యవిద్యలో ప్రవేశం కల్పించే వెసులుబాటు దేశంలో ఏ విద్యా సంస్థలోనైనా ఉందా?

ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ (మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) చదివినవారికి మెడికల్‌ కోర్సులు చేయడానికి అర్హత ఉండదు. వైద్యవిద్యను అభ్యసించడానికి ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివివుండాలి. ఎంపీసీ అనేది నాన్‌మెడికల్‌ కోర్సులు చేయడానికి ఉపయోగపడుతుంది. మెడికల్‌ కోర్సులు చదవడానికి జీవశాస్త్రం (బయాలజీ) తప్పనిసరి సబ్జెక్టు. ఇతర దేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలన్నా ప్లస్‌ టూ (ఇంటర్మీడియట్‌)లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ (తప్పనిసరి), ఇంగ్లిష్‌ సబ్జెక్టులను ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాలల్లో చదివి ఉండాలి. ఒకవేళ ఎంపీసీ చదివి మెడికల్‌వైపు వెళ్లాలనుకుంటే మాత్రం మళ్లీ బైపీసీ చదివి, వైద్యవిద్యను అభ్యసించవచ్చు. ఎందుకంటే బైపీసీ చదవడంవల్ల వైద్యవిద్యకు కావలసిన మౌలికాంశాలను నేర్చుకుంటారు కాబట్టి. బయాలజీ... మెడికల్‌ కోర్సులకు పునాది లాంటిది.

మా అమ్మాయికి పదో తరగతి పూర్తయింది. తనను కాస్మటాలజీ ఇంజినీరింగ్‌ చేయించాలని ఉంది. ఇంటర్లో ఏ గ్రూపు దీనికి అవసరం?

ఇంజినీరింగ్‌ విద్యలో కాస్మటాలజీ ఇంజినీరింగ్‌ అనేది ప్రత్యేకమైన కోర్సు. ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్లు, కాస్మటిక్స్‌కు ఆదరణ పెరుగుతున్న సందర్భంలో కాస్మటాలజీ కోర్సుకు కూడా ఆదరణ పెరిగింది. మీ అమ్మాయికి ఈ కోర్సు చేయటానికి ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా ఈ కోర్సులో చేర్పించవచ్చు. దీన్ని చదవటానికి ముఖ్యంగా ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/మ్యాథ్స్‌లతో ఇంటర్‌ చదివివుండాలి. ఈ కోర్సును తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలోని కొన్ని యూనివర్సిటీలు నాలుగు సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ కాస్మటిక్‌ టెక్నాలజీ కోర్సును అందిస్తున్నాయి. రాష్ట్ర సంత్‌ తుకడోజీ మహరాజ్‌ నాగపూర్‌ యూనివర్సిటీ, నికాలస్‌ మహిళా మహావిద్యాలయ, విద్యాభారతి మహా విద్యాలయ, సంత్‌ గాడ్జీ బాబా అమరావతి యూనివర్సిటీ, ఆర్‌.సి. పటేల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మా ఎడ్యు. అండ్‌ రిసర్చ్‌, లేడీ అమృత్‌బాయి డాగా కాలేజ్‌ అండ్‌ శ్రీమతి రత్నీదేవి పురోహిత్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌ మొదలైన విద్యాసంస్థలు బ్యాచిలర్‌ ఆఫ్‌ కాస్మటిక్‌ టెక్నాలజీ కోర్సును అందిస్తున్నాయి.

దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశాను. హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమాను దూరవిద్యలో చేయాలనుకుంటున్నాను. ఏ సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి? ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

సాధారణంగా హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును దూరవిద్యలో కంటే నేరుగా చదవటంవల్ల ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలు పీజీ డిప్లొమా ఇన్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌/హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందిస్తున్నాయి. అందులో ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఇగ్నో, ఆంధ్ర, కాకతీయ, ఆచార్య నాగార్జున, శ్రీ వేంకటేశ్వర మొదలైన విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలు.. ఉదాహరణకు- అన్నామలై లాంటివి కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి. సాధారణంగా హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును దూరవిద్యలో కంటే నేరుగా చదవటంవల్ల ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పరిస్థితులూ అనుకూలంగా ఉన్నపుడు రెగ్యులర్‌గా చదవటానికే ప్రయత్నించండి. ఎందుకంటే... దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవటం వల్ల సబ్జెక్టు పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌/డెవలప్‌మెంట్‌ చదవటం వల్ల హెచ్‌ఆర్‌ జనరలిస్టు, స్టాఫింగ్‌ డైరెక్టర్‌, కాంపన్సేషన్‌ మేనేజర్‌, టెక్నికల్‌ రిక్రూటర్‌, ఎంప్లాయిమెంట్‌/ప్లేస్‌మెంట్‌ మేనేజర్‌, హెచ్‌ఆర్‌ ట్రెయినింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌, ఎంప్లాయీ రిలేషన్స్‌ మేనేజర్‌, ఆర్గనైజేషనల్‌ డెవలప్మెంట్‌ అండ్‌ చేంజ్‌ కన్సల్టెంటు మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చెంజ్‌లో సర్టిఫికెట్లను నమోదు చేయించాలని అంటుంటారు కదా? అలా చేయడం ఉద్యోగార్థులకు తప్పనిసరేనా? నమోదు చేయకపోతే సమస్యలు వస్తాయా?

విద్యార్హత సర్టిఫికెట్లను ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చెంజ్‌లో నమోదు చేయించడం వల్ల నిరుద్యోగుల వివరాలు ప్రభుత్వానికి తెలియడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నమోదు చేయకపోతే ప్రభుత్వం దగ్గర గణాంకాలుండవు. ఈ నమోదు వల్ల ప్రభుత్వానికి భవిష్యత్తులో ఉద్యోగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికీ, పాలసీలు తయారుచేయడానికీ అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు అయితే కొన్నికొన్ని ఉద్యోగాలు ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజి ద్వారానే భర్తీ చేయాలనే నిబంధన ఉండేది. కాలక్రమేణా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వారు ఇంటర్వ్యూలు, పరీక్షలు నిర్వహించి నేరుగా కొలువులు భర్తీ చేస్తున్నారు. ఏదిఏమైనా మీ విద్యార్హతలను నమోదు చేయించుకోవటం మీకు మంచిది; ముందు తరాలకు కూడా మంచిది. ప్రభుత్వం దగ్గర స్పష్టమైన గణాంకాలు ఉండటం వల్ల ఉపాధి కల్పనకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది.

ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ (బీఎస్‌సీ) వరకూ కరీంనగర్‌ జిల్లాలోనే చదివాను. ఉద్యోగరీత్యా తమిళనాడులోని సేలంలో ఉంటున్నా. పెరియార్‌ యూనివర్సిటీలో దూరవిద్యలో ఎంఎస్‌సీ (బోటనీ) చదువుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సెట్‌, జేఎల్‌ ఉద్యోగాలకు అర్హుడనవుతానా?

మీరు ఎంఎస్‌సీ ఇతర రాష్ట్రంలో చదివినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సెట్‌ (స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) రాయడానికి అర్హులే. కానీ ఉద్యోగ విషయానికొచ్చేసరికి లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. సాధారణంగా నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఏ రాష్ట్రంలో అయితే చదువుతారో ఆ రాష్ట్రానికి లోకల్‌గా పరిగణిస్తారు. మీరు ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకూ కరీంనగర్‌ జిల్లాలోనే చదివారు కాబట్టి జేఎల్‌ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.
సెట్‌ను ఎవరైనా, ఎక్కడైనా రాసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో అయితే నెట్‌ రాసి అర్హత సాధిస్తారో ఆ రాష్ట్రంలోని ఉద్యోగాలకు మాత్రమే అర్హులవుతారు. సెట్‌లో అర్హత సాధించడం వల్ల జూనియర్‌ లెక్చరర్‌ నుంచి డీఎల్‌గా పదోన్నతి పొందడానికి అవకాశం ఉంటుంది.

డిగ్రీ (2013-2016) ఫైనలియర్‌ రెగ్యులర్‌గా చదువుతున్నాను. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి డి.ఇడి (టీటీసీ)లో మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరాను. ఇలా ఒకే విద్యాసంవత్సరంలో రెండు రెగ్యులర్‌ కోర్సులు చేయవచ్చునా? తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా?

సాధారణంగా రెండు రెగ్యులర్‌ కోర్సులను ఒకే విద్యాసంవత్సరంలో చదవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఇలా చదివినప్పటికీ భవిష్యత్తులో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులుండవచ్చు. రెండు కోర్సులను రెగ్యులర్‌గా ఒకేసారి చేయడం వల్ల సాధారణంగా ఒక సర్టిఫికెట్టును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఒక కోర్సు పూర్తయిన తర్వాత మరొక కోర్సును చదవటం ఉత్తమం. రెండు కోర్సులను ఒకేసారి చదవడం వల్ల ఏ కోర్సును కూడా సరిగా అధ్యయనం చేయలేకపోవడం, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవడం.. ఇవన్నీ సమస్యలే!.

ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాను. నా సందేహం ఏమిటంటే... దూరవిద్య ద్వారా బీఏ చేయటం వల్ల అన్ని ఉద్యోగాలకూ అర్హత ఉంటుందా? రెగ్యులర్‌ డిగ్రీకి ఉన్న విలువ దీనికి ఉంటుందా?

దూరవిద్య ద్వారా చదవటం వల్ల కొన్ని ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. కానీ కొన్నిటికి తప్పనిసరిగా రెగ్యులర్‌గా చదివివుండాలని అడుగుతారు. ఒకవేళ నోటిఫికేషన్లో రెగ్యులర్‌ డిగ్రీని అడగకపోతే, ఆ సందర్భంలో ఆ ఉద్యోగాలకు అర్హులవుతారు. దూరవిద్య ద్వారా పొందిన చదువుకూ, రెగ్యులర్‌ చదువుకూ తేడా ఉంటుంది.
అన్నీ అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో రెగ్యులర్‌గా చదవడానికే ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఈ మార్గంలో సబ్జెక్టు పట్ల పరిజ్ఞానం పెంపొందటమే కాకుండా భావప్రకటన నైపుణ్యం, భావ ప్రసార సామర్థ్యం, మానసిక ఎదుగుదల, తోటివారితో సత్సంబంధాలు మొదలైనవి మెరుగుపడతాయి.
ఆర్థిక పరిస్థితులు సహకరించనపుడో, ఏదైనా ఉద్యోగం చేస్తున్నపుడో ... ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లోనే దూరవిద్యవైపు మొగ్గు చూపటం సరైనది. రెగ్యులర్‌గా చదవటం వల్ల అధ్యాపకులతో చర్చించే అవకాశాలుంటాయి. ఎక్కువ నేర్చుకోవచ్చు. దానివల్ల చదువులో ముందుకువెళ్లటానికి ఆస్కారం లభిస్తుంది. ఉద్యోగావకాశాలు, వ్యక్తిత్వ వికాసం, విద్యాభ్యాసంలో ప్రేరణ.. అన్నీ కళాశాల/ విశ్వవిద్యాలయంలో విద్య వల్ల మెరుగ్గా సాధ్యపడతాయి.

పాలిటెక్నిక్‌ (ఈఈఈ) తర్వాత ఉన్న ప్రభుత్వ ఉద్యోగావకాశాలను వివరించగలరు. పాలిటెక్నిక్‌ తర్వాత ఏ పై చదువులు చదివితే మంచి ఉద్యోగావకాశాలుంటాయి?

పాలిటెక్నిక్‌ (ఈఈఈ) చదివినవారికి ప్రభుత్వరంగంలోనైనా, ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగావకాశాలుంటాయి. ఉదాహరణకు... ఇండియన్‌ రైల్వే, డీఆర్‌డీవో, బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌హెచ్‌పీసీ, డీవీసీ, ఎలక్ట్రిసిటీ బోర్డ్‌, ఎన్‌టీపీసీ, ఇస్రో, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ మొదలైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉపాధి లభిస్తుంది.
కొత్తగా వస్తున్న ఉద్యోగ ప్రకటనల ప్రకారం ఇండియన్‌ ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌, ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌, ఇండియన్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీస్‌ మొదలైనవాటిలో కూడా ఎలక్ట్రానిక్స్‌ డిప్లొమా ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అయితే పాలిటెక్నిక్‌ తర్వాత అవకాశాలున్నప్పటికీ బీటెక్‌ తర్వాత కొలువుకు ప్రయత్నించటం వల్ల ఉన్నత ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. మీరు పై చదువులు కొనసాగించాలనుకుంటే బీటెక్‌ (ఈఈఈ), ఎంటెక్‌ చదవొచ్చు. ఆపై పీహెచ్‌డీ చేయటానికి కూడా వీలుంటుంది.

మా అమ్మాయి ఇంటర్‌ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతోంది. బీఎస్‌సీ (ఆప్టోమెట్రీ) చేస్తే విద్యా ఉపాధి అవకాశాలెలా ఉంటాయి? దీనికి ప్రవేశపరీక్ష ఉంటుందా? కోర్సును అందించే విద్యాసంస్థల వివరాలు తెలుపగలరు.

బీఎస్సీ (ఆప్టోమెట్రీ) అనేది విభిన్నమైన కోర్సు. దీనిలో ముఖ్యంగా మానవ నేత్ర నిర్మాణం, దాని విధులు, కన్ను పనిచేసే విధానం గురించి అధ్యయనం చేయాలి. ఈ కోర్సు చదవటానికి ఐసెట్‌ (EYECET) అనే ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మే, జూన్‌ నెలల్లో ఈ ప్రవేశపరీక్ష ప్రకటన వెలువడుతుంది.
బీఎస్‌సీ (ఆప్టోమెట్రీ) కోర్సును ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ (హైదరాబాద్‌), బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (పిలానీ), పారా మెడికల్‌ కాలేజ్‌ (దుర్గాపూర్‌), ఆదిత్య జ్యోత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ముంబయి), లోటస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ముంబయి), మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్స్‌ (మణిపాల్‌), అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (కొచ్చి, కేరళ), త్రిపుర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారామెడికల్‌ సైన్స్‌ (అగర్తల) లాంటి విద్యాసంస్థలు అందిస్తున్నాయి.
ఈ కోర్సు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆప్టోమెట్రిస్టులుగా, కంటివైద్య నిపుణులకు సహాయకులుగా ఉపాధి అవకాశాలుంటాయి. ఈ కోర్సు చదివిన తర్వాత ఉన్నతవిద్యను అభ్యసించాలనుకుంటే... మాస్టర్స్‌ డిగ్రీ ఇన్‌ ఆప్టోమెట్రీ చదవొచ్చు. అంతేకాకుండా చదువు కొనసాగించాలంటే పీహెచ్‌డీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.

నాకు యానిమేషన్‌ అంటే చాలా ఆసక్తి. ఇంటర్‌ను ఎంపీసీ గ్రూపుతో పూర్తిచేశాను. త్రీడీ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌... ఈ మూడూ కలిసి అందిస్తున్న కళాశాలలుంటాయా? ఈ రంగంలో కెరియర్‌ అవకాశాలు ఎలా ఉంటాయి?

త్రీడీ యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్‌... మూడింటినీ కలిపి అందిస్తున్న విద్యాసంస్థలు మనదేశంలో తక్కువగానే ఉన్నాయి. సాధారణంగా ఈ కోర్సులను ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. కొన్ని కళాశాలలు త్రీడీ యానిమేషన్‌నూ, కొన్ని వీఎఫ్‌ఎక్స్‌ కోర్సునూ, కొన్ని యానిమేషన్‌+ గేమింగ్‌నూ, కొన్ని కళాశాలలు యానిమేషన్‌ + వీఎఫ్‌ఎక్స్‌నూ అందిస్తున్నాయి.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఆర్ట్‌ అండ్‌ యానిమేషన్‌ (కోల్‌కత), ఎరీనా మల్టీమీడియా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (అహ్మదాబాద్‌) లాంటివి బ్యాచిలర్‌ ఆఫ్‌ త్రీడీ యానిమేషన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి.
సాంకేతికతను విభిన్న రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో నైపుణ్యం కలిగిన, శిక్షణ పొందిన యానిమేటర్ల అవసరం చాలా ఉంటుంది. ఈ కోర్సులు చదివినవారికి వినోద, గేమింగ్‌ పరిశ్రమల్లో, టీవీ, వాణిజ్యప్రకటనల పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలుంటాయి.

ఇంటర్‌ బైపీసీ గ్రూపుతో 2011లో పాసయ్యాను. తర్వాత డిప్లొమా ఇన్‌ ఫార్మసీలో చేరాను. కొందరు ఈ కోర్సును తీసేస్తారనీ, భవిష్యత్తు ఉండదనీ భయపెడుతున్నారు. ఇదెంతవరకూ నిజమో తెలియక పరీక్షలకు సరిగా తయారవలేకపోతున్నా. వాస్తవాలేమిటో తెలుపగలరు.

* ఈ కోర్సును తీసేస్తారనీ, భవిష్యత్తు ఉండదనీ చెప్పడంలో ఎలాంటి వాస్తవమూ లేదు. ఇంజినీరింగ్‌లో పాలిటెక్నిక్‌ అనేది ఎలాగైతో ఉందో ఫార్మసీ రంగంలో డీ ఫార్మసీ కూడా ఒక డిప్లొమా ప్రోగ్రాం. డిప్లొమా ఇన్‌ ఫార్మసీ చదివినవారికి మందుల దుకాణాలు పెట్టటానికీ, అందులో పనిచేయటానికీ అవకాశం ఉంటుంది.
వైద్య ఆరోగ్యరంగం బహుముఖంగా ఎదుగుతున్న ఈ తరుణంలో ఫార్మసిస్టుల అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కోర్సు చదివినవారికి ఫార్మసీ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వైద్య ఆరోగ్య రంగంలో అవకాశాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈ రంగంలో భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయపడాల్సిన అవసరమే లేదు.
మీకు ఉన్నత చదువులు చదవాలనే ఆకాంక్ష ఉన్నట్లయితే మీరు చదువును కొనసాగించండి. దానివల్ల మీకు ఉద్యోగావకాశాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎలాంటి అనుమానాలూ లేకుండా పరీక్షలకు సిద్ధం కండి!

ఇంటర్‌ చదవకుండా అధ్యాపక వృత్తికి అర్హత ఉండదని ఓ జీఓ గురించి మీరు ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఏపీ సెట్‌/యూజీసీ నెట్‌లో అర్హత సాధించినవారికి ఇందులో మినహాయింపు ఇస్తారా? లేదా ఇప్పుడు దూరవిద్యలో ఇంటర్‌ పూర్తిచేయొచ్చా? అర్హత లేనట్లయితే సెట్‌, నెట్‌ రాసేందుకు అర్హత కల్పించి లెక్చరర్‌షిప్‌కు అర్హత ఉందంటూ సర్టిఫికెట్‌ ఇవ్వకూడదు కదా?

* ఉపాధ్యాయ/అధ్యాపక/మరో ఉద్యోగ నియామకాలకైనా విద్యార్హతలు ఉద్యోగ ప్రకటనలో ఇచ్చిన ప్రకారమే పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వులను కూడా కోర్టు తీర్పులను బట్టి, గత ఉద్యోగ నియామకాల్లో ఎదురైన సమస్యలను బట్టి ఎప్పటికప్పుడు సవరిస్తుంటారు. 2008లో ఉమ్మడి రాష్ట్రపు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధ్యాపక ఉద్యోగ ప్రకటనలో పీజీలో మార్కుల శాతం, నెట్‌/సెట్‌ల ప్రస్తావన మాత్రమే ఉంది. దానికి అనుగుణంగానే నియామకాలు చేపట్టారు.
2010 యూజీసీ నియమావళి ప్రకారం ‘గుడ్‌ ఎడ్యుకేషన్‌ రికార్డ్‌’ అనే నిబంధనను చేర్చారు. అయితే దీన్ని వివిధ విశ్వవిద్యాలయాలు/ నియామక సంస్థలు వివిధ రకాలుగా నిర్వచిస్తున్నాయి. ఆమేరకు యూజీసీ కూడా వెసులుబాటు కల్పించింది.
దూరవిద్య ద్వారా డిగ్రీలు పొందినవారు రెండు కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది- సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ లేకుండా ఓపెన్‌ వర్సిటీ ద్వారా నేరుగా చేసిన పీజీ డిగ్రీ చెల్లదు. ఇటీవల వచ్చిన మద్రాస్‌ హైకోర్టు తీర్పు ప్రకారం- 10+2 చదవకుండా పొందిన డిగ్రీలు కూడా రెగ్యులర్‌ డిగ్రీలకు సమానం. అయితే ఆ డిగ్రీ చేయటానికి యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైవుండి ఆ ప్రవేశపరీక్ష రాసే సమయానికి అభ్యర్థికి 21 సంవత్సరాలు నిండివుండాలి. దూరవిద్య ద్వారా అందించే ప్రతి కోర్సూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌/డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతి పొందడం తప్పనిసరి.
మీరు డిగ్రీని పైవిధంగా పొందివుంటే, ఉద్యోగ ప్రకటనలో 10+2+3 నిబంధన లేకపోతే, నిరభ్యంతరంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఒకవేళ ఆ నిబంధన ఉంటే మాత్రం నెట్‌/సెట్‌లు ఉన్నా గానీ ఎలాంటి మినహాయింపు ఉండదు.
నెట్‌/సెట్‌ ధ్రువపత్రాల్లో ఒక గమనిక ఉంటుంది. అదేమిటంటే... ఈ ధ్రువపత్రాన్ని అభ్యర్థి దరఖాస్తులో రాసిన విషయాలకు లోబడి ఇచ్చాం కానీ వాటి నిర్థారణ చేసుకునే బాధ్యత ఉద్యోగ నియామక సంస్థలదేనని. ఇప్పుడు మీరు ఇంటర్‌ చదవాలనుకుంటే నిరభ్యంతరంగా చదవొచ్చు. కానీ దాన్ని అంగీకరించాలా లేదా అనే విషయంలో తుది నిర్ణయం మాత్రం ఉద్యోగ నియామక సంస్థలదే. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే నోటిఫికేషన్ల కోసం ఇప్పటినుంచే సిద్ధపడండి.

పదో తరగతి పాసయ్యాను. నా స్కూలింగ్‌ అంతా ఆంధ్రప్రదేశ్‌లోనే సాగింది. హైదరాబాద్‌లోగానీ, బెంగళూరులో గానీ ఇంటర్‌ చదవమని అమ్మానాన్నా అంటున్నారు. బైపీసీ తీసుకొని, ఇంటర్‌ తర్వాత సెంట్రల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనుకుంటున్నాను. నేను ఎక్కడ చదివితే మంచి అవకాశాలు అందుతాయో తెలుపగలరు?

* బైపీసీ చదివి, ఇంటర్‌ తర్వాత సెంట్రల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనే మీ కోరిక అభినందనీయం. మీరు ఇంటర్‌ హైదరాబాద్‌లోచదివినా, బెంగళూరులో చదివినా మీ ఉద్యోగావకాశాలు, ఉన్నత విద్య అవకాశాలు ఒకేలా ఉంటాయి. మీరు పొందే అవకాశాలు మీరు ఎక్కడ చదివారన్నదానిపై ఆధారపడవు. మీకున్న సబ్జెక్టు పరిజ్ఞానం, నైపుణ్యాలు, మీ తెలివితేటలు, భావ ప్రకటన సామర్థ్యం మొదలైనవి మీ భవిష్యత్తు అవకాశాలను ప్రభావితం చేస్తాయి.
ఆ సామర్థ్యాలు పెంపొందించుకున్నట్లయితే ఎక్కడ చదివినా మంచి అవకాశాలు తప్పకుండా లభిస్తాయి. సెంట్రల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆసక్తి ఉన్నచోటనే చదువుకోండి. సెంట్రల్‌ యూనివర్సిటీలో కూడా వివిధ రకాల సైన్సు గ్రూపులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

నాకు జంతువుల గురించి తెలుసుకోవాలనీ, ఆ విశేషాలను ప్రజలకు తెలియజేయాలనీ చిన్నప్పటి నుంచీ ఉత్సాహం ఎక్కువ. మనదేశంలోని అడవులూ, వాటిలోని జంతువుల సమాచారాన్ని డాక్యుమెంటరీల కోసం సేకరించేందుకు ఏం చదివి, ఎవరి అనుమతులు తీసుకోవాలి? నా అర్హత బీఏ, బీఈడీ మాత్రమే.

* జంతువుల గురించి తెలుసుకొని, ఆ విశేషాలను ప్రజలకు తెలియజేయాలనే మీ ఉత్సాహం అభినందనీయం. దానికోసం వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీరు బీఏ చదివానని రాశారు. బీఎస్సీ ఫారెస్ట్రీ చదివి, దానితర్వాత ఎంఎస్సీ ఫారెస్ట్రీలో వివిధ రకాల స్పెషలైజేషన్లు... ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌, వైల్డ్‌లైఫ్‌ సైన్స్‌లాంటి కోర్సులను చదివినట్టయితే మీకు అడవులు, వాటిలోని జంతువుల పట్ల చాలా అవగాహన వస్తుంది. ఆ తర్వాత పీహెచ్‌డీ చేస్తే అడవులు, జంతువులపై పరిశోధనలకూ అవకాశం ఉంటుంది.
బీఎస్సీ (జువాలజీ), బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బీఎస్సీ (బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ) లాంటి కోర్సులు చదివి ఎమ్మెస్సీ జువాలజీ చేయవచ్చు. ఇవి చదవడం వల్ల నేషనల్‌ జాగ్రఫీ, యానిమల్‌ ప్లానెట్‌, డిస్కవరీ ఛానెల్‌లాంటి ఛానెళ్లలో కూడా ఉద్యోగావకాశాలుంటాయి.
పైన తెలిపిన కోర్సులే కాకుండా డిజిటల్‌ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ, ఎస్‌ఎల్‌ఆర్‌ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. దగ్గరలో ఉన్న అటవీశాఖాధికారులను సంప్రదిస్తే డాక్యుమెంటరీ తీయడానికి అవసరమైన సమాచారం పొందవచ్చు.

సి.ఎ.తో పాటు ఇతర కోర్సులు చేయవచ్చా? దానికి అవకాశముంటే ఏ కాంబినేషన్‌ కోర్సు(లు) చేయడం ప్రయోజనకరం?

* సీఏతో పాటు ఇతర కోర్సులు చేయవచ్చు. చార్టర్డ్‌ అకౌంటెన్సీ అనేది పూర్తిగా వృత్తివిద్యాకోర్సు. అదనపు కోర్సులు చదివినా, చదవకపోయినా దానికి ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ రోజుల్లో కంపెనీలు అదనపు అర్హతలున్న అభ్యర్థులకే ప్రాముఖ్యం ఇస్తున్నాయి. కాబట్టి అదనపు కోర్సులు చదవటం వల్ల లాభమే కానీ నష్టమేం లేదు.
సీఏ అనేది ఫైనాన్స్‌కు సంబంధించిన కోర్సు. ఎంబీఏ (ఫైనాన్స్‌) చేయడం వల్ల మీ ఆర్థిక సంబంధ నైపుణ్యాలతో పాటు నిర్వహణ నైపుణ్యాలు కూడా తోడై మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచే అవకాశం ఉంటుంది. సీఏ+ కంపెనీ సెక్రటరీ (సీఎస్‌) కూడా మంచి కలయిక. అకౌంట్స్‌తో పాటు సెక్రటేరియల్‌ వర్క్‌ కూడా తేలిగ్గా నిర్వహించగలుగుతారు.
వీటితోపాటు ఐసీఏఐ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్ట్‌ర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా) వారు వివిధరకాల సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నారు. ఉదాహరణకు... ఎంటర్‌ప్రైజ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌, మాస్టర్‌ ఇన్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌, ఇంటర్నేషనల్‌ టాక్సేషన్‌, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫ్రాడ్‌ ప్రివెన్షన్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ స్టాండర్డ్స్‌, డెరివేటివ్స్‌, ఫారెక్స్‌ అండ్‌ ట్రెషరీ మేనేజ్‌మెంట్‌ మొదలైనవి.
డిప్లొమా ఇన్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఆడిట్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ లా, మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ లాంటి పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ కోర్సులను అందిస్తోంది.
ఇతర కోర్సులు సీపీఏ (సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటెంట్స్‌), సీఎఫ్‌పీ (సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌), సీఐఏ (సర్టిఫైడ్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌), సీఎఫ్‌ఏ (చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌) లాంటి కోర్సులు కూడా సీఏతో పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకేసారి వివిధ కోర్సులు చేయడం అనేది మీ ఆసక్తి, అంకితభావాలపై ఆధారపడివుంటాయి.

ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేస్తున్నాను. కొన్ని సంస్థల వారు ఇంటర్‌ ఎంపీసీతో పాటు డిగ్రీ (బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)తో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ కోర్సుతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించవచ్చని ప్రకటిస్తున్నారు. బీటెక్‌ లేకుండా డిగ్రీ విద్యతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించగలమా? అలా సాధ్యమైతే భవిష్యత్తు ఎలా ఉంటుంది?

* ఉద్యోగం సంపాదించడం అనేది పూర్తిగా అభ్యర్థిపైనే ఆధారపడివుంటుంది. ఏ సంస్థ అయినా అభ్యర్థులకు శిక్షణ మాత్రమే ఇస్తుంది కానీ, శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వస్తుందనేది చాలావరకూ జరగకపోవచ్చు. శిక్షణలో అభ్యర్థి నేర్చుకున్న మెలకువలు, తనకున్న నైపుణ్యాలు, సబ్జెక్టు పరిజ్ఞానం, సామర్థ్యాలు మొదలైనవి ఉద్యోగం సంపాదించడానికి దోహదపడతాయి.
బీటెక్‌ లేకుండా డిగ్రీ విద్యతో ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. బీకాం (కంప్యూటర్స్‌), బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌), బీసీఏ లాంటి కోర్సులతో కూడా ఉద్యోగం సంపాదించవచ్చు. ఈ మధ్యకాలంలో ఇంజినీరింగ్‌ సీట్లు చాలా ఎక్కువైపోయిన తర్వాత, ఇంజినీరింగ్‌లో నాణ్యత లేదని చాలా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు డిగ్రీ చదివినవారికి కొంతకాలం శిక్షణ ఇచ్చి వారిని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా తీసుకుంటున్నాయి.
భవిష్యత్తు అనేది పూర్తిగా మీ పనితనం, కొత్త విషయాలు నేర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు, ఇచ్చిన పనిని ఎంత సమర్థంగా చేస్తారు అనేవాటిపై ఆధారపడివుంటుంది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో కూడా మొదట ఉద్యోగం వరకూ ఇవ్వగలుగుతారు. ఐఐటీలో చదివివచ్చినా, ఐఐఎంలో చదివివచ్చినా అభ్యర్థి సంస్థలో పని చేసే తీరును బట్టి భవిత నిర్ణయమవుతుంది.

2005లో ఇంటర్‌ బైపీసీ గ్రూపుతో పాసయ్యాను. 2011లో నర్సింగ్‌ చేశాను. దీని తర్వాత నర్సింగ్‌ కాకుండా బీఫార్మసీ చేయాలని అనుకుంటున్నాను. దీన్ని అర్హురాలినేనా? ఫార్మసీ సంబంధమైనవి వేరే కోర్సులేమైనా చేయొచ్చా?

* ఇంటర్‌ బైపీసీ గ్రూపుతో పాసయ్యారు కాబట్టి బీఫార్మసీ చేయడానికి అర్హత ఉంటుంది. మీకు ఆసక్తి ఉన్న బీఫార్మసీ చేయవచ్చు. ఫార్మసీకి సంబంధించిన వేరే కోర్సులు ఉన్నప్పటికీ మీకున్న ఆసక్తిని బట్టి ముందుకెళ్లడం మంచిది. ఫార్మసీ సంబంధమైన కోర్సులు... అంటే డిఫార్మసీ చేయడానికి అవకాశం ఉంటుంది. బీఎస్సీ ఇన్‌ క్లినికల్‌ రీసెర్చ్‌, బీఎస్సీ ఇన్‌ న్యూట్రిషన్‌, బీపీటీ (ఫిజయోథెరపి), బీపీహెచ్‌( పబ్లిక్‌ హెల్త్‌) లాంటి ప్రత్యేకమైన కోర్సులు కూడా చేయవచ్చు.

బీఎస్‌సీ (ఎంపీసీ) చదివాను. మా ప్రాంతంలో సౌర శక్తి (సోలార్‌ ఎనర్జీ) కోర్సులూ, శిక్షణల గురించి తెలిపాల్సిందిగా కోరుతున్నాను.

* సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క హైదరాబాద్‌లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో సోలార్‌ ఎనర్జీ కోర్సులు, శిక్షణను ఇచ్చే సంస్థలు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. సోలార్‌ ఎనర్జీకి సంబంధించిన శిక్షణ కోర్సులు సోలార్‌ పవర్‌ డిజైన్‌, సోలార్‌ పవర్‌ ఇన్‌స్టాలేషన్‌, సోలార్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, సోలార్‌ ఎనర్జీ సర్టిఫికేషన్‌ మొదలైన కోర్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు సోలార్‌ ఎనర్జీ శిక్షణ కోర్సులను అందిస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ పవర్‌ టెక్నాలజీస్‌ అండ్‌ వొకేషనల్‌ ట్రెయినింగ్‌, హైదరాబాద్‌, స్టీన్‌బీస్‌ సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ ఇండియా, రీజినల్‌ గవర్నమెంట్‌ ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (విశాఖపట్నం) మొదలైన సంస్థలు సోలార్‌కు సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి.

ఇంటర్‌ చదువుతున్నాను. డిప్లొమా ఇన్‌సీడ్‌ టెక్నాలజీ కోర్సు చేయాలనుకుంటున్నాను. దీనికి ఏ ప్రవేశ పరీక్ష రాయాలి? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలున్నాయి?

* తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ కోర్సును ఆచార్య ఎన్‌.జి.రంగా విశ్వవిద్యాలయం అందిస్తోంది. ఈ కోర్సు చదవడానికి పదో తరగతి 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. కోర్సు కాలవ్యవధి 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ కోర్సును అందిస్తున్న సంస్థలు- విజయనగరంలోని డాక్టర్‌ ఎన్‌.ఆర్‌.ఆర్‌. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ఎస్‌.బి.వి.ఆర్‌. ఎడ్యుకేషనల్‌ సొసైటీ కళాశాల, తెలంగాణలో ఉన్న డాక్టర్‌. డి.రామానాయుడు విజ్ఞానజ్యోతి అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల. వీటితో పాటు వివిధ ప్రైవేటు కళాశాలల్లో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది.

బీఎస్సీ (జియాలజీ) మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎంఎస్‌సీ ఓషనాగ్రఫీ చేయాలని కోరిక. ఈ కోర్సు అందించే విద్యాసంస్థల గురించి, దీని ఉద్యోగావకాశాల గురించీ తెలపండి. ఈ కోర్సు చేస్తే సైంటిస్ట్‌ ఉద్యోగాలకు అవకాశం ఉంటుందా? ఎందుకంటే సైంటిస్టు అవ్వాలనేది నా కల.

* సైంటిస్టు అవ్వాలనే మీ కోరిక అభినందనీయం. ఓషనోగ్రఫీ అనేది ఆసక్తికరమైన కోర్సు. మన భారతదేశంలో కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు ఎంఎస్‌సీ (ఓషనోగ్రఫీ)ని అందిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవి- అన్నామలై, అలగప్ప, కొచ్చిన్‌ యూనివర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కత, భారతీదాసన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ మొదలైన విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
ఓషనోగ్రఫీ చదివినవారికి ఉద్యోగవకాశాలు విరివిగా ఉంటాయి. ఈ కోర్సు చదివినవారికి కోల్‌ ఇండియా, మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అథారిటీ, ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ జింక్‌, వివిధ రకాల ఆర్గనైజేషన్లలో ఉద్యోగావకాశాలుంటాయి. రక్షణ, పారామిలిటరీ దళాలు కూడా జియాలజిస్ట్‌, ఓషనోగ్రాఫర్‌ సేవలను వినియోగించుకుంటాయి. ఓషనోగ్రఫీ చదివినవారికి ఎన్విరాన్‌మెంటర్‌ సైంటిస్ట్‌, జియో- డెసిస్ట్‌, జియో గ్రాఫర్‌, జియాలజిస్టు, జియోఫిజిసిస్ట్‌, హైడ్రోగ్రాఫర్‌, ఓషినోగ్రాఫర్‌, మైనింగ్‌ ఇంజినీర్‌.. ఇలా ఉద్యోగావకాశాలుంటాయి. ఎంఎస్‌సీ తర్వాత పీహెచ్‌డీ (ఓషనోగ్రఫీ) చేసినట్లయితే మీరు ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో, కళాశాలల్లో శాస్త్రవేత్తలుగా పనిచేయడానికి అవకాశాలుంటాయి.

దూరవిద్యావిధానంలో పీజీ (ఎకనామిక్స్‌) చదువుతున్నాను. ఇంటర్‌, డిగ్రీ ఒకే సంవత్సరంలో చదివాను. నాగార్జున విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతూ ఓపెన్‌ స్కూల్‌ పద్ధతిలో ఇంటర్‌ కట్టాను. ఈ రెండూ ఒకేసారి చదవడం వల్ల నాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? లెక్చరర్‌ పోస్టులకు అర్హడనవుతానా? మళ్ళీ డిగ్రీ చదవాలా?

* ఇంటర్‌, డిగ్రీ రెండూ ఒకేసారి చదవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు ఇంటర్‌ సర్టిఫికెట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డిగ్రీని మళ్ళీ చదవడం ఉత్తమం. అప్పుడు మీరు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికీ అర్హత ఉంటుంది. దూరవిద్య ద్వారా చదివినవారు కూడా లెక్చరర్‌ పోస్టులకూ, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే ఏ కోర్సు అయినా రెగ్యులర్‌గా చేయడం మంచిది. ఇలా చదవటం వల్ల సబ్జెక్టు పట్ల అవగాహన, నైపుణ్యాలూ పెంపొందుతాయి. పోటీ పరీక్షల్లో కూడా మీ ప్రతిభ కనబరచడానికి అవకాశం ఎక్కువ.

కాకతీయ విశ్వవిద్యాలయం (స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ లర్నింగ్‌ అండ్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌) ద్వారా నేరుగా బి.ఎ. డిగ్రీ, బీఈడీ పూర్తిచేశాను. ప్రభుత్వ ఉద్యోగాలకు నాకు అర్హత ఉందా? డీఎస్‌సీ రాయడానికి అవకాశం ఉంటుందా?

* మీకు ప్రభుత్వ ఉద్యోగాలకూ, డీఎస్‌సీ రాయడానికీ అవకాశం ఉంటుంది. మీ విద్యాభ్యాసం మొత్తం దూరవిద్య ద్వారానే చేశారు. అన్నీ అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో రెగ్యులర్‌గా చదవడానికే ప్రాముఖ్యం ఇవ్వాలి. దీనివల్ల ఉపాధ్యాయులతో చర్చించే వీలుండి సబ్జెక్టు పరిజ్ఞానమే కాకుండా భావ ప్రకటన నైపుణ్యం, మానసిక ఎదుగుదల, తోటివారితో సత్సంబంధాలు అలవడతాయి. చదువులో ప్రేరణ, వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగసాధనలో ముందంజ... ఇవన్నీ కళాశాల/విశ్వవిద్యాలయ విద్య వల్ల సాధ్యపడతాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు, ఏదైనా ఉద్యోగం చేస్తుండటం.. ఇలాంటి ప్రత్యేక కారణాలున్నపుడు మాత్రమే దూరవిద్యను ఎంచుకోవడం మేలు.

ఇంటర్మీడియట్‌ (ఎంఈసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు సాంకేతిక అంశాలపై ఆసక్తి ఉంది. ఈ మధ్యనే ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) గురించి విన్నాను. ఈ సంస్థ ఎక్కడుంది? ఏ కోర్సు (డిప్లొమా, డిగ్రీ) అందిస్తుంది? ఎంఈసీ తర్వాత ఇందులో చేరవచ్చా? బీకాం డిగ్రీ చేస్తూనే ఈ కోర్సు చేయవచ్చా?

* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. దీనికి చాలాచోట్ల బ్రాంచీలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతిలలో సంస్థ శాఖలున్నాయి. ఐఐహెచ్‌టీ సంస్థ ముఖ్యంగా ఐటీఎంఎస్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌), నెట్‌ వర్కింగ్‌, వెబ్‌ అప్లికేషన్‌ డెవెలప్‌మెంట్‌, డాట్‌నెట్‌, జావా మొదలైన డిప్లొమా కోర్సులను అందిస్తుంది. బిగ్‌డేటా అనలిటిక్స్‌, ఆండ్రాయిడ్‌ ఆప్‌ డెవెలప్‌మెంట్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌ సర్వర్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులను అందిస్తుంది. ఎంఈసీ తర్వాత మీరు ఇందులో చేరవచ్చు. డిగ్రీ చేస్తూనే ఈ కోర్సులు చేయాలని ఏమీ లేదు. ఇంటర్‌ తర్వాత కూడా ఈ సంస్థలో చేరడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కోర్సులు డిగ్రీ తర్వాత మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది.

దూరవిద్యలో ఆంత్రొపాలజీ (పీజీ)ని అందిస్తున్న విద్యాసంస్థల వివరాలు తెలుపగలరు?

* మనదేశంలో అతి తక్కువ విశ్వవిద్యాలయాలు దూరవిద్యలో ఆంత్రొపాలజీని అందిస్తున్నాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం, నార్త్‌ ఒరిస్సా యూనివర్సిటీ లాంటివాటిల్లో దూరవిద్యలో ఆంత్రొపాలజీ అందుబాటులో ఉంది. మీకు అనుకూల పరిస్థితులు ఉంటే దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవటానికే మొగ్గు చూపండి.

ఇంటర్‌ (బైపీసీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నాకు అంతరిక్షం, గ్రహాలపై ఆసక్తి. సంబంధిత కోర్సులు ఏం చేయవచ్చు? వాటి ఉద్యోగావకాశాలు ఏమిటో వివరించండి.

* సాధారణంగా అంతరిక్షం, గ్రహాలకు సంబంధించిన కోర్సులు చదవడానికి భౌతికశాస్త్రం, గణితశాస్త్రం కీలక పాత్రను పోషిస్తాయి. మీరు ఇంటర్‌ బైపీసీ చదువుతున్నారు కాబట్టి అంతరిక్షం- గ్రహాలకు సంబంధించిన కోర్సులు చేయడానికి అతి తక్కువ అవకాశాలుంటాయి. అందుకని బైపీసీ గ్రూపుతో చేయదగిన కోర్సుల్లో మీకు ఆసక్తి ఉన్న కోర్సును చేయడానికి ప్రయత్నించండి. ఏ కోర్సుకైనా దానికి సంబంధించిన ఉద్యోగావకాశాలు తప్పకుండా ఉంటాయి. కానీ మీకున్న ఆసక్తి, నైపుణ్యాలను బట్టి తగిన కోర్సును ఎంచుకోవడం ముఖ్యం. అలా కాకుండా మీరు అంతరిక్షం- గ్రహాలకు సంబంధించిన కోర్సులను మాత్రమే చేయదలచుకుంటే ఇంటర్‌ ఎంపీసీ చదివి గణితం, భౌతిక శాస్త్రాలపై పట్టు సాధించాల్సివుంటుంది. అప్పుడు మాత్రమే ఆ కోర్సులు చేసే వీలుంటుంది. తద్వారా నాసా, ఇస్రో లాంటి అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో చేరే ఆస్కారం ఉంటుంది.

బి.ఎ (ఇంగ్లిషు, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. ఎంఎ., ఇంగ్లిషు, ఎంటీటీఎమ్‌ అందిస్తున్న విద్యాసంస్థలేమిటి? ఎంబీఏ (టూరిజం) వివరాలు తెలుపగలరు.

* మన తెలుగు రాష్ట్రాల్లోని చాలా విశ్వవిద్యాలయాల్లో ఎం.ఎ ఇంగ్లిషు కోర్సు అందుబాటులో ఉంది. ఉదాహరణకు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, ఆంధ్ర, శ్రీకృష్ణదేవరాయ, శ్రీవెంకటేశ్వర, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మొదలైన సంస్థల్లో ఎంఏ ఇంగ్లిషు కోర్సు అందుబాటులో ఉంది.
ఎంటీటీఎమ్‌ (మాస్టర్స్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సును మన తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం; శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఎంఏ (టూరిజం)ను అందిస్తున్నారు. వీటితోపాటు ఎంబీఏ కోర్సును డా.వై.ఎస్‌.ఆర్‌. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (హైదరాబాద్‌), ఇతర రాష్ట్రాల్లో పాండిచ్చేరి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ, కేరళ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ స్టడీస్‌, డా.డి.వై. పాటిల్‌ విద్యాపీఠ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన విద్యాసంస్థలు అందిస్తున్నాయి.
మీ ఆసక్తిని బట్టి మీకు నచ్చిన కోర్సును చదవచ్చు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ ఇంగ్లిషు, ఎంటీటీఎమ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఐటీఐ ఫిట్టర్‌ చదివాను. గత ఐదేళ్ళ నుంచి ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఓపెన్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తయింది. నాకు ఉద్యోగావకాశాలున్నాయా? ఈసెట్‌ రాసి ఇంజినీరింగ్‌ చేయడానికి అర్హుడనేనా?

* ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తయిన మీకు ఈసెట్‌ రాయడానికి అర్హత ఉంది. డిప్లొమా తర్వాత కూడా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కానీ మీకు ఇంజినీరింగ్‌ చదవాలని ఆసక్తి ఉన్నట్లయితే అది పూర్తయిన తర్వాత ఉద్యోగానికి ప్రయత్నించండి. డిప్లొమా తర్వాత ఉండే అవకాశాలకంటే ఇంజినీరింగ్‌ తర్వాత ఉండేవి ఎక్కువ. మీకు ఉద్యోగానుభవం కూడా ఉంది. కాబట్టి చదువు పూర్తయిన తర్వాత ప్రయత్నించడం వల్ల మంచి ఉపాధి అవకాశాలను పొందవచ్చు.

నేను డి.ఇడి.(టీటీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాను. అలాగే డా. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మూడేళ్ల బీఎస్సీకి దరఖాస్తు చేశాను, ఏకకాలంలో రెండూ చేయవచ్చా? ప్రభుత్వ ఉద్యోగం, బీఈడీ, పదోన్నతులకు డీఈడీ, డిగ్రీ సర్టిఫికెట్లు రెండూ చెల్లుబాటవుతాయా? లేదా? ఏమైనా ఇబ్బంది అవుతుందా?

* రెండు రెగ్యులర్‌ కోర్సులను ఏకకాలంలో చేయడానికి వీలుపడదు. రెండేళ్ల క్రితం యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌( యూజీసీ) ఇచ్చిన ప్రకటన మేరకు ఒక రెగ్యులర్‌ కోర్సుతో పాటు ఒక డిప్లొమా కోర్సుగానీ, సర్టిఫికేట్‌ కోర్సు గానీ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే రెండు సర్టిఫికేట్‌ కోర్సులు గానీ, ఒక సర్టిఫికేట్‌, ఒక డిప్లొమా కోర్సులను ఏకకాలంలో చేయడానికి అవకాశం ఉంటుంది.
లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలకూ, ఉన్నత చదువులకు దరఖాస్తు చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఒక సర్టిఫికెట్‌ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రెండు డిగ్రీలను ఏకకాలంలో చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులుండే అవకాశం ఉంటుంది. రెండు డిగ్రీలను ఒకేసారి చదవడం వల్ల మీరు ఏ డిగ్రీనీ సరిగా చదవలేకపోతారు. ఒక డిగ్రీ తర్వాత ఒకటి చదవడం వల్ల సబ్జెక్టు పట్ల పరిజ్ఞానం పెంపొందడానికి అవకాశం ఉంటుంది.

మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ చేస్తున్నాను. కోర్సు పూర్తి కావస్తోంది. ఈ అర్హతతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏ శాఖల్లో ఉద్యోగాలుంటాయి? ఎలాంటి ఉద్యోగాలుంటాయి?

* మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ చదివినవారికి మనదేశంలో విరివిగా ఉద్యోగావకాశాలుంటాయి. ఈ కోర్సు పూర్తి అయిన తర్వాత ఆసక్తి ఉన్నట్లయితే ప్రసిద్ధ సంస్థల్లో కన్సల్టెంట్లుగా ఉద్యోగం చేయవచ్చు. విద్యాసంస్థల్లోనూ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కోర్సు చదివినవారికి క్లినిక్స్‌, విపత్తు నిర్వహణ సంస్థలు, విద్యారంగం, వైద్యరంగం, కౌన్సెలింగ్‌ కేంద్రాలు, మానవహక్కుల సంస్థలు, వృద్ధాశ్రమాలు, మానసిక ఆసుపత్రులు, న్యాచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, జైళ్ళు మొదలైనవాటిలో ఉద్యోగావకాశాలుంటాయి.
కమ్యూనిటీ అభివృద్ధి, బాలల సంక్షేమం, కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, స్కూల్‌ సోషల్‌ వర్క్‌, సోషల్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ కేర్‌ మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఇంకా లెక్చరర్లు, ప్రొఫెసర్లు, రీసెర్చ్‌ ఆఫీసర్లు, వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు, జైలు ప్రొబేషనరీ, వెల్ఫేర్‌ అధికారులు, అర్బన్‌/ రూరల్‌ ప్లానర్‌లుగా ఉపాధి దొరుకుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాలే కాకుండా ప్రైవేటు రంగాల్లో కూడా ఈ కోర్సుకు ఉద్యోగావకాశాలుంటాయి.

నేను ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. తర్వాత అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ చదవాలనుకుంటున్నాను. ఈ విభాగంలో ఉండే భవిష్యత్తు అవకాశాలూ, ఈ కోర్సును ఎలాంటి కళాశాలలో చేయాలో తెలియజేయగలరు.

* వ్యవసాయ రంగం మనదేశంలో అతి ముఖ్యమైన రంగం. మీరు అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ చదవాలనుకోవడం అభినందనీయం. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరికరాల వాడకం పెరుగుతున్న తరుణంలో అగ్రికల్చర్‌ ఇంజనీర్ల ఆవశ్యకత పెరిగింది. కాబట్టి వ్యవసాయ సంబంధ కోర్సులకు భవిష్యత్తు అవకాశాలూ ఎప్పుడు ఎక్కువే. ఇటు ప్రభుత్వ రంగంలో, అటు ప్రైవేటు రంగంలో అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ చదివినవారికి భవిష్యత్తు బాగుంటుంది.
ఈ కోర్సు చదివినవారికి ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్స్‌, ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆయిల్‌పామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డు, కేబినెట్‌ సెక్రెటేరియట్‌, న్యాచురల్‌ అగ్రికల్చరల్‌ ఇన్నోవేటివ్‌ ప్రాజెక్ట్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సురెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, డాక్టర్‌ బాల సాహెబ్‌ సావంత్‌ కొంకన్‌ కృషి విద్యాపీఠ్‌ మొదలైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఎంటెక్‌ చేసి, ఆ తర్వాత పీహెచ్‌డీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ చదివినవారికి అగ్రికల్చర్‌ క్రాప్‌ ఇంజనీర్‌, అగ్రికల్చరల్‌ ఇన్‌స్పెక్టర్‌, అగ్రికల్చరల్‌ స్పెషలిస్ట్‌, ఫామ్‌ షాప్‌ మేనేజర్‌, రిసెర్చర్‌, ఎన్విరాన్‌మెంటర్‌ కంట్రోల్స్‌ ఇంజనీర్‌, ఫుడ్‌ సూపర్‌వైజర్‌, అగ్రోనమిస్ట్‌, మైక్రోబయోలజిస్ట్‌, సాయిల్‌ సైంటిస్ట్‌, ప్లాంట్‌ ఫిజియాలజిస్ట్‌... ఇలా ఎన్నో అవకాశాలుంటాయి. ఈ కోర్సును ప్రభుత్వ గుర్తింపు ఉన్న విద్యాసంస్థల్లో చదవడం మంచిది. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావు.

మా అమ్మాయి ఫార్మ్‌ -డి (ఆరేళ్ల కోర్సు) చదువుతోంది. తనకు పై చదువులూ, ఉద్యోగావకాశాల గురించి తెలుపగలరు.

* ఫార్మ్‌-డి అనేది దేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కోర్సు. ఈ కోర్సుకి సంబంధించి ఉన్నత చదువులైనా, ఉద్యోగావకాశాలైనా మనదేశంతో పోలిస్తే అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ. ఫార్మ్‌- డి (ఆరేళ్ల కోర్సు) తర్వాత ఉన్నత చదువులు కొనసాగించాలనుకుంటే అమెరికా లాంటి దేశాల్లో పీహెచ్‌డీకి అవకాశం ఉంటుంది. మనదేశంలో ఈ కోర్సు ముందు ముందు అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో మనదేశంలో కూడా ఈ కోర్సుకి ఉన్నత చదువులూ, ఉద్యోగావకాశాలూ ఎక్కువే ఉంటాయి.
ఫార్మ్‌-డి కోర్సు చదివినవారికి ఫార్మస్యూటికల్‌ కంపెనీలలో మెడికల్‌ అఫైర్స్‌ పొజిషన్‌ కానీ, మెడికల్‌ అడ్వైజర్‌, మెడికల్‌ మేనేజర్‌- డైరెక్టర్‌, ఫార్మకోవిజిలెన్స్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ నాలెడ్జ్‌ మేనేజర్‌, క్లినికల్‌ ఫార్మసిస్ట్‌... మొదలైన అవకాశాలుంటాయి. మెడికల్‌ స్కూల్స్‌లో అధ్యాపకునిగా చేరవచ్చు. కోర్సు ముఖ్యంగా క్లినికల్‌ రీసెర్చ్‌కి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల క్లినికల్‌ రీసెర్చ్‌ కార్యకలాపాల్లో కూడా ఈ కోర్సు చదివినవారికి ఉపాధి లభిస్తుంది.

హెచ్‌.ఆర్‌లో కానీ, హెల్త్‌కేర్‌లో గానీ బిజినెస్‌ అనలిటిక్స్‌(బీఏ)లో ప్రవేశించాలనేది నా అభిలాష. ఈ కోర్సు ఎంచుకుంటే అవకాశాలు ఎలా ఉంటాయి? మనదేశంలో అందించే ఉత్తమ విద్యాసంస్థలు ఎక్కడున్నాయి?

* బిజినెస్‌ అనలిటిక్స్‌ (బీఏ) లో ప్రవేశించాలనే మీ అభిలాష అభినందనీయం. సాధారణంగా అతి తక్కువ విశ్వవిద్యాలయాలు/ విద్యాసంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐఎమ్‌ కోల్‌కత, ఐఎస్‌ఐ కోల్‌కతలు కలిసి రెండు సంవత్సరాల పీజీడీబీఏ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌) కోర్సును ప్రవేశపెట్టాయి. ఈ కోర్సు పూర్తయ్యేలోపు విద్యార్థులు ఈ మూడు విద్యాసంస్థల్లో వివిధ సెమిస్టర్లు చదవవలసి ఉంటుంది.
ఐఐఎమ్‌ బెంగళూరు, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (హైదరాబాద్‌) లాంటి సంస్థలు బిజినెస్‌ అనలిటిక్స్‌ సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ ద్వారా కూడా డేటా అనలిటిక్స్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి.
బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు చేసినవారికి భవిష్యత్తులో ఉద్యోగావకాశాల కొరత ఉండదు. దాదాపు అన్ని రంగాలలో ఈ నిపుణుల అవసరం క్రమంగా పెరుగుతున్నాయి. ఈ కోర్సు చదివినవారికి బిజినెస్‌ డేటా అనలిస్ట్‌గా, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ టార్గెటింగ్‌ స్పెషలిస్ట్‌గా, డేటా అనలిస్ట్‌గా, డేటా సైంటిస్ట్‌గా, అనలిటిక్స్‌ కన్సల్టెంట్‌గా ఉపాధి అవకాశాలుంటాయి.

ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం నుంచి బీకాం 2014లో 51% మార్కులతో పాసయ్యాను. ఐపీసీసీ 5 సార్లు విఫలమవ్వడంతో సీఏ చదువును మానేశాను. టీసీఎస్‌, ఇన్‌ఫోసిస్‌లలో బీకాం ఫ్రెషర్లనే కానీ, ఏడాది విరామం వస్తే తీసుకోరని విన్నాను. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఏమైనా కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకోవాలా? గ్యాప్‌ తర్వాత ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటాయా?

* సాధారణంగా పెద్ద కంపెనీల్లో అనుభవం ఉన్నవారిని తీసుకుంటారు. లేదా ఫ్రెషర్లను నియమించుకుంటారు. మీకు మీ చదువు తర్వాత గ్యాప్‌ వచ్చిందంటున్నారు. ఏమైనా కంప్యూటర్‌ కోర్సులు మీకు ఆసక్తి ఉన్నవి నేర్చుకొని మొదట ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరండి. తర్వాత పెద్ద కంపెనీలలో ఉద్యోగానికి ప్రయత్నించండి.
సాధారణంగా ఇలాంటి ఉద్యోగాలకు గ్యాప్‌ వచ్చినట్లయితే కొంత ఇబ్బందే. చదువు తర్వాత ఇలా విరామం వచ్చినవారెవరైనా సర్టిఫికేట్‌ కోర్సులు లేదా కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకుంటే వారి చదువు కొనసాగించినట్టుగా ఉంటుంది. ఆవిధంగా మనం సీవీని బలోపేతం చేయవచ్చు. అందుకని ఉద్యోగం రాలేదని అధైర్యపడకండి. కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకొని, నైపుణ్యాలు పెంపొందించుకొని ప్రయత్నించడంవల్ల ఫలితం ఉంటుంది.

ఎం.ఎస్సీ మ్యాథ్స్‌ ఫస్టియర్‌ చదువుతున్నాను. దీన్ని చేస్తూనే అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో బీఈడీ మ్యాథ్స్‌ చెయ్యాలని వుంది. ఇలా రెగ్యులర్‌గా ఒక కోర్సు, దూరవిద్యలో మరో కోర్సు ఒకే సంవత్సరంలో చేయవచ్చా? భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందా? ఇలా చేస్తే రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించే టెట్‌, డీఎస్సీలకు అర్హత ఉంటుందా?

* రెండు డిగ్రీ కోర్సులు కానీ, రెండు పీజీ కోర్సులు కానీ ఒకేసారి చేయడానికి వీలులేదు. రెండు డిగ్రీలను ఒకటి రెగ్యులర్‌గా, మరొకటి దూరవిద్య ద్వారా ఒకే సంవత్సరంలో చేయరాదు. అలాచేస్తే ఆ డిగ్రీకి విలువ ఉండదు. కాబట్టి ఒక డిగ్రీని పూర్తిచేసిన తర్వాత మరొకటి చేయడం మేలు. ఒకటి రెగ్యులర్‌ కోర్సు చేస్తున్నప్పుడు సాయంకాలపు డిప్లొమా కోర్సులు గానీ, సర్టిఫికెట్‌ కోర్సులు గానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకానీ రెండు డిగ్రీ స్థాయి కోర్సులను ఒకేసారి చేయకూడదు. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.

చరిత్రకారుడు (హిస్టోరియన్‌) అవ్వాలంటే ఏ అర్హతలు సాధించాలి?

* చరిత్రకారుడుగా అవ్వాలంటే సాధారణంగా చరిత్రలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కనీసం అవసరం. వృత్తిపరమైన అనుభవం, బ్యాచిలర్‌ డిగ్రీతో ప్రొఫెషనల్‌ పొజిషన్‌ను సాధించినవారికి ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యాపక వృత్తిని చేపట్టాలనుకునే చరిత్రకారులకు తప్పనిసరిగా పీహెచ్‌డీ ఉండాలి. విద్యాసంబంధ స్థలాల్లో పదోన్నతుల కోసం ఒక చరిత్రకారుడు పరిశోధనా పత్రాలను క్రమం తప్పకుండా ప్రచురిస్తూ ఉండాలి. డిగ్రీలో హిస్టరీతో పాటుగా లాంగ్వేజ్‌, ఎంచుకున్న స్పెషలైజేషన్‌ తాలూకు సాహిత్యం లాంటివి కూడా చదవడం సబ్జెక్టులో నిమగ్నమై ఉండేలా దోహదపడతాయి.
చరిత్రకారులు గతకాలానికీ, ప్రస్తుత కాలానికీ సంబంధించిన విస్తృత సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. కాబట్టి స్టాటిస్టిక్స్‌ తరగతులు కూడా దోహదం చేస్తాయి. చరిత్రకారులు చారిత్రక మూలాలను, పత్రాలను అధ్యయనం చేసి, పరిశోధించి, విశ్లేషించి, భావానువాదం చేసి ప్రదర్శిస్తారు. అందుకని ఈ స్థాయి చేరుకోవాలనుకునేవారికి అత్యుత్తమమైన రాత, భావ ప్రకటన సామర్థ్యాలు అవసరం. మెరుగైన విశ్లేషణ, వాస్తవిక ఆలోచన, మేథోపరమైన దృక్పథం, స్వీయ ప్రేరణ, సమయ నిర్వహణ మొదలైన లక్షణాలు కలిగి ఉండాలి.

ఇంటర్‌ రెండో సంవత్సరం (బైపీసీ) విద్యార్థిని. నాకు మెడిసిన్‌ గానీ, వెటర్నరీ సైన్స్‌గానీ చదవాలని లేదు. బయోటెక్నాలజీ ఎక్కడ అందిస్తున్నారు? దీని వల్ల ఏ ఉద్యోగావకాశాలుంటాయి?

* ఆసక్తి లేని సబ్జెక్టులను చదవకపోవడమే మంచిది. ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని చదవడం వల్ల ఆ రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. బయోటెక్నాలజీ కోర్సును తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ మొదలైనవి అందిస్తున్నాయి. రాయలసీమ యూనివర్సిటీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తోంది. కె.ఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ (బయోటెక్నాలజీ) అందుబాటులో ఉంది. గిరిరాజ్‌ గవర్నమెంట్‌ కళాశాల (అటానమస్‌), నిజామాబాద్‌ వారు కూడా బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తున్నారు.
బయోటెక్నాలజీ చదివినవారికి పరిశోధనా రంగంలో, ఫార్మాస్యూటికల్‌ రంగంలో, కెమికల్‌ పరిశ్రమలో, వ్యవసాయరంగంలో, వాతావరణ రంగంలో, ఆక్వాకల్చర్‌, బయో ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ, బయో ఇన్ఫర్మేటిక్స్‌, ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌, అకడెమిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (కళాశాలలు, విశ్వవిద్యాలయాలు), ప్రింట్‌ / డిజిటల్‌ మీడియా మొదలైన రంగాలలో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వ- ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

బయోసైన్సెస్‌లో బి.ఇడి చేయాలని ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో చేయాలంటే ఏ అర్హతలతో, ఎప్పుడు ప్రవేశ పరీక్ష రాయాలి?

* యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో బి.ఇడి కోర్సు అందుబాటులో లేదు. మీరు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర విశ్వవిద్యాలయాల్లో బి.ఇడి చేయదలచుకుంటే ఎడ్‌సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కొన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలలో బి.ఇడి అందుబాటులో ఉంది. మే లేదా జూన్‌ నెలల్లో ప్రత్యేక పరీక్షను నిర్వహించి, దాని ద్వారా జులై నెలలో ప్రవేశాలు కల్పిస్తారు. బి.ఇడి చేయడానికి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.

ఇంటర్‌ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. తరువాత ఏం చేయాలో అర్థం కావడం లేదు. టెక్నికల్‌ వైపు వెళదామంటే బీటెక్‌కు విలువ తగ్గిందంటున్నారు. పోనీ, డిగ్రీచేద్దామంటే ఉద్యోగావకాశాలు తక్కువంటున్నారు. ఏది చదివితే కెరియర్‌ బాగుంటుంది?

* బీటెక్‌ చేసినవారికైనా, డిగ్రీ చేసినవారికైనా ఉద్యోగావకాశాలు తప్పకుండా ఉంటాయి. ఏ డిగ్రీ అయినా కూడా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. బీటెక్‌కు విలువ తగ్గిందని అనుకోవడం పొరపాటు. దానికుండే ఉద్యోగావకాశాలు దానికుంటాయి. ఈ రోజుల్లో డిగ్రీ చదివినవారికి ఉద్యోగావకాశాలు తక్కువేం లేవు.
ప్రభుత్వ రంగంలో అయినా, ప్రైవేటు రంగంలో అయినా ఉద్యోగానికి డిగ్రీ తప్పనిసరి. ఉద్యోగావకాశాలు అనేవి ఏ డిగ్రీ చేశామనే దానిపైనే ఆధారపడి ఉండవు. జ్ఞానం, సబ్జెక్టు పట్ల పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉద్యోగావకాశాలకు దోహదం చేస్తాయి. మీరు ఏ డిగ్రీ చదవడమనేది మీకున్న ఆసక్తి, నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఒక ఐదు, పది సంవత్సరాల తరువాత ఎలా ఉండాలని అనుకుంటున్నారో, మీకే కోర్సుపై ఆసక్తి ఉందో, ఉన్న నైపుణ్యాలను బట్టి ఏ కోర్సు చదవాలో నిర్ణయించుకోండి.

బీఏ (హెచ్‌.పి.పి) పూర్తిచేశాను. పీజీలో నా సబ్జెక్టుల ఆధారంగా ఏ కోర్సు చేస్తే మంచిదో తెలపండి. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

* పీజీలో మీ సబ్జెక్టుల ఆధారంగా ఎంఏ (చరిత్ర) లేదా ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌) లేదా ఎంఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ కోర్సు చేయాలనేది మీ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆసక్తి, నైపుణ్యాలు, జ్ఞానానికి తగిన కోర్సును ఎంచుకుని చదివితే భవిష్యత్తులో రాణించడానికి అవకాశముంటుంది. ఏ కోర్సుకయినా దాని ప్రత్యేకత దానిది. కాబట్టి సంబంధిత ఉద్యోగావకాశాలు తప్పనిసరిగా ఉంటాయి.
ఎంఏ (హిస్టరీ) చదివినవారికి పురావస్తుశాఖ, దస్తావేజులు భద్రపరిచే, చారిత్రక పార్కులు, జీనియాలజీ, దౌత్యాధికార, ఇంటెలిజెన్స్‌, మిలిటరీ, మ్యూజియం, పాలిటిక్స్‌, సంరక్షణ, పబ్లిక్‌ రిలేషన్స్‌, టూరిజం, రేడియో, టెలివిజన్‌, ప్రచురణ, పరిశోధన, హిస్టారికల్‌ ఫిక్షన్‌ మొదలైన వాటిలో ఉద్యోగావకాశాలుంటాయి.
ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌) చదివినవారికి పొలిటికల్‌ జర్నలిస్టుగా, పౌరవ్యవహారాల అధికారిగా, మధ్యవర్తిగా, ప్రభుత్వ అధ్యాపకుడు, ప్రొఫెసర్‌, పొలిటికల్‌ అనలిస్ట్‌, ప్రచార అధికారి మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.
ఎంఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) చదివినవారికి న్యూస్‌ రిపోర్టర్‌, డేటా అనలిస్ట్‌, స్థానిక ప్రభుత్వరంగంలో- సిటీ డైరెక్టర్‌, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌, లోకల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ బోర్డ్‌, కమ్యూనిటీ హెల్త్‌ డైరెక్టర్‌, ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, పోలిస్‌ కమిషనర్‌, ప్రైవేటు రంగంలో- కంపనీ డైరెక్టర్‌, సీఈవో, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మొదలైన అవకాశాలుంటాయి. లోకల్‌ గవర్నమెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌, పాలసీ మేనేజర్‌, పబ్లిక్‌ హౌసింగ్‌ మేనేజర్‌, చారిటీ మేనేజర్‌, బడ్జెట్‌ డైరెక్టర్‌, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌, పబ్లిక్‌ అఫైర్‌ డైరెక్టర్‌, అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ కన్సల్టెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ డైరెక్టర్‌ మొదలైన స్థానాల్లో ఉపాధికి ఆస్కారం ఉంటుంది.

ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా నేరుగా బి.ఎ. చదువుతున్నాను. (టెన్త్‌, ఇంటర్‌ లేకుండా) బి.ఎ. పాసైన తర్వాత అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హుడినేనా? నాలాంటి వారు ఇంటర్వ్యూలకు వెళ్తే ఎలాంటి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు?

* టెన్త్‌, ఇంటర్‌ లేకుండా దూరవిద్య ద్వారా నేరుగా బి.ఎ. చదువుతున్న మీరు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హులు కారు. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో వారు టెన్త్‌, ఇంటర్‌ కచ్చితంగా చదివి ఉండాలని అడుగుతున్నారు. ఉదాహరణకు జూనియర్‌ లెక్చరర్స్‌, డిగ్రీ లెక్చరర్స్‌, యూనివర్సిటీ లెక్చరర్స్‌ లాంటి ఉద్యోగాలకు కచ్చితంగా టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ చదివి ఉండాలని అడుగుతున్నారు. అతి తక్కువ ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నోటిఫికేషన్‌లో ఏమీ రాయరు. కానీ ఇంటర్వ్యూ సమయంలో ఇబ్బందులుండే అవకాశం ఉంటుంది.
నోటిఫికేషన్‌లో ఒకవేళ టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదివి ఉండాలని- లేకుంటే డిగ్రీ అర్హత కలిగి ఉండాలని రాసినట్లయితే మీరు ఆ ఉద్యోగానికి అర్హులవుతారు. కొన్ని నోటిఫికేషన్లలో టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదివినవారు అర్హులు అని రాస్తుంటారు. అలాంటివాటికి మీరు అనర్హులు. బోధనా రంగంలోకి రావడానికి కచ్చితంగా ఇంటర్‌, టెన్త్‌, డిగ్రీ అవసరమనే జీవో ఉంది. లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్‌లకు ఇది వర్తిస్తుంది (స్కూలు టీచర్లకు కాదు). మీలాంటి వారు ఇంటర్వ్యూలకు వెళ్తే మీకు డిగ్రీ సర్టిఫికేట్‌ మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్నే పరిశీలిస్తారు.

పదోతరగతి తర్వాత ఇంటర్‌ చదవకుండా డా. బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ పూర్తి చేశాను (2011-2014). బీఈడీ కూడా చేశాను. ఇంటర్మీడియట్‌ లేదనే కారణంతో పోలీస్‌, గ్రూప్స్‌, ఇతరత్రా ప్రభుత్వోద్యోగాలకు నాకు అర్హత లభిస్తుందా? బీసీ స్టడీ సర్కిల్‌ ఉచిత శిక్షణల సమయంలో కూడా ఇంటర్‌ మార్కుల మెమో అడుగుతున్నారు.

* ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ అర్హతను ఎక్కడైతే అడుగుతున్నారో అక్కడ కచ్చితంగా ఇంటర్‌ అర్హత సాధించి ఉండాలి. ఇంటర్‌ సర్టిఫికెట్‌ ఎక్కడైతే అడుగుతారో అక్కడ మీరేం చేయలేరు. సాధారణంగా పోలీస్‌లాంటి ప్రభుత్వోద్యోగాలకు టెన్త్‌, ఇంటర్‌ అర్హత ఉండాలని అడుగుతారు. సాధారణంగా వీటికి సంబంధించి వీరు అర్హులు, వీరు అనర్హులు అని నిబంధనలేం లేవు. ఆయా సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న ఉద్యోగం, దాని అవసరం, దరఖాస్తు చేసిన ఇతరుల అర్హతను బట్టి కొన్నిసార్లు నిర్ణయాలుంటాయి.

ఎంఏ (చరిత్ర) చదివినవారికి ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయో తెలియజేయండి.

* ఎంఏ (చరిత్ర) చదివినవారికి ఆ డిగ్రీ ఒకేషనల్‌ డిగ్రీ కాకపోయినప్పటికీ చాలా ఉద్యోగావకాశాలుంటాయి. పురావస్తుశాఖల్లో, దస్తావేజులు భద్రపరిచే శాఖల్లో, న్యాయశాఖ, సివిల్‌ సర్వీసెస్‌, జర్నలిజం (పత్రికా రచన/ వార్తారచన), దౌత్యాధికార, జీనియాలజీ, చారిత్రక పార్కులు, హిస్టోరికల్‌ ఫిక్షన్‌, ఇంటెలిజెన్స్‌, మిలిటరీ, మ్యూజియాలు, సంరక్షణ, ప్రజాసంబంధాలు, రేడియో, టెలివిజన్‌, ప్రచురణ, సర్వే, పరిశోధన రంగం, పర్యాటక రంగం, బోధన మొదలైన శాఖల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
ఇంకా.. ఆర్కైవిస్ట్‌ (ప్రభుత్వ అభిలేఖదారుడు), డాక్యుమెంట్‌ స్పెషలిస్ట్‌, లైబ్రేరియన్‌, ఇన్ఫర్మేషన్‌ మేనేజర్‌, రికార్డు మేనేజర్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌, ఎడిటర్‌ మొదలైన అవకాశాలుంటాయి.

మా అమ్మాయి బీఎస్‌సీ (బయోటెక్నాలజీ) రెండో సంవత్సరం చదువుతోంది. తరువాత ఫుడ్‌ టెక్నాలజీలో పీజీ చేయాలనుకుంటోంది. కోర్సు వివరాలు, ఉద్యోగావకాశాలను తెలపండి.

* మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌జీ రంగా, గీతం, శాతవాహన మొదలైన విశ్వవిద్యాలయాలు ఫుడ్‌టెక్నాలజీలో పీజీని అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలు కూడా అందిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు వాటి ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కర్ణాటక), గీతం యూనివర్సిటీ మొదలైనవి ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయంలో ఐసీఏఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) వారు నిర్వహించే ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. ఫుడ్‌ టెక్నాలజీ చదివినవారికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో, క్వాలిటీ కంట్రోల్‌ యూనిట్స్‌, రైస్‌ మిల్లులు, తయారీ రంగం, పరిశోధన ప్రయోగశాలలు, హోటల్స్‌, కూల్‌డ్రింక్‌ ఫ్యాక్టరీలు, డిస్టిల్లరీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంటి ప్రభుత్వ సంస్థల్లోనూ ఉపాధి దొరుకుతుంది.
వీరు ఉన్నత చదువులు చదివినట్లయితే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, యానిమల్‌ న్యూట్రిషనిస్ట్‌, డైటీషియన్‌, ఫుడ్‌ టెక్నాలజిస్ట్‌, న్యూట్రిషనల్‌ థెరపిస్ట్‌, టాక్సికాలజిస్ట్‌, ప్రాడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌ ఉద్యోగావకాశాలుంటాయి.

బీఎస్‌సీ (మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్స్‌) చదివాను. దాని తరువాత అగ్రికల్చర్‌ వైపు వెళ్లాలనుంది. అవకాశం ఉంటుందా? ఉంటే వివరాలు తెలపండి.

* మీరు అగ్రికల్చర్‌ చదవడానికి అవకాశముండదు. చదవాలనుకుంటే బీఎస్‌సీ (అగ్రికల్చర్‌)కానీ, బీఎస్‌సీ (హార్టీకల్చర్‌)కానీ, బీఎస్‌సీ (సెరికల్చర్‌)కానీ లేదా బీఎస్‌సీ (ఫారెస్ట్రీ)కానీ చదివుండాలి. అంతేకాకుండా బీఎస్‌సీ (కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) చదివినవారు అగ్రికల్చర్‌ చేయడానికి అర్హులు.

మా పిల్లలు కేంద్రీయ విద్యాలయం (సెంట్రల్‌ స్కూల్‌)లో చదువుతున్నారు. కేంద్రీయ విద్యాలయం, రాష్ట్ర చదువులకు తేడాలేమిటి? కేంద్రీయ విద్యాలయంలో చదివిన వారి భవిష్యత్తు, ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

* కేంద్రీయ విద్యాలయాలు భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో బోధన హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన మాతృభాషను ఒక సబ్జెక్టుగా కేంద్రీయ విద్యాలయాలు అందించవు. రాష్ట్ర చదువుల్లో విద్యార్థులు వారి వారి రాష్ట్రాలకు చెందిన మాతృభాషను ఒక సబ్జెక్టుగా చదవుతారు.
కేంద్రీయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్లో భావప్రకటన సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం, ఆలోచన, ఆత్మవిశ్వాసం ఇతర విద్యార్థుల్లో కంటే మెరుగ్గా ఉంటుంది. కేంద్రీయ విద్యాలయంలో మనోవికాసానికి సంబంధించిన కార్యక్రమాలు, సైన్స్‌ ఫేర్‌లాంటివి అపుడపుడు జరుగుతుండడం వల్ల విద్యార్థుల భావప్రకటన సామర్థ్యం, అవగాహన శక్తి ఎక్కువవుతాయి.
ఉద్యోగావకాశాలు స్కూళ్లను బట్టి ఉండవు. విద్యార్థుల నైపుణ్యాలు, ఆసక్తి, సబ్జెక్టు పట్ల పరిజ్ఞానం మొదలైనవాటిని బట్టి ఉంటాయి కానీ, వారు ఏ స్కూల్లో చదువుకున్నారన్న దానిపై విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగావకాశాలుండవు.

ఎంఎస్‌సీ (సైకాలజీ) దూరవిద్య ద్వారా పూర్తిచేశాను. సైకాలజీలో పీహెచ్‌డీ చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాలేవి? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

* తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు ఉస్మానియా, ఆచార్య నాగార్జున, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్రా మొదలైన విశ్వవిద్యాలయాలు సైకాలజీలో పీహెచ్‌డీని అందిస్తున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో హెల్త్‌ సైకాలజీలో పీహెచ్‌డీ కోర్సు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్రస్థాయి, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా పీహెచ్‌డీ అందుబాటులో ఉంది.
ఉదాహరణకు- అలహాబాద్‌, బనారస్‌ హిందూ, యూనివర్సిటీ ఆఫ్‌ కర్నాటక, కలబురగి, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, పంజాబ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూ, కేరళ, కురుక్షేత్ర మొదలైన విశ్వవిద్యాలయాతోపాటు చాలా రాష్ట్రాల్లోని రాష్ట్ర, కేంద్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో సైకాలజీలో పీహెచ్‌డీ అందుబాటులో ఉంది.
ఎంఎస్‌సీ (సైకాలజీ)ని దూరవిద్య ద్వారా చదివిన మీరు పీహెచ్‌డీ మాత్రం రెగ్యులర్‌ విధానంలోనే చదవాలి. ఎందుకంటే సైకాలజీ పీహెచ్‌డీని ఏ విశ్వవిద్యాలయాలూ దూరవిద్య ద్వారా అందించడం లేదు. సైకాలజీలో పీహెచ్‌డీని చదివినవారికి మెంటల్‌ హెల్త్‌, సోషల్‌ సర్వీసెస్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ సబ్జెక్టు చదివినవారికి ముఖ్యంగా క్లినికల్‌ సైకాలజిస్టులు, కౌన్సెలర్లు, సోషల్‌వర్కర్స్‌గా ఉదోగావకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో సోషల్‌ వర్కర్‌, సోషల్‌ సర్వీస్‌ మేనేజర్‌, మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలర్‌, రిహాబిలిటేషన్‌ కౌన్సెలర్‌, ఒకేషనల్‌ కౌన్సెలర్‌, మెంటల్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌, బిహేవియర్‌ అనాలిసిస్‌ స్పెషలిస్ట్స్‌, సైకలాజికల్‌ స్పెషలిస్ట్‌ మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి. విద్యారంగంలో స్కూల్‌ సైకాలజిస్ట్‌, ఎడ్యుకేషనల్‌ సైకాలజిస్ట్‌, స్కూల్‌ కౌన్సెలర్లుగా ఉద్యోగావకాశాలుంటాయి. వ్యాపార రంగంలో ఇండస్ట్రియల్‌- ఆర్గనైజేషనల్‌ సైకాలజిస్టులుగా, ఫోరెన్సిక్‌ సైకాలజిస్టులుగా ఉద్యోగావకాశాలుంటాయి.

బీఎస్‌సీ (స్టాటిస్టిక్స్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఎంసీఏ చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాలు, ప్రవేశపరీక్ష, ఫీజు వివరాలను తెలపండి.

* తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు- ఉస్మానియా, ఆంధ్రా, కాకతీయ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, జేఎన్‌టీయూ, ఆచార్య నాగార్జున, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, తెలంగాణ, పాలమూరు మొదలైన విశ్వవిద్యాలయాలు ఎంసీఏ కోర్సును అందిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఎంసీఏ ప్రవేశానికి ఐసెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు ఉదాహరణకు బనారస్‌ హిందూ, దిల్లీ, పాండిచ్చేరి, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలైన విశ్వవిద్యాయాల్లో ఎంసీఏ కోర్సు ప్రవేశానికి విశ్వవిద్యాలయ ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సు ప్రవేశానికి నిమ్‌సెట్‌ అనే ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా ఐఐటీల్లో ఎంసీఏ కోర్సు ప్రవేశానికి జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫీజు విషయానికి వస్తే ఒక్కో సంస్థ, విశ్వవిద్యాలయాన్ని బట్టి ఫీజు ఒక్కోలా ఉంటుంది. సాధారణంగా ఫీజు ఎంసీఏ కోర్సుకు రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది.

స్టెనోగ్రఫీలో డిప్లొమా చేయాలనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందించే సంస్థల వివరాలను తెలియజేయండి. టైపింగ్‌ కోర్సులను అందించే సంస్థల గురించీ తెలపండి.

* స్టెనోగ్రఫీ కోర్సును ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలు మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్‌ ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సికింద్రాబాద్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌, ఇతర ప్రైవేటు సంస్థలు స్టెనోగ్రఫీ కోర్సును అందిస్తున్నాయి. వీటితోపాటు మన వివిధ జిల్లాల్లో గల ఐటీఐ (ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లు కూడా స్టెనోగ్రఫీ కోర్సును అందిస్తున్నాయి.
ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, అనంతపురం, తూర్పు గోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఐటీఐ సంస్థలున్నాయి. టైపింగ్‌ కోర్సును ఎక్కువగా ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టేట్‌బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ వారు టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌ లాంటి కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ఐటీఐలు కూడా టైపింగ్‌ కోర్సును అందిస్తున్నాయి.

2011లో ఇంటర్‌ ఒకేషనల్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) పాసయ్యాను. మా కళాశాలలో డీఈడీలో అర్హత ఉందని చెప్తే డీఈడీ పూర్తిచేశాను. కానీ మొన్న ఏపీలో డీఎస్‌సీ- 2015లో ఒకేషనల్‌ వాళ్లకు అర్హత లేదన్నారు. ఇపుడు నేను అర్హత సంపాదించాలంటే ఏం చేయాలి? మళ్లీ ఇంటర్‌ రాసి పాసై డీఈడీ చేయవచ్చా? తెలియజేయండి.

* ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు చదివినవారికి డీఎస్‌సీలో అర్హత లేదన్న విషయం వాస్తవం. ఇంటర్‌- జనరల్‌ చదివిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది. మీరు ఉపాధ్యాయ వృత్తే లక్ష్యంగా కలిగి ఉంటే ఇంటర్‌- జనరల్‌ చదివి తర్వాత డీఈడీ చేయండి. అప్పుడు మీకు డీఎస్‌సీలో అర్హత ఉంటుంది. లేదంటే డిగ్రీ చదివి పాసైన తరువాత బీఈడీ చేయవచ్చు.

డిగ్రీ (బీకాం) చివరి సంవత్సరం చదువుతున్నాను. ఎంఏ ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదవాలనుకుంటున్నాను. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? ప్రభుత్వ ఉద్యోగం పొందగలనా?

* ఎంఏ ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారికి ప్రభుత్వ, కమ్యూనిటీ సంస్థల్లో; విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో; కార్పొరేట్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసుల్లో, బిహేవియరల్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో, రెసిడెన్షియల్‌ కేర్‌ ఫెసిలిటీస్‌ మొదలైన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
ఎంఏ ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారికి విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులుగా, సోషియాలజిస్ట్‌, జర్నలిస్ట్‌, లాయర్‌, లీగల్‌ అడ్వైజర్‌, లాబియిస్ట్‌, మల్టీ కల్చరలిజమ్‌ ఆఫీసర్‌, ఎన్‌జీఓ ఏరియా కో ఆర్డినేటర్‌, నాన్‌ ప్రాఫిట్‌ ఫౌండేషన్‌ మేనేజర్‌, పొలిటికల్‌ రీసెర్చర్‌, ప్రెగ్నెన్సీ కౌన్సెలర్‌, సైకోథెరపిస్ట్‌, సోషల్‌ వర్కర్‌, సెక్సువల్‌ అబ్యూస్‌ కౌన్సెలర్‌, సెక్సువల్‌ అస్సాల్ట్‌ ఎడ్యుకేటర్‌, సెక్సువల్‌ హెల్త్‌ ఎడ్యుకేటర్‌, సోషల్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌, యూనియన్‌ ఆర్గనైజర్‌, ఉమెన్‌ అడ్వకేట్‌, ఉమన్‌ షెల్టర్‌ సూపర్‌వైజర్‌, ఉమెన్స్‌ షెల్టర్‌ సాఫ్ట్‌, ఆంత్రపాలజిస్ట్‌, అసిస్టెంట్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, బయోగ్రాఫర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌, క్రిమినాలజిస్ట్‌, ఈక్వల్‌ ఆపర్చ్యునిటీ ఆఫీసర్‌, వ్యాసకర్త, ఫ్యామిలీ కౌన్సెలర్‌ మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.
ఎంఏ ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది.

బీఎస్‌సీ ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీ కల్చర్‌, హార్టీకల్చర్‌ కోర్సులను దూరవిద్య ద్వారా చదవడం వీలవుతుందా? అందించే విశ్వవిద్యాలయాలు, విద్యార్హతల వివరాలు తెలియజేయండి.

* బీఎస్‌సీ- ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీకల్చర్‌, హార్టీకల్చర్‌ కోర్సులను చదవడానికి ఇంటర్‌ అర్హత ఉండాలి. కానీ బీఎస్‌సీ ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీకల్చర్‌, హార్టీకల్చర్‌ కోర్సులను సాధారణంగా ఏ విశ్వవిద్యాలయాలూ దూరవిద్య ద్వారా అందించవు. ఈ కోర్సులను రెగ్యులర్‌ విధానంలోనే చేయాల్సి ఉంటుంది.
అతి తక్కువ విశ్వవిద్యాలయాలు- యశ్వంత్‌రావు చావన్‌- మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ, ఇగ్నో లాంటి విశ్వవిద్యాలయాలు డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌, సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇవి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల కాలపరిమితితో ఉంటాయి. ఈ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను కూడా ఫుల్‌టైం చేయాల్సి ఉంటుంది. బీఎస్‌సీ- ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీకల్చర్‌, హార్టీకల్చర్‌ లాంటి కోర్సులను దూరవిద్య ద్వారా చదవడం కంటే నేరుగా ఫుల్‌టైం చదవడమే మేలు. ఎందుకంటే ఏ కోర్సు అయినా దూరవిద్య ద్వారా చదవడం కంటే నేరుగా చదవడం వల్ల సబ్జెక్టుపట్ల జ్ఞానం, నైపుణ్యాలు పెంపొందుతాయి.

మనోవిజ్ఞాన శాస్త్రం (సైకాలజీ)లో పీహెచ్‌డీ చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాల వివరాలు తెలుపగలరు.

* తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలైన ఉస్మానియా, ఆచార్య నాగార్జున, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్రా మొదలైన విశ్వవిద్యాలయాలు సైకాలజీలో పీహెచ్‌డీని అందిస్తున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో హెల్త్‌ సైకాలజీలో పీహెచ్‌డీ కోర్సు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర స్థాయి, సెంట్రల్‌ విశ్వవిద్యాలయాలైన అలహాబాద్‌, బనారస్‌ హిందూ, యూనివర్సిటీ ఆఫ్‌ కర్నాటక, గుల్బర్గా, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, పంజాబ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూ, కేరళ, కురుక్షేత్ర లాంటి విశ్వవిద్యాలయాలతోపాటు ఇంకా చాలావాటిల్లో సైకాలజీలో పీహెచ్‌డీ అందుబాటులో ఉంది.

మా అమ్మాయి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ తర్వాత ఏం చదివితే బాగుంటుందో వివరాలను తెలియజేయగలరు.

* ఎంపీసీ చదివినవారికి ఇంటర్‌ తరువాత ఇంజినీరింగ్‌ కోర్సులు, బీఎస్‌సీ (బాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌), బీసీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌), బి- ఆర్కిటెక్చర్‌ (బాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌), బీఫార్మసీ, బీబీఏ, కమర్షియల్‌ పైలట్‌ ట్రెయినింగ్‌, డిప్లొమా కోర్సెస్‌ ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, టెక్నాలజీ, మర్చంట్‌ నేవీకి సంబంధించిన కోర్సులు, జాయింట్‌ ఆర్మ్‌డ్‌ కోర్సులు, కొన్ని డిజైన్‌ సంబంధిత కోర్సులు, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, బాచిలర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ మొదలైన కోర్సులను చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇవే కాకుండా కొన్ని జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ తరువాత ఏర్‌ హోస్టెస్‌ ట్రెయినింగ్‌, ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, లాయర్‌ కోర్సు, యానిమేషన్‌, గ్రాఫిక్స్‌, మల్టీమీడియా, ఫ్యాషన్‌ టెక్నాలజీ లేదా ఫ్యాషన్‌ డిజైన్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌- డిజైనింగ్‌ లాంటి జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.
మీ అమ్మాయి ఏ బ్రాంచి లేదా కోర్సు చదవాలనేది తన ఆసక్తిని బట్టి చేయడం మంచిది. అపుడే ఉన్నతంగా ఎదగడానికీ, అనుకున్నది సాధించడానికీ అవకాశ ముంటుంది. అంతేకానీ ఎవరో ఏదో చెప్పారని కాకుండా ఆమె ఆసక్తి, నైపుణ్యాలనుబట్టి తగిన కోర్సును ఎంచుకోనివ్వడం మంచిది.

బీఎస్‌సీ నర్సింగ్‌, మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌ కోర్సుల తరువాత పీజీ తప్పనిసరా? లేదా ఇంకేమైనా కోర్సులు చేయవచ్చా? రెండు కోర్సులకూ ఉన్న అవకాశాలనూ తెలియజేయండి.

* బీఎస్‌సీ నర్సింగ్‌ చేసినవారు నర్సులుగా కొనసాగాలనుకుంటే పీజీ తప్పనిసరిగా చేయాల్సిన అవసరమేమీ లేదు. కానీ బోధన, పరిశోధన రంగాల్లోకి అడుగు పెట్టాలనుకుంటే తప్పనిసరిగా పీజీ అవసరం ఉంటుంది. అంతేకాకుండా బీఎస్‌సీ నర్సింగ్‌ తర్వాత పోస్ట్‌ బేసిక్‌ స్పెషాలిటీ (ఒక సంవత్సరం) డిప్లొమా కోర్సులను ఎన్నుకోవడం ద్వారా ఏదైనా ప్రత్యేకమైన స్పెషలైజేషన్‌లో నర్సింగ్‌ కూడా చేసే అవకాశముంటుంది.
ఉదాహరణకు కార్డియో థోరాసిక్‌ నర్సింగ్‌, క్రిటికల్‌ కేర్‌ నర్సింగ్‌, నియోనాటల్‌ నర్సింగ్‌, న్యూరో నర్సింగ్‌, ఆంకాలజీ నర్సింగ్‌, ఆపరేషన్‌ రూమ్‌ నర్సింగ్‌, ఎమర్జెన్సీ అండ్‌ డిజాస్టర్‌ నర్సింగ్‌, ఆర్థోపెడిక్‌ నర్సింగ్‌, సైకియాట్రిక్‌ నర్సింగ్‌ లాంటి డిప్లొమా కోర్సులు కూడా చేయవచ్చు. నర్సింగ్‌ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు బాగా ఉంటాయి.
ఈ కోర్సు చదివినవారికి ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఆర్మీ, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌, స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ లాంటి రకరకాల నర్సింగ్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
మెడికల్‌ లాబ్‌టెక్నీషియన్‌తో పెద్ద ఆస్పత్రుల్లో చిన్నస్థాయి ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంఎస్‌సీ (మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌) చేస్తే కార్పొరేట్‌ హాస్పిటళ్లలో, ల్యాబ్‌ల్లో బయోలాజికల్‌ టెక్నీషియన్‌, కెమికల్‌ టెక్నీషియన్‌ మొదలైన అవకాశాలుంటాయి. అంతేకాకుండా పరిశోధన రంగంలోకి వెళ్లాలనుకుంటే ఎంఎస్‌సీ (మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌) చేయాల్సిన అవసరం ఉంటుంది.

బీకాం (జనరల్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేయాలనుంది. నేను అర్హుడినేనా?

* బీకాం చివరి సంవత్సరం చదువుతున్న మీకు ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదవడానికి అర్హత ఉంటుంది. కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదవడానికి అవకాశం కల్పిస్తున్నాయి.
ఉదాహరణకు- కేంద్రీయ విశ్వవిద్యాలయాలైన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ మొదలైనవి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. కానీ, కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలైన బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, ఉస్మానియా వంటి విద్యాసంస్థల్లో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదవడానికి బీఏ (పొలిటికల్‌ సైన్స్‌) చదివి ఉండాలన్న నిబంధనను పాటిస్తున్నాయి.

ఇంటర్మీడియట్‌ తరువాత ఇంజినీరింగ్‌తో సమానంగా ఏదైనా యానిమేషన్‌ కోర్సు ఉందా? ఏదైనా యానిమేషన్‌ కోర్సు చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది?

* ఇంటర్‌ తరువాత ఇంజినీరింగ్‌తో సమానంగా ఉండే యానిమేషన్‌ కోర్సు చేయాలంటే బీఈ లేదా బీటెక్‌ యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా కోర్సును చేయవచ్చు. వేరే ఏదైనా యానిమేషన్‌ కోర్సు చేయాలనుకుంటే బీఈ (యానిమేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌), బీఏ (యానిమేషన్‌ అండ్‌ గ్రాఫిక్‌ డిజైన్‌), బీఏ (మల్టీమీడియా), బీఎస్‌సీ (యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా), బీఎస్‌సీ (డిజిటల్‌ మీడియా), బీఎస్‌సీ (యానిమేషన్‌ ఫిల్మ్‌ మేకింగ్‌), బీఎస్‌సీ (యానిమేషన్‌ మల్టీమీడియా టెక్నాలజీ), బీఎస్‌సీ (గేమ్స్‌ డెవలప్‌మెంట్‌) లాంటి కోర్సులు చేయవచ్చు. డిప్లొమా ఇన్‌ 2డి యానిమేషన్‌, డిప్లొమా ఇన్‌ 3డి యానిమేషన్‌), డిప్లొమా ఇన్‌ యానిమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ లాంటి డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
యానిమేషన్‌ కోర్సు చేసినవారికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో, సినిమా, కార్టూన్స్‌ మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలు విరివిగా ఉంటాయి.ఈ కోర్సు చదివినవారు వివిధ రంగాల్లో యానిమేటర్లు, గ్రాఫిక్‌ డిజైనర్‌, వీడియో ఎడిటర్‌, 3డి మోడలర్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌ వైజర్లు, సౌండ్‌ ఎడిటర్‌, క్యారెక్టర్‌ యానిమేటర్లుగా ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఎంఎస్‌సీ లేదా ఎంఈ లేదా ఎంటెక్‌ డిగ్రీలో యానిమేషన్‌ కోర్సు చేస్తే వారికి బోధన రంగంలో అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ఉద్యోగావకాశాలుంటాయి.

బీఎస్‌సీ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీ తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదవాలనుంది. నేను అర్హుడినేనా? ఈ కోర్సు చదవడానికి ఇంకా ఏమైనా అదనపు కోర్సులు చేయాల్సి ఉంటుందా? తెలియజేయగలరు.

* బీఎస్‌సీ (ఎంపీసీ) చదవుతున్న మీరు డిగ్రీ తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదవడానికి అర్హులే. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివేవారికి ముఖ్యంగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా అవసరం. కాబట్టి మీరు వాటికి సంబంధించిన కోర్సులు చేయడం ఉపయోగకరం. ఎకౌంటింగ్‌కు సంబంధించిన డిప్లొమా కోర్సులు, కంప్యూటర్‌కు సంబంధించిన డిప్లొమా కోర్సులు చేయడం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసేవారికి ఉపయోగకరం. మీ సీవీ (కరిక్యులమ్‌ వీటే)లో ఈ విషయాలు పొందుపరిస్తే మీకు ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

హిందీ పండిట్‌ విద్వాన్‌ చేసి, హెచ్‌పీటీ శిక్షణ కూడా పూర్తిచేశాను. విద్వాన్‌ను డిగ్రీతో సమానంగా భావించటం నిజమేనా? అలా అయితే నేను బీఈడీ చేసే అవకాశముందా? వేరే రాష్ట్రంలో డీఈడీ చేస్తే ఆ విద్యార్థి లోకల్‌ అవుతాడా? నాన్‌ లోకల్‌ అవుతాడా?

* సాధారణంగా మీరు చేసిన హిందీ పండిట్‌ విద్వాన్‌ డిగ్రీతో సమానం కాదు. కానీ మీరు చేసిన హెచ్‌పీటీ శిక్షణ హిందీ ప్రచార్‌ సభ (నాంపల్లి, హైదరాబాద్‌) వారి ఆమోదం పొందినట్త్లెతే అది డిగ్రీతో సమానమనే జీవో ఉంది. ఆ జీవో కాపీ కావాలనుకుంటే మీరు హిందీ ప్రచార్‌ సభకు వెళ్లి సంప్రదించండి.
ఒకవేళ అది డిగ్రీతో సమానమైతే మీరు బీఈడీ చేయడానికి అవకాశముంటుంది. లేదంటే ఉండదు. ఎందుకంటే బీఈడీ చేయాలంటే డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా మీరు లోకలా, నాన్‌లోకలా అనేది మీరు చదివిన డిగ్రీపై ఆధారపడి ఉండదు. రెండు, మూడు సంవత్సరాలు ఇతర రాష్ట్రాల్లో చేసినంత మాత్రాన నాన్‌లోకల్‌ కారు. నాలుగో తరగతి నుంచి పదోతరగతి వరకు ఎక్కడ చదువుకున్నారో ఆ ప్రాంతం మీకు లోకల్‌ అవుతుంది.

బీఎస్‌సీ (స్టాట్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంసీఏ చేయాలనుంది. ఉద్యోగావకాశాలను తెలియజేయండి. ఆ తర్వాత ఎంఎస్‌సీ (నానో టెక్నాలజీ), ఎంఎస్‌సీ (ఫిజిక్స్‌, రాకెట్‌ సైన్స్‌) చేయవచ్చా?

* బీఎస్‌సీ (స్టాట్‌) చదువుతున్న మీరు డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంసీఏ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంసీఏ చదివినవారికి ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వ రంగంలోకూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఎంసీఏ చదివినవారికి ప్రభుత్వరంగ సంస్థలైన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ), బీఏఐఎల్‌ (ఇండియా) లిమిటెడ్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) మొదలైన సంస్థల్లో ఉపాధికి ఆస్కారం ఉంటుంది. ప్రైవేటు ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయి.
ఎంసీఏ చదివినవారికి సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, ప్రోగ్రామర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ట్రబుల్‌ షూటర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌, సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌, హార్డ్‌వేర్‌ ఇంజినీర్లు, టెక్నికల్‌ రైటర్‌, సిస్టమ్‌ డెవలపర్‌, సిస్టమ్‌ ఇంజినీర్లు, వెబ్‌ డిజైనర్‌ అండ్‌ డెవలపర్‌ మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.
ఎంఎస్‌సీ (నానోటెక్నాలజీ) చేయాలంటే బీఎస్‌సీలో ఫిజిక్స్‌, మేథమేటిక్స్‌ సబ్జెక్టులను చదివుండాలి. కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు ఉదాహరణకు జేఎన్‌టీయూలాంటివి ఎంఎస్‌సీ (నానోటెక్నాలజీ)ని బీఎస్‌సీ అన్ని గ్రూపులవారికి అందిస్తున్నాయి. బీఎస్‌సీలో ఫిజిక్స్‌ సబ్జెక్టు చదివినవారికి ఎంఎస్‌సీ (ఫిజిక్స్‌) చదవడానికి అవకాశం ఉంటుంది. ఎంఎస్‌సీ (రాకెట్‌ సైన్స్‌) అనేది ఎక్కడా లేదు. ఆసక్తి ఉంటే పరిశోధనల్లో రాకెట్‌సైన్స్‌ను ఎంచుకోవచ్చు.

ఇంటర్‌ (సీఈసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాను. భూకంపాలు వంటి వాతావరణానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేయడం ఇష్టం. అందుకుగానూ డిగ్రీలో ఏ కోర్సును ఎంచుకోవాలి? అందించే విశ్వవిద్యాలయాలేవి?

* వాతావరణానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేయాలనే మీ అభిరుచి బాగుంది. ఈ పరిశోధన చేయడానికి డిగ్రీలో ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌ లాంటి కోర్సులను చేయవచ్చు. కానీ ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులను తప్పనిసరిగా చదివివుండాలి.
వాతావరణానికి సంబంధించిన ఏ అంశంపైన పరిశోధన చేయాలన్నా ఈ సబ్జెక్టులు అంటే బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలాంటి వాటిలో తప్పనిసరిగా అవగాహన ఉండాలి. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మీరు ఈ రంగంలోనే టెక్నికల్‌గా కాకుండా నాన్‌టెక్నికల్‌ విభాగంలో పని చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకుగానూ జాగ్రఫీలాంటి కోర్సును చదవవచ్చు. సీఈసీ చదువుతున్నారు కాబట్టి, మీకు వాతావరణానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

అన్నామలై విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా బీజీఎల్‌ (బాచిలర్‌ ఆఫ్‌ జనరల్‌ లాస్‌) పూర్తిచేశాను. ఇప్పుడు ఎల్‌ఎల్‌ఎం లేదా ఎంఎల్‌ దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. వీలవుతుందా? అందించే విశ్వవిద్యాలయాలేవి?

* ఎల్‌ఎల్‌ఎంను దూరవిద్య ద్వారా చదవడం వీలవుతుంది. మన దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలు దూరవిద్య ద్వారా ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌ను అందిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా కాకతీయ, ఆచార్య నాగార్జున, నల్సార్‌- హైదరాబాద్‌ మొదలైన విశ్వవిద్యాలయాలు ఎల్‌ఎల్‌ఎంను దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని అన్నామలై, కురుక్షేత్ర, బందేల్‌ఖండ్‌, నేషనల్‌ లా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా విశ్వవిద్యాలయం, ఇండియన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ మొదలైనవి ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌ను దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. మీ అభిరుచిని బట్టి నచ్చిన విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్‌ (ఎంఈసీ) పూర్తిచేశాను. పురావస్తు శాస్త్రవేత్త (ఆర్కియాలజిస్టు) కావాలనుకుంటున్నాను. ఎలా?

* పురావస్తుశాస్త్రవేత్త కావాలనుకునేవారు డిగ్రీ, పీజీల్లో హిస్టరీ, ఆర్కియాలజీ, ఆంత్రపాలజీ, సోషియాలజీ లేదా జియాలజీల్లో ఏదో ఒకదాన్ని చదివుండాలి. మన తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్ర, ఉస్మానియా, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, కాకతీయ; ఇంకా అన్నామలై మొదలైన విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, పాండిచ్చేరి, విశ్వభారతి, నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతా, దిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ రీసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన విశ్వవిద్యాలయాలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి.

బీఎస్‌సీ రెండో సంవత్సరం చదువుతున్నాను. పైలట్‌ కావాలనుంది. కావాల్సిన అర్హతలేమిటి?

* పైలట్‌ కావాలనుకునేవారు మొదటగా గుర్తింపున్న కళాశాల నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (మూడు సంవత్సరాల కోర్సు) 60% మార్కులతో ఉత్తీర్ణులవాలి. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ పాసై ఉండాలి. లేదా బీఈ/ బీటెక్‌ డిగ్రీ (4 సంవత్సరాలు) ఏదైనా గుర్తింపు ఉన్న కళాశాల నుంచి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించివుండాలి. ఎత్తు కనీసం 162.5 సెంటీమీటర్లు ఉండి, బరువు ఎత్తుకి తగ్గట్లుగా ఉండాలి. శారీరక దృఢత్వం కలిగివుండి కంటిచూపుకు సంబంధించి ఎలాంటి సమస్యలూ లేకుండావుండాలి. వీరి వయః పరిమితి 19- 23 సంవత్సరాలు ఉండాలి. డిగ్రీ పూర్తయినవారే కాకుండా, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి అర్హులే.

* ఏర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ పోస్టు వివరాలను తెలియజేయండి. దానికి ఎలా సన్నద్ధమవాల్సి ఉంటుంది?

* ఏర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ పోస్టు కోసం కనీసం 60% మార్కులతో రెగ్యులర్‌ పూర్తికాలపు బ్యాచిలర్స్‌ డిగ్రీని (మూడు సంవత్సరాలు) ఫిజిక్స్‌, మాథమేటిక్స్‌ సబ్జెక్టులతో చదివి ఉండాలి. లేదా కనీసం 60% మార్కులతో బీఈ/ బీటెక్‌ డిగ్రీని ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో చదివి ఉండాలి. ఇది కూడా రెగ్యులర్‌ ఫుల్‌టైం చదివి ఉండాలి. అంతేకాకుండా ఇంటర్మీడియట్‌ స్థాయి ఇంగ్లిష్‌ను రాయగల, మాట్లాడగల కనీస సామర్థ్యం ఉండాలి. ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ పోస్టు కోసం ఎంపిక విధానంలో ఆన్‌లైన్‌ పరీక్ష, వాయిస్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఆన్‌లైన్‌ పరీక్షలో వారు చదివిన డిగ్రీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులుండవు. తరువాత ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏఓ) లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ లెవల్‌- 4 (ఆపరేషనల్‌) పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి ఉచ్చారణ, వ్యాకరణం, ఒకాబులరీ, ఫ్లూయెన్సీ, కాంప్రహెన్షన్‌, ఇంటరాక్షన్‌ మొదలైనవాటిని పరీక్షిస్తారు.
ఈ ఉద్యోగానికి వయః పరిమితి జనరల్‌ కేటగిరీ వారికి 27 సంవత్సరాలు, ఓబీసీకి 30 సంవత్సరాలు, ఎస్‌సీ/ ఎస్‌టీ వారికి 32 సంవత్సరాలు మించకూడదు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కి వయః పరిమితిలో సడలింపు ఉంటుంది.

* ఎంఏ (జాగ్రఫీ) పూర్తిచేశాను. అందులో భాగంగా జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫి, క్లెమటాలజీ చదివాను. ఎర్త్‌సైన్సెస్‌లో నెట్‌/ ఏపీసెట్‌ రాయడానికి అర్హుడినేనా? ఒకవేళ అయితే ఈ విభాగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

* ఎంఏ (జాగ్రఫీ) చేసిన మీరు ఎర్త్‌ సైన్సెస్‌లో నెట్‌/ ఏపీసెట్‌ రాయడానికి అర్హులు. మీరు నెట్‌లో అర్హత సాధించినట్లయితే విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగావకాశాలుంటాయి.
ఈ కోర్సు చదివినవారికి వాతావరణానికి సంబంధించిన కన్సల్టింగ్‌ సంస్థల్లో, మైనింగ్‌, ఎక్స్‌ప్లోరేషన్‌ సంస్థల్లో, ఆయిల్‌ సంస్థల్లో, పరిశోధనా సంస్థల్లో (ప్రభుత్వ, ప్రైవేటు) మొదలైన వాటిల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఎన్విరాన్‌మెంటల్‌ (వాతావరణ) కన్సల్టెంట్లుగా, గ్రౌండ్‌ వాటర్‌ స్పెషలిస్టులుగా, మైనింగ్‌/ మెరైన్‌ ఇంజినీర్లుగా, ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్టులుగా, జియాలజిస్టులుగా, మెరైన్‌ జియాలజిస్టులుగా, పేలియొంటాలజిస్టులుగా, పెట్రోలియం జియాలజిస్టులుగా, జియోకెమిస్టులుగా, జియోఫిజికిస్ట్‌లుగా, ఓషినోగ్రాఫర్‌లుగా, ఎన్విరాన్‌మెంటల్‌ లాయర్లుగా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మ్యాపింగ్‌, ఎక్స్‌ప్లోరేషన్‌, పాలసీ డెవలప్‌మెంట్‌ అండ్‌ అడ్వైజింగ్‌, కన్సల్టింగ్‌ అండ్‌ మేనేజింగ్‌ లాంటి వాటిల్లో జియాలజిస్టుల అవసరం ఎంతైనా ఉంది.

* బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. తరువాత నాకున్న విద్యావకాశాలేమిటి? ఉద్యోగావకాశాలనూ వివరించండి.

* బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తి అయిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు ఎంఎస్‌సీ (కంప్యూటర్‌సైన్స్‌), ఎంఎస్‌సీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ), ఎంసీఏ, ఎంబీఏ, బీఎడ్‌, ఎంఎస్‌సీ (మాథ్స్‌) మొదలైన కోర్సులు చేయడానికి అవకాశముంటుంది. అంతే కాకుండా ఇతర కోర్సులైన వెబ్‌ డిజైన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ జావా స్పెషల్‌ కోర్సు, ఫ్యాషన్‌ డిజైన్‌ లాంటివి చేయడానికి కూడా వీలుంది.
బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చదివినవారికి ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు రంగంలో ఈ కోర్సు చదివినవారికి వెబ్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, వీడియోగేమ్స్‌, మొబైల్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ విజన్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌, యానిమేషన్‌, ఎంటర్‌ప్రైజ్‌ కంప్యూటింగ్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ మొదలైన రంగాల్లో ఉపాధి దొరుకుతుంది. ఈ కోర్సు చదివిన తర్వాత ప్రభుత్వ రంగానికి సంబంధించిన రైల్వే, ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ), గ్రూప్స్‌ (సివిల్స్‌), ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మొదలైన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

* మెడికల్‌ అండ్‌ హెల్త్‌లో పనిచేస్తున్నాను. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ చేయాలనుకుంటున్నాను. దూరవిద్య ద్వారా అందించే విశ్వవిద్యాలయాల వివరాలు తెలపండి.

* పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ను దూరవిద్య ద్వారా చేయాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు ఆచార్య నాగార్జున, ఉస్మానియా, శ్రీ వెంకటేశ్వర, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇగ్నో మొదలైన వాటిల్లో చేయడానికి అవకాశముంటుంది. ఇతర రాష్ట్రాల్లోని అన్నామలై, పంజాబ్‌ యూనివర్సిటీ, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ మొదలైన విశ్వవిద్యాలయాలు కూడా దూరవిద్య ద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ను అందిస్తున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం హెల్త్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి వివిధ రకాల పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ఇందులో ముఖ్యంగా పీజీ డిప్లొమా ఇన్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, కార్డియాక్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, కార్డియాక్‌ పల్మొనరీ ఫిజియోథెరపి, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, పర్‌ఫ్యుషన్‌ టెక్నాలజీ, కార్డియాక్‌ అనస్తీషియా టెక్నాలజీ, మెడికల్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి.

* పదో తరగతి తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలనుకుంటున్నాను. కోర్సు, కళాశాలల వివరాలు, ఫీజు, ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

* పదో తరగతి చదివిన తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలనుకుంటే సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఇంటర్మీడియట్‌ చేసిన తరువాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును చేయడం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీలు, పీజీలు చేసినవారు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండడంవల్ల పదో తరగతి తర్వాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా చేసినవారికి చెప్పుకోదగ్గ ఉద్యోగావకాశాలు లేవు. కాబట్టి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తర్వాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు ప్రయత్నం చేయండి.

* ఎంపీసీ 50% మార్కులతో పూర్తిచేశాను. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాకుండా వేరే వృత్తివిద్యా కోర్సులు చేయాలని ఉంది. ఫైర్‌ అండ్‌ సేఫ్టీ/ మర్చంట్‌ ఆఫ్‌ నేవీలో ఆసక్తి ఉంది. దీనిని ఎవరు చేయవచ్చు?

* ఎంపీసీ పూర్తిచేసి అందరు విద్యార్థుల్లా ఇంజినీరింగ్‌ లాంటిది కాకుండా వృత్తివిద్యా కోర్సులు చేయాలనుకున్న మీ నిర్ణయం అభినందనీయం. ఫైర్‌ అండ్‌ సేఫ్టీ కోర్సు చేయాలనుకున్నవారు 10+2 ఉత్తీర్ణతతో పాటు శారీరక దృఢత్వం కలిగివుండాలి. మంచి భావప్రసార నైపుణ్యాలు, నిర్వహణ సామర్థ్యం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని, సమస్యలను సత్వరమే పరిష్కరించే నేర్పు ఉన్నట్లయితే మీరు ఈ రంగంలో రాణించవచ్చు. మర్చంట్‌ ఆఫ్‌ నేవీ కోర్సు చేయదలచుకున్నవారు పదోతరగతి/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ కోర్సు చేయదలచుకున్నవారి వయఃపరిమితి 16 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

* దూరవిద్య ద్వారా ఎంఏ తెలుగు రెండో సంవత్సరం చదువుతున్నాను. తర్వాత పీహెచ్‌డీ చేయాలనుంది. నోటిఫికేషన్లు, ప్రవేశపరీక్షల వివరాలు తెలియజేయండి.

దూరవిద్య ద్వారా పీహెచ్‌డీ చేయడం వీలవదు. పీహెచ్‌డీని రెగ్యులర్‌గానే చేయవలసి ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పీహెచ్‌డీ కోర్సును అందిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వారు ప్రతి సంవత్సరం మార్చి/ ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చి జూన్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించి జులైలో ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రప్రభుత్వ విశ్వవిద్యాలయాలు రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ ఇస్తాయి. పీహెచ్‌డీ ప్రవేశం ఎంఫిల్‌ ద్వారా కానీ, నెట్‌ (నేషనల్‌ ఎబిలిటీ టెస్ట్‌)/ సెట్‌ (స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)/ జేఆర్‌ఎఫ్‌ల ద్వారాకానీ లేదా ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా కానీ జరుగుతుంది. రాతపరీక్ష/ జాతీయ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా కానీ మౌఖిక పరీక్ష తప్పనిసరి. మౌఖికపరీక్షలో మీ విషయ పరిజ్ఞానం, పరిశోధన చేయబోయే అంశం, పరిశోధన పట్ల ఉన్న ఆసక్తిని బట్టి మార్కులను నిర్ణయించి ప్రవేశాన్ని కల్పిస్తారు.

* ఇంటర్మీడియట్‌ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. బీటెక్‌- బయోటెక్నాలజీ చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాలేవి? ఈ కోర్సులో ఏ సబ్జెక్టు ఎంచుకుంటే లాభదాయకం? ప్రవేశపరీక్షల వివరాలు తెలియజేయండి.

బీటెక్‌- బయోటెక్నాలజీని తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐటీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)- వరంగల్‌, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల- పులివెందుల, ఆంధ్రయూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల, గీతం యూనివర్సిటీ, విజ్ఞాన్‌ యూనివర్సిటీ మొదలైన వాటిల్లో అందిస్తున్నారు. అదేవిధంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ గౌహతి, ఐఐటీ రూర్కీ మొదలైన ఐఐటీల్లో బీటెక్‌- బయోటెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు అన్నా యూనివర్సిటీ, గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, డీవై పాటిల్‌ విద్యాపీఠ్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లాంటి విశ్వవిద్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంది.
ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌) ద్వారా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎంసెట్‌ ద్వారా, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో వారు నిర్వహించే ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. బీటెక్‌- బయోటెక్నాలజీలో స్పెషలైజేషన్లు ఏమీ ఉండవు. ఎంటెక్‌లో మాత్రమే ఉంటాయి. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌లాంటి సంప్రదాయ కోర్సుతో పోలిస్తే బీటెక్‌-బయోటెక్నాలజీకి సాధారణంగా తక్కువ సీట్లుంటాయి. కాబట్టి బీటెక్‌ స్థాయిలో ఆప్షనల్‌ సబ్జెక్టును కూడా కచ్చితంగా చదవాల్సి ఉంటుంది.

* డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలోనే ఆపేశాను. ఇపుడు పూర్తి చేయాలనుకుంటున్నాను. వన్‌ సిట్టింగ్‌ డిగ్రీ అంటే ఏమిటి? దీనికి అర్హులెవరు? వివరాలు తెలియజేయండి.

ఆపేసిన డిగ్రీని పూర్తిచేయాలని కోరుకోవడం అభినందనీయం. ఇరవై సంవత్సరాల క్రితం వరకు వన్‌ సిట్టింగ్‌ డిగ్రీని వివిధ విశ్వవిద్యాలయాలు దూరవిద్య/ ఎక్స్‌టర్నల్‌ ద్వారా అందించేవి. కానీ వన్‌సిట్టింగ్‌ ద్వారా డిగ్రీ చేసే విద్యార్థులు తొమ్మిది గ్రూప్‌ సబ్జెక్టులు, నాలుగు లాంగ్వేజ్‌ సబ్జెక్టుల్లో పరీక్ష రాసి ఒకేసారి డిగ్రీని పొందేవారు. ఈ క్రమంలో నాణ్యత లోపించడం వల్ల పరీక్ష నిర్వహణలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యూజీసీ వన్‌ సిట్టింగ్‌ డిగ్రీని పూర్తిగా రద్దుచేసింది.
ఎవరైనా వన్‌ సిట్టింగ్‌ డిగ్రీ ద్వారా డిగ్రీ పూర్తి చేయవచ్చని చెబితే నమ్మి మోసపోకండి. కొన్ని నకిలీ విశ్వవిద్యాలయాలు స్టడీ సెంటర్ల ద్వారా వన్‌ సిట్టింగ్‌ డిగ్రీని ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేస్తున్నాయి. డిగ్రీ అనేది ఆభరణం లాంటిది కాదు. ఆసక్తి ఉంటే 3 సంవత్సరాలపాటు ఏదైనా ప్రభుత్వ/ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ప్రత్యక్ష/ దూరవిద్య ద్వారా చదువుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకుని డిగ్రీ పట్టా పొందాలి. అప్పుడే ఆ పట్టాకూ, మీకూ కూడా విలువ పెరిగి మెరుగైన ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసుకునే అవకాశముంటుంది.

* బీఎస్‌సీ- ఎంపీసీ చేసి, కేంద్రప్రభుత్వ స్థాయిలో క్లర్క్‌గా నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాను. ఎంబీఏ దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. అందించే విశ్వవిద్యాలయాలు, వాటి దరఖాస్తు విధానాలను తెలియజేయండి. హెచ్‌ఆర్‌/ ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌ చదవాలనుంది. ఇది చేస్తే ప్రభుత్వ/ పీఎస్‌యూ విభాగంలో ఉద్యోగావకాశాలుంటాయా?

అవును, ఉంటాయి. ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, రైల్వే, యూపీఎస్‌సీ, బ్యాంక్‌ పీవో, ఐఏఎస్‌, ఇండియన్‌ ఆర్మీ మొదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఎస్‌ఏఐఎల్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఐఓసీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, పీజీసీఐఎల్‌లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఎంబీఏను దూరవిద్య ద్వారా డా. బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, ఇగ్నో, ఉస్మానియా, జేఎన్‌టీయూ, కాకతీయ, గీతం, ఆచార్య నాగార్జున, ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, కేఎల్‌ మొదలైన విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఐసెట్‌ ద్వారా, మరికొన్ని విశ్వవిద్యాలయాలు ఆయా విశ్వవిద్యాలయాల ప్రత్యేక ప్రవేశపరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో సమయంలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. మీరు ప్రకటన వచ్చిన తరువాత ఏ విశ్వవిద్యాలయంలో ఆసక్తి ఉందో చూసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఫిజియోథెరపి విభాగంలో డిగ్రీ 2012లో పూర్తిచేశాను. తరువాత నుంచి ప్రాక్టీసు చేస్తున్నాను. యూఎస్‌ఏలో ఉన్నత చదువులు చదవాలనుంది. ఏ కోర్సులు చేస్తే మేలు?

ఫిజియోథెరపి చికిత్సకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. మీరు ఉన్నత చదువులు యూఎస్‌ఏలో చదవాలని అనుకుంటున్నారు కాబట్టి జీఆర్‌ఈ, టోఫెల్‌ రాయాల్సివుంటుంది.ఫిజియోథెరపీలో పీడియాట్రిక్స్‌, జీరియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, న్యూరాలజీ, మస్కులోస్కెలిటల్‌ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్‌ ఫిజియోథెరపి, ఆంకాలజీ మొదలైన కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంఎస్‌సీ- ఫిజీషియన్‌ అసిస్టెంట్‌ స్టడీస్‌, మెడికల్‌ ఫిజిక్స్‌, థెరపాటిక్‌ రిక్రియేషన్‌, ఫిజియాలజీ, మాస్టర్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ, ఎంఎస్‌సీ- కైనేసియాలజీ, ఎంఏ- క్లరికల్‌ ఆర్ట్‌ థెరపీ, మాస్టర్‌ ఫిజీషియన్‌ అసిస్టెంట్‌ స్టడీస్‌ మొదలైన కోర్సులు కూడా చేయవచ్చు. ఈ కోర్సు అయినా దానికది ప్రత్యేకతను కలిగివుంటుంది. అభిరుచి, ఆసక్తులను బట్టి కోర్సు ఎంచుకున్నట్లయితే ఆ రంగంలో రాణించే అవకాశముంటుంది.

* మా అమ్మాయి పాలిటెక్నిక్‌ చేసింది. ఆ తర్వాత ఒక సంవత్సరం బీహెచ్‌ఈఎల్‌లో అప్రంటిస్‌గా చేసింది. ప్రస్తుతం బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. తనకున్న ప్రభుత్వ ఉద్యోగావకాశాల వివరాలు తెలపండి.

మీ అమ్మాయి పాలిటెక్నిక్‌లో చదివిన బ్రాంచి విషయం తెలియజేయలేదు. బీహెచ్‌ఈఎల్‌లో అప్రంటిస్‌గా చేసింది కాబట్టి ఎలక్ట్రికల్‌గానీ, ఎలక్ట్రానిక్స్‌గానీ చదివి ఉంటుందని భావించి ఉద్యోగావకాశాల వివరాలను తెలియజేస్తున్నాం. పాలిటెక్నిక్‌, బీకాం ద్వారా ఉద్యోగావకాశాలు, బీకాం తర్వాత ఎంకాం, ఎంబీఏ (ఫైనాన్స్‌), సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఏసీఎస్‌లాంటి కోర్సుల వల్ల కూడా ఉద్యోగావకాశాలుంటాయి. పాలిటెక్నిక్‌తోనే ఉద్యోగం చేయాలనుకుంటే భారత రైల్వే, ఏర్‌వేస్‌, రోడ్‌వేస్‌, ఇంకా చాలా ప్రభుత్వ సంస్థలు బీహెచ్‌ఈఎల్‌, బీఈఎల్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ఇండియా, హెచ్‌పీసీఎల్‌, ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఐఐటీ ఇన్‌స్టిట్యూషన్స్‌, ఈసీఐఎల్‌, బీపీసీఎల్‌ మొదలైన సంస్థల్లో ఉద్యోగాలుంటాయి. పాలిటెక్నిక్‌ చదివినవారికి జూనియర్‌ ఇంజినీర్లుగా, అసిస్టెంట్‌ ఇంజినీర్లుగా ఉద్యోగం చేయడానికి అవకాశముంటుంది.
బీకాం తర్వాత ఉద్యోగం చేయదలచుకుంటే అకౌంట్స్‌ కర్క్‌, అకౌంట్స్‌ అసిస్టెంట్‌, టాక్స్‌ అసిస్టెంట్‌, ఎక్సైజ్‌ ఆఫీసర్‌, బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలుంటాయి. యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, రక్షణ (ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌) మొదలైన రంగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి డిగ్రీ చదివినవారు అర్హులు. బీకాం తర్వాత ఉన్నత విద్య ద్వారా ఉద్యోగావకాశాలు పొందాలనుకుంటే ఎంబీఏ (ఫైనాన్స్‌), ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ చదివిన వారికి బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్‌ సంస్థల్లో, ఫైనాన్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో, స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థల్లో ఆడిటింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ కన్సల్టెంట్లుగా, ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌, క్రెడిట్‌ ఆఫీసర్లు, లోను ఆఫీసర్లు మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.

* ఎంఏ ఇంగ్లిష్‌, ఎంఈడీ చేశాను. ఎడ్యుకేషన్‌ సబ్జెక్టులో యూజీసీ నెట్‌, ఏపీసెట్‌లో అర్హత సాధించాను. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాను. దూరవిద్య ద్వారా సోషియాలజీ చేస్తే, నేను సోషియాలజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేయడానికి అర్హుడినేనా?

మీరు ఎడ్యుకేషన్‌లో నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌), సెట్‌ (స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ల్లో అర్హత సాధించారు. కాబట్టి మీరు ఎడ్యుకేషన్‌ విభాగంలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హులు. దూరవిద్య ద్వారా సోషియాలజీ చేసినట్లయితే సోషియాలజీలో కూడా నెట్‌లో కానీ/ సెట్‌లోకానీ అర్హత సాధిస్తేనే ఆ విభాగంలో మీరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హులు. సెట్‌ కానీ, నెట్‌ కానీ అర్హత సాధించకపోతే యూజీసీ- 2009 రెగ్యులేషన్‌ ప్రకారం పీహెచ్‌డీ చేసినట్లయితే సోషియాలజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హులవుతారు.

* మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుతున్నాను. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో నాకున్న ఉద్యోగావకాశాలేమిటి?

మీరు మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుతున్నారని చెప్పారు. కానీ ఏ విభాగంలో చదువుతున్నారో రాయలేదు. మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో ఫొటోగ్రఫి, పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, డాన్స్‌, మ్యూజిక్‌, ఫిల్మ్‌ మేకింగ్‌ మొదలైన విభాగాలుంటాయి. ఈ కోర్సు సృజనాత్మకత రంగానికి సంబంధించినది. కాబట్టి ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువ. ముఖ్యంగా టెక్స్‌టైల్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, టీచింగ్‌, గ్రాఫిక్‌ ఆర్ట్స్‌, పబ్లిషింగ్‌, అడ్వర్త్టెజింగ్‌ ఏజెన్సీలు మొదలైనవాటిలో ఉద్యోగావకాశాలు ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే బోధనారంగంలో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు అవకాశాలున్నాయి. దూరదర్శన్‌, రేడియో, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ లాంటి రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వరంగంలో కంటే ప్రైవేటు రంగంలోనే వేతనాలు కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది.

* మా అబ్బాయి అగ్రి బీఎస్‌సీ చేస్తున్నాడు. తను చదువుతున్న విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు ఉంది. కానీ ఐసీఏఆర్‌ గుర్తింపు లేదు. మా అబ్బాయికి ఉన్నత విద్య, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయాల్లో తేడాలేమిటి?

యూజీసీ గుర్తింపు అనేది విశ్వవిద్యాలయానికిగానీ, కళాశాలకు గానీ ఉంటుంది. ఆ విశ్వవిద్యాలయం, కళాశాలలు ప్రొఫెషనల్‌ కోర్సు అందిస్తుంటే వాటికి సంబంధించిన జాతీయ నియంత్రణ సంస్థల గుర్తింపు తప్పనిసరి. ఉదాహరణకు వైద్య కోర్సులకు ఎంసీఐ అనుమతి, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి, న్యాయకోర్సులకు బార్‌ కౌన్సిల్‌ అనుమతి, నర్సింగ్‌ కోర్సులకు ఐసీఏఆర్‌ అనుమతి తప్పనిసరి. ఇటీవల వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం విశ్వవిద్యాలయాలు అందించే ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇతర జాతీయ నియంత్రణ సంస్థల గురించి అటువంటి తీర్పులుగానీ, ఆదేశాలుగానీ వెలువడలేదు. కాబట్టి ఐసీఏఆర్‌ అనుమతిలేని బీఎస్‌సీ (అగ్రికల్చర్‌) కోర్సుకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలుగానీ ఉన్నతవిద్య అవకాశాలుగానీ ఉండవు. ప్రైవేటురంగంలోని సంస్థల్లో తగిన ప్రతిభ ఉంటే వారికి ఉద్యోగావకాశాలుంటాయి.
యూజీసీ అనుమతి ఉండడం వల్ల దాన్ని సాధారణ బీఎస్‌సీ డిగ్రీలాగా ఉపయోగించుకునే అవకాశముంది. కాబట్టి ఏదైనా ప్రొఫెషనల్‌ కోర్సులో చేరేముందు ఆ కళాశాలలో ఆ కోర్సుకు జాతీయ నియంత్రణ సంస్థల అనుమతి ఉందో లేదో నిర్ధారించుకుని తర్వాతే ప్రవేశాన్ని పొందాలి. కొన్ని విద్యాసంస్థలు ఎలాంటి అనుమతి లేకుండా కోర్సుని ప్రారంభించి ప్రవేశాలు జరిపి మీరు ఫైనల్‌ ఇయర్‌ అయ్యేలోపు అనుమతి లభిస్తుందని విద్యార్థులను తప్పుదోవ పట్టించే అవకాశముంది. కాబట్టి నిపుణుల సలహాలు, అదే కళాశాలలో చదువుతున్న సీనియర్ల సూచనల ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లయితే మీ డిగ్రీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయాల్లో ఏవైనా ఐసీఏఆర్‌ అనుమతితో మాత్రమే అగ్రికల్చర్‌ కోర్సులను అందించాలి. ఏదైనా విశ్వవిద్యాలయంలో స్కూళ్లు, కళాశాలలు, డిపార్ట్‌మెంట్లు, సెంటర్లు భాగంగా ఉంటాయి. ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో రకమైన పేరుతో విభాగాలను ఏర్పాటు చేస్తుంది. స్కూల్‌ అనే పదం సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ఎక్కువగా వాడుతారు. అదే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అయితే కాలేజ్‌ అని ఉంటుంది. మీరు అగ్రికల్చర్‌ కోర్సు చదవదలచుకుంటే ఐసీఏఆర్‌ అనుమతి అతిముఖ్యమైనది. కానీ స్కూల్‌, డిపార్ట్‌మెంట్‌, కాలేజ్‌ అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

* మా అబ్బాయి డెయిరీ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. పీజీ కోర్సులు, అందించే విశ్వవిద్యాలయాలను తెలపండి. కోర్సు పూర్తయిన తరువాత తనకుండే ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

నిత్యావసర వస్తువు అయిన పాలకు సంబంధించిన కోర్సులకు ఆదరణ, అవకాశాలు ఎప్పుడూ ఎక్కువే. డెయిరీ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ చదివినవారు ఈ కింది కోర్సుల్లో పీజీ చేయవచ్చు. అవి- ఎంటెక్‌ ఇన్‌ డెయిరీ టెక్నాలజీ, ఎంటెక్‌ ఇన్‌ డెయిరీ కెమిస్ట్రీ, ఎంటెక్‌ ఇన్‌ డెయిరీ ఇంజినీరింగ్‌, ఎంటెక్‌ ఇన్‌ డెయిరీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎంటెక్‌ ఇన్‌ డెయిరీ బాక్టీరియాలజీ, మాస్టర్స్‌ ఆఫ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంఏబీఎం) మొదలైనవి.
ఈ కోర్సులను అందించే విశ్వవిద్యాలయాలు కాలేజ్‌ ఆఫ్‌ డెయిరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కాలేజ్‌ ఆఫ్‌ డెయిరీ టెక్నాలజీ, బెంగళూరు డెయిరీ సైన్స్‌ కాలేజ్‌, ఆనంద్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వెస్ట్‌బెంగాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ యానిమల్‌ అండ్‌ ఫిషరీ సైన్స్‌, నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ మొదలైన ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు, తెలుగు రాష్ట్రాల్లోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలు డెయిరీ టెక్నాలజీలో పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసినవారికి డెయిరీ కన్సల్టెంట్లుగా, సూపర్‌వైజర్లుగా, ఉపాధ్యాయులుగా, పరిశోధనల్లో ఉద్యోగావకాశాలున్నాయి. ఆసక్తి, నైపుణ్యం ఉన్నవారు మిల్క్‌ప్లాంట్‌, ఐస్‌క్రీం యూనిట్లు స్థాపించి సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. డెయిరీ టెక్నాలజీ చదివినవారికి డెయిరీ ఫార్మ్‌ల్లో పాలకు సంబంధించిన పదార్థాలను తయారుచేసే సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

* బీఏ- హెచ్‌ఆర్‌ఎం మూడో సంవత్సరం చదువుతున్నాను. తరువాత నాకున్న కెరియర్‌ అవకాశాలను తెలియజేయండి. వాటితో ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

బీఏ-హెచ్‌ఆర్‌ఎం (హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) చదివిన తరువాత ఎంబీఏ హెచ్‌ఆర్‌ఎం కూడా చదివితే ఉద్యోగావకాశాల పరిధి బాగా పెరుగుతుంది. ఎంబీఏ- హెచ్‌ఆర్‌ఎం వీలుకాని పక్షంలో ఎంహెచ్‌ఆర్‌ఎం (మాస్టర్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) కానీ, ఎంఏ (హెచ్‌ఆర్‌ఎం) కానీ, మాస్టర్స్‌ ఆఫ్‌ లేబర్‌ వెల్ఫేర్‌ కూడా చేసే అవకాశముంది. ఇంకా అవకాశముంటే హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ కూడా చేయవచ్చు.
మీరు బీఏ- హెచ్‌ఆర్‌ఎంతోనే ఉద్యోగం చేయాలని అనుకుంటే ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎంబీఏ కళాశాల నుంచి వేలమంది విద్యార్థులు హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌తో బయటికి వస్తున్నారు; వారితో పోటీపడి ఉద్యోగం సాధించాలంటే మీకు బీఏలో ఉన్న సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి. దీనితోపాటు భావప్రకటన నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, చొరవ ఉన్నట్లయితే ఎంబీఏ వారితో పోటీపడి ఉద్యోగాలు సాధించవచ్చు హెచ్‌ఆర్‌ఎం చదివినవారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలు: హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్‌, ఎంప్లాయీ ట్రెయినింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌, ఎంప్లాయీ బెనిఫిట్‌ మేనేజర్‌, లేబర్‌ రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ కన్సల్టెంట్‌, రిక్రూట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎంప్లాయిమెంట్‌ ఇంటర్వ్యూయర్‌, ఎంప్లాయీ వెల్ఫేర్‌ మేనేజర్‌ మొదలైనవి.

* లాసెట్‌లో మంచి ర్యాంకు సాధించాను. అయితే స్నేహితులు న్యాయవిద్య కంటే గ్రూప్స్‌కు సిద్ధమవడం మేలు అంటున్నారు. నిజమేనా? లా ఉపాధి, ఉద్యోగావకాశాలను తెలపండి. తరువాత ఏ పై చదువులు చదవవచ్చు?

లాసెట్‌లో మంచి ర్యాంకు సాధించిన మీరు ఆ రంగంలో ఆసక్తి ఉన్నట్లయితే లా కోర్సు చదవడమే మేలు. ప్రభుత్వ ఉద్యోగంతోపాటుగా ప్రజాసేవ చేయడం మీ అభిమతమైతే గ్రూప్స్‌ చేయడం మంచిది. లా చదివిన తర్వాతగానీ, గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నపుడుగానీ భారీగా పోటీపడాల్సి ఉంటుంది. కొన్ని వేలమంది లాయర్లతో, లక్షల మంది గ్రూప్స్‌ అభ్యర్థుతో పోటీ పడడం తప్పనిసరి అయిననపుడు మీకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రయత్నించడం మంచిది.
లా అనేది ఒక కోర్సు అయితే గ్రూప్స్‌... ఉద్యోగానికి సంబంధించిన అంశం. లాసెట్‌లో మంచి ర్యాంకు రావడమనేది మీకు ఉన్న జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, లీగల్‌ ఆప్టిట్యూడ్‌ల్లో మీకున్న పట్టును తెలియజేస్తుంది.
పోటీ పరీక్షల్లో కూడా ఈ విషయాల్లో పరిజ్ఞానం ఉన్నవారు రాణించే అవకాశాలు ఎక్కువ. న్యాయవిద్య- ప్రొఫెషనల్‌ కోర్సు కాబట్టి గ్రూప్స్‌లో ఒకవేళ ఉత్తీర్ణత సాధించకపోతే లాయరుగా స్థిరపడే అవకాశాలుంటాయి. వీలుంటే లా చదువుతూ కూడా సన్నద్ధమయ్యే అవకాశాలను పరిశీలించండి. న్యాయవిద్య చదివినట్లయితే లీగల్‌ అడ్వైజర్‌గా, క్రిమినల్‌ లాయర్‌, లీగల్‌ జర్నలిస్ట్‌, లీగల్‌ అనలిస్ట్‌, సివిల్‌ లిటిగేషన్‌, సబ్‌ జడ్జి, జడ్జిలుగా ఉద్యోగావకాశాలుంటాయి.
ఉన్నతవిద్య అభ్యసించాలంటే ఎల్‌ఎల్‌ఎం, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులను చేయవచ్చు. మీరు లా చదవాలనుకుంటే క్రిమినల్‌ లా, అడ్మినిస్ట్రేటివ్‌ లా, హ్యూమన్‌రైట్స్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, సైబర్‌ లా, కార్పొరేట్‌ లా, బిజినెస్‌ లా, లేబర్‌ లా మొదలైన వాటిలో ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ను ఎంచుకుని చదవవచ్చు. కొన్ని తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు (ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ), కొన్ని జాతీయ విశ్వవిద్యాలయాలు (నల్సార్‌, నేషనల్‌ లా స్కూల్‌ మొదలైనవి), కొన్ని డీమ్డ్‌ (భారతీ విద్యాపీఠ్‌, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం) లా కోర్సును అందిస్తున్నాయి.

* బీఎస్‌సీ పూర్తిచేశాను. ఎంఎస్‌సీ (మేథమేటిక్స్‌) దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను కుదురుతుందా? అందించే సంస్థలేవి? తుది గడువులు, ఫీజు వివరాలు తెలియజేయండి.

ఎంఎస్‌సీ (మేథమేటిక్స్‌)ను దూరవిద్య ద్వారా చేయవచ్చు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, (బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీతోపాటుగా ఉస్మానియా), కాకతీయ, ఆంధ్ర, ఆచార్య నాగార్జున, శ్రీ వెంకటేశ్వర, రాయలసీమ విశ్వవిద్యాలయాలు, తమిళనాడులోని అన్నామలై, మధురై కామరాజు, అలగప్ప విశ్వవిద్యాలయాలు, పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా ఎంఎస్‌సీ (మేథమేటిక్స్‌)ను దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి.
ఫీజు రూ. 8000 నుంచి రూ. 22,000వరకు (కోర్సు మొత్తానికి) ఉంటుంది. చాలా విశ్వవిద్యాలయాలు కనిష్ఠంగా రూ. 8000, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) లాంటి విశ్వవిద్యాలయాలు గరిష్ఠంగా రూ. 22000 ఫీజు నిర్ధారించాయి. సాధారణంగా దూరవిద్య ద్వారా నిర్వహించే కోర్సుల ప్రకటనలు జులై నుంచి డిసెంబర్‌లోపు రకరకాల తేదీల్లో విడుదల చేస్తారు. ఆ తేదీల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

* అగ్రికల్చర్‌ డిప్లొమా చేశాను. బీఎస్‌సీ అగ్రికల్చర్‌ చేయాలనుకుంటున్నాను. దూరవిద్య ద్వారా చేయడం మంచి ఆలోచనేనా? ఇతర రాష్ట్రాల్లో ఈ కోర్సును దూరవిద్య ద్వారా అందించే విశ్వవిద్యాలయాలేవి?

బీఎస్‌సీ అగ్రికల్చర్‌ కోర్సుకు దేశంలో ఐసీఏఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) అనుమతి తప్పనిసరి. ఐసీఏఆర్‌ అనుమతి లేని బీఎస్‌సీ అగ్రికల్చర్‌ కోర్సుకు ఉద్యోగావకాశాలు, ఉన్నతవిద్య అవకాశాలు ఉండవు. మీరు దూరవిద్య ద్వారా కానీ, నేరుగా కానీ బీఎస్‌సీ అగ్రికల్చర్‌ చేయాలనుకుంటే ఆ విద్యాసంస్థకు ఐసీఏఆర్‌ అనుమతి ఉందో, లేదో తెలుసుకోవాలి. యశ్వంతరావు చవాన్‌ మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ, నాసిక్‌ http://www.ycmou.ac.in దూరవిద్య ద్వారా బీఎస్‌సీ అగ్రికల్చర్‌ను అందిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో బీఎస్‌సీ అగ్రికల్చర్‌ను దూరవిద్య ద్వారా ఏ విశ్వవిద్యాలయమూ అందించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో చాలా విశ్వవిద్యాలయాలు అగ్రికల్చర్‌లో పీజీ డిప్లొమా కోర్సులు, డిప్లొమా కోర్సులు, అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు, అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ లాంటి కోర్సులను అందిస్తున్నాయి.
బీఎస్‌సీ అగ్రికల్చర్‌ లాంటి ఏ ప్రొఫెషనల్‌ కోర్సునయినా నేరుగా పేరున్న కళాశాలల్లో చేయడం మంచిది. మీరు డిప్లొమా తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరి ఉంటే దూరవిద్య ద్వారా చేసిన డిగ్రీ పదోన్నతులకు ఉపయోగపడుతుంది. మరేదైనా కొత్త ఉద్యోగానికి వెళ్లినపుడు దూరవిద్య ద్వారా డిగ్రీ చేసినవారికంటే నేరుగా డిగ్రీ చదివినవారికి ప్రాముఖ్యం ఉంటుంది.
ఏదైనా ప్రొఫెషనల్‌ కోర్సులో మూడు/ నాలుగు సంవత్సరాలు ప్రముఖ విద్యాసంస్థల్లో పేరున్న అధ్యాపకుల పర్యవేక్షణలో విషయ పరిజ్ఞానాన్నీ, మెలకువలనూ ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. నేరుగా బీఎస్‌సీ అగ్రికల్చర్‌ను చేయడానికి వీలులేనపుడు మాత్రమే దూరవిద్య ద్వారా డిగ్రీ కోసం ప్రయత్నించాలి. దూరవిద్య ద్వారా చేస్తున్నప్పటికీ విశ్వవిద్యాలయం వారు అందించే పాఠ్యాంశాలను, ఉపయుక్త గ్రంథాలను కూడా చదవాలి. అసైన్‌మెంట్‌లను సొంతంగా రాస్తూ, కాంటాక్ట్‌ తరగతులకు విధిగా హాజరై విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇలా చేస్తే ఉద్యోగార్హత పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచే అవకాశం ఉంటుంది.

* మా బాబు ఇంటర్‌ (ఎంపీసీ) తరువాత సీఏ తీసుకున్నాడు. సీపీటీ పూర్తి చేశాడు. ఐపీసీసీ చదివేటపుడే బీకాం పూర్తి చేశాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సును దూరవిద్య ద్వారా చేస్తున్నాడు. దీనికి విలువ ఉంటుందా? దీనికి తోడు ఏదైనా కోర్సు చేస్తే మేలా? ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

సీపీటీ, ఐపీసీసీతోపాటుగా బీకాం పూర్తిచేసి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సును దూరవిద్య చేయడం వల్ల ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూరవిద్య ద్వారా చేస్తున్న కోర్సు డిప్లొమా, డిగ్రీ, పీజీల విషయంలో స్పష్టత లేనందువల్ల దూరవిద్య ద్వారా ఎంబీఏ చదువుతున్నారన్న భావనతో మీ ప్రశ్నకు సమాధానాన్ని పరిశీలిద్దాం. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం సీఏ, ఐసీడబ్ల్యూఏ లాంటి కోర్సులను పీజీతో సమానంగా అధ్యాపక ఉద్యోగాలకు అర్హత కల్పిస్తున్నారు. మీ బాబు సీఏ పూర్తిచేసి ఎంబీఏ కూడా కలిగి ఉన్నట్లయితే అధ్యాపక రంగంలో, ఆడిట్‌, సాఫ్ట్‌వేర్‌, వస్తుతయారీ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సు చదవడం వల్ల ప్రపంచస్థాయి వ్యాపారానికి కావాల్సిన విషయ పరిజ్ఞానం మెలకువలు గ్రహించవచ్చు. వీటితోపాటుగా ఎకౌంటింగ్‌కు సంబంధించి కొన్ని సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీల్లో శిక్షణ తీసుకున్నట్లయితే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.

* మా అమ్మాయి ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ పూర్తయ్యాక ఏదైనా కోర్సులో చేరాలనుకుంటోంది. ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సుల గురించి వివిధ సంస్థలు అందించే డిగ్రీ, డిప్లొమా, పీజీ, మేనేజ్‌మెంట్‌ కోర్సుల వివరాలు తెలియజేయగలరు. అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వివరాలు తెలపండి.

ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఇంటీరియర్‌ డిజైనింగ్‌లు ప్రత్యేకమైన కోర్సులు. ఆ కోర్సును చదవాలనుకునే విద్యార్థులకు ఆ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటే భవిష్యత్తులో రాణించే అవకాశం ఉంటుంది. ఈ కోర్సులు అందించే సంస్థలు, వాటి వివరాలు: జాతీయ సంస్థలైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ అండ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (www.niiftbbsr.ac.in ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (www.nift.ac.in ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (www.iiftbangalore.com) మొదలైన సంస్థలు డిప్లొమా ఇన్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌, బీఎస్‌సీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, పీజీ డిప్లొమా కోర్సులు, మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ మొదలైనవి అందిస్తున్నాయి. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని బీఐపీడీ బిజినెస్‌ స్కూల్‌ (www.bipdindia.com ), హామ్స్‌టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ (www.hamstech.com ), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ (www.svuniversity.ac.in ), ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ (www.andhrauniversity.edu.in ), కాలేజ్‌ ఆఫ్‌ హోమ్‌సైన్స్‌ (www.chshyd.ac.in ), జేడీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ- హైదరాబాద్‌ మొదలైన సంస్థలు ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి.

* మా అమ్మాయి ఆక్వాకల్చర్‌ చదవాలనుకుంటోంది. నేనేమో హార్టికల్చర్‌ను సూచించాను. వీటిల్లో ఏది మెరుగు? కోర్సులు, ప్రవేశ పరీక్షల వివరాలు తెలియజేయగలరు.

మీరు చెప్పిన రెండు కోర్సులూ ఉపయోగకరమైనవే. మార్కెట్‌ను బట్టి ఉద్యోగావకాశాలు మారుతూ ఉంటాయి. ఏ కోర్సు దానికదే ప్రత్యేకం. ఏ కోర్సు అయినా విద్యార్థి/ విద్యార్థిని ఆసక్తిని బట్టి బాగా ఉండడం, ఉండకపోవడమనేది ఆధారపడి ఉంటుంది. బీఎస్‌సీ (హార్టికల్చర్‌) తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలైన కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్‌ యూనివర్సిటీ, డా.వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. ఇంటర్మీడియట్‌ బైపీసీ తరువాత ఎంసెట్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు. ఐసీఏఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) వారు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా కూడా రెండు విశ్వవిద్యాలయాల్లో కొన్ని సీట్లను భర్తీచేస్తారు. హార్టీకల్చర్‌లో డిప్లొమా కోర్సులు చేసే అవకాశముంది. హార్టికల్చర్‌ కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు చాలా ఉంటాయి. శాస్త్రవేత్త, అధ్యాపకుడు, జిల్లా హార్టికల్చర్‌ అధికారి, హార్టికల్చర్‌ ఇన్‌స్పెక్టర్‌- ట్రెయినింగ్‌ అసిస్టెంట్‌, ఫార్మా సూపర్‌వైజర్‌ లాంటి ఉద్యోగావకాశాలు విద్యార్హతను బట్టి పొందవచ్చు. ప్రైవేటు రంగంలో కూడా మార్కెటింగ్‌ ఉద్యోగాలు, పరిశ్రమల్లో లాండ్‌స్కేపింగ్‌, హోటళ్లు, కన్‌స్ట్రక్షన్‌ సంస్థలు, గోల్ఫ్‌ కోర్టుల్లో కూడా ఉద్యోగావకాశాలుంటాయి. స్వయం ఉపాధికి చాలా అవకాశాలున్నాయి. కన్సల్టెంట్‌గా, ఫ్లోరల్‌ డెకరేటర్లుగా, కోల్డ్‌స్టోరేజీ నిర్వాహకులుగా రకరకాల అవకాశాలుంటాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 30 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో హార్టికల్చర్‌ కోర్సులు, పరిశోధన అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రైవేటు కళాశాలల్లో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది.
ఆక్వాకల్చర్‌ విషయానికొస్తే.. దీనిని బీఎస్‌సీలో భాగంగా ఒక సబ్జెక్టుగా గానీ, బీఎస్‌సీ- ఫిషరీస్‌, మైక్రోబయాలజీ, ఆక్వాకల్చర్‌ కలయికగాకానీ చదివే అవకాశముంది. ఇవేకాకుండా బీఎఫ్‌ఎస్‌సీ ఫిష్‌ బయాలజీ, ఫిష్‌ ఎకనామిక్స్‌, ఫిష్‌ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌, ఫిష్‌ టెక్నాలజీ- ఇంజినీరింగ్‌, బీఎస్‌సీ ఫిషరీస్‌; ఇవే కోర్సుల్లో మాస్టర్స్‌, పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సు ఆంధ్ర, ఆచార్య నాగార్జున, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంది. ఈ కోర్సు చేస్తే ఆహార పరిశ్రమలో చేపలు/ రొయ్యల ఎగుమతులు, బయోటెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

* దూరవిద్య ద్వారా బీకాం (చివరి సంవత్సరం) చదువుతున్నాను. ఎంకాం (అకౌంట్స్‌)/ ఎంబీఏ నేరుగా చదవాలనుకుంటున్నాను. అలా చదవడం కుదురుతుందా? అయితే ఏయే ప్రవేశపరీక్షలు రాయాలి? తెలుగు రాష్ట్రాల్లో ఏయే విశ్వవిద్యాలయాలు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి?

దూరవిద్య ద్వారా బీకాం చదివినప్పటికీ రెగ్యులర్‌గా బీకాం చదివినవారు ఏయే కోర్సులకు అర్హులో వాటన్నింటికీ మీరూ అర్హులవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలైన మౌలానా నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (ఉర్దూ మీడియం), అన్ని డీమ్డ్‌ యూనివర్సిటీలు, కొన్ని అటానమస్‌ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంకాంలు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, జవహర్‌లాల్‌నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (హైదరాబాద్‌, అనంతపురం, కాకినాడ), దాదాపుగా అన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఎంబీఏ మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలు ఎంబీఏకి సమానమైన రెండు సంవత్సరాల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ను అందిస్తున్నాయి. ఉదాహరణకు శివశివాని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, విశ్వవిశ్వాని బిజినెస్‌ స్కూల్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌, ఐఎంటీ హైదరాబాద్‌, సింబయాసిస్‌ మొదలైనవి. ఎంకాంకు సంబంధించినంతవరకూ ప్రతి సంవత్సరం మే, జూన్‌లలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఎంబీఏకు సంబంధించి ఐసెట్‌ (ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తారు. ఐసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా రెండు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో, వాటి అనుబంధ కళాశాలల్లో వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలుంటాయి. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ క్యాట్‌లో వచ్చిన మార్కులు, బృందచర్చలు, మౌఖిక పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుపుతారు. ఏఐసీటీఈ- సీమ్యాట్‌ (కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌), ఏటీఎంఏ (ఎయిమ్స్‌ టెస్ట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌)ల్లో పొందిన మార్కులు, బృందచర్చలు, మౌఖిక పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

* గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మెకానికల్‌ చదువుతున్నాను. తరువాత ఇంజినీరింగ్‌లో చేరాలనుంది. ఏ ప్రోగ్రాముల్లో నాకు చేరే అవకాశముంటుంది? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

మీకు ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ చదివే అవకాశం ఉంటుంది. మెకానికల్‌, మైనింగ్‌, ప్రొడక్షన్‌, ఆటోమొబైల్‌, మెటలర్జీ, ఏరోనాటికల్‌, మెటీరియల్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌ మొదలైన కోర్సులు చదివే అవకాశముంటుంది. పాలిటెక్నిక్‌ తర్వాత ఇంజినీరింగ్‌ చేస్తే చాలా ఉద్యోగాలకు అర్హులవుతారు. విషయ పరిజ్ఞానం కూడా పెరగడం వల్ల పాలిటెక్నిక్‌లో నేర్చుకున్న ప్రాక్టికల్స్‌, ఇంజినీరింగ్‌లో నేర్చుకునే థియరీ, ప్రాక్టికల్స్‌ వల్ల అవగాహన, సమస్యా పరిష్కార సామర్థ్యాలు పెరుగుతాయి. ఫలితంగా మంచి భవిష్యత్తు సొంతమవుతుంది.

* బీఎస్‌సీ (హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌) పూర్తి వివరాలను తెలియజేయండి.

బీఎస్‌సీ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ / బాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఒక అండర్‌గ్రాడ్యుయేట్‌ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌. ఈ కోర్సు హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ నిర్వహణను బోధిస్తుంది... మెడికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌, ఎథికల్‌, లీగల్‌ కోణాల్లో. వైద్యసేవాపరిజ్ఞానం, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ రెండూ ఈ వృత్తిలో అనుసంధానమైవుంటాయి. కోర్సు కాలవ్యవధి మూడు సంవత్సరాలు. విద్యార్థి ఈ కోర్సులో ఉత్తీర్ణులైతే ఎన్నో కెరియర్‌ అవకాశాలుంటాయి.
అర్హత: 10+2 కనీసం 45% మార్కులతో పాసైన అభ్యర్థులు (ఎస్‌సీ/ ఎస్‌టీ అభ్యర్థులు 40%) అర్హులు. ఈ డిగ్రీలో ప్రవేశం కల్పించడానికి కొన్ని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు, సంస్థలు ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి.
ఎలాంటి లక్షణాలుండాలి?: కోర్సును చేయాలనుకునేవారు అందుకు అవసరమైన మానవసంబంధాలు, భావప్రసరణ నైపుణ్యాలను కలిగుండాలి. ఆరోగ్య సంబంధ విషయాలపై తాజా పరిణామాల అవగాహనతోసహా మంచి పరిజ్ఞానం అవసరం.
కోర్సు పూర్తయ్యాక మాస్టర్స్‌, పరిశోధన కూడా చేయవచ్చు.
గ్రాడ్యుయేట్లను ప్రవేశస్థాయి ఆరోగ్య సమాచార అడ్మినిస్ట్రేటర్లుగా తయారుచేస్తారు. ఈ వృత్తి హెల్త్‌కేర్‌ సిస్టమ్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ల పరిజ్ఞానాన్ని జోడిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు, ఏజెన్సీల్లో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తుంది. ఈ కోర్సు ప్రాక్టికల్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికీ, తద్వారా క్లిష్టమైన హెల్త్‌ ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాజెక్టులను ప్లాన్‌ చేసుకోవడానికీ, వాటిని నిర్వహించడానికీ తోడ్పడుతుంది.
ఉద్యోగావకాశాలు
* క్లినికల్‌ రికార్డ్‌ మేనేజర్‌ * పేషెంట్‌ డేటా సర్వీసెస్‌ మేనేజర్‌ * హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ * క్లినికల్‌ కోడింగ్‌ స్పెషలిస్ట్‌ * హెల్త్‌ డేటా అనలిస్ట్‌ * ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌ అనలిస్ట్‌ * కోడింగ్‌ కంప్లయన్స్‌ రివ్యూయర్‌
బీఎస్‌సీ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అడ్వాన్స్‌ కోర్సులు: * ఎంఎస్‌సీ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌) * పీజీ డిప్లొమా ఇన్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ అందించే కళాశాలలు
* ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ - ఏఐఓహెచ్‌ఎస్‌, మహారాష్ట్ర * భారతీదాసన్‌ యూనివర్సిటీ, తమిళనాడు * భార్గవి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ (బీఐఎంఏటీ), ఆంధ్రప్రదేశ్‌ * ఛత్రపతి షాహు జీ మహారాజ్‌ యూనివర్సిటీ, ఉత్తర్‌ప్రదేశ్‌ * మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌- ఎంసీఓఏహెచ్‌ఎస్‌, కర్ణాటక * ముథూట్‌ కాలేజ్‌ ఆఫ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, కేరళ * ఒయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఓఐహెచ్‌ఎస్‌ఆర్‌సీ), పూణె, మహారాష్ట్ర * సిక్కిం మణిపాల్‌ యూనివర్సిటీ, సిక్కిం .

* బీఎస్‌సీ (హెచ్‌ఎస్‌సీ) (ఫామిలీ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు వివరాలు తెలియజేయండి.

ఫామిలీ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో బాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (హోం సైన్స్‌)కాలవ్యవధి- 3 సంవత్సరాలు. ఇదో అండర్‌గ్రాడ్యుయేట్‌ హోమ్‌ సైన్స్‌ కోర్సు. ఆర్థిక, మానసిక, జీవసంబంధ,
సంప్రదాయిక, సామాజిక అంశాలపరంగా కుటుంబ, వ్యక్తిగత బాగోగులను ఎలా చూసుకోవాలో విద్యార్థులకు నేర్పిస్తారు. సామాజిక వనరులను భవిష్యత్తు కాలంలో పెరగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్పిస్తారు. కెరియర్‌ పరంగా ఎక్కువ ఉద్యోగావకాశాలను కల్పించగల కోర్సు ఇది.
స్పెషలైజేషన్లు: * ఇంటర్‌పర్సనల్‌ రిలేషన్‌షిప్స్‌ * ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ * న్యూట్రిషన్‌ * పేరెంటింగ్‌ * అడాలసెంట్‌ డెవలప్‌మెంట్‌
అర్హత: సైన్స్‌లో 10+2 లేదా అందుకు సమానమైన కోర్సులో కనీసం 50% మార్కులు సాధించాలి.
* కొన్ని ప్రతిష్ఠాత్మక కళాశాలలు, సంస్థలు ప్రవేశపరీక్షను నిర్వహించి దాని ఆధారంగా బీఎస్‌సీ డిగ్రీ కోర్సులో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.
ఏ కళాశాలల్లో?
* అస్సాం అగ్రికల్చర్‌ యూనివర్సిటీ * ఎస్‌.ఎం పాటిల్‌ కాలేజ్‌ ఆఫ్‌ హోమ్‌ సైన్స్‌ * చౌదరి సార్వన్‌ కర్నర్‌ అగ్రికల్చరల్‌ విశ్వవిద్యాలయా * శ్రీమతి నాతిభాయ్‌ దామోదర్‌ థాకర్సే విమెన్‌ యూనివర్సిటీ (చర్చ్‌గేట్‌).
కావాల్సిన లక్షణాలు: భావప్రసరణ నైపుణ్యాలు, సానుకూల మృదు స్వభావం, ఆలోచనల్లో విశ్లేషణాత్మకత లక్షణాలు ఈ కోర్సు చదివాలనుకునేవారికి తప్పనిసరి. సమాజాభివృద్ధికి తోడ్పడాలనుకునేవారు, అవసరంలో ఉన్నవారికి సహాయపడాలనుకునేవారు కూడా ఈ కోర్సులో చేరవచ్చు. పీజీ చేసి టీచర్‌, లెక్చరర్‌ అవ్వాలనే లక్ష్యం ఉన్నవారు కూడా ఈ కోర్సును ఎంచుకోవచ్చు. బీఈడీ, నెట్‌ వంటివి పూర్తిచేసి అధ్యాపకులుగా మారవచ్చు. స్వీయ నియంత్రణ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఈ ఉద్యోగం చేసేవారికి క్లిష్టసమయాల్లో నెమ్మదిగా వ్యవహరించడం, భావోద్వేగాలనూ, కోపాన్నీ అదుపులో ఉంచుకోవడం అవసరం.
ఎలా లాభదాయకం?
ఉన్నత చదువులు చదవడానికి ఈ డిగ్రీ కోర్సు ఉపయోగపడుతుంది. ఎన్‌జీవోల ఆధ్వర్యంలో జరిగే ఎన్నో సమాజ సేవాకార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. పాఠశాలల్లో టీచరుగా చేరవచ్చు. అవసరమైన వనరులను ఉపయోగించుకుంటూ కుటుంబ సంబంధాలను ఎలా మెరుగుపరచుకోవచ్చో ఈ ప్రోగ్రామ్‌ తెలియజేస్తుంది.
ఉద్యోగావకాశాలు: * హెచ్‌ఆర్‌ బిజినెస్‌ మేనేజర్‌ * పేరెంట్‌ ఎడ్యుకేటర్‌ * ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌ * న్యూట్రిషన్‌ ఎడ్యుకేటర్‌ * జూనియర్‌ మేనేజర్‌- హెచ్‌ఆర్‌, అడ్మినిస్ట్రేషన్‌ * అసిస్టెంట్‌ మేనేజర్‌- హ్యూమన్‌ రిసోర్స్‌ * హ్యూమన్‌ రిసోర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ * ఎంప్లాయీ రిలేషన్స్‌ మేనేజర్‌ * డెలివరీ మేనేజర్‌ * అసిస్టెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ * హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ * రెస్టారెంట్‌ మేనేజర్‌.
అడ్వాన్స్‌ కోర్సులు: * ఎంఎస్‌సీ (ఫామిలీ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) * పీహెచ్‌డీ (ఫామిలీ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌).

బీఎస్‌సీ బయోమెడికల్‌ సైన్సెస్‌ను ఎంచుకోవచ్చా? వివరాలు తెలియజేయండి?

ఇది ఆరు సెమిస్టర్లతోకూడిన మూడు సంవత్సరాల కాలవ్యవధిగల కోర్సు. దీనిని యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ అందిస్తోంది. ఆరు సెమిస్టర్లలో 12 మెయిన్‌ పేపర్లు, 6 కామన్‌ పేపర్లు, 6 ఇంటర్‌ డిసిప్లినరీ పేపర్లుంటాయి. ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రాక్టికల్స్‌తోపాటు కింద తెలిపిన సబ్జెక్టులుంటాయి.
బయాలజీ, హ్యూమన్‌ ఫిజియాలజీ, కెమిస్ట్రీ, టెక్నికల్‌ రైటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ ఇంగ్లిష్‌/ కంప్యూటేషనల్‌ స్కిల్స్‌, హ్యూమన్‌ ఫిజియాలజీ, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, మైక్రోబయాలజీ, పాథాలజీ, సెల్‌ బయాలజీ, మాలిక్యులార్‌ బయాలజీలను బోధిస్తారు. కోర్సు సమయంలో బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, జెనెటిక్స్‌, బయోఫిజిక్స్‌లను కూడా బోధిస్తారు. మూడో సంవత్సరంలో జనరల్‌ బయోమెడికల్‌ సైన్సెస్‌పై సమగ్ర అవగాహన కల్పించడానికి ఇమ్యునాలజీ, టాక్సికాలజీ అంశాలనూ బోధిస్తారు. దీంతోపాటు విద్యార్థులు రెండు నెలల వేసవి శిక్షణకు వెళ్లి, దానిపై డిజర్టేషన్‌ను ఆరో సెమిస్టర్‌ చివర్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు వర్కు పరిశోధన/ డయాగ్నోస్టిక్‌ లాబ్‌/ సర్వే విశ్లేషణ/ సమీక్షా వ్యాసం అయి ఉండొచ్చు.
* కోర్సును అందిస్తున్న కళాశాలలు: ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, చెన్నై, దిల్లీ విశ్వవిద్యాలయం, దిల్లీ, ఆచార్య నరేంద్రదేవ్‌ కళాశాల, దిల్లీ
* అర్హత: ఫిజిక్స్‌, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుండాలి.

రిహాబిలిటేషన్‌ సైన్సెస్‌ అంటే ఏమిటి? ఈ కోర్సును అందించే సంస్థలేవి?

బీఎస్‌సీ రిహాబిలిటేషన్‌ సైన్సెస్‌ నాలుగు సంవత్సరాల కోర్సు. దీన్ని బెంగళూరు విశ్వవిద్యాలయం 2012- 13 నుంచి అందిస్తోంది. ఈ కోర్సును సైకాలజీ, సీబీఆర్‌ నెట్‌వర్క్‌ (సౌత్‌ ఆసియా), రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా రూపొందించాయి.
ఏదైనా గాయం/ జబ్బు తర్వాత క్రియారహితంగా మారిన వ్యక్తిని తిరిగి కోలుకునేలా చేస్తుంది రిహాబిలిటేషన్‌. అశక్తులుగా తయారైనవారిని మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా, సామాజికంగా, వృత్తిపరంగా పునరుద్ధరించడంలో తోడ్పడుతుంది. మానసికవ్యాధులు కూడా దీని సాయంతో దూరమవుతాయి.
నేషనల్‌ కాలేజ్‌ తిరుచిరాపల్లి, తమిళనాడు; స్వీకార్‌ అకాడమీ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ సైన్సెస్‌ (ఎస్‌ఏఆర్‌ఎస్‌), సికింద్రాబాద్‌- ఈ కోర్సును అందిస్తున్నాయి.
ఈ విభాగం ప్రాణాంతకమైన మారకద్రవ్యాలకు బానిసలైనవారిని మళ్లించడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. మానసికంగా బలహీనులైన వారి పునరావాసంలో రిహాబిలిటేషన్‌ సిబ్బంది ప్రముఖపాత్రను పోషిస్తారు.
ఈ పరిశ్రమలో పనిచేసేవారు... తీవ్రంగా బానిసలైనవారికి వైద్యం అందించడానికి రెసిడెన్షియల్‌ చికిత్సా కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. రిహాబిలిటేషన్‌ థెరపీలో ఫిజికల్‌, ఆక్యుపేషనల్‌ థెరపీలుంటాయి. ఫిజికల్‌ థెరపీ వైద్యం అంటే వ్యాయామం, టిష్యూ మానిప్యులేషన్‌ ద్వారా శరీరంలోని అవయవాలు సరిగా పనిచేసేలా చేస్తారు. ఆక్యుపేషనల్‌ థెరపీ వ్యాధిగ్రస్తుడు తిరిగి కోలుకొని, తన దినచర్యలను సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన ప్రక్రియలను అందించడంపై దృష్టిసారిస్తుంది.
లభించే కోర్సులు
* సర్టిఫికెట్‌ ఇన్‌ రిహాబిలిటేషన్‌ కౌన్సెలింగ్‌ * డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపెయిర్డ్‌) * డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (విజువల్లీ హాండికాప్‌డ్‌) * డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (మెంటల్‌ రిటార్డేషన్‌) * బాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఆనర్స్‌) ఫిజికల్‌ థెరపీ * బాచిలర్‌ ఇన్‌ మెంటల్‌ రిటార్డేషన్‌ * బాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపెయిర్డ్‌) * బాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (విజువల్లీ హాండీకాప్డ్‌) * బాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌) * మాస్టర్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ థెరపీ * మాస్టర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ- రిహాబిలిటేషన్‌ * మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ రిహాబిలిటేషన్‌ సైన్స్‌
బ్యాచిలర్‌ డిగ్రీ 3-4 సంవత్సరాల వ్యవధితో ఉంటుంది. దీనిలో చేరటానికి ఇంటర్‌మీడియట్‌ సైన్స్‌ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైవుండాలి. ప్రవేశపరీక్ష ఆధారంగా ప్రవేశాలుంటాయి.

బీఎస్‌సీ స్పోర్ట్స్‌ మెడిసన్‌లో ప్రవేశమెలా? కోర్సు పూర్తిచేసుకున్న తరువాత ఉండే అవకాశాలేమిటి?

స్పోర్ట్స్‌ మెడిసిన్‌లో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు హెల్త్‌కేర్‌ సంబంధించిన వివిధ కెరియర్లలో ప్రవేశించవచ్చు. గ్రాడ్యుయేట్లు శారీరకంగా దృఢంగా ఉన్న అభ్యర్థులకుమార్గదర్శకత్వం, ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలు, పునరావాస అంశాలపై అవగాహన కల్పిస్తారు. స్పోర్ట్స్‌ మెడిసిన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో (ఎక్సర్‌సైజ్‌ సైన్స్‌/ అథ్లెటిక్‌ ట్రెయినింగ్‌) కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు బాచిలర్స్‌ డిగ్రీలను అందిస్తున్నాయి.
బీఎస్‌సీ ఇన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ సైన్స్‌ డిగ్రీ కోర్సును శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయం అందిస్తోంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా స్పోర్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ సైన్స్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఆఫ్‌ కేప్‌టౌన్‌, సౌత్‌ ఆఫ్రికా సహకారంతో అందిస్తోంది. ఈ కోర్సులో నమోదు చేసుకున్న విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్‌ కేప్‌టౌన్‌ అధ్యాపకులు బోధన, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. ఇది నాలుగు సంవత్సరాల కోర్సు. దీనిలో స్పోర్ట్స్‌, ఎక్సర్‌సైజ్‌ సైన్స్‌ అంశాలకు సంబంధించిన అంశాలన్నింటినీ బోధిస్తారు. శ్రీ రామచంద్ర యూనివర్సిటీ అందుకు కావాల్సిన అత్యుత్తమ వసతులతో కూడిన జిమ్నాజియమ్‌ వంటి సదుపాయాలనూ కల్పిస్తోంది.
విద్యార్హతలు: కళాశాల/ విశ్వవిద్యాలయంలో చేరడానికి హైస్కూల్‌ డిప్లొమా/ తత్సమాన కోర్సును పూర్తి చేసుండాలి. స్పోర్ట్స్‌ మెడిసిన్‌ బాచిలర్స్‌ పోగ్రామ్‌లో ప్రవేశంకోసం కొన్ని అదనపు అర్హతలు- కోర్సును బట్టి- అవసరం. ఫస్ట్‌ ఎయిడ్‌, కార్డియోపల్మినరీ (సీపీఆర్‌)ల్లో సర్టిఫికేషన్‌; సర్టిఫైడ్‌ అథ్లెటిక్‌ ట్రెయినర్‌ను కొన్ని గంటలపాటు పరిశీలించడం వంటివి.
గ్రాడ్యుయేట్‌ స్థాయిలో ఉద్యోగావకాశాలు: * కోచ్‌ * ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ * పర్సనల్‌ ట్రెయినర్‌ * ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్‌ .

నానోటెక్నాలజీ అంటే ఏమిటి? ఇంటర్‌ పూర్తిచేసిన తరువాత బీఎస్‌సీలో దీన్నో సబ్జెక్టుగా ఎంచుకోవచ్చా?

నానోటెక్నాలజీ అనే పదం కాలగతిలో 'మైక్రో టెక్నాలజీ కంటే చిన్నది' అనే అర్థంలో వచ్చింది. ద ఫోర్‌సైట్‌ సంస్థ నానోటెక్నాలజీకి దాని అసలైన అర్థాన్ని సూచించేలా మరో పేరును సిఫారసు చేసింది. అదే- జెట్టాటెక్నాలజీ.
సైన్స్‌, మెడిసిన్‌లో దీని వినియోగం చాలా ఎక్కువ. ఈ టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్‌ కణాలను తొలగించడానికి, తిరిగి అవి ఒకచోట చేరకుండా చేయడానికి, వ్యర్థ పదార్థాలుగా వాటిని బయటకు పంపడానికి మైక్రో ప్రాసెసింగ్‌ ప్రొక్రియేటింగ్‌ రోబోను మానవ శరీరంలోకి ప్రవేశపెట్టవచ్చు. నానో ఉపయోగం ఎంత లోతైనదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీలతోసహా దాదాపు అన్ని విభాగాలపై నానోటెక్నాలజీ ప్రభావముంది.
అర్హత: బీఎస్‌సీ నానోటెక్నాలజీ చదవాలనుకునేవారు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్‌ నేపథ్యంలో హయ్యర్‌ సెకండరీ పరీక్ష (10+2) పూర్తిచేసిఉండాలి. అంటే ఇంటర్‌ సబ్జెక్టుల్లో మూడో సబ్జెక్టు గణితం/ బయాలజీతోపాటుగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ తప్పనిసరి.
అవకాశాలు: బీఎస్‌సీ/బీటెక్‌- నానోటెక్నాలజీ పూర్తిచేసిన తరువాత విద్యార్థులు ఎంఎస్‌సీ నానోటెక్నాలజీలో చేరొచ్చు. పరిశోధన ప్రాజెక్టులోనూ పాల్గొనవచ్చు. నానోటెక్నాలజీ విద్యార్థులు మెడిసిన్స్‌/ ఫార్మసీ సంబంధిత ఐటీ/ కోర్‌, బయాలజీ విభాగాల్లో చేరవచ్చు. డీఆర్‌డీఓ వంటి పరిశోధన రంగాల్లోకి వెళ్లవచ్చు.
ఉద్యోగావకాశాలు: బీఎస్‌సీ- నానోటెక్నాలజీ గ్రాడ్యుయేట్లకు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనే కాకుండా విదేశాల్లోనూ అవకాశాలుంటాయి. ప్రముఖ సంస్థల్లో వీరికి మంచి జీతభత్యాలుంటాయి. వీరు అనేక పరిశోధన ప్రోగ్రాముల్లోనూ పాల్గొనవచ్చు. బీఎస్‌సీ నానోటెక్నాలజీ గ్రాడ్యుయేట్‌కు ఈ కింది అవకాశాలుంటాయి..
* నానో డివిజన్‌ మేనేజర్‌ * నానో మెటీరియల్స్‌ సర్ఫేస్‌ కెమిస్ట్‌ * సీనియర్‌ నాలెడ్జ్‌ ఆఫీసర్‌ * లా అండ్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌
ఉద్యోగావకాశాలను అందించే విభాగాలు: * నానో మెడిసిన్‌ * బయోఇన్ఫర్మాటిక్స్‌ * నానోటాక్సికాలజీ * నానో పవర్‌ జనరేటింగ్‌ రంగం * స్టెమ్‌సెల్‌ డెవలప్‌మెంట్‌ * బయోటెక్నాలజీ * జెనెటిక్స్‌ * పరిశోధన సంస్థలు * వ్యవసాయం * వస్తు ఉత్పాదన * పర్యావరణ పరిశ్రమ * ఆరోగ్య పరిశ్రమ * అంతరిక్ష పరిశోధన * ఫోరెన్సిక్‌ సైన్స్‌ * ఆర్మీ * జాతీయ భద్రత
ఈ కోర్సు అందించే కొన్ని విద్యాసంస్థలు:
యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ (తమిళనాడు); అన్నా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుచిరాపల్లి; అమిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నానోటెక్నాలజీ (నోయిడా); ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ), చెన్నై; లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ- జలంధర్‌, పంజాబ్‌; ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.

ఇంటర్‌ తరువాత బీఎస్‌సీ న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీలో చేరవచ్చా?

బీఎస్‌సీ న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీని 1993లో ప్రారంభించారు. దీనిని స్కూల్‌ ఆఫ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌, మణిపాల్‌ అందించింది. ఈ ప్రోగ్రామ్‌లో అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, అడ్వాన్స్‌డ్‌ ఇమేజింగ్‌, అడ్వాన్స్‌డ్‌ కార్డియాలజీ, రీసెర్చ్‌ మెథడాలజీ, రేడియో- ఫార్మకాలజీ ఉంటాయి. న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌లు రోగులకు రేడియో- ఫార్మాస్యూటికల్స్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష తీరుతెన్నులను రోగులకు వివరిస్తారు. రేడియోఫార్మాస్యూటికల్‌ డోసేజ్‌ను తయారుచేసి, ఇంజక్షన్‌/ ఇతర మార్గాల్లో అందిస్తారు. టెక్నాలజిస్టులు భద్రతా ప్రమాణాలకనుగుణంగా వీలైనంత తక్కువ ప్రమాణంలో రేడియేషన్‌ డోసేజ్‌ను రోగులకు అందిస్తారు.
అవకాశాలు: ఉద్యోగకల్పన ఈ రంగంలో 2010- 2020కి 19% పెరుగుతుందని భావిస్తున్నారు. ఆసుపత్రుల్లో అధికంగా, మిగిలినవి ఇమేజింగ్‌ సెంటర్లు, రేడియో- ఫార్మసీస్‌, మాన్యుఫాక్చరర్స్‌లో ఉంటాయి.
కాలవ్యవధి: బీఎస్‌సీ ఎన్‌ఎంటీ (న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ)- 3 సంవత్సరాలు+ డిఎన్‌ఎంటీ- 1 సంవత్సరం
* ఇందులో ప్రవేశానికి ఇంటర్‌ బైపీసీ కనీసం 45% మార్కులతో పాసై ఉండాలి.

ఇంటర్‌ (బైపీసీ) పూర్తిచేశాను. మనదేశంలో ఉద్యోగాధారిత పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయా? వాటికి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

స్వభావరీత్యా పారామెడికల్‌ కోర్సులు ఉద్యోగాధారితమైనవే. సైన్స్‌ నేపథ్యమున్న విద్యార్థులకు రెండు అవకాశాలున్నాయి. ఒకటి- గ్రాడ్యుయేషన్‌ పూర్తవగానే ఉద్యోగంలోకి చేరడం. రెండోది, ఉత్తమ అవకాశాల కోసం చదువుతున్నదానిలోనే పీజీ చేయడం. కొన్ని ప్రతిష్ఠాత్మకమైన వైద్యకళాశాలల్లో కింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
జిప్‌మర్‌ (జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌), పాండిచ్చేరి.
బీఎస్‌సీ (అలైడ్‌ మెడికల్‌ సైన్సెస్‌), కాలవ్యవధి: 3 సంవత్సరాలు
కోర్సు ప్రవేశాలు ప్రతి సంవత్సరమూ జరుగుతాయి. పరీక్ష ప్రతి సంవత్సరం జులై చివరి ఆదివారం నిర్వహిస్తారు. ఆగస్టు మొదటివారంలో తరగతులు ప్రారంభమవుతాయి. ప్రవేశప్రక్రియ 30 సెప్టెంబర్‌తో ముగుస్తుంది. వెబ్‌సైట్‌: www.jipmer.edu.in
బీఎస్‌సీ మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ- 30 సీట్లు, కార్డియాక్‌ లేబొరేటరీ టెక్నాలజీ - 4 సీట్లు, డయాలసిస్‌ టెక్నాలజీ - 4 సీట్లు, న్యూరో టెక్నాలజీ - 4 సీట్లు, న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ - 4 సీట్లు, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ - 4 సీట్లు, పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ - 4 సీట్లు, బీఏఎస్‌ఎల్‌పీ (బాచిలర్‌ ఇన్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ) - 10 (ఏఐఐఎస్‌హెచ్‌, మైసూర్‌ తో భాగస్వామ్యం).
ఈ కోర్సులు ఆయా విభాగాల్లో ప్రభుత్వ, కార్పొరేట్‌ ఆసుపత్రులు రెండింటిలోనూ పుష్కలంగా ఉద్యోగావకాశాలను కల్పిస్తాయి. ఉదాహరణకు న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌ రేడియాలజిస్టుల ఆధ్వర్యంలో ఎంఆర్‌ఐ, ఇతర స్కానింగ్‌ సంబంధిత విభాగాల్లో, రేడియోథెరపీ టెక్నాలజిస్ట్‌ ఆంకాలజీ విభాగంలో విధులు నిర్వహించవచ్చు.

బీఎస్‌సీ ఫిషరీస్‌లో ఆసక్తి ఉంది. కోర్సును అందించే కళాశాలలు, ఉద్యోగావకాశాలను తెలపండి.

ఫిషరీస్‌లో రెండు రకాల కోర్సులున్నాయి. ఒకటి- బీఎస్‌సీ ఫిషరీస్‌, రెండోది- బీఎస్‌సీ (ఇండస్ట్రియల్‌ ఫిష్‌ అండ్‌ ఫిషరీస్‌). ఇది మూడు సంవత్సరాల కోర్సు. సైన్స్‌ నేపథ్యంలో ఇంటర్‌ కనీస అర్హత. ఈ కోర్సులో సబ్జెక్టులుగా.. బయాలజీ ఆఫ్‌ ఫిషెస్‌ అండ్‌ షెల్‌ ఫిషెస్‌; మెరైన్‌ అండ్‌ ఇన్‌లాండ్‌ ఫిషరీస్‌ ఆక్వాకల్చర్‌; ఆర్నమెంటల్‌ ఫిషరీస్‌, వాటి నిర్వహణ; ఫిషరీస్‌ మార్కెటింగ్‌, ఎకనామిక్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌; హార్వెస్ట్‌ అండ్‌ పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ ఆఫ్‌ ఫిషెస్‌; ఫిషరీ మైక్రోబయాలజీ అండ్‌ సీఫుడ్‌ క్వాలిటీ కంట్రోల్‌; ఫిష్‌ అండ్‌ షెల్‌ఫిష్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ అండ్‌ బయో స్టాటిస్టిక్స్‌ చదువుతారు.
అందించే సంస్థలు: * ఆశుతోష్‌ కాలేజ్‌, కోల్‌కతా- బాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇండస్ట్రియల్‌ ఫిష్‌ అండ్‌ ఫిషరీస్‌ * కేరళ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ - బాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌, త్రిశూర్‌ * కేరళ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీస్‌- బాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌, పదనక్కడ్‌ * కేరళ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఓషన్‌ స్టడీస్‌- బాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్సెస్‌, పనంగఢ్‌ * ఎంఈఎస్‌ పొన్నాని కాలేజ్‌- బాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇండస్ట్రిల్‌ ఫిష్‌ అండ్‌ ఫిషరీ, మలప్పురం * షేర్‌-ఈ-కశ్మీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆఫ్‌ కశ్మీర్‌- బాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌ * శివాజీ యూనివర్సిటీ- బాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఫిషరీస్‌, కొల్హాపూర్‌.

బీఎస్‌సీ (ఆనర్స్‌) ఆప్తాల్మిక్‌ టెక్నిక్స్‌ సమాచారం ఇవ్వగలరా?

ఈ కోర్సును న్యూదిల్లీలోని ఎయిమ్స్‌ అందిస్తోంది. ఎంపికయిన విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఉపకారవేతనం లభిస్తుంది. కోర్సు పూర్తవగానే అభ్యర్థికి ఏ కంటి ఆసుపత్రిలోనైనా ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగస్వభావం ఏమిటంటే- ఆసుపత్రుల్లో నేత్రవైద్యులకు సహాయంగా ఉంటూ ఆప్తాల్మిక్‌ కేర్‌లో భాగస్వాములవ్వడం. కంటి వైద్యుల ఆధ్వర్యంలో కాంటాక్ట్‌ లెన్స్‌ ఉపయోగించేవారిని పరీక్షించడం, వారికి సరైన కటకాలను సూచించడం వంటివి చేస్తారు. మరిన్ని వివరాలకు www.aiims.edu.en.htmlను సంప్రదించవచ్చు.

అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ సైన్స్‌ విద్యార్థులకు ఐఐఎస్‌సీ లాంటి ప్రముఖ సంస్థల్లో సమ్మర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్పులు లభిస్తాయా?

జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ సమ్మర్‌ ఫెలోషిప్పులను ప్రతి సంవత్సరం రెండు నెలల వ్యవధితో అందిస్తారు. లైఫ్‌సైన్సెస్‌, మెటీరియల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌ సైన్సెస్‌, మ్యాథమేటిక్స్‌, అట్మాస్ఫిరిక్‌ సైన్సెస్‌ మొదలైన డిసిప్లిన్లలో. అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాములు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు http://www.jncasr.ac.in/,www.ncbs.res.in, www.iisc.ernet.in సైట్లను సందర్శించవచ్చు. ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ కూడా సమ్మర్‌ ఫెలోషిప్పును అందిస్తోంది.

ఫోరెన్సిక్‌ సైన్స్‌లో యూజీ, పీజీ చేసిన విద్యార్థులకు ఎలాంటి ఉపాధి అవకాశాలుంటాయి?

పరీక్ష, విశ్లేషణ, అన్వయం, నివేదిక, టెస్టిమోనియల్‌ ఆధారిత సాక్ష్యం... వీటికి సంబంధించిన పరిజ్ఞానం, నైపుణ్యాలను ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్తలు సమన్వయం చేయగలిగివుండాలి. మనదేశంలో ఈ శాస్త్ర విభాగం ఇంకా పుంజుకోవాల్సివుంది. దీనిలో చాలా విద్యాసంస్థలు కోర్సులను అందిస్తున్నాయి. గుజరాత్‌లో ఫోరెన్సిక్‌ సైన్స్‌పై ప్రత్యేకించి విశ్వవిద్యాలయమే ఉంది. ఇక్కడ చాలా కోర్సులు లభిస్తున్నాయి. ఉస్మానియా మొదలైన విశ్వవిద్యాలయాలు కూడా కోర్సులను అందిస్తున్నాయి.

ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, జనరల్‌ కెమిస్ట్రీ... ఈ రెండిట్లో ఏది మెరుగు? మంచి కెరియర్‌ అవకాశాలు దేనిలో ఉంటాయి?

కర్బన రసాయనశాస్త్రం (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ)లో మెరుగైన అవకాశాలున్నాయి. డ్రగ్‌, ఫార్మా పరిశ్రమల్లో, కెమికల్‌ పరిశ్రమల్లో ఎన్నో ఖాళీలుంటాయి. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్‌/ సింథటిక్‌ కెమిస్ట్‌లకు ఆకర్షణీమైన జీతభత్యాలుంటాయి. మనదేశంలోని ఎన్నో మొక్కల జాతుల నుంచి ఔషధాలు తయారవుతాయి. వచ్చే సంవత్సరాల్లో మొక్కల నుంచి ఎన్నో మాలిక్యూల్స్‌ను వెలికితీస్తారు. వైవిధ్యమైన మొక్కలకు మనదేశం నిలయమని తెలిసిందే. ఇప్పటివరకూ గుర్తించిన మొక్కల జాతులు 45,000 మాత్రమే. గుర్తించని జాతులు మరెన్నో. మంచి ఆర్గానిక్‌ కెమిస్ట్‌కు వృక్షాలనుంచి కొత్త మాలిక్యూల్స్‌ను గుర్తించటం సవాలుతో కూడుకున్న అంశం. ఏదైనా వ్యాధికో, వ్యాధులకో అది భవిష్యత్‌ ఔషధం కావొచ్చు. మొత్తమ్మీద చెప్పాలంటే ఆర్గానిక్‌ కెమిస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉంది.

ఎస్‌ఎస్‌సీ 2003లో పూర్తిచేశాను. మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేస్తే భవిష్యత్తు బాగుంటుందని విన్నాను. వివరాలు తెలియజేయండి?

మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ను 3 ప్రధానభాగాలుగా చెప్పుకోవచ్చు. ఫిజికల్‌ మెటలర్జీ- మెటాలిక్‌ అల్లాయ్‌ డెవలప్‌ చేయడం; ఎక్స్‌ట్రాక్టివ్‌ మెటలర్జీ- ఓర్‌ నుంచి మెటల్‌ను వేరు చేయడం; మినరల్‌ ప్రాసెసింగ్‌- మినరల్‌ ప్రాడక్ట్‌లను ఎర్త్‌ క్రస్ట్‌ని సేకరించడం. నిత్యజీవితంలో కారు, బైక్‌, ప్లేన్‌, బిల్డింగ్స్‌ ఇలా ఎన్నోరకాల వాటికి మెటల్స్‌ ప్రాముఖ్యం తెలిసిందే. కాబట్టి మెటల్స్‌, మినరల్‌ ప్రాడక్ట్‌ల డిజైన్‌, తయారీలో ఎంతో భవిష్యత్తు ఉంటుంది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లి., నాల్కో ఉత్కల్‌ మినరల్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌, జిందాల్‌ స్టీల్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), లార్సన్స్‌ గ్రూప్‌, న్యూ భారత్‌ రిఫ్రాక్టరీస్‌ లి., ద మెటల్‌ పౌడర్‌ కంపనీ లి.ల్లో రీసెర్చర్‌, మెటల్లర్జిస్ట్‌, సైంటిస్ట్‌, ప్రొఫెసర్‌, వెల్డింగ్‌ ఇంజినీర్‌, ప్లాంట్‌ ఎక్విప్‌మెంట్‌ ఇంజినీర్‌, బాలిస్టిక్స్‌ ఇంజినీర్‌, క్వాలిటీ ప్లానింగ్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ప్రాసెస్‌ ఇంజినీర్‌, సప్లయిర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలుంటాయి.

ఇంటర్‌ (బైపీసీ) చదువుతున్నాను. ఫోరెన్సిక్‌ సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేయాలనుంది. మన దేశంలో ఈ కోర్సును అందిస్తున్న సంస్థలేవి? దీనికి భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, ముంబయి; అమిటీ యూనివర్సిటీ, నోయిడా; డా. హరిసింగ్‌ ఘోర్‌ యూనివర్సిటీ, మధ్యప్రదేశ్‌; గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఔరంగాబాద్‌; శామ్‌ హిగ్గిన్‌బాదమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, అలహాబాద్‌; ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ & హియరింగ్‌, మైసూర్‌లలో డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. వీరికి ఫోరెన్సిక్‌ పాథాలజిస్ట్‌, క్రైమ్‌ లేబొరేటరీ అనలిస్ట్‌, ఫోరెన్సిక్‌ ఇంజినీర్‌, ఫోరెన్సిక్‌ ఆర్కిటెక్ట్స్‌, ఫోరెన్సిక్‌ వెటర్నరీ సర్జన్‌, వైల్డ్‌లైఫ్‌ ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, ఫోరెన్సిక్‌ సైకియాట్రిస్ట్‌, ఫోరెన్సిక్‌ టాక్సికాలజిస్ట్‌, ఫోరెన్సిక్‌ ఒడొన్‌టాలజిస్ట్‌ లాంటి ఉద్యోగాలు సీబీఐ/ ఐబీ లాంటి ప్రభుత్వ, ఇతర ప్రైవేటు ఏజెన్సీల్లో, ఆస్పత్రులూ, ప్రయోగశాలల్లో ఉంటాయి. ఇవేకాకుండా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, సైబర్‌ నేరాల దర్యాప్తు, మానవ హక్కుల పరిరక్షణ, పర్యావరణం, వినియోగదారుల హక్కుల విభాగాల్లో అవకాశాలుంటాయి.

అనెస్తీషియాలజీలో పీజీ డిప్లొమా చేశాను. భవిష్యత్తు ఎలా ఉంటుంది? విదేశీ అవకాశాలెలా ఉంటాయి?

శస్త్రచికిత్సల్లో అనెస్తీషియాలజిస్ట్‌ పాత్ర ఎంతో. కాబట్టి భారత్‌, విదేశాల్లోని ఆరోగ్యకేంద్రాలు, ప్రయోగశాలలు, నర్సింగ్‌ హోంలు, ఆస్పత్రుల్లో, ప్రైవేట్‌ ప్రాక్టీసు రూపంలో అవకాశాలు అధికంగా ఉంటాయి. న్యూరోసర్జరీ, ప్లాస్టిక్‌ & రీ కన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌, డెంటల్‌, ఆర్థోపెడిక్‌ సర్జరీ, ట్రామా & ఎమర్జెన్సీ సర్జరీ లాంటి విభాగాల్లో అవసరం ఉంటుంది. ఇవే కాకుండా ఇంటెన్సివ్‌ కేర్‌ మెడిసిన్‌ & పెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో- అంటే ఆపరేషన్‌ థియేటర్‌ బయట కూడా ప్రాధాన్యం ఉంటుంది.

దూరవిద్య ద్వారా ఎంఏ (పాలిటిక్స్‌) చేయాలనుకుంటున్నాను. భవిష్యత్‌ మార్గాలను తెలియజేయండి?

రాజనీతిశాస్త్రం ముఖ్యంగా బోధన, పరిశోధన, ప్రచురణలకు సరిపడే వృత్తి అని చెప్పవచ్చు. ప్రభుత్వం, దేశ విదేశ వ్యాపార సంస్థలు, ఎన్‌జీవో, లాభాపేక్ష లేని సంస్థలు, జర్నలిజం, ఎలక్టోరల్‌ పాలిటిక్స్‌ లాంటి ఎన్నో రంగాల్లో అవకాశాలున్నాయి. ప్రతి మనిషి జీవనశైలి, ఆరోగ్యం, చదువు, ఉద్యోగం వంటి ఎన్నో అంశాలపై రాజకీయాలు ఏదోవిధంగా ప్రభావం చూపుతుంటాయి. ఇంకా విదేశీ వ్యవహారాలు, పబ్లిక్‌ పాలసీ, హెల్త్‌కేర్‌, ఇమిగ్రేషన్‌ వంటి వాటికి ప్రాముఖ్యం ఉండడం వల్ల ఈ రంగానికి గిరాకీ పెరుగుతూనే ఉంది. ప్రజాసమస్యలను గుర్తించి, పరిశీలించి నివేదిక రాసి వార్తాపత్రికల్లో ప్రచురించడం; పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ప్రణాళిక, ప్రజా వ్యవహారాలు, అంతర్జాతీయ సంబంధాల్లో కెరియర్‌ మలుచుకోవచ్చు.

అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌లో రెండు సంవత్సరాల డిప్లొమా చదివాను. పై చదువులు చదవాలనుకుంటున్నాను. ఏ కోర్సు చదివితే మేలు?

బీఎస్‌సీ/ బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ కోసం ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (http://bit.ly/1OssLM7); యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, బెంగళూరు (http://bit.ly/1D0Rgut);ఇగ్నోలో పీజీ డిప్లొమా కోర్సులకు (http://bit.ly/1EZpzqx); నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ వారి పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌ ఇన్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌- పీజీడీఏఈఎం కోసం http://bit.ly/1HFYMQT లను చూడండి.
మాస్టర్‌, పీహెచ్‌డీ లాంటి ఉన్నత చదువులకు వెళ్లేటపుడు కిందివాటిలో నచ్చిన ఒక అంశాన్ని ఎంచుకుని కెరియర్‌ను మొదలుపెట్టండి. క్రాప్‌ ప్రొడక్షన్‌, డైరీ మేనేజ్‌మెంట్‌, అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ, సాయిల్‌ & వాటర్‌ ఇంజినీరింగ్‌, పౌల్ట్రీ & ఫిష్‌ ప్రాసెసింగ్‌, అగ్రికల్చరల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, అగ్రికల్చరల్‌ మెషినరీ డిజైన్‌, ఫుడ్‌ ఇంజినీరింగ్‌/ ప్రాసెస్‌ కంట్రోల్‌, ఇరిగేషన్‌ & డ్రైనేజ్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌.

నేను ప్రస్తుతం బీకాం (జనరల్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. రాజనీతిశాస్త్రం (పాలిటిక్స్‌)లో పీజీ చేయాలనుకుంటున్నాను. కొన్ని విశ్వవిద్యాలయాలు బీఏ పాలిటిక్స్‌ చదివిన వాళ్లనే తీసుకుంటున్నాయి. డిగ్రీతో సంబంధం లేకుండా ప్రవేశం కల్పించే సంస్థలు, విశ్వవిద్యాలయాల వివరాలు తెలపండి?

* డిగ్రీలో పొలిటికల్‌ సంబంధిత సబ్జెక్టు చదివినవారికే పీజీలో పొలిటికల్‌ సైన్స్‌ చదవడానికి వీలుంటుంది. ఇగ్నో, రాజీవ్‌ గాంధీ విశ్వవిద్యాలయం, జైప్రకాష్‌ విశ్వవిద్యాలయం, ఇంద్రప్రస్థా విశ్వవిద్యాలయం, భావనాగర్‌ విశ్వవిద్యాలయం, బెంగళూరు విశ్వవిద్యాలయం, జివాజీ విశ్వవిద్యాలయాల్లో పీజీ చేయవచ్చు. ఇవే కాకుండా షార్ట్‌టర్మ్‌, లాంగ్‌టర్మ్‌ డిప్లొమా/ పీజీ డిప్లొమా కోర్సుల వివరాలకు http://bit.ly/1ym4klQని చూడండి.

2008లో డిగ్రీలో చేరాను. మూడో సంవత్సరంలో రెండు సబ్జెక్టులు మిగిలాయి. ఇప్పుడు పూర్తి చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా? ఏడు సంవత్సరాల్లో పూర్తిచేయకపోతే డిగ్రీ రద్దవుతుందని విన్నాను. ఇది ఎంతవరకూ నిజం?

* ప్రతి డిగ్రీ పూర్తిచేయడానికి గరిష్ఠ సమయం నిర్దేశిస్తారు. సాధారణంగా ఏదైనా డిగ్రీని ఆయా కోర్సు పరిమితికి రెట్టింపు (అంటే 3 సంవత్సరాల కోర్సు- 6 సంవత్సరాల) కాలవ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మరిన్ని రీ-అడ్మిషన్‌ నిబంధనల కోసం http://bit.ly/1CUuubn వెబ్‌సైట్‌ను చూడండి. లేదా ఉస్మానియా విశ్వవిద్యాలయం, సెంటర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ను సంప్రదించి పూర్తి వివరాలు పొందండి.

ఇంటర్‌ పూర్తిచేసి ఫిల్మ్‌ రైటింగ్‌ కోర్సులో డిప్లొమా చేస్తున్నాను. నవలా రచయితను కావాలనుంది. అందుకు ఏం చేయాలి?

* ముందుగా నవలా రచన, వాటి అవగాహనపై ఒక రూపు తెచ్చిన వారి గురించి http://bit.ly/1EeXqN0 చదివి స్ఫూర్తి పొందండి. పరిసర ప్రాంతాల్లో జరిగే సంఘటనలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాటిపై ఆసక్తికరంగా పలు రకాల కమ్యూనిటీ, వివిధ వయసు గల వారిని ఆకర్షించేవిధంగా స్క్రిప్ట్‌ రాయాల్సి ఉంటుంది. ఆలోచన, కథ, సమర్పణ విధానం చాలా ముఖ్యం. సినిమాలు, లఘు చిత్రాలు (షార్ట్‌ ఫిల్మ్స్‌) ఇతరత్రా ప్రకటనలను పరిశీలిస్తూ ప్రతి సన్నివేశంపై నోట్స్‌ తయారు చేసుకోవాలి. సిద్‌ ఫీల్డ్‌ (స్క్రీన్‌ప్లే & ద స్క్రీన్‌ రైటర్స్‌ బుక్‌ రచయిత) వివరించిన త్రీ యాక్ట్‌ స్ట్రక్చర్‌ గురించి ఈ http://bit.ly/1FVR31s లింకును చూసి ప్రముఖ స్క్రీన్‌ప్లే పద్ధతిని తెలుసుకోండి. రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌, హైదరాబాద్‌; అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ & మీడియా, హైదరాబాద్‌; గ్లిట్టర్స్‌ ఫిలిం అకాడమీ, హైదరాబాద్‌; ఫిల్మ్‌ & టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ), పుణె; సత్యజిత్‌ రే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ & టెలివిజన్‌ (ఎస్‌ఆర్‌ఐఎఫ్‌టీ), కోల్‌కతా; గ్జేవియర్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై; మైండ్‌ స్క్రీన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై; డిజిటల్‌ అకాడమీ- ది ఫిలిం స్కూల్‌, ముంబై కోర్సులతోపాటు కమలేష్‌ పాండే, బెన్‌ రేఖీ వారి స్క్రిప్ట్‌వాలా (http://bit.ly/1ymEVk) వర్క్‌షాపుల్లో చేరొచ్చు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. మెరైన్‌ ఇంజినీరింగ్‌ చేయాలనుంది. ఎంసెట్‌తో సాధ్యమేనా? అందించే సంస్థల వివరాలను తెలపండి?

మీరు ఎంసెట్‌ ద్వారా కాకుండా ఐఎంయూ-సీఈటీ (http://bit.ly/1w5wjRi) ద్వారా మాత్రమే మెరైన్‌ ఇంజినీరింగ్‌ & రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎంఈఆర్‌ఐ), ప్రవీణ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ & మారిటైం స్టడీస్‌ (www.primevisakha.net/) ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ఇంటర్నేషనల్‌ మారిటైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (www.imi.edu.in/marine.html) లలో ప్రవేశానికి అర్హత పొందవచ్చు. నియోషియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ & సైన్స్‌ (ఎన్‌ఐటీఎంఏఎస్‌)లో WBJEE/IIT- JEE (http://wbjeeb.nic.in) ద్వారా ప్రవేశం పొందవచ్చు.

మా అమ్మాయి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. భవిష్యత్తులో ఏవియానిక్స్‌లో చేరాలనుకుంటోంది. అర్హత, అందించే సంస్థల వివరాలు కావాలి?

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ - ఐఐఎస్‌టీ (http://bit.ly/1BHYTJm) లో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్‌ (http://jeemain.nic.in) లో అర్హత సాధించాల్సివుంటుంది. హిందుస్థాన్‌ విశ్వవిద్యాలయంలో అయితే వారు నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్ష (https://hindustanuniv.ac.in/eligibility.php) ద్వారా ప్రవేశం పొందవచ్చు.
యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (యూపీఈఎస్‌) లో ప్రవేశం కోసం వారి UPESEAT (http://bit.ly/1BTp1ml) లేదా జేఈఈ మెయిన్‌ ద్వారా అర్హత పొందవచ్చు. ఇంజినీరింగ్‌ కాకుండా హిందుస్థాన్‌ విశ్వవిద్యాలయం వారు బీఎస్‌సీ ఏవియానిక్స్‌ అనే మూడేళ్ల వ్యవధి ఉన్న కోర్సు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ http://bit.ly/1GlSciV ని చూడండి.

ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయంలో బీఎస్‌సీ ఫుడ్‌ & న్యూట్రిషన్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. మా విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్‌ మాదే. తరువాత ఏమేం అవకాశాలున్నాయో తెలియడం లేదు. తెలియజేయండి. అలాగే ఎంఎస్‌సీ (ఫుడ్‌ & న్యూట్రిషన్‌) అందించే విశ్వవిద్యాలయాలను తెలపండి?

ఫుడ్‌ & న్యూట్రిషన్‌కు ఆదరణ పెరుగుతూనే ఉంది. మీకీ రంగంలో చక్కని అవకాశాలున్నాయి. ఫుడ్‌ & ఫుడ్‌ ప్రాసెసింగ్‌, బయోటెక్నాలజీ, వ్యవసాయ సంబంధ పరిశ్రమలు, హెల్త్‌ & రిక్రియేషన్‌ క్లబ్స్‌, హాస్పిటల్స్‌, కాంటీన్‌, నర్సింగ్‌ కేర్‌ సెంటర్స్‌, కళాశాల/ విశ్వవిద్యాలయాల్లో కేటరింగ్‌ డిపార్ట్‌మెంట్‌, ఫాకల్టీ, ఫుడ్‌ మానుఫాక్చరింగ్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌లలో, ఫుడ్‌ & న్యూట్రిషన్‌ బోర్డు లాంటి ప్రభుత్వ ఆరోగ్య శాఖల్లో, రంగాల్లో అయితే కన్సల్టెంట్‌గా చేయవచ్చు. ప్రభుత్వ విభాగంలో సోషల్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌కిగాను న్యూట్రిషనిస్ట్‌గా తీసుకుంటారు.
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి యూపీఎస్‌సీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. ఎంఎస్‌సీ (ఫుడ్‌ & న్యూట్రిషన్‌) కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (http://www.nagarjunauniversity.ac.in); డా. ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (http://ntruhs.ap.nic.in/); ఎస్‌వీ విశ్వవిద్యాలయం (http://svuniversity.ac.in/); ఆంధ్రా విశ్వవిద్యాలయం (http://www.andhrauniversity.edu.in/) లను గమనిస్తూ ఉండి వారు నిర్వహించే రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఉత్తీర్ణత సాధించి కోర్సులో ప్రవేశం పొందవచ్చు.

ఎస్‌పీసీఎల్‌లో జేఎల్‌ఎంగా చేస్తున్నాను. దూరవిద్య ద్వారా ఎలక్ట్రికల్‌ డిప్లొమా ఏదైనా ఉందా? లేదా రెగ్యులర్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమా చేయాలా? ఐటీఐ చేసినవారు నేరుగా రెండో సంవత్సరంలో చేరి పూర్తిచేసే వీలుందా?

మీరు పాలీసెట్‌ ద్వారా డిప్లొమాలో ఇదివరకులా రెండో సంవత్సరంలో కాకుండా మొదటి సంవత్సరంలో చేరాల్సిందే. నోటిఫికేషన్‌ వివరాలకు http://sbtetap.gov.in/Screens/Notifications.aspxని చూడండి. దూరవిద్య కాకుండా అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అందించే షార్ట్‌టర్మ్‌ కోర్సులకు http://atihyderabad.ap.nic.in/ని చూడండి. లేదా నేరుగా వారిని విద్యానగర్‌, హైదరాబాద్‌లో సంప్రదించండి.

సోషియాలజీలో పీజీ చేయాలనుకుంటున్నాను. అందించే సంస్థల వివరాలు తెలపగలరు. దీనికి భవిష్యత్తు ఎలా ఉంటుంది?

జేఎన్‌యూ, డీ-స్కూల్‌, బీహెచ్‌యూ, పుణె విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, ఎంఎస్‌యూ- బరోడా, అలహాబాద్‌ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ/ ఎంఎస్‌సీ- సోషియాలజీ చేయవచ్చు. ఇక వీరికి అకడమిక్‌ & రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, ఎన్‌జీవోస్‌, ప్రొఫెషనల్‌ రీసెర్చ్‌ ఏజెన్సీస్‌, మార్కెట్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్స్‌, కన్స్యూమర్‌ ఇన్‌సైట్‌ కంపెనీస్‌, అడ్వర్త్టెజింగ్‌ ఏజెన్సీస్‌, గవర్నమెంట్‌ ఆర్గనైజేషన్స్‌, మీడియా, సీఎస్‌ఆర్‌ ప్రోగాముల్లో అవకాశాలుంటాయి. మరిన్ని వివరాలకు http://bit.ly/1DBQPZP ని చూడండి.

ఎంఎస్‌సీ (మైక్రో బయాలజీ) 2013లో పూర్తిచేశాను. ఎంఫిల్‌ చేయాలనుకుంటున్నాను. దరఖాస్తు విధానం, ఉద్యోగావకాశాలను తెలపండి.

పీజీ (మైక్రో బయాలజీ)లో 55% మార్కులు సంపాదించినవారు ఎంఫిల్‌ (మైక్రో బయాలజీ) చేయడానికి అర్హులు. దీనికి ఆయా విశ్వవిద్యాలయాలు నిర్వహించే అడ్మిషన్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. తదుపరి ప్రక్రియ వ్యక్తిగత మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాలకు గీతం విశ్వవిద్యాలయం http://bit.ly/1zzlemh; జైన్‌ విశ్వవిద్యాలయం http://bit.ly/1CkLrth; పెరియార్‌ విశ్వవిద్యాలయం http://bit.ly/170KhYN వెబ్‌సైట్లను చూడండి.
మీకు లేబొరేటరీస్‌, ప్రైవేటు ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యుటికల్‌ పరిశ్రమలు, ఆహార పరిశ్రమ, బేవరేజ్‌, కెమికల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఏజెన్సీలు, అగ్రికల్చర్‌ విభాగాల్లో బయోమెడికల్‌ సైంటిస్టులు, మైకాలజిస్ట్స్‌, ప్రోటో జువాలజిస్ట్స్‌, బయోకెమిస్ట్‌, బయోటెక్నాలజిస్ట్‌, అనలిస్ట్స్‌, మైక్రోబయాలజిస్ట్స్‌, సెల్‌ బయాలజిస్ట్స్‌, జెనెటిసిస్ట్స్‌, ఇమ్యునాలజిస్ట్స్‌, పారాసైటాలజిస్ట్స్‌, సైన్స్‌ రైటర్‌, టీచర్స్‌, వైరాలజిస్ట్‌ లాంటి పలు రకాల ఉద్యోగావకాశాలు ఉంటాయి.

డిగ్రీ మ్యాథ్స్‌ పూర్తిచేశాను. న్యూరోసైన్స్‌ చదవాలనుకుంటున్నాను. డిగ్రీ తరువాత చేసే అవకాశముందా? అందించే విశ్వవిద్యాలయాలేవి?

డిగ్రీ హెల్త్‌ సైన్సెస్‌, బోటనీ, కెమిస్ట్రీ, బీయూఎంఎస్‌, బయో కెమిస్ట్రీ- మెయిన్‌/ ఆన్సిలరీ, బీఎస్‌సీ- లైఫ్‌ సైన్సెస్‌, బయోసైన్స్‌, బయాలజీ, ఫిజిక్స్‌, బీఎస్‌ఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీఎస్‌సీ నర్సింగ్‌, బీఎస్‌సీ ఫిజిషియన్‌ అసిస్టెంట్‌, బీపీటీహెచ్‌, బాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థియరీ (బీఓటీ), జువాలజీ, బయోలాజికల్‌ సైన్సెస్‌/ ఎంబీబీఎస్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సు చేసిన వాళ్లు పీజీ కోర్సులకు అర్హులు. మీరు NIMHANS (www.nimhans.kar.nic.in/aca_ admission/adm_notif201516a.pdf) లేదా అపోలో (www.apollohospdelhi.com/research-and-education) వారి డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులను చేయవచ్చు.

మెకానికల్‌ విభాగంలో డిప్లొమా చేశాను. ప్రస్తుతం ఒక ఎంఎన్‌సీలో పనిచేస్తున్నాను. బీటెక్‌ దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా? లేదంటే నా విద్యార్హతను పెంచుకునే మార్గాలను తెలియజేయండి.

దూరవిద్య ద్వారా బీటెక్‌ చేయడానికి ముందులా ఇపుడు వీలు కాదు. యూజీసీ/ ఏఐసీటీఈ/డీఈసీ వారు వీటికి ఎలాంటి అనుమతీ ఇవ్వడం లేదు. కాబట్టి దూరవిద్య ద్వారా అనుమతి లేని ఇంజినీరింగ్‌ కోర్సులో చేరకండి. మీకు డిప్లొమా ఉంది కాబట్టి రెగ్యులర్‌ విధానంలో బీటెక్‌ చేయలేనపుడు ఏఎంఐఈ ద్వారా ఇంజినీరింగ్‌ పూర్తి చేయవచ్చు. ఏఎంఐఈ పూర్తి వివరాలకు ఈ లింక్‌ http://bit.ly/1yAAXXq ని చూడండి.

అంబేద్కర్‌ దూరవిద్య విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తిచేశాను. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర దూరవిద్య విశ్వవిద్యాలయంలో ఎంఏ (ఎకనామిక్స్‌) మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను ఏయే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హుడిని?

మీ విశ్వవిద్యాలయం (డైరెక్టర్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌) వారి ఎంఏ (ఎకనమిక్స్‌) కోర్సు యూజీసీ గుర్తింపు పొందింది. కాబట్టి రెగ్యులర్‌ విధానంలో ఎంఏ (ఎకనమిక్స్‌) చేసినవారి లాగానే ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అర్హులే. ఉదాహరణకు ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీస్‌/ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ (http://upsc.gov.in/general/ies-iss.htm); రక్షణ రంగంలో యూపీఎస్‌సీ నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (http://bit.ly/16qL9pw); రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ), రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆయిల్‌ కార్పొరేషన్‌ రంగంలో ప్రయత్నించండి. ఇంకా యూజీసీ నెట్‌ (www.ugcnetonline.in/) రాసి ప్రభుత్వ లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించవచ్చు. వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వివరాల కోసం ఎప్పటికపుడు దినపత్రికలు, ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (http://employmentnews.gov.in/index.asp) అనుసరించండి.

పదో తరగతి 2003లో పూర్తిచేశాను. 2008లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పాలిటెక్నిక్‌ డిప్లొమా చేశాను. ఆరోగ్య కారణాల రీత్యా చదువు మానేశాను. ప్రస్తుతం చదువు కొనసాగించాలనుకుంటున్నాను. నా దగ్గర డిప్లొమా సర్టిఫికెట్‌ కూడా లేదు. కెరియర్‌ను మెరుగుపరచుకోవడానికి నాకున్న విద్యావకాశాలేమిటి?

మీరు తదుపరి చదువులకు వెళ్లవచ్చు. డిప్లొమా సర్టిఫికెట్‌ పోయింది అంటున్నారు కాబట్టి, వెంటనే డిప్లొమా సర్టిఫికెట్‌ కోసం ఈ దరఖాస్తు ఫారాన్ని పూరించి SBTET (http://sbtetap.gov.in/Screens/ContactUs.aspx)ని సంప్రదించండి. బీటెక్‌ ప్రవేశానికి ECET రాయండి. లేదా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ (www.ieindia.org/) ద్వారా AMIE చేయవచ్చు. పూర్తి వివరాలకు www.amieindia.in/amie_details.pdfని చూడండి.

నా తమ్ముడు 2011లో బీకాం పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నాడు. యూఎస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకుంటున్నాడు. జీఆర్‌ఈ, జీమ్యాట్‌లలో ఏది రాయాలి?

బీకాం పూర్తిచేశాక ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి యూఎస్‌లో మాస్టర్స్‌ చేయడానికి అర్హుడే. చాలా విశ్వవిద్యాలయాలు 16 సంవత్సరాల విద్య వ్యవధి ఉన్నవారిని/ అండర్‌ గ్రాడ్యుయేట్‌ తరువాత తగిన అనుభవం కలవారిని తీసుకుంటాయి. యూఎస్‌లో మాస్టర్స్‌ చేయడానికి దాదాపు 1700 విశ్వవిద్యాలయాలు జీమ్యాట్‌నూ, 1100 విశ్వవిద్యాలయాలు జీఆర్‌ఈనీ అంగీకరిస్తాయి. బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సు చేయాడానికైతే జీమ్యాట్‌ రాయాల్సి ఉంటుంది. ఇతర మాస్టర్‌ కోర్సులకు జీఆర్‌ఈ సరిపోతుంది. కానీ ఎంచుకునే ప్రోగ్రామును బట్టి ఎంచుకున్న విశ్వవిద్యాలయం జీఆర్‌ఈ/ జీమ్యాట్‌ వీటిలో దేనిని అంగీకరిస్తుందో తెలుసుకుని దాన్ని రాయాల్సి ఉంటుంది. ఉచితంగా పరీక్ష రాయడానికి జీమ్యాట్‌ కోసం http://bit.ly/1yAsweM, జీఆర్‌ఈ కోసం http://bit.ly/1weUQ4gని చూడండి. ఆంగ్లం మొదటి భాష కానివారు ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ నిర్ధారణకు ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అయితే మీరు ఎవరు, ఎందుకు మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నారు, మీ లక్ష్యాలు ఏమిటనేది వివరించే స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (SOP) కూడా కీలకం.

ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీలో బీటెక్‌ చేయాలనుకుంటున్నాను. అందించే సంస్థలు, కోర్సు వివరాలు తెలుపగలరు.

ఇంటర్‌ తర్వాత ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించి పై చదువులకు వెళ్లవచ్చు. బీటెక్‌- ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇంజినీరింగ్‌/ బీఎస్‌సీ ఫుడ్‌ టెక్నాలజీ చేయవచ్చు. టెక్నికల్‌ వైపు వెళ్లాలనుకుంటే బీటెక్‌, సైన్స్‌ వైపు వెళ్లాలనుకుంటే బీఎస్‌సీ చేయవచ్చు. బీటెక్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ కూడా చదవొచ్చు. 6 నెలల ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్ట్‌/ రీసెర్చ్‌, పరిశ్రమలు సందర్శిస్తూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ & ఇంజినీరింగ్‌లో సరికొత్త పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అదే బీఎస్‌సీలో బయాలజీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫుడ్‌ సైన్సెస్‌ ప్రిన్సిపల్స్‌, ఫుడ్‌ మైక్రో బయాలజీ వంటివి చదువుతారు.
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ విశ్వవిద్యాలయం, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, అమిటీ విశ్వవిద్యాలయం, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, గురు జంబేశ్వర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ & టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలు ఈ కోర్సులను అందిస్తాయి. ఇతర స్వల్పకాలిక కోర్సులకు సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ www.cftri.com/shortterm.htmlని చూడండి.

ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాను. పెట్రో కెమికల్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉంది. దీనిలో భవిత ఎలా ఉంటుంది?

పెట్రో కెమికల్ ఇంజినీర్లకు మాన్యుఫాక్చరింగ్, సర్వీసు పరిశ్రమల్లో పలు రకాల అవకాశాలుంటాయి. అంటే ఫుడ్ మెటీరియళ్లు, స్పెషాలిటీ కెమికల్స్, ప్లాస్టిక్స్, పవర్ ప్రొడక్షన్, బయోటెక్నాలజీ, టైర్ ఉత్పత్తి, నానోటెక్నాలజీ, మైనింగ్, మినరల్, పెట్రోకెమికల్ ప్లాంట్స్, ఫార్మస్యూటికల్స్, సింథటిక్ ఫైబర్స్, మెటీరియల్ సైన్స్, రీసెర్చ్ లాబోరేటరీస్.
ఈ రంగంలో పెట్రోలియం జియాలజిస్టు, రిజర్వాయర్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఇంజినీర్, డ్రిల్లింగ్ ఇంజినీర్‌గా జియో ఎన్‌ప్రో పెట్రోలియం లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, షెల్ టెక్నాలజీ లి., ఎస్సార్ ఆయిల్, జియోమెట్రిక్ లి., ఆయిల్ ఖీ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లి., రిలయన్స్ పెట్రో కెమికల్స్ లాంటి పలు సంస్థల్లో అవకాశాలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు యూపీఎస్‌సీ వారి ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత సాధించాల్సి వుంటుంది. రక్షణ రంగంలో హెల్త్‌కేర్‌కు సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్టులు, అటామిక్ పవర్ ప్లాంట్స్, రీసైక్లింగ్, పవర్ కన్సర్వేషన్ ప్రాజెక్టులలో సదవకాశాలుంటాయి.

ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నాను. మెకానికల్‌కూ, దీనికి తేడా ఏంటి? ఏది ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది?

మెకానికల్ ఇంజినీరింగ్‌లో స్టాటిస్టిక్స్, సోలిడ్స్, థర్మోడైనమిక్స్, కైనమేటిక్స్, మెటీరియల్ సైన్స్, ఫిజిక్స్ & స్ట్రక్చరల్ ఎనాలిసిస్ ఉంటాయి. ఆటోమోటివ్ గురించి కొద్దిపాటి సిలబస్ భాగమే ఇందులో ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజినీరింగ్... మెకానిక్ ఇంజినీరింగ్‌లో ఉండే చాలా విషయాలను కవర్ చేసినా కూడా ఆటోమోటివ్ అనువర్తనంపై ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఇందులో భాగంగా పవర్ ట్రైన్, చేసిస్ డిజైన్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఏరో డైనమిక్స్ & సేఫ్టీ కాంపోనెంట్స్. రెండు విభాగాలు మెకానికల్ కాన్సెప్టుల గురించి ఉన్నా రెండింటికీ తేడా ఉంటుంది.
మెకానికల్ ఇంజినీరింగులో మెకానికల్ డిజైన్ థియరీ & స్టాటిక్, డైనమిక్స్ & థర్మోడైనమిక్స్ వంటి వాటిని ఇంజినీరింగ్ రంగాల్లో ఎలా అనువర్తిస్తారో తెలుసుకోవచ్చు. మెకానికల్ ఇంజినీరింగ్ చేసినవారు ఒకవేళ ఆటోమోటివ్ పరిశ్రమలో ఉద్యోగం సంపాదించలేకపోయినా వేరే ఇతర మెకానికల్ రంగంలో మెకానికల్ ఇంజినీరింగ్ నైపుణ్యాలతో సంపాదించవచ్చు.
అలాగే ఆటోమొబైల్ ఇంజినీర్లు... వీరు ఆటోమోటివ్ మెకానికల్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలపై నైపుణ్యాలు పెంచుకుంటే కెరియర్ వెంటనే ఆరంభించడానికి చక్కని అవకాశం ఉంది. వీరికి తగిన స్పెషలైజ్‌డ్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన తర్వాత మాస్టర్ ఇన్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ చేయడం కూడా సరైన పనే.

ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయో తెలుపగలరు.

రాన్‌బాక్సీ లాబ్స్, వాక్‌హార్ట్, డా. రెడ్డీస్ లాబ్స్, గ్లాక్సో స్మిత్ క్త్లెన్, జాన్ హాప్కిన్స్, ఎన్ఆర్‌హెచ్ఎం, అపోలో హాస్పిటల్, ఇన్ఫోసిస్, క్రిసిల్, యూనిసెఫ్, ఫోర్టిస్ గ్రూప్ వంటి ఎన్నో కార్పొరేట్, ప్రైవేటు, పబ్లిక్ ఫండెడ్, ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్‌కేర్ సంస్థలు, హాస్పిటల్ కన్సల్టెన్సీలు, రీహాబిలిటేషన్ సెంటర్స్, పరిశోధన సంస్థలు, ఈ పరిశ్రమకు సాఫ్ట్‌వేర్ తయారుచేసే ఐటీ సంస్థల్లో ఈ కోర్సు చేసినవారికి అవకాశాలుంటాయి.
మేనేజ్‌మెంట్ ట్రైనీగా మొదలుపెట్టి హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, మెడికల్ సూపరింటెండెంట్, హాస్పిటల్ డైరెక్టరు, హాస్పిటల్ ప్లానింగ్ అడ్వైజర్, పేషెంట్ కేర్ టేకర్, కన్సల్టెంట్- ట్రామా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్, హెల్త్ అడ్మినిస్ట్రేటర్, పీఆర్ ఆఫీసర్, హెల్త్‌కేర్ ప్రొవైడర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌లా మీ కెరియర్‌ను మలచుకోవచ్చు.
దూరవిద్య చేయడానికి అన్నామలై విశ్వవిద్యాలయం, భారతియర్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ కేరళ, అన్నా విశ్వవిద్యాలయం, పాండిచేరి విశ్వవిద్యాలయం లాంటి యూజీసీ/ ఏఐసీటీఈ/ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారి గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాలనే ఎంచుకోండి.

బీఏ- ఇంగ్లిష్‌ దూరవిద్య ద్వారా పూర్తిచేశాను. యానిమల్‌ సైన్స్‌లో ఆసక్తి ఉంది. రెగ్యులర్‌ విధానంలో అందించే కోర్సుల వివరాలు తెలుపగలరు.

యానిమల్‌ సైన్స్‌లో పై చదువులకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో స్పష్టత తెచ్చుకోండి. కేవలం డిగ్రీ/ సర్టిఫికెట్‌ల కోసం చేయడం సరి కాదు. మీకు డిగ్రీలో జువాలజీ/ యానిమల్‌ సైన్స్‌కు సరిపడే సబ్జెక్టులు లేవు కాబట్టి రెగ్యులర్‌ మోడ్‌లో గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాల ద్వారా మీరు పై చదువులు చదవలేరు. http://bit.ly/1w9tU4a, http://yhoo.it/1w9tVoj ద్వారా యానిమల్‌ సైన్స్‌ గురించి తెలుసుకోవచ్చు.

ఇంటర్‌ పూర్తిచేశాను. నానో టెక్నాలజీపై ఆసక్తి ఉంది. కోర్సు, అందించే సంస్థల వివరాలు తెలుపగలరు.

10+2/ ఇంటర్‌ చదివిన తరువాత నేరుగా నానో టెక్నాలజీలో కోర్సులు అందించే కళాశాల/ విశ్వవిద్యాలయాలు అరుదుగా ఉన్నాయి. అమిటీ విశ్వవిద్యాలయం వారి బీటెక్‌- నానోటెక్నాలజీ (4 సంవత్సరాలు) కోర్సు/ బీటెక్‌+ ఎంటెక్‌ (డ్యూయల్‌ డిగ్రీ - 5 సంవత్సరాలు) కోర్సు; ఎస్‌ఎన్‌ఆర్‌ సన్స్‌ కళాశాల, కోయంబత్తూరు వారి బీఎస్‌సీ ఫిజిక్స్‌ & నానో టెక్నాలజీ చేయవచ్చు.
బీఈ/ బీటెక్‌/ బీఎస్‌సీ చేసినవారు ఇతర మాస్టర్‌ కోర్సులకు గమనించాల్సినవి- జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌, బెంగుళూరు; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (www.nano.iisc.ernet.in); జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ (www.jncasr.ac.in); ఐఐటీ ముంబయి (www.iitb.ac.in/~crnts/preamble.html); అమృత యూనివర్సిటీ (www.amrita.edu/acns); అమిటీ యూనివర్సిటీ (www.amity.edu); ఎన్‌ఐటీ, భోపాల్‌ (http://manit.ac.in); గురు జంబేశ్వర్‌ యూనివర్సిటీ (www.gju.ernet.in); శాస్త్ర యూనివర్సిటీ (www.sastra.edu/centab/); ఐఐటీ ఢిల్లీ (www.iitd.ac.in); ఐఐటీ కాన్పూర్‌ (www.iitk.ac.in/nanoscience); ఎన్‌ఐటీ కురుక్షేత్ర (www.nitkkr.ac.in); ఎన్‌ఐటీ రూర్కెలా (www.nitrkl.ac.in) .

బీకాం పూర్తిచేశాను. అగ్నిమాపక దళంలో చేరటానికి ఫైర్‌& సేఫ్టీ కోర్సు చేయాలని ఉంది. కామర్స్‌/ ఆర్ట్స్‌ చదివినవారు దీనికి అర్హులేనా? ఈ కోర్సులను అందించే విద్యాసంస్థలు, ఉద్యోగావకాశాల వివరాలు తెలుపగలరు.

ఎలాంటి డిగ్రీ చేసినా మీరు ఫైర్‌ & సేఫ్టీ కోర్సులు చేయవచ్చు. NCTT- CFSE వారి డిప్లొమా/ పీజీ డిప్లొమా, ఇతర కోర్సుల వివరాలకు www.ncttcfse.com/university.html ని చూడండి. ఎన్‌ఐఎఫ్‌ఎస్‌ వారి కోర్సుల వివరాలకు www.nifsindia.net/courses.htm ని చూడండి. ఇంకా కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ వారి వర్క్‌షాప్‌, ఇతర ఫైర్‌/సెక్యూరిటీ ఇవెంట్‌ల కోసం ఈ http://bit.ly/1uENFxR వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండండి. ఉద్యోగ విషయానికి వస్తే ఫైర్‌ ఆఫీసర్‌, ఫైర్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, సేఫ్టీ ఆఫీసర్‌/ సూపర్‌వైజర్‌/ మేనేజర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఆఫీసర్‌/ ఇంజినీర్‌/ మేనేజర్‌, హెచ్‌ఎస్‌ఈ ఆఫీసర్‌/ ఇంజినీర్‌/ అడ్వైజర్‌, ఫైర్‌మెన్‌ లాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఫైర్‌& సేఫ్టీలో ప్రత్యేక శిక్షణ పొందినవారికి అన్ని పరిశ్రమలు/ ఫ్యాక్టరీలు, ప్లాంటేషన్‌, మైనింగ్‌, థర్మల్‌ పవర్‌స్టేషన్లు, నిర్మాణరంగ సంస్థలు, ఈపీసీ డివిజన్‌, ఆస్పత్రులు, హోటళ్లు, ఆయిల్‌- గ్యాస్‌, విద్యాసంస్థలు, మాల్స్‌లో కూడా వీరి అవసరం ఉంటుంది. భారత్‌లోనే కాకుండా ఇతరదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్‌, మధ్యప్రాచ్య దేశాల్లో గిరాకీ ఎక్కువ.

డిగ్రీ (బీఎస్‌సీ కంప్యూటర్స్‌) చేశాను. పైచదువులు చదవాలనుకుంటున్నాను. వివరాలు తెలియజేయగలరు.

బాచిలర్‌ డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేసినవారికి చాలా అవకాశాలున్నాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇష్టం ఉంటే ఎంఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌, మాస్టర్‌ ఇన్‌ కంప్యూటర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంసీఎం), ఎంఎస్‌సీ- ఐటీ, మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ (ఎంసీఏ) చేయవచ్చు. ఇవే కాకుండా ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ (ఐఎంసీఏ), 3డీ ఆనిమేషన్‌ &విజువల్‌ ఎఫెక్ట్స్‌, అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్వర్కింగ్‌ (ఏడీహెచ్‌ఎన్‌), అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ మల్టీ లింగ్వల్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ (ఏడీఎంసీపీ), సీసీఎన్‌ఏ సర్టిఫికేషన్‌ పోగ్రామ్‌ ఫర్‌ నెట్వర్క్‌ ప్లానింగ్‌ &ఆప్టిమైజేషన్‌, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ టెలికాం సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఫర్‌ ద వెబ్‌ డెవలప్‌మెంట్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌, హెచ్‌సీఈ+ (హార్డ్‌వేర్‌ కోర్సు), ఐహెచ్‌టీ సర్టిఫైడ్‌ నెట్వర్క్‌ ప్రొఫెషనల్‌, ఐఐజేటీ సర్టిఫైడ్‌ నెట్వర్కింగ్‌ ఎక్స్‌పర్ట్‌ (ఐసీ- నెక్ట్స్‌) (పీసీ నెక్ట్స్‌), ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అండ్‌ ఎథికల్‌ హాకింగ్‌ మైక్రోసాఫ్ట్‌ సర్టిఫైడ్‌ సిస్టమ్‌ ఇంజినీర్‌ (ఎంసీఎస్‌ఈ), రెడ్‌ హాట్‌ సర్టిఫైడ్‌ ఇంజినీర్‌ (ఆర్‌హెచ్‌సీఈ), రోబోటిక్స్‌ కోర్సు టీసీఎన్‌పీ సర్టిఫికేషన్‌ లాంటి కోర్సులు మీరు చేయవచ్చు.
మేనేజ్‌మెంట్‌ వైపు ఇష్టం ఉంటే మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) ఎంచుకోవచ్చు. లేదా షార్ట్‌ టైం కోర్సులు- ఉదాహరణకు గ్రాఫిక్‌ డిజైన్‌, ఆనిమేషన్‌, వెబ్‌డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, ట్రావెల్‌ & టూరిజం కోర్సులు చేయవచ్చు.

BHMS కోర్సు ఇటీవలే పూర్తిచేశాను. పైచదువులు చదవాలనుకుంటున్నాను. ఆదరణ ఉన్న మంచి కోర్సులను తెలుపగలరు.

బీహెచ్‌ఎంఎస్‌ పూర్తిచేసిన తరువాత మీరు మాస్టర్‌ కోర్సులు మెటీరియా మెడికా, ఆర్గనాన్‌, రిపెర్టరీ, పీడియాట్రిక్స్‌, డెర్మటాలజీల్లో చేయవచ్చు. ద ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (ISHA) వారి ఒక ఏడాది దూరవిద్య డిప్లొమా కోర్సును నిర్వహిస్తున్నారు. మీ ఇష్టాలకు సరితూగే కోర్సును www.ishaindia.org/html/trainee.htmలో పొందుపరచిన కోర్సులు, వాటిని నిర్వహించే విశ్వవిద్యాలయంలో నుంచి ఎంచుకోండి. తద్వారా ప్రైవేటు, ప్రభుత్వ హోమియోపతిలో ఉద్యోగం చేయడమే కాకుండా సొంతంగా క్లినిక్‌ కూడా మొదలుపెట్టుకోవచ్చు. బోధన/ పరిశోధన రంగంలో కూడా అవకాశాలుంటాయి.

బి. ఆర్కిటెక్చర్‌ కోర్సు, అందిస్తున్న సంస్థలు, ప్రవేశపరీక్షల వివరాలు తెలుపగలరు. బీఆర్క్‌ చేసినవారికి ఉపాధి అవకాశాలెలా ఉంటాయి?

జేఈఈ ద్వారా అర్హత సాధించి బీఆర్క్‌ ప్రవేశం పొందవచ్చు. వివరాలకు http://jeemain.nic.in/jeemainapp/pdf/JEE_Main_bulletin_2014_19_12_13.pdf చూడండి. నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - ఆర్కిటెక్చర్‌ (NATA) వారు సంవత్సరానికి రెండు సార్లు నాటా పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు www.nata.in/2014/docs/NATA_Brochure_2014_final.pdfని చూడండి. జేఈఈ/ నాటాలో అర్హత సాధించినవారికి http://pahaldesign.com/nata-colleges/లో పొందుపరిచిన కళాశాలల్లో బీఆర్క్‌ కోర్సు ప్రవేశం లభిస్తుంది. బీ-ఆర్క్‌ చేసిన తర్వాత L&T, DLF, సహారా, ఈరోస్‌ గ్రూపు లాంటి నిర్మాణసంస్థల్లో కెరియర్‌ను మొదలు పెట్టవచ్చు. ఇంకా హౌసింగ్‌ బోర్డులు, అర్బన్‌/ సిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు, సెంట్రల్‌/ స్టేట్‌ పబ్లిక్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్లు, రైల్వే, నేషనల్‌ బిల్డింగ్‌ ఆర్గనైజేషన్లలో ఉద్యోగావకాశాలున్నాయి. భారత్‌లోనే కాకుండా యూఏఈ, చైనా, యూరోపియన్‌ లాంటిదేశాల్లో ఆర్కిటెక్టులకు కూడా భవిష్యత్తు ఉంది. దీని గిరాకీ దృష్ట్యా చాలామంది సొంతంగా చిన్న కంపెనీగా మొదలుపెట్టి ఆర్కిటెక్చరల్‌/ ఇంటీరియర్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసులను అందిస్తుంటారు.

బీఎస్సీ (ఎంపీసీఎస్‌) మూడో సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీ తరువాత ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. చేయాల్సిన కోర్సు వివరాలు తెలుపగలరు.

మీకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇష్టమైతే బిజినెస్‌ ఆర్కిటెక్చర్‌, సోషల్‌ మీడియా ఆర్కిటెక్చర్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్చర్‌, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లు, వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌ అప్లికేషన్లు, డేటా మేనేజ్‌మెంట్‌ వంటి వాటిలో ఏది ఇష్టమో ఇంటర్న్‌షిప్‌ల ద్వారా తెలుసుకోండి. ఎమ్‌ఓఓసీ (www.mooc-list.com/), ఖాన్‌ అకాడమీ (www.khanacademy.org/), ఎమ్‌ఐటీ (http://bit.ly/1jikPBw) వారి వివిధ కోర్సుల గురించి తెలుసుకోండి. స్టాటిస్టిక్స్‌ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎనలిస్ట్‌, బయో స్టాటిస్టీషియన్‌, బిజినెస్‌ స్టాటిస్‌టీషియన్‌, మార్కెటింగ్‌ ఎనలిస్ట్‌, డేటా ఎనలిస్ట్‌, డేటా సైంటిస్ట్‌, క్వాంటిటేటివ్‌ ఎనలిస్ట్‌, ప్రొఫెసర్‌, టీచర్‌గా కెరియర్‌ను మొదలుపెట్టవచ్చు. మరిన్ని వివరాలకు http://bit.ly/1j6aPWZను చూడండి.

బీకాం దూరవిద్య ద్వారా చేస్తున్నాను. తరువాత ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ప్రవేశపరీక్షల వివరాలు తెలుపగలరు.

ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌- ఐసెట్‌ (www.apicet.org.in/) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ చేయవచ్చు. ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ వారి మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌- మ్యాట్‌ (www.aima.in/testing- services/mat/mat.html) ద్వారా భారత్‌లో ఉన్న బిజినెస్‌ స్కూల్స్‌లో ఎంబీఏ చేయవచ్చు. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ -CAT (www.cat2013.iimidr.ac.in/)ద్వారా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్స్‌ (IIMs)లో ఎంబీఏ చేయవచ్చు. ఐబీఎస్‌ఏటీ (www.ibsindia.org/admissions/)ద్వారా భారత్‌లో ఉన్న ఐసీఎఫ్‌ఏఐ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ చేయవచ్చు. ఇవే కాకుండా ఫాకల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌- ఎఫ్‌ఎమ్‌ఎస్‌ (www.fms.edu); ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ -IIFT (www.iift.edu); NARSEE MONJEE MAT వారి NMAT (www.nmims.edu); సింబయాసిస్‌ నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌-SNAP (www.snaptest.org); XLRI- XAT (www.xlri.net.in)ల ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ ప్రవేశం పొందవచ్చు.

ఈఈఈ డిప్లొమా కోర్సు చేస్తున్నాను. దీని తరువాత ఏది ఎంచుకుంటే మేలు? బీటెక్‌ కాకుండా డిప్లొమా చేసిన వారికున్న అవకాశాలేమిటి?

రెగ్యులర్‌ బీటెక్‌ కాకుండా ఏఎమ్‌ఐఈని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (www.ieindia.org) నుంచి చేయవచ్చు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఎన్నో షార్ట్‌టర్మ్‌, లాంగ్‌టర్మ్‌ కోర్సులను అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (http://atihyderabad.ap.nic.in/calender2014.pdf) వారు నిర్వహిస్తున్నారు. డిప్లొమా వారికి కూడా ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, బీహెచ్‌ఈఎల్‌, సెయిల్‌, ఎన్‌టీపీసీ, ఇస్రో, డీఆర్‌డీవో, బార్క్‌, బెల్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీఎల్‌, ఈసీఐఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, గెయిల్‌ లాంటి ప్రభుత్వ రంగంలో; ఏబీబీ, ఆల్స్‌టామ్‌, బజాజ్‌, జీఈ, Schneiderలాంటి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. కోర్‌ ఇంజినీరింగ్‌లో ఉద్యోగాలకు డిప్లొమా వారిని తీసుకోవడానికి చాలా సంస్థలు సుముఖత చూపిస్తాయి.

బీబీఎం మొదటి సంవత్సరం చదువుతున్నాను. తరువాత ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఏదైనా బహుళజాతి సంస్థకి సీఈవో/ జీఎం కావాలన్నది నా కల. మంచి కళాశాలల వివరాలు తెలుపగలరు.

మేనేజ్‌మెంట్‌ వైపునకు వెళ్లాలనుకునేవారికి ఎంబీఏ చేయడం మంచి ఆలోచనే. అలాగని ఎంబీఏ చేసినవారే సీఈఓ/ వ్యాపారవేత్తలుగా కాలేరు. ఎంబీఏ లేకపోయినా కావలసిన నైపుణ్యాలను సంపాదించి ఎందరో ఎన్నో వ్యాపారాల్లో విజయాన్ని సాధించారు. INSEAD, HBR సమీక్ష ప్రకారం http://bit.ly/1mzllMj చూసినట్లయితే భారత్‌లో 60 శాతం ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సు లేకుండానే సీఈవో లాంటి గొప్ప పదవుల్లో కొనసాగుతున్నారు. చాలామంది డిగ్రీలతో కెరియర్‌ను మొదలుపెట్టి కొంత అనుభవం వచ్చాక అప్పుడు ఎంబీఏ చేయడం వల్ల వచ్చిన పరిజ్ఞానాన్ని సీఈఓ/ ఇతర వ్యాపారవేత్తగా కావడానికి సద్వినియోగపరచుకుంటారు.
క్యాట్‌/ మ్యాట్‌/ గ్జాట్‌ లాంటి రాత పరీక్షల ద్వారా http://bit.ly/QqcNvzలో పొందుపరిచిన ప్రముఖ ఎంబీఏ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. దీనికి తోడుగా మీరు రోల్‌ మోడల్స్‌, కేస్‌ స్టడీస్‌, సంస్కృతిపై అధ్యయనం చేయడం, నెట్వర్క్‌ పెంచుకోవడం, ప్రతి ఓటమి నుంచి నేర్చుకోవడంతోపాటు భావవ్యక్తీకరణ, నాయకత్వం, సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి.

డిగ్రీ పూర్తిచేశాను. సీఎఫ్‌పీ (సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌) కోర్సు చేద్దామనుకుంటున్నాను. ఈ కోర్సుకు భవిష్యత్తు ఎలా ఉంటుంది?

పెట్టుబడి, పన్ను ఆదా, బీమా ఎంపిక, స్టాక్‌ లావాదేవీలు... ఇలా డబ్బును సరిగా నిర్వహిస్తూ ఆర్థిక లక్ష్యాన్ని అందుకోవడానికి సహకరించే ఫైనాన్షియల్‌ ప్లానర్‌ల అవసరం పెరుగుతోంది. మీరు సీఎఫ్‌పీ కోర్సుకి తోడు ఎంబీఏ, సీఏ లాంటి కోర్సులు చేయడం లాభదాయకం. భారత్‌ ఆర్థికవ్యవస్థ వృద్ధి మూలంగా సీపీఎఫ్‌ల అవసరం పెరుగుతుంది కాబట్టి ఈ రంగంలో భవిష్యత్తు బాగుంటుందని చెప్పొచ్చు. బ్యాంకులు, ఏఎమ్‌సీలు (హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, ప్రిన్సిపల్‌, రిలయన్స్‌, ఎల్‌&టీ); బ్రోకింగ్‌ కంపెనీలు (ఐసీఐసీఐఐ సెక్యూరిటీస్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌, కార్వీ, ఎడెల్వెయిస్‌, డెస్టిమనీ); జీవితబీమా సంస్థలు (మెట్‌లైఫ్‌, రిలయన్స్‌ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ కంపెనీలు, శిక్షణ సంస్థలు, కేపీవోలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, మీడియా సంస్థల్లో మీ కెరియర్‌ను ఆరంభించవచ్చు.

డిగ్రీ పూర్తిచేశాను. రూరల్‌ డెవలప్‌మెంట్‌ పీజీ కోర్సు చేయాలనుకుంటున్నాను. దూరవిద్య, రెగ్యులర్‌ రెండింటినీ అందించే సంస్థల వివరాలు తెలుపగలరు. ఈ కోర్సు చేసినవారికి ఉండే ఉద్యోగావకాశాలను తెలియజేయగలరు.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఐఆర్‌డీ) వారు సంవత్సరపు కాల వ్యవధిలో నిర్వహించే పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (పీజీడీఆర్‌డీ) అనే కోర్సులోకి రాతపరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. పూర్తి వివరాలకు ఈ http://www.nird.org.in/PGDRDM/process.aspx వెబ్‌సైట్‌ చూడండి. జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌, రాంచీ వాళ్లు నిర్వహించే పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అనే రెండు సంవత్సరాల కోర్సు కోసం www.xiss.ac.in/admission.php ని చూడండి.
ఇవి కాకుండా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు బీఏ (ఎకనామిక్స్‌) చేసినవారికి రెండు సంవత్సరాల ఎంఏ- (అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ & రూరల్‌ డెవలప్‌మెంట్‌) కోర్సు, ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ డిప్లొమా- కో ఆపరేషన్‌ & రూరల్‌ స్టడీస్‌ అనే సంవత్సరపు కోర్సులు, ఎస్‌వీయూ యూనివర్సిటీతో ఎంఏ (రూరల్‌ డెవలప్‌మెంట్‌) అనే రెండు సంవత్సరాల కోర్సులున్నాయి. ఇగ్నోలో దూరవిద్య కోర్సులు- ఎంఏ (రూరల్‌ డెవలప్‌మెంట్‌) అనే రెండు సంవత్సరాల, సర్టిఫికెట్‌ ప్రోగ్రాం- రూరల్‌ డెవలప్‌మెంట్‌ అనే ఆరు నెలల కోర్సులుంటాయి. మరిన్ని వివరాలకు www.ignou.ac.in/ వెబ్‌సైట్‌ని చూడండి.
ఉద్యోగ విషయానికి వస్తే భారత్‌లో ఎన్‌జీవోలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, కార్పొరేట్‌ రంగ సోషల్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్స్‌ (సీఎస్‌ఆర్‌), సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌- రీసెర్చర్‌, ప్రాజెక్టు ఫార్ములేషన్‌ ఫ్రీలాన్సర్‌ లేదా సొంతంగా మీరే సంస్థను మొదలు పెట్టవచ్చు. ఈ వెబ్‌సైట్‌ http://nrega.ap.gov.in/ చూస్తే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ వారు ఏపీలో తలపెట్టిన పథకాలను చూసి గ్రామీణాభివృద్ధికి ఉన్న ప్రాముఖ్యాన్ని గ్రహించవచ్చు.

బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎం ఫార్మసీ/ ఎంబీఏ ఫార్మసీల్లో ఏది చేస్తే మంచిది?

మీకు సాంకేతికంగా ఫార్మసిస్టుగా ఔషధాలపై పనిచేసే అభిరుచి ఉంటే ఎంఫార్మ్‌ చెయ్యండి. అలా కాకుండా సబ్జెక్టుతోపాటు మేనేజ్‌మెంట్‌లో అభిరుచి ఉంటే ఎంబీఏ చెయ్యండి.

ఐటీఐ చేశాను. గనుల సర్వేయర్‌ కోర్సు చేయాలనుంది. ఈ కోర్సు చేసే కాలేజి వివరాలు తెలుపగలరు.

మైన్‌ సర్వేయింగ్‌ చేయాలంటే మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఉన్న బజాజ్‌ చంద్రపూర్‌ పాలిటెక్నిక్‌ దగ్గరలో ఉంది. సర్వేయింగ్‌ అయితే కొత్తగూడెం, నర్సీపట్నంలలో ఉన్నాయి. ఈ కింది కళాశాలలు మైనింగ్‌/ సర్వేయింగ్‌లో డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి.
మైన్‌ సర్వేయింగ్‌
* అసన్‌సోల్‌ పాలిటెక్నిక్‌, సౌత్‌ ధడక్‌, బర్ధమాన్‌ (ఫో), వెస్ట్‌ బెంగాల్‌
* బజాజ్‌ చంద్రపూర్‌ పాలిటెక్నిక్‌, బజాజ్‌ వార్డ్‌, చంద్రపూర్‌, మహారాష్ట్ర
* లేట్‌ అహిల్యబాయి కక్డె బహుద్దేశీయ శిక్షణ ప్రశాసక్‌ మండల్స్‌ సాయి పాలిటెక్నిక్‌, కిన్హి (జవదె), ఎన్‌హెచ్‌-2, నాగపూర్‌- హైదరాబాద్‌ రోడ్‌, తల్‌రాలేగావ్‌ మహారాష్ట్ర
* శ్రీవైష్ణవ్‌ పాలిటెక్నిక్‌, ఎంఓజీ లైన్స్‌, ఇండోర్‌, మధ్యప్రదేశ్‌
డిప్లొమా ఇన్‌ మైనింగ్‌
* గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, నర్సీపట్నం
* గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ బెల్లంపల్లి, ఆదిలాబాద్‌
* గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, గుంటూరు
* గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
* వైఎస్‌ఆర్‌ రెడ్డి పాలిటెక్నిక్‌, పులివెందుల.

ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ చేస్తున్నాను. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేద్దామనుకుంటున్నాను. సలహా ఇవ్వగలరు.

మీకు ఇదివరకే ఏదైనా పరిశ్రమలో అనుభవం ఉండి, మేనేజ్‌మెంట్‌ వైపు వెళ్లాలని ఉంటే మేనేజ్‌మెంట్‌లో ఉన్నత చదువుల కోసం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఐఎమ్‌ఏ), పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎస్‌బీ), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎంటీ) లలో చేయడం ఉత్తమం. http://bit.ly/1csP8lqని ఓసారి చూడండి.

నా సోదరి బీఎస్సీ నర్సింగ్‌ చేసి నాలుగు సంవత్సరాలపాటు ఉద్యోగం చేసింది. ఇప్పుడు తను క్లినికల్‌ నర్సింగ్‌ రంగాన్ని మార్చుకోవాలనుకుంటోంది. ఏం చేయాలో వివరించండి.

మీ ప్రశ్నలో తన ఉద్యోగ వివరాలు, రంగం మార్చుకోవడానికి కారణాలు, ఇంకా తన ఇష్టాల గురించి కూడా రాసి ఉంటే బాగుండేది. ఏదేమైనా నర్సింగ్‌లో ఉన్నత చదువులు/ మాస్టర్‌ కోర్సు తర్వాత పీహెచ్‌డీ చేయడం ఇష్టం లేకపోతే ఎంబీఏ చేయవచ్చు. ఎంబీఏ చేయడం వల్ల హెల్త్‌కేర్‌, ఫార్మాస్యుటికల్స్‌, ఇన్స్యూరెన్స్‌, పబ్లిక్‌హెల్త్‌ ఏజెన్సీల్లో మేనేజ్‌మెంట్‌ పోస్టులకు ప్రయత్నించవచ్చు. నాన్‌-క్లినికల్‌ రంగంలో (హెల్త్‌కేర్‌ రిక్రూట్‌మెంట్‌, నర్సింగ్‌ ఇన్ఫర్మాటిక్స్‌, పేషెంట్‌/ స్టాఫ్‌ అడ్వైజర్‌, మెడికల్‌ రైటర్‌, యూనివర్సిటీ/ స్కూల్‌ టీచింగ్‌, ఫార్మాస్యుటికల్‌/ మెడికల్‌ డివైస్‌ సేల్స్‌, ఇన్స్యూరెన్స్‌ ఏజెంట్లు) నచ్చినది ఎంచుకోవచ్చు. http://bit.ly/1e9OO7 ద్వారా వీఎల్‌ఎస్‌ఐ ప్రాముఖ్యం, దానిలో మీ ఉద్యోగ భవిష్యత్తు తెలుసుకోండి.

పాలిటెక్నిక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చేస్తున్నాను. ఉన్నత చదువులను విదేశాల్లో చదవాలనుకుంటున్నాను. కోర్సునూ, దేశాన్నీ ఏవిధంగా ఎంచుకోవాలి?

మీరు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లి డబ్బు, సమయం వృథా చేయడం కంటే జేఈఈ రాసి ఐఐటీలో బీటెక్‌ సీటుకు ప్రయత్నించడం మంచిది. మరిన్ని వివరాలకు http://bit.ly/1eN6axE వెబ్‌సైట్‌ను చూడండి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ఉచిత మెటీరియల్‌ కోసం udacity, MIT OpenCourseWare, Khan academy, coursera వంటి వెబ్‌సైట్లను చూడండి. వివిధ దేశాల అనుభవజ్ఞులు పొందుపరచిన వీడియో లెక్చర్లు, పీడీఎఫ్‌ డాక్యుమెంట్ల కోసం http://bit.ly/1dMhaWW లో చూడండి.

ఏఎస్‌ఆర్‌బీ సెట్‌ (అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)కు సిద్ధమవుతున్నాను. పుస్తకాలు, మాదిరి ప్రశ్నపత్రాల సమాచారం ఎక్కడ దొరుకుతుంది?

మీరు పాఠ్యపుస్తకాలు బాగా చదివి నోట్సు తయారు చేసుకోండి. ముఖ్యమైన పాయింట్లను రోజూ మననం చేసుకోండి. మాదిరి ప్రశ్నపత్రాల కోసం కింది వెబ్‌సైట్లు చూడండి.
1) http://entrance-exam.net/forum/general-discussion/previous-5-years-question-papers-asrb-net-agribusiness-management-paper-969539.html#ixzz2iLqixudN

2) www.jbigdeal.com/ 2011/05/asrb-question-paper-free-pdf-previous-year-old-papers-www-asrb-com.html

3. www.icar.org.in/files/new-syllabus-ARS-NET%202012.pdf

.

మా అమ్మాయి జూ. ఇంటర్‌ చేస్తోంది. ఇంటర్‌ తరువాత ఏ కోర్సు చేయాలనే సందిగ్ధంలో ఉంది. ఇంజినీరింగ్‌/ డిగ్రీ/ ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సు... ఏది ఎంచుకోవాలి? తను తెలివైనది. సలహా ఇవ్వండి.

మీ అమ్మాయి అభిరుచి ఏంటో తెలుసుకోండి. తన సహజ చాతుర్యం ఏ రంగంలో ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తను స్కూల్లో ఏ సబ్జెక్టులు బాగా చదివేదో తెలుసుకోండి. ఒకవేళ గణితం, భౌతికశాస్త్రాల్లో ఆసక్తి ఉంటే ఇంజినీరింగ్‌ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా సాంఘికశాస్త్రంలో/ గణితశాస్త్రంలోని అంకగణితంలో ఆసక్తి ప్రదర్శిస్తే డిగ్రీ చేయడం మంచిది. తనలో సృజనాత్మకత ఉంటే ఫ్యాషన్‌ డిజైన్‌ మంచిది. ఒకవేళ ఈ విషయంలో మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు కెరియర్‌ కౌన్సిలర్‌ను కలవడం మంచిది.

నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌టీపీఐ) 12 వారాల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఓపెన్‌ కేటగిరీలో ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇదెలా ఉపయోగపడుతుంది?

విద్యుచ్ఛక్తి విభాగంలో సుశిక్షితులైన మానవ వనరుల కొరతను తీర్చడానికి ఎన్‌టీపీఐను స్థాపించారు. ఎంబీఏతో సహా ఈ సంస్థ నిర్వహించే వివిధ కోర్సుల్లో 12 వారాల కోర్సు ఒకటి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లోని వివిధ అంశాలపై అవగాహనతో కూడిన శిక్షణనిచ్చే కార్యక్రమమిది. శిక్షణానంతరం ఎటువంటి ఉద్యోగ హామీ లేకపోయినా చాలా కంపెనీలు ఇక్కడ శిక్షణ పొందినవారిని నియమించుకుంటున్నాయి. ప్రాంగణ నియమకాలకు కూడా ఎన్‌టీపీఐ సహకరిస్తోంది. కాబట్టి ఈ కోర్సు మంచిదే.

నేను ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాక మెరైన్‌ ఇంజినీరింగ్‌ చేయాలనుంది. కోర్సు, ఉద్యోగావకాశాల గురించి వివరించండి?

మెరైన్‌ ఇంజినీరింగ్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ రంగంలో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. పంప్‌మన్‌, హార్బర్‌ మేటర్‌, థర్డ్‌/ ఫోర్త్‌/ సెకండ్‌ ఇంజినీర్‌, మెరైన్‌ ఇంజినీర్‌, జూనియర్‌/ ఫిఫ్త్‌ ఇంజినీర్‌, జావీ వెపన్‌ ఇంజినీరింగ్‌ ఆఫీసర్‌ వంటి ఉద్యోగాలుంటాయి. ఇలా పోర్టులో ఉండే వర్క్‌షాపులోనే కాకుండా షిప్పింగ్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీల్లో, డైరెక్టరేట్‌ జనరల్‌ షిప్పింగ్‌ ఆఫ్‌ ఇండియాలో, ఇండియన్‌ నేవీ రంగంలో లేదా ఇతర సర్వీస్‌ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలుంటాయి. మెరైన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుని నిర్వహించే కొన్ని ప్రముఖ కాలేజీల వివరాలకు http://bit.ly/IM2IK6 వెబ్‌సైట్‌ని చూడండి.

నేను ఒక గ్రాడ్యుయేట్‌ని. ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. ఇప్పుడు నెట్‌వర్కింగ్‌ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు బాగుంటాయా? చేయదగిన కోర్సుల గురించి తెలుపగలరు.

నెట్‌వర్కింగ్‌లో కోర్సు చేసినవారు సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్లుగా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఈ ఉద్యోగమైతే వయసుతో నిమిత్తం లేకుండా తీసుకుంటారు. మీరు ఎంసీఎస్‌ఈ, లేకపోతే సీసీఎన్‌ఏ వంటి కోర్సులు చెయ్యాలి. కేవలం శిక్షణతో ఆగిపోక సర్టిఫికేషన్‌ కూడా చేస్తే మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అన్న ప్రశ్నకు సరైన జవాబు ఇచ్చుకోండి. ఎవరో చెప్పారని, ఇక్కడ జీతాలు బాగుంటాయని, లేక ఇతరుల ప్రభావానికి లోనై మాత్రం ఈ నిర్ణయం తీసుకునుంటే పునరాలోచన మంచిది. ఏ ఉద్యోగమైనా, వృత్తిపరమైన కష్టనష్టాలు తప్పవని తెలుసుకోవాలి. ఏదైనా ప్రామాణిక సంస్థను ఎంచుకుని కోర్సు చేయండి.

ఐఐఎం ఇండోర్‌లో ఇంటర్‌ తరువాత చదివే 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ వివరాలు తెలుపగలరు. ఈ కోర్సు ప్రవేశపరీక్షకు సిద్ధమడానికి అవసరమయ్యే పుస్తకాల సమాచారం ఎక్కడ లభిస్తుంది?

ఐఐఎం ఇండోర్‌ వారి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సులో 10+2 లేదా హయ్యర్‌ సెకండరీ పూర్తి చేసినవాళ్లు చేరొచ్చు. ఎస్‌ఎస్‌సీ/ పదోతరగతి, 12/ 10+2/ హయ్యర్‌ సెకండరీలో 60 శాతం ఉత్తీర్ణత ఉండాలి. ప్రవేశం కోసం ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, వెర్బల్‌ ఎబిలిటీ) రాయాలి. దీనిలో అర్హత సాధించినవారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ www.iimidr.ac.in/iimi/pages/programmes_main/ipm.php వెబ్‌సైట్‌ని చూడండి. ఆప్టిట్యూడ్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఆర్‌ఎస్‌ అగర్వాల్‌, అరుణ్‌ శర్మ, నిశిత్‌ కే. సిన్హా వారి పుస్తకాలు చదవండి. మాదిరి ప్రశ్నపత్రం కోసం www.bschool.careers360.com/sites/default/files/filedownloadcount/IPM-Aptitude-Sample-paper.pdf చూడండి.

నాకు కంపెనీ సెక్రటరీ ఉద్యోగం చేయాలని ఉంది. మనరాష్ట్రంలో ఈ కోర్సును చదివేదెలా?

ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) అందించే కంపెనీ సెక్రటరీ కోర్సును 10+2 చదివినవారికి మూడు దశలుగా ఉంటుంది. 1) ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌ 2) ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌ 3) ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారికి 1) ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌ 2) ప్రొఫెషనల్‌ ప్రోగ్రాములు ఉంటాయి. కోర్సు ప్రవేశ వివరాలకు www.icsi.edu/WebModules/AboutUs/Courses/CS_Course.htm సైట్‌ను చూడండి.

దుబాయ్‌లోని ఒక ఎలక్ట్రికల్‌ సంస్థలో 8 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం కర్ణాటక ఓపెన్‌ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్‌ డిప్లొమా చేస్తున్నాను. దీనిద్వారా ఏపీ ట్రాన్స్‌కోలో ఉద్యోగం పొందవచ్చా? మన రాష్ట్రంలో బీటెక్‌ (ఈఈఈ) లేదా ఎలక్ట్రికల్‌ డిప్లొమాను దూరవిద్య ద్వారా అందించే విశ్వవిద్యాలయాల వివరాలు తెలుపగలరు.

ఏపీ ట్రాన్స్‌కోలో సబ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) ఉద్యోగానికి మీరు డిప్లొమా (ఎలక్ట్రికల్‌) పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ డిప్లొమా కోర్సు భారత ప్రభుత్వం/ యూజీసీ/ డీఈసీ/ ఏఐసీటీఈ వారి గుర్తింపు పొందినదై ఉండాలి. వివరాలకు క్రితంలో సబ్‌ ఇంజినీర్‌ పోస్టు ప్రకటన వివరాలను http://aptransco.cgg.gov.in/Documents/SE.pdf లో అర్హతను (మూడోపేజీలో) పరిశీలించండి. యూజీసీ/ డీఈసీ/ ఏఐసీటీఈ వారు ఇపుడు ఎలాంటి ఇంజినీరింగ్‌ దూరవిద్య కోర్సులనూ ప్రోత్సహించడం లేదు కనుక మీరు యూజీసీ/ డీఈసీ/ ఏఐసీటీఈ వారి గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల్లో దూరవిద్య చేయడం సరికాదు.

NATAవివరాలు, అవకాశాలను తెలపండి

నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ అనేది బీ.ఆర్కిటెక్చర్‌లో అడ్మిషన్‌ కోసం రాసే రాతపరీక్ష. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ వారు నిర్వహించే ఈ NATA ద్వారా బాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ మొదటి సంవత్సరంలో ఎన్‌ఐటీలు, ఐఐటీలు, గవర్నమెంట్‌ ఎయిడెడ్‌ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ యూనివర్శిటీల్లో, ఇతర ప్రైవేటు సంస్థల్లో ప్రవేశించవచ్చు. దీనికి రుసుము చెల్లించి దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు. 10+2 లేదా దీనికి సమాన అర్హతతోపాటు 50 శాతం ఉత్తీర్ణత ఉండి గణితం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మరిన్ని వివరాలకు http://portal.nata.in/www13/Home.aspxని చూడండి.
బీ.ఆర్కిటెక్చర్‌ చేసిన తర్వాత ఎల్‌అండ్‌టీ, డీఎల్‌ఎఫ్‌, సహారా, Eros గ్రూపు వంటి సంస్థల్లో కెరియర్‌ను మొదలు పెట్టవచ్చు. ఇంతేకాకుండా హౌసింగ్‌ బోర్డులు, అర్బన్‌/ సిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, సెంట్రల్‌/ స్టేట్‌ పబ్లిక్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్లు, రైల్వేస్‌, నేషనల్‌ బిల్డింగ్‌ ఆర్గనేజేషన్స్‌ వంటి మరెన్నో ప్రభుత్వ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలున్నాయి. మనదేశంలోనే కాకుండా యూఏఈ, చైనా, యూరప్‌లలో ఆర్కిటెక్చర్‌లకి కూడా ఎంతో భవిష్యత్తు ఉంది. దీనికి గిరాకీ ఉన్నందువల్ల చాలామంది చిన్న కంపెనీగా మొదలుపెట్టి ఆర్కిటెక్చరల్‌/ ఇంటీరియర్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసులను అందిస్తుంటారు.


ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చేయాలనుకుంటున్నాను. కోర్సు వివరాలు, సంస్థల సమాచారం ఇవ్వగలరు.

ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ కోసం ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయం - http://www.angrau.in/admissionsindia.aspx, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఉస్మానియా) http://www.uctou.ac.in చూడవచ్చు. 4 సంవత్సరాల ఇంజినీరింగ్‌ కోర్సులు ఎంసెట్‌లో అర్హత సాధించినవారు చేయవచ్చు.

నాకు ఐసెట్‌ (2013)లో 3301 ర్యాంకు వచ్చింది. డిగ్రీలో మైక్రోబయాలజీ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నాను. కెరియర్‌లో పురోగతికి ఉద్యోగం మానేసి ఎంబీఏ చేద్దామనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? లేక ఉద్యోగం చేస్తూనే దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయనా? తెలుపగలరు.

ఎంబీఏ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, పారిశ్రామిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి తోడ్పడుతుంది. మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ వంటివే కాకుండా ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా చేయవచ్చు. http://bit.ly/12vUQR7 వెబ్‌సైట్‌లో ఈ ప్రోగ్రాం వివరాలను తెలుసుకోవచ్చు. మీరు ఉద్యోగం చేసుకుంటూ కూడా ఎంబీఏ చేయవచ్చు. ఐఎస్‌బీఎం, ఐసీఎఫ్‌ఏఐ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌, హోలిమేరి బిజినెస్‌ స్కూల్‌ వంటివాటిలో వారాంతపు ఎంబీఏలో చేరవచ్చు. సాయంత్ర సమయంలోనూ వీటిలో తరగతులు నిర్వహిస్తారు.

ఐసెట్‌లో 1600 ర్యాంకు సాధించాను. ఉద్యోగం చేస్తూ ఎంబీఏ దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. వివరాలు తెలుపగలరు.

యశ్వంతరావ్‌ చవాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ స్టడీస్‌ అండ్‌ రిసర్చ్‌- పూణే, ఉస్మానియా యూనివర్శిటీ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ), నర్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎన్‌ఎమ్‌ఐఎమ్‌ఎస్‌), ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ (ఐజీఎన్‌ఓయూ)లో మీరు దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయవచ్చు. ఇవే కాకుండా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఐఎస్‌బీఎమ్‌), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎఫ్‌ఏఐ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌, హోలిమేరి బిజినెస్‌ స్కూల్‌ వంటి వాటిలో వారాంతపు ఎంబీఏ ప్రోగ్రాములు చేయవచ్చు. ఉద్యోగం చేస్తూ ఎక్కువ సమయం కేటాయించలేనివారికి వారాంతాల్లో/ సాయంకాల సమయంలో తరగతులు నిర్వహిస్తారు. ఎంబీఏ దూరవిద్య పద్ధతిలో చేస్తున్నపుడు కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై ఆధారపడకుండా సొంతంగా ప్రాజెక్ట్‌/ ఇంటర్న్‌షిప్‌ల ద్వారా (http://www. internshala.com/) మీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

నేను ఓ జూనియర్‌ కాలేజీలో చదువుతున్నాను. ఈ మధ్య ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (IGNOU)వారి వెబ్‌సైట్‌ (www.iiaeit.org)ని చూశాను. కానీ ఏరోనాటికల్‌ గురించి తాజా వివరాలు ఏమీలేవు. వీటిపై పూర్తివివరాలు తెలపండి.

ఇలా తమ వెబ్‌సైట్లను ఎప్పటికప్పుడు తాజాకరించని సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఈ కాలేజీ వివరాలు, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు గురించి http://bit.ly/11Lcax0వెబ్‌సైట్‌ను చూడండి. హైదరాబాద్‌లో గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (www.griet.ac.in/),వాసవీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌(www.vce.ac.in/),చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (www.cbit.ac.in/),ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌(http://web.iare.ac.in/),జేబీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(www.jbiet.edu.in/),ఎం.జె. కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(www.mjcollege.ac.in/)లాంటి కళాశాలలు కూడా ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయి.

ఎంఎస్సీ అనలిటికల్‌ కెమిస్ట్రీ చేశాను. ఇప్పుడు SAS ప్రోగ్రాంలో చేరాలని ఉంది. దీని గురించి వివరాలు తెలపండి.

స్టాటిస్టికల్‌ ఎనాలిసిస్‌ సిస్టమ్‌ (SAS) అనే ఇంటిగ్రేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిట్రీవ్‌, మేనేజ్‌ చేయడానికి, రిపోర్ట్‌, గ్రాఫిక్స్‌, స్టాటిస్టికల్‌ డేటా ఎనాలిసిస్‌ చేయడానికీ, బిజినెస్‌ నిర్ణయాలూ, నాణ్యత మెరుగుపరుచుకోవడానికీ ఉపయోగపడుతుంది. క్లినికల్‌ డేటా ఇంటిగ్రేషన్‌, డ్రగ్‌ డిస్కవరీ, నిర్వహణ, క్లినికల్‌ ట్రయల్‌అనాలిసిస్‌ లాంటివాటికి ఎన్నో లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు వాడతారు. Cytel (http://bit.ly/2TLjSY), VGIT (http://bit.ly/12Wuqn4), TechData (http://bit.ly/Yy5OSV) లాంటి ఇన్‌స్టిట్యూట్లలో మీరు జాయినవ్వొచ్చు.

నేను డిగ్రీ చేశాను. కానీ చదువులో వెనకబడివున్నాననుకుంటున్నాను. నాకు ఎలక్ట్రానిక్స్‌ లేదా హార్డ్‌వేర్‌ రంగాలంటే చాలా ఇష్టం. నాకు తగిన సలహా ఇవ్వండి.

మీ ఆసక్తిని బట్టి హార్డ్‌వేర్‌/నెట్‌ వర్కింగ్‌ రంగం ఎంచుకుంటే భవిష్యత్తు ఉంటుంది. రౌటర్స్‌, హబ్స్‌, గేట్‌వేస్‌, నెట్‌వర్కింగ్‌ కేబుల్స్‌, మోడెమ్స్‌, ఫైర్‌వాల్స్‌ మొదలైనవాటిలో పనచేయడమే హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్‌. దీనికి సీసీఎన్‌ఏ, సీసీఎన్‌పీ, నెట్‌వర్కింగ్‌ లాంటి కోర్సులు చేయండి. వీటిని సర్టిఫికెట్ల కోసం కాకుండా మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవటం కోసం చేయండి. ఇలా చేస్తూనే Letsintern లేదా Internshala ద్వారా ఇంటర్న్‌షిప్‌ కూడా చేయొచ్చు. మీకు చిన్నచిన్న హార్డ్‌వేర్‌ షాపులు మొదలుకొని మాన్యుఫాక్చరింగ్‌, ఐటీ/సర్వీస్‌, టెలికాం, బీపీవో లాంటి పెద్ద సంస్థలవరకూ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

బి.కాం. పూర్తిచేశాను. ఎంబీఏ-ఐటీ చేయాలని ఉంది. దీని గురించి వివరాలు చెప్పండి.

విశ్వవిద్యాలయం/ విద్యాసంస్థను బట్టి ఎంబీఏ కాలవ్యవధి ఏడాది లేదా రెండు సంవత్సరాలు. ఉస్మానియా, జేఎన్‌టీయూలలో లేదా ఐఎస్‌బీ, ఐఐఎం, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలలో చేయడానికి ఐసెట్‌, క్యాట్‌/జీమ్యాట్‌, ఎక్స్‌ఏటీ లేదా మ్యాట్‌ రాయాల్సివుంటుంది. ఎంబీఏలో ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, ఐటీ/సిస్టం మేనేజ్‌మెంట్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌... ఇలా చాలా రకాల కోర్సులున్నాయి. పార్ట్‌టైమ్‌ లేదా ఫుల్‌టైమ్‌ కోర్సులూ ఉన్నాయి. ఎక్కడ చదివినా, కేవలం విద్యాసంస్థపై మాత్రమే ఆధారపడకుండా సెల్ఫ్‌లర్నింగ్‌ మోడ్‌లో ప్రస్తుత ఐటీ/సోషల్‌ మీడియా/గూగుల్‌ అలర్ట్స్‌ ద్వారా ఎలా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలో నేర్చుకోండి. ఐటీ/సిస్టమ్‌లో చేసినట్టయితే ప్రాజెక్టు మేనేజర్‌/ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ మేనేజర్‌ లాంటివాటిలో కెరియర్‌ ఉంటుంది.

నేను ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేశాను. నాతో పాటు మా మిత్రులు చాలామందికి ఉద్యోగం ఎందుకో రావడం లేదు. మేం ఏం చేయాలి?

ఏ సబ్జెక్టులో మీకు ఇష్టం బాగా ఉంటుందో దాన్ని ఎంచుకుని ముందుకు సాగండి. మొదటగా సి, సి++, సి#పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. దరఖాస్తును హెచ్‌ఆర్‌కి మాత్రమే పంపి వూరుకోవద్దు. సోషల్‌మీడియా వెబ్‌సైట్స్‌ ద్వారా హైరింగ్‌ మేనేజర్‌ గురించి తెలుసుకుని వారినే సంప్రదించడం మంచిది. ఎక్కడెక్కడ స్టార్ట్‌ అప్‌ కంపెనీలున్నాయో గూగుల్‌ అలర్ట్స్‌, http:/bit.ly/Zgljz8 లాంటి గ్రూపుల ద్వారా తెలుసుకోవచ్చు. బ్లాగ్‌ను రూపొందించుకుని, దానిలో మీ సబ్జెక్టు గురించి రాస్తూ ఆ వెబ్‌లింక్‌ని నియామక సంస్థలకు పంపండి.

బీకామ్‌ (కంప్యూటర్స్‌) చేశాను. ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌లలో ఏది ఎంచుకోవాలి?

కామర్స్‌ సబ్జెక్టుల్లో, బిజినెస్‌ ఇంకా మేనేజ్‌మెంట్‌లో ఇష్టం, పరిణతి ఉంటే ఎంబీఏ ఫైనాన్స్‌ తీసుకోవచ్చు. ప్రోగ్రామింగ్‌పై ఇష్టముంటే ఎంసీఏ లాంటి సాంకేతిక కోర్సులు చేయడం మంచిది. ఇతరుల సలహా ఆధారంగా కాకుండా, మనకు ఆసక్తి ఉన్నదానిలో చేరటమే మంచిది. తరగతుల్లో నేర్చుకున్నవాటిని పరిశ్రమలో ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఎంఎస్సీ అనలిటికల్‌ కెమిస్ట్రీ చేశాను. ఒక కెమికల్‌ ల్యాబ్‌ మొదలెట్టాలని అనుకుంటున్నాను. దీనిపై సలహా ఇవ్వండి.

అనలిటికల్‌ కెమిస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉంది. ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ, ఫూడ్‌ అండ్‌ బెవరేజెస్‌, కంజ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ మానిటరింగ్‌ అండ్‌ కంట్రోల్‌, మెటీరియల్స్‌ డెవలప్‌మెంట్‌, ఆయిల్‌ అండ్‌ పెట్రోలియం టెస్టింగ్‌, ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ, అగ్రికల్చర్‌, మినరాలజీ అండ్‌ జియలాజికల్‌ సైన్సెస్‌, ఓషనోగ్రఫిక్‌ స్టడీస్‌, అట్మాస్ఫియరిక్‌ స్టడీస్‌, ఎనర్జీ స్టడీస్‌, ఫోరెన్సిక్స్‌, స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌, టెక్స్‌టైల్స్‌... ఇలా వివిధ రంగాల్లో కెమిస్టులకు అవకాశాలున్నాయి. మీరు ల్యాబ్‌ మొదలుపెట్టేముందు కెమికల్‌ అనలిస్టుగా కావాల్సిన అంశాలకు http://bit/ly/Z h6KMY వెబ్‌సైట్‌ చూడండి.

బీఎస్సీ (ఎంపీసీ) చేశాక ఐదేళ్ళ నుంచి డేటా అనలిస్టుగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఇంకా ఎదుగుదల ఉండాలంటే ఏం చేయాలి?

ఫైనాన్షియల్‌ ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌ ఆఫ్‌ అల్గోరిత్మిక్‌ ట్రేడింగ్‌లో కోడర్‌కి చాలా గిరాకీ ఉంది. దీనికి సి, సి++, సి#లో నైపుణ్యం పెంచుకోవాలి. ఇంకా పీహెచ్‌పీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి. అల్గోరిత్మిక్‌ ట్రేడింగ్‌పై అవగాహన పెంచుకోవడానికి టీసీఎస్‌ వెబ్‌సైట్‌ http://bit/ly/13YezJhని చూడండి. దాదాపు ఉచితంగా ఆల్గోరిత్మిక్‌ ట్రేడింగ్‌ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి http://bit.ly/16xLIMVవెబ్‌సైట్‌ని అనుసరించండి. గూగుల్‌ అలర్ట్స్‌ ద్వారా దీనికి సంబంధించిన కంపెనీల గురించి తెలుసుకుంటుండండి.

బీఎస్‌సీ (కంప్యూటర్స్‌) తర్వాత మహీంద్రా సత్యంలో చేరాను. ఇప్పుడు ఉన్నత విద్యాభ్యాసం చేయదలిచాను. ఎంసీఏ లేదా ఎంబీఏ... ఏది చేయాలో సూచించగలరు.

మీరు దేనిగురించి పైచదువులు చదవాలనుకుంటున్నారో ముందుగా స్పష్టత తెచ్చుకోండి. మీ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అయితే ఎంసీఏ; బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ గురించి అయితే ఎంబీఏ లాంటి కోర్సులూ చేయొచ్చు. ఎంసీఏ లేదా ఎంబీఏ- ఏది చేసినా ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్టుల రూపంలో పరిశ్రమలకు వెళ్ళి ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఇదివరకే ఐటీ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీరు ఎంబీఏ-ఐటీ లాంటి చదువులకు వెళ్ళటం సబబు. కేవలం సర్టిఫికెట్‌ కోసమే అయితే ఎలాంటి చదువులయినా వృథానే. ఎంబీఏ కోసం CAT లో అర్హత సాధించి ఐఐఎం, జేవియర్‌, ఎస్పీ జైన్‌ లాంటి కళాశాలల్లో చేరటం మంచిది.

C

నెట్‌వర్కింగ్‌పై ఇంటర్న్‌షిప్‌ను తక్కువ ఖర్చుతో చేయడానికి అవకాశం కల్పించే సంస్థల గురించి తెలియజేయండి.

ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా మీ పరిజ్ఞానాన్ని పంచి ఇతరులకు సాయపడేలా ఉండాలంటే ఖాన్‌ అకాడమీ వారితో జాయినవ్వొచ్చు. నెట్‌వర్కింగ్‌పై కన్వర్జెంట్‌, బెంగళూర్‌ వారు ఇంటర్న్‌షిప్‌ సదుపాయం కల్పిస్తున్నారు. career@convergentindia.com కు ఈ-మెయిల్‌ ద్వారా మీ దరఖాస్తు పంపించవచ్చు.

ఇంగ్లిష్‌, హిందీ భాషలో కమ్యూనికేషన్‌ మెరుగుపరుచుకోవాలంటే ఏమి చేయాలి?

కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌/హిందీ ఒకటి కాదన్నది తెలిసిందే కదా? మాతృభాషలో ఆలోచిస్తూ ఇంగ్లిష్‌, లేదా వేరే ఇతర భాషల్లో మాట్లాడటం కష్టతరం. మీరు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అవకుండా కూడా స్వతహాగా కూడా వీటిలో ప్రావీణ్యం సంపాదించొచ్చు. మొదట మీ మాతృ భాషలో ఏదో ఒక విషయంపై మాట్లాడటం, రాయడం అలవాటు చేసుకోండి. మాట్లాడినది వాయిస్‌/వీడియో రికార్డు చేసి దాన్ని మీకు మీరుగా పరీక్షించుకోండి. ఇలా పదే పదే చేస్తూ ఉంటే ప్రతిసారీ మీలో మార్పును గ్రహించవచ్చు.
మాతృభాషలో అయిన తర్వాత ఇంగ్లిష్‌లో లేదా హిందీలో కూడా ఇలాగే సాధన చేస్తూ ఉండండి. రోజు బిజినెస్‌న్యూస్‌ పేపర్‌ చదవండి. మీకు నచ్చినదానిపై రెండు మూడు పేరాగ్రాఫ్‌లు రాయడం అలవాటు చేసుకోండి. టోస్ట్‌ మాస్టర్‌ (http://www.meetup.com/hyderabadtoastmasters/)లో లేదా మీ ప్రాంతంలో ఉండే లోకల్‌ టోస్ట్‌మాస్టర్‌ క్లబ్‌లో జాయిన్‌ అయ్యి, మీ పబ్లిక్‌ స్పీకింగ్‌ను మెరుగుపర్చుకోండి.

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంహెచ్‌ఆర్‌ఎం చదువుతున్నాను. దీనికి ముందు బీబీఎంలో 67 శాతం ఉత్తీర్ణత సాధించాను. ఈ హెచ్‌ఆర్‌లో ఉపయోగపడే పుస్తకాలూ,కోర్సులూసూచించండి.

ప్రాజెక్టు చేయడానికి చిన్న కంపెనీ అయినా సరే కానీ, మంచిది ఎంచుకొని ఇష్టంతో చేయండి. కెరియర్‌ ఆరంభించిన కొత్తలో నియామకం, శిక్షణ, సమయ నిర్వహణ, పే రోల్‌ నిర్వహణ... ఇలా హెచ్‌ఆర్‌కు సంబంధించిన వివిధ అంశాల్లో అవగాహనతో రెండుమూడేళ్ల అనుభవం తెచ్చుకోండి. దాని తర్వాత అందులోంచి మీకు నచ్చినదానిని ఎంచుకొని ముందుకు సాగండి. లేదంటే Jack of all trades, but Master of none మాదిరి అవుతుంది. మార్పు తీసుకొస్తూ దానికి తగ్గట్టుగా కంపెనీలో గైడ్‌ చేయాల్సిన బాధ్యత హెచ్‌ఆర్‌ వాళ్లదే. లేదంటే నాయకుల్లా కాకుండా కేవలం మేనేజ్‌ చేసే వాళ్లు అవుతారు. http://www.asktheheadhunter.comలోకి వెళ్లి వీక్లీ న్యూస్‌లెటర్‌ కోసం సబ్‌స్క్రైబ్‌ చేయండి.
Success Principles by Jack Canfield; Eat That Frog by Brain Tracy; First, Break All the Rules: What the World's Greatest Managers Do Differently by Marcus Buckingham; The Present by Dr. Spencer Johnson ఇలాంటి పుస్తకాలూ, http://www.ted.com/లో ఉచితంగా లభ్యమయ్యే వీడియోలూ మీ కెరియర్‌కి చాలా ఉపయోగపడతాయి.

ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాను. సాఫ్ట్‌వేర్‌ ప్రోగామర్‌ లేదా డెవలపర్‌ కావాలని ఉంది. తగిన సలహా ఇవ్వగలరు.

కేవలం క్లాసు సిలబస్‌ కాకుండా కెరియర్‌ గురించి ఇప్పటినుంచే ఆలోచించడం అభినందనీయం. ఇప్పటినుంచి సి, సి++, సి# లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలలో పరిజ్ఞానం పెంచుకుంటూ వెళ్లండి. దానికి మీరు ఇంజినీరింగ్‌ లేదా పీజీలు చేయనక్కర్లేదు. బ్లాగు రాయడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకు http://bit.ly/ZySs9Nలింక్‌ చూసినట్లయితే మీరు సి, సి++, సి# వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లలో చాలా విషయాలు గ్రహించొచ్చు. వాటిపై మీ స్పందనలను బ్లాగులో రాస్తూ ఇతరులతో పంచుకోండి.

ఎంఎస్‌సీ (ఎలక్ట్రానిక్స్‌) ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ చదువుతున్నాను. దీనికి సంబంధించిన ఉద్యోగం సంపాదించడానికి ఇంకా వేరే ఏదైనా కోర్సు చేయాలా?

మీరు సీ, సీ ++, లినక్స్‌లలో మీ నైపుణ్యాలను పెంచుకోండి. http://www.embedded.com/, http://free-electrons.com/ వెబ్‌సైట్లలో వివిధ రకాల శిక్షణ మెటీరియల్‌ ఉచితంగా లభ్యమవుతుంది.