ఇంజినీరింగ్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ మెళకువలు

ఇంజినీరింగ్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియలో హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ కీలకం. అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికవడం.. అవ్వకపోవడం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ మౌఖిక పరీక్షలో కొన్ని తికమక పెట్టే ప్రశ్నలు ఎదురుకావొచ్చు. వాటిని సమయస్ఫూర్తితో ఎలా ఎదుర్కోవాలో చూద్దాం!

అభ్యర్థులు తన కల నిజం చేసుకోవడానికి చివరి అంచె అయిన హెచ్‌ఆర్‌ మౌఖిక పరీక్షలో ప్రతిభను గరిష్ఠంగా ప్రదర్శించాల్సివుంటుంది. రాతపరీక్ష, టెక్నికల్‌ రౌండ్‌, బృందచర్చ/ ప్రెజెంటేషన్‌ దశలను సమర్థంగా పూర్తిచేసిన తరువాత వచ్చే ఈ హెచ్‌ఆర్‌ రౌండ్‌ కొంత ఉత్కంఠ, ఆందోళనలను కలిగిస్తుంది. అయితే దీన్ని ఎదుర్కొనేటపుడు సమతుల్యమైన ఆలోచనతోపాటు ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, పకడ్బందీ ప్రణాళిక, శ్రద్ధతోకూడిన తయారీ, సరైన వైఖరి... ఈ మౌఖిక పరీక్షలో నెగ్గేలా చేస్తాయి.

కొన్ని నమూనా ప్రశ్నలు

హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థి భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం, అభిరుచి, ఆత్మవిశ్వాసం, సంస్థ అవసరాలకు అనుగుణంగా ఉండడం వంటి అంశాలపై దృష్టిసారిస్తారు.

* How long you commit to work with us?
జవాబు: అభ్యర్థులు జీవితాంతం ఇదే కంపెనీలో చేస్తానని అబద్ధం చెప్పడమో.. లేదా కొంతకాలం చేసిన తరువాత పై చదువులకు విదేశాలకు వెళ్తాననో.. 2-3 సంవత్సరాలు చేసిన తరువాత వేరే సంస్థకు వెళ్తానని నిజం చెప్పడమో చేస్తారు. కానీ ఇలా కాకుండా.. కొత్త సవాళ్లు, వృత్తినైపుణ్యం పెంపొందించే సంస్థలో పనిచేయడం వల్ల కలిగే ఆనందం గురించి చెప్పడం మంచిది. ఇవి అభ్యర్థిలోని పురోగతి, వృత్తిపరమైన విలువలను తెలియజేస్తాయి. ఫలితంగా ఇంటర్వ్యూ చేసేవారు అభ్యర్థి సరైన వృత్తికోసం చూస్తున్నాడనీ, ఆసక్తికలవాడనీ, సంస్థకు ఉపయోగపడడంతోపాటు వ్యక్తిగతంగా ముందుకు సాగగలడనీ భావిస్తారు.

* What is your expected salary?
జ: సాధారణంగా అభ్యర్థి నిర్దిష్ట సంఖ్యను చెబుతారు, ఎంత జీతం ఇచ్చినా చేస్తామనే సూచననూ నేరుగా తెలియజేస్తారు. లేదా ఆశించిన జీతానికి తక్కువ తీసుకోవడానికీ ఒప్పుకోరు. కానీ తటస్థ వైఖరిని అవలంబిస్తూ.. సామర్థ్యం, కృషి ఆధారంగా ఇవ్వగలిగిన జీతాన్ని ఆశిస్తున్నానని పరోక్షంగా సూచన ఇవ్వడం సమంజసం.

* Describe your life as a 'news headline'.
జ: ప్రశ్నతీరును చూసి తికమక పడకండి. ఇది 'మీ గురించి చెప్పండి' అనే ప్రశ్నకు సూచన. చాలామంది తమ పాఠశాల, కళాశాల, కుటుంబం గురించి మాట్లాడి వదిలేస్తారు. కానీ ఈ ప్రశ్నను భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, విద్యా సంబంధ పరిచయం, బలాలతోపాటు అభ్యర్థి కెరియర్‌ లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళిక ఇతరులతో పోల్చితే ఎలా భిన్నంగా ఉన్నాయో తెలుసుకోవడానికి వేస్తారు.

* Do you consider yourself a suitable candidate for this position?
జ: అభ్యర్థి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆ పోస్టుకు కావాల్సిన నైపుణ్యాలు, అవసరాలను తెలుసుకుని ఉండాలి. సమాధానంలో ఆ రంగానికి సంబంధించిన అంశాలపై అవగాహన ప్రతిఫలించాలి.

* What do you know about us?
జ: దీనికి కొంత పరిశోధన అవసరం. సంస్థ మైలురాళ్లు, ముఖ్యమైన వ్యక్తులు, వృత్తిపరంగా పురోగతి, వృద్ధి చెందుతున్న సాంకేతికత, భవిష్యత్తు అవకాశాలపై సమాచారం సేకరించి చెప్పాల్సివుంటుంది.

* Tell us some of your strengths.
జ: సంస్థలో మీ హోదాకు సరిపోయే లక్ష్యనిర్దేశం, సమయపాలన, సానుకూల దృక్పథం, సాంకేతిక నైపుణ్యాలు వంటి బలాలను గురించి చెప్పాలి. ఆదర్శ మూర్తులు, స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, వారిలోని లక్షణాలు మీ వ్యక్తిగత, విద్యాస్థాయుల్లో ఎలా ఉపయోగపడ్డాయో చెప్పవచ్చు.

* Tell us some of your weaknesses.
జ: రెజ్యుమెలో ప్రస్తావించే బలహీనత మీపై సానుకూల దృక్పథం ఏర్పడేలా ఉండాలి. ఎలా అంటే.. నైపుణ్యం ఉన్న వ్యక్తులతో పరిచయాలు, అనుకున్న సమయంలో పని పూర్తి చేయడం, ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోతే అశాంతిగా భావించడం మొదలైనవి మీ సమాధానాలుగా ఉండాలి.

* Can you work for longer hours?
జ: ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి అభ్యర్థి గంటల తరబడి పనిచేయలేననో.. చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అనే అభిప్రాయాన్ని కలిగించకూడదు. పరిస్థితి, పని, అవసరమైన సందర్భాల్లో తప్పకుండా అందుబాటులో ఉంటానని చెప్పాలి.

* Discuss the most stressful situations you came across?
జ: ఈ ప్రశ్న మీ మానసిక సంతులనాన్ని పరిశీలించడానికి అడుగుతారు. మీకెపుడూ అలాంటి సందర్భం రాలేదని చెప్పకండి. పరీక్షలు, తోటివారి నుంచి ఎదుర్కొన్న ఒత్తిడి, దాన్ని మీరు అధిగమించిన విధానాన్ని ఎంచుకుని చెప్పండి.

* Why should we hire you?
జ: ఇతరుల నుంచి మిమ్మల్ని వేరుచేసే మీలోని నైపుణ్యాలను గురించి చెప్పండి. మీ బలాలు, సాధించిన విజయాలు, సాంకేతిక పోటీతత్వం, ఆలోచనల్లో స్పష్టత... మిమ్మల్ని సంస్థలో నియమించుకునేలా చేస్తాయి.

* Are you willing to relocate/ travel?
జ: కుటుంబానికి దూరంగా ఉండడం, కొత్త వాతావరణాన్ని అలవాటు చేసుకోవడం, స్థల మార్పు వంటివి దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ప్రతికూలంగా స్పందిస్తారు. కానీ ఈ ప్రశ్నకు ఎల్లప్పుడూ చెప్పాల్సిన సమాధానం 'సరే' అనేదే. ఈ ప్రపంచీకరణ యుగంలో వ్యక్తిగత సరిహద్దులు పెట్టుకోకూడదు.

* Where do you see yourself after 5 years?
జ: పై చదువులకు విదేశాలకు వెళ్తాననో, వేరే సంస్థలోకి వెళతాననో అభిప్రాయాన్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి కలిగించకండి. దీర్ఘకాలం నిబద్ధతతో పనిచేసే ఉద్దేశం కనబరచాలి. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల వంటివాటిని లక్ష్యం చేసుకుంటున్నానని చెప్పటం ఇంటర్వ్యూ చేసేవ్యక్తిని ఆకట్టుకుంటాయి.

* If you are in a position to offer a seat in your car (only one seat is availble)- to an old woman who needs emergency hospital visit, an old friend who saved your life earlier and a beautiful lady who has all the qualities to become your wife, who would you allow to travel along with you?
జ: ప్రశ్నకు ఒక విద్యార్థి.. స్నేహితుడికి కారు తాళాలు ఇచ్చి, మార్గమధ్యంలో వృద్ధ మహిళను ఆస్పత్రి దింపమని చెప్పి, తాను ఆ అమ్మాయిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తానని సమాధానమిచ్చాడు.

* Tell something negative you have heard about your college?
జ: ఈ ప్రశ్న అభ్యర్థిని పక్కదారి పట్టించడానికి అడుగుతారు. కళాశాల, అందులోని వ్యక్తులపై వ్యతిరేక వ్యాఖ్యలు మంచిది కాదు. సానుకూలంగా స్పందించండి.

ముగింపు: ఏ మౌఖిక పరీక్ష అయినా ఎంతోకొంత నేర్చుకునే అవకాశమిచ్చేదే. ఎంపికైతే మీ అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటూ, వారూ విజయం సాధించేలా కృషి చేయండి. ఒకవేళ విఫలమైతే.. దానికి కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరో సవాలు కోసం తయారవండి.