ఈ - ముఖాముఖి ఎదుర్కోవడమెలా!

నేను గతకొన్ని రోజులుగా ఉద్యోగ అన్వేషణలో ఉన్నాను. అయితే ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూలన్నీ వీడియో కాన్ఫరెన్సులూ, స్కైప్‌ ద్వారా జరుగు తున్నాయి. నేనింతవరకూ టెలిఫోన్‌ ఇంటర్వ్యూలే మాట్లాడా. ఇప్పుడు స్కైప్‌ ఇంటర్వ్యూకి హాజరవ్వాలంటే నేను ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

గతంలో ఇంటర్వ్యూ తేదీ ముందే చెప్పడం నేరుగా ముఖాముఖి మాట్లాడటం వంటి పద్ధతులు ఉండేవి. కానీ ఇప్పుడది నెమ్మదిగా మారుతోంది. మిమ్మల్ని నేరుగా కలవడానికి ముందే స్కైప్‌లో అభ్యర్థులతో మాట్లాడి ఒక అంచనాకి వస్తున్నాయి సంస్థలు. హార్వర్డ్‌ లా స్కూల్‌ వంటివి అభ్యర్థుల దూరాభారాలను దృష్టిలో పెట్టుకొని ఈ పద్ధతిలోనే ప్రాథమిక వడపోతలు చేసేస్తున్నాయి.

ముఖాముఖీ కంటే సాంకేతికతను వాడుకొని హాజరయ్యే ఈ ఇంటర్వ్యూలకు మరింత ఎక్కువగా సన్నద్ధమవ్వాలి. ఎందుకంటే.. ముందు స్కైప్‌ కనెక్షన్‌ సరిగా ఉందో లేదో పరీక్షించుకోవాలి. ఐదునిమిషాల ముందు చూసుకొని వాల్యూమ్‌ తగినంత లేదని బాధపడి లాభం లేదు. అలాగే మీ చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉందో చూసుకోవాలి. మంచి వెలుతురూ, వెనక బ్యాక్‌గ్రౌండ్‌ బాగుండాలి. మీరెలా కనిపిస్తారనేది ఓ సారి ముందే ట్రయల్‌ వెయ్యాలి. మీ వెనుక కానీ కిటికీలు ఉంటే ఆ వెలుతురు కారణంగా మీ ముఖం అవతలి వారికి కనిపించదు. మీ రూపం వారికి నల్లగా కనిపిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయానికి మీ ఫోన్‌ రింగవ్వడం కానీ, ఇతర ఫోన్‌ల నుంచి రింగ్‌టోన్లుగా రావడం.. మీకు ఇబ్బందిగా మారడం లాంటివి జరగకుండా జాగ్రత్త పడాలి. అలాగే మధ్యలో ఎవరో వచ్చి వెళ్లడం, మిమ్మల్ని పలకరించడం వంటివి ఉండకూడదు. ఆ సమయంలో మీముఖం ఎలా ఉంది అని మీరు మీవైపు చూసుకొంటూ పరీక్షించుకోవడం కాదు.

ఇంటర్వ్యూ చేసేవారివైపు చూడాల్సి ఉంటుంది. నేను నేరుగా హాజరు కాలేదు కాబట్టి, నా వస్త్రధారణ బాగోకపోయినా ఏం కాదు అని మాత్రం అనుకోవద్దు. ముఖాముఖి అప్పుడు ఎటువంటి వస్త్రధారణ ఉంటుందో ఇక్కడా అదే జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది వీడియో ఛాట్‌ జరిగేటప్పుడు కెమెరా వైపు కాకుండా కంప్యూటర్‌ స్క్రీన్‌వైపు చూస్తుంటారు. అది మంచి పద్ధతికాదు. కెమెరావైపు చూడ్డం వల్ల ఎవరితోనో కాకుండా అవతలి వ్యక్తితో నేరుగా మాట్లాడినట్టు ఉంటుంది. మీ ప్రతి కదలికా చాలా సహజంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అలాగే వీడియోలో నేను ఎలా కనిపిస్తున్నానో, ఎలా వినిపిస్తున్నానో అనే భావన మీలో ఉంటే కనుక మీరే మాత్రం ఇబ్బందిపడ్డా అవతలి వ్యక్తికి స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే మధ్యలో నవ్వుతూ మాట్లాడుతూ ఆ భావనని దూరం చేయండి.