National Talent Search Examination (NTSC)

తొలి పోటీ... నెగ్గితే ధీమా, ఆసరా!

మెరుగైన ర్యాంకులతో వృత్తివిద్యల్లో ప్రవేశించటానికీ, వాటిలో బాగా రాణించటానికీ పటిష్ఠమైన పునాది అవసరం. ఈ దిశలో ఉపయోగపడే పరీక్ష- నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎస్‌ఈ). దీని ప్రత్యేకత, సన్నద్ధతల గురించి తెలుసుకుందాం! విద్యార్థి జీవితంలో ఎదుర్కొనే తొలి పోటీపరీక్షగా ఎన్‌టీఎస్‌ఈని చెప్పుకోవచ్చు. దీనిలో నెగ్గినవారికి ఇంటర్మీడియట్‌ నుంచి డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌, డాక్టరేట్‌ వరకూ ప్రతినెలా ఉపకార వేతనం లభిస్తుంది. ఈ పరీక్షలో నెగ్గినవారి ఆత్మవిశ్వాసం వేరుగా ఉంటుంది. వీరు మొదటి నుంచీ బట్టీవిధానం కాకుండా ప్రాథమిక అంశాలపై పట్టు ఏర్పరచుకునేలా తయారవుతున్నారు. అందుకే జాతీయస్థాయి పోటీపరీక్షలైన కేవీపీవై, జేఈఈ- మెయిన్స్‌, జేఈఈ- అడ్వాన్స్‌డ్‌, మెడికల్‌, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లోనూ నూరుశాతం విజయం సాధిస్తున్నారు. ఎన్‌టీఎస్‌ఈని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) నిర్వహిస్తుంది. ఇది రెండు స్థాయిల్లో ఉంటుంది. ప్రథమస్థాయి పరీక్ష రాష్ట్రప్రభుత్వం (డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌) ఆధ్వర్యంలో, రెండోస్థాయి పరీక్ష ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహిస్తాయి. ఈ రెండు స్థాయుల్లో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్మీడియట్‌లో నెలకు రూ.1250, డిగ్రీ/ పీజీలో ఇంకా ఇంజినీరింగ్‌, మెడికల్‌ లాంటి కోర్సుల్లో నెలకు రూ.2000, పీహెచ్‌డీ చేసేటపుడు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా నెలవారీ ఉపకారవేతనం (స్కాలర్‌షిప్‌) ఉంటుంది. ప్రతి సంవత్సరం వెయ్యిమందికి వీటిని అందజేస్తారు.
మొత్తం ఉపకార వేతనం ఇచ్చే విద్యార్థుల్లో 15% ఎస్‌సీ, 7.5% ఎస్‌టీ విద్యార్థులకు, 3% వికలాంగులకు రిజర్వేషన్‌ కల్పిస్తారు. ఈ విద్యార్థులకు అర్హత మార్కు కూడా 35%గా లెక్కిస్తారు.

బోధన తీరుకు కొలమానం
ఇంటర్మీడియట్‌ కళాశాలల ప్రాముఖ్యం ఇంటర్‌ మార్కులతోపాటు జేఈఈ, ఎన్‌ఐటీ, మెడికల్‌, సీపీటీ, క్లాట్‌ లాంటి పోటీపరీక్షల్లో తెచ్చుకున్న సీట్ల ప్రాతిపదికగా లెక్కిస్తారు. అలాగే ఒక పాఠశాల ప్రాముఖ్యం ఎన్‌టీఎస్‌ఈలో ఎంతమంది స్కాలర్‌షిప్‌ సాధించుకోగలిగారో అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువమంది ఎంపికయ్యారంటే అక్కడ అన్ని సబ్జెక్టులకూ సమప్రాధాన్యం ఇచ్చి ప్రాథమిక అంశాల నుంచి విద్యార్థిలో సృజనాత్మకతను వెలికితీసే దిశలో బోధన జరుగుతోందని అర్థం.
ఈ పరీక్ష 1963 నుంచి జరుగుతున్నప్పటికీ దీని గురించిన అవగాహన పెద్దగా ఉండేది కాదు. గతంలో 8వతరగతి విద్యార్థులకు నిర్వహించటం దీనికో కారణం. కానీ రెండు సంవత్సరాలుగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహించడం వల్ల ప్రాముఖ్యం బాగా పెరుగుతోంది. పరీక్షలో విద్యార్థి ప్రతిభను పూర్తిగా వెలికి తీయడానికి ఈ పరీక్ష రెండు స్థాయుల్లో జరుగుతుంది.

సబ్జెక్టులన్నిటికీ ప్రాధాన్యం
పాఠశాల స్థాయిలో ఐఐటీ ఫౌండేషన్‌ చదవడం కంటే ఎన్‌టీఎస్‌ఈకు తయారుకావడం మేలవుతుంది. ఐఐటీ ఫౌండేషన్‌ విద్యార్థి కేవలం మేథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ అంటే తనకు ఉన్న మొత్తం ఆరు సబ్జెక్టుల్లో కేవలం 1 1/2 సబ్జెక్టుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి చదవడం వల్ల మిగిలినవాటిపై పట్టు కోల్పోతున్నారు. విద్యార్థిలో సంపూర్ణ వికాసం రావాలంటే అన్ని సబ్జెక్టులకూ సమప్రాధాన్యమిచ్చి చదవాలి. అది ఎన్‌టీఎస్‌ఈతో వీలవుతుంది. దీనిలో ర్యాంకు సాధించిన విద్యార్థి కచ్చితంగా ఏ పోటీ పరీక్షలో అయినా సీటు సాధించగలడు.
ఎన్‌టీఎస్‌ఈలో కొందరు మెరుగ్గా ప్రతిభ చూపించలేకపోవటానికి కారణం కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమై పోవడం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నెలలూ బాగా చదవడానికి ప్రయత్నిస్తే నవంబర్‌ 8న జరిగే పరీక్షలో విజయం సాధ్యమవుతుంది. ఆ పరీక్షలో నెగ్గితే పూర్తి ఆత్మవిశ్వాసంతో జీవితంలో జరిగే ప్రతి పోటీలోనూ విజయం సాధ్యమే!

ముఖ్యమైన తేదీలు
స్టేజ్‌-1
1. నిర్ణీత చలానాతో స్కూలు ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు అందజేయాల్సిన ఆఖరు తేదీ: 1.9.2015
2. స్కూలు నుంచి నింపిన దరఖాస్తు డీఈఓకు చేరవలసిన ఆఖరుతేదీ: 3.9.2015
3. నామినల్‌ రోల్స్‌, చలానాలు, దరఖాస్తులను డీఈవో వద్ద నుంచి డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌కు చేరవలసిన ఆఖరుతేదీ: 8.9.2015
4. పరీక్ష తేదీ: 8 నవంబర్‌, 2015
స్టేజ్‌-2
5. పరీక్ష తేదీ: 8 మే, 2016
http://bseap.org/Applicationforms.aspx

మ్యాట్‌... శాట్‌
స్టేజ్‌-1: దీనిలో మూడు భాగాలు. మ్యాట్‌ (మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌), ఎల్‌టీ (లాంగ్వేజ్‌ టెస్ట్‌), శాట్‌ (స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌).
మూడు గంటల వ్యవధిలో జరిగే ఈ పరీక్షలో ప్రతి సరైన జవాబుకీ ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. వీటిలో లాంగ్వేజ్‌ టెస్ట్‌లో 40 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. గతంలో ఈ మార్కులకు ప్రాధాన్యం ఉండేది. అయితే ఇప్పుడు వీటిలో 40% మార్కులు (40కి 16) వస్తేనే ర్యాంకు ఇస్తారు. 16 మార్కులపైన ఎన్ని మార్కులు వచ్చినా పరిగణనలోకి తీసుకోరు. తుది ర్యాంకు నిర్ధారణకు కేవలం మ్యాట్‌, శాట్‌ల ఉమ్మడి మార్కులనే ప్రాతిపదికగా తీసుకుంటారు. మిగిలిన 140 మార్కులనే ప్రాధాన్య మార్కులుగా పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు.
లాంగ్వేజ్‌ పరీక్ష ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడింటిలో ఉంటుంది. వాటిలో విద్యార్థి 20 మార్కులకు పైన వస్తాయని అనుకున్నపుడు- రాని ప్రశ్నలపై సమయం వృథా చేసుకోకుండా మిగిలినవాటికి ఆ కాలాన్ని కేటాయించుకోగలిగితే మంచిది. మిగిలినవాటిల్లో మ్యాట్‌ అంటే రీజనింగ్‌ ప్రశ్నలని చెప్పవచ్చు. 9, 10 తరగతుల్లో వీటిపై పాఠ్యాంశాల్లో ఏమీలేదు. కాబట్టి కొంత ఇబ్బంది పడవచ్చు. అయితే సీబీఎస్‌ఈ విద్యార్థులకు సులభమే. రాష్ట్ర సిలబస్‌లోని విద్యార్థులు మ్యాట్‌కు కొంత ప్రాధాన్యమిచ్చి అభ్యాసం, పునశ్చరణ చేసుకోవాలి.
140 మార్కులకు 130 వరకు సాధించుకోవాలి. అందుకని మ్యాట్‌లో వీలైనంతవరకూ 45 మార్కులపైనే వచ్చేలా అభ్యాసం చేయాలి. ఇక మిగిలిన 90 మార్కులకు జరిగే శాట్‌లో మేథమేటిక్స్‌ 20 ప్రశ్నలు, సైన్స్‌ 35 ప్రశ్నలు, సోషల్‌ 35 ప్రశ్నలుంటాయి. సైన్స్‌లోని 35 ప్రశ్నల్లో భౌతికశాస్త్రం నుంచి 12, రసాయనశాస్త్రం నుంచి 11, బయాలజీ నుంచి 12 ప్రశ్నలు ఇస్తున్నారు. సోషల్‌లోని 35 ప్రశ్నల్లో చరిత్ర నుంచి 10, జాగ్రఫీ నుంచి 10, పొలిటికల్‌ సైన్స్‌ నుంచి 10, ఎకనామిక్స్‌ నుంచి 5 ప్రశ్నలు ఇస్తున్నారు.
2014 నవంబర్‌లో జరిగిన పరీక్షను మేథమేటిక్స్‌, సోషల్‌ విద్యార్థులు కొద్దిగా కష్టంగా భావించారు. నిడివిగా ఉన్న ప్రశ్నలు మ్యాథ్స్‌లో వచ్చాయి. అంటే కేవలం ప్రశ్న జవాబు రూపంలో కాకుండా విశ్లేషణతో కూడి చదువుకోవడం ప్రారంభిస్తే జవాబులు సులభంగా రాబట్టడానికి అవకాశం ఉంటుంది.


Posted on 17.8.2015