బాలకార్మిక వ్యవస్థ

విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన తర్వాత బాల కార్మిక వ్యవస్థ ఏ రూపంలోనూ ఉండటానికి వీల్లేదు. ఆర్థిక కారణాల వల్ల ఏ బిడ్డా బడి వెలుపల ఉండరాదని విద్యా హక్కు చట్టం స్పష్టం చేస్తోంది. మధ్యలో బడి మానేయకూడదు. అంటే ఏ రూపంలోనైనా బాల కార్మిక వ్యవస్థకు అవకాశం లేదు. అందుకే బాల కార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టాన్ని తక్షణం సవరించి 'నియంత్రణ అనే పదాన్ని తీసివేయాలి. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారతదేశంలో ఇళ్లల్లో పనిచేసే బాలకార్మికుల సంఖ్య పెరుగుతోందని జాతీయ బాలల హక్కుల కమిషన్ జరిపిన తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.
అందుకే అన్ని రకాల బాలకార్మిక వ్యవస్థలు చట్టం పరిధిలోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రమాదకర పరిస్థితుల్లో ఉండే బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తోంది. ఇతర రంగాల్లోని బాలకార్మిక వ్యవస్థనూ నియంత్రించాలని చెబుతోంది. కానీ, విద్యా హక్కు చట్టం వచ్చాక ఈ తేడాను చూపడానికి కూడా వీల్లేదు.

అంచనాలు

2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 25.2 కోట్ల మంది పిల్లలున్నారు. వీరిలో సుమారు 1.26 కోట్లమంది బాలకార్మికులు. అసంఘటిత రంగంలో బాల కార్మికుల సంఖ్య పెరుగుతోంది. ఉదాహరణకు ఇళ్లలో పనిచేసే బాలలు. వాస్తవానికి అనేక సందర్భాల్లో బాలకార్మిక వ్యవస్థ ప్రభుత్వ లెక్కల్లోకి రాదని కూడా జాతీయ బాలల హక్కుల కమిషన్ పేర్కొంటోంది.
యునిసెఫ్ ప్రకారం దాదాపు సగంమంది; ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం సుమారు 43 శాతం మంది బాలబాలికలు ఎనిమిదో తరగతిలోపే బడి మానేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల్లో ఇది 55% షెడ్యూల్డ్ తెగల్లో 63% దాకా ఉందని అంచనా. బడి మానేసిన ప్రతి పిల్లవాడూ అనివార్యంగా బాలకార్మికుడిగానే జీవిస్తున్నాడని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఫలితంగా బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. 2005 నాటికి జాతీయ బాలల కార్యాచరణలో భాగంగా బాల కార్మిక వ్యవస్థ నిషేధంతోపాటు బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఈ లక్ష్య సాధనలో విఫలమయ్యాం. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అందమైన బాల్యాన్ని లేకుండా చేయడం అతి పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన.

విద్యాహక్కు చట్టం

బాలకార్మిక వ్యవస్థను రద్దు చేయాలన్నా లేదా బాల్యవివాహాలను పూర్తిగా నిషేధించాలన్నా ముందు జరగాల్సింది సార్వత్రిక ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడం. అందుకే విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. చట్టం అమల్లో భాగంగా బడి బయట ఉన్న పిల్లలను, మధ్యలో మానేసిన వారిని తిరిగి బడిలో చేర్పించడం సవాలుగా మారింది. విద్యా హక్కు చట్టం హామీ ఇచ్చినవిధంగా వీరందరికీ వాళ్ల వయసుకు తగిన తరగతిలో చేర్పించి విద్యనందించడమూ ఒక సవాలే. మధ్యలో బడిమానేయకుండా చూడటానికి ఎనిమిదో తరగతి వరకూ పిల్లలకు డిటెన్షన్ పద్ధతి ఉండకూడదని; వీరిని సమగ్ర, నిరంతర మూల్యాంకన పద్ధతి ద్వారా పరీక్షించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. నాణ్యమైన విద్యనందించడం ద్వారా ప్రతి ఒక్కరూ అవసరమైన స్థాయిలో చదువు నేర్చుకుని, తర్వాతి తరగతిలోకి ప్రవేశించగలిగేలా చేయాల్సిన బాధ్యత పాఠశాలపై ఉంటుందనీ చట్టం పేర్కొంటోంది. బాలలు బాలకార్మికులుగా మారకుండా చేసేందుకు విద్కాహక్కు చట్టంలో అనేక ఇతర నిబంధనలూ ఉన్నాయి. ఉదాహరణకు ఒకపూట బడి ఉండకుండా ఏటా తప్పనిసరిగా బడి నడవాల్సిన రోజులను, రోజూ బడి నడపాల్సిన సమయాన్ని చట్టం నిర్దేశిస్తోంది. విద్యా సంవత్సరంలో ఏ సమయంలో వచ్చినా తగిన తరగతిలో చేర్చుకోవాలి. అవసరమైన అదనపు శిక్షణ ఇవ్వాలి. దండన లేని బోధన అందించాలి. బడిలో ఉండాల్సిన పిల్లలు అందులో చేరకపోవడానికి, మధ్యలో బడి మానేసి బయట ఉండటానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయని వివిధ అధ్యయనాల ద్వారా తెలిసింది. అవి: తల్లిదండ్రుల పేదరికం, సామాజిక వెనకబాటుతనం; పిల్లలకు అనుకూలంగా లేని బోధనాంశాలు, బోధనా ప్రణాళిక.

చట్టపరమైన రక్షణ

భారత రాజ్యాంగంలోని 24, 39, 45వ అధికరణలు పిల్లలకు శ్రమ దోపిడీ నుంచే కాకుండా ఇతర రక్షణలనూ కల్పిస్తున్నాయి. వయసుకు తగని ఆర్థిక కార్యకలాపాలు, వృత్తుల్లో పని చేయకుండా భారత రాజ్యాంగం పిల్లలకు రక్షణ కల్పిస్తోంది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి భారత ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మొదటిది: బాల కార్మిక చట్టాల అమలు; రెండోది: బాలల సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన, అమలు; మూడోది: బాల కార్మిక వ్యవస్థ అధికంగా ఉన్న ప్రదేశాలు, రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా పథకాలను అమలు చేయడం. 1986లో చేసిన బాల కార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం నోటిఫై చేసిన ప్రమాదకర వృత్తుల్లో బాలకార్మికులుండటాన్ని నిషేధిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు.

ఈ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ఆయా రంగాల్లో బాలకార్మిక వ్యవస్థను నిషేధించింది. అవి: తివాచీల తయారీ, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, పలకల తయారీ, క్వారీలు. 2010లో సర్కస్‌లలో, ఏనుగుల సంరక్షణలో కూడా బాలకార్మిక వ్యవస్థను నిషేధించారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుమును విధించడానికి సెక్షన్ 14 వీలు కల్పిస్తోంది. దీంట్లో జైలుశిక్ష విధించడానికి నిబంధనలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ చట్టం అమలు బాధ్యత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, వాటి పాలనా యంత్రాంగాలపైనే ఉంది. అవి ఈ చట్టం అమలుపై నివేదికలను సమర్పించాలి.
2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 5 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 1.26 కోట్లమంది బాలబాలికలు ఆర్థిక కార్యకలాపాల్లో ఉన్నారు. అంటే బాలకార్మికులుగా ఉన్నారు. వీరిలో 12 లక్షలమంది ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు. చట్టం నిషేధించిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 2004-05లో జాతీయ నమూనా సర్వే అంచనా ప్రకారం దేశంలో 89 లక్షల మంది బాలకార్మికులున్నారు. 2009-10లో జరిగిన జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో 49.84 లక్షలమంది 5 నుంచి 14 ఏళ్ల వయసున్న పని చేసే పిల్లలు ఉన్నట్లు అంచనా. బాల కార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టాన్ని పూర్తిగా సవరించి అన్నిరకాల బాలకార్మిక వ్యవస్థలను నిషేధించడానికి భారత ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు ఇచ్చిన సమాధానంలో వివరించింది.
బాలకార్మిక నిషేధ, నియంత్రణ చట్టం కింద 1997-98 నుంచి 2008-09 మధ్యకాలంలో దేశం మొత్తం మీద 3583327 తనిఖీలు నిర్వహించారు. వీటిలో 2.45 లక్షల ఉల్లంఘనలను గుర్తించి, 90932 విచారణలు జరిపారు. వీటిలో 24829 కేసుల్లో శిక్షలు విధించారు.

జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో అతిముఖ్యమైన పథకం జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు (ఎన్‌సీఎల్పీ). దీన్ని భారత ప్రభుత్వం 1988లో మొదటగా బాలకార్మికులు అధికంగా ఉన్న 12 జిల్లాల్లో ప్రారంభించింది. పదకొండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి జాతీయ బాలకార్మిక ప్రాజెక్టును 250 జిల్లాల్లో అమలు చేశారు. ప్రస్తుతం ఇది 266 జిల్లాల్లో అమలవుతోంది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం పని నుంచి విముక్తి కల్పించిన పిల్లలకు పునరావాసాన్ని అందించడం. అలాంటి పిల్లలను ప్రత్యేక పాఠశాలల్లో చేరుస్తారు. వారికి బ్రిడ్జి కోర్సుల ద్వారా విద్యను అందిస్తారు.

వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారు. వీరికి ఉపకారవేతనం, ఆరోగ్య, రక్షణ సదుపాయాలు కూడా లభిస్తాయి. ఇప్పటి వరకూ ఇలాంటి పదివేలకు పైగా ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించారు. వీటిలో అయిదు లక్షల మంది పిల్లలు చేరారు. ప్రస్తుతం దేశంలో 8020 జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు ప్రత్యేక పాఠశాలలున్నాయి. వీటిలో 4 లక్షల మంది పిల్లలు చేరారు. ఈ ప్రాజెక్టు కింద 6.47 లక్షల మంది పిల్లలను ప్రత్యేక శిక్షణ అనంతరం సాధారణ పాఠశాలల్లో చేర్చారు. పదకొండో ప్రణాళికలో ఈ ప్రాజెక్టుకు రూ.625 కోట్లు కేటాయించారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం. ఈ పథకం కింద జిల్లా స్థాయిలో ప్రాజెక్టు సొసైటీలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలేవైనా పునరావాస ప్రాజెక్టులను నిర్వహిస్తే వాటికి అయ్యే ఖర్చులో 75 శాతం మేరకు కేంద్రం సమకూరుస్తుంది. తల్లిదండ్రుల సంరక్షణ లేని బాలకార్మికులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సమీకృత బాలల రక్షణ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు.

కుటుంబాలపైనా శ్రద్ధ

బాలకార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం కుటుంబాల పేదరికమని అనేక అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అందువల్ల బాలకార్మికులను పని నుంచి విముక్తులను చేసి, వారికి పునరావాసం కల్పిస్తున్నారు. వారి కుటుంబాలకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కింద సహకారాన్ని అందించే చర్యలు చేపట్టారు. ఉదాహరణకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కూడా ఇతోధికంగా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయ కార్మికసంఘం, అమెరికా ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ కూడా భారత ప్రభుత్వ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పథకాలకు సహకారాన్ని అందిస్తున్నాయి.
బాలకార్మిక వ్యవస్థ సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక సమస్య. దీన్ని నిర్మూలించడానికి స్థిరమైన, దీర్ఘకాల కృషి అవసరం. చట్టాలు సమగ్రంగా ఉండేలా చూడాలి. ఈ చట్టాల అమలుకు అవసరమైన పటిష్ట యంత్రాంగం ఉండాలి.

రాజకీయ చిత్తశుద్ధి లేనిదే బాలకార్మిక వ్యవస్థను తొలగించలేం. బాలకార్మిక చట్టంతోపాటు విద్యాహక్కు చట్టం లాంటి వాటినీ సమర్థంగా అమలు చేయాలి. దీంతోపాటు బాలల సమగ్ర అభివృద్ధికి, రక్షణకు కార్యాచరణ ప్రణాళికను రచించి అమలు చేయాలి. దీంట్లో భాగంగా బాలకార్మికుల తల్లిదండ్రులపై కూడా దృష్టి సారించాలి. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానించాలి.
© Ushodaya Enterprises Private Limited 2012