నూరేళ్ల స్ఫూర్తిజ్వాల.. గదర్‌ ఉద్యమం

జన జీవన రంగాలన్నీ భ్రష్టుపట్టి సగటు మనిషికి బతుకే భారంగా మారింది. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు. ఇలాంటప్పుడు ఎన్ని నీతులు చెప్పినా ఎవరి కడుపూ నిండదు. కానీ, కడుపు మండే జనం జ్వాలలై రగిలితే, ఆ సెగ పాలక వర్గాలకు తగలకుండా పోదు. జనంలో అలాంటి జ్వాలలే రగిలించి, ఆనాడు తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించారు గదర్‌ ఉద్యమకారులు. ఎలాగైనా సరే, దేశానికి స్వాతంత్య్రం సాధించడమే వారి లక్ష్యం. స్వేచ్ఛకోసం సాగిన మహా సంగ్రామంలో ఎంతో చురుకైనపాత్ర పోషించారు వారు. మనం ఇప్పుడు స్వతంత్రులమన్న మాటే కానీ, సమస్యల సంకెళ్లు విడిపోనేలేదు. ఆ విప్లవ వీరుల స్ఫూర్తితో ఈ సంకెళ్లు తెంచుకొనేందుకు మరోసారి సమర శంఖం పూరించాల్సిన సమయమిది. గదర్‌ ఉద్యమ శత సంవత్సరమిది.

వారివి ఉక్కునరాలు... ఇనుప కండరాలు. కణకణమని నెత్తురుమండే ప్రవాస భారతీయ యువకులు వారు. వారు కొద్దిమందే కానీ, ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో అమెరికాలో వారు ప్రారంభించిన గదర్‌ పార్టీ పెను సంచలనం సృష్టించింది. భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో అదో చెరగని అధ్యాయం. తీవ్రస్థాయి అన్యాయాలు, అణచివేతకు తెగబడుతూ నిరంకుశ శాసనం సాగిస్తున్న బ్రిటీషు పాలకుల నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందాలంటే- సాయుధ పోరాటమే సరైన మార్గమని ఆ యువకులు భావించారు. ఆ దిశలో ముందడుగు వేశారు. వారు స్వయంగా లక్ష్యం సాధించి ఉండకపోవచ్చు. కానీ, ప్రజానీకాన్ని చైతన్యపరచి, లక్ష్యసాధన దిశలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ శత సంవత్సర వేళ గదర్‌పార్టీ గురించీ; న్యాయం, సమానత, స్వేచ్ఛ కోసం ఆ పార్టీ సాగించిన విప్లవోద్యమం గురించీ నేటి తరానికి తెలియ‌జేయాల్సిన‌ అవసరం ఎంతైనా ఉంది.

నూరేళ్ల క్రితం భారతీయ కార్మికులు, ముఖ్యంగా పంజాబీలు వాషింగ్టన్‌, ఒరేగాన్‌ రాష్ట్రాల్లోని కట్టెల మిల్లుల్లోను, కాలిఫోర్నియాలోని వ్యవసాయ క్షేత్రాల్లోనూ పనిచేయడానికి పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. తెల్లవారికన్నా సమానంగానో, ఎక్కువగానో పనిచేస్తున్నప్పటికీ, వారికి తెల్లవారికన్నా చాలా తక్కువ వేతనాలు చెల్లించేవారు. వారిపట్ల అడుగడుగునా విచక్షణ చూపేవారు. చిన్నచూపు చూసేవారు. ఇండియాను పాలిస్తున్న బ్రిటిషుదొరలు ప్రవాస భారతీయుల దురవస్థను పట్టించుకోలేదు. దాంతో ఇంగ్లిషువారి పట్ల వారిలో కోపావేశాలు కట్టలు తెంచుకొన్నాయి. స్వతంత్ర దేశానికి చెందిన పౌరులు మాత్రమే పరాయిగడ్డ మీద తలెత్తుకొని గౌరవంగా బతకగలరని, పోరాడి హక్కులు సాధించే అవకాశం వారికే ఉంటుందని గ్రహించారు. దేశానికి స్వాతంత్య్రం వస్తే తప్ప తమ పరిస్థితులు మారవని వారికి అర్థమైంది. అందుకే, ఎలాంటి త్యాగాలకైనా సరే సిద్ధపడి, స్వాతంత్య్ర సాధన కోసం పోరాటం సాగించాలన్న దృఢసంకల్పం బూనారు. మాతృదేశ స్వాతంత్య్రమే అప్పటి ప్రవాస భారతీయుల అంతిమ లక్ష్యంగా మారింది. అందుకోసం దూకుడుగా ముందుకు ఉరికేందుకు నడుం బిగించారు. న్యాయం, సమానత, స్వాతంత్య్రమే వారి జెండాగా, అజెండాగా మారింది. ఈ ఆశయతీరాలను చేరుకోవడానికి వారంతా సైనికుల్లా సమాయత్తమయ్యారు. మొట్టమొదట 1913 ఏప్రిల్‌లో ఒరేగాన్‌లోని అస్టోయియాలో సమావేశమైన భారతీయ కార్మికులు, లాలా హర్‌దయాళ్‌, బాబా సోహన్‌ సింగ్‌ భక్నాల సారథ్యంలో 'పసిఫిక్‌ తీర హిందీ సంఘం' ఏర్పాటు చేసుకొన్నారు. సంఘ సభ్యులు బాబా సోహన్‌సింగ్‌ భక్నాను సంస్థాపక అధ్యక్షుడిగా, లాలా హర్‌దయాళ్‌ను కార్యదర్శిగా, పండిత్‌ కాన్షీరామ్‌ను కోశాధికారిగా ఎన్నుకొన్నారు. ఆ సంఘం 1913 నవంబరు ఒకటిన తన వారపత్రిక 'గదర్‌' ప్రారంభించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యుగంతర్‌ ఆశ్రమ్‌ ఆ సంఘం ప్రధాన కార్యాలయం. అక్కడి నుంచే పత్రికను తీసుకొచ్చింది. అది పత్రికకు 'గదర్‌' అని పేరు పెట్టడానికి బలమైన కారణమే ఉంది. 1857నాటి ప్రథమ స్వాతంత్య్ర సమరాన్ని బ్రిటిష్‌ పాలకులు 'గదర్‌'(తిరుగుబాటు)గా అభివర్ణించేవారు. ఆ పోరాటాన్ని కొనసాగించి, అంతిమంగా దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడమే లక్ష్యం కాబ‌ట్టి పత్రికకు ఆ పేరునే ఖరారు చేశారు. కాలక్రమేణా ఆ సంఘమే 'గదర్‌ పార్టీ'గా ప్రసిద్ధికెక్కింది. గదర్‌ పార్టీది ఆది నుంచీ జాతీయవాద దృక్పథమే. ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన ఆ పార్టీలో ఎక్కువమంది పంజాబీలే అయినప్పటికీ, పశ్చిమ భారతానికి చెందిన విష్ణుగణేశ్‌ పింగ్లే, సదాశివ్‌ పాండురంగ్‌ ఖన్‌భోజే; మధ్య భారతానికి చెందిన మౌల్వీ బర్కతుల్లా, పండిత్‌ పరమానంద్‌ ఝాన్సీ; తూర్పు భారతానికి చెందిన జితేందర్‌ లాహిరి, తారానాథ్‌దాస్‌, దక్షిణ భారతానికి చెందిన దరిశి చెంచయ్య, చంపక్‌ రామన్‌ పిళ్త్లె తదితరులూ కీలకపాత్ర పోషించారు.

గదర్‌ పార్టీ ప్రధాన కార్యాలయం శాన్‌ఫ్రాన్సిస్కోలోని 5, ఉడ్‌ స్ట్రీట్‌లో ఉండేది. అక్కడి ప్రింటింగ్‌ ప్రెస్‌లోనే అది వార్తాపత్రికను, కరపత్రాలను ముద్రించేది. లాలా హర్‌దయాళ్‌, కర్తార్‌ సింగ్‌ సరభ తదితరులు కేంద్ర కార్యాలయంలోనే ఉండి, క్రియాశీలంగా వ్యవహరించేవారు. మున్షీరామ్‌, కవి హరిసింగ్‌ ఫకీర్‌ వంటివారు గదర్‌ పత్రికకు తరచుగా రచనలు సమకూర్చేవారు. భారతదేశంలో కొనసాగుతున్న స్వాతంత్య్ర పోరాటం మీద గదర్‌ పార్టీ, పత్రికా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేవి. పోరాటాన్ని కొత్త మలుపు తిప్పి, మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేవి. బ్రిటిషు పాలకుల దుర్నీతిని ఎండగట్టి, ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగుల్కొల్పడానికి ఆ పార్టీ భారీయెత్తున కరపత్రాలు ముద్రించి, పంపిణీ చేసేది. మాతృభూమి స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాట బాట పడుతున్న కార్మికులు, కర్షకుల వీరోచిత గాథల్ని కరపత్రాల్లో ప్రముఖంగా ప్రచురించేవారు. వారి రాజకీయ చైతన్యానికి అవి అద్దం పట్టేవి. బ్రిటిష్‌ దొరతనం కింద పనిచేస్తున్న భారతీయ సైనికుల్లో అసంతృప్తిని రాజేయడానికి, తిరుగుబాటు లేవదీసేలా వారిని ప్రేరేపించడానికీ 'గదర్‌' పార్టీ ప్రయత్నించింది. మామూలుగానైతే బ్రిటిషర్లు దేశం వదలిపోరని, బలప్రయోగం ద్వారానే వారిని తరిమికొట్టాలని భావించింది. అందుకోసం గెరిల్లా యుద్ధతంత్రాన్ని అనుసరించాలనుకొంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌ తలమునకలై ఉన్న సమయమే ప్రతిఘటనకు అనుకూలమైనదని నిర్ణయించింది. గదర్‌ పార్టీ సభ్యులు పంజాబ్‌ తిరిగివచ్చి తిరుగుబాటు రగల్చడానికి ప్రయత్నించారు. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం వారిని క్రూరంగా అణచివేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1948లో ఆ పార్టీ రద్దయిపోయింది. కానీ అది రగిలించిన స్ఫూర్తిజ్వాల నేటికీ వెలుగుతూనే ఉంది.

(రచయిత - డాక్టర్‌ డి.పి.సింగ్‌)

© Ushodaya Enterprises Private Limited 2012