జాతీయ‌స్థాయి వైజ్ఞానిక, గ‌ణిత ప్రద‌ర్శన - 2013

* పలు రాష్ట్రాల నవోదయ విద్యార్థుల వినూత్న ప్రయోగాలు
* అబ్బుర పరిచిన జాతీయ స్థాయి వైజ్ఞానిక, గణిత ప్రదర్శన

అరటి చెట్టు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చని ఎంతమందికి తెలుసు. సైకిల్ తొక్కితే ఆరోగ్య పరిరక్షణే కాక.. ఓ బల్బునూ వెలిగించొచ్చని విన్నారా..! భాగ్యనగరంలో నిత్యం వేధించే అతిపెద్ద సమస్య ట్రాఫిక్. దీనిని నివారించేందుకు అత్యాధునిక సిగ్నళ్ల వ్యవస్థను కొందరు చిన్నారులు రూపకల్పన చేశారంటే.. ఆశ్చర్యం కలగక మానదు. అవును వారంతా పాఠశాల విద్యార్థులే అయినా.. తమ మెదడుకు పదునుపెట్టి అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. గచ్చిబౌలిలోని జవహర్ నవోదయ విద్యా లయలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల జాతీయ స్థాయి వైజ్ఞానిక, గణిత ప్రదర్శన అబ్బురపరుస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన నవోదయ విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిక్షణ, గ్లోబల్ వార్మింగ్, గణితశాస్త్ర సూత్రాలను అన్వయిస్తూ.. చిన్నారులు చేసిన నమూనాలు ఔరా అనిపించాయి.
మరిచిపోయినా.. దీపాలు ఆరిపోతాయ్
రూపకర్త: గౌరవ్, 10వ తరగతి, రాష్ట్రం: మధ్యప్రదేశ్

ఉదయాన్నే కార్యాలయానికి వెళ్లే సమయంలో చాలామంది హడావిడిగా ఉంటారు. ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు ఆపకుండా వెళ్లిపోతుంటారు. 'ఆటోమెటిక్ టైమ్ స్విచ్' పరికరం ఉంటే మనం వదిలేసినా.. అవే ఆగిపోతాయి. ప్రత్యేకంగా రూపొందించిన సర్క్యూట్‌కు ఇంట్లో ఉండే విద్యుత్తు గృహోపకరణాలతో కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు ఆగాలనే సమయం అమరిస్తే.. సరిపోతుంది. మనం లేకపోయినా.. ఆ సమయానికి వాటంతట అవే ఆరిపోతాయి. ఈ పరికరంతో చాలావరకూ విద్యుత్తు ఆదా అవుతుంది.
అత్యాధునిక ట్రాఫిక్ విధానం
ఆలోచన: జయకృష్ణన్, 11వ తరగతి, రాష్ట్రం: కేరళ

నగర రద్దీ రహదారులపై 'అధునాతన ట్రాఫిక్ సిస్టమ్' ఉంటే వాహనాల నియంత్రణ సులభమవుతుంది. అంబులెన్స్‌లు వంటి అత్యవసర సర్వీసులకు దారి సుగమం అవుతుంది. రేడియో వేవ్ ట్రాన్స్‌మీటర్‌ను అమర్చుకోవడం ద్వారా.. అంబులెన్స్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా చౌరస్తాలోని సిగ్నళ్లకు సంకేతాలు అందుతాయి. అక్కడికి వచ్చేలోగా.. మిగతా వాహనాలను నియంత్రిస్తుంది. ఇళ్లలోనూ ఇలాంటి ట్రాన్స్‌మీటర్ ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు జరిగినప్పుడు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సిగ్నళ్లను చేరవేస్తుంది.
ఒక్క మిస్డ్‌కాల్ ఇస్తే నియంత్రణ
విద్యార్థి: ఆయూష్, రాష్ట్రం: ఉత్తరాఖండ్

తిరుగుతున్న ఫ్యాన్‌ను ఆపా లంటే.. స్విచ్ నొక్కాల్సి ఉంటు ంది. వేయాలన్నా.. అంతే. అదే 'మొబైల్ ఆపరేటింగ్ సర్క్యూ ట్' ఉంటే కేవలం సెల్‌ఫోన్‌తో కూర్చున్న చోటి నుంచే లైట్లు, ఫ్యాన్లు ఆపొచ్చు.. వేయొచ్చు. ఒక్క మిస్డ్‌కాల్ ఇస్తే సరిపోతుంది. సెల్ నుంచి ఎల్‌డీఆర్ ఫోటో సిగ్నళ్ల ద్వారా ఈ పరికరం పనిచేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చీకటి పడితే పొలాల వద్దకు వెళ్లి మోటార్ వేసే పనిలేకుండా ఇంటి నుంచే దీని ద్వారా నియంత్రించవచ్చు. ఇది రైతన్నలకు చాలా ప్రయోజన కరంగా ఉంటుంది.
సీసాలో నీరు కదిలితే... భూకంపమే
రూపకర్త: నిషాంత్ పాటిల్, ప్రాంతం: పుణే

ఈ చిన్ని 'ఎర్త్‌క్వేక్ ఇండికేటర్‌'తో భూకంపాన్ని ముందే పసిగట్టొచ్చు. పెద్ద పెట్టెలో రెండు ఇనుప చువ్వలకు మధ్య రబ్బర్ బ్యాండ్ పెట్టి మధ్యలో చిన్న నీళ్ల సీసాను వేలాడదీస్తారు. కుదుపులొస్తే.. సీసాలోని నీరు కదులుతుంది. దీనిలోని సెన్సార్ నుంచి శబ్ధం వస్తుంది. పాత సామగ్రితో దీన్ని చేయొచ్చు.

అరటి చెట్టుతో విద్యుత్తు
ఆలోచన: అభిజిత్, రాష్ట్రం: అసోం

అరటి ఆకులు, పువ్వు లు, పండ్ల నుంచి విద్యుత్తును తీయొచ్చు. వీటిని ఓ సీసాలో పూర్తిగా కుళ్లిపోయే వరకూ దాదాపు 20 నుంచి 30 రోజులు ఉంచాలి. అనంతరం కార్బన్, జింక్‌రాడ్లను ఆ సీసాలో అమర్చాల్సి ఉంటుంది. కుళ్లిన పదా ర్థం నుంచి వెలువడే ఎలక్ట్రాన్లు మధ్యలో ఉంచిన రాడ్ల ద్వారా శక్తిని బయటకు పంపిస్తాయి. ఇలా ఒక్క అరటి చెట్టు నుంచి దాదాపు 172 వాల్ట్స్ విద్యుత్తును తీయొచ్చు..
ఇంధన ఖర్చు లేకుండా.. దాణా కత్తిరింపు
విద్యార్థి: కమల్‌తివారి, రాష్ట్రం: ఉత్తరాఖండ్

గ్రామాల్లో పశువుల కోసం గడ్డిని, చొప్పను చిన్న ముక్కలుగా చేసేందుకు యంత్రాలను ఉపయోగిస్తుంటారు. ఇవి విద్యుత్తు, పెట్రోల్‌తోనే పనిచేస్తాయి. యంత్రాలు లేకుండా.. 'సైకిల్ ఫోడర్ హార్వెస్టర్' పరికరంతో గడ్డిని ముక్కలుగా చేయొచ్చు. సైకిల్‌పై కూర్చొని తొక్కుతుంటే ముందు అమర్చిన బ్లేడ్లు చొప్పను ముక్కలుగా చేస్తాయి. ఇంధన ఖర్చు లేకుండా పని జరిగిపోతుంది.
సైకిల్‌తో.. దీపాల వెలుగులు
విద్యార్థి: సూరజ్ ప్రాంతం: గచ్చిబౌలి, హైదరాబాద్

సైకిల్‌కు అమర్చిన ఆల్ట్రనేటర్ ద్వారా బ్యాటరీని ఛార్జింగ్ చేసి విద్యుత్తు దీపాలను వెలిగించొచ్చు. ఈ పరికరం ద్వారా అరగంట సైకిల్ తొక్కితే.. రెండు దీపాలను 12 గంటల సమయం వెలిగించేంత విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. కరెంటు సరఫరా లేని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని కోసం పెద్దగా ఖర్చుకూడా ఉండదు. ఓ పాత సైకిల్ ఉంటే సరిపోతుంది. దానిని బ్యాటరీకి అనుసంధానం చేయాలి. తొక్కితే చీకట్లను తొలగిస్తూ వెలుగులు ప్రసరిస్తాయి.
సిరంజీలతో హైడ్రాలిక్ యంత్రాలు
ఆలోచన: డింపుల్ ఠాకూర్, రాష్ట్రం: చంఢీఘర్

సిరంజీలతో ఈ హైడ్రాలిక్ యంత్రాన్ని రూపొందించారు. ఫ్త్లెవుడ్ చెక్కతో జేసీబీ తరహాలో ప్రత్యేక పరికరం తయారుచేశారు. దానికి ముందు భాగంలో ఉండే క్రేన్ పనిచేయాలంటే వెనుక ఉండే సిరంజుల ద్వారా నీరు పంప్ చేస్తుంటే... యంత్రం పనిచేస్తుంది. పాస్కల్ సిద్ధాంతాన్ని అనుసరించి దీనిని రూపొందించారు. ఈ హైడ్రాలిక్ పరికరం పెద్దపెద్ద బండరాళ్లను, వస్తువులను సునాయాసంగా పైకెత్తి పక్కన పడేయగలదు.ఎంత బరువున్న వాహనాన్నైనా పైకి లేపే శక్తి దీనికి ఉంది.

:: READ MORE ::