TELANGANA EAMCET -2017 - Toppers

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో తొలి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ మనోభావాలను వెల్లడించారు. భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
* సివిల్స్‌కు ఎంపికై పేదలకు సేవ చేస్తా.. - గోరంట్ల జయంత్‌ హర్ష, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ మొదటి ర్యాంకు
కృషి, పట్టుదలతోనే మొదటి ర్యాంకు వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని పరీక్ష రాసిన రోజే అధ్యాకులకు, అమ్మానాన్నలకు చెప్పా. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు రాగా తెలంగాణ ఎంసెట్‌లో ప్రథమ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నిత్యం 13 గంటలు చదివేవాణ్ని. ముంబయిలో సీఎస్‌ఈ చేయాలనుకుంటున్నా. బీటెక్‌ పూర్తి చేసి సివిల్స్‌ రాస్తా. ఎప్పటికైనా సివిల్‌ సర్వీసుకు ఎంపికై పేదలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. మాది గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం ముత్తానపల్లి.
* అమ్మానాన్నల కష్టం వల్లే.. - కిల్లారి రాంప్రసాద్‌, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ రెండో ర్యాంకు
మా అమ్మానాన్నలిద్దరూ పెద్దగా చదువుకోలేకపోయినప్పటికీ నన్ను కష్టపడి చదివించారు. వారికి మంచి పేరు తేవాలన్న లక్ష్యంతో పట్టుదలగా చదివా. రోజుకు 13 గంటలు చదవడంతో పాటు అధ్యాపకులు చెప్పిన పాఠాల్ని క్రమం తప్పకుండా సాధన చేసేవాడిని. జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయిలో 83వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో ఎనిమిదో ర్యాంకు వచ్చింది. ఆంధ్ర ఎంసెట్‌లో 188వ ర్యాంకు రాగా.. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో రెండో ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ముంబయి ఐఐటీలో కంప్యూటరు సైన్సు చదివి సొంతంగా సంస్థ నెలకొల్పాలన్నదే నా ఆశయం. మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేట.
* తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే.. - అవ్వారి సాయి ఎస్‌ఎస్‌వీ భరద్వాజ్‌, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ మూడో ర్యాంకు
తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు సాధించగలిగా. మాది భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గౌతమీనగరం. జేఈఈ మెయిన్స్‌లో అఖిల భారత స్థాయిలో 25వ ర్యాంకు వచ్చింది. ఏపీ ఎంసెట్‌లో రెండో ర్యాంకు సాధించగా.. తెలంగాణలో మూడో ర్యాంకు వచ్చింది. రెండుచోట్లా ఉత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉంది.
* ఎయిమ్స్‌లో చదవడమే లక్ష్యం - కడిమిశెట్టి నేస్తంరెడ్డి, టీస్ ఎంసెట్-2017 అగ్రికల్చర్‌, ఫార్మసీ మొదటి ర్యాంకు
తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీలో మొదటి ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎయిమ్స్‌లో సీటు సాధించడమే లక్ష్యంగా చదువుతున్నా. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలోని శ్రీనివాసనగర్‌. నాన్న నూకిరెడ్డి కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో ఇంజినీరుగా పనిచేస్తూ ఆరేళ్ల క్రితం మస్కట్‌ వెళ్లారు. చిన్నతనం నుంచి మేనమామ సత్యనారాయణరెడ్డి సంరక్షణలో ఉండి చదువుతున్నా.
* నీట్‌ ర్యాంకును బట్టి మంచి కాలేజీలో చేరతా.. - గొల్లమూడి ప్రదీత్‌సుందర్‌రెడ్డి, టీస్ ఎంసెట్-2017 అగ్రికల్చర్‌, ఫార్మసీ రెండో ర్యాంకు
తెలంగాణ ఎంసెట్‌లో 160కి 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లో 37వ ర్యాంకు వచ్చింది. త్వరలో రానున్న నీట్‌ ర్యాంకును బట్టి మంచి కళాశాలలో చేరి డాక్టర్‌ కావడమే లక్ష్యం. అమ్మానాన్నలిద్దరూ వైద్యులే. నాన్న మధుకిరణ్‌రెడ్డి న్యూరోసర్జన్‌. ఒంగోలులో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు.
* కార్డియాలజిస్ట్‌ను అవుతా.. - అభినవ్‌రెడ్డి, టీస్ ఎంసెట్-2017 అగ్రికల్చర్‌, ఫార్మసీ మూడో ర్యాంకు
తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీలో మూడో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లో 77వ ర్యాంకు వచ్చింది. నీట్‌ పరీక్ష ద్వారా మెడిసిన్‌లో సీటు సాధించి కార్డియాలజిస్ట్‌ లేదా అంకాలజిస్ట్‌ అవుతా. ఎయిమ్స్‌ పరీక్షలో కూడా మంచి ర్యాంకు కోసం చదువుతున్నా. ఉపాధ్యాయులైన మా అమ్మ మంజుల, నాన్న శ్రీనివాసరెడ్డిల ప్రోత్సాహం, అధ్యాపకుల సలహాలు, సూచనలతో ఏ రోజు పాఠ్యాంశాలను ఆరోజే పూర్తి చేస్తుంటా. కష్టపడి చదవడంతోనే ఈ ర్యాంకు సాధ్యమైంది. మాది సిద్దిపేట జిల్లా నంగునూరు.

TELANGANA EAMCET - III 2016 - Toppers

సాధించగలననే ఆత్మ విశ్వాసం, అమ్మానాన్నల అండదండలు ఉంటే చాలు... పరీక్షలు ఏవైనా విజయం అమ్మాయిలదే అంటున్నారు తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకర్లు. అబ్బాయిల్ని తోసిరాజని.. వరసగా మొదటి మూడు ర్యాంకుల్నీ సొంతం చేసుకున్న రేగళ్ల మానస, శ్రీహారిక, తేజస్విని మనోగతం ఇది..
* వేల ర్యాంకు నుంచి.. - రేగళ్ల మానస
పరీక్షల్లో ప్రథమంగా పాటించాల్సిన నియమం సమయపాలన! ఇది చదివేటప్పుడే కాదు పరీక్ష రాసేటప్పుడూ ఎంతో ముఖ్యం అని నాకు తొలిసారి తెలంగాణ ఎంసెట్‌ రాసినప్పుడు తెలిసొచ్చింది. అప్పుడు సమయం సరిపోక... కంగారుగా ఓఎమ్‌ఆర్‌ షీటు నింపేశాను. నాలుగు వేల ర్యాంకు వచ్చింది! అలా విఫలమైన నేను ఈసారి ఎలాగైనా విజయం సాధింధచాలనే కసితో చదివాను. ఆ కష్టానికి ఫలితమే మొదటి ర్యాంకు. మా సొంతూరు విస్సన్నపేటయినా నాన్న వృత్తిరీత్యా గుడివాడలో ఉంటున్నాం. అమ్మ గృహిణి. మా చెల్లి ప్రస్తుతం ఇంటర్‌ మొదటి ఏడాది చదువుతోంది. వైద్యురాల్ని కావాలన్నదే చిన్నప్పట్నుంచీ నా లక్ష్యం. అందరూ కష్టం అన్నా నేను బైపీసీ తీసుకుని.. 986 మార్కులు సాధించా. భవిష్య అకాడమీలో శిక్షణ తీసుకున్నా. మొదటిసారి విఫలం అయినా.. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ తెలంగాణ ఎంసెట్‌కు సిద్ధమయ్యా. మొదటిసారి తెలంగాణ ఎంసెట్‌ రద్దయినా ఉదయం ఆరు నుంచి రాత్రి పది వరకూ చదవడం మానుకోలేదు. బయటకు వెళ్లడం, సరదాలూ, షికార్ల జోలికి వెళ్లలేదు. దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లిళ్లూ, శుభకార్యాలకీ దూరంగానే ఉన్నాను. మా అమ్మావాళ్ల.. అమ్మమ్మ(జేజమ్మ) పరీక్షకు ముందు రోజే చనిపోయారు. నేను వాళ్లింటికి వెళ్లడానికి కూడా కుదరలేదు. నేను ఆ బాధతోనే పరీక్ష రాశా. భవిష్యత్తులో కార్డియాలజిస్టు అవ్వాలనేది నా కోరిక. తప్పకుండా వైద్యురాలిగా మీ ముందుకొస్తాను..! అమ్మానాన్నకి ఇంతకన్నా మంచి పేరు తీసుకువస్తాను.
* అమ్మతోడుగా.. - శ్రీహారిక
అమ్మకి ఇప్పటికే ఎన్ని ఫోన్లు వచ్చాయో! అభినందనల చిట్టిసందేశాలతో తన ఫోన్‌ ఇన్‌బాక్సు కూడా నిండిపోయింది. మాది సికింద్రాబాద్‌. మధ్యతరగతి కుటుంబం. నాన్న ఓ ఫార్మాసంస్థలో ఉద్యోగి. అమ్మానాన్నలకు మేం ఇద్దరం ఆడపిల్లలం. మా చెల్లి పదో తరగతి చదువుతోంది. ఐదో తరగతి వరకూ నేను హైదరాబాద్‌లోనే చదువుకున్నా. తరవాత పదో తరగతి వరకూ ముంబయిలో చదువుకున్నా. చైతన్య నారాయణ కాలేజీలో ఇంటర్‌ చదివి 98.6 శాతం మార్కులు తెచ్చుకున్నా. అక్కడే ఎంసెట్‌ శిక్షణ తీసుకున్నా. మా ప్యాకల్టీ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం చదువుకున్నా. ఆడపిల్లలం కదాని అమ్మానాన్నలెప్పుడూ మా చదువుల విషయంలో వెనకడుగు వేయలేదు. మగపిల్లలతో సమానంగా చదివించడానికి తాపత్రయపడ్డారు. మంచి భవిష్యత్తుకి బాటవేశారు. మా అమ్మ నేను ఒత్తిడి ఫీలవ్వకుండా ఎప్పుడూ నాకు తోడుగా ఉండేది. వైద్యురాలిగా అమ్మానాన్నలకి ఇంకా మంచి పేరు తీసుకురావాలనేది నా లక్ష్యం.
* తొమ్మిదో తరగతి నుంచే.. - తప్పెట తేజశ్విని
మానసిక వికలాంగుల్ని.. చూసినప్పుడు వాళ్లకి ఏదో ఒక రకంగా సాయం చేయాలని ఉండేది. అందుకే వైద్యురాల్ని కావాలనుకుని బైపీసీ తీసుకుని.. ఎంస్‌ట్‌ రాశా. కష్టపడి చదివి మూడో ర్యాంకు సాధించగలిగాను. మాది కడప. నాన్న వృత్తిరీత్యా అనంతపురంలో స్థిరపడ్దాం. తొమ్మిదో తరగతి నుంచే వైద్యవిద్యకి సంబంధించి చదవడం మొదలుపెట్టా. విజయవాడ చైతన్య కాలేజీలో ఇంటర్‌పూర్తి చేశాను. ఇంటర్‌లో 987 మార్కులు వచ్చాయి. తొలిసారి ఆంధ్రా ఎంసెట్‌ కోసం శిక్షణ తీసుకున్నా. 29వ ర్యాంకు వచ్చింది. అది నాకు సంతృప్తినివ్వలేదు. తెలంగాణ ఎంసెట్‌కి ఇంట్లో ఉంటూనే సిద్ధమయ్యా. మొదటిసారి రాసినప్పుడు పదహారో ర్యాంకు వచ్చింది. అది రద్దై రెండోసారి నిర్వహించినప్పుడు ఏడో ర్యాంకు వచ్చింది. ఇదిగో ఇప్పుడు మూడో ర్యాంకు! నిర్ణీత సమయమంటూ లేకుండా.. ఇవాళ ఇంత భాగం పూర్తి చేయాలని మాత్రమే లక్ష్యం పెట్టుకుని చదివా. అందుకోసం ఎంత సమయమైనా వెచ్చించేదాన్ని. పాటలు విని ఒత్తిడిని అధిగమించేదాన్ని. భయం దరిచేరనీయకుండా పరీక్షలు రాశాను. నాకు పోటీ అంటే చాలా ఇష్టం. దాంతోనే ప్రతిదాంట్లోనూ విజయం అందుకునేందుకు ప్రయత్నించేదాన్ని. ఆ ఆత్మవిశ్వాసమే నన్ను విజేతగా నిలబెట్టింది. న్యూరాలజిస్టు అయి మానసిక వికలాంగులకు సేవ చేయాలని ఆశపడుతున్నా!

TELANGANA EAMCET 2015 - Toppers

'ఎయిమ్స్‌' పైనే టాపర్ల దృష్టి
* తెలంగాణ ఎంసెట్ (మెడిసిన్) తొలి పది ర్యాంకర్ల మనోగతమిదీ... .
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌లలో ఉత్తమ ర్యాంకులు సాధించినా... అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ప్రవేశం పొందేందుకు సన్నద్ధమవుతున్నామని తెలంగాణ ఎంసెట్ మెడిసిన్ విభాగ తొలి పది ర్యాంకర్లు వెల్లడించారు. ర్యాంకుల సాధనకు దోహదపడిన అంశాలను వారు 'ఈనాడు'కు వివరించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం... శ్రీచైతన్య నారాయణ సంస్థల ప్రత్యేక శిక్షణ తాము భావి వైద్యులుగా తయారుకావడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. వారి మాటల్లోనే...
* రోజుకు 14 గంటలు సాధన చేశా - ఉప్పలపాటి ప్రియాంక, మొదటి ర్యాంకరు
మెడిసిన్‌లో మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. మాది ప్రకాశం జిల్లా పర్చూరు మండలం, నాగులపాలెం గ్రామం. నాన్న జగదీష్ వ్యాపారి. అమ్మ ఉమాలక్ష్మి గృహిణి. ఇంటర్‌లో 983 మార్కులు వచ్చాయి. రోజుకు 14 గంటల పాటు చదివా. ఎయిమ్స్, జిప్‌మర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా. ఆంధ్రా మెడికల్ కళాశాలలో చేరాలనుకుంటున్నా. కార్డియాలజీ విభాగంపై ఆసక్తి ఉంది. చిత్రలేఖనం, నవలలు చదవడం నా అభిరుచులు... Read More
* మంచి వైద్యునిగా పేరు తెచ్చుకుంటా - కాడ శ్రీవిదుల్, రెండో ర్యాంకరు
మంచి వైద్యునిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. స్పెషలైజేషన్‌పై ఇంకా ఆలోచించలేదు. నాన్న సత్యనారాయణ, అమ్మ రమాదేవి ఇద్దరూ వైద్యులే. ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. రోజుకు 8 గంటలు చదివా. జాతీయ స్థాయి పరీక్షలకు సిద్ధపడుతున్నా. అమ్మానాన్నలాగే నేనూ వైద్యుడిని కావాలనుకున్నా.
* కార్డియాలజిస్ట్ కావాలని... - వంగాల అనూహ్య, మూడో ర్యాంకరు
'ఎయిమ్స్' అందించే ఎంబీబీఎస్‌లో చేరతా. కార్డియాలజీ విభాగంలో స్పెషలైజేషన్ చేయాలని ఉంది. నాన్న పాపిరెడ్డి వ్యవసాయదారుడు. అమ్మ నాగలత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. ఇంటర్‌లో 977 మార్కులు వచ్చాయి. రోజూ 14 గంటల పాటు చదివా. తీరిక సమయాల్లో సైన్స్‌కు సంబంధించిన అంశాలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదువుతుంటా... Read More
* జాతీయ స్థాయి సంస్థల్లో ఎంబీబీఎస్ చేస్తా - పారశెల్లి సాయితేజ, నాలుగో ర్యాంకరు
ఏపీ ఎంసెట్‌లో 84వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. నాన్న నారాయణరావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అమ్మ నీరజ గృహిణి. ఎయిమ్స్, జిప్‌మర్ తదితర జాతీయ వైద్యవిద్యా సంస్థల్లో మెడిసిన్ చేయాలని కోరిక. వాటి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధనకు కృషి చేస్తున్నా.
* న్యూరాలజిస్ట్‌ను అవుతా - చెన్నూరి సాయితేజరెడ్డి, ఐదో ర్యాంకరు
ఎయిమ్స్‌లో ప్రవేశం పొందడానికి కృషి చేస్తున్నా. న్యూరాలజిస్ట్‌ను కావాలని ఉంది. నాన్న నాగిరెడ్డి, అమ్మ కళావతి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇంటర్‌లో 984 మార్కులు సాధించా. రోజుకు 14 గంటలపాటు చదివా. వైద్యునిగా పేదలకు సేవ చేస్తా. తీరిక సమయాల్లో సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతుంటా. అన్నయ్య సాయిచరణ్‌రెడ్డి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు.
* పేదలకు ఉచిత వైద్యం అందిస్తా - పైడి తేజేశ్వరరావు, ఆరో ర్యాంకరు
పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తా. మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం. నాన్న అప్పారావు రైతు. అమ్మ అరుణ గృహిణి. ఇంటర్‌లో 976 మార్కులు వచ్చాయి. రోజుకు 14 గంటల పాటు చదివా. తీరిక సమయాల్లో క్రికెట్ ఆడతా. స్వామి వివేకానంద రచనలు చదువుతుంటా.
* గుండె వైద్య నిపుణురాలినవుతా.. - పొన్నాడ నాగసత్య వరలక్ష్మి , ఏడో ర్యాంకరు
ఏపీ ఎంసెట్ ఫలితాల్లో 46వ ర్యాంకు వచ్చింది. మాది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం. రాజమండ్రి శ్రీ చైతన్య కళాశాలలో చదివా. భవిష్యత్తులో గుండె వైద్య నిపుణురాలు కావాలన్నది నాలక్ష్యం.
* అమ్మా నాన్నల ప్రోత్సాహంతో...- బాలబోలు కీర్తన, ఎనిమిదో ర్యాంకరు
ఏపీ ఎంసెట్‌లోనూ నాకు 19వ ర్యాంకు వచ్చింది. ఎయిమ్స్, జిప్‌మర్ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకుల సాధనకు కృషి చేస్తున్నా. జాతీయ స్థాయి వైద్య విద్యాసంస్థల్లో మెడిసిన్ చదవాలన్నది నా లక్ష్యం. నాన్న రమేష్, అమ్మ అనురాధ ఇద్దరూ విశాఖ కేజీహెచ్‌లో వైద్యులుగా పనిచేస్తున్నారు. నా విజయం వెనుక వారి ప్రోత్సాహం ఎంతో ఉంది.
* ఎయిమ్స్ కాకుంటే.. ఉస్మానియాలో చేరతా - అన్ష్ గుప్త, తొమ్మిదో ర్యాంకరు
మంచి న్యూరాలజిస్ట్‌గా పేరు తెచ్చుకుంటా. నాన్న మనీష్ గుప్త, అమ్మ అనామిక గుప్త ఇద్దరూ వైద్యులే. ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. రోజూ 8 నుంచి 10 గంటల పాటు చదివా. తీరిక వేళల్లో బాస్కెట్‌బాల్ ఆడతా. ఫ్రెండ్స్‌తో చాటింగ్, నవలలు చదవడం ఆసక్తి. ఎయిమ్స్. జిప్‌మర్ పరీక్షల్లో వచ్చే ర్యాంకులను చూసుకుని.. ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరతా.
* ఇది నా చిన్ననాటి కల - సిరంచెట్టి సాయిప్రీతమ్, పదో ర్యాంకరు
వైద్యుడిని కావాలనేది నా చిన్ననాటి కల. మంచి కళాశాలలో సీటు రావాలన్న సంకల్పంతో, ర్యాంకే లక్ష్యంగా చదివా. నాన్న భాస్కర్ వరంగల్‌లో వైద్యుడు. అమ్మ మాధవి గృహిణి. ఇంటర్‌లో 973 మార్కులు వచ్చాయి. రోజుకు ఎనిమిది గంటల పాటు అభ్యాసం చేశా. ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేయాలని ఉంది. ప్రస్తుతం ఎయిమ్స్, జిప్‌మర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా. న్యూరాలజీ విభాగంలో స్పెషలైజేషన్ చేస్తా.

 

 

ఐఐటీలో చేరతాం... లక్ష్యం సాధిస్తాం
* తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంకర్ల మనోగతం
న్యూస్‌టుడే యంత్రాంగం: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో అబ్బాయిలు అదరగొట్టారు. తొలి పది ర్యాంకుల్లో తొమ్మిదింటిని వారే కైవసం చేసుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులూ ఉన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అధ్యాపకుల సూచనలు, ప్రణాళికాయుత సాధన వల్ల మంచి ప్రతిభ కనబరచగలిగామని పేర్కొన్నారు. వారేమన్నారంటే...
* ఐఐటీ ముంబయిలో చదివి శాస్త్రవేత్తనవుతా - మోపర్తి సాయి సందీప్, మొదటి ర్యాంకర్, కుత్బుల్లాపూర్
మొదటి ర్యాంకు సాధించినందుకు ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లోనూ ఆరో ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం ముంబయిలోని ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌లో శిక్షణ పొందుతున్నా. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ చదివి, శాస్త్రవేత్త కావాలన్నది నా లక్ష్యం. ఐఐటీ ప్రవేశ పరీక్షలో రెండో ర్యాంకు సాధిస్తా. మా కుటుంబం గుంటూరు జిల్లా లెమెళ్లపాటు నుంచి నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆదర్శ్‌నగర్‌లో స్థిరపడింది. తమ కుమారుడికి ఊహించిన ర్యాంకే వచ్చిందని సందీప్ తల్లిదండ్రులు రవి, కృష్ణకుమారి చెప్పారు.
* కంప్యూటర్ రంగంలో మార్పులు తీసుకొస్తా - రౌతు నిహార్ చంద్ర, రెండో ర్యాంకరు, నిజాంపేట
ఐఐటీలో చదివి, అమెరికాలోని మైక్రోసాఫ్ట్ సంస్థలో సీఈవో స్థాయికి ఎదగాలన్నదే నా లక్ష్యం. సమాజానికి ఉపయోగపడే సరికొత్త కంప్యూటర్ పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తా. నా విజయం వెనుక అమ్మ విజయలక్ష్మి, నాన్న నాగేశ్వరరావుల ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న కంప్యూటర్స్ రంగంపై పుస్తకాలు రాస్తుంటారు. మాదాపూర్‌లోని శ్రీచైతన్య నారాయణ కళాశాలలో ఇంటర్ చదివా.
* సివిల్స్ సాధనే లక్ష్యం - బోగి కీర్తన, మూడో ర్యాంకరు, బొబ్బిలి, విజయనగరం జిల్లా
ఎంసెట్‌తో పాటు ఐఐటీ ప్రవేశ పరీక్ష కూడా రాశాను. దాంట్లోనూ ర్యాంకు సాధిస్తాను. పట్టుదల, ప్రణాళికాబద్ధంగా చదివితే ర్యాంకు సాధించడం అసాధ్యమేమీ కాదు. ఇంటర్‌తోపాటే ఎంసెట్‌కూ సిద్ధపడ్డాను. నాన్న సత్యనారాయణ గుప్తా వ్యాపారి. అమ్మ గృహిణి. ఐఐటీ తర్వాత సివిల్స్ సాధించాన్నదే నా లక్ష్యం... Read More
* రెండేళ్ల కష్టానికి ప్రతిఫలమిది - జీ సాయితేజ, నాలుగో ర్యాంకరు, హైదరాబాద్
ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నా. ఇంటర్‌లో 978, జేఈఈ మెయిన్స్‌లో 320 మార్కులు వచ్చాయి. జేఈఈ తుది ఫలితాల్లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. రెండేళ్ల కష్టానికి ప్రతిఫలమిది.
* ఐఐటీలో చేరతా - వెన్నపూస హేమంత్‌రెడ్డి, ఐదో ర్యాంకరు, పులివెందుల, కడప
154మార్కులతో ఐదోర్యాంకు సాధించా. జేఈఈ మెయిన్స్‌లో 299, ఇంటర్‌లో 978 మార్కులు వచ్చాయి. మాది కడప జిల్లా పులివెందుల. 'ఈనాడు నిర్వహించిన మాక్ ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచా. ఐఐటీలోనే చేరతా.
* మంచి ఇంజినీరుగా పేరు తెచ్చుకుంటా - తన్నీరు శ్రీహర్ష, ఆరో ర్యాంకరు, కోదాడ, నల్గొండ
ఇది ముందే ఊహించిన ర్యాంకు. ఎంసెట్‌కు ప్రణాళికబద్ధంగా సన్నద్ధమయ్యా. అధ్యాపకుల సాయంతో ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకున్నా. మంచి ఇంజినీరుగా స్థిరపడి, దేశానికి సేవ చేస్తా. ఇంటర్‌లో 986, జేఈఈ మెయిన్స్‌లో 250 మార్కులు వచ్చాయి. ఐఐటీలో ఎలక్ట్రికల్ లేదా సివిల్ విభాగంలో చేరతా.
* ధ్యాసంతా చదువుపైనే - మజ్జి సందీప్‌కుమార్, ఏడో ర్యాంకరు, విజయనగరం
చిన్నతనం నుంచి చదువంటే నాకిష్టం. పట్టుదలగా చదివి రెండు రాష్ట్రాల ఎంసెట్లలోనూ పది లోపు ర్యాంకులు సాధించా. జేఈఈ మెయిన్స్‌లో 335 మార్కులు వచ్చాయి. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేరతా.
* కొత్త ఆవిష్కరణలకు కృషి - గార్లపాటి శ్రీకర్, ఎనిమిదో ర్యాంకరు, నాచారం
ఇది ఊహించిన ర్యాంకే. ప్రణాళికాబద్ధంగా రోజుకు 9 నుంచి 12 గంటలపాటు చదివాను. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి, సమాజాభివృద్ధికి దోహదపడే కొత్త ఆవిష్కరణలకు కృషి చేస్తా. ఏపీ ఎంసెట్‌లోనూ ఏడో ర్యాంకు వచ్చింది. నాన్న శ్రీనివాస్‌రావు వ్యాపారి. అమ్మ కృష్ణశ్రీ గృహిణి. ఇంటర్‌లో 975 మార్కులు, జేఈఈ మెయిన్స్‌లో 335 మార్కులు వచ్చాయి.
* ఐఏఎస్ కావడమే లక్ష్యం - దొంతుల అక్షిత్‌రెడ్డి, తొమ్మిదో ర్యాంకరు, వరంగల్
ఎంచుకున్న రంగంలో అందరికంటే ముందుండాలన్నదే నా ఆశయం. అందుకు తగినట్టుగానే ఎప్పటికప్పుడు సిద్ధపడుతున్నా. నేను రాసిన చాలా ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులొచ్చాయి. భవిష్యత్తులో ఐఐటీ ముంబయిలో బీటెక్ పూర్తిచేసి, ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా.
* ఒత్తిడి లేకుండానే ర్యాంకులు సాధించా - అనిరుథ్‌రెడ్డి, పదో ర్యాంకరు, హైదరాబాద్
ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు. స్వేచ్ఛగా చదువుకునే ఈ ర్యాంకు సాధించా. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు వచ్చింది. నాన్న శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ జెన్‌కోలో కార్యనిర్వాహక ఇంజినీరు.

Back
Entrance Exams