close
eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

ప్రధాన కథనాలు
ప్రశాంతంగా డిప్యూటీ సర్వేయర్ రాతపరీక్ష

ఈనాడు, హైదరాబాద్: డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు ఆదివారం (ఆగస్టు 20) నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా జరిగిందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జనరల్ నాలెడ్జి, సివిల్(ఐటీఐ) ట్రేడ్ సబ్జెక్టులుగా రాత పరీక్ష జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 273 పోస్టులకు 27068 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికి 56 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాత పరీక్ష రాసేందుకు హాల్‌టికెట్లు 26874 మంది డౌన్‌లోడ్ చేసుకోగా వీరిలో 21060 (78.37శాతం) మంది హాజరయ్యారని వెల్లడించారు.

టీఎస్‌పీఎస్సీ వద్ద అపరిష్కృతంగా ఆరువేల పోస్టులు
* రెవెన్యూలో 1498, మున్సిపాలిటీల్లో 541 ఖాళీలు
* అడిగిన వివరాలు అందజేయని శాఖాధిపతులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా.. ఆయా శాఖల అధిపతుల నుంచి సరైన సమాచారం రాకపోవడంతో వాటి భర్తీకి వీలుకావడం లేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద దాదాపు 6,000కు పైగా పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలు అపరిష్కృతంగా ఉన్నాయి. చిన్నచిన్న సమస్యలు, సాంకేతిక ఇబ్బందుతో ఇవి ప్రకటనల రూపం దాల్చడం లేదు. ఆర్థికశాఖ అనుమతి తరువాత సంబంధిత శాఖలు వివరాలు పంపించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్క రెవెన్యూ, పురపాలక శాఖల్లోనే దాదాపు 2,000 వరకు పోస్టులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అర్హతలు నిర్ణయించకపోవడం, వయోపరిమితిలో స్పష్టత కొరవడటం, ప్రత్యేక పోస్టులకు సర్వీసు నిబంధనలు లేకపోవడం ప్రధాన కారణాలు. ప్రభుత్వం అనుమతించిన పోస్టులు, ప్రభుత్వ విభాగాలు పంపిస్తున్న ప్రతిపాదనలు పరస్పర విరుద్ధంగా ఉంటుండటం గమనార్హం.
విభాగాధిపతుల అలసత్వం
వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించి వాటికి సర్కారు అనుమతులు మంజూరు చేస్తుంది. ఆ సమయంలోనే పోస్టుల సంఖ్య, రోస్టర్ పాయింట్, రిజర్వేషన్, స్థానికత, అర్హతలు, వయోపరిమితి తదితర విషయాలపై విభాగాధిపతులు స్పష్టత ఇవ్వాలి. కానీ ఈ విషయంలో అలసత్వం కనిపిస్తోంది. ఎలాంటి ప్రాథమిక సమాచారం లేకుండానే ఖాళీలను భర్తీ చేయాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. సాంకేతిక అంశాలను పరిశీలిస్తే సమచార లోపం ఉందని, అదనపు సమాచారమివ్వాలని కోరుతున్నా గడువులోగా సమాధానాలు రావడం లేదు.
* డీఎస్సీలో పోస్టుల సంఖ్య ఎంత ఉంటుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. తొలుత 8,792 పోస్టులు అని చెప్పినప్పటికీ, తర్వాత 12,000కు పైగా ఉండే అవకాశముందని పాఠశాలవిద్య వర్గాలు పేర్కొన్నాయి. చివరకు టీఎస్‌పీఎస్సీకి ఇచ్చిన జాబితాలో 11,000కు తగ్గాయి.
* జీహెచ్ఎంసీలో వివిధ పోస్టులకు సంబంధించి ఏడాది క్రితమే అనుమతులిచ్చినా నేటికీ సర్వీసు నిబంధనలు రూపొందించలేదు. కొన్ని పోస్టుల పేరు మార్చినప్పటికీ, ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వలేదు.
* రెవెన్యూ శాఖలో కొన్ని పోస్టులకు సంబంధించి ఇంకా విభాగాధిపతుల నుంచి ప్రతిపాదనలు అందలేదు.
* వైద్య, కుటుంబ సంక్షేమశాఖలో దాదాపు 2,281 ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారం రాలేదు. పారామెడికల్ పోస్టుల సమాచారమే విభాగాధిపతి నుంచి వచ్చింది.
మరిన్ని పోస్టులకు ప్రకటనలు
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఇటీవల ప్రభుత్వం అటవీ, వైద్యశాఖలో 2,345 పోస్టుల ప్రకటనలు ఇచ్చింది. మరోవైపు ఆగస్టు 30న వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులకు ప్రకటన వెలువడనుంది. అలాగే ఒకవేళ డీఎస్సీకి అనుమతి వస్తే దాదాపు 11,000 వరకు పోస్టులు వచ్చే అవకాశముంది.
ఉద్యోగాల భర్తీకి పాత జిల్లాలే ప్రాతిపదిక
* 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యంకాదు
* కొలువుల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాత పది జిల్లాల ప్రాతిపదికగానే ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున కొలువుల భర్తీకి పాత జిల్లానే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 31 జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో కొత్తగా జారీ చేసే ఉద్యోగ ప్రకటనలకు ఈ జిల్లాల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోవాలా? పాత పది జిల్లాలనే తీసుకోవాలా? అనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయశాఖ సలహా కోరింది. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నంత వరకు పాత పది జిల్లాల ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉంటుందని గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వివిధ శాఖల్లో 84,878 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ఎలాంటి న్యాయ వివాదాలకూ తావులేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల ప్రాతిపదికగా కాకుండా 31 జిల్లాల ఆధారంగా ఉద్యోగ ప్రకటనలు జారీ అయితే న్యాయస్థానాలను ఎవరైనా ఆశ్రయిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం భావించింది. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడం లేదా రద్దు చేయడం సుదీర్ఘమైన ప్రక్రియ కావడంతో ప్రస్తుతానికి పది జిల్లాల ప్రాతిపదికగానే ఉద్యోగాల భర్తీలో ముందుకు వెళ్లనుంది.
నియామకాలు వేగవంతం
* ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు
* సందేహాల నివృత్తికి ప్రత్యేక కేంద్రం
* సాంకేతిక సమస్యలతోనే ఆగిన నోటిఫికేషన్లు
* ఏఈవో పోస్టులకు 30న ప్రకటన జారీ
* త్వరలో డీఎస్సీ ప్రకటన
* 'ఈనాడు'తో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు 17,955 పోస్టులకు 58 ఉద్యోగ ప్రకటనలు ఇచ్చిందని చెప్పారు. సాంకేతిక సందేహాలపై వివరణలు వస్తే మరో 8,167 పోస్టులకు ప్రకటనలు జారీ చేస్తామన్నారు. గ్రూప్-2 నియామకాల ప్రక్రియపై న్యాయస్థానంలో అప్పీలు చేస్తున్నామని చెప్పారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా గ్రూప్-1 పోస్టులపై సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన ఏడాదిలోనే దాదాపు ప్రక్రియ పూర్తిచేయగలిగామని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య పోస్టుల పంపకంపై నెలకొన్న సందిగ్ధంతో కొంత ఆలస్యమైందని, లేదంటే ఇప్పటికే గ్రూప్-1 నియామకాలు జరిగిపోయేవని వివరించారు. ఉద్యోగ ప్రకటనతో రాతపరీక్ష, ఇంటర్వ్యూ, నియామకంపై నిర్ధిష్టమైన కాలపరిమితితో కేలండర్‌ను ఇస్తున్నామని వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ నియామకాలపై 'ఈనాడు'తో ప్రత్యేకంగా మాట్లాడారు..
ప్రశ్న: భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి టీఎస్‌పీఎస్సీ సన్నద్ధత ఏమిటి?
పారదర్శకంగా గడువులోగా నియామక ప్రక్రియ వేగవంతం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. గతంలో రెండేళ్లు పట్టే నియామక ప్రక్రియను 4 నెలల్లో పూర్తిచేస్తున్నాం. విధానపరమైన కారణాలతో ఆలస్యం జరిగితే తప్ప, జాప్యానికి అవకాశం లేదు. ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన ఖాళీల డిమాండ్ మేరకు ప్రకటనలు ఇస్తున్నాం.
ప్రశ్న: గురుకుల పోస్టుల అర్హతల విషయంలో టీఎస్‌పీఎస్సీ విమర్శలు ఎదుర్కొంది కదా!
ఉద్యోగ ప్రకటనల సమయంలో అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ తదితరాలన్నీ సంబంధిత విభాగాలు ఖరారు చేస్తాయి. గురుకులాలకు సంబంధించి ఐదు సొసైటీలున్నాయి. అవి సర్వీసు నిబంధనలు సిద్ధం చేసుకుని పంపిన ప్రతిపాదనలతో ఫిబ్రవరిలో ప్రకటనలు ఇచ్చాం. అర్హతలు జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని చెప్పడంతో వాటిని రద్దుచేసి, సవరణతో ప్రకటనలు ఇచ్చాం. మహిళా రిజర్వేషన్‌పై ప్రకటన వచ్చినపుడు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. పరీక్షల సమయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అవి వాయిదాపడ్డాయి. చివరకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో త్వరలో జరగనున్నాయి. గురుకులాల్లో పోస్టుల భర్తీ ఆలస్యానికి టీఎస్‌పీఎస్సీ కారణం కాదు.
ప్రశ్న: ఆర్థికశాఖ అనుమతులు జారీ చేస్తున్నా ఉద్యోగ ప్రకటనలు ఎందుకు రావడం లేదు?
ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేశాక సర్వీసు నిబంధనల ప్రకారం విద్యార్హత, వయోపరిమితి, రిజర్వేషన్, జోనల్, స్థానికత, రోస్టర్ లెక్కింపు తదితర 16 అంశాలను సరిచూసి, సంబంధిత విభాగాధిపతులు టీఎస్‌పీఎస్సీకి వివరాలు పంపించాలి. వాటిని పరిశీలించి, న్యాయ వివాదాలకు తావులేకుండా, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వివరాలన్నీ ఉన్నాయో లేదో చూస్తాం. అన్నీ అనుకూలంగా ఉంటే ప్రకటన జారీ చేస్తాం. లేకుంటే మరిన్ని వివరాలు తెప్పిస్తాం. ప్రభుత్వ విభాగాల్లో కొన్ని పోస్టులకు సర్వీసు నిబంధనలు లేవు. పునర్విభజన నేపథ్యంలో రోస్టర్ ఎప్పటినుంచి లెక్కించాలన్న సందేహాలున్నాయి. టీఎస్‌పీఎస్సీకి సకాలంలో వివరాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ఇది జరిగితే నియామకాలు వేగం పుంజుకుంటాయి.
ప్రశ్న: నియామకాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? మీకు పోస్టుల వివరాలు అందలేదా?
ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పది జిల్లాలను ప్రాతిపదికన తీసుకోవాలా? కొత్త జిల్లాలను పరిశీలించాలా? స్థానికత ఎలా? తదితర విషయాలపై సందిగ్ధం నెలకొంది. ఇదంతా ప్రభుత్వ వ్యవహారం. ప్రభుత్వం నుంచి మాకు 30 జిల్లాల్లో పోస్టుల జాబితా అనధికారంగా వచ్చింది. అందులో 11,000 వరకు పోస్టులున్నాయి. కానీ సమగ్రమైన జీవో ద్వారా రాలేదు. దీనిపై పాఠశాల విద్యాశాఖ ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక రెండురోజుల్లో రానున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎన్ని పోస్టులున్నాయన్న ప్రతిపాదనలు వస్తే ఆ మేరకు పదిరోజుల్లో ప్రకటన జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
ప్రశ్న: జాబితా ప్రకటించిన తరువాత కీలో సవరణలు చేయడంపై నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది కదా?
నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు, అభ్యర్థుల్లో ఆందోళనలు దూరం చేసేందుకు కీలో సవరణలు చేశాం. తప్పుడు ప్రశ్నలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ప్రశ్నకు సమాధానాల విషయంలో రెండు, మూడు రిఫరెన్సులు చూడాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ ఒకే రిఫరెన్సుతో ముందుకు వెళ్లడంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇకనుంచి ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ప్రాథమిక కీ, అభ్యంతరాల నమోదు, తుదికీ విడుదలకు కచ్చితమైన గడువుతో మార్గదర్శకాలు రూపొందించాం. తుదికీ తరువాత అభ్యంతరాలు స్వీకరించడం లేదు. యూపీఎస్సీలో కీ ఇవ్వరు. తెలంగాణలో పారదర్శకత మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం.
ప్రశ్న: ఆన్‌లైన్ పరీక్షలో పేరు తెచ్చుకుని.. ఇప్పుడు కనీసం వెబ్‌సైట్‌ను నిర్వహించలేకపోతున్నారన్న విమర్శలున్నాయి?
ఆన్‌లైన్ నియామక పరీక్షల నిర్వహణలో దేశంలో మొదటిస్థానంలో ఉన్నాం. ఇప్పటి వరకు 13 లక్షలమంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు రాశారు. వీటి నిర్వహణకు ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. గతంలో ఒకటి రెండు పరీక్షల్లో కొన్ని కేంద్రాల్లో సర్వర్, సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. భారీ సంఖ్యలో అభ్యర్థులు ఉంటే ఆఫ్‌లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సీజీజీ నిర్వహిస్తోంది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా 040-23542185, 23542187 నెంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చాం. టీఎస్‌పీఎస్సీకి ప్రత్యేక ఐటీ సెంటర్ పరికరాల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రశ్న: అర్హతల విషయంలో నిబంధనలు సరిగా లేవని తెలిస్తే, మీరు వ్యతిరేకించే అవకాశం ఉంటుందా?
టీఎస్‌పీఎస్సీ నియామక సంస్థ మాత్రమే. మా అభిప్రాయాలను ప్రభుత్వంపై రుద్దడానికి లేదు. నియామకానికి అవసరమైన నిబంధనలు, జీవోలు, నిబంధనలు, న్యాయవివాదాలు తలెత్తకుండా ఆధారాలు ఉన్నాయా అనే విషయాలే చూస్తాం. జీవోలు లేకుంటే జీవోలు కావాలని, నిబంధనలు లేకుంటే రూపొందించాలన్న సలహాలు మాత్రమే ఇస్తాం. అంతేకానీ అర్హతలు, వయోపరిమితి విషయంలో రాజ్యాంగబద్ధమైన సంస్థగా ప్రభుత్వ వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోం.
ప్రశ్న: మౌఖిక పరీక్షల్లో ఏమైనా మార్పులు చేశారా?
మౌఖిక పరీక్షల్లో అభ్యర్థి జ్ఞాపకశక్తి, ప్రతిభపై కాకుండా వ్యక్తిత్వంపై ఎక్కువగా దృష్టిసారించాం. సర్కారు బోర్డులో ప్రభుత్వ అధికారులను నియమించింది. గతంలో మాదిరి కాకుండా మరింత పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. మౌఖికపరీక్షల్లో మార్పులు, పారదర్శకత విధానంపై అభ్యర్థులు సానుకూలంగా, ఆనందంగా ఉన్నారు.
టీఎస్‌పీఎస్సీ ప్రగతి
ఉద్యోగ ప్రకటనలు - 58
ఖాళీ పోస్టులు - 17,955
భర్తీ చేసినవి - 4,432
కోర్టు కేసులతో ఫలితాలు నిలిచినవి (గ్రూప్-1, 2, ఎక్సైజ్ కానిస్టేబుల్) - 1,500
నియామక ప్రక్రియ కొనసాగుతున్నవి : 12,151
ప్రకటనలు జారీ చేయాల్సిన పోస్టులు - 8,167
ఆన్‌లైన్‌లో గ్రూప్‌-2 ప్ర‌ధాన ప‌రీక్ష జ‌వాబు ప‌త్రాలు
ఈనాడు, అమ‌రావ‌తి: జులై 15, 16 తేదీల్లో జరిగిన గ్రూప్-2 ప్రధాన పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలను ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో ఉంచారు. గ్రూప్-2 పరీక్షకు సంబంధించి తొలిసారిగా ఏ వివాదానికీ తావులేని విధంగా ప్రతి అభ్యర్థి జవాబు పత్రాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అయితే, గీతం విశ్వవిద్యాలయంలో తలెత్తిన సాంకేతిక ఇబ్బంది ఆధారంగా నిరసనకు దిగిన కొందరి అభ్యర్థులను మాత్రం దీని నుంచి మినహాయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వై.వి.ఎస్.టి.సాయి వెల్లడించారు.
గ్రూప్-2 ప్రకటన ద్వారా 982 పోస్టులకు భర్తీకి ప్రాథమిక పరీక్ష ద్వారా మొత్తం 49,106 మందిని మెయిన్స్ పరీక్ష కోసం ఎంపిక చేశారు. వారిలో జూన్ 15, 16 తేదీల్లో జరిగిన పరీక్షకు 45,228 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే మొదటి రోజు పరీక్ష జరిగే సమయానికి గీతం విశ్వవిద్యాలయం పరీక్ష కేంద్రంలో సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. ఈ పరిస్థితిపై ఆగ్రహించిన 226 మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రం బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. అదే కేంద్రంలో పరీక్ష రాస్తున్న మరో 67 మంది మాత్రం పరీక్ష కేంద్రం నుంచి బయటికి రాలేదు. మొత్తం ఈ వ్యవహారాన్ని సీసీ కెమెరాల ద్వారా పరీశీలించిన ఏపీపీఎస్సీ బయటికి వచ్చి ఆందోళన చేసిన అభ్యర్థులను పరీక్ష నుంచి తొలగించడంతో పాటు వారిపై పోలీసు చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే నిర్ణయించింది.
గీతం పరీక్ష కేంద్రం నుంచి బయటికి రాకుండా కొంచెం ఆలస్యంగానైనా పరీక్ష ముగించుకున్న 67 మంది జవాబు పత్రాలను మూల్యాంకనానికి స్వీకరించి వాటిని ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. త్వ‌ర‌లోనే గ్రూప్-2 ఫలితాలు వెల్లడించేందుకు సమాయత్తం అవుతున్నామన్నామని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.
ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతం
* న్యాయపర ఇబ్బందులు తలెత్తకుండా ప్రకటనలు
* శాఖల వారీగా భర్తీకి వివరాలు సిద్ధం చేయాలి
* ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రకటనలు జారీ చేసి త్వరితగతిన ఉద్యోగాల భర్తీకి సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో బుధవారం (ఆగస్టు 16) సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా తదితరులతో సమావేశం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. భర్తీకి రోడ్ మ్యాప్ తయారు చేయాలని సీఎం ఆదేశించడంతో అధికారులు సమావేశమయ్యారు. ఉద్యోగ ఖాళీలను త్వరగా భర్తీ చేయడానికి, న్యాయపరమైన అడ్డంకులు లేకుండా టీఎస్‌పీఎస్సీ ద్వారా ప్రకటనల జారీకి గల మార్గదర్శకాలను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. ఇప్పుడు అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాత పది జిల్లాల ప్రాతిపదిక చేసుకొని ప్రకటనలు జారీ చేయాలా? కొత్తగా ఏర్పాటు చేసుకున్న 31 జిల్లాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాలా అన్నదానిపై న్యాయశాఖ తన ప్రతిపాదనలు, సలహాలను వెంటనే ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కడియం ఆదేశించారు. శాఖలు, కేడర్ వారీగా ఖాళీల సంఖ్యను గుర్తించి వివరాలు ఇవ్వాలని, వాటి భర్తీకి అభ్యర్థులకు కావాల్సిన విద్యార్హతలు, రోస్టర్ పాయింట్లను రూపొందించాలన్నారు.
21 మరోసారి సమావేశం
ఆగస్టు 21న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మరోసారి ఇదే అంశంపై సమావేశం కావాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ చక్రపాణి విలేఖర్లతో మాట్లాడుతూ.. భర్తీ ఎలా చేయాలన్న దానిపైనే చర్చ సాగిందన్నారు. అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు కదా అని ప్రశ్నించగా వారు ప్రభుత్వ ఆదేశాలపైనే న్యాయస్థానాలకు వెళ్తున్నారని.. ప్రభుత్వ ఉత్తర్వులనే తాము పాటిస్తామని సమాధానమిచ్చారు. సమావేశంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు జారీ
* అటవీశాఖలో 2014, వైద్యశాఖలో 331 పోస్టులు
ఈనాడు, హైదరాబాద్: అటవీ, వైద్యశాఖల్లో 2345 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైద్య విధానపరిషత్, వైద్యవిద్య డైరెక్టరేట్, బీమా వైద్యసేవలు, అటవీ శాఖల్లో ఉద్యోగాలకు తొమ్మిది ప్రకటనలు విడుదలయ్యాయి. మంగళవారం (ఆగస్టు 15) టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఛైర్మన్ చక్రపాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ ప్రగతి, ఉద్యోగ నియామక ప్రక్రియ గురించి వివరించారు. వైద్య పోస్టులకు ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 15 వరకు, అటవీ పోస్టులకు 21 నుంచి సెప్టెంబరు 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనల్లో అత్యధికంగా అటవీ బీట్ అధికారుల పోస్టులు 1857 ఉన్నాయి. అటవీశాఖలో 2014 పోస్టులు, వైద్యశాఖలో 331 పోస్టులకు ప్రకటనలు వెలువడ్డాయి. విద్యార్హతలు, పోస్టులు, దరఖాస్తు తేదీ వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కార్యదర్శి వాణీప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రకటన సంఖ్య పోస్టుపేరు ఉద్యోగాల సంఖ్య
40/2017 - సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (స్పెషాలిటీస్) 205
41/2017 - డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు 10
42/2017 - వైద్యవిద్యలో ట్యూటర్లు 65
43/2017- రేడియాలజికల్ ఫిజిక్స్, ఫిజిసిస్ట్ లెక్చరర్లు 06
44/2017- సివిల్ అసిస్టెంట్ సర్జన్లు(బీమా వైద్యసేవలు) 43
45/2017- అసిస్టెంట్ ఫిజియోథెరపిస్టు(బీమా వైద్యసేవలు) 02
46/2017- అటవీ రేంజ్ అధికారులు 67
47/2017- అటవీ సెక్షన్ అధికారులు 90
48/2017- అటవీ బీట్ అధికారులు 1857
వెత్తం పోస్టులు: 2345
నిరుద్యోగులకు పంద్రాగస్టు కానుక
* నేడు 2345 ఉద్యోగాల ప్రకటన
* అటవీ, వైద్యశాఖల్లో పోస్టుల భర్తీ
ఈనాడు, హైదరాబాద్: పంద్రాగస్టు కానుకగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) 2345 పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. అటవీశాఖ, వైద్య ఆరోగ్యశాఖలోని ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టనుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్, దంతవైద్యులు, లెక్చరర్లు, ఫిజియోథెరపీ పోస్టులు ఉన్నాయి. అటవీశాఖలో అత్యధికంగా 1857 అటవీ బీట్ ఉద్యోగాలకు ప్రకటన రానుంది. గతంలో రద్దుచేసిన గురుకుల పోస్టుల రాతపరీక్షలు ఆగస్టు నెలాఖరు నుంచి మొదలు కానున్నాయి. ఇకనుంచి నవంబరు వరకు ప్రతి శని, ఆదివారాల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రూప్-1లో 128 పోస్టులకు మౌఖిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల విద్యార్హతలు, వయసు, వైద్యపరీక్షల వివరాల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించే పనిలో టీఎస్‌పీఎస్సీ నిమగ్నమైంది. గ్రూప్-1పై కొన్ని న్యాయవివాదాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. రెండు, మూడు రోజుల్లో న్యాయస్థానం సమ్మతి తీసుకుని మెరిట్ జాబితాను ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది.
ఉద్యోగ ప్రకటనల్లో కొన్ని పోస్టుల వివరాలు
సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ (స్పెషాలిటీ)- 205
దంత వైద్యులు- 10
లెక్చరర్లు- 6
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (ఈఎస్ఐ)- 43
అటవీ బీట్ అధికారులు- 1857
అటవీ సెక్షన్ అధికారులు- 90
అటవీ రేంజ్ అధికారులు- 67
సివిల్స్‌ మెయిన్స్‌కు... ఏమేం ప్రధానం?
ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ దగ్గరపడు తున్నాయి.ఈ ప్రధానపరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో కాకుండా వ్యాసరూపంలో జరుగుతుంది. లిఖిత రూపంలో అభ్యర్థుల భావ వ్యక్తీకరణకు ఇది సవాలులాంటిది. దీని సన్నద్ధతను నిర్దిష్టంగా, ప్రభావశీలంగా మలుచుకోవాలంటే ఏమేం గమనించాలి? ఆచరించాలి?
సివిల్స్‌ ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. దాదాపుగా 13,000 మంది అభ్యర్థులు అర్హత సాధించారు, అక్టోబరులో జరిగే మెయిన్స్‌ పరీక్షను రాయబోతున్నారు. వారికింకా తగినంత సమయం కూడా లేదు. అర్హత సాధించని మెజారిటీ అభ్యర్థులు వచ్చే సంవత్సరం నిర్వహించబోయే పరీక్షల వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ వారు వచ్చే ఏడాది ఈ పరీక్షలో అర్హత సాధించినా, వారికి తక్కువ సమయం ఉన్నట్లుగా భావించే అకాశముంది. కాబట్టి వారు ఇప్పటినుంచే మెయిన్స్‌కు సన్నద్ధమవడం మేలు. నిజానికి వారు ప్రిలిమినరీలో అర్హత సాధించినట్లుగా భావించి, మెయిన్స్‌కు సన్నద్ధత ప్రారంభించడం మంచిది. ఈ ఆలోచన ఆచరణీయమేనా అనిపించొచ్చు కానీ, అమలుపరిస్తే వచ్చే ఏడాది విజయం సాధించే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. లిమినరీ సిలబస్‌లోని అంశాలు మెయిన్స్‌ సిలబస్‌లో 75% కలుస్తున్నాయి. కరంట్‌ అఫైర్‌ నుంచి జీకే, జాగ్రఫీ... ఇలా రెండు పరీక్షలకూ చదవాల్సిన అంశాలున్నాయి. వాటి జాబితాను ఇక్కడ చూడండి.
మెయిన్స్‌ సన్నద్ధత ప్రిలిమ్స్‌తో పోల్చినపుడు ఏవిధంగా భిన్నం?
మెయిన్స్‌కూ, ప్రిలిమ్స్‌కీ సన్నద్ధతకు సంబంధించిన పునాది ఒకేలా ఉంటుంది. కాన్సెప్టులను అర్థం చేసుకోవడం ముఖ్యం. కాన్సెప్టులను అర్థం చేసుకున్నాక ప్రిలిమ్స్‌ సన్నద్ధతలో వాస్తవాధారిత అంశాలుండాలి. అదే మెయిన్స్‌కు అయితే వాస్తవాలు, అభిప్రాయాలు, విశ్లేషణలను జోడించాలి. అయినప్పటికీ చాలామంది అభ్యర్థుల్లో కొన్ని సందేహాలున్నాయి. అవి..
* మెయిన్స్‌ సన్నద్ధత ప్రిలిమ్స్‌తో పోల్చినపుడు ఏవిధంగా భిన్నం?
* ఒక అంశాన్ని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లకు చదవడం ఎలా? వాటిని ఎలా అనుసంధానించి చదవాలి?
* మెయిన్స్‌లో పరిశీలించేవేమిటి? సమాధానాలను ఎలా రాయాలి?
* వీటికి తగిన సమాధానాలను అన్వేషిస్తే నిశ్చింతగా పరీక్షకు సిద్ధం కావొచ్చు.
ఒక అంశాన్ని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లకు చదవడం ఎలా? వాటిని ఎలా అనుసంధానించి చదవాలి?
ప్రాథమికాంశాలను పూర్తిచేశాక అభ్యర్థి సహజంగానే ముఖ్యమైన అంశాల చిత్రాన్ని మనసులోనే రూపొందించుకోవాలి. అది వర్తమాన వ్యవహారాలవైపునకు దారి తీస్తుంది. నిజానికి ప్రశ్నలు వర్తమాన వ్యవహారాల ఆధారంగానే ఉంటాయి. ఒకసారి టాపిక్‌లను ఎంపిక చేసుకుంటే సన్నద్ధత ప్రారంభించవచ్చు.
* ఉదాహరణకు- ఇటీవల వార్తాపత్రికల్లో ఆర్టికల్‌ 35-ఏ గురించి చదువుతున్నాం. ఈ అంశంపై కింది ప్రశ్నలు వేసుకుని, వాటికి సమాధానాలను వివరంగా సేకరించాలి.
* ఆర్టికల్‌ 35-ఏ ఏమిటి? ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది?
* జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి దాని ప్రాముఖ్యం ఏమిటి?
* ఈ ఆర్టికల్‌ ఎందుకు చర్చనీయాంశమవుతోంది?
* దీన్ని మార్చడానికి వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
* ఈ సమాచారంలో వాస్తవాధారిత ప్రాథమికాంశాలు ప్రిలిమ్స్‌కు ఉపయోగపడతాయి. మిగిలిన అంశాలైన కాలక్రమానుగత పరిణామాలూ, వివిధ సంస్థల అభిప్రాయాలూ, చర్చలూ... ఇవన్నీ మెయిన్స్‌ పరీక్ష కోణంలో ముఖ్యమైనవి.
మెయిన్స్‌లో పరిశీలించేవేమిటి? సమాధానాలను ఎలా రాయాలి?
సివిల్స్‌ ప్రధాన పరీక్షను మూల్యాంకనం చేసేవారు జవాబు పత్రంలో ‘పాయింట్ల’ కోసం చూస్తారు. అది 20 మార్కుల ప్రశ్న అయితే వీలైనన్ని పాయింట్లు ఉండాలని ఆశిస్తారు. దీన్ని ఓ ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇటీవల నాగార్జున సాగర్‌కు 29 కి.మీ. వాయవ్యదిశలో భూకంపం సంభవించింది. దీన్ని జాతీయ జియోఫిజికల్‌ పరిశోధన కేంద్రం (NGRI) జులై 26న కనిపెట్టింది. ఈ పరిణామం రెండు అంశాలను (భారీ రిజర్వాయర్ల వద్ద భూ ప్రకంపనాలను పరిశీలించటం, పెద్ద ఆనకట్టలకు సంబంధించిన పర్యావరణ అంశాలపై దృష్టి పెట్టాలనే భావన) వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో రాదగ్గ ప్రశ్న-
Q : 'WHAT ARE THE ECOLOGICAL IMPACTS OF LARGE DAMS ?'
A: Experience from all over the world has shown that large dams have major environmental and ecological impacts. Some of these are listed below:
Upstream (including reservoir) (1) soil erosion; (2) micro-climatic changes; (3) loss of forests, flora, and fauna; (4) changes in floral and faunal density and diversity; (5) changes in fisheries, especially on spawning grounds; (6) chain effects on catchment area due to constructions, displacement, etc.; (7) landslips, siltation and sedimentation; (8) breeding of vectors in reservoir and increase in related diseases; (9) seismicity; (10) loss of non-forest land; (11) water logging around reservoir ; and (12) growth of weeds. Downstream (including command area); (1) water logging and salinity; (2) reduced water flow and deposition in river, with related impacts on aquatic ecosystem, flora and fauna; (3) micro- climatic changes; (4) flash-floods; (5) salt-water ingress at river mouth; (6) changes in coastal ecosystem (e.g., mangroves); (7) loss of land fertility along river; and (8) vector breeding and increase in related diseases. ఈ జవాబులో 20 పాయింట్లు ఉన్నాయి కదా! సాధారణంగా ఇది 20 మార్కుల ప్రశ్నగా రావొచ్చు. అంటే పాయింటుకో మార్కు ఉంటుందని వూహించవచ్చు.
రాత సాధన ఎందుకు అవసరం?
సివిల్‌ సర్వెంట్‌ పరిణతిని సూచించేలా రాయగలిగివుండాలి. వ్యాకరణ దోషాలు, అక్షరక్రమ (స్పెలింగ్‌) లోపాలు లేకుండా జాగ్రత్తపడాలి. పదాడంబరం పనికిరాదు. సందర్భ శుద్ధిలేని గణాంకాలను ఏకరువు పెట్టడం తగదు. సివిల్స్‌కు అవసరమైన పుస్తకాలన్నీ చదివేసి వివిధ అంశాలపై పరిజ్ఞానం సంపాదించినవారు దాన్ని రాతపూర్వకంగానే అది కూడా నియమిత కాలవ్యవధిలో ప్రదర్శించాల్సివుంటుంది. అందుకు రాత సాధన చాలా ముఖ్యం. కొందరు... మొదట అన్ని అంశాల్లో పరిజ్ఞానాన్ని సంపాదించేదాక వేచిఉండి, ఆ తర్వాత రాయడాన్ని సాధన చేయాలని సలహా ఇస్తుంటారు. ఇది అర్థరహితమైన వాదన. అన్ని అంశాల్లో అభ్యర్థికి ‘తగినంత’ పరిజ్ఞానం ఎప్పటికి లభిస్తుంది? మెయిన్స్‌ పరీక్షకు నెలరోజుల ముందా? రెండు నెలల ముందా? అప్పుడైతే రోజుకు 4-5 గంటల రాత సాధన అవసరమవుతుంది. మరి వార్తాపత్రికలు చదవటం, తయారు చేసుకున్న నోట్సు/ పుస్తకాలను పునశ్చరణ చేయటం, నమూనా పరీక్షలు రాయటం.. వీటికి సమయం ఎక్కడ ఉంటుంది? అందుకే సమాధానాలను రాసే సాధన సన్నద్ధతతోపాటే కొనసాగాలి. అస్పష్టమైన అవగాహన ఉన్న అంశంపైన కూడా కొన్ని పాయింట్లను రాయగలిగేలా తయారు కావాలి. మెయిన్స్‌ పరీక్షలో ఒక రోజు సమయంలో 8000 నుంచి 10,000 కుపైగా పదాలను రాయాల్సి ఉంటుంది. కాబట్టి, ఒక నిర్ణీత సమయంపాటు రాయడాన్ని అలవాటు చేసుకోకపోతే పరీక్ష కేంద్రంలో చిక్కులు ఎదురవుతాయి. అభ్యర్థుల రాతలు సివిల్‌ సర్వెంట్‌ పరిణతిని సూచించేలా ఉండాలి. వ్యాకరణ దోషాలు, అక్షరక్రమ (స్పెలింగ్‌) లోపాలు లేకుండా జాగ్రత్తపడాలి. పదాడంబరం, సందర్భ శుద్ధిలేని గణాంకాలను ఏకరువు పెట్టడం తగదు. ప్రముఖుల కొటేషన్లనూ, జాతీయాలనూ వాడేటప్పుడు వాటిని ఇష్టం వచ్చినట్టు మార్చకుండా యథాతథంగా ఇవ్వాలి. అడిగిన ప్రశ్నకు నిర్దిష్టంగా జవాబు రాయటం, రాసే విషయాన్ని అవసరమైన పేరాగ్రాఫులుగా విడగొట్టటం, పాయింట్లు కనపడేలా అమర్చటం.. ఇవన్నీ అభ్యర్థి ఆలోచనా క్రమంలోని స్పష్టతను సూచిస్తాయి.
ఐటీఐఆర్‌పై స్పష్టత ఇవ్వాలి
* నాలుగేళ్లుగా నయాపైసా రాలేదు
* కేంద్ర ఐటీశాఖ మంత్రికి కేటీఆర్ లేఖ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణకు ఐటీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) వస్తుందా? రాదా అనే అంశంపై స్పష్టతనివ్వాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆయన ఆగ‌స్టు 13న‌ లేఖ రాశారు. ప్రాజెక్టును ప్రకటించి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ పైసా సాయం అందలేదన్నారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని 202 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు 2013 సెప్టెంబరులో కేంద్రం ప్రకటించింది. దీనిపై ఇప్పటికి రెండుసార్లు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాష్ట్రప్రభుత్వం సమర్పించింది. మౌలిక వసతుల కోసం మొదటి విడతలో రూ.3275కోట్లు, రెండో విడతలో రూ.3110 కోట్ల విడుదలకు కేంద్రం 2013 నవంబరు 13న ఆమోదం తెలిపింది. దీనిపై అనేకసార్లు కేంద్రానికి విన్నవించినా నిధులు రాలేదు. ఐటీఐఆర్‌పై మీతోనూ పలు దఫాలు సమావేశమయ్యాం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదు. మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. వృద్ధిరేటు, ఎగుమతులు పెరిగాయి. 2016-17లో ఐటీ ఎగుమతులు రూ.85479 కోట్లు. 2015-16 కంటే 13.85 శాతం పెరిగాయి. ఇది జాతీయ సగటు కంటే 4శాతం ఎక్కువ. పేరొందిన ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. టీహబ్, టాస్క్, ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసి తెలంగాణ ఉపాధి కల్పన, నూతన ఆవిష్కరణలు, పరిశ్రమల రంగంలో పురోగమిస్తోంది.
కేంద్రం సహకారం లేకున్నా
కేంద్రం నుంచి సహకారం లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఈరంగంలో ప్రగతిని సాధిస్తోంది. గతంలో అంగీకరించినట్లు వెంటనే ఐటీఐఆర్‌కు కేంద్రం నిధులను విడుదల చేయాలి. ఐటీఐఆర్ వస్తే హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు సమకూరుతాయి. ఉపాధి, పెట్టుబడులపరంగానే గాక దేశాభివృద్ధికి ఇది సహకరిస్తుంది. వెంటనే పరిష్కరించాలి అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
డీఎస్సీ విధివిధానాలు రూపొందించండి
* అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
* తాజా ప్రతిపాదనలతో మళ్లీ రావాలని సూచన
ఈనాడు, హైదరాబాద్‌: డీఎస్సీ నిర్వహణకు ఎటువంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో చర్చించి మళ్లీ విధి విధానాలు తయారు చేసుకొని రావాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం. అడ్వకేట్‌ జనరల్‌ సలహాలు తీసుకొని విధి విధానాలు, నిబంధనలు, విద్యార్హతలు తదితర వాటిపై పకడ్బందీగా నివేదికతో మళ్లీ రావాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ నిర్వహించే అంశంపై ఆయన ఆగస్టు 12న గంటపాటు అధికారులతో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ సమావేశంలో పాల్గొన్నారు. సెప్టెంబరు 11లోపు ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించాలని పలువురు అభ్యర్థులు విన్నవించినందున టెట్‌ ఫలితాలు వెలువడిన వెంటనే డీఎస్సీ నిర్వహిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీం కోర్టుకూ ఇదే విషయం తెలిపింది. కొత్త జిల్లాల వారీగా నియామకాలు చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినా దానివల్ల కొన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో మాత్రమే ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. స్థానికత ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలు చేసి ఆ తర్వాత ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహించాలని.. పాత జిల్లాల వారీగా డీఎస్సీ ప్రకటన ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగస్టు 12న అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో 8,792 ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. కొత్త జిల్లాల వారీగా అయితే కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ ఖాళీలు ఉంటాయన్నది అభ్యర్థుల్లో ఉన్న ఆందోళన అయితే వాటి సంఖ్యను పెంచవచ్చా? లేదా? అని కూడా పరిశీలించాలని సూచించినట్లు తెలిసింది. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలపైనా చర్చించినట్లు సమాచారం.
విద్యార్థుల నమోదుపై సీఎం ఆరా..
సర్కారు బడుల్లో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల నమోదుపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. గతేడాది కంటే ఈసారి 1,062 మంది విద్యార్థులు తగ్గారని అధికారులు నివేదించారు. గత సంవత్సరం 1-10 తరగతుల్లో 22,88,182 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా ఈసారి ఆ సంఖ్య 22,87120 మాత్రమే ఉందని, అయితే ప్రవేశాలకు సెప్టెంబరు 30 వరకు సమయం ఉందని చెప్పినట్లు తెలిసింది.
ఆన్‌లైన్ ద్వారా ఓయూ దూరవిద్యా కోర్సుల ప్రవేశాలు
* 16 నుంచి దరఖాస్తులు
ఓయూ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పీజీఆర్ఆర్‌సీడీఈ ద్వారా అందించే దూరవిద్యా కోర్సుల ప్రవేశ ప్రకటనను శనివారం విడుదల చేశారు. ఓయూ ఉపకులపతి రామచంద్రం, పీజీఆర్ఆర్‌సీడీఈ సంచాలకుడు చింత గణేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వర్సిటీ దూరవిద్యాకోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాల నిర్వహణతో పాటు రుసుముల స్వీకరణను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై అక్టోబరు 31తో ముగుస్తుందన్నారు. దూరవిద్య ద్వారా యూజీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసుకున్న తర్వాత ధ్రువపత్రాల పరిశీలనకు ఒకసారి కేంద్రానికి అభ్యర్థులు రావాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దూరవిద్యా కేంద్రం నూతన వెబ్‌సైట్, కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Website
నిరుద్యోగులకు పంద్రాగస్టు కానుక..!
* అటవీ, వైద్య శాఖల్లో 2,300 ఉద్యోగాల భర్తీకి అవకాశం
ఈనాడు, హైదరాబాద్‌: పంద్రాగస్టు కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ, వైద్యశాఖలో దాదాపు 2,300 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయనుంది. ఒక్క అటవీ శాఖలోనే దాదాపు 2 వేల వరకు పోస్టులు ఉండే అవకాశమున్నట్లు సమాచారం. వైద్యారోగ్య శాఖలో వైద్యుల ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమైంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (వైద్య) పోస్టులకు ఇంకా అర్హతలు ఖరారు కాలేదు. ఎంసీఐ నిబంధనల మేరకు అర్హతలు ఖరారుపై స్పష్టత వచ్చిన తరువాత ఆ పోస్టులకు ప్రత్యేకంగా ప్రకటన జారీకానున్నట్లు తెలిసింది. అటవీశాఖలో భర్తీచేసే ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలను ఆ శాఖ వేగంగా ఖరారు చేసింది. టీఎస్‌పీఎస్సీ అభ్యంతరాలు, సూచనలు ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుని యుద్ధప్రాతిపదికన ఆ ప్రక్రియ పూర్తిచేసిన నేపథ్యంలో ఆశాఖలో ఉద్యోగాల భర్తీప్రకటన జారీ చేసేందుకు మార్గం సుగమమయింది.
డీఎస్సీపై 17న తుది నిర్ణయం!
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో డీఎస్సీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు 17న ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త జిల్లాల ప్రకారం 8,792 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని కొందరు సమర్థిస్తుంటే.. దానివల్ల కొన్ని జిల్లాల్లో పోస్టులు అతి స్వల్పంగానే ఉంటాయని, పాత జిల్లాల ప్రకారమే జరపాలని మరికొందరు అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ సాధారణ పరిపాలనశాఖ, న్యాయశాఖ తదితర విభాగాల అధికారులతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్హతలకు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలను కూడా పరిశీలించనుంది.
నీట్‌లో ఏకరూప ప్రశ్నపత్రం
* సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
* ప్రమాణపత్రం దాఖలుకు ఆదేశం
దిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)లో ఆంగ్లం, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ ఏకరూప/సమరూప పశ్నప్రతం ఉండాలని సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని అమలుకు సంబంధించి ప్రమాణపత్రాన్ని దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్‌లో ప్రాంతీయ భాషల్లో ఇచ్చిన ప్రశ్న పత్రాల స్థాయి... ఆంగ్లం, హిందీ భాషల్లో ఇచ్చిన పశ్నపత్రాల స్థాయి కంటే కఠినంగా ఉందని, దీనివల్ల ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసిన వారికి నష్టం జరిగిందంటూ గత నెలలో కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే 2017 నీట్‌ను రద్దు చేయటానికి తిరస్కరించిన సుప్రీంకోర్టు ఇదే అంశంపై గురువారం (ఆగస్టు 10) విచారణ కొనసాగించింది. ప్రశ్నపత్రం ఏ భాషలో ఉన్నప్పటికీ ఏకరూప/సమరూపంలోనే ఉండాలని, వచ్చే ఏడాది నుంచి దీనిని అమలుచేసేందుకు ఏమిచేయబోతున్నారో ప్రమాణపత్రంలో తెలియజేయాలని జస్టిస్‌లు దీపక్ మిశ్రా, అమితవరాయ్, ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 10వ తేదీకి వాయిదా వేసింది.
నమూనా పరీక్షలే క్యాట్‌కు కీలకం
కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) ప్రకటన వెలువడింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) సంస్థలతోపాటు, దాదాపు అంతటి అత్యున్నత కళాశాలల్లో ఎంబీఏలో చేరటానికి క్యాట్‌లో మంచి స్కోరు సాధించాల్సి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం చదివితే ఈ పరీక్షలో విజయానికి ఆస్కారం ఉంటుంది!
క్యాట్‌లో పేర్కొన్న అంశాల పఠనానికి వెళ్లేముందు, అభ్యర్థులు స్వయం విశ్లేషణ చేసుకోవాలి. రోజుకు ఎంత సమయం వెచ్చించగలరనే పరిశీలనతో ఇది ప్రారంభం కావాలి. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నవారు, పూర్తిస్థాయి సమయం క్యాట్‌కే సిద్ధమవుతున్నవాళ్లు కూడా ఉంటారు. ఎంత సమయం నిత్యం వెచ్చించగలరన్నది కీలకం. తదనుగుణంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.
క్యాట్‌లో రాతపరీక్ష, బృంద చర్చ, మౌఖికపరీక్షలు ఉంటాయి. రాతపరీక్షలో మొత్తం మూడు సెక్షన్లుంటాయి. అవి:
1. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌
2. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌
3. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ
క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ
గణితంపై అంతగా పట్టులేని అభ్యర్థులు, ముందుగా ఆ అంశం నుంచే తమ సన్నద్ధతను ప్రారంభించాలి. మూడో సెక్షన్‌లోని క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ సరైన ఎంపిక. ఇందులో నంబర్‌ సిస్టమ్స్‌, అరిథ్‌మెటిక్‌తోపాటు జామెట్రీ, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, లీనియర్‌ ఈక్వేషన్స్‌, కాంప్లెక్స్‌ నంబర్స్‌, బైనామియల్‌ థీరమ్‌, ప్రొగ్రెషన్స్‌ తదితర అంశాలుంటాయి. వీటిల్లో నంబర్‌ సిస్టమ్‌తో సన్నద్ధత ప్రారంభించాలి. ఎందుకంటే గణిత సమీకరణాల సూక్ష్మీకరణ ఇందులో ప్రధానాంశం. మిగతా ఏ అంశాల్లో అయినా సరే, దీని ఉపయోగం ఉంటుంది. ఇందులో షార్ట్‌కట్స్‌ కూడా ఉంటాయి. అయితే వేగంగా సూక్ష్మీకరించాలంటే సాధనే మార్గం. నిత్యం కనీసంగా 100 లెక్కలను పరీక్ష పూర్తయ్యేవరకు కొనసాగించడం ద్వారా వేగం బాగా పెరుగుతుంది. మిగతా అంశాలకు సంబంధించి పూర్తిగా కాన్సెప్టులే కీలకం. అవసరం అయితే, పాఠశాల స్థాయి పుస్తకాలను తిరగేయడం ద్వారా పట్టు లభిస్తుంది. ఇప్పుడు చేయాల్సిందల్లా వాటికి అనువర్తనాన్ని చేయడమే. ఒక అంశాన్ని ఎంచుకుని దానిని వివిధ రకాలుగా ప్రశ్నలు వేస్తూ, పరిష్కరించాలి. ఫలితంగా ప్రశ్న కోణం అలవడుతుంది.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌
క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ తర్వాత సిద్ధం కావాల్సిన అంశమిది. అరిథ్‌మెటిక్‌లో నేర్చుకున్న నిష్పత్తులు, శాతాలు, సరాసరి ఇక్కడ కూడా ఉపయోగపడతాయి. అలాగే సూక్ష్మీకరణాలు ఎలాగూ నిత్యం సాధన చేస్తుంటాం కాబట్టి ఈ సెక్షన్‌ సన్నద్ధతకు పెద్దగా సమయం కేటాయించాల్సిన పనిలేదు. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో పట్టికలు, గ్రాఫ్‌లు, చార్ట్‌లు ఉంటాయి. ఇచ్చిన దత్తాంశాన్ని (డేటా) అభ్యర్థి అర్థం చేసుకుని ఎలా విశ్లేషించగలడో ఇందులో పరిశీలిస్తారు.
లాజికల్‌ రీజనింగ్‌
క్యాట్‌లో ఉన్న ఇతర అంశాలన్నీ అకడమిక్‌ చదువులో ఎప్పుడో ఒకప్పుడు సిలబస్‌లో భాగంగా ఉంటాయి. పూర్తిగా కొత్త అంశం ఇదే. అయితే వ్యక్తుల తార్కిక పరిజ్ఞానం, సమయస్ఫూర్తికి సంబంధించింది ఇది. ఇందులో నంబర్‌, లెటర్‌ సిరీస్‌, వెన్‌ డయాగ్రమ్స్‌, బైనరీ లాజిక్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, సిలాజిజం, లాజికల్‌ మ్యాచింగ్‌, లాజికల్‌ సీక్వెన్స్‌, లాజికల్‌ కనెక్టివ్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, ర్యాంకింగ్‌ తదితర అంశాలు ఉంటాయి. ఇందులో బ్లడ్‌ రిలేషన్స్‌ నుంచి ప్రారంభించి తర్వాత సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, ప¶¾జిల్స్‌కు వెళ్లాలి. ఇందులో ప్రాథమికాంశాలు అంటూ ఉండవు. నేరుగా సాధన పేపర్లను చేస్తూ వెళ్లాలి. క్రమం తప్పకుండా ఈ విభాగానికి సమయం కేటాయించాలి. పరీక్ష జరిగే వరకూ కూడా నిత్యం ఒక పేపర్‌ పూర్తిచేయాలి. ఈ విభాగంలోనే క్లాక్స్‌, క్యాలెండర్‌ ఆధారిత అంశాలు కూడా ఉంటాయి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో భాగంగా నేర్చుకుంటారు. కాబట్టి, సాధనకు పరిమితం అయితే చాలు.
వెర్బల్‌ ఎబిలిటీ
ఇంగ్లిష్‌ భాషపై పట్టును అడిగే అంశంగా దీనిని చెప్పుకోవచ్చు. వ్యాకరణంతోపాటు పదాల వాడకం ఎలా ఉంటుందన్న అంశంపై లోతుగా ప్రశ్నలు అడుగుతారు. సమాన, వ్యతిరేకార్థాలు (సిననిమ్స్‌, యాంటనిమ్స్‌), సెంటెన్స్‌ కరెక్షన్‌, జంబుల్డ్‌ పారాగ్రాఫ్‌, క్లోజ్‌టెస్ట్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ తదితర అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. ఇన్ఫరెన్సెస్‌, జడ్జిమెంట్‌ అంశాలు కూడా ఇందులో భాగమే. ఇంగ్లిష్‌ భాషపై పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా అభ్యర్థులు ప్యాసేజ్‌ను అర్థం చేసుకుని విశ్లేషించడం, అన్వయ రీతిని కూడా పరీక్షిస్తున్నారు. అందుకే, కొత్త ప్యాసేజీలు లేదా ఇంగ్లిష్‌ భాషలో కొత్త సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు చదువుతూ ప్రతి అంశాన్నీ విశ్లేషించుకోవాలి. ఎందుకు, ఏమిటి... ఇలా ప్రశ్నల పరంపరను వేసుకుంటూ వెళితే సమర్థంగా విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో వ్యాకరణానికి సంబంధించి ప్రాథమికాంశాలకు సిద్ధం కావాలి. అయితే అకడమిక్‌ తరహాలో కాకుండా ప్రతి వ్యాకరణ నియమం, నిత్యం వాడుక భాషలో ఎలా ఉపయోగపడుతుందో పరిశీలించుకుంటూ వెళ్లాలి. అలాగే పరీక్ష జరిగే వరకూ కూడా ప్రతిరోజూ 50 నుంచి 100 వరకు కొత్త పదాలను నేర్చుకుంటూ ఉండాలి.
రీడింగ్‌ కాంప్రహెన్షన్‌
ఇచ్చిన అంశాలపై అభ్యర్థి అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని ఈ అంశంలో పరీక్షిస్తారు. ఇంగ్లిష్‌ భాషపై ఎంత పట్టు ఉందో కూడా ఈ విభాగంలో తెలుస్తుంది. సందర్భానుసారంగా పదాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇందుకు రోజూ ఆంగ్లపత్రికలో వచ్చే సంపాదకీయాలు చదవాలి. రాజకీయాలు, బిజినెస్‌, పాలన, శాస్త్ర సాంకేతిక అంశాలు, సాహిత్యానికి సంబంధించినవి చదవాలి. అంతర్జాతీయ స్థాయి దినపత్రికలు కూడా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లభ్యం అవుతున్నాయి. వాటిని చదువుతూ అదే ప్యాసేజ్‌ పరీక్షలో వస్తే ఏ తరహా ప్రశ్నలు అడగవచ్చో వూహిస్తూ జవాబులను రాబట్టాలి. ఇలా చేయడం ద్వారా ఈ అంశంపై పట్టు లభిస్తుంది.
దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 9
ముగింపు: సెప్టెంబరు 20
అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌: అక్టోబరు 18 నుంచి
పరీక్ష:నవంబర్‌ 26 (రెండు స్లాట్లలో)
క్యాట్‌ను రాయడానికి కనీసం 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 45% మార్కులను కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవాళ్లు, గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం చదువుతున్నవాళ్లు అర్హులే. అయితే వారి ఎంపిక నిబంధనలకు లోబడి ఉంటుంది.
సమయపాలన కీలకం
ఈ ఏడాది నవంబర్‌ 26న క్యాట్‌ నిర్వహించనున్నారు. అంటే సుమారు 110 రోజుల సమయం పరీక్షకు అందుబాటులో ఉంది. ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు లేదా పూర్తిస్థాయి వెచ్చించలేనివాళ్లు కనీసంగా రెండు నెలల్లో ప్రాథమికాంశాలను పూర్తిచేయాలి. ఆ తర్వాత ప్రతిరోజూ ఒక పరీక్ష రాస్తూ వెళ్లాలి. ఎక్కువ తప్పులు చేస్తున్న అంశాలను గుర్తించి, వాటిలోనే ఎక్కువ సంఖ్యలో సాధన చేయడం మంచిది. సన్నద్ధతకు పూర్తి సమయం కేటాయించినవాళ్లు 15-20 రోజుల వ్యవధిలో ప్రాథమికాంశాలను పూర్తిచేయాలి. నిత్యం ఒక నమూనా పరీక్షను రాయడంతోపాటు ఒక్కో అంశంలో విడిగా పరీక్ష రాస్తూ వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధన మరవకూడదు. క్యాట్‌కు ఈ మాక్‌ పరీక్షలే కీలకం. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచిది. మంచి పర్సంటైల్‌ సాధించడం ద్వారా అత్యుత్తమ కళాశాలల్లో సీటును దక్కించుకోవచ్చు. పరీక్షహాలులోనూ సమయపాలన చాలా కీలకం. మొత్తం ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు ఉంటాయి. కేటాయించిన సమయం 180 నిమిషాలు. అయితే, ప్రతి అంశానికి సంబంధించి నిర్ణీత సమయం ఉంటుంది. ఆ విభాగంలోనే మరో ప్రశ్నకు వెళ్లవచ్చు కానీ, మరో విభాగానికి వెళ్లే ఆస్కారం ఉండదు.
1. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌: 32 ప్రశ్నలు - 60 నిమిషాలు
2. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: 34 ప్రశ్నలు - 60 నిమిషాలు
3. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌: 34 ప్రశ్నలు - 60 నిమిషాలు
అభ్యర్థికి ఏ స్లాట్‌ వస్తుందో ఇప్పుడు తెలియదు. కాబట్టి, రెండు స్లాట్లలో కచ్చితంగా పరీక్ష సమయాన్ని పాటిస్తూ నిజమైన పరీక్షను రాస్తున్నట్టే భావించాలి. దీనివల్ల అసలు పరీక్షలో ఒత్తిడి దూరం అవుతుంది.
ఈ సారి ఎంటెక్ సీటు కష్టమే!
* రెండేళ్లలో సగానికిపైగా సీట్లకు కోత
* ఎంఫార్మసీ సీట్లదీ ఇదే పరిస్థితి
ఈనాడు, హైదరాబాద్: ఎంటెక్‌లో చేరండి.. మేమే మీకు ఎదురు నగదు ఇస్తామనే పరిస్థితికి దాదాపు తెరపడే పరిస్థితి వచ్చింది. గత రెండేళ్లలో సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గడమే దీనికి కారణం. అధ్యాపకుల విషయంలో జేఎన్‌టీయూహెచ్ అమలు చేసిన నిబంధనలతో అసలుకే ఎసరు రాకుండా చాలా కళాశాలలు స్వయంగా ముందుగానే డిమాండ్ లేని, అధ్యాపకులు దొరకని కోర్సులను రద్దు చేసుకున్నాయి. మౌలిక వసతులు లేవని వర్సిటీ సైతం మరికొన్ని వందల సీట్లకు కోత పెట్టింది. మొత్తానికి 2015-16 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటివరకు సగానికిపైగా సీట్లు తగ్గిపోవడం గమనార్హం. రెండేళ్ల క్రితం వరకు ఎంటెక్ సీట్లను పిలిచి ఇచ్చేవారు. సీట్లు ఎక్కువ...చేరే వారు తక్కువ ఉండటంతో ఖాళీగా ఉంచడం కంటే చేరితే బోధనారుసుమైనా వస్తుంది కదాని విద్యార్థులను యాజమాన్యాలు ప్రలోభపెట్టి చేర్చుకునేవి. అందుకు వారికి కొంత ఎదురుముట్టచెప్పి బోధనా రుసుంను యాజమాన్యాలు తీసుకునేవి.
నిబంధనల పక్కా అమలుతో...
యాజమాన్యాల అక్రమాలను కట్టడి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జేఎన్‌టీయూహెచ్ నిబంధనల అమలును కఠినతరం చేస్తూ వచ్చింది. దాంతో కళాశాలలే స్వయంగా సీట్లను తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఈసారి ఒక బ్రాంచీకి ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్హతగల అధ్యాపకులుండాలన్న నిబంధన కచ్చితంగా అమలు చేయడంతో సీట్లకు భారీగా కోత పడింది. ఇప్పటివరకు పీజీ తరగతులు సక్రమంగా జరిగేవి కావు. తాత్కాలిక ఉద్యోగం చేసుకునే వారు, తరగతులకు వెళ్లకున్నా పీజీ పట్టా వస్తుంది కదానుకొనే వారు ప్రవేశాలు పొందేవారు. గతేడాది బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని జేఎన్‌టీయూహెచ్ కళాశాలలకు ఆదేశాలిచ్చినా సరిగా అమలు జరగలేదు. ఈసారి తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో ఈ నెల 11వ తేదీ నాటికి ప్రతి 100 మందికి ఒకటి చొప్పున బయోమెట్రిక్ యంత్రం ఏర్పాటు చేసి జేఎన్‌టీయూహెచ్ సర్వర్‌తో అనుసంధానం చేయాలని వర్సిటీ అధికారులు కళాశాలలకు తుది ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్ అమలు చేస్తే తరగతులకు వెళ్లక తప్పదని కొందరు, బోధనా రుసుములు రావని మరికొందరు విద్యార్థులు ప్రవేశాలకు వెనకడుగు వేస్తున్నారు.
సీట్లు 8951 ... అర్హులు 32 వేల మంది
పీజీఈసెట్‌లో అర్హులైన 29,742 మందితోపాటు గేట్, జీప్యాట్ ర్యాంకర్లు మరో 2157 మంది ఉన్నారు. కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఆగస్టు 12 వరకు గడువు ఉంది. 8వ తేదీ నాటికి 9 వేల మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది. 16న సీట్లు కేటాయిస్తారు. ఎంఈ/ఎంటెక్ సీట్లు 5,978, ఎంఫార్మసీ సీట్లు 2973 మాత్రమే కన్వీనర్ కోటా కింద అందుబాటులో ఉన్నాయి.
గత మూడేళ్లలో కన్వీనర్ కోటా సీట్లు ఇలా...
కోర్సు 2015-16 2016-17 2017-18
ఎంఈ/ఎంటెక్ 13,955 9270 5978
ఎంఫార్మసీ 7650 3435 2973
( * మరో 30 శాతం సీట్లు యాజమాన్య కోటా కింద ఉంటాయి)
మరో రెండేళ్లు గరిష్ఠ వయోపరిమితి పెంపుదల
* 2019 జులై 26 వరకు అమలు
* తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్సీ), ఇతర నియామక సంస్థల ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంపుదలను మరో రెండేళ్ల పాటు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 8) ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ నియామకాలకు మాత్రమే పెంపుదల అమలవుతుందని పోలీసు, ఆబ్కారి, అటవీ, అగ్నిమాపక, జైళ్ల శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులకు వర్తించదని తెలిపింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిరుద్యోగుల వినతి మేరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 34 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ 2015 జులై 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఈ ఉత్తర్వులను పొడిగించింది. ఆ గడువు గత నెల 26తో ముగిసింది. పదేళ్ల వయోపరిమితి పెంపును కొనసాగించాలని తాజాగా వినతులు వచ్చాయి. దీనికి అనుగుణంగా వయోపరిమితి పెంపుదలను మరో రెండేళ్ల పాటు అంటే 2019 జులై 26 వరకు అమలు చేసేందుకు తాజాగా ఆదేశాలిచ్చింది.
వైద్యశాఖలో 4,713 కొత్త పోస్టులు
* నియామకాల కోసం కసరత్తు
ఈనాడు, హైదరాబాద్‌: వైద్యారోగ్యశాఖలో దీర్ఘకాలంగా వేధిస్తున్న మానవ వనరుల సమస్యను తీర్చడానికి ఇటీవల 4713 కొత్త పోస్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే 2118 ఖాళీల భర్తీకి అవసరమైన మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌సర్వీస్‌కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ)కు వైద్యారోగ్యశాఖ పంపించింది. త్వరలోనే ఖాళీల భర్తీకి సంబంధించిన నియామక ప్రకటన వెలువడుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే కొత్తగా మంజూరు చేసిన పోస్టుల భర్తీ పైనా వైద్యారోగ్యశాఖ దృష్టిసారించింది. వీటికి సంబంధించి పక్కాగా మార్గదర్శకాలను రూపొందించడంలో నిమగ్నమైంది. అనంతరం మార్గదర్శకాలను టీఎస్‌పీఎస్‌సీకి పంపించనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
ముగిసిన గ్రూపు-3 ప్రధాన పరీక్షలు
ఈనాడు, అమరావతి: గ్రూపు-3 (పంచాయతీ కార్యదర్శి) ప్రధాన పరీక్షలు ముగిశాయి. ఆగస్టు 6, 7 తేదీల్లో (ఆదివారం తొమ్మిది, సోమవారం నాలుగు జిల్లాల్లో) ఆన్‌లైన్ ద్వారా ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 52750 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా పేప‌ర్‌-1కు 47878 (90.76 శాతం), పేప‌ర్‌-2కు 47904 (90.81 శాతం) మంది పరీక్ష రాశారు. 91% వరకు హాజరు నమోదైంది. ప్రశ్నపత్రాల 'కీని ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఆగస్టు 8 నుంచి అందుబాటులో ఉంచుతున్నారు. దీనిపై అభ్యంతరాలను ఆగస్టు 16 లోగా రాతపూర్వకంగా తెలియజేయాలని కార్యదర్శి వైవీఎస్టీ శాయి సూచించారు. అభ్యంతరాలకు తగిన ఆధారాలను చూపించాలని పేర్కొన్నారు.
సహనంతో శ్రమిస్తే... సీఏ
చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు కష్టమైనదనే భావన ఇప్పటికే చాలామందిలో ఉంది. చిత్తశుద్ధితో, శ్రద్ధగా కష్టపడి చదివితే సీఏ క్లిష్ట్టమేమీ కాదని నిరూపించాడు గుంటూరు విద్యార్థి పవన్‌ కుమార్‌. జీవితంలో త్వరగా స్థిరపడాలనీ, తద్వారా కుటుంబానికి ఆర్థిక చేయూతను ఇవ్వాలనీ నిర్ణయించుకున్నాడు. దానికోసం సీఏను కెరియర్‌గా ఎంచుకున్నాడు. కృషి చేసి, సీఏ ఫైనల్‌లో ఏకంగా అఖిలభారత స్థాయిలో 22వ ర్యాంకు సాధించాడు. సీఏ కోర్సు చదవడానికి తనకు ప్రేరణ ఏమిటి? సన్నద్ధత ఎలా సాగింది? అతడి మాటల్లోనే తెలుసుకుందాం!
పేరు: తిరుమలశెట్టి పవన్‌ కుమార్‌
పదోతరగతి:9.2 గ్రేడ్‌ పాయింట్లు
ఇంటర్మీడియట్‌: 971 మార్కులు ( రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు)
సీఏ-సీపీటీ: 184 మార్కులు
సీఏ-ఐపీసీసీ: 479/700 మార్కులు
సీఏ ఫైనల్‌: అఖిల భారత 22వ ర్యాంకు
గుంటూరు శివారులోని తురకపాలెం మా గ్రామం. నాన్న తిరుమలశెట్టి శ్రీనివాసరావు గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్లో సెక్యూరిటీ గార్డు; అమ్మ రమాదేవి గృహిణి. పదో తరగతి వరకు గుంటూరు నల్లపాడులోని కేంద్రీయ విద్యాలయంలో చదివాను. పదోతరగతిలో ఉన్నప్పుడు మా ఫిజిక్స్‌ మాస్టర్‌ మూర్తి గారి ద్వారా సీఏ కోర్సు గురించి తెలిసింది. ఇది తక్కువ సమయంలో పూర్తిచేయగల కోర్సు అనీ, జీవితంలో త్వరగా స్థిరపడవచ్చనీ చెప్పారాయన. అంతే కాదు; సీఏలకు మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయని కూడా తెలిపారు. ఇదే విషయం మా అమ్మానాన్నలకు చెప్పాను. వారు నా ఇష్టాన్ని గౌరవించి సీఏ చదవడానికి ప్రోత్సహించారు.
సీఏ కోర్సు చదవడానికి ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకుని చదవడమే సరైన విధానమని సీనియర్లు చెప్పారు. మాస్టర్‌ మైండ్స్‌ శిక్షణ సంస్థలో ఎంఈసీ, సీఏ కోర్సుల్లో చేరాను. ఇంటర్‌ ఎంఈసీ, సీఏ- సీపీటీ ఏకకాలంలో చదివాను. ఇంటర్‌లో 971 మార్కులతో రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంకు తెచ్చుకున్నాను. సీఏ-సీపీటీలో 200 మార్కులకుగానూ 184 మార్కులు వచ్చాయి. సీపీటీలో కేవలం ఒక్క మార్కుతో అఖిల భారతస్థాయి పదో ర్యాంకు చేజారింది. దాంతో సీఏ కోర్సు ఇంకా బాగా చదవాలన్న కసి నాలో పెరిగింది. సీఏలోని రెండోదశ ఐపీసీసీ సైతం మొదటి ప్రయత్నంలో 700 మార్కులకు 479 సాధించి, పూర్తిచేశాను. ఆర్టికల్‌షిప్‌ పూర్తిచేసిన తర్వాత సీఏ ఫైనల్‌ మొదటి ప్రయత్నంలో పూర్తిచేశాను. అది కూడా అఖిలభారత స్థాయిలో 22వ ర్యాంకులో నిలవడం సంతోషంగా అన్పిస్తోంది. మంచి సీఏగా రాణించాలన్నదే నా లక్ష్యం!
విజయ రహస్యాలు
* ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకుని చదవడం వల్ల ప్రాథమికాంశాలపై మంచి పట్టు సాధించగలిగాను. కాబట్టి సీఏ చదవాలనుకునేవారు ఇంటర్‌లో ఎంఈసీ ఎంచుకోవడం సరైనదని నా ప్రగాఢ విశ్వాసం.
* సీఏ కోర్సులోని ఏ దశలోనూ ఎటువంటి ఒత్తిడులకూ గురికాలేదు. అన్ని దశల్లోనూ ప్రశాంతతతో ఆలోచించి చదివి పూర్తిచేశాను.
* నన్ను నేను నమ్మాను. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువే. అదే నా విజయానికి సోపానమైందని నమ్ముతున్నాను.
* జీవితంలో త్వరగా స్థిరపడాలనే లక్ష్యం ఉంది కాబట్టి సీఏ పూర్తిచేసేవరకూ అనవసర విషయాలపై దృష్టి సారించలేదు. అందుకే అనుకున్నట్లుగానే సీఏ కోర్సు పూర్తి చేయగలిగాను.
* కొన్నిరోజులు కష్టపడి వదిలేస్తే సీఏ లాంటి కోర్సుల్లో విజయం కష్టం. ఈ కోర్సు కోసం నిరంతరం హార్డ్‌వర్క్‌ చేయవలసి ఉంటుంది.
పునశ్చరణ తప్పనిసరి
* సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు ఇచ్చే ప్రామాణిక మెటీరియల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. దీనివల్ల పరీక్షలు బాగా రాయవచ్చు. ఏది చదివినా ప్రణాళికబద్ధంగా చదవాలి. కోచింగ్‌ పూర్తయ్యాక ఆరు నెలల సమయాన్ని అధ్యయనానికీ, పునశ్చరణకూ కేటాయించాలి.
* సీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులో ప్రశ్నల కఠినత్వ స్థాయి ఎక్కువ. కాబట్టి చదివిన అంశాలనే కనీసం మూడుసార్లు పునశ్చరణ చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* విజయం సాధించడం ఎంత అవసరమో భావవ్యక్తీకరణ నైపుణ్యాలూ అంతే అవసరం. కాబట్టి సీఏ చదువుతున్న సమయంలోనే సెమినార్లు, వక్తృత్వ పోటీలు వంటి వాటిల్లో పాల్గొనగలిగితే ఈ నైపుణ్యాలను పెంచుకోవచ్చు.
* కోచింగ్‌ సమయంలోనూ, పునశ్చరణలోనూ ఒక్కమాటలో చెప్పాలంటే సీఏ కోర్సు పూర్తయ్యేవరకూ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం మంచిది.
* ఆర్టికల్‌షిప్‌లో లభించే ప్రాక్టికల్‌ విజ్ఞానం సీఏ ఫైనల్‌ కోర్సుకూ, సీఏ పూర్తయ్యాక చేయబోయే ప్రాక్టీస్‌కూ, ఉద్యోగానికీ చాలా అవసరం. కాబట్టి ఆర్టికల్‌షిప్‌ను సరదాగా కాకుండా శ్రద్ధగా, సీరియస్‌గా చేయాలి.
చదవాల్సిన పుస్తకాలు
* విద్యాసంస్థ ఇచ్చే మెటీరియల్‌తోపాటు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) వారి మెటీరియల్‌ చదవడం కూడా తప్పనిసరి.
* సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారి ప్రాక్టీస్‌ మాన్యువల్స్‌, రివిజన్‌ టెస్ట్‌ పేపర్స్‌, మాక్‌ టెస్ట్‌ పేపర్స్‌ విధిగా చదవాలి. సాధన చేయాలి.
* పాత ప్రశ్నపత్రాలు ముఖ్యంగా గత పదేళ్లవి, వాటికి సరిపోయే సూచన, సమాధానాలను (సజెస్టెడ్‌ ఆన్సర్స్‌) చదవాలి. వీటిని సరిగా చదివితే పరీక్షల్లో సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చు.
వ్యక్తిగత బలాలపై దృష్టి
సీఏ లాంటి ప్రొఫెషనల్‌ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఎంతో ఓపిక, కఠోర శ్రమ, సమయపాలన అవసరం. సీఏ పరీక్షలను కఠినంగా భావించి కొంతమంది కోర్సును మధ్యలోనే వదిలేస్తారు. దీనికి కారణం విద్యార్థిలో అంతర్లీనంగా ఉండే భయం. ఆ భయాన్ని వీడి, తమ బలాలపై దృష్టిసారిస్తే ఈ కోర్సు పూర్తి చేయడం కష్టమేమీ కాదు.
సబ్జెక్టులు- ప్రాధాన్యాంశాలు
* సీఏ కోర్సులోని లా పేపర్‌కు బేర్‌ యాక్ట్‌ చదివితే లా-లోని ప్రొవిజన్స్‌ను బాగా అర్థం చేసుకోవచ్చు.
* ఆర్టికల్‌షిప్‌ చేసేటప్పుడు అవగతమయ్యే ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ఆడిటింగ్‌ పేపర్లకు చాలా అవసరం. కాబట్టి దీనికి కూడా ప్రాధాన్యమివ్వాలి. పుస్తకాల్లోని సమాచారానికి ఆచరణాత్మక జ్ఞానం జోడించి చదవాలి.
* ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, కాస్టింగ్‌ వంటి పేపర్లకు సన్నద్ధమయ్యేటప్పుడు చదవడం కన్నా పెన్‌, పేపర్‌ విధానంలో సాధన చేయడం తప్పనిసరి.
* ఇన్‌కం టాక్స్‌కు సంబంధించిన పేపర్లను చదివేటప్పుడు చట్టంలో వచ్చిన సవరణల గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. సవరణలు, చట్టాల్లో వస్తున్న సరికొత్త మార్పులను తెలుసుకుంటూ సన్నద్ధత కొనసాగించాలి.
17న విదేశీవిద్య అభ్యర్థుల ఎంపిక
ఈనాడు, హైదరాబాద్: అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద 2017-18 ఏడాదికి దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 17న ఎంపిక నిర్వహించనున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ సంచాలకులు కరుణాకర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో ముఖాముఖి(ఇంటర్వ్యూ)లు ఉంటాయని పేర్కొన్నారు. ఆగస్టు 10 నాటికి ఆన్‌లైన్లో దాఖలైన దరఖాస్తులను తీసుకుని 12 నాటికి పరిశీలన పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. తిరస్కరించిన వాటికి కారణాలు పేర్కొంటూ నివేదిక ఇవ్వాలన్నారు.
ఉద్యోగ ప్రకటనలపై ఉత్కంఠ
* ప్రభుత్వ ఆమోదానికి ఏపీపీఎస్సీ నిరీక్షణ
* నామమాత్రమవుతున్న వార్షిక క్యాలెండర్‌
* నిరుద్యోగుల ఎదురుచూపు
ఈనాడు - అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జారీ చేసే ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగ యువత ఉత్కంఠగా నిరీక్షిస్తోంది. జులై/ ఆగస్టు నుంచి ప్రకటనలను జారీ చేస్తామన్న హామీ అమలు విషయంలో కార్యాచరణ కనిపించడం లేదు. వార్షిక ఉద్యోగ ప్రకటనల పట్టిక జారీ ప్రక్రియను ఈ ఏడాది నుంచే మొదలుపెడతామని ఏపీపీఎస్సీ గత ఏప్రిల్‌లో ఘనంగా ప్రకటించింది. 42 రకాల ఉద్యోగ ఖాళీల ప్రకటనలను జులై/ ఆగస్టు నుంచి ప్రారంభించి జనవరి 2018 వరకు జారీ చేస్తామని వెల్లడించింది. కనీసం ఆరువేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రకారం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు (వైద్య ఆరోగ్య శాఖ), లెజిస్లేచర్‌ ఆఫీసర్‌ (సచివాలయం), టౌన్‌ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీస్‌, అసిస్టెంట్‌ ఆర్కిటెక్చర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ గ్రేడ్‌-2 ఉద్యోగ ప్రకటనలు వెలువడాల్సి ఉంది. మరో మూడు వారాల్లో ఆగస్టు ముగియనున్నా వీటిల్లో ఇప్పటివరకు ఒక్కటీ వెలువడలేదు. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల ఉద్యోగాల భర్తీ ప్రకటన ఆగస్టులోగా వెలువడితే ప్రాథమిక పరీక్ష అక్టోబరు 15న, ప్రధాన పరీక్ష ఫిబ్రవరి 3,4 తేదీల్లో జరపాల్సి ఉంది. క్యాలెండర్‌లో తెలిపిన మేరకు ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలు వెలువడనట్లయితే పరీక్షల తేదీలు మారతాయి. దీనివల్ల అభ్యర్థుల సన్నద్ధతకు అవరోధం ఏర్పడుతుంది. కొందరికి వయోపరిమితి అడ్డంకి కూడా ఎదురవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఉద్యోగాల భర్తీపై వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసి నియామకాలు చేపడతామని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఈ విషయంలో అడుగు ముందుకేసి వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించింది.
ఆర్థిక శాఖ ఆమోదమేదీ?.. ఆయా శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీని ఆర్థిక శాఖ ఆమోదించాలి. దీనికి అనుగుణంగా సామాజికవర్గాలవారీగా శాఖల వివరాలు అందితేనే ప్రకటనలు జారీ చేసేందుకు వీలుంటుంది. వార్షిక ఉద్యోగ ఖాళీల భర్తీ పట్టికను జారీచేసే సమయంలోనే ఉద్యోగ ఖాళీల వివరాలను తెలపాలని ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ వివరాలు ఏపీపీఎస్సీకి అందడం లేదు. ప్రస్తుతం వేర్వేరు శాఖలకు చెందిన కేవలం 1600 ఉద్యోగ ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీ వద్ద ఉన్నాయి. వీటిల్లో టౌన్‌ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీస్‌- 227, గిరిజన సంక్షేమశాఖ వసతిగృహ అధికారి- 134, భూపరిపాలన శాఖ జూనియర్‌ అసిస్టెంట్లు- 138, అసిస్టెంట్‌ మోటార్‌వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు- 61, అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (చేనేత) 41.. వంటి పోస్టుల అరకొర సమాచారం ఉంది. ఇవేకాకుండా సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులు, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌- వ్యవసాయ మార్కెటింగ్‌- ఇతర శాఖలకు చెందిన పోస్టుల వివరాలు కొంతవరకు అరకొరగా ఉన్నాయి. సామాజికవర్గాలవారీ వివరాలు, ఆర్థిక శాఖ ఆమోదించిన సమాచారం అందనందున తదుపరి చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఉద్యోగ ప్రకటనల జారీ ప్రాధాన్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఏపీపీఎస్సీ అధక్షుడు ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నామన్నారు. ఖాళీల భర్తీని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మూడోవిడతలో తగ్గిన కన్వీనర్ కోటా సీట్లు
* స్వచ్ఛంగా సీట్లు వదులుకున్న 12 ఇంజినీరింగ్ కళాశాలలు
ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్ - 2017 తుది విడత కౌన్సెలింగ్ నుంచి 12 ఇంజినీరింగ్ కళాశాలలు తప్పుకున్నాయి. మూడు కళాశాలలు కొన్ని బ్రాంచిల్లో సీట్లు వదులుకోగా.. 10 కళాశాలలు మొత్తం సీట్లను స్వచ్ఛందంగా వదులుకున్నాయి. ఈ మేరకు ఈ సీట్లను కౌన్సెలింగ్‌లో తగ్గించారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఇంజినీరింగ్ కళాశాల - సివిల్, ఈఈఈ, ఎంఈసీ బ్రాంచిల్లో, నెల్లూరు జిల్లాలోని విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్ కళాశాల - ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచి సీట్లు, కడపలోని శ్రీనివాస కళాశాల - ఈఈఈ బ్రాంచిలో సీట్లను స్వచ్ఛందంగా వదులుకున్నాయి. మొత్తం 12 ళాశాలల్లో కలిపి కన్వీనర్ కోటాలో 1,751 సీట్లు తగ్గాయి. ఈ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఇతర కళాశాలలకు మారేందుకు కొత్తగా అప్షన్లు ఇచ్చుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు సూచించారు. తుదివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఆగస్టు 5న 81 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కాగా.. 5,811 మంది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.
తెలుగువారికి మేలే
* ‘రైజ్‌’తో గ్రీన్‌కార్డు సులభమే
* ప్రతిభే ప్రధాన కారణం
* పాయింట్ల విధానం భారతీయులకు ఉపయోగం
ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌: విద్యార్థిగా వెళ్లి...హెచ్‌1బీ వీసాపై చేరి అమెరికా గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూసే ఇబ్బందులు చాలా వరకు తొలగనున్నాయి. అమెరికా ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త బిల్లు ‘రైజ్‌’ భారతీయులకు ముఖ్యంగా తెలుగువారికి మేలు చేస్తుందని పలువురు నిపుణులు సృష్టం చేస్తున్నారు. నైపుణ్యం, తగిన అర్హతలు ఉన్న వారు ఏళ్ల తరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూసే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. అమెరికాకు చట్టబద్ధంగా వచ్చే వలసదారులను తగ్గించే ఉద్దేశంతో ట్రంప్‌ ఆమోదించిన కొత్త బిల్లు ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
భారత్‌ నుంచి విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే వారిలో ఎక్కువగా తెలుగువారే ఉంటుండడంతో అందరి దృష్టి అమెరికా కొత్త వలస విధానంపైనే ఉంది. ‘రిఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయిమెంట్‌(రైజ్‌)’ ప్రతిపాదిత బిల్లు చట్టం రూపంలో అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న లాటరీ ఆధారిత వ్యవస్థ రద్దవుతుంది.
ప్రస్తుతం సీనియారిటీ ఆధారంగానే..
అమెరికాలో గ్రీన్‌కార్డులను ఇవ్వడానికి ఇప్పుడొక సృష్టమైన విధానం లేదు. సీనియారిటీ (కోటా నిబంధన), లాటరీ ఆధారంగా ఇస్తున్నారు. దీని వల్ల తమ దేశ పౌరులు ఉద్యోగాలపరంగా కూడా నష్టపోతుండటంతో రైజ్‌ పేరిట తెచ్చిన బిల్లుకు ట్రంప్‌ ఆమోదం తెలిపారు. గ్రీన్‌ కార్డు పొందడానికి ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయస్సును ప్రధానంగా తీసుకొని పాయింట్లు కేటాయిస్తూ... అందులో నిర్దేశించిన విధంగా పాయింట్లు దక్కితే గ్రీన్‌కార్డు ఇవ్వాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. దీని వల్ల దేశానికి నిపుణులు దొరుకుతారని, అమెరికా దేశ పౌరులకు కూడా నష్టం రాదని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
హెచ్‌1బీ వీసాలో భారీ వాటా మనదే..
గ్రాడ్యుయేట్‌ (పీజీ) విద్యకు ఏటా భారత్‌ నుంచి 60 వేల నుంచి 70 వేల వరకు వెళ్తున్నారు. అమెరికాలో 2.06 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత రెండో స్థానం మనదే. భారతీయులు చదువు పూర్తయిన తర్వాత వెంటనే వెనక్కి వచ్చే వారు స్వల్పం. ఐచ్ఛిక ప్రాక్టికల్‌ శిక్షణ (ఓపీటీ) చేస్తూ హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు చేస్తారు. అమెరికాలో చదువుకొని ఓపీటీలో ఉన్న మన విద్యార్థులు విద్యార్థి కోటాకు సంబంధించి 20 వేల వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు.
* ఇక సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు చేసేందుకు విద్యార్థి కోటాతో కలిపి ప్రతి ఏటా అమెరికా 85 వేల హెచ్‌1బీ వీసాలను మంజూరు చేస్తుంది. అందులో 72 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారని అధికారిక గణాంకాలే సృష్టం చేస్తున్నాయి. గత ఏప్రిల్‌లో భారతీయుల నుంచి 2018కి 1.99 లక్షల దరఖాస్తులు అందాయి. గత 11 సంవత్సరాల్లో 26 లక్షలు హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తులు రాగా అందులో 21 లక్షలు భారతీయులవే ఉన్నాయని ఇటీవల అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అందులో 20 లక్షలు కంప్యూటర్‌ సంబంధిత నిపుణులే ఉన్నారు. తగిన విద్యార్హత, ఆంగ్ల, ఉద్యోగ నైపుణ్యం ఉండటమే ప్రధాన కారణం. దశాబ్దానికిపైగా అమెరికాలో ఉంటున్న వారికి కూడా గ్రీన్‌కార్డు దక్కడం లేదు. అందుకు కారణం సీనియారిటీ, లాటరీ ఆధారంగా ఇస్తుండటమే.
పాయింట్లతో తెలుగు వారికి మేలు..
ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. పాయింట్ల ఆధారిత వ్యవస్థ ద్వారా గ్రీన్‌కార్డు జారీ చేస్తారు. ఇందులో ఆంగ్లభాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయస్సు ప్రాతిపదిక పెట్టారు. వీటిలో ఒక్కో అంశానికి పాయింట్లు కేటాయిస్తారు. ఆంగ్ల భాష, ఉన్నత విద్య, వయస్సు ప్రాతిపదికల్లో తెలుగు వారికి మెరుగైన పాయింట్లు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదువు విషయంలో 26-30 ఏళ్ల మధ్య వయస్సుకు బిల్లులో 10 పాయింట్లు వరకు పెట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో చదువులు పూర్తి చేసే వారిలో ఎక్కువగా ఈ వయస్సులో వారే ఉంటారని ఐటీ నిపుణులు వెల్లడిస్తున్నారు. స్టెమ్‌ విధానంలో విదేశీ మాస్టర్‌ డిగ్రీకి 7 పాయింట్లు, అమెరికా మాస్టర్‌కు 8 పాయింట్లు ఇవ్వనున్నారు. వేతనాల్లోనూ చాలా మందికి మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు తక్కువ ప్యాకేజీ ఉంటోందని ఇలాంటి వారికి కొంత ఇబ్బంది ఏర్పడొచ్చని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. కనీసం అమెరికాలోని మధ్యస్థ గృహ ఆదాయం కంటే 150శాతం వేతనం అధికంగా ఉండాలనే నిబంధనను బిల్లులో చేర్చారు. అమెరికా సెన్‌సెస్‌ బ్యూరో నివేదిక-2014 (సెప్టెంబర్‌) ప్రకారం..2013లో అమెరికాలో మధ్యస్థ గృహ ఆదాయం 51,939 డాలర్లుగా పేర్కొన్నారు.
ఉత్తమ కళాశాలలో సీటు పొందితే...
చదువుకునే సమయంలోనే ఉత్తమ కళాశాలలో సీటు పొందితే ఈ కొత్త బిల్లు చట్టం రూపంలో వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదని, విదేశీ చదువులకు విద్యార్థులను పంపించే పలు కన్సల్టెన్సీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. చదువు నుంచి పాయింట్లు ఎక్కువగా రావడంతో గ్రీన్‌కార్డుకు ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంటున్నాయి.
నిపుణులు ఏమంటున్నారంటే...
జీతాల ప్యాకేజీ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీధర్‌ వెల్లడించారు. అమెరికాలోనే చదువుకొని, అక్కడే ఉద్యోగాలు పొందే ఫ్రెషర్స్‌కు ఈ పరిస్థితి వస్తుందన్నారు. ప్రస్తుతం ఫ్రెషర్స్‌కు 65-80 వేల డాలర్ల మధ్య వేతనాలు ఉంటున్నాయని, సీనియర్‌లకు మాత్రం 1,30,000 డాలర్లు పైనే ఉంటోందన్నారు. గతంలో ఎక్కువగా ఫ్రెషర్స్‌ బీటెక్‌ పూర్తయిన వెంటనే అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లేవారు. ఇప్పుడు ఈ విధానంలో కొంత మార్పు వచ్చిందని వెల్లడించారు.
* తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బ్రాంచిలు కలిగిన అబ్రాడ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధి పార్థసారథి మాట్లాడుతూ.. మంచి గుర్తింపు ఉన్న కళాశాలల్లో చదివితే ఉన్నత విద్యకు వచ్చే పాయింట్లు పెరుగుతాయి.ఆంగ్లభాషలోనైపుణ్యం తెలుగు వారిలో ఎక్కువగానే ఉంటుంది. మంచి కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేస్తే వేతనాల ప్యాకేజీ ఎక్కువగానే ఉంటుంది. గ్రీన్‌కార్డు లభించడం చాలా తేలికవుతుంది. ప్రతిపాదితబిల్లు.. చట్టంగాఅమల్లోకి వచ్చినా తెలుగు వారికి అవకాశాలనేవి తగ్గవని వెల్లడించారు.
భారతీయులకు ఎంతో ప్రయోజనం
ప్రస్తుతం గ్రీన్‌కార్డు పొందడానికి ఒక సృష్టమైన విధానం లేదు. ఏటా ఎన్ని ఇస్తారో అన్నది కూడా తెలియదు. ఎన్నికల సంవత్సరం మాత్రం భారీగా ఇస్తున్నారు. గత నాలుగు ఎన్నికల నుంచి దీనిని నేను గమనిస్తున్నాను. ప్రస్తుతం ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఆ సంస్థ గ్రీన్‌కార్డుకు సిఫారసు చేస్తానని ఉద్యోగులను గుప్పిట్లో పెట్టుకుంటుంది. సిఫారసు చేస్తున్నందుకు వేతనాలు కూడా తగ్గించి ఇస్తారు. ప్రతిభను బట్టి గ్రీన్‌కార్డు ఇస్తే ఇలాంటి అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం ఆంగ్లం రాకున్నా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, చైనా లాంటి ఎన్నో దేశాల వారు అమెరికాలో గ్రీన్‌కార్డు పొందడానికి పోటీ పడుతున్నారు. అంతేకాకుండా సాంకేతిక నైపుణ్యం, ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం భారతీయుల్లో ఎక్కువ ఉంది. తాజా బిల్లు వల్ల భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందుతారు.
టెట్ ఫలితాలు విడుదల
* పేపర్-1లో 57.37...పేపర్-2లో 19.51 శాతం ఉత్తీర్ణత
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పేపర్-1లో ఈసారి ఉత్తీర్ణత శాతం పెరగగా...పేపర్-2లో భారీగా తగ్గింది. టెట్ ఫలితాలను ఆగస్టు 5న వెల్లడిస్తామని గతంలో ప్రకటించినా..ఒకరోజు ముందే తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విడుదల చేయడం విశేషం. ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు శేషుకుమారి, అదనపు సంచాలకులు సత్యనారాయణరెడ్డి, కృష్ణారావు, బాలయ్య తదితరులతో కలిసి విద్యాశాఖ కమిషనర్ జి.కిషన్ ఫలితాల సీడీని శుక్రవారం (ఆగస్టు 4) విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ గత ఏడాది పేపర్-1లో 54.45 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఈసారి అది 57.37కి పెరిగిందన్నారు. పేపర్-2లో(గణితం, సైన్స్‌తోపాటు సాంఘిక శాస్త్రం పేపర్లు) మాత్రం గత ఏడాది 25.04 శాతం ఉండగా ఈసారి 19.51 శాతానికి తగ్గిందని చెప్పారు. ఫలితాలు టెట్ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామన్నారు. ఈసారి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా అభ్యర్థులు ఓఎంఆర్ పత్రంలో చేసిన పొరపాట్లు వల్ల మొత్తం 1632 మంది ఫలితాలు విత్‌హెల్డ్‌లో పెట్టామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో రుసుముల నివేదికపై కమిటీ ఛైర్మన్ ఆచార్య తిరుపతిరావే చెప్పాలని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డీఎస్‌సీ ప్రకటనపై ప్రశ్నించగా అది టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించిన అంశమనీ, వారే చూసుకుంటారని తెలిపారు. బడి సంచి బరువుపై అవగాహన కల్పిస్తున్నామని, తనిఖీలు ఉంటాయని తెలిపారు.
ఉత్తీర్ణత శాతం ఇలా...
పేపర్ - పరీక్ష రాసిన వారు - ఉత్తీర్ణులు - శాతం
పేపర్-1 - 98,848 - 56,708 - 57.37
పేపర్-2(సైన్స్) - 1,11,018 - 20,233 - 18.31
పేపర్-2(సోషల్) - 1,19,914 - 24,732 - 20.62
నిరుద్యోగులకు 'జాబ్ కనెక్ట్'
* సంచార వాహనాన్ని ప్రారంభించిన డీజీపీ అనురాగ్ శర్మ
ఈనాడు, హైదరాబాద్: విద్యార్హతలు, నైపుణ్యం ఉండి ఉద్యోగాల్లేని యువకులకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'జాబ్ కనెక్ట్' పేరుతో సంచార ఉద్యోగ సమాచార వాహనాన్ని రూపొందించారు. ప్రతి పోలీస్ ఠాణా పరిధిలో తిరిగే ఈ వాహన సేవలను డీజీపీ అనురాగ్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. వివిధ కంపెనీలు, పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగాల వివరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని టీఎంఐ గ్రూపు అందించడం అభినందనీయమన్నారు. మొబైల్ యాప్ ద్వారా కూడా ఉద్యోగార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలిప్పించాలన్న లక్ష్యంతో 'జాబ్ కనెక్ట్' వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని నగర కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. సంచార వాహనంలోని హెల్ప్‌డెస్క్‌లో విద్యార్హతలను నమోదు చేసిన వెంటనే ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయన్న వివరాలు వస్తాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకూ విద్యార్హతలుండి నైపుణ్యమున్న వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు అనేక కంపెనీల వివరాలను సేకరించామని టీఎంఐ గ్రూప్ ఛైర్మన్ మురళీధరన్ తెలిపారు. దేశంలో ఏటా 1.20 కోట్ల మంది ఉద్యోగాలను ఆశిస్తుండగా 40-50 లక్షల మందికే దక్కుతున్నాయని, మిగిలిన వారికి అవకాశాలున్నా ఇక ఉద్యోగాలు రావన్న నిరాశతో ఉన్నారని వివరించారు. వీరిలో కొంతమందికైనా ఉద్యోగాలు ఇప్పించాలన్న లక్ష్యంతో జాబ్స్ డైలాగ్ అనే సంస్థను స్థాపించామని పేర్కొన్నారు. ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌లా దీన్ని తీర్చిదిద్దామన్నారు. ఉద్యోగార్థులు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని మధ్య మండలం డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
మహిళలతోనే ‘గురుకుల’ భర్తీ
* సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్‌
* నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయన్న హైకోర్టు
* తదుపరి విచారణ ఆగస్టు 9కి వాయిదా
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని గురుకుల విద్యాసంస్థల్లో టీఎస్‌పీఎస్‌సీ చేపట్టిన ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. మహిళా విద్యా సంస్థల్లో మహిళా అభ్యర్థులతో పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ సాధారణ పరిపాలనాశాఖ 2016 జూన్‌ 4న జీవో 1274 జారీ చేసింది. తాజాగా హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలోని సాంఘిక, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకుల బాలికలు, మహిళా విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను ‘మహిళా అభ్యర్థులతో’ భర్తీ చేయడానికి ఉన్న అడ్డంకి తొలగింది. అయితే నియామకాలు తామివ్వబోయే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టంచేసింది. ఒకరిద్దరి కోసం నియామక ప్రక్రియ మొత్తాన్ని ఆపలేమని తేల్చిచెప్పింది. అందరి ప్రయోజనాల కోసం పోరాడటానికి పిటీషనర్‌ దాఖలు చేసింది ప్రజాహిత వ్యాజ్యం కాదని గుర్తుచేసింది. గురుకుల కళాశాలల్లో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల నియామక ప్రక్రియకు వీలుగా ఇటీవల జారీచేసిన ఉత్తర్వులే ప్రస్తుతం అప్పీల్‌లోనూ జారీచేస్తున్నామని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఆగస్టు 2న ఈ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
నేపథ్యం
జీవో 1274 చట్టబద్ధతను సవాలు చేస్తూ వరంగల్‌ జిల్లాకు చెందిన కె.సత్యనారాయణ, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద జరిగిన విచారణలో పిటీషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ జీవోలో బాలికా/మహిళా విద్యాసంస్థలోని అన్ని పోస్టులను మహిళా సిబ్బందితోనే భర్తీ చేయమని, అందుకు తగ్గట్టుగా బైలాలను, నియామక నిబంధనలను సవరించుకోమని కోరిందన్నారు. ఎటువంటి సవరణలు చేయకుండా మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ప్రకటనలు ఇస్తున్నారని, ఈ ప్రకటనల్లో పురుష అభ్యర్థులను మినహాయించడం వివక్షతో కూడుకున్నదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సింగిల్‌ జడ్జీ, ఆ జీవో అధారంగా మహిళా అభ్యర్థులతో పోస్టులను భర్తీ చేసే ప్రక్రియపై తదుపరి చర్యలన్నింటిని నిలుపుదల చేస్తూ జులై 19న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులపై తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, మరో ఇద్దరు అధికారులు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఆగస్టు 2న ధర్మాసనం విచారణ జరిపింది. పిటీషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించేందుకు గడువు కావాలని కోరారు. సింగిల్‌ జడ్జీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేయవద్దని అభ్యర్థించారు. నిరాకరించిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. వాదనలు వినిపించడం కోసం విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది.
త్వరలో నియామకాల పరీక్షలు
స్టేను హైకోర్టు ఎత్తేయడంతో వాయిదా పడిన గురుకుల విద్యాసంస్థల పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఎడ్‌సెట్ ర్యాంకు పత్రాలు ఇంకా విడుదల కాలేదు
ఓయూ, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల బీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ఎడ్‌సెట్-2017 ర్యాంకు పత్రాలు ఇంకా విడుదల కాలేదని సెట్ కన్వీనర్ బుధవారం (ఆగస్టు 2) ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని సంస్థలు తప్పుడు ర్యాంకు పత్రాలను జారీ చేస్తున్నాయని, అటువంటి వాటిపై అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలో ర్యాంకు పత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. వీటిని టీఎస్ ఎడ్‌సెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే పొందాలని సూచించారు.