Latest News

విదేశీ విద్యార్థులకు కఠినంగా ఆంగ్ల పరీక్షలు

* బ్రిటన్ యోచన
* భారతీయ చదువరులకు కష్టమే

లండన్: విద్యాభ్యాసం నిమిత్తం ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు కఠినమైన రీతిలో ఆంగ్ల పరీక్షలు నిర్వహించాలని బ్రిటన్ ప్రతిపాదిస్తోంది. భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఇప్పటికే తగ్గిపోతుండగా ఇలాంటి చర్యల వల్ల మరింత ప్రతికూల ప్రభావం కనిపిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. యు.కె.విశ్వవిద్యాలయాలకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారత్‌ది రెండోస్థానం. ఏటా సుమారు 20 వేల మంది విద్యార్థులు భారత్ నుంచి యూకే వస్తున్నారు. విద్యానంతరం రెండేళ్లపాటు పనిచేసుకునేందుకు ఇచ్చే అనుమతిని రద్దు చేశాక విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కఠినమైన నిబంధనల వల్ల ఈ సంఖ్య ఇంకా పడిపోతుందని కొందరు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ స్థానే కఠిన నిబంధనలతో అంతర్జాతీయ ఆంగ్లభాషా పరీక్ష విధానాన్ని తీసుకురావడంపై విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో ఇటీవలే ప్రభుత్వం సమాలోచనలు జరిపింది. ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఉన్న పరీక్షల కంటే ఇవి కఠినంగా ఉంటాయి. దీనివల్ల విద్యార్థుల సంఖ్య పడిపోతే ఏటా అనేక లక్షల పౌండ్ల అదనపు భారం పడుతుందనీ, ఆ కోణంలోనూ మదింపు జరగాలని ఉప కులపతులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సైన్సు, ఇంజనీరింగ్ విద్యార్థులు బాగా నష్టపోతారనీ, ఇతర విద్యార్థులతో పోలిస్తే వీరిలో భాషాపరమైన నైపుణ్యం తక్కువ అని విశ్వవిద్యాలయాలు చెబుతున్నాయి. కొన్ని సైన్సు కోర్సుల్ని పూర్తిగా మూసివేసే పరిస్థితి రావచ్చని ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న భాషాపరీక్షల ద్వారా నియమితులైనవారు విద్యాపరంగా వెనుకబడిపోయినట్లు ఎలాంటి ఆధారాల్లేవని యూకే విశ్వవిద్యాలయాల ముఖ్య కార్యనిర్వహణాధికారి నికోలా డాండ్రిడ్జ్ పేర్కొన్నారు. యూకే విద్యార్థుల మాదిరిగానే విదేశీ విద్యార్థులూ ఫలితాలు సాధిస్తున్నారనీ, వారిలో 87% మందికి ప్రథమ, లేదా ద్వితీయ శ్రేణులు లభిస్తున్నాయనీ వివరించారు.

posted on 06.10.2015

Ask the Expert
Click Here..