Latest News

మా విద్యార్థులను వెనక్కి పంపటమేంటి?

* అమెరికా దృష్టికి తీసుకెళ్లిన భారత్‌
* మాపై నిషేధం విధించలేదు: వర్సిటీలు

ఈనాడు, దిల్లీ; వాషింగ్టన్‌: ఇటీవల భారత్‌కు చెందిన 14 మంది విద్యార్థులను వెనక్కి పంపిన విషయాన్ని మనదేశం అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. ‘‘సిలికాన్‌ వ్యాలీ యూనివర్సిటీ(ఎస్‌వీయూ), నార్త్‌ వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ(ఎన్‌పీయూ)ల్లో చేరిన భారతీయ విద్యార్థులను వెనక్కి పంపిన అంశాన్ని అమెరికా విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లాం. వారి స్పందన కోసం చూస్తున్నాం’’ అని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు. అమెరికాలోని రెండు విశ్వవిద్యాలయాల్లో చేరటానికి శాన్‌ఫ్రాన్సికోకు వెళ్తున్న 19 మంది విద్యార్థులను ఎయిరిండియా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిలువరించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయాలపై ‘నిఘా’ ఉండటం వల్ల 14 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించినట్టు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం సూచించటంతో ఈ చర్య తీసుకుంది. ‘‘అమెరికా వలస ప్రాధికారసంస్థ సూచనలను పాటించటం ఎయిరిండియా విధి. దాని సూచనల మేరకే ఆ విద్యార్థులను వెనక్కి పంపారు’’ అని వికాస్‌ స్వరూప్‌ వెల్లడించారు. విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకే తాము హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని నిలువరించామని ఎయిరిండియా తెలిపింది. అమెరికాలోని తమ కార్యాలయం నుంచి సూచనలు అందేంతవరకు ఈ విశ్వవిద్యాలయాల్లో చేరటానికి వెళ్లే విద్యార్థులను అనుమతించొద్దని ఎయిరిండియా నిర్ణయించింది. ఇదిలాఉండగా.. తమను నిషేధిత జాబితాలో చేర్చలేదని సిలికాన్‌ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్‌ వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ తెలిపాయి. అయితే ఇటీవల ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో అమెరికాకు వచ్చేవారిని విమానాశ్రయాల్లో ప్రశ్నించటంతో పాటు భద్రతను మరింత పెంచారని వివరించాయి. అందువల్ల అమెరికాకు వచ్చే విద్యార్థులు తమ దేశాల నుంచి బయలుదేరేముందు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను కలిగుండాలని సూచించాయి. పాస్‌పోర్ట్‌, వీసా, విశ్వవిద్యాలయం అంగీకరించిన ప్యాకేజీ, ఆర్థిక స్వతంత్రత లేదా ఇతరులపై ఆధారపడటానికి సంబంధించిన రుజువులు, అమెరికాలో చదవటానికి అర్హత, ప్రయాణ పత్రాలు తప్పకుండా వెంట ఉండాలని పేర్కొన్నాయి.
గుర్తింపులేని వర్సీటీల వివరాలు అందజేస్తాం: సుష్మా
అమెరికాలోని గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల పేర్లను త్వరలో అందజేస్తామని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు. కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు మంగళవారం సుష్మాతో భేటీ అయ్యారు. అమెరికా వెళ్లే తెలుగు విద్యార్థుల సమస్యలపై చర్చించారు. గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల వివరాలు తెలియక చాలామంది విద్యా సంవత్సరాన్ని కోల్పోవటంతో పాటు పలు ఇబ్బందులు పడుతున్నారని ఆమెకు వివరించారు. దీనికి సుష్మా స్పందిస్తూ.. గుర్తింపులేని విశ్వవిద్యాలయాల గురించి తెలియకపోవటం వల్ల విద్యార్థులు అమెరికాకు వెళ్లి తిరస్కరణకు గురవుతుండటపై ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కంభంపాటి మీడియాతో మాట్లాడుతూ... గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల వివరాలు అందగానే ప్రసార మాధ్యమాల ద్వారా వెల్లడిస్తామన్నారు. ఈ అంశంపై తాను అమెరికా రాయబారి రిచర్డ్‌ రాహుల్‌వర్మతోనూ చర్చించానని తెలిపారు. విద్యార్థులను వెనక్కి పంపటంపై అమెరికా విదేశాంగ, హోంల్యాండ్‌ శాఖలతో చర్చిస్తున్నామని రిచర్డ్‌ తమకు తెలిపారన్నారు.

posted on 23.12.2015

Ask the Expert
Click Here..