Latest News

భారత విద్యార్థులను తిప్పి పంపడంపై అమెరికా విచారం

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులను బలవంతంగా తిప్పి పంపించేయడం వల్ల వారిపై పడిన ప్రభావానికి అమెరికా డిసెంబరు 23న విచారం వ్యక్తం చేసింది. కాలిఫోర్నియాకు చెందిన రెండు విద్యాసంస్థలకు వెళ్లాల్సిన విద్యార్థుల ప్రవేశాన్ని కస్టమ్స్‌, సరిహద్దు రక్షణ అధికారులు అడ్డుకున్నట్లు వచ్చిన సమాచారంపై తమకు అవగాహన ఉందని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొంత మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై ఇది ప్రభావం చూపించి ఉండవచ్చని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ విషయమై అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల విభాగం, భారత ప్రభుత్వంతో సమాచారం అందిపుచ్చుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారత విద్యార్థులందరూ అమెరికా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని భారత్‌ సూచించిన నేపథ్యంలో రిచర్డ్‌ వర్మ ఈ ప్రకటన జారీ చేశారు. తమకు తగిన విద్యా సంస్థ ఏదో తెలుసుకుని ఎంచుకునేందుకు భారత్‌లో ఉన్న ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ’ కేంద్రాలు దోహదపడతాయని, https://educationusa.state.gov/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని రిచర్డ్‌వర్మ సూచించారు. ప్రయాణికుల వద్ద వీసా ఉన్నప్పటికీ వారి ప్రయాణ పత్రాల చట్టబద్ధతను ప్రశ్నించడానికి కారణం ఉన్నా, వారెందుకు ప్రయాణిస్తున్నారో సరిగా సమాధానం చెప్పకున్నా ఇమ్మిగ్రేషన్‌ అధికారి వారి ప్రవేశాన్ని నిరాకరించవచ్చని అమెరికా కాన్సులేట్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. విద్యార్థుల ప్రవేశాన్ని నిరాకరించిన విషయమై వాస్తవాలను సేకరిస్తున్నట్లు వెల్లడించింది. తమ విమానంలో అమెరికా వెళ్లి, భారత్‌కు తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న భారత విద్యార్థులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని గల్ఫ్‌ విమానయాన సంస్థ ఎతిహాద్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది.

posted on 25.12.2015

Ask the Expert
Click Here..