Latest News

అన్య మార్గాల వైపే చూపు..!

* ఐ20, వీసాలకు సొంతంగా దరఖాస్తుచేసే విద్యార్థులు 10 శాతమే
* అంతర్జాలంపై అవగాహన ఉన్నా ఇతర మార్గాల వైపే చూపు
* కనీస అధ్యయనం చేయడం లేదంటున్న నిపుణులు

ఈనాడు - హైదరాబాద్‌: విదేశాల్లో ఉన్నత విద్యార్జనకు వెళ్లే తెలుగు విద్యార్థుల్లో అత్యధికులు ఇంజినీరింగ్‌ పూర్తిచేసినవారే. అంతర్జాలంపై పట్టున్నవారే. కాస్త దృష్టిపెడితే విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడం నుంచి.. వీసా పొందేవరకు ఆ పనులన్నీ సొంతంగానే పూర్తిచేసుకోవచ్చు. అయినా సరే, అత్యధికులు నగరాల్లోని మెరుగైన కన్సల్టెన్సీలకు బదులు, అందుబాటులో ఉండే వాటిపైనే ఆధారపడుతూ నష్టపోతున్నారు.
తెలుగురాష్ట్రాల నుంచి ఏటా దాదాపు 25వేల మంది విద్యార్థులు అమెరికాకు ఉన్నతవిద్యార్జనకు వెళ్తున్నారు. వారిలో 90శాతం మంది వర్సిటీల ఎంపిక నుంచి వీసాల దరఖాస్తు వరకు కన్సల్టెన్సీల పైనే ఆధారపడుతున్నారు. 5-10 శాతం మందే సొంతంగా ముందుకెళ్తున్నారని నిపుణులంటున్నారు. వారిలోనూ కొందరు సొంతంగా అధ్యయనం చేసినవారు, మరికొందరు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్న, చదువు ముగించినవారి సహకారంతోనూ ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. ఎక్కువ మంది చదువు పూర్తయ్యాక విదేశాల్లో చదివేందుకు నిర్ణయించుకుంటున్నారు. టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ లాంటి పరీక్షలకు హాజరై.. కన్సల్టెన్సీలకు ఆయా ధ్రువపత్రాలు మొత్తం అప్పగించి మీదే భారమన్నట్లు వ్యవహరిస్తున్నారు. అవి వారి నుంచి 5వేల నుంచి రూ.7వేల వరకూ వసూలుచేస్తున్నాయి. తగిన సూచనలివ్వకుండా విదేశాలకు పంపిస్తున్నాయి. నాసిరకం విశ్వవిద్యాలయాలను విద్యార్థి ఎంపిక చేసుకున్నా అవి మంచివి కాదని చెప్పే కన్సల్టెన్సీలు తక్కువగా ఉన్నాయని, తమతో ఒప్పందం కుదుర్చుకున్న వర్సిటీల్లో చేరేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. అంతర్జాలం, ఆంగ్లంపై పట్టున్న విద్యార్థులు సైతం ఏదైనా పొరపాటు చేస్తే విశ్వవిద్యాలయంలో ప్రవేశ అనుమతి పత్రం(ఐ20) రాదన్న భయం వారిని కన్సల్టెన్సీల వైపు నడిచేలా చేస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 1500 వరకు కన్సల్టెన్సీలు ఉన్నట్లు అంచనా. వీటి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది.
నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు యత్నాలు
విచ్చలవిడిగా కన్సల్టెన్సీలు పుట్టుకొస్తుండటం, విద్యార్థులను దగాచేస్తున్న ఘటనలు వెలుగుచూస్తుండటంతో కొందరు కన్సల్టెన్సీ నిర్వాహకులు వీటిపై నియంత్రణ వ్యవస్థ అవసరమన్న నిర్ణయానికి వచ్చారు. కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోందని భావిస్తున్నవారు కన్సల్టెన్సీల నిర్వహణకు అర్హతలు, విధివిధానాల రూపకల్పనలో ఉన్నారు. దీనిపై త్వరలో నివేదికను తయారుచేసి రెండు తెలుగు ప్రభుత్వాలకు అందజేయనున్నారు.
నిపుణులేం చెప్తున్నారు..
కన్సల్టెన్సీల సహకారం తీసుకోవడం తప్పు కాకున్నా, పూర్తిగా వాటిపైనే ఆధారపడటం మంచిది కాదని కొన్ని కన్సల్టెన్సీల నిర్వాహకులే సూచిస్తున్నారు.
* విదేశాల్లో చదవాలనుకున్నవారు కనీసం ఏడాది ముందుగా ప్రణాళిక రూపొందించుకోవాలి. జీఆర్‌ఈ, టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీస్‌ పరీక్షలకు హాజరై మంచి స్కోర్‌ సాధించాలి. బీటెక్‌ మూడో సంవత్సరంలో అర్హత పరీక్షలు రాసి నాలుగో ఏడాదిలో ఉండగానే ఐ20 కోసం దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించాలి.
* ఏ దేశంలో చదవాలనుకుంటున్నారో ఆ దేశానికి చెందిన సాధికారిక వెబ్‌సైట్లను పరిశీలించి అధ్యయనం చేయాలి. ఇందుకోసం అంతర్జాలంలో www.educationusa.state.gov, www.ice.gov (హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం) లాంటి ఎన్నో సాధికారిక వెబ్‌సైట్ల ద్వారా సమగ్ర వివరాలను పొందొచ్చు.
* ఏటా హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల్లో విదేశీవిద్యపై బ్రిటిష్‌ కౌన్సిల్‌, యూఎస్‌ కాన్సులేట్‌ తదితరుల సహకారంతో విద్యామేళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా సందర్భాల్లో సంబంధిత అధికారులు విదేశీ విద్యార్జనకు దరఖాస్తు చేసుకోవటం నుంచి నిబంధనలు, రుసుముల వరకు అంశాలన్నింటినీ సమగ్రంగా వివరిస్తారు. సందేహాలుంటే తీరుస్తారు.

posted on 02.01.2016

Ask the Expert
Click Here..