Latest News

ఇక్కడికి ఎందుకు వస్తున్నారు?

* భారత్‌లో వీసాలు అమ్ముతున్నారా?
* ఎన్ని పత్రాలు చూపించినా ఉపయోగం లేదు
* తెలుగు విద్యార్థులను వెనక్కి పంపిన అమెరికా అధికారులు
* శంషాబాద్‌ విమానాశ్రయంలో విద్యార్థుల ఆవేదన

ఈనాడు, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: "భారత్‌లో వీసాలు అమ్ముతున్నారా?.. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావడం లేదు.. ఎన్ని పత్రాలు చూపించినా ఉపయోగం లేదు.. తిరిగి వెళ్లండి" అంటూ అమెరికా అధికారులు తమను వెనక్కు పంపుతున్నారని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలోని నార్త్‌వెస్ట్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, సిలికాన్‌ వ్యాలీ విశ్వవిద్యాలయం సహా ఇతర విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు వెళ్లి.. అక్కడి అధికారులు వెనక్కి పంపడంతో 25మంది విద్యార్థులు జనవరి 2న శంషాబాద్‌ విమానాశ్రమానికి చేరుకున్నారు. న్యూయార్క్‌ విమానాశ్రమంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వ్యవహరించిన తీరును వారు వివరించారు. తమకు ప్రత్యక్ష నరకం చూపించారని, ధ్రువీకరణ పత్రాలున్నా భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు ఒత్తిడి చేశారని తెలిపారు. అసలు ధ్రువపత్రాలు తీసుకెళ్లినా వారు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రశ్నించినవారిలో కొందరికి బేడీలు వేశారని, ఒకచోట నుంచి మరోచోటికి పంపించారన్నారు. ఒకే గదిలో 24 గంటలు కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు.
విశ్వవిద్యాలయం సరైందికాదని పంపించారు
కాలిఫోర్నియాలోని నార్త్‌వెస్ట్‌ పాలిటెక్నిక్‌ విశ్వవిద్యాలయంలో చేరేందుకు డిసెంబరు 29న వెళ్లాను. న్యూయార్క్‌ విమానాశ్రమంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పక్కకు పిలిచారు. విద్యార్థి అని తెలిసిన వెంటనే తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. ఎందుకు అని ప్రశ్నిస్తే విశ్వవిద్యాలయం సరైందికాదన్నారు. విమానాశ్రయంలోని ఓ గదిలో రోజంతా ఉంచారు. తర్వాత తిప్పి పంపించారు. సిలికాన్‌వ్యాలీ విశ్వవిద్యాలయం విద్యార్థులనూ అడ్డుకున్నారు.
          ------ కాత్యాయనికుమార్‌, హైదరాబాద్‌
చేతులకు బేడీలు వేసి ఇబ్బంది పెట్టారు
తెలుగు విద్యార్థులను అక్కడి అధికారులు దొంగల్లా చూస్తున్నారు. విమానాశ్రయంలో దిగిన తరువాత అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా చేతులకు బేడీలు వేసి అక్కడ ఉంచారు. పత్రాలు లేవనే తదితర కారణాలు చూపి తప్పుమనదే అన్నట్లు చూపుతున్నారు.
          ------ కరుణాకర్‌, గుంటూరు
అమెరికా అధికారుల తీరు అనుమానాస్పదం
అమెరికా అధికారులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. మేము అన్ని పత్రాలు సరైనవే తీసుకెళ్లాం. భారత్‌ తిరిగి వెళ్లాలని చెబుతున్న వారు సరైన కారణం చూపడంలేదు. వివిధ ప్రశ్నలు అడుగుతున్నారు. అన్నింటికీ సమాధానాలు ఇచ్చాను. అన్ని నిజమే.. కానీ నీవు భారత్‌కు తిరిగి వెళ్లాల్సిందే అని అన్నారు.
          ------ అనీల్‌కుమార్‌, మహబూబ్‌నగర్‌
నా పత్రాలు పరిశీలించలేదు
న్యూయార్క్‌ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే ఎక్కడి నుంచి వచ్చావన్నారు. విద్యార్థి అనగానే అసలు నా పత్రాలను కూడా పరిశీలించలేదు. హైదరాబాద్‌కు వెళ్లాలంటూ ఒత్తిడిచేశారు. ఏదైనా ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. గదిలో ఖైదీల్లా చూశారు. దాహం వేస్తే నీళ్లు తాగేందుకూ వీల్లేదన్నారు.
          ------- మహేష్‌, రాజమండ్రి

posted on 03.01.2016

Ask the Expert
Click Here..