Latest News

వీసా అంటే..ఆహ్వానమే

* అమెరికాలో అడుగుపెట్టేందుకు రాజముద్ర కాదు
* విద్యార్థులు తొట్రుపాటుకు గురికావొద్దు
* స్పష్టంగా, నిజాయతీగా సమాధానాలివ్వాలి
* లేదంటే వెనక్కి పంపేయడం ఖాయం
* నిపుణులు, అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధుల వెల్లడి

ఈనాడు - హైదరాబాద్‌: ఉన్నత చదువులకు వీసా రావడమంటే.. అమెరికాలో అడుగుపెట్టేందుకు రాజముద్ర పడినట్లు కాదు. వీసా అంటే కేవలం ఆహ్వానం, అమెరికా వచ్చేందుకు ఇచ్చే అనుమతి మాత్రమే. ఈ అంశాన్ని విస్మరించి వెళితే ఇక్కట్లు తప్పవంటున్నారు నిపుణులు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థులను పెద్ద సంఖ్యలో వెనక్కు పంపుతున్న ఘటనలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. సిలికాన్‌వ్యాలీ విశ్వవిద్యాలయం(ఎస్‌వీయూ), నార్త్‌వెస్ట్రన్‌ పాలిటెక్నిక్‌ విశ్వవిద్యాలయం(ఎన్‌పీయూ)లో చేరేందుకు వచ్చిన పలువురు విద్యార్థులను ఇటీవల వెనక్కు పంపడం చర్చనీయాంశమైంది. ఆ రెండు విశ్వవిద్యాలయాలే కాకుండా ఇతర విద్యా సంస్థల్లో చేరేందుకు వచ్చిన వారిని కూడా వెనక్కు పంపుతున్నారు. భద్రతా అధికారులు అడిగే ప్రశ్నలకు విద్యార్థులు స్పష్టంగా, నిజాయతీగా సమాధానాలు చెప్పకపోవడం వంటి కారణాలతోనే వారిని తిప్పి పంపుతున్నట్లు అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులకు అక్కడి అధికారులు చెబుతున్నారు. విద్యార్థి వీసాపై అమెరికా వచ్చే వారు విశ్వవిద్యాలయం ముందస్తు అనుమతి లేనిదే ఉద్యోగం చేయడం అక్కడి చట్టాల ప్రకారం నేరం.
ప్రవేశాధికారం వారిదే..
హెచ్‌1(ఉద్యోగ), బీ1, బీ2(పర్యాటకం), ఎఫ్‌1(విద్యార్థి) వీసాల్లో ఏ వీసాతో వచ్చినవారినైనా.. ఎప్పుడైనా, ఎక్కడైనా తనిఖీలు చేసే అధికారం అమెరికాలోని కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌(సీబీపీ) అధికారులకు ఉంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు అనుమానం వస్తే వెనక్కు పంపించే అధికారం వీరికి ఉంది.
ఆంగ్లంపై పట్టులేకపోవడమే..
ఇక్కడి నుంచి వెళ్లే విద్యార్థుల్లో కొందరికి ఆంగ్లంలో పట్టు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. సీబీపీ అధికారులు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆంగ్లంలో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సరైన ధ్రువపత్రాలు చూపకపోవడం, ఆర్థిక అంశాలపై వివరాలు చెప్పలేకపోవడం కూడా కారణంగా ఉంది. అమెరికాలో ఎక్కడ ఉండబోతున్నారు? నివాసానికయ్యే ఖర్చును ఎలా భరిస్తారు? కళాశాల ఫీజును ఎలా చెల్లిస్తారు? బీమా సౌకర్యం ఉందా? వీటన్నింటికీ ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి ప్రశ్నలు అధికారుల నుంచి ఎదురవుతుంటాయి. వాటికి దీటుగా, సంతృప్తిగా సమాధానాలు చెప్పగలిగితేనే ప్రయాణం ముందుకు సాగుతుంది. లేదంటే విమానాశ్రయం నుంచి వెనక్కు రావాల్సిందే. అమెరికా రావడానికి ముందే ఆయా ప్రశ్నలకు సమాధానాలు సిద్ధంగా ఉంచుకోవాలి. వీసాకు వెళ్లినప్పుడు ఎంతగా సంసిద్ధమై వెళతారో అమెరికాలో సీబీపీ అధికారుల ప్రశ్నలకూ అంతే సంసిద్ధత అవసరం.
* సీబీపీ అధికారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి.
* ‘మేం ఇక్కడ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసి సంపాదిస్తాం. ఆ సొమ్ముతో కళాశాల రుసుము చెల్లించి, మా జీవనాన్ని సాగిస్తాం’ అని చెప్పకూడదు.
* ఆ కళాశాల యాజమాన్యం అనుమతించిన ఉద్యోగంలో నిర్దేశించినన్ని పని గంటలు (సుమారు వారానికి 20 గంటలు) మాత్రమే పనిచేయాలి.
* రక్తసంబంధీకులు, సమీప బంధువుల ద్వారా ఆర్థిక సహకారాన్ని పొందుతామని చెప్పడమూ సరికాదు.
* ఆర్థిక అంశాలపై భారత్‌లో ఎలాంటి హామీలిచ్చారో వాటినే ఇక్కడా అమలు చేయాలి తప్ప మరో కొత్త విషయాన్ని తెరపైకి తీసుకురాకూడదు.
* ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయని అమెరికా దౌత్యాధికారులు భావిస్తుండడంతో మున్ముందు ఎఫ్‌1 వీసాదారులపై మరింత నిఘా పెరుగుతుంది. నిబంధనలను కఠినంగా అమలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు.
అనూహ్యంగా పెరిగిన సంఖ్య..
అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అమెరికా వచ్చే విద్యార్థుల్లో 2014-15లో 11 శాతం పెరుగుదల నమోదైంది. ఏటా చైనా నుంచి వచ్చే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఈసారి భారత విద్యార్థులు ఆ రికార్డును అధిగమించారు. భారత్‌ నుంచి వచ్చే విద్యార్థుల్లో 29.1 శాతం పెరుగుదల నమోదైందని అమెరికా ప్రభుత్వ విద్యా, సాంస్కృతిక వ్యవహారాల సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. ఇతర దేశాలతో పోల్చితే ఇదే అత్యధిక పెరుగుదల. 2001-02లో భారత్‌ నుంచి 50 వేల మంది వెళ్లగా.. తాజాగా అంతకంటే ఎక్కువ మంది వెళ్లడం విశేషం.

త్వరలో ప్రత్యేక విద్యార్థి విభాగం - మోహనకృష్ణ మన్నవ, అధ్యక్షుడు, నాట్స్‌
విద్యార్థి వీసాపై అమెరికా వచ్చే వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన కళాశాలల్లో ఈ విభాగం ప్రతినిధులు పర్యటించి అమెరికాలో ఉన్నత విద్యపై అవగాహన కల్పిస్తారు. సామూహిక ఇంటర్వ్యూలు, చర్చావేదికలు నిర్వహిస్తాం. అమెరికాలో ఇంటర్వ్యూ అధికారులడిగే అంశాలపై అవగాహన కల్పిస్తాం. వారానికోసారి ఈ విభాగం ద్వారా ఆన్‌లైన్‌లో వేదికను ఏర్పాటు చేస్తాం. దీనిద్వారా విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అమెరికా కాన్సులేట్‌, విద్యార్థుల మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తాం. బోగస్‌ కన్సల్టెన్సీలపై అవగహన కల్పిస్తాం. కళాశాలల్లో చేరేముందే దానికి గుర్తింపు ఉందా? లేదా? అన్నది తప్పనిసరిగా తెలుసుకోవాలి.
నిజాయతీ అవసరం.. - ఆలపాటి సుభాకర్‌, డైరెక్టర్‌, గ్లోబల్‌ ట్రీ కన్సల్టెన్సీ
విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల్లో నిజాయతీ చాలా కీలకం. అమెరికాలో దిగిన తర్వాత సీబీపీ అధికారులడిగే ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలివ్వాలి. వివిధ స్థాయుల్లో విద్యార్థులకు లభించే పర్సంటేజీలు ఎంత ముఖ్యమో.. అడిగిన ప్రశ్నలకు తొట్రుపాటు లేకుండా సమాధానమివ్వడం కూడా అంతే కీలకం. అమెరికాలో ప్రవేశం లభించడమనేది సమాధానాలు, నిజాయతీపైనే ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చదువుతూ ఉద్యోగం చేయాలన్న ఆలోచనకు విద్యార్థులు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా సాధ్యమైనంత మేరకు విద్యార్థులపై ఆర్థిక భారం మోపకుండా ఉంటే మంచిది. ఏడాదికి అయ్యే నిర్వహణ వ్యయం, చదువుకు చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచుకోవడం అనివార్యం.
వారు విశ్వసిస్తేనే అనుమతి.. - వి చౌదరి జంపాలి, అధ్యక్షుడు, తానా
సీబీపీ అధికారులకు వీసాదారులపై పూర్తి స్థాయిలో విశ్వాసం కలిగితేనే అమెరికాలోకి అనుమతిస్తారు. సమాధానాల్లో అబద్ధాలు ఉండకూడదు. ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. అధికారులు క్షుణ్ణంగా ప్రశ్నిస్తారు. కొన్ని సందర్భాల్లో అధిక సమయం పట్టవచ్చు. ప్రత్యేకించి ఎఫ్‌-1 వీసాపై వచ్చే విద్యార్థులకు ఫీజులు తదితర ఖర్చుల నిర్వహణకు సంబంధించిన ప్రణాళిక పటిష్ఠంగా ఉండాలి. అన్ని రకాల ధ్రువపత్రాలు ఉండాలి. ఆ కోర్సును పూర్తి చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని నిరూపించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే. మాకున్న సమాచారం మేరకు నిషేధిత జాబితాలో ఉన్న విశ్వవిద్యాలయాలు లేవు. ఆయా విద్యాసంస్థలకు గుర్తింపు ఉందా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి. విద్యార్థులను వెనక్కు పంపేటప్పుడు అక్కడి అధికారులు సరైన కారణాలతో(రూలింగ్‌ పేపర్‌) పత్రం ఇవ్వాలి. కారణం సహేతుకంగా లేదని భావిస్తే విద్యార్థులు ఆ పత్రాన్ని info@tana.orgకి పంపితే ఇమిగ్రేషన్‌ అధికారులతో సంప్రదింపులు నిర్వహిస్తాం. అధికారులు దురుసుగా వ్యవహరిస్తే వారి సమాచారాన్ని కూడా అదే చిరునామాకు పంపవచ్చు. వివిధ వీసాలపై అమెరికా వచ్చే వారు http://www.tana.org/help-line-team-square/safety-guidelines ను పరిశీలిస్తే కొంత అవగాహన కలుగుతుంది.

posted on 04.01.2016

Ask the Expert
Click Here..