Latest News

విదేశీ విద్యార్థులకు.. వర్క్‌ పర్మిట్‌ వ్యవధిని పెంచనున్న ఒబామా ప్రభుత్వం!

* భారతీయ విద్యార్థులకు లాభదాయకం

వాషింగ్టన్‌: భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి ఇక్కడికి మరింత మంది విద్యార్థులు వచ్చి చదువుకునేందుకు వీలుగా ఒబామా ప్రభుత్వం ఓ సరికొత్త వెసులుబాటును ప్రతిపాదించింది. అమెరికాలో చదువుకోవడానికి వచ్చే కొన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులకు వర్క్‌ పర్మిట్‌ వ్యవధిని ఆరేళ్లపాటు పెంచాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే భారతీయ విద్యార్థులకు ప్రధానంగా లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు. సైన్సు, సాంకేతిక రంగం, ఇంజినీరింగ్‌, గణితం చదివే విద్యార్థులను సమష్టిగా 'స్టెమ్‌'(ఎస్‌.టి.ఈ.ఎం)గా వ్యవహరిస్తున్నారు. ఈ 'స్టెమ్‌' పరిధిలోకి వచ్చే విద్యార్థులకు ఆరేళ్లపాటు వర్క్‌పర్మిట్‌ ఇవ్వాలన్నదే తాజా ప్రతిపాదన సారాంశంగా ఉంది. అంటే..., అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు పూర్తయిన తర్వాత మూడేళ్లు.... అవసరమైతే గ్రాడ్యుయేషన్‌ అయిన తర్వాత మరో మూడేళ్లపాటు ఆయా కేటగిరీల విద్యార్థులు పనిచేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం అమెరికాలో ఏదైనా డిగ్రీ పూర్తయిన తర్వాత పన్నెండునెలల పాటు మాత్రమే పనిచేసుకునేందుకు అనుమతినిస్తున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. భారత దేశం నుంచి 'స్టెమ్‌' కేటగిరీలో అత్యధిక విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్న నేపథ్యంలో ఒబామా సర్కారు చేసిన తాజా ప్రతిపాదనలు వారికే అత్యధిక లబ్ధి చేకూరుస్తాయని భావిస్తున్నారు.

posted on 11.6.2015

Ask the Expert
Click Here..