Latest News

విద్యార్థుల కుటుంబాలు క్షోభిస్తున్నాయ్‌

* వారిని వెనక్కి పంపడంపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడండి
* కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

ఈనాడు - హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసమని అప్పులు చేసి అమెరికా వెళ్ళిన తెలుగు విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. జనవరి 5న హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ను కలిసిన కేటీఆర్‌, ఆరో తేదీన ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళారు. విద్యార్థులను వెనక్కి పంపటం వల్ల వారి కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చట్టబద్ధంగా అమెరికన్‌ కాన్సులేట్‌ జారీచేసిన వీసా, అనుమతి పత్రాలున్నప్పటికీ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగింది. హైదరాబాద్‌ నుంచే ఎక్కువమంది విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వెళుతున్నారు. అక్కడ చదువుల కోసమని విద్యార్థులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు వారిని వెనక్కి పంపటంతో వారి కుటుంబాలు తీవ్ర మానసిక, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అక్కడి అధికారులు విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు బాగోలేదంటూ వార్తలొస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వెంటనే అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి’’ అని సుష్మాస్వరాజ్‌కు రాసిన లేఖలో కేటీఆర్‌ కోరారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే సుష్మాస్వరాజ్‌ను స్వయంగా కలుస్తానని కూడా మంత్రి తెలిపారు.

posted on 07.01.2016

Ask the Expert
Click Here..