Latest News

ఎయిర్‌ ఇండియాదే పొరపాటు!

* విద్యార్థులను అడ్డుకోవడంపై ఎన్‌పీ విశ్వవిద్యాలయం ఆరోపణ
వాషింగ్టన్‌: అమెరికా వస్తున్న భారతీయ విద్యార్థులను అడ్డుకోవడంలో ఎయిర్‌ ఇండియాదే పొరపాటని అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయం నిందించింది. ఎయిర్‌ ఇండియా చర్యల వల్ల విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని వెల్లడించింది. ‘ఎయిర్‌ ఇండియా చర్యల వల్లే ఈ ఇబ్బందులు తలెత్తినట్లు భావిస్తున్నాం’ అని నార్త్‌వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ(ఎన్‌పీయూ) అధ్యక్షుడు పీటర్‌ హసెహ్‌ విద్యార్థులకు ఈ-మెయిల్‌ సందేశం పంపారు. విశ్వవిద్యాలయం ఖ్యాతికి మచ్చతెచ్చి, పూడ్చలేనంత నష్టాన్ని ఎయిర్‌ ఇండియా ఎందుకు కల్గించిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొవలసి వచ్చిందన్నారు. అమెరికా నుంచి విద్యార్థులను తిరిగి పంపిస్తే సంస్థపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతోనే ఎయిర్‌ ఇండియా అడ్డుకుందని ఆరోపించారు. చాలా మంది విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమెరికాకు వచ్చి తమ యూనివర్సిటీలో చేరుతున్నారని అన్నారు. రెండో దశ పరిశీలనకు వెళ్లినప్పుడు సరైన పత్రాలు, సమాధానాలు తెలిపిన వారిని అమెరికాలోకి అనుమతిస్తారని వెల్లడించారు. ఇది ఎన్‌పీ విశ్వవిద్యాలయం, ఎఫ్‌-1 విద్యార్థులకు మాత్రమే కాదని.. హెచ్‌-1 వీసాపై వచ్చే విదేశీ ప్రయాణికులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారని విద్యార్థులను నిందించారు. ‘అడ్డుకున్న విద్యార్థులు విషయాన్ని పెద్దది చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నాం. ఇంటర్య్వూలో పేలవమైన ప్రదర్శన కనబరిచామని వారి తల్లిదండ్రులకు చెప్పకుండా.. ఎన్‌పీ విశ్వవిద్యాలయం నిషేధిత జాబితాలో ఉందని నిందిస్తున్నారు’ అని పీటర్‌ ఆరోపించారు. ఇమిగ్రేషన్‌ ఇంటర్య్వూలో విఫలమైన కొద్ది మంది విద్యార్థులు మాత్రమే భారత్‌కు పంపివేసినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై ఎయిర్‌ ఇండియా స్పందించలేదు.

posted on 07.01.2016

Ask the Expert
Click Here..