Latest News

వెనక్కి పంపించడమే లక్ష్యం

* అమెరికాలో తనిఖీల పరమార్థమిదే..!
* గుంపులుగా వస్తారంటూ సిబ్బంది వ్యంగ్యాస్త్రాలు
* హైదరాబాద్‌కు తిరిగొచ్చిన 20మంది విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నతవిద్య కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులు భంగపాటుకు గురై తిరిగి రావడం ఆనవాయితీగా మారింది. జనవరి 2న హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లిన 20మంది విద్యార్థులు జనవరి 6న శంషాబాద్‌ తిరిగొచ్చారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థుల్ని ‘ఈనాడు’ పలకరించగా అక్కడ ఎదురైన చేదు అనుభవాల్ని వివరించారు. వారి మాటల్లోనే.. ‘‘అమెరికా చేరుకున్న అనంతరం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల కోసం వరుస కట్టిన తెలుగు విద్యార్థుల్ని అక్కడి సిబ్బంది వేరేగా తీసుకెళ్లారు. అందరినీ ఒక్కచోట నిలబెట్టి ఆంగ్లంలో ప్రశ్నలవర్షం కురిపించారు. ‘మీతోటి విద్యార్థులు తిరిగి వస్తున్నారు కదా. అయినా మీరెందుకొస్తున్నారు..?’, ‘గుంపులుగుంపులుగా వస్తారు.. అందరూ ఒకేతరహా ధ్రువపత్రాలు చూపిస్తారు.. వీసాలు తీసుకునేందుకు ఎంత డబ్బులు చెల్లిస్తున్నారు?’, ‘విశ్వవిద్యాలయంలో సీటు కొనేందుకు ఎంత ఇస్తున్నారు?’.. తదితర ప్రశ్నలు వేస్తూ వేధించారు. 20మంది బృందంలోని ఇద్దరు అమ్మాయిలతోనైతే ఏమీ మాట్లాడకుండానే వెంటనే విమానంలో భారత్‌కు తిప్పి పంపారు. మిగతా విద్యార్థుల్ని మాత్రం 12గంటలపాటు ఓగదిలో కూర్చోబెట్టారు. తిరుగు ప్రయాణపు టికెట్లు ఖరారయ్యాయని సమాచారం వచ్చిన తర్వాత విచారణ చేపట్టారు. అదీ హేళనగా, భారత విద్యార్థుల గురించి జోకులేసుకుంటూ, వెకిలి నవ్వులతో కొనసాగించారు. ఓ విద్యార్థి ఇదంతా ఏంటని గట్టిగా ప్రశ్నించినందుకు అతడి వీసాను వెనక్కి తీసుకుంటూ దానిపై అయిదేళ్లపాటు అమెరికా రాకుండా రివోక్‌ అని ముద్రవేయడం గమనార్హం. మిగిలిన విద్యార్థులను ఒత్తిడిచేసి తమంతట తాముగా వెనక్కి వెళ్తున్నట్లు సంతకాలు తీసుకొని విమానమెక్కించారు’’ అని పేర్కొన్నారు.
ఆశలు అడియాసలు: గత 20రోజుల నుంచి విద్యార్థులు అమెరికాకు వెళ్తూ తిరిగి వస్తున్నా.. తనిఖీ అధికారుల్ని ఒప్పించగలమనే ధీమాతో వెళ్లిన తాజాబృందం ఆశలు అడియాసలే అయ్యాయి. డిసెంబరు నుంచి ఈతరహా అనిశ్చితి కొనసాగుతున్నా ఈమధ్యకాలంలో అడపాదడపా ఒకరిద్దరు విద్యార్థులు మాత్రం ఆటంకాల్ని అధిగమించి అమెరికాలో ప్రవేశించగలిగారు. అలా ఏమాత్రం అవకాశం వచ్చినా తనిఖీ అధికారుల్ని ఒప్పించాలనే ఉద్దేశంతోనే తాజాబృందం అమెరికా వెళ్లింది. అయితే వీరికి ఏమాత్రం అవకాశమివ్వని అధికారులు.. తిప్పిపంపడమే పరమార్థంగా వ్యవహరించడంతో వెనక్కి రాక తప్పలేదు. అమెరికాలో తెలుగు విద్యార్థులు ఇలా అవమానాలకు గురవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఈఅనిశ్చితికి ఇంకా తెరదించడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.


posted on 07.01.2016

Ask the Expert
Click Here..