Latest News

పక్కా ప్రణాళికతోనే అమెరికా వెళ్లండి

* 'యూఎస్-ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్' సాయం తీసుకోండి
* విద్యార్థులకు ఆ సంస్థ సమన్వయకర్త రేణుకా రాజారావు సూచన

ఈనాడు, హైదరాబాద్: అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు కనీసం ఏడాదిన్నర ముందు నుంచే ప్రణాళికను రూపొందించుకోవాలని యూఎస్-ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) భారత సమన్వయకర్త రేణుకా రాజారావు సూచిస్తున్నారు. పూర్తిస్థాయిలో నమ్మకమైన సమాచారం పొందిన తర్వాతే, ఆయా విశ్వవిద్యాలయాలను, కోర్సులను ఎంపిక చేసుకోవాలని ఆమె చెబుతున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆమె గురువారం(జనవరి 7) విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె మాటల్లోనే...
* అధికారిక సమాచారం ఇస్తాం
అమెరికా-భారత్ విద్యార్థులకు పరస్పర సహకారం అందించే నిమిత్తం రెండు దేశాల ఒందంలో భాగంగా ఆరు దశాబ్దాల క్రితం ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది. దాదాపు 170 దేశాల్లో 450 కేంద్రాల ద్వారా ఇది సేవలు అందిస్తోంది. భారత్‌లో హైదరాబాద్ సహా దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌లలో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌లోనే ప్రాంతీయ కేంద్రం ఉంది. అక్కడ ఫౌండేషన్ ప్రాంతీయ అధికారి ప్రియా బహదూర్‌ను సంప్రదించి, అమెరికా విద్యకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సంస్థ అన్ని విధాలా మార్గదర్శనం చేస్తుంది. విద్యార్థులు అమెరికాలో చదువుకొనేందుకు ఐదు దశలను ఎలా పూర్తిచేయాలో వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
* విద్యాసంస్థ అనుమతితోనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయాలి
విద్యా సంస్థ అనుమతి మేరకు ఆన్ క్యాంపస్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలాగే కోర్సుకు సంబంధించిన విషయాల్లోనూ పార్ట్‌టైమ్‌గా పనిచేయవచ్చు. దానిని కరికులమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (సీపీటీ)గా పిలుస్తారు. చదువు పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) పేరిట ఏడాదిపాటు ఉద్యోగం చేసుకోవచ్చు. ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఈ కార్యక్రమంలో మీ పేరును చేర్చితే, ఓపీటీ కింద రెండున్నర సంవత్సరాలు పనిచేయవచ్చు. హెచ్-1బీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాచారమివ్వాలి. తిరిగి వచ్చినవారు మళ్లీ మరో విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా పొందొచ్చు. మళ్లీ అదే విశ్వవిద్యాలయం అంటే మాత్రం సమస్య రావచ్చు.
* విద్యాసంస్థల గుర్తింపును నిర్ధారించుకోండి
అమెరికాలోని గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల జాబితాను విద్యార్థులు తప్పనిసరిగా సరిచూసుకోవాలి. గుర్తింపులో ముఖ్యంగా రెండున్నాయి. ఒకటి రీజినల్ అక్రిడేషన్. ఈ గుర్తింపు ఉంటే ఢోకా లేదు. మరొకటి నేషనల్ ఎక్రిడేషన్. దీన్ని ఒకేషనల్, ఇతర మతపరమైన విద్యా సంస్థలకు ఇస్తారు. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి.
* అమెరికా కార్నర్‌లో సందేహాల నివృత్తి
విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబరు 1800-103-1231కు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో అమెరికా కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికా కార్నర్ పేరిట ఓ కార్యాలయం పనిచేస్తోంది. ఇక్కడి గ్రంథాలయంలో అమెరికా విద్యకు సంబంధించిన పుస్తకాలున్నాయి. వాటిని చదివి విద్యార్థులు పూర్తి అవగాహన పెంపొందించుకోవచ్చు. అంతర్జాలంలోనూ తెలుసుకోవచ్చు. ప్రతి గురువారం అమెరికా కార్నర్‌కు యూఎస్ఐఈఎఫ్ ప్రతినిధి వస్తారు. ఆ రోజైనా విద్యార్థులు వచ్చి, తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.


posted on 08.01.2016

Ask the Expert
Click Here..