Latest News

ఐదంచెల అధ్యయనంతో అమెరికా విద్య

* భారతీయ విద్యార్థులకు ఫాల్‌ సీజన్‌ ప్రవేశాలు ఉపయుక్తం
* పీజీ విద్యార్థులకు ఉపకార వేతనాలు నామమాత్రమే
* అమెరికా-ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌
* సమన్వయకర్త రేణుకా రాజారావు

ఈనాడు - హైదరాబాద్‌: అమెరికాలో అవస్థలకు అడ్డుకట్ట వేయాలంటే... ఐదంచెల ప్రణాళికతో ముందడుగు వేయాలి. విశ్వవిద్యాలయం ఎంపిక మొదలు, ఆర్థిక ప్రణాళిక వరకు వ్యూహాత్మకంగా అనుసరించకపోతే అక్కడి విద్య అందని ద్రాక్షే అవుతుంది. ఆ దేశంలో మొత్తం 4,500 విద్యా సంస్థలకు గుర్తింపు ఉంది. వీటిలో చేరుతున్నప్పటికీ, చేయదలచుకున్న కోర్సును బోధించేందుకు ఆ సంస్థకు అక్రిడేషన్‌ ఉందా? అన్నది తప్పకుండా నిర్ధారించుకోవాలి. భారత్‌లో డిగ్రీ ముగిసిన రెండు, మూడు నెలల వ్యవధిలోనే అమెరికా వెళ్లేందుకు సిద్ధపడటం... పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకుండా కన్సల్టెంట్లను నమ్ముకోవటం విద్యార్థులు అవస్థలు పడటానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో సీటు పొందేందుకు జీఆర్‌ఈ, టోఫెల్‌, ఐఈఎల్‌టీల్లో మార్కులొక్కటే ప్రామాణికం కాదు. డిగ్రీలో వచ్చిన మార్కులు కూడా దోహదం చేస్తాయి. వీటికి తోడు విద్యార్థి సృజనశీలత, అర్థం చేసుకునే తీరు కీలక భూమికను పోషిస్తాయి. ఉపకార వేతనాల మంజూరులో పరిశోధన (పీహెచ్‌డీ) విద్యార్థులకే ప్రాధాన్యం ఉంటుందనీ, పీజీ చదివేందుకు వచ్చేవారికి ఉపకారవేతనం లభించటం నామమాత్రమేనని అమెరికా-ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ భారతీయ సమన్వయకర్త రేణుకా రాజారావు శుక్రవారం ‘ఈనాడు’కు చెప్పారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి జనవరి-ఫిబ్రవరి (స్ప్రింగ్‌ సీజన్‌), ఆగస్టు-సెప్టెంబరు (ఫాల్‌ సీజన్‌)లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఫాల్‌ సీజన్‌లో ప్రవేశాలకు వెళ్లటం అన్ని విధానాలా శ్రేయస్కరమని రేణుక సూచించారు.
ఈ సమాచారం తప్పనిసరి: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లాలనుకుంటే అధ్యయనమే తొలిదశ. కనీసం 12 నుంచి 18 నెలల ముందు నుంచి కసరత్తు చేయాలి. అక్కడి విశ్వవిద్యాలయాల నుంచి అధ్యాపకుల వివరాలు, ఆయా కోర్సులకు అనుమతులు ఉన్నాయి? అక్రిడేషన్‌ ఉందా? విదేశీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? గ్రంథాలయం, ప్రయోగశాల ఉందా? అన్నవి తెలుసుకోవాలి. అక్కడి వాతావరణ పరిస్థితులేంటి? చదువుకుంటూ విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉందా, లేదా? అన్న అంశాలపైనా స్పష్టమైన సమాచారం ఉండాలి.
ఆర్థిక పరిస్థితి కీలకం: అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ చేయాలంటే ఏడాదికి 20 వేల నుంచి 50 వేల డాలర్లు వరకు వ్యయమవుతుంది. అమెరికాలో 5 వేల డాలర్లతో ఏడాది చదువును పూర్తిచేయించే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. తక్కువ ఫీజు కదాని వాటిల్లో చేరితే, సాధించేది ఏమీ ఉండదు. కోర్సును పూర్తిచేసేందుకు అవసరమైన మొత్తాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవటం ఉత్తమం. అమెరికా వెళ్లిన తర్వాత... ఉపాధి మార్గాలను వెతుక్కుని ఫీజులు, నిర్వహణ ఖర్చులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిద్దామనుకుంటే మొదటికే మోసం రావచ్చు. విశ్వవిద్యాలయాల్లోనే వారానికి గరిష్ఠంగా 20 గంటలు పనిచేసే వెసులుబాటు ఉంటుంది. విద్యా సంవత్సరం పూర్తయితే అధిక సమయం పనిచేసేందుకూ అవకాశమిస్తారు.
దరఖాస్తు భర్తీలో అప్రమత్తం: విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కోర్సును ఎంచుకోవడానికి కారణాలను విశ్లేషిస్తూ ఒక విశ్వవిద్యాలయానికి పంపిన విశ్లేషణనే... స్వల్ప మార్పులతో ఇతర వర్సిటీలకు కూడా పంపుతుంటారు. ప్రవేశాన్ని తిరస్కరించేందుకు ఇది కూడా ఒక కారణమవుతోంది. గత విద్యా కార్యక్రమాల్లో వచ్చిన మార్కులను కూడా జాగ్రత్తగా నమోదు చేయాలి.
వీసా ఇంటర్వ్యూలో నిజాయితీ
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయంలో... చదువుకు అవసరమైన డబ్బులను ఎలా సమకూర్చుకుంటారో స్పష్టంగా చెప్పాలి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సరిగ్గా ఇక్కడే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వీసా, అమెరికా పోర్టులో ఇమిగ్రేషన్‌ అధికారులు ఇంటర్వ్యూ చేసే సమయంలో... ఆర్థికపరమైన అంశాలకు విద్యార్థులు పొదుపుగా సమాధానాలు చెప్పడం తిరస్కారానికి కారణమవుతున్నట్లు రేణుకా రాజారావు చెప్పారు. చాలా సందర్భాల్లో పార్ట్‌టైం ఉద్యోగం చేసి, డబ్బులను సమకూర్చుకుంటామని చెబుతున్నారనీ, దీంతో వీసాలు మంజూరు కావడం లేదన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.
ఉచిత అవగాహన తరగతులు
ఫీజులు, నిర్వహణ ఖర్చులకు సంబంధించి బ్యాంకు పత్రాలు... విద్యా ప్రమాణాలకు సంబంధించి ధ్రువపత్రాలను విద్యార్థులు సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో అమెరికా-భారత్‌ విద్యా ఫౌండేషన్‌ ఏర్పాటుచేసే ఉచిత సన్నద్ధత తరగతులను విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. అమెరికా పోర్టులో ఇమిగ్రేషన్‌ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలి? కోర్సులు ఎలా ఉంటాయి? తదితర అంశాలపై నిపుణులతోపాటు ఆయా విశ్వవిద్యాలయాల్లో చదవిన విద్యార్థులతో వివరంగా చెప్పించేందుకు ఈ ఫౌండేషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.
అమెరికాలో ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారం కోసం ఈ వెబ్‌సైట్లను చూడవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఈ వెబ్‌సైట్‌లో అపారమైన సమాచారం అందుబాటులో ఉంటుందని అమెరికా కాన్సులేట్‌ అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు.
www.petersons.com
www.educationusa.state.gov
www.usief.org.in
అమెరికాలో ఉన్నత విద్య వివరాలు తెలుసుకోవాలనుకుంటే అపాయింటుమెంటు కోసం ఈ-మెయిల్‌ను వినియోగించుకోవచ్చు.
usiefhyderabad@usief.org.in
ఆయా విద్యా సంస్థలకు గుర్తింపు(అక్రిడేషన్‌) ఉందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
www.chea.org
వివిధ అంశాల్లో సంశయాలను తొలగించుకునేందుకు సోమవారం నుంచి శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయవచ్చు. 1800 103 1231
లేదంటే...80084 65712, 80084 62712, 040 4033 8300 లను సంప్రదించవచ్చు.

posted on 10.01.2016

Ask the Expert
Click Here..