Latest News

మరో 22 మంది విద్యార్థులు వెనక్కి

* విమానాశ్రయం నుంచి తిప్పిపంపిన అమెరికా అధికారులు
* టికెట్‌ డబ్బుల కోసం ఎయిరిండియా సిబ్బంది పట్టు
* ఉపముఖ్యమంత్రి చొరవతో విద్యార్థులకు విముక్తి

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించడం కొనసాగుతోంది. తాజాగా న్యూయార్క్‌ వెళ్లిన మరో 22 మంది విద్యార్థులను అక్కడి అధికారులు తిప్పి పంపించారు. జనవరి 7న అమెరికా వెళ్లిన తమను న్యూయార్క్‌ విమానాశ్రయంలో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూయార్క్‌ విమానాశ్రయం చేరుకోగానే విద్యార్థులను అక్కడి అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఇంత భారీగా విద్యార్థులు అమెరికాకు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇప్పటికే ఎంతోమందిని పంపించినా ఇంకా ఎందుకు వస్తున్నారని నిలదీశారని విద్యార్థులు చెప్పారు. తమకు బేడీలు వేసి విమానాశ్రయంలో తిప్పారని, వెంటనే వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని వాపోయారు. చదువుకోవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారని ఓ విద్యార్థి చెప్పారు. ఇలా వివిధ ప్రశ్నలతో వేధించి ఎయిర్‌ ఇండియా విమానంలో తమను వెనక్కి పంపించారన్నారు.
శంషాబాద్‌లో నిరీక్షణ: అయితే జనవరి 10 వ తేదీన శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న తమను టికెట్‌ డబ్బులు చెల్లించాలని ఎయిరిండియా సిబ్బంది అక్కడే కూర్చోబెట్టారని విద్యార్థులు చెప్పారు. అర్ధరాత్రి 1.30 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అదే సమయంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ విమానాశ్రయం నుంచి బయటకి వస్తుండడంతో అక్కడే నిరీక్షిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను అడ్డుకుని విషయం చెప్పారు. పలువురు తల్లిదండ్రులు కంటతడి పెట్టడంతో ఉపముఖ్యమంత్రి ఎయిరిండియా అధికారులతో మాట్లాడి విద్యార్థులను వదిలిపెట్టేలా చర్యలు తీసుకున్నారు. తెలుగు విద్యార్థుల ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమెరికా దృష్టికి తీసుకెళ్లిందని ఆయన అన్నారు. విద్యార్థులపట్ల అమెరికాలో అధికారులు వ్యవహరించిన తీరుపై మహమూద్‌ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.

posted on 11.01.2016

Ask the Expert
Click Here..