Latest News

ఐదు కారణాలతోనే విద్యార్థులు వెనక్కి

* ‘అమెరికాలో ఉన్నత విద్య’ ఇబ్బందులపై నిపుణుల విశ్లేషణ
* వాటిని అధిగమిస్తే సులభంగానే అమెరికాయానం
* ‘ఈనాడు-వెబినార్‌’లో సందేహాల నివృత్తి

ఈనాడు - హైదరాబాద్‌: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు పదుల సంఖ్యలో తిరిగి వస్తుండటానికి... ముఖ్యంగా ఐదు అంశాలపై స్పష్టత లేకపోవడమేనని నిపుణులు చెప్పారు. నెల రోజులుగా 200 మందికిపైగా విద్యార్థులను అమెరికాలోని విమానాశ్రయాల నుంచి తిప్పిపంపిన సంగతి తెలిసిందే. ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదంటూ ఇలా తిప్పి పంపడంతో... తెలుగు రాష్ట్రాల్లోని పలువురు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా యానంపై సందేహాల నివృత్తికి ‘ఈనాడు’ జనవరి 12న నిపుణులతో వెబినార్‌ నిర్వహించింది. మూడురోజుల క్రితం విద్యార్థుల సందేహాలను ఆహ్వానించగా.. భారీసంఖ్యలో ఈ-మెయిల్‌ సందేశాలు వెల్లువెత్తాయి. వీటికి ‘గ్లోబల్‌ ట్రీ’ సంచాలకులు ఆలపాటి శుభకర్‌, సెంటర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీ స్టడీస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కన్నెగంటి రమేశ్‌బాబులు సమాధానాలిచ్చారు. తెలుగురాష్ట్రాల నుంచి 2014లో 26,220 మంది విద్యార్థులు అమెరికా వెళ్లగా, గతేడాది సుమారు 50వేల మంది వెళ్లినట్లు వారు వివరించారు. వారిలో కేవలం 200 మంది మాత్రమే ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల సందర్భంగా వెనక్కి వచ్చినట్లు తెలిపారు. ఆంగ్లభాషపై పట్టు లేకపోవడం, అమెరికాలో వసతి సౌకర్యం.. చదువుకయ్యే నిధుల లభ్యతపై అస్పష్టత, ఇమ్మిగ్రేషన్‌ తనిఖీ పరిభాషపై పరిజ్ఞానం, సరైన అవగాహన లేకపోవడం తదితర కారణాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఇమ్మిగ్రేషన్‌ తనిఖీ ఇబ్బందులను అధిగమించొచ్చని వారు స్పష్టం చేశారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
* అమెరికాలో చదువుకుంటూ విశ్వవిద్యాలయం వెలుపల ఉద్యోగం చేయడం చట్టరీత్యా నేరం. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పార్ట్‌టైం ఉద్యోగాలను చేయాలన్న ఉద్దేశాన్ని మనసులో నుంచి పూర్తిగా తీసేయాలి. తల్లిదండ్రులు... చదువుకునే తమ పిల్లలతో బయట ఉద్యోగం చేసేందుకు ప్రోత్సహించడం తగదు. విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండే క్లబ్‌లు, ఇతర కమ్యూనిటీల్లో చేరేందుకు ప్రయత్నించడం ద్వారా క్యాంపస్‌ ఉద్యోగాలను పొందేందుకు అవకాశాలు మెరుగుపడతాయి.
* విద్యా సంవత్సరం అంతటికీ అవసరమైన వ్యయ అంచనాలపై... రుణం మంజూరుచేసే బ్యాంకు రూపొందించిన ఐ-20 పత్రాన్ని ముందే పరిశీలించుకోవాలి. అందులో బోధన రుసుము, వసతి, ఇతరత్రా వ్యయానికి సంబంధించి పూర్తివివరాలు తప్పనిసరిగా ఉండాలి.
* ప్రయాణానికి ముందే అంతర్జాతీయ విద్యకు సంబంధించిన నిపుణుల నుంచి సలహాలు తీసుకోవాలి. స్నేహితులు, బంధువులు చెప్పే అస్పష్ట విషయాలను నమ్ముకుని ఇబ్బందులకు గురికావొద్దు.
* మీరు చేరగోరిన విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను పరిశీలించి, జాబితాలో సూచించిన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
* బ్యాంకు.. రుణం మంజూరు చేస్తుంది కాబట్టి, వీసా వచ్చిన వెంటనే బోధన రుసుమును పూర్తిస్థాయిలో విశ్వవిద్యాలయ ఖాతాకు బదిలీ చేయడం ఉత్తమం. లేదంటే డీడీ రూపంలో వెంట తీసుకెళ్లాలి. వసతికి సంబంధించిన డబ్బుల్ని నిల్వ ఉంచిన బ్యాంకు ఖాతాకు సంబంధించి ట్రావెల్‌ కార్డును వెంట ఉంచుకోవాలి. ఈ రెండు అంశాల్లో స్పష్టత లేకుంటే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెనక్కి పంపించడం ఖాయం.
* అమెరికాలో వసతి ఎక్కడన్న విషయమై స్పష్టత అవసరం. సీనియర్లతో కలిసి విశ్వవిద్యాలయం వెలుపల ఉంటానని చెప్పవచ్చు.

posted on 14.01.2016

Ask the Expert
Click Here..