Latest News

రెండు రోజుల్లోనే పాస్‌పోర్ట్‌

* ముందస్తు పోలీసు పరిశీలన ఎత్తివేత
* పాన్‌, ఆధార్‌, ఓటరు కార్డులుంటే చాలు
* నిబంధనల సరళీకరణ

ఈనాడు, విశాఖపట్నం: దేశవాసులకు పాస్‌పోర్ట్‌లను మరింత వేగంగా మంజూరు చేసేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ(ఎం.ఇ.ఎ.) విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే పాస్‌పోర్టు చేతికందనుంది. పాస్‌పోర్ట్‌ మంజూరు చేయడానికి నిర్వహించే ముందస్తు పోలీసు పరిశీలన చేయాల్సిన అవసరం లేకుండా నిబంధనలను సరళీకరించింది. ముందుగా పాస్‌పోర్ట్‌ మంజూరు చేసి; ఆ తరువాత దరఖాస్తుదారుడు సమర్పించిన వివరాలు సరైనవా? కావా? అన్న విషయాల్ని పోలీసులతో తనిఖీ చేయించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం పాస్‌పోర్ట్‌ కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసిన తరువాత పాస్‌పోర్టు అధికారుల ముందు హాజరై అసలు ధ్రువపత్రాలు, వేలిముద్రలు, ఐరిస్‌లు ఇవ్వాలి. అనంతరం పోలీసులు దరఖాస్తుదారుడి ఇంటికి వచ్చి వివరాల్ని పరిశీలిస్తారు. దరఖాస్తుదారుడు ఇచ్చిన వివరాలు సరైనవేనని ‘పోలీసు తనిఖీ నివేదిక’(పి.వి.సి.)లో ధ్రువీకరించిన తరువాతే పాస్‌పోర్ట్‌ మంజూరు చేస్తారు. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చారు. దరఖాస్తుదారుడు పాస్‌పోర్ట్‌ అధికారులకు ధ్రువపత్రాలను చూపే సమయంలో పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటరు కార్డులను చూపిస్తే ఎలాంటి పోలీసు పరిశీలన లేకుండా వెంటనే పాస్‌పోర్ట్‌ను మంజూరు చేస్తారు. అయితే మూడు ధ్రువపత్రాలపై చిరునామాలు ఒకే విధంగా ఉండాలి. పాన్‌కార్డుపై చిరునామా లేకపోయినప్పటికీ పాస్‌పోర్ట్‌ అధికారులు దాని నెంబరు ఆధారంగా తనిఖీ చేస్తారు. ఒకే విధమైన చిరునామాలు లేకపోతే మాత్రం మళ్లీ పాత పద్ధతిలోనే పాస్‌పోర్ట్‌ను మంజూరు చేస్తారు.
పోలీసుకు ప్రత్యేక యాప్‌..: దరఖాస్తుదారుల వివరాలు పరిశీలించడానికి పోలీసులు ప్రస్తుతం ప్రత్యేకంగా ట్యాబ్‌లు వినియోగిస్తున్నారు. దానిబదులు ప్రత్యేకంగా ఒక యాప్‌ (అప్లికేషన్‌)ను ‘ఎం పాస్‌పోర్ట్‌ పోలీస్‌ యాప్‌’ పేరుతో అందుబాటులోకి వచ్చింది. వివరాల పరిశీలనకు వెళ్లే పోలీసులు తమ స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌లలో దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని తనిఖీ నివేదికను క్షణాల్లో పంపించవచ్చు.
కావాల్సిన రోజున హాజరుకావచ్చు..: దరఖాస్తుదారులు ఆన్‌లైన్లో పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేస్తే ‘సమయం’(స్లాట్‌/అపాయింట్‌మెంట్‌) ఇస్తారు. అభ్యర్థులు అదే సమయంలో కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. ఆరోజుల్లో ఇతర అత్యవసర పనులేమైనా ఉంటే మళ్లీ దరఖాస్తుకు ప్రయత్నించాలి. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉన్న ఐదు పనిదినాలు, ఆ రోజుల్లో నిర్ణీత సమయాలను ఎంచుకోవచ్చు.
గణతంత్ర దినోత్సవ కానుక
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణతంత్ర దినోత్సవ కానుకగా సరళీకరించిన నూతన విధానాల్ని అందుబాటులోకి తెచ్చింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయి. ఈ సౌకర్యానికి ఎలాంటి అదనపు రుసుములు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నూతన విధానం అమలైతే దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే పాస్‌పోర్ట్‌ అందే అవకాశం ఉంటుంది. తనిఖీ జరగడంలేదు కదా అని తప్పుడు నకిలీ ధ్రువపత్రాలు సమర్పిస్తే రెండేళ్ల జైలు, జరిమానా, రూ.5వేలు అపరాధరుసుము, పాస్‌పోర్టు రద్దు తదితర కఠిన చర్యలు ఉంటాయి.
    - ఎన్‌.ఎల్‌.పి.చౌదరి, పాస్‌పోర్ట్‌ అధికారి

posted on 27.01.2016

Ask the Expert
Click Here..