Latest News

వర్క్ పర్మిట్ల జారీని కఠినతరం చేయనున్న బ్రిటన్

లండన్: ఇతర దేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చేవారిని కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వర్క్‌ ఆర్డర్‌ల జారీని కఠినతరం చేయనుంది. నైపుణ్యం గల ఉద్యోగుల కనీస వేతనాలను కూడా గణనీయంగా పెంచబోతోంది. స్థానికులకు ఉద్యోగావకాశాలు, అప్రెంటీస్‌షిప్‌ల పెంపు కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ ఆదేశ పార్లమెంటుకు తెలిపారు.
బ్రిటన్‌ తాజా నిర్ణయం భారత్‌ లాంటి వర్ధమాన దేశాల వృత్తి నిపుణులపై ప్రభావం చూపనుంది.
బ్రిటన్ లోని చాలా పరిశ్రమలు, కంపెనీలు ప్రభుత్వ ఉదార విధానాల వల్ల భారత్‌ లాంటి దేశాల నుంచి నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమించుకుంటున్నాయి. అలా చేరిన విదేశీ ఉద్యోగులు తమ జీవిత సహచరులకూ అత్యంత సులువుగా ఉద్యోగాలు ఇప్పించుకొని బ్రిటన్‌కు రప్పించుకునే వారు. కామెరూన్‌ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ అవకాశం ఇకపై ఉండబోదు. గడచిన పదేళ్ల కాలంలో ఇమిగ్రేషన్‌ల సంఖ్య 3 లక్షల 18వేలకు చేరడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. దీంతో ఈ ఇమిగ్రేషన్లను లక్షకు పరిమితం చేస్తానని గత ఎన్నికల్లో కామెరూన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఏర్పాటైన ఇమిగ్రేషన్‌ అడ్వయిజరీ కమిటీ సూచనల మేరకు ప్రధాని కామెరూన్‌ తాజా ఇమిగ్రేషన్‌ బ్లూ ప్రింట్‌ను ప్రకటించారు. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది నుంచే అమల్లోకి రానుంది.

posted on 13.6.2015

Ask the Expert
Click Here..