Latest News

అమెరికా కాన్సులేట్‌కు వీసా అధికారుల కొరత

* ఒక్కొక్కరూ రోజూ వంద మందిని ఇంటర్వ్యూ చేయాల్సివస్తోంది
* విద్యార్థి వీసా దినోత్సవంలో కాన్సులేట్‌ ముఖ్య అధికారి

ఈనాడు, హైదరాబాద్‌: వీసా అధికారులు ఏడుగురే ఉండటంతో రోజూ ఒక్కొక్కరూ సుమారు వందమందిని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తోందని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం ముఖ్య అధికారి జమిసన్‌ ఫౌజ్‌ అన్నారు. నిత్యం 700 నుంచి వెయ్యి మంది అభ్యర్థులు హైదరాబాద్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. బేగంపేట్‌లోని కాన్సులేట్‌ కార్యాలయంలో జూన్ 9న జరిగిన విద్యార్థి వీసా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రస్తుతమున్న కార్యాలయంలో 16 కౌంటర్లే ఉన్నాయి. గచ్చిబౌలిలో నిర్మిస్తున్న నూతన కార్యాలయంలో 51 కౌంటర్లను ఏర్పాటుచేసి వీసా అధికారుల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంటర్వ్యూకు హాజరయ్యే విద్యార్థులు నిజం చెబుతున్నారో, లేదో అనే విషయంపై వీసా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెడతారు. అభ్యర్థులు నిజాన్ని సూటిగా చెబితే ఎలాంటి ఇబ్బందులుండవు. డిగ్రీ ప్రదానోత్సవం, వ్యాపార సమావేశాలు, సదస్సులు వంటి పనులపై వెళ్లాలనుకునే వారు తక్కువ వ్యవధిలో వీసా పొందేందుకు కాన్సులేట్‌ వెబ్‌సైట్‌లోని ‘అత్యవసర వీసా’ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. గత ఐదేళ్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 80శాతం పెరిగింది. విద్యార్థి వీసా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 4000కు పైగా వీసాలు మంజూరుచేయగా వాటిలో దాదాపు 700 హైదరాబాద్‌ కార్యాలయానికి చెందినవే.’’అని స్పష్టంచేశారు. కార్యక్రమంలో 16 మంది అభ్యర్థులకు ప్రాంతీయ కాన్సులేట్‌ అధికారులు వీసాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

posted on 10.06.2016

Ask the Expert
Click Here..