Latest News

నాణ్యమైన విద్య కోసం బ్రిటన్‌కు రండి

* విద్యార్హతకు తగిన ఉద్యోగాలే చేయండి
* భారత విద్యార్థులకు ఉపకారవేతనాలు
* యూకేలో ప్రపంచ టాప్‌ 200 విశ్వవిద్యాలయాలు
* ‘ఈనాడు-ఈటీవీ’తో బ్రిటీష్‌ హై కమిషనర్‌ డోమినిక్‌ అస్‌క్విత్‌

ఈనాడు - హైదరాబాద్‌: ‘ప్రపంచంలోని టాప్‌ 10, 200 విశ్వవిద్యాలయాల్లో బ్రిటన్‌నకు చెందిన పలు వర్సిటీలున్నాయి...అత్యున్నత నాణ్యమైన విద్యకు బ్రిటన్‌ పెట్టింది పేరు. నాణ్యమైన విద్య కావాలనుకున్న వారు బ్రిటన్‌లో చదివేందుకు రావాలి’ అని భారత్‌లో బ్రిటీష్‌ హై కమిషనర్‌ డోమినిక్‌ అస్‌క్విత్‌ సూచించారు. బ్రిటీష్‌ హై కమిషనర్‌గా నియమితులైన ఆయన తొలిసారిగా జూన్ 23న హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ‘ఈనాడు-ఈటీవీ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతితోపాటు దేశంలోని నగరాల అభివృద్ధికి బ్రిటన్‌ సహకారం, భారత్‌ విద్యార్థులకు ఉపకారవేతనాలు తదితర అంశాలను వివరించారు.
నోబెల్‌ గ్రహీతల్లో 38శాతం బ్రిటన్‌లో చదివినవారే..
ప్రపంచంలో ఉత్తమ నాణ్యమైన విద్యను అందించడంలో బ్రిటన్‌ విశ్వవిద్యాలయాలు ముందంజలో ఉన్నాయి. టాప్‌-10లో కేంబ్రిడ్జి, యూసీఎల్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌ నిలిచాయి. టాప్‌-200 ర్యాంకింగ్‌లో 30 వర్సిటీలున్నాయి. వాటిల్లో చదివి నాణ్యమైన విద్యను పొందొచ్చు. మొత్తం నోబెల్‌ బహుమతి గ్రహీతల్లో 38 శాతం మంది బ్రిటన్‌లో చదివిన వారున్నారు. తాజాగా బ్రిటీష్‌ కౌన్సిల్‌ చేసిన అధ్యయనంలో ప్రస్తుత ప్రపంచస్థాయి ప్రతి 10 మంది నేతల్లో ఒకరు బ్రిటన్‌లో చదివిన వారేనని తేలింది. ఇక్కడ పొందిన విజ్ఞానం, అనుభవం అపారం. మీరు చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు చేయవచ్చు. చిన్న చిన్న ఉద్యోగాలు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు అవకాశం తక్కువ. దానికంటే బ్రిటన్‌లో పొందిన నాణ్యమైన విద్య, అపార అనుభవంతో భారత్‌కు తిరిగి రండి. ఇక్కడ పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి చేయూతనివ్వొచ్చు.
భారీగా ఉపకారవేతనాలు..
భారత్‌ విద్యార్థులు యూకేలో చదివేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం భారీగా స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది. ఒక పథకం కింద 130 మందికి 100 శాతం స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు 2.6 మిలియన్ల పౌండ్లు ఖర్చు చేస్తోంది. బ్రిటీష్‌ కౌన్సిల్‌ వందల సంఖ్యలోనే ఉపకారవేతనాలిస్తోంది. గత రెండేళ్లలో స్కాలర్‌షిప్‌లు నాలుగు రెట్లు పెరిగాయి. రెండు దేశాల మధ్య విద్యా సంబంధాలు బలోపేతం అయ్యేందుకు 2006 ఏప్రిల్‌లో యూకే- ఇండియా ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌(యుకైరి) అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. 2016-21 వరకు మూడో దశ నడుస్తోంది. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య సుమారు 25 వేల మంది విద్యార్థులు, పరిశోధకులు మార్పిడి కార్యక్రమం (ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌) ద్వారా ప్రయోజనం పొందారు.
చదువుకు భారీగా ఖర్చేమీ కాదు
అన్ని దేశాల్లో మాదిరిగానే బ్రిటన్‌లోనూ ఎక్కువ, తక్కువ ఖర్చుతో చదువుకోగలిగిన ప్రాంతాలు, విశ్వవిద్యాలయాలున్నాయి. తక్కువ కాలంలో నాణ్యమైన డిగ్రీను సొంతం చేసుకోవచ్చు. ఆ పరంగా ఆస్ట్రేలియా, అమెరికా, సింగపూర్‌ కంటే తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య పొందొచ్చు. అమెరికా తర్వాత అత్యధిక మంది విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశం బ్రిటనే. ఇక్కడ ఏటా 4.93 లక్షల మంది విదేశీయులు చదువుతున్నారు. వారిలో 21 వేల మంది భారత్‌ నుంచి వస్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో మొత్తం విదేశీ విద్యార్థుల్లో 90 శాతం భారత్‌ విద్యార్థులే ఉన్నారు. అర్హులైన వారికి వీసా సమస్యలేమీ లేవు. దరఖాస్తు చేస్తున్న వారిలో 88 శాతం మందికి వీసాలు వస్తున్నాయని గుర్తుంచుకోవాలి. వీసా పొందేందుకు ఆంగ్ల నైపుణ్యం కూడా అవసరం. ఇతర దేశాల వారికి తలుపులు మూస్తున్నారన్నది పూర్తి అవాస్తవం.
అమరావతి లాంటి నగరాలకు సహకరిస్తాం
జూన్ 23న ఏపీ రాజధాని ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నా. ముఖ్యమంత్రినీ కలుస్తాను. వివిధ అంశాలపై చర్చించి కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా నగరాభివృద్ధిలో బ్రిటన్‌కు అన్ని రకాల అనుభవం ఉంది. అమరావతి లాంటి కొత్త నగరాల్లో రవాణా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, వైద్య రంగం తదితర వాటిపై మా అనుభవాలను పంచుకుంటూ అన్నివిధాలా సహకరిస్తాం.

posted on 23.06.2016

Ask the Expert
Click Here..