Latest News

భారత విద్యార్థులకు న్యూజిలాండ్‌ వీసాల తిరస్కరణ

మెల్‌బోర్న్‌: వేలాది భారత విద్యార్థులకు న్యూజిలాండ్‌ వీసాలను తిరస్కరించినట్లు ఒక మీడియా సంస్థ వెల్లడించింది. 2015 డిసెంబరు నుంచి 2016 మే మధ్య కాలానికి సంబంధించిన గణాంకాలను వివరించింది. ఈ కాలంలో న్యూజిలాండ్‌ ఇమ్మిగ్రేషన్‌ విభాగం 3,864 దరఖాస్తులను తిరస్కరించగా.. 3,176 దరఖాస్తులను మాత్రమే ఆమోదించింది. భారత్‌ నుంచి వస్తున్న దరఖాస్తులను తిరస్కరించడానికి రెండు కారణాల్లో ఏదో ఒకటి చూపుతున్నారు. చాలామంది నిజంగా చదువుల కోసం రావడం లేదని లేదా చదువుకోవడానికి తగినంత మొత్తం వారివద్ద ఉండటం లేదని నమ్ముతున్న ఇమ్మిగ్రేషన్‌ విభాగం వీసాలు తిరస్కరించినట్లు ఆ సంస్థ పేర్కొంది. అధికారిక సమాచార చట్టం కింద పొందిన గణాంకాల ప్రకారం 51 విద్యా సంస్థలకు సంబంధించి 30 శాతానికి పైగా భారత విద్యార్థులకు వీసాలు నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో అత్యధిక శాతం మోసపూరిత కేసులు కావని.. కేవలం ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడమే కారణమని అక్లాండ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ ప్రతినిధి పాల్‌ చాల్మెర్స్‌ తెలిపారు. భారత్‌ నుంచి వచ్చే దరఖాస్తుల విషయంలో ఇమ్మిగ్రేషన్‌ కఠినంగా ఉండేదని, అయితే వీసా తిరస్కరణ శాతం 50 శాతానికి పైగా ఉండటం ప్రశ్నించదగ్గదని ప్రైవేటురంగానికి చెందిన అంతర్జాతీయ విద్యా ప్రతినిధి రిచర్డ్‌ గూడాల్‌ అన్నారు.

posted on 09.07.2016

Ask the Expert
Click Here..