Latest News

భారతీయ విద్యపై బ్రిటన్ ఆసక్తి

* మంత్రి గంటాతో ప్రతినిధి బృందం భేటీ
* భారత విద్యాసంస్థలను సందర్శించనున్న యూకే విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్: భారతీయ విద్యపై బ్రిటన్ ఆసక్తి చూపుతోంది. రానున్న ఐదేళ్లలో కనీసం 25 వేల మంది యూకే విద్యార్థులు దశల వారీగా ఆంధ్రప్రదేశ్, పలు ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థలను సందర్శించనున్నారు. బ్రిటిష్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా సంచాలకులు అలెస్ గెమ్మెల్, దిల్లీలో బ్రిటన్ దౌత్యవేత్త ఆండ్రూస్, ఇతర ప్రతినిధులు బుధవారం విజయవాడలో ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి, విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సమావేశమై, వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలు, విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి చేపడుతున్న చర్యలు, ఆన్‌లైన్ ద్వారా తరగతుల నిర్వహణ గురించి బ్రిటన్ ప్రతినిధి బృందానికి మంత్రి గంటా, అధికారులు వివరించారు. ఈ బృందం అక్టోబరు, నవంబరులలో మరో దఫా రాష్ట్రంలో పర్యటించే అవకాశముందని ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు విజయ్‌ప్రకాష్ తెలిపారు.

posted on 21.07.2016

Ask the Expert
Click Here..