Latest News

విద్యార్థుల కోసం యూకే ప్రయోగాత్మక వీసా పథకం

లండన్: మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు భారత్ తదితర దేశాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం యూకే ప్రయోగాత్మక వీసా పథకాన్ని ప్రారంభించింది. దీనిద్వారా కోర్సు పూర్తయిన తరువాత 6 నెలల పాటు వారు యూకేలో ఉండవచ్చు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజి, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, బాత్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో 13 నెలలు, అంతకంటే తక్కువ కాలావధి కోర్సులకు అనుమతి పొందిన వారంతా ఈ పథకానికి అర్హులు. ఈ టైర్ 4 వీసా ప్రయోగాత్మక పథకాన్ని యూకే హోం కార్యాలయం ప్రారంభించింది. 2016-17 లేదా 2017-18 సంవత్సరాలకు గాను ఈనెల 25, ఆ తరువాత వచ్చిన వీసా దరఖాస్తులకు ఈ పథకం వర్తిస్తుంది. రెండేళ్ల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. యూకేకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 2010-11లో 18,535 ఉండగా అది 2012-13 నాటికి 10,235కు పడిపోయింది. కోర్సు తరువాత పనిచేయడానికి వీలు కల్పించే వీసాలను 2012లో తొలగించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలవైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. కొత్త వీసా పథకం భారతీయ విద్యార్థులను ఆకర్షించే వీలుంటుందని భావిస్తున్నారు.

posted on 30.07.2016

Ask the Expert
Click Here..