Latest News

‘హెచ్‌1-బి’ నిబంధనలను కఠినతరం చేయాల్సిందే

* అమెరికా చట్టసభకు మళ్లీ చేరిన బిల్లు
వాషింగ్టన్‌: హెచ్‌1-బి వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు అమెరికా చట్టసభ(కాంగ్రెస్‌)లోకి మరోసారి ప్రవేశించింది. ‘అమెరికా ఉద్యోగాల రక్షణ, పెంపుదల’ పేరుతో కాలిఫోర్నియాకు చెందిన రిపబ్లికన్‌ నేతలు డారెల్‌ ఇసా, స్కాట్‌ పీటర్స్‌ ఈ బిల్లును కాంగ్రెస్‌లో జనవరి 4న ప్రవేశపెట్టారు. హెచ్‌1-బి వీసా దుర్వినియోగానికి తాజా బిల్లు అడ్డుకట్ట వేస్తుందని వారు సూచించారు. ప్రపంచ దేశాల నుంచి అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులు మాత్రమే అమెరికాకు వచ్చేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని తెలిపారు. తక్కువ వేతనాలకే విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకోవడం ద్వారా అమెరికన్లకు ఉపాధిని దూరం చేస్తున్న సంస్థలపై చర్యలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. హెచ్‌1-బి వీసాకు సంబంధించిన కనీస వేతనాన్ని సుమారు రూ.67 లక్షలకు(ఏడాదికి) పెంచడం, మాస్టర్స్‌ డిగ్రీ విషయంలో ఇస్తున్న మినహాయింపులను తొలగించడం వంటి మార్పులకు ఈ బిల్లు ఉపకరించనుంది. నాణ్యత లేని మాస్టర్స్‌ డిగ్రీ ధ్రువీకరణ పత్రాలతో అభ్యర్థులు వీసా పొందుతున్నారని ఆరోపణలున్న సంగతి గమనార్హం. వాస్తవానికి గతేడాది కూడా ఈ బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టగా.. వ్యతిరేకత వ్యక్తమైంది. అధిక సంఖ్యలో భారతీయులు సహా పలు దేశస్థులు హెచ్‌1-బితో అమెరికాలో ఉపాధి పొందుతున్న సంగతి తెలిసిందే.

posted on 05.01.2017

Ask the Expert
Click Here..