Latest News

బ్రిటన్‌లో విదేశీ విద్యార్థుల ఉద్యోగాలపై నిషేధం?

హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం లండన్‌ వచ్చి చదువు పూర్తవగానే అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడే విద్యార్థులపై ఇక నిషేధం వేటు పడనుంది. చదువు పూర్తయిన వెంటనే తమ దేశం వదిలి వెళ్లిపోవాలని బ్రిటన్‌ హోం సెక్రటరీ థెరిసా మే ఆదేశాలు జారీ చేశారు. 1,21,000మంది విద్యార్థులు ఉన్నత చదువులకు బ్రిటన్‌ రాగా, అందులో కేవలం 51వేల మంది మాత్రమే తిరిగి తమ సొంత దేశాలకు వెళ్లారు. మిగిలిన 70వేల మంది అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. దీంతో స్థానిక విద్యార్థులకు నిరుద్యోగ సమస్య ఎదురౌతుందని, అందుకే చదువులు అయిపోగానే తమ దేశం విడిచి వెళ్లాలని థెరిసా పేర్కొన్నారు. లండన్‌లో ఉద్యోగం చేయాలనుకుంటే, ముందు స్వదేశం వెళ్లిపోయి తిరిగి ఉద్యోగ వీసా తీసుకోవాలన్నారు. ఉద్యోగ వీసా ఉంటేనే లండన్‌లో ఉద్యోగం చేయడానికి అర్హులవుతారని ఆమె తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ బయటి దేశాలన్నిటికీ ఈ నియమాలు వర్తిస్తాయి. బ్రిటిష్‌ వర్క్‌వీసా పొందడానికి కళాశాలలను దొడ్డిదారిగా ఉపయోగించడాన్ని నివారిస్తూ ఈ చర్యలు చేపడుతున్నారు.

posted on 12.7.2015

Ask the Expert
Click Here..