Latest News

చదువుకుంటూ పనిచేయటం కుదరదు

* విదేశీ విద్యార్థులపై బ్రిటన్‌ ఆంక్షలు
లండన్‌: విదేశీ విద్యార్థులు చదువుకుంటూ ఉద్యోగం చేయటం బ్రిటన్‌లో ఇకమీదట సాధ్యం కాదు. యూరోపియన్‌ యూనియన్‌కు (ఈయూ) చెందిన వారు తప్ప ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతూ పని చేయటం ఇకపై కుదరదని, దీనిపై ఆగస్టు నుంచి నిషేధం విధిస్తున్నామని బ్రిటన్‌ సోమవారం ప్రకటించింది. ఆ దేశ వలస వ్యవహారాల శాఖ మంత్రి జేమ్స్‌ బ్రోకెన్‌షైర్‌ ఈ వివరాలను వెల్లడించారు. ''బ్రిటన్‌లో ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే ఈయూయేతర విదేశీ విద్యార్థులు వారానికి 10 గంటలపాటు పని చేసే హక్కును వచ్చేనెల నుంచి కోల్పోతారు'' అని తెలిపారు. వలస నిబంధనలను ఉల్లంఘిస్తూ బ్రిటన్‌ ఉద్యోగమార్కెట్లోకి అక్రమంగా ప్రవేశించాలని చూస్తున్నవారిని అడ్డుకుంటామని చెప్పారు. బ్రిటన్‌ లబ్ధి కోసమే వలస విధానంలో ఈ సంస్కరణలను తీసుకొస్తున్నామన్నారు. ఈయూయేతర విదేశీ విద్యార్థులు తమ కోర్సు ముగిసిన తర్వాత వీసాకు దరఖాస్తు చేసుకోవటానికి తాజా వలసవిధానం అనుమతించటం లేదు. విశ్వవిద్యాలయాల పరిధికి వెలుపల పనిచేసే ఒకేషనల్‌ కళాశాలల వంటి విద్యాసంస్థల్లో (వీటికి ఎఫ్‌ఈ కాలేజీలని పేరు) చదువుకునే ఈయూయేతర విదేశీ విద్యార్థుల వీసా గరిష్ఠ కాలపరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు. అంటే చదువు ముగియగానే స్వదేశానికి వెళ్లాల్సిందే. ఈ కొత్తనిబంధనలను ప్రైవేటు కళాశాలలకు ఇప్పటికే వర్తింపజేశారు. తాజాగా వీటిని ప్రభుత్వ కాలేజీలకూ విస్తరించారు.

posted on 14.7.2015

Ask the Expert
Click Here..