సమయపాలన
శాట్‌లో సమయవ్యవధి కచ్చితంగా పరిమితమైనప్పటికీ, అతివేగంగా చేస్తే అది స్కోరును దెబ్బతీసే ప్రమాదముంది. చాలా ప్రశ్నలు సూక్ష్మ అంశాలపై ఆధారపడి ఉంటాయి. వాటిని చాలా శ్రద్ధగా గమనించాల్సివుంటుంది. చాలామంది తమ కళాశాలల్లో అలవాటైనవిధంగా ప్రశ్నలను త్వరత్వరగా చదివేస్తూ, ప్రశ్న సారాంశాన్ని మాత్రమే గ్రహిస్తారు. తీరా పరీక్ష రాశాక ఆ ప్రశ్నలను తప్పుగా చదవడమో, సూక్ష్మ అంశాలను పట్టించుకోకపోవడమో చేశామని గుర్తిస్తారు.
ప్రతి ప్రశ్నకూ నిర్ణీత సమయాన్ని సమానంగా కేటాయించుకోవడం మంచి వ్యూహంగా కనిపిస్తుండొచ్చు. కానీ- శాట్‌లో ప్రశ్నలు (క్రిటికల్ రీడింగ్ విభాగం మినహా) అతి తేలిక నుంచి అతి కఠినమైన ప్రశ్నల వరకు క్రమంలో ఉంటాయని విస్మరించకూడదు. కాబట్టి తేలిక ప్రశ్నలను చాలా వేగంగా పూర్తిచేసి, మిగిలిన సమయాన్ని చివరలో క్లిష్టమైన ప్రశ్నలకు కేటాయించుకోవాలి.
ఎక్కువ సాధన: మాదిరి పరీక్షలను ఎన్ని ఎక్కువ రాస్తే అంతగా పురోగతి సాధించవచ్చు. సమయ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. మాదిరి పరీక్షలు పరీక్ష స్వరూపం, నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవడానికి తోడ్పడతాయి. మాదిరి పరీక్షల్లో సాధించిన స్కోరే ప్రాథమిక స్కోరు అవుతుంది. ఇది మీరు ఏయే విభాగాల్లో మెరుగ్గా ఉండాలో చూపిస్తుంది. మిగతా వాటికంటే వీటిపై ఎక్కువ దృష్టిసారించి సాధన చేయాలి. అసలైన పరీక్షను సమర్థంగా ఎదుర్కోవడానికి వీలైనన్ని మాదిరి పరీక్షలతో సిద్ధమవాలి. మొత్తం పరీక్ష 225 నిమిషాల్లో 170 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సివుంటుంది. వీలైనన్ని మాదిరి పరీక్షలు రాయడం ద్వారా శక్తిసామర్థ్యాలను ఎక్కువ సమయం కొనసాగించేలా చూడొచ్చు.
చాలామంది విద్యార్థులు విడివిడి విభాగాలు, విడివిడి ప్రశ్నలపై దృష్టి పెడుతుంటారు. మొదటి దశలో.. ముఖ్యంగా కాన్సెప్టులను నేర్చుకునే క్రమంలో ఇది మంచి ప్రక్రియే. కానీ తర్వాత పూర్తిస్థాయి నమూనా పరీక్ష ద్వారా అసలైన పరీక్ష పరిస్థితులకు అలవాటు పడాల్సివుంటుంది. ఎక్కువ సమర్థంగా తయారవడం ద్వారా ప్రతి ప్రశ్నకూ కేటాయించే శ్రమా, శక్తీ తగ్గుతాయి. వాటిని తదుపరి విభాగాలు, క్లిష్టమైన ప్రశ్నలకు కేటాయించవచ్చు. శాట్ నైపుణ్యాల, కాన్సెప్టుల అవగాహనకూ, ప్రావీణ్య సాధనకూ తోడ్పడే అదనపు ప్రయోజనాలుగా నమూనా పరీక్షలను భావించాలి. పురోగతిని అంచనా వేసుకోవడానికి ఈటీఎస్ సైట్ ద్వారా వీటిని సాధన చేయాలి.
ఒత్తిడి: మానసికంగా, ఉద్వేగపరంగా సిద్ధమవడాన్ని కూడా సన్నద్ధతలో భాగంగా చేర్చుకోవాలి. ఒత్తిడిని నియంత్రించడానికి మార్గం- మళ్లీ సరైన సన్నద్ధతే. సవ్యంగా సన్నద్ధమైన భావన పరీక్షను హాయిగా, కచ్చితంగా రాసేలా చేస్తుంది. మీరు చేసే సాధన గరిష్ఠ ఫలితాన్ని అందిస్తుందని దృఢంగా నమ్మవచ్చు.
ఇవి ఉపయోగపడతాయి: https://sat.collegeboard.org/ home, https://sat.collegeboard.org/practice/sat-practice-test
The Official SAT Study Guide: Second Edition.