Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
లెక్కలంటే.. మక్కువుంటే!

గణితం అనగానే కొంతమంది గడ గడ వణికిపోతే... ఇంకొందరు టక టకా స్టెప్పులేసుకుంటూ వెళ్లిపోతారు. ఇది ఒక సబ్జెక్టు మాత్రమే కాదు. విస్తృత ఉద్యోగావకాశాలు కల్పించే వేదిక కూడా. ఇంజినీరింగ్‌, అకౌంటింగ్‌ మొదలు అంతరిక్షం వరకు గణితం అన్ని రంగాల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. బోధన, పరిశోధనలతోపాటు ఎన్నో రకాల ఉద్యోగాలకు ఈ నిపుణుల అవసరం ఉంది. అందుకే గణితానికి సంబంధించి కొన్ని సంస్థలు అందిస్తున్న ప్రత్యేక కోర్సులతోపాటు ఉన్నతమైన ఉద్యోగాల గురించి తెలుసుకుందాం.

గణితం అంటే కొంచెం భయంగా.. చాలా గౌరవంగా అనిపిస్తుంది. నూటికి నూరు మార్కులు తెచ్చుకోడానికి వీలున్న విభాగాల్లో ఎందరికో ఇష్టమైన సబ్జెక్టు ఇది. లెక్కలపై మక్కువ ఎక్కువగా ఉంటే, వాటినే జీవితంగా గడపడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యపరంగా చూస్తే ఎన్నో ప్రఖ్యాత సంస్థలు రకరకాల కోర్సులను అందిస్తున్నాయి. ఉపాధిని పరిశీలిస్తే బోధన, పరిశోధన రంగాల్లో పలు కొలువులు ఆహ్వానం పలుకుతున్నాయి. మ్యాథ్స్‌పై శ్రద్ధ, ఆసక్తి ఉంటే మొదటగా గుర్తుకొచ్చేది ఇంజినీరింగ్‌. అది వాస్తవమే. గణితంపై పట్టు వల్ల కచ్చితంగా ఇంజినీరింగ్‌లో ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు. అప్లైడ్‌ మ్యాథమేటిక్స్‌ వంటి స్పెషలైజేషన్లతో ఉన్నత విద్యను, ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటే లెక్కలే సర్వస్వంగా జీవనాన్ని సాగించవచ్చు.
ప్రత్యేక సంస్థలు
ఆర్యభట్ట నుంచి రామానుజన్‌ వరకు ఎందరో మహానుభావులు భారతదేశ గణిత చరిత్రకి పునాదులు వేశారు. ఆధునిక కాలంలోనూ కేవలం గణితం కోసం ప్రత్యేకమైన సంస్థలు ఏర్పాటయ్యాయి. మ్యాథమేటిక్స్‌లో ఈ కింది సంస్థలు ప్రత్యేక గుర్తింపుతో ప్రపంచ పటంలో తమకంటూ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆయా సంస్థల్లోకి ప్రవేశాల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌ల్లో చూడవచ్చు.
* చెన్నై మ్యాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై www.cmi.ac.in
* ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, www.imsc.res.in
* టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, ‌www.tifr.res.in
* హరీశ్‌ చంద్ర రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, www.hri.res.in
* సీఆర్‌ రావు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్ ‌www.crraoaimscs.org
ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త సీఆర్‌ రావు పేరుతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఈ సంస్థలోని కింది విభాగాలు ఉత్తమమైన పరిశోధనా విద్యకి, మేధోపరమైన ఉపాధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో మార్గాలు చూపిస్తున్నాయి.
* సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్‌
* సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌
* సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ క్రిప్టోగ్రఫీ
* సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కంప్యూటేషనల్‌ జెనోమిక్స్‌
మ్యాథమేటిక్స్‌ రంగంలో రిసెర్చ్‌ సైంటిస్ట్‌, రిసెర్చ్‌ అసోసియేట్స్‌, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ వంటి పేర్లతో కెరియర్‌ ప్రారంభానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని సీఆర్‌ రావు ఇన్‌స్టిట్యూట్‌ అందిస్తోంది. దీంతోపాటు ఏటా స్టాటిస్టిక్స్‌ ఒలింపియాడ్‌లను నిర్వహించి హైస్కూల్‌ స్థాయిలో విద్యార్థుల ప్రతిభాపాటవాలను వెలుగులోకి తీసుకొస్తోంది.
వివిధ సంస్థల్లో విభిన్న కోర్సులు
సాధారణంగా మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, అప్లైడ్‌ మ్యాథ్స్‌ తదితరాల్లో బీఎస్సీ కోర్సులను; మాస్టర్స్‌ స్థాయిలో రకరకాల స్పెషలైజేషన్లతో ఎమ్మెస్సీని మన దేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలు అందిస్తున్నాయి. వీటితోపాటు దేశంలో ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సీల్లోని మ్యాథమేటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ కోర్సుల్లోకి జామ్‌ (జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ ఎమ్మెస్సీ) ర్యాంకుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. బ్యాచిలర్‌ డిగ్రీలో మ్యాథమేటిక్స్‌ చదివితే జామ్‌ రాయడానికి అర్హత లభిస్తుంది. మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ పేపర్లతో ఎమ్మెస్సీ పూర్తి చేస్తే వినూత్న రంగాలకు సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఆపరేషన్స్‌ రిసెర్చ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఓషన్‌ అండ్‌ అట్మాస్ఫిరిక్‌ సైన్స్‌, అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగాల్లో ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ చేయవచ్చు. జామ్‌ ద్వారా భువనేశ్వర్‌, బాంబే, దిల్లీ, ధన్‌బాద్‌, గాంధీనగర్‌, గువాహటి, హైదరాబాద్‌, ఇండోర్‌, జోద్‌పూర్‌, కాన్పూర్‌, రోపర్‌, పట్నా, రూర్కీల్లోని ఐఐటీల్లోకి ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ అడ్మిషన్లు లభిస్తున్నాయి. ఈ కోర్సులు పరిశోధన రంగంలో మంచి ఉద్యోగాలకు మార్గం చూపిస్తాయి.
భారత ప్రభుత్వం ఉన్నతశ్రేణి సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ కోసం ఐఐఎస్‌ఈఆర్‌లను బరంపురం, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతిల్లో ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అయిదు సంవత్సరాల బీఎస్‌-ఎంఎస్‌ ప్రోగ్రామ్‌ని అందిస్తోంది. ప్రస్తుతం ఐఐఎస్‌ఈఆర్‌-2018 నోటిఫికేషన్‌ విడుదలైంది.
పరిశోధనలో!
మ్యాథమేటిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన వారికి ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలైన ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో), డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), సొసైటీ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ ట్రాన్సాక్షన్స్‌ అండ్‌ సెక్యూరిటీ (ఎస్‌ఈటీఎస్‌) ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.
ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు మ్యాథమేటిక్స్‌లో ప్రావీణ్యం సాధించినవారికి థియరిటికల్‌ కంప్యుటేషన్‌ పేరుతో పరిశోధనా విభాగంలో ఎక్కువ వేతనంతో కూడిన ఆకర్షణీయ ఉద్యోగాలను ఇస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ బోర్డ్‌ ఆయా రంగాల్లో పరిశోధనకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని రామానుజన్‌ ఫెలోషిప్‌ల పేరుతో అందిస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో
ఉపాధికి సంబంధించి పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ మొదలు యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరక ఉన్నాయి.
మ్యాథమేటిక్స్‌కి సంబంధించి ముఖ్యంగా స్టాటిస్టిక్స్‌లో దేశవ్యాప్తంగా ప్రామాణికమైన ఉద్యోగం జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (జేఎస్‌ఓ). ఇది స్టాటిస్టిక్స్‌ రంగంలోకి ప్రవేశ ద్వారం లాంటిది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్ష ద్వారా మూడంచెల విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. సాధారణంగా ఏప్రిల్‌లో ఈ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. పూర్తి వివరాలకు www.ssc.nic.in చూడ‌వ‌చ్చు.
జేఎస్‌ఓగా ఎంపికైన అభ్యర్థులు సబార్డినేట్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌) కేడర్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌లో భాగంగా పని చేస్తారు. వీరు డేటా కలెక్షన్‌, డేటా ప్రాసెసింగ్‌ లాంటి కార్యక్రమాల్లో అంకగణిత పరంగా ప్రభుత్వ ప్రణాళికలకు సాయపడతారు.
ఎన్నో ఉద్యోగాలు.. మరెన్నో కోర్సులు
స్టాటిస్టిక్స్‌లో పట్టుతో పాటు కొన్ని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో నైపుణ్యాన్ని సంపాదిస్తే దాదాపు అన్ని ఫైనాన్స్‌, ఇన్స్యూరెన్స్‌, బ్యాంకింగ్‌ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
మ్యాథ్స్‌లో పీజీ ఉంటే ఐఐటీ, ఎంసెట్‌, క్యాట్‌, శాట్‌, జీమ్యాట్‌ తదితర ఎన్నో రకాల పరీక్షార్థులకు గణితం బోధించవచ్చు. పీహెచ్‌డీ చేసిన వారు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రొఫెసర్‌ ఉద్యోగాల్లో చేరవచ్చు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్‌లు మొదలైన పోటీ పరీక్షల్లోనూ గణితం కీలకమైన విభాగం. ఆ అభ్యర్థులకూ శిక్షణ ఇవ్వవచ్చు.
టెక్నాలజీ అభివృద్ధిలో ప్రధాన పాత్ర గణిత నిపుణులదే అని చెప్పవచ్చు. రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తదితర రంగాల్లో మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ చదివిన వారికి డిమాండ్‌ ఉంది. ఆపరేషన్స్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌ తదితర సాఫ్ట్‌వేర్‌ కొలువులు, డేటా సైంటిస్టులు వంటి ఉన్నతమైన ఉద్యోగాలూ మ్యాథ్స్‌ మేధావులకు స్వాగతం పలుకుతున్నాయి.
జేఎస్‌ఓల పదోన్నతి ఈ కింది విధంగా ఉంటుంది.
* జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌
* సీనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌
* అసిస్టెంట్‌ డైరెక్టర్‌
* డిప్యూటీ డైరెక్టర్‌
* జాయింట్‌ డైరెక్టర్‌
* డైరెక్టర్‌
* డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌
* అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌
* డైరెక్టర్‌ జనరల్‌
స్టాటిస్టిక్స్‌ రంగంలో ఉద్యోగాలు అందజేసే మరో ముఖ్య సంస్థ ఇండియన్‌ అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (www.iasri.res.in). ఇది ఎలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ఇస్తుందో తెలుసుకోడానికి వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
రాష్ట్రస్థాయిలో కూడా అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయి. ఆయా రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు భర్తీని నిర్వహిస్తాయి.
స్టాటిస్టిక్స్‌లో బీఎస్సీ లేదా ఎమ్మెస్సీ లేదా పీహెచ్‌డీ చేసినవారు ప్రైవేటు రంగంలో ఈ కింది టూల్స్‌/టెక్నాలజీలు నేర్చుకోవడం ద్వారా కార్పొరేట్‌ రంగంలో అధిక వేతనాలు పొందవచ్చు.
* ఆర్‌ ప్రోగ్రామింగ్‌ టూల్‌ ‌
* ఎస్‌ఏఎస్‌
* ఎస్‌పీఎస్‌ఎస్‌
* మినిట్యాబ్‌ ‌
* ఎక్సెల్‌ అనలిటిక్స్‌ ‌
* మ్యాట్‌లాబ్‌
* స్టాటా

ర‌వి క‌టుకం, ఇన్నోవేష‌న్ ఇవాంజిలిస్ట్

Back..

Posted on 01-03-2018